మీరు దేవుడ్ని ఎందుకు సేవిస్తారు?
మీరు దేవుడ్ని ఎందుకు సేవిస్తారు?
దైవభయం గల ఓ రాజు ఒకసారి తన కుమారునికి ఈ సలహా ఇచ్చాడు: ‘నీ తండ్రియొక్క దేవుడ్ని తెలిసికొని, హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము.’ (1 దినవృత్తాంతములు 28:9) తన సేవకులు కృతజ్ఞతతో, ప్రశంసాత్మకమైన హృదయాలతో తనను సేవించాలని యెహోవా కోరుతున్నాడన్నది స్పష్టం.
బైబిలు వాగ్దానాలు మనకు మొదటిసారిగా వివరించబడినప్పుడు కృతజ్ఞతా భావంతో మన హృదయాలు ఉప్పొంగిపోయాయని యెహోవాసాక్షులముగా మనం వెంటనే అంగీకరిస్తాం. ప్రతీరోజు, దేవుని సంకల్పాల గురించిన ఏదో ఒక క్రొత్త విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. మనం యెహోవా గురించి తెలుసుకున్నకొద్దీ, ‘హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను’ ఆయనను సేవించాలన్న మన కోరిక మరింతగా పెరిగింది.
యెహోవాసాక్షులైన అనేకమంది అవధుల్లేని ఆనందంతో తమ జీవితమంతా యెహోవాను విడువకుండా సేవిస్తూనే ఉన్నారు. అయితే, కొంతమంది క్రైస్తవులు ప్రారంభంలో సంతోషంతో సేవించారు, కానీ కాలం గడిచేకొలది దేవుడ్ని సేవించడానికి మనల్ని ప్రేరేపించే బలమైన కారణాలేమిటన్న దృష్టిని కోల్పోయారు. మీ విషయంలోనూ అదే జరిగిందా? అలా జరిగితే, బాధపడవద్దు. పోయిన సంతోషాన్ని తిరిగి పొందవచ్చు. ఎలా?
మీరు అనుభవిస్తున్న ఆశీర్వాదాలను తలపోయండి
మొదటిగా, దేవుడు మీకు ప్రతిదినమూ కుమ్మరిస్తున్న ఆశీర్వాదాల గురించి ధ్యానించండి. యెహోవా ఇచ్చిన శ్రేష్ఠమైన ఈవుల గురించి ఆలోచించండి: సాంఘిక, ఆర్థిక స్థితిగతులెలావున్నా అందరికీ ధారాళంగా లభ్యమయ్యే అనేకమైన హస్తకృత్యాలు, అంటే—ఆయన ప్రకృతిసిద్ధంగా అనుగ్రహిస్తున్న ఆహారపానీయాల గురించి, మనం అనుభవిస్తున్న కొద్దో గొప్పో ఆరోగ్యం గురించి, బైబిలు సత్యం పట్ల మీకున్న జ్ఞానం గురించి, మరిముఖ్యంగా, ఆయన కుమారుడ్ని మనకు బహుమానంగా ఇవ్వడం గురించి ఆలోచించండి. నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సేవించడానికి ఆయన మరణం, మనకు మార్గాన్ని సిద్ధంచేసింది. (యోహాను 3:16; యాకోబు 1:17) దేవుని మంచితనాన్ని గురించి మీరు ఎంతెక్కువగా ధ్యానిస్తే, ఆయన పట్ల మీకున్న ప్రశంస అంతెక్కువగా పెరుగుతుంది. అప్పుడు ఆయన మీ కోసం చేసిన వాటన్నింటి విషయమై ఆయనను కృతజ్ఞతతో సేవించేలా మీ హృదయం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు కీర్తన గ్రంథకర్త వ్రాసినట్లుగా మరి అలా భావించడం ప్రారంభిస్తారనడంలో ఎలాంటి సందేహమూలేదు: “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.”—కీర్తన 40:5.
ఈ మాటలు సమస్యల నుండి ఎలాంటి మినహాయింపూ లేని దావీదు వ్రాశాడు. తనను చంప ప్రయత్నించే దుష్టరాజగు సౌలు, అతని దేహసంరక్షకుల బారినుండి తప్పించుకు తిరగడంలోనే దావీదు యౌవనమంతా గడిచిపోయింది. (1 సమూయేలు 23:7, 8, 19-23) వ్యక్తిగత బలహీనతలతో కూడా దావీదు పోరాడాడు. 40వ కీర్తనలో తానిలా అంగీకరించాడు: “లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలయెత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి.” (కీర్తన 40:12) అవును, దావీదుకు సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని బట్టి ఆయన పూర్తిగా కృంగిపోలేదు. తనకు సమస్యలు ఉన్నప్పటికీ యెహోవా తనకు ఏ యే విధాలుగా ఆశీర్వాదాలను దయచేస్తున్నాడన్న దానిపై ఆయన దృష్టి నిల్పాడు, ఆయన అనుభవిస్తున్న శ్రమలు ఆ ఆశీర్వాదాలను మించినవి కావని ఆయన గుర్తించాడు.
వ్యక్తిగత సమస్యలతో లేక సరిగా చేయలేకపోతున్నాననే భావాలతో మీరు కృంగిపోతున్నప్పుడు, అలాంటి భావాలను అక్కడితో ఆపి, దావీదు చేసినట్లుగా మీరూ మీకు దయచేయబడిన ఆశీర్వాదాలను గురించి తలపోయడం మంచిది. ఆ ఆశీర్వాదాల పట్ల మీకున్న ప్రశంస యెహోవాకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి ప్రేరేపించిందనడంలో ఎలాంటి
సందేహమూ లేదు; అలా తలపోయడం, మీరు కోల్పోయిన సంతోషాన్ని పునరుజ్జీవింపజేసుకోవడానికి, ప్రశంసాపూర్వక హృదయంతో దేవుడ్ని సేవించడానికి మీకు సహాయం చేస్తుంది.సంఘ కూటాలు సహాయపడగలవు
యెహోవా మంచితనాన్ని ఏకాంత సమయంలో ధ్యానించడంతో పాటు తోటి క్రైస్తవులతో సహవసించడం కూడా మనకు అవసరం. దేవుడ్ని ప్రేమించి, ఆయనను సేవించాలని తీర్మానించుకున్న స్త్రీ పురుషులతో, యౌవనులతో క్రమంగా కలవడం ప్రోత్సాహాన్నిస్తుంది. యెహోవా సేవలో పూర్ణాత్మతో పనిచేసేలా వారి మాదిరిలు మనల్ని ప్రేరేపిస్తాయి. రాజ్యమందిరానికి హాజరవ్వడం ద్వారా వాళ్ళకు మనం కూడా ప్రోత్సాహాన్ని అందించిన వాళ్లమౌతాము.
నిజమే, కష్టపడి పనిచేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, లేదా ఏదో ఒక సమస్య లేక బలహీనతను బట్టి నిరుత్సాహపడిపోయినప్పుడు, రాజ్యమందిరంలో కూటానికి హాజరవ్వడం గూర్చి ఆలోచించడం అంత సులభం కాకపోవచ్చు. అలాంటి సమయాల్లో, తోటి క్రైస్తవులతో కూడుకోవాలన్న ఆజ్ఞకు విధేయులవ్వడానికి గాను ‘మన శరీరాన్ని నలుగగొట్టుకొన్న’ట్లుగా మనతో మనమే స్థిరంగా ఉండవలసిన అవసరం రావచ్చు.—1 కొరింథీయులు 9:26, 27; హెబ్రీయులు 10:23-25.
అలా చేయవలసివస్తే, యెహోవాను మనం పూర్ణహృదయంతో ప్రేమించడం లేదని తీర్మానం చేసుకోవాలా? అవసరం లేదు. గతకాలంలోని పరిపక్వత గల క్రైస్తవులకు దేవునిపై ప్రేమ ఉందనడంలో సందేహమేమీ లేదు, అయినప్పటికీ వాళ్ళు కూడా దేవుని చిత్తాన్ని చేయడంలో ఎంతగానో పోరాడారు. (లూకా 13:24) అలాంటి క్రైస్తవుల్లో అపొస్తలుడైన పౌలు ఒకరు. ఆయన తన భావాలను బాహాటంగా ఈ విధంగా తెలిపాడు: “నాయందు, ఆనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయచున్నాను.” (రోమీయులు 7:18, 19) “నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. . . . ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయనను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను,” అని ఆయన కొరింథీయులతో అన్నాడు.—1 కొరింథీయులు 9:16, 17.
మనలో అనేకులవలెనే, సరైనది చేయాలనే పౌలు కోరిక వెనుక పాపపు దృక్పథాలు దాగియుండేవి. అయితే, ఆ దృక్పథాలకు వ్యతిరేకంగా ఆయన జరిగించిన పోరాటంలో అనేకసార్లు ఆయన విజయం సాధించాడు. నిజమే, పౌలు దీనిని తన స్వంత బలముతో సాధించలేదు. ఆయన ఇలా వ్రాశాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:13) సరియైనది చేసేలా మీకు సహాయం చేయమని పౌలును బలపరచిన యెహోవానే కోరినట్లయితే ఆయన మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. (ఫిలిప్పీయులు 4:6, 7) గనుక మీరు ‘బోధ [“విశ్వాసము”NW] నిమిత్తం పోరాడినట్లయితే’ యెహోవా తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.—యూదా 3.
ఆ పోరాటాన్ని మీరే స్వయంగా చేయాల్సిన అవసరం లేదు. యెహోవాసాక్షుల సంఘాల్లో ఉన్న పరిపక్వత గల సంఘ పెద్దలు తాముగా ‘విశ్వాసం నిమిత్తం పోరాడడంలో’ పట్టుదలను కల్గి ఉండి, అలా చేయడంలో మీకు సహాయం చేయడానికి ఇష్టతను కనబరుస్తారు. సహాయం కోసం మీరు ఒక పెద్దను సమీపించినట్లయితే, ఆయన మిమ్మల్ని ‘ధైర్యపరచడానికి’ కృషిచేస్తాడు. (1 థెస్సలొనీకయులు 5:14) “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలె” ఉండాలనేది ఆయన గురైవుంది.—యెషయా 32:2.
“దేవుడు ప్రేమాస్వరూపి” తన సేవకులు తనను ప్రేమతో సేవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 యోహాను 4:8) దేవుని పట్ల ఉన్న మీ ప్రేమను పునరుజ్జీవింపజేసే అవసరత ఉందంటే, పైన పేర్కొన్నట్లుగా చేయడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోండి. అలా చేసినప్పుడు ఆనందాన్ని మీరనుభవిస్తారు.