కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పనిచేయడానికి—పసిఫిక్‌ ద్వీపాలకు!

పనిచేయడానికి—పసిఫిక్‌ ద్వీపాలకు!

పనిచేయడానికి—పసిఫిక్‌ ద్వీపాలకు!

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌, సిడ్నీ నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని లాంజ్‌లలో క్రితంలేని సందడి ఏర్పడింది. 46 మందితో కూడిన గుంపు ఒకటి సమోవాకు వెళ్ళటానికి సంసిద్ధంగా ఉంది, వారు న్యూజీలాండ్‌, హవాయి, అమెరికాల నుండి వచ్చే మరి 39 మందిని కలవనైయున్నారు. వారి సామాన్లు మాత్రం కాస్త విశేషంగానే ఉన్నాయి; ఎక్కువగా ఉపకరణాలే—సుత్తులు, రంపాలు, డ్రిల్లింగ్‌ మెషీన్లు వగైరా. పసిఫిక్‌ సముద్రంలోని సుందరమైన ద్వీపానికి తీసుకువెళ్ళాల్సింది వీటిని కాదే అన్పిస్తుంది. కానీ వారి నియామకం మాత్రం అసాధారణమైనదే మరి.

స్వంత ఖర్చులు పెట్టుకుని, వారు రెండు వారాలపాటు జీతంలేకుండా స్వచ్ఛందంగా ఒక నిర్మాణ కార్యక్రమంలో భాగం వహించనైయున్నారు. దీన్ని యెహోవాసాక్షుల ఆస్ట్రేలియా బ్రాంచిలోని రీజనల్‌ ఇంజినీరింగ్‌ ఆఫీస్‌ పర్యవేక్షిస్తుంది. ఈ కార్యక్రమం అంతటికీ స్వచ్ఛంద విరాళాలే ఆర్థిక మద్దతునిచ్చాయి. పసిఫిక్‌ సముద్రంలోని ద్వీపాల్లో ఎంతో వేగంగా అభివృద్ధిచెందుతున్న యెహోవాసాక్షుల సంఘాల కోసం రాజ్యమందిరాలు, అసెంబ్లీ హాల్‌లు, మిషనరీ గృహాలు, బ్రాంచి కార్యాలయాలు, అనువాద కార్యాలయాలు వంటివాటి నిర్మాణాన్ని ఈ కార్యక్రమం నియంత్రిస్తుంది. మనం ఈ పనివారిలో కొందరిని పరిచయం చేసుకుందాము. వీరు తమ తమ దేశాల్లోని రాజ్యమందిర నిర్మాణ జట్టుల్లో సభ్యులుగా ఉన్నారు.

ఇంటి పైకప్పులు వేసే మ్యాక్స్‌ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌లోని కౌరా అనే పట్టణవాస్తవ్యుడు. ఆయనకు వివాహం అయి, ఐదుగురు పిల్లలున్నారు. ఆయన తోటి పనివాడు రాయ్‌ పెయింటరు, బిల్డింగుల బయటి గోడలకు ప్లాస్టరింగ్‌ చేస్తాడు. ఈయన న్యూజీలాండ్‌లోని మౌంట్‌ మౌంగాన్యూయీ నుండి వచ్చాడు. ఆయన కూడా వివాహితుడే, నలుగురు పిల్లలు. ఆర్నాల్డ్‌ హవాయీవాసి, ఇద్దరు మగపిల్లలు. ఆయన ప్రత్యేక పయినీరు, అంటే పూర్తికాల పరిచారకుడు కూడాను. మ్యాక్స్‌లానే ఆర్నాల్డ్‌ తన స్వంత సంఘంలో ఒక పెద్దగా సేవచేస్తున్నాడు. వీటిని బట్టి తెలుస్తున్నదేమంటే, ఈ పురుషులకు—ఈ కార్యక్రమంలోని అనేకమంది ఇతరులకూ—ఏదో చేయటానికి పనేమీ లేనందున స్వచ్ఛంద సేవకులుగా ఉన్నవారు కారు. బదులుగా, వారూ, వారి కుటుంబాలవారూ, ఒక అవసరాన్ని గుర్తించారు, అందుకని వారు తాము చేయగల్గినంత చేయడానికి ముందుకు వచ్చారు.

బహుళజాతి పనివారు ఒక కీలకమైన అవసరాన్ని తీరుస్తున్నారు

వారి నైపుణ్యాలూ సేవలూ అవసరమైన ఒక స్థలం పసిఫిక్‌ సముద్రంలోని టువాలూ. ఇది సమోవాకు ఈశాన్యంగా భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న తొమ్మిది పగడపు దీవులతో కూడిన ఒక దేశం. వీటిలో దాదాపు 10,500 మంది ప్రజలున్నారు. ఈ దీవులు లేదా పగడపు దిబ్బలు ఒక్కొక్కటి దాదాపు 2.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటాయి. 1994 కల్లా వాటిపై ఉన్న 61 మంది సాక్షులకు అత్యవసరంగా ఒక క్రొత్త రాజ్యమందిరమూ, అప్పట్లో ఉన్నదానికన్నా పెద్ద అనువాద కార్యాలయమూ కావాల్సివచ్చింది.

ఈ పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో, బిల్డింగులు గాలివానల్నీ తుపానుల్నీ తట్టుకునేలా నిర్మించాల్సివుంటుంది. కానీ ఈ ద్వీపాల్లో నాణ్యమైన నిర్మాణ సామగ్రి ఏమాత్రం దొరకదు. ఏమిటి మరి పరిష్కారం? ప్రతి వస్తువునీ అంటే, పైకప్పులూ ట్రస్సులూ మొదలుకొని ఫర్నిచరు కర్టెన్లు టాయ్‌లెట్‌లు, చివరికి స్క్రూలు మేకుల వరకూ ప్రతీదాన్నీ ఆస్ట్రేలియా నుండి ఓడలలో తీసుకువచ్చారు.

నిర్మాణ సామగ్రి రావడానికి ముందు ఒక చిన్న జట్టు వెళ్ళి స్థలాన్ని సిద్ధం చేసి పునాది వేసింది. అటుతర్వాత నిర్మాణాలు నిర్మించడానికీ, పెయింట్‌ వేయడానికీ, వాట్లో ఫర్నిచర్‌ ఏర్పాటు చేయడానికీ అంతర్జాతీయ పనివారు వచ్చారు.

టువాలులోని ఈ కార్యకలాపాలన్నీ స్థానిక పాదిరీల ఉగ్రతను రేకెత్తించాయి. సాక్షులు “బాబెలు గోపురాన్ని” నిర్మిస్తున్నారని రేడియోలో వాళ్ళు ప్రకటించారు! అయితే వాస్తవాలేమిటి? ఒక స్వచ్ఛంద సేవకుడైన గ్రేమ్‌, “బైబిలులోని బాబెలు గోపురాన్ని నిర్మిస్తున్నప్పుడు వారు ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకోలేకపోయారు, ఎందుకంటే దేవుడు వారి భాషల్ని తారుమారు చేశాడు. వాళ్ళిక తమ పనిని మధ్యలో వదిలేయాల్సివచ్చింది” అని వ్యాఖ్యానించాడు. (ఆదికాండము 11:1-9) “యెహోవా దేవుని కోసం పని చేస్తున్నప్పుడు పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. భాషలు సంస్కృతులు వేర్వేరుగా ఉన్నా పనులు మాత్రం ప్రతీసారీ పూర్తౌతాయి” అంటున్నాడాయన. ఈ నిర్మాణం విషయంలో అది రుజువైంది—రెండు వారాల్లోనే. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి భార్యతోసహా 163 మంది హాజరయ్యారు.

ఈ పనిని పర్యవేక్షించిన డగ్‌ ఈ అనుభవాన్ని గురించి చెబుతూ ఇలా అంటున్నాడు: “వేరే దేశాల నుండి వచ్చిన స్వచ్ఛంద సేవకులతో పని చేయడం ఎంతో ఆనందాన్ని కల్గించింది. మేము పనుల్ని విభిన్నమైన రీతుల్లో చేశాము, వేర్వేరు పదజాలాన్ని ఉపయోగించాము, చివరికి కొలమానాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి, అయినా వీటిలో ఏదీ కూడా ఎటువంటి సమస్యనూ కల్గించలేదు.” ఇటువంటి పనుల్లో ఇప్పటికే అనేకం చేసివున్నందున ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “యెహోవా మద్దతుతో ఆయన ప్రజలు ఈ భూమ్మీద ఎక్కడైనా నిర్మాణాల్ని చేపట్టగలరు. అదెంతటి మారుమూల ప్రాంతమైనా, స్థలం ఎంత అసౌకర్యంగా ఉన్నా అది సుసాధ్యమౌతుంది. నిజమే, మా దగ్గర ప్రతిభగల వారెంతోమంది ఉన్నారు, కానీ సమస్తాన్నీ సాధ్యపర్చేది యెహోవా ఆత్మే.”

ఈ ద్వీపాల్లోని సాక్షుల కుటుంబాలు నిర్మాణకులకు ఆహారాన్ని నివాసాల్ని అందించేలా దేవుని ఆత్మ వారిని కదిలించింది. కొంతమంది విషయంలోనైతే ఇది ఎంతో త్యాగంతో కూడిన విషయమే. అటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించినవారు హృదయలోతుల్లో నుండి కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నుండి వచ్చిన కెన్‌ ఫ్రెంచ్‌ పాలినేషియాలో ఇటువంటి నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆయనిలా అంటున్నాడు: “మేము సేవకులుగా వస్తే వాళ్ళు మమ్మల్ని రాజుల్లా చూసుకున్నారు.” సాధ్యమైన చోటల్లా స్థానిక సాక్షులు కూడా నిర్మాణ పనిలో భాగం వహించారు. సాలమన్‌ ఐలాండ్స్‌లో స్త్రీలు తమ చేతులతోనే కాంక్రీటును కలిపారు. వర్షంలో నేలంతా చిత్తడిగా అయినా వందమంది స్త్రీపురుషులు పర్వతాలు ఎక్కి 40 టన్నుల కలపను క్రిందకి తీసుకువచ్చారు. ఇందులో యువత కూడా తమ సహాయ హస్తాన్ని అందించి ఇందులో పాల్గొన్నది. న్యూజీలాండ్‌ నుండి వచ్చి ఒక నిర్మాణకుడు ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “ఈ ద్వీపంలోని ఒక యౌవనస్థుడు ఒకేసారి రెండు మూడు సిమెంటు బస్తాల్ని మోసుకురావడం నాకు గుర్తుంది. ఎండలోను వానలోను ఆయన ఒక రోజంతా పారతో కంకర తీశాడు.”

పనిలో స్థానిక సాక్షులు పాల్గొనడం మరో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. వాచ్‌ టవర్‌ సొసైటీ యొక్క సమోవా బ్రాంచి కార్యాలయం ఇలా నివేదిస్తుంది: “ఈ పనిలో పాల్గొంటూ ద్వీపాల్లో నివసించే సహోదరులు, రాజ్యమందిర నిర్మాణాల్లో వినియోగించగల నైపుణ్యాలను నేర్చుకున్నారు, తుపానులు వచ్చిన తర్వాత చేయాల్సిన మరమ్మతులు పునర్నిర్మాణాలు కూడా వారిప్పుడు చేయగలరు. అంతేకాదు, జీవనోపాధి సంపాదించుకోవడం కష్టంగా ఉండే అలాంటి సమాజాల్లో ఈ పనుల మూలంగా వారిప్పుడు సహాయాన్ని పొందారు కూడా.”

నిర్మాణ కార్యక్రమం చక్కని సాక్ష్యాన్నిస్తుంది

హనోయిరాలో ఉన్న కాలిన్‌ సాలమన్‌ ఐలాండ్స్‌ అసెంబ్లీ హాల్‌ నిర్మిస్తుండడాన్ని చూశాడు. ఎంతో ప్రభావితుడై ఆయన వాచ్‌ టవర్‌ సొసైటీ యొక్క స్థానిక బ్రాంచి కార్యాలయానికి పిడ్జిన్‌ ఇంగ్లీష్‌లో ఈ ఉత్తరాన్ని వ్రాశాడు: “వారందరూ ఐక్యంగా ఉంటారు, వారిలో ఎవ్వరూ చిరచిరలాడుతూ ఉన్నట్లు కన్పించరు. వారందరూ ఒక్క కుటుంబంలా పనిచేస్తారు.” తర్వాత కొద్దికాలానికి ఆయన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరూలీగో అనే తన గ్రామానికి వెళ్ళినప్పుడు తనూ తన కుటుంబమూ కలిసి తమ స్వంత రాజ్యమందిరాన్ని నిర్మించుకున్నారు. తర్వాత బ్రాంచి కార్యాలయానికి మరొక ఉత్తరం వ్రాశారు. “మా రాజ్యమందిరం సిద్ధంగా ఉంది, పోడియం కూడా ఉంది, ఇక్కడ మేము కూటాల్ని జరుపుకోవచ్చా?” అంటూ సాగిందా ఉత్తరం. వెంటనే ఏర్పాట్లు జరిగాయి, ఇప్పుడక్కడ 60 కంటే ఎక్కువమంది క్రమంగా హాజరౌతున్నారు.

ఒక యూరోపియన్‌ యూనియన్‌ సలహాదారుడు టువాలులోని కార్యకలాపాల్ని గమనించాడు. ఆయనొక నిర్మాణకునితో ఇలా అన్నాడు: “బహుశ దీన్ని చూసిన వారందరూ ఇలాగే అని ఉంటారు కానీ నేను మళ్ళీ అంటున్నాను, ఇది నిజంగా ఒక అద్భుతమే!” టెలిఫోన్‌ ఎక్సేంజిలో పనిచేస్తున్న ఒక మహిళ, వేరే దేశంనుండి వచ్చిన స్వచ్ఛంద సేవకురాలిని ఇలా అడిగింది: “మీరందరూ ఇంత ఆనందంగా ఎలా ఉండగల్గుతున్నారు? ఇక్కడెవరూ అంత ఆనందంగా ఉండరే!” వారు క్రైస్తవత్వం అలా ఆచరణాత్మకంగా, త్యాగపూరితంగా కార్యాచరణలో ఉండడం చూసెరుగరు.

త్యాగాలు, కానీ తర్వాత బాధపడడాలు లేవు

“సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును” అని బైబిలు 2 కొరింథీయులు 9:6 లో చెబుతుంది. నిర్మాణకులు, వారి కుటుంబాలవారు, వారి సంఘాలవారు అందరూ పసిఫిక్‌ ప్రాంతంలోని తోటి సాక్షులకు సహాయం చేస్తూ సమృద్ధిగా విత్తుతున్నారు. సిడ్నీ దగ్గర్లోని కీన్‌కుంబర్‌ సంఘంలో పెద్ద అయిన రాస్‌, “నా సంఘం నా విమాన ప్రయాణ ఖర్చులో మూడోవంతును భరించింది, నాతోపాటు వచ్చిన మా బావమరిది అదనంగా 500 డాలర్లు ఇచ్చాడు” అని చెబుతున్నాడు. మరొక నిర్మాణకుడు తన ప్రయాణ ఖర్చుల కోసం తన కారును అమ్మేశాడు. మరొకాయన కొంత భూమిని అమ్మేశాడు. కెవిన్‌కి ఇంకా 900 డాలర్లు కావల్సివచ్చింది, అందుకని తన దగ్గరున్న రెండేళ్ళ పావురాల్ని పదహారింటిని అమ్మేద్దామనుకున్నాడు. తనకు తెలిసిన ఒక వ్యక్తిద్వారా ఒక కొనుగోలుదారుడు దొరికాడు, వాటికోసం సరిగ్గా 900 డాలర్లు లభించాయి!

“విమాన ప్రయాణ ఖర్చులూ, దానికి తోడు జీతం నష్టమూ కలిసి 6,000 డాలర్లు అయ్యింది కదా, మరి దానికి తగ్గ ఫలితం ఏమైనా దొరికిందా?” అని డానీ షెరిల్‌లను అడగడం జరిగింది. “తప్పకుండా! నిజానికి దానికి రెట్టింపు ఖర్చైనా సరే మేము బాధపడివుండము” అని వారు జవాబిచ్చారు. న్యూజీలాండ్‌లోని నెల్సన్‌ అనే ప్రాంతం నుండి వచ్చిన అలన్‌ దానికిలా జోడించాడు: “టువాలుకి వెళ్ళడానికి నాకెంత ఖర్చయ్యిందో దాంతో నేను యూరప్‌కి వెళ్ళివుండగల్గేవాణ్ని, ఇంకా డబ్బు మిగిలివుండేది. కానీ నాకీ ఆశీర్వాదాలు లభించివుండేవా, లేక నాకంత మంది స్నేహితులు అదీ వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినవారు దొరికుండేవారా, లేక నాకోసం కాకుండా వేరే వాళ్ళకోసం ఏమైనా చేసివుండగల్గేవాడినా? లేదు! ఏదేమైనా, నేను ఆ ద్వీపాల్లోని సహోదరులకు ఏమి ఇవ్వగల్గినా బదులుగా వారు నాకు దానికి ఎన్నో రెట్లు ఎక్కువే ఇచ్చారు.”

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరొ కీలకం ఏమిటంటే, కుటుంబాల మద్దతే. కొందరి భార్యలు తమ భర్తలతోపాటు వెళ్ళగల్గినా, నిర్మాణ స్థలంలో సహాయమూ చేయగల్గినా, కొందరికి స్కూలుకు వెళ్ళే పిల్లలుండడంతోనో లేదా కొందరికి ఇతర వ్యాపారాలుండడంతోనో వెళ్ళలేకపోయారు. “నేను దూరంగా ఉన్నప్పుడు పిల్లల్నీ ఇంటినీ చూసుకోవడానికి నా భార్య సుముఖత చూపించడం నేను చేసిన త్యాగం కన్నా ఎంతో గొప్పది” అని క్లే అంటున్నాడు. నిజంగానే, తమ భార్యల్ని తమతో తీసుకెళ్ళలేకపోయిన భర్తలందరూ దానికి “ఆమేన్‌” అనే చెబుతారు!

టువాలులోని కార్యకలాపాలు పూర్తైనప్పటి తర్వాత, స్వచ్ఛంద సేవకులు ఫిజీ, టోంగా, పాపువా న్యూగినియా, న్యూ కలెడోనియా, మరితర ప్రాంతాల్లో రాజ్యమందిరాలు, అసెంబ్లీ హాల్‌లు, మిషనరీ గృహాలు, అనువాద కార్యాలయాలు నిర్మించారు. ఆగ్నేయాసియా ప్రాంతంలోని కొన్ని నిర్మాణాలకు తోడు అనేక ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టులు ఇంకా డ్రాయింగ్‌ బోర్డు మీదే ఉన్నాయి. వాటన్నింటికీ సరిపడా నిర్మాణకులు దొరుకుతారా?

ఇది సమస్యే కాదని స్పష్టంగా తెలుస్తుంది. “అంతర్జాతీయ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మరో కార్యక్రమానికి పథకాలు వేస్తున్నప్పుడు తమను గుర్తు చేసుకోమని అడిగారు” అని హవాయి బ్రాంచి కార్యాలయం వ్రాస్తోంది. “వాళ్ళు తమ తమ ఇండ్లకు చేరుకున్న వెంటనే డబ్బు ఆదాచేయడం ప్రారంభిస్తారు.” అలాంటి నిస్వార్థ సమర్పణకు యెహోవా మెండైన ఆశీర్వాదాలు తోడైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం కాక మరేమౌతాయి?

[9వ పేజీలోని చిత్రం]

నిర్మాణానికి సామగ్రి

[9వ పేజీలోని చిత్రాలు]

నిర్మాణ స్థలంలో పనివారు

[10వ పేజీలోని చిత్రాలు]

నిర్మాణాలు ముగుస్తుండగా, దేవుని ఆత్మ సాధించిన దాన్ని చూసి మేం అత్యానందభరితులమయ్యాం