కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎలా వేచివుండాలో మీకు తెలుసా?

ఎలా వేచివుండాలో మీకు తెలుసా?

ఎలా వేచివుండాలో మీకు తెలుసా?

ప్రజలు కేవలం వేచివుండడంలోనే ప్రతి సంవత్సరం ఎంత సమయాన్ని గడుపుతారో మీరూహించగలరా? దుకాణం దగ్గరా, పెట్రోలు బంకు దగ్గరా లైనులో వేచివుంటారు. రెస్టారెంటులో వెయిటర్‌ కోసం వేచివుంటారు. డాక్టరు దగ్గరికో డెంటిస్ట్‌ దగ్గరికో వెళ్ళినప్పుడు వేచివుంటారు. బస్సుల కోసమూ రైళ్ళ కోసమూ వేచివుంటారు. అవును, ఒక వ్యక్తి తన జీవితంలో వేచివుండడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాడో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక అంచనా ప్రకారం, జర్మన్‌ దేశస్థులు కేవలం ట్రాఫిక్‌ జామ్‌లలో వేచివుంటూనే ప్రతి సంవత్సరం 470 కోట్ల గంటలు వెచ్చిస్తుంటారు! ఇది దాదాపు 7,000 మంది పూర్తి జీవితాయుష్షుకు సమానమని ఎవరో లెక్కగట్టారు.

వేచివుండడం ఎంతో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ రోజుల్లో ఉన్న పనులను చేసుకోవటానికే సమయం చాలడం లేదన్పిస్తుంది. ఇక, చేయాల్సిన బాధ్యత ఉన్న ఇతర పనుల కోసం సమయమెక్కడ సంపాదించాలని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో, వేచివుండాలన్నది ఎంతో భరించరానిదిగా తయారౌతుంది. రచయితైన అలెగ్జాండర్‌ రోస్‌ ఇలా అన్నాడు: “జీవితాన్ని సగం దుర్భరం చేసేది వేచివుండడమే.”

వేచివుండడం ఖరీదుగా కూడా మారదగలదని అమెరికా దేశానికి చెందిన రాజనీతిజ్ఞుడు బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ గుర్తించాడు. దాదాపు 250 ఏండ్ల క్రితం ఆయనిలా అన్నాడు: “టైమ్‌ ఈజ్‌ మనీ.” అందుకనే పనిలో సమయం వృథా కాకుండా ఉండేందుకు వాణిజ్యరంగం అనేక మార్గాల్ని అన్వేషిస్తుంది. తక్కువ సమయంలో ఎంత ఎక్కువ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తే అంత ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రజలకు త్వరితంగా సేవలందించటానికి కొన్ని వ్యాపార రంగాలు ప్రయత్నిస్తాయి​—⁠ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, కారులో ఉండే డబ్బు వ్యవహారాలు చూసుకునే సౌలభ్యాన్ని అందించే బ్యాంకులు వంటివి వాటిలో కొన్ని మాత్రమే. వినియోగదారులు వేచివుండాల్సి వచ్చే సమయాన్ని తక్కువ చేయడం, వినియోగదారులకు సంతృప్తిని కల్గించడంలో భాగమని వారికి తెలుసు మరి.

మన జీవితాల్ని వ్యర్థంగా గడిపేయడం

పందొమ్మిదవ శతాబ్దంలోని అమెరికన్‌ కవి రాల్ఫ్‌ వాల్డో ఎమర్సన్‌ ఒకసారిలా ఫిర్యాదు చేశాడు: “వేచివుండడంలో మనిషి జీవితం ఎంతగా ఖర్చైపోతోంది!” ఇటీవల ఉదాహరణ చూస్తే, రచయితైన లాన్స్‌ మారో వేచివుండడం గురించి ఫిర్యాదు చేస్తూ, దాని మూలంగా ఎంత విసుగు కలుగుతుందో, ఎంత శారీరక అసౌకర్యం కల్గుతుందో వ్రాశాడు. కానీ తర్వాత ఆయన “వేచివుండడంలో మనకు తెలియని మరొక దౌర్భాగ్యం” ఉందని చెప్పాడు. ఏమిటది? “ఒక వ్యక్తి దగ్గరున్న వనరుల్లో అతి విలువైనదైన సమయం కొంత కోల్పోవడం జరుగుతుందనీ, దాన్ని తిరిగి పొందే మార్గమే లేదనీ తెలుసుకోవడం.” విచారకరమైన విషయం, కాని అది తిరుగులేని నిజం. వేచివుంటూ కోల్పోయిన సమయం ఇక ఎన్నడూ తిరిగిరాదు.

నిజమే, జీవితకాలం ఇంత తక్కువగా లేకపోయుంటే వేచివుండడం అనేది అంత పట్టించుకోదగ్గదిగా కన్పించదు. కానీ జీవితకాలం తక్కువగానే ఉన్నది. వేలాది సంవత్సరాల క్రితం, బైబిలులోని కీర్తనల గ్రంథకర్త ఇలా వ్యాఖ్యానించాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.” (కీర్తన 90:​10) మనమెక్కడ జీవిస్తున్నా, మనమెవరిమైనా మనమీ భూమ్మీద పడ్డ క్షణం తర్వాత మనకిక మిగిలివున్న దినాలు, గంటలు, నిమిషాలు పరిమితమైనవే. అయితే, ఆ అమూల్యమైన సమయంలో కొంత దేనికోసమో ఎవరికోసమో వేచివుంటూ వ్యర్థం చేసుకునే పరిస్థితుల్ని మనం నివారించలేము.

ఎలా వేచివుండాలనేది నేర్చుకోవడం

మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు కారులో కూర్చుని ఉండగా, డ్రైవరు తన ముందున్న బండిని దాటిపోవాలని ప్రయత్నించడం అనుభవమయ్యే ఉంటుంది. సాధారణంగా ఆ డ్రైవరుకి అంత అత్యవసరమైన పనేమీ ఉండదు. అయినా తన పురోభివృద్ధిని మరొక డ్రైవరు నిర్దేశించడాన్ని అతడు భరించలేడు. ఆయన అసహనం చూస్తే, ఆయన ఎలా వేచివుండాలనేది నేర్చుకోలేదని తెలిసిపోతుంది. నేర్చుకోవడమా? అవును, ఎలా వేచివుండాలన్నది నేర్చుకోవల్సిన పాఠమే. పుట్టుకతోనే ఎవరూ దానితో పుట్టరు. తమకు ఆకలైనప్పుడో అసౌకర్యం కల్గినప్పుడో చిన్న పిల్లలు తమని పట్టించుకోమని డిమాండు చేస్తారు. వారు పెద్దవారౌతున్నప్పుడే తమకు కావల్సినదాన్ని పొందాలంటే కొన్నిసార్లు తాము వేచివుండాలన్నది అర్థమౌతుంది. నిజంగానే, వేచివుండడం అన్నది జీవితంలో అనివార్యమైన అంశం గనుక, అవసరమైనప్పుడు సహనంతో ఎలా వేచివుండాలనేది నేర్చుకోవడం ఒక పరిణతి చెందిన వ్యక్తికి గుర్తింపు చిహ్నం.

నిజమే, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అసహనం అన్నది అర్థం చేసుకోదగిందే. యౌవనస్థుడైన ఒక భర్త తన భార్యకు నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు, ఏమన్నా ఆలస్యం జరిగితే ఆయన సహనం కోల్పోవడం అర్థం చేసుకోదగినదే. లోతును సొదొమ విడిచిపెట్టమని తొందరపెడ్తున్న దేవదూతలు లోతు ఆలస్యం చేస్తున్నప్పుడు వేచివుండడానికి సిద్ధంగా లేరు. నాశనం ముంచుకు రాబోతున్నది, లోతు, ఆయన కుటుంబ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. (ఆదికాండము 19:​15, 16) అయితే, అత్యధిక సందర్భాల్లో వేచివుండాల్సివచ్చిన ప్రతీసారీ ప్రాణాలు పోయే పరిస్థితులేమీ ఉండవు. అటువంటి సందర్భాల్లో అందరూ సహనంతో ఉండడం నేర్చుకుని ఉంటే చక్కగా ఉంటుంది​—⁠ఒకవేళ ఈ వేచివుండడం ఒకరి అసమర్థత మూలంగానో లేదా నిరాసక్తత మూలంగానో జరిగినా సరే. అంతేగాక, వేచివుండాల్సిన సమయాన్ని ఎలా ప్రయోజనకరంగా గడపవచ్చో అందరూ నేర్చుకుంటే అప్పుడు సహనంతో ఉండడం మరింత సులభంగా ఉంటుంది. ఐదవ పేజీలోని బాక్సులో, వేచివుండే సమయంలో సహనంతో ఉండడమే గాక ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో తెలియజేసే కొన్ని సూచనలున్నాయి.

అసహనంతో కూడిన స్ఫూర్తి గర్వంతో కూడిన వైఖరిని వెల్లడిచేస్తుండవచ్చన్న విషయాన్ని కూడా విస్మరించలేము. తాను వేచివుండేలా చేయడానికి వీల్లేనంత ప్రాముఖ్యమైన వాడినన్న భావనలోంచి అది పుడుతుంది. అటువంటి వైఖరి గల ఎవరైనా, బైబిల్లోని ఈ మాటలు పరిశీలించడం మంచిది: “అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు.” (ప్రసంగి 7:⁠8) అహంకారం, లేదా గర్వం ఒక గంభీరమైన వ్యక్తిత్వ లోపం, అందుకనే బైబిలు ఇలా చెబుతుంది: “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు.” (సామెతలు 16:⁠5) అందుకని సహనాన్ని నేర్చుకోవడానికి​—⁠ఎలా వేచివుండాలనేది నేర్చుకోవడానికి—⁠మనల్ని మనం బాగా పరీక్షించుకోవడమూ మన చుట్టూ ఉన్న ఇతరులతో మనకు గల సంబంధాల్ని పరీక్షించుకోవడమూ అవసరం కావచ్చు.

సహనానికి ప్రతిఫలం లభిస్తుంది

మనం వేచివుంటున్నది దేనికోసమైనా సరే, అది ఆలస్యమైనా తగిన ప్రతిఫలాన్నిస్తుందనీ, తప్పక వస్తుందనీ మనకు పూర్తి నమ్మకం కలిగితే వేచివుండడం సాధారణంగా సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో, దేవుణ్ణి యథార్థంగా ఆరాధించే వారందరూ బైబిలులో ఉన్న ఆయన చేసిన అద్భుతమైన వాగ్దానాల నెరవేర్పు కోసం వేచివుంటున్నారన్న వాస్తవాన్ని గురించి తలపోయడం మంచిది. ఉదాహరణకు, దైవికంగా ప్రేరేపించబడిన ఒక కీర్తనలో మనకిలా చెప్పబడింది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యమూ నివసించెదరు.” ఈ వాగ్దానం అపొస్తలుడైన యోహాను వ్రాసిన ఈ మాటల్లో ప్రతిధ్వనిస్తుంది: “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (కీర్తిన 37:​29; 1 యోహాను 2:​17) మనం నిరంతరం జీవించగల్గితే వేచివుండడం అంత పెద్ద సమస్యగా ఉండదు. కానీ మనం ప్రస్తుతం నిరంతరం జీవించడంలేదు. కాబట్టి నిరంతర జీవితం గురించి మాట్లాడడం అసలు వాస్తవికమేనా?

జవాబివ్వడానికి ముందు, దేవుడు మొదట్లో మన తొలి తలిదండ్రుల్ని నిరంతరం జీవించే ఉత్తరాపేక్షతో సృష్టించాడన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. కేవలం పాపం చేశారన్న కారణంగానే వారు తమకోసమూ తమ పిల్లలకోసమూ ఆ భవిష్యత్తును కోల్పోయారు​—⁠ఈ పిల్లల్లో మనమూ ఉన్నాము. అయినప్పటికీ వారు పాపం చేసిన వెంటనే దేవుడు వారి అవిధేయతా పరిణామాల్ని నిష్ఫలం చేయడానికైన తన సంకల్పాన్ని ప్రకటించాడు. ఒక “సంతానము” వస్తాడని ఆయన వాగ్దానం చేశాడు, ఆ సంతానము యేసుక్రీస్తే.​—⁠ఆదికాండము 3:​15; రోమీయులు 5:⁠18.

ఇక, మనం ఒక్కొక్కరంగా ఆ నెరవేర్పు నుండి ప్రయోజనం పొందుతామా లేదా అన్నది మనం తీసుకోవల్సిన నిర్ణయం. అలా పొందటానికి సహనం కావాలి. ఇటువంటి సహనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయటానికి బైబిలు ఒక వ్యవసాయదారుని ఉదాహరణను గురించి ధ్యానించమని మనకు చెబుతుంది. వ్యవసాయదారుడు విత్తనాలు విత్తి పంట కోతకొచ్చేంత వరకూ ఓపికగా వేచివుంటాడు​—⁠వేరు దారి లేదు. ఈలోగా పంటను కాపాడడానికి తనకు సాధ్యమైనంత చేస్తూ ఉంటాడు. తర్వాత తన సహనానికి ప్రతిఫలం దక్కుతుంది, తన కృషికి తగ్గ ఫలాల్ని ఆయన చూస్తాడు. (యాకోబు 5:⁠7) సహనానికి మరొక ఉదాహరణను అపొస్తలుడైన పౌలు పేర్కొంటున్నాడు. ప్రాచీన కాలానికి చెందిన విశ్వసనీయులైన వ్యక్తులను మన స్మరణకు తెస్తున్నాడు. వారు దేవుని సంకల్పాల నెరవేర్పుకోసం ఎదురుచూస్తూ జీవించారు, కానీ వారు దేవుని నియమిత కాలం కోసం వేచివుండాల్సివచ్చింది. “విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించు”కొనే వీరిని అనుకరించమని పౌలు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు.​—⁠హెబ్రీయులు 6:​11, 12.

అవును, వేచివుండడమనే దాన్ని మనం తప్పించుకోలేము. కానీ దాని మూలంగా ఎప్పుడూ చింతిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానాల నెరవేర్పుకోసం వేచివుంటున్న వ్యక్తుల విషయంలో అది ఆనందానికి మూలం కాగలదు. వారు వేచివుండాల్సిన సమయాన్ని దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పెంపొందించుకుంటూ, తమ విశ్వాసాన్ని ప్రదర్శించే పనుల్ని చేస్తూ గడపవచ్చు. అంతేగాక, ప్రార్థన పఠనం ధ్యానం వంటివాటి ద్వారా వారు, దేవుడు వాగ్దానం చేసిన ప్రతీదీ దాని దాని సమయంలోనే సంభవిస్తుందన్న అచంచలమైన విశ్వాసాన్ని కూడా పెంపొందించుకోగలరు.

[5వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

వేచివుండడంలోని వ్యథను తగ్గించుకోండి!

ముందే ప్లాన్‌ చేసుకోండి! మీరు వేచివుండాల్సి వస్తుందని మీకు తెలిసినప్పుడు, ఏదైనా చదవడం, వ్రాయడం, కుట్టుపనులు చేయడం, క్రొషే పనిచేయడం, లేదా మరితర ఉపయోగకరమైన పనుల్లో నిమగ్నమై ఉండడానికి సిద్ధంగా ఉండండి.

సమయాన్ని ధ్యానించటానికి ఉపయోగించండి, జీవనగతి వేగంగా ఉండే ఈ కాలంలో సాధారణంగా ఇది చేయటానికి కష్టంగా ఉంటుంది.

ఫోనులో మాట్లాడుతుండగా అవతలి వ్యక్తి కాస్సేపాగమని చెప్పినప్పుడు చదివేందుకు అందుబాటులో ఉండేలా టెలిఫోను దగ్గర పుస్తకాలు ఉంచండి; ఐదు లేదా పది నిమిషాల్లో మీరు ఎన్నో పేజీలు చదివేయగలరు.

ఏదైనా గుంపుతో పాటు వేచివుంటున్నప్పుడు, యుక్తమైనట్లైతే, ఇతరులతో సంభాషణను ప్రారంభించండి, వారితో క్షేమాభివృద్ధికరమైన విషయాల్ని పంచుకోండి.

అనూహ్యమైన సందర్భాల్లో వేచివుండాల్సి వచ్చినప్పుడు చదువుకోవడానికి వీలుగా కార్లో పుస్తకాలు, నోటుపుస్తకాలు కూడా ఉంచుకోండి.

కళ్ళు మూసుకుని రిలాక్సవండి, లేదా ప్రార్థన చేయండి.

విజయవంతమైన రీతిలో వేచివుండడం ఎక్కువగా ఒక వ్యక్తి వైఖరిపైనా ముందుచూపుపైనా ఆధారపడివుంటుంది.