ఆప్టీషియన్ ఒక విత్తనాన్ని నాటడం
ఆప్టీషియన్ ఒక విత్తనాన్ని నాటడం
యుక్రేన్‌లోని లవీఫ్‌లో ఉన్న ఒక ఆప్టీషియన్ కృషికీ, దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో కొన్ని దేశాల అవతల ఉన్న ఇజ్రాయేల్‌లోని హైఫలో రష్యన్ భాష మాట్లాడే యెహోవాసాక్షుల క్రొత్త సంఘం ఏర్పడడానికీ ఏమి సంబంధం ఉంది? ఆ కథ, “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు” అని చెప్తున్న ప్రసంగి 11:6 నందలి బైబిలు వ్యాఖ్యానం యొక్క విలువను స్పష్టం చేస్తుంది.
పూర్వం యూదా మతానికి చెందిన, మందుల వ్యాపారం చేస్తున్న ఎల్ల అనే యౌవనస్థురాలు లవీఫ్‌లో నివసిస్తున్న సమయంలో అంటే 1990 లో మన కథ ప్రారంభమౌతుంది. ఎల్ల, ఆమె కుటుంబం ఇజ్రాయేల్‌కు వలస వెళ్లడానికి సిద్ధమౌతున్నారు. వారు వెళ్లేముందు ఎల్ల ఆప్టీషియన్ దగ్గరికి వెళ్లవలసి ఉంది, ఆయన ఒక యెహోవాసాక్షి.
ఆ సమయంలో, యెహోవాసాక్షుల పని యుక్రేన్‌లో నిషేధించబడింది. అయినప్పటికీ ఆయన చొరవ తీసుకుని తన బైబిలు ఆధారిత నమ్మకాలను ఎల్లతో పంచుకున్నాడు. దేవునికి వ్యక్తిగతమైన పేరు ఉందని ఆయన చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్య చకితురాలయ్యింది. అది ఎల్ల ఉత్సుకతను ప్రేరేపించింది, దానితో ఒక చక్కని బైబిలు చర్చ జరిగింది.ఎల్లకు ఆ చర్చ ఎంతగా నచ్చిందంటే ఆమె తర్వాతి వారం అలాగే ఆ తర్వాతి వారం కూడా చర్చించమని కోరింది. ఆమె ఆసక్తి పెరుగుతోంది, కానీ ఒక సమస్య ఉంది. ఆ కుటుంబం ఇజ్రాయేల్‌కు వెళ్లవలసిన సమయం వేగంగా సమీపిస్తోంది. ఎల్ల నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉంది! ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆమె తాను వెళ్లిపోయే వరకు ప్రతిరోజు బైబిలు అధ్యయనం చేయమని కోరింది. ఆమె ఇజ్రాయేల్‌కు వచ్చేశాక తన అధ్యయనాన్ని పునఃప్రారంభించనప్పటికీ, సత్య విత్తనం ఆమెలో వేళ్లూనింది. ఆ సంవత్సరం ముగింపుకల్లా ఆమె మళ్ళీ శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేస్తోంది.
పర్షియన్ సింధుశాఖలో యుద్ధం ప్రారంభం కావడంతో ఇరాక్ ఇజ్రాయేల్‌పై మిస్సైల్స్‌తో దాడి చేసింది. ఇది తరచూ చర్చణీయాంశం అయిపోయింది. ఒకరోజు సూపర్ మార్కెట్‌లో, క్రొత్తగా వలస వచ్చిన రష్యన్ భాష మాట్లాడే ఒక కుటుంబం మాట్లాడుకుంటుండగా ఎల్ల విన్నది. అప్పటికింకా ఆమె బైబిలు అధ్యయనం చేస్తున్నప్పటికీ, ఎల్ల ఆ కుటుంబాన్ని సమీపించి, సమాధానకరమైన లోకాన్ని గురించిన బైబిలు వాగ్దానాన్ని వారితో పంచుకున్నది. ఫలితంగా, కుమారుడు సాషా (ఏరియల్), కుమార్తె ఈలన, అమ్మమ్మ గలీన, తల్లి నటాషా అందరూ ఎల్లతో బైబిలు పఠనానికి అంగీకరించారు.
ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ ఆ కుటుంబంలో బాప్తిస్మం వరకు చేరుకున్న మొదటి వ్యక్తి సాషా. అతడు ప్రతిభావంతుడైన విద్యార్థి అయినప్పటికీ, పాఠశాల పాఠ్యావళిలో తప్పనిసరి భాగంగా ఉన్న సైనిక సంబంధమైన తర్ఫీదును తీసుకోవడానికి ఆయన క్రైస్తవ మనస్సాక్షి అనుమతించకపోవడం మూలంగా ఆయన పాఠశాల నుండి తీసివేయబడ్డాడు. (యెషయా 2:2-4) సాషా కేసు జెరూసలేమ్‌లోని ఇజ్రాయేల్ కోర్టుకు వెళ్లింది, అది సాషా పాఠశాల విద్య ముగించగలిగేలా ఆయనను మళ్లీ చేర్చుకొమ్మని ఆజ్ఞలు జారీ చేసింది. ఆ కేసు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. తత్ఫలితంగా, చాలామంది ఇజ్రాయేల్ దేశస్థులకు యెహోవాసాక్షుల గురించి తెలిసింది. *
సాషా ఉన్నత పాఠశాల చదువు ముగించి, యెహోవాసాక్షుల పూర్తికాల పరిచర్యను చేపట్టాడు. నేడు ఆయన ప్రత్యేక పయినీరుగా, సంఘ పెద్దగా సేవచేస్తున్నాడు. సాషా సహోదరి ఈలన కూడ ఆయనతోపాటు పూర్తికాల పరిచర్య చేస్తుంది. వాళ్ల అమ్మ, అమ్మమ్మలు ఇద్దరూ బాప్తిస్మం తీసుకున్న సాక్షులు. ఆ ఆప్టీషియన్ నాటిన విత్తనం ఇంకా ఫలాలను ఫలిస్తోంది!
ఈ మధ్యలో ఎల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించి, త్వరలోనే ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం మొదలుపెట్టింది. ఆమె తాను వెళ్లిన మొదటి ఇంట్లోనే ఫైనాను కలుసుకుంది, ఫైనా ఇటీవలనే యుక్రేన్ నుండి వచ్చింది. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతుంది. ఎల్ల తలుపు తట్టే సమయానికి కొంచెం ముందు, ఎంతో వేదనతో ఉన్న ఫైనా, “నీవు ఎవరో నాకు తెలియదు, కానీ నీవు వినగల్గితే నాకు సహాయం చెయ్యి” అని దేవునికి ప్రార్థించింది. ఆ విషయం ఎల్లకి తర్వాత తెలిసింది. ఆమె, ఎల్ల చాలా ఉత్తేజభరితమైన చర్చలో పాల్గొన్నారు. ఫైనా చాలా ప్రశ్నలు వేసింది, ఇవ్వబడిన జవాబులను ఆమె ఎంతో జాగ్రత్తగా పరిశీలించింది. సకాలంలోనే, యెహోవాసాక్షులు బైబిలు నుంచి సత్యాన్ని బోధిస్తారని ఆమెకు రూఢి అయ్యింది. తాను సంఘంతోనూ, ప్రకటనాపనిలోనూ ఎక్కువ సమయాన్ని గడపగలిగే విధంగా ఆమె తన విశ్వవిద్యాలయ విద్యా కార్యక్రమంలో మార్పులు చేసుకుంది. ఫైనా 1994 మేలో బాప్తిస్మం తీసుకుంది. ఆమె కూడా పయినీరు పరిచర్యను
ప్రారంభించి, కంప్యూటర్ రంగంలో పార్ట్‌టైమ్ పని చేస్తూ తన కాళ్లపై తాను నిలబడింది.1994 నవంబరులో ఒకసారి ప్రకటనా పనిలో పాల్గొంటున్నప్పుడు ఎల్లకు హఠాత్తుగా చాలా నీరసం అనిపించింది. ఆమె హాస్పిటల్‌కు వెళ్లింది, అక్కడ చేసిన పరీక్షలు ఆమెకు ప్రేగులో అల్సర్ ఉందనీ, రక్తం కారుతోందనీ వెల్లడి చేశాయి. సాయంకాలానికల్లా ఆమె హెమోగ్లోబిన్ కౌంట్ 7.2కు పడిపోయింది. ఎల్ల సంఘంలోని ఒక పెద్ద, స్థానిక హాస్పిటల్ లియాసన్ కమిటీ (హెచ్.ఎల్.సి) చైర్మన్, రక్తాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేని అనేక వైద్య విధానాలను గురించిన సమాచారాన్ని వైద్యులకు తెలియజేశాడు. * రక్తం లేకుండా శస్త్రచికిత్సను విజయవంతంగా చేయడం జరిగింది, ఎల్ల పూర్తిగా కోలుకుంది.—అపొస్తలుల కార్యములు 15:28, 29.
ఎల్లకు చికిత్స చేసిన వైద్యుడు, జర్మనీలో జన్మించిన కార్ల్ అనే పేరుగల ఒక యూదుడు. ఆయన దీనికి ఎంతో ప్రభావితమయ్యాడు. హోలోకాస్ట్‌ను తప్పించుకుని బ్రతికిన వారిలో ఒకరైన తన తల్లిదండ్రులకు నిర్బంధ శిబిరాల్లోని యెహోవాసాక్షుల గురించి తెలుసని ఆయనకు గుర్తు వచ్చింది. కార్ల్ చాలా ప్రశ్నలు వేశాడు. తన వైద్యవృత్తిలో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ, క్రమంగా బైబిలు అధ్యయనం చేయడానికి కార్ల్ సమయాన్ని వెచ్చించాడు. తర్వాతి సంవత్సరానికల్లా, ఆయన వారం వారం జరిగే క్రైస్తవకూటాలకు హాజరవ్వడం ప్రారంభించాడు.
ఆ ఆప్టీషియన్ నాటిన విత్తనం వల్ల వచ్చిన ఫలితమేమిటి? సాషాకు ఆయన కుటుంబానికి ఏమి జరిగిందో మనం చూశాము. ఎల్ల విషయానికొస్తే, ఆమె ఒక ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తోంది. ఆమె కుమార్తె ఈనా ఉన్నత పాఠశాల విద్య ముగించిన వెంటనే పయినీరుగా తన కెరీర్‌ను మొదలు పెట్టాలనుకుంటుంది. ఫైనా కూడా ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తుంది. ఎల్ల వైద్యుడైన కార్ల్ ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న సాక్షి, పరిచర్య సేవకుడు. ఆయన బైబిలు సత్యానికున్న స్వస్థపరిచే శక్తి గురించి తన రోగులతోనూ ఇతరులతోనూ చెప్తున్నాడు.
హైఫ హెబ్రీ సంఘంలో ఒక చిన్న భాగంగా ప్రారంభమైన, రష్యా భాష మాట్లాడే వలసదారుల చిన్న గుంపు. అది ఇప్పుడు 120 కన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులతో ఆసక్తిగల రష్యన్ సంఘంగా రూపొందింది. ఈ అభివృద్ధికి కొంతమేరకు, లవీఫ్‌లోని ఒక ఆప్టీషియన్ విత్తనం నాటడానికి అవకాశాన్ని ఉపయోగించుకోవడమే కారణం!
[అధస్సూచీలు]
^ పేరా 6 అదనపు సమాచారం కోసం, తేజరిల్లు! నవంబరు 8, 1994 (ఆంగ్లం), 12-15 పేజీలు చూడండి.
^ పేరా 9 రోగికి, హాస్పిటల్ సిబ్బందికి మధ్య సంభాషణలలో హెచ్.ఎల్.సి. సహాయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అత్యాధునిక వైద్య పరిశోధన ఆధారంగా ఇవ్వబడే ప్రత్యామ్నాయ వైద్య సంరక్షణ గురించి కూడా ఆ కమిటీ సమాచారాన్ని అందజేస్తారు.
[29వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
యుక్రేన్
ఇజ్రాయేల్
[చిత్రసౌజన్యం]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[30వ పేజీలోని చిత్రాలు]
ఎల్ల, ఆమె కుమార్తె ఈనా
[31వ పేజీలోని చిత్రం]
హైఫలోని రష్యన్ భాష మాట్లాడే ఆనందభరితుల గుంపు. ఎడమ నుండి కుడికి: సాషా, ఈలన, నటాషా, గలీన, ఫైనా, ఎల్ల, ఈనా, కార్ల్