కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రమాదాలతో నిండి ఉన్నప్రపంచంలో భద్రతను కనుగొనడం

ప్రమాదాలతో నిండి ఉన్నప్రపంచంలో భద్రతను కనుగొనడం

ప్రమాదాలతో నిండి ఉన్నప్రపంచంలో భద్రతను కనుగొనడం

మందుపాతరలు పాతిపెట్టబడిన ప్రాంతంలో నడవడం ప్రాణాంతకం కాగలదు. అయితే, మందుపాతరలు సరిగ్గా ఎక్కడెక్కడ పాతిపెట్టబడి ఉన్నాయో చూపించే మ్యాప్‌ మీదగ్గర ఉందనుకోండి, అది మీకు ఎంతో సహాయకరంగా ఉండదా? అంతేగాక, వివిధ మందుపాతరలను గుర్తించే విషయంలో కూడా మీకు మంచి తర్ఫీదు ఇవ్వబడిందనుకోండి. అలాంటి జ్ఞానం మీరు అంగవికలురయ్యే లేక మరణించే ప్రమాదాన్ని ఎంతగానో తగ్గిస్తుందని స్పష్టమౌతుంది.

మందుపాతరలను గుర్తించేందుకు తర్ఫీదును పొందడంతోసహా ఆ మ్యాప్‌ మన దగ్గర ఉండడంతో బైబిలును పోల్చవచ్చు. అపాయాలను తప్పించుకుంటూ, జీవితంలో తలెత్తే సమస్యలతో వ్యవహరించే విషయానికి వస్తే, దానికి కావాల్సిన అసమానమైన జ్ఞానం బైబిలులో ఉంది.

సామెతలు 2:10, 11 లలో ఉన్న అభయాన్నిచ్చే ఈ వాగ్దానాన్ని గమనించండి: “జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును.” ఇక్కడ ప్రస్తావించబడిన జ్ఞాన వివేచనలు మానవ మూలం నుండి కాదుగానీ, దైవిక మూలం నుండే వచ్చాయి. “[దైవిక జ్ఞానాన్ని] నంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.” (సామెతలు 1:​33) బైబిలు మన భద్రతను అధికం చేసి, అనేక సమస్యలను నివారించుకునేందుకు మనకెలా సహాయం చేయగలదో మనం చూద్దాం.

ప్రాణాంతకమైన దుర్ఘటనలను నివారించడం

ప్రయాణ దుర్ఘటనల మూలంగా సంవత్సరానికి భూవ్యాప్తంగా దాదాపు 11,71,000 మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రచురించిన గణాంకాలు చూపిస్తున్నాయి. దాదాపు మరో నాలుగు కోట్లమంది గాయపడుతున్నారు, 80 లక్షలకన్నా కాస్త ఎక్కువమంది దీర్ఘకాల అశక్తతకు గురౌతున్నారు.

వాహనం నడుపుతున్నప్పుడు సంపూర్ణ భద్రత సాధ్యం కాకపోయినప్పటికీ, మనం ట్రాఫిక్‌ నియమాలను పాటించినప్పుడు మన వ్యక్తిగత భద్రతను ఎంతగానో అధికం చేసుకోవచ్చు. ట్రాఫిక్‌ నియమాలను రూపొందించి, అమలు చేసే ప్రభుత్వ అధికారుల గురించి మాట్లాడుతూ బైబిలు ఇలా చెప్తుంది: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను.” (రోమీయులు 13:⁠1) వాహనాలను నడిపేవారు ఈ ఉపదేశానికి కట్టుబడి ఉండడం, తరచూ ఎంతో అపాయకరమైన పర్యవసానాలను తీసుకురాగల దుర్ఘటనలకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సురక్షితంగా వాహనాన్ని నడిపేందుకు మరో ప్రేరకం ఏంటంటే, ప్రాణం పట్ల ఉన్న గౌరవమే. యెహోవా దేవుని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “నీయొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:⁠9) కాబట్టి జీవం దేవుడిచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని ఎవరి నుండైనా తీసేసుకునే హక్కుగానీ, జీవంపట్ల అగౌరవాన్ని చూపే హక్కుగానీ అది చివరకు మన సొంత ప్రాణమైనా సరే, మనకు లేదు.​—⁠ఆదికాండము 9:5, 6.

సహజంగానే, మానవ జీవం పట్ల గౌరవాన్ని చూపించడంలో, మన కారునూ, ఇంటినీ సహేతుకంగా సాధ్యమైనంత సురక్షితంగా ఉండేలా చూసుకోవడం కూడా చేరివుంది. ప్రాచీన ఇశ్రాయేలులో, జీవితంలోని అన్ని కోణాల్లోనూ భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడేది. ఉదాహరణకు, ఒక ఇంటిని నిర్మించేటప్పుడు, దాని పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలని దేవుని ధర్మశాస్త్రం తెలియజేసింది​—⁠సాధారణంగా కుటుంబానికి సంబంధించిన చాలా కార్యకలాపాలు ఆ పైకప్పు మీదే జరిగేవి. “క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవడైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 22:⁠8) భద్రతనిచ్చే ఈ సూత్రాన్ని అనుసరించనందువల్ల ఎవరైనా పడిపోతే, దేవుడు ఆ ఇంటి యజమానిని బాధ్యునిగా ఎంచుతాడు. ఈ ఆజ్ఞలో నిక్షిప్తమైవున్న ప్రేమపూర్వకమైన సూత్రాన్ని అన్వయించుకోవడం పనిస్థలంలో లేదా చివరికి వినోద కార్యకలాపాల్లో దుర్ఘటనలు జరగడాన్ని తగ్గిస్తుందనడంలో సందేహం లేదు.

ప్రాణాంతకమైన దుర్వ్యసనాలను అధిగమించడం

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న దాని ప్రకారం, ఇప్పుడు ప్రపంచంలో ఒక వంద కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రొగతాగేవారు ఉన్నారు, సంవత్సరానికి దాదాపు 40 లక్షల కన్నా ఎక్కువ మరణాలు కేవలం పొగాకు మూలంగానే సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. రానున్న 20 నుండి 30 సంవత్సరాల్లో ఈ సంఖ్య ఒక కోటికి చేరుకోవచ్చునని అంచనా వేయబడుతుంది. పొగత్రాగుతున్న కోట్లమంది ఇతరులు, అలాగే “రిక్రియేషనల్‌” మాదకద్రవ్యాలను ఉపయోగించేవారు తమ వ్యసనాల మూలంగా తమ ఆరోగ్యాన్నీ, జీవన నాణ్యతనూ నాశనం చేసుకుంటారు.

పొగాకు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి దేవుని వాక్యం ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆ వాక్యంలో ఉన్న సూత్రాలు, అటువంటి వ్యసనాల నుండి మనల్ని కాపాడగలవు. ఉదాహరణకు, 2 కొరింథీయులు 7:1 ఇలా ఉపదేశిస్తుంది: “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.” పొగాకు, మత్తు పదార్థాలు హానికరమైన అనేక రసాయనాలతో మన శరీరాన్ని కలుషితం చేస్తాయనడంలో సందేహం లేదు. అంతేగాక, మన శరీరాలు “పరిశుద్ధము”గా ఉండాలని అంటే పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. (రోమీయులు 12:⁠1) ఈ సూత్రాలను అన్వయించుకోవడం ఒకరి జీవితానికి సంభవించగల గమనార్హమైన ప్రమాదాన్ని తగ్గించగలదని మీరు అంగీకరించరా?

ప్రమాదకరమైన అలవాట్లను అధిగమించడం

తినడం, త్రాగడం వంటి విషయాల్లో చాలామంది సమతూకాన్ని కోల్పోతారు. అదుపు లేకుండా తినడం మూలంగా మధుమేహం, క్యాన్సర్‌, హృద్రోగాలు రావచ్చు. త్రాగుబోతుతనం, సిరోసిస్‌ (మద్యపానం వల్ల వచ్చే కాలేయపు వ్యాధి), విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు, ప్రయాణ దుర్ఘటనలు వంటి అదనపు సమస్యలకు దారితీయగలదు. మరోవైపున, బరువు తగ్గాలని ఆహారాన్ని తీసుకోవడం మానేయడాన్ని అలవాటుగా చేసుకోవడం హానికరం కాగలదు; అది అనొరెక్సియా నర్వోసా వంటి ప్రాణాపాయకరమైన ఆహారపుటలవాట్లకు నడిపిస్తుంది.

బైబిలు వైద్యపరమైన పాఠ్యగ్రంథం కాకపోయినా, తినడం త్రాగడం వంటి విషయాల్లో సమతూకాన్ని పాటించవలసిన అవసరం గురించి అది చాలా సూటిగా ఉపదేశాన్నిస్తుంది. “నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు.” (సామెతలు 23:​19-21) అయినప్పటికీ, తినడం, త్రాగడం ఆనందాన్నిచ్చేవిగా ఉండాలని బైబిలు చెప్తుంది. “ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే.”​—⁠ప్రసంగి 3:⁠13.

“శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును” అని చెప్తూ శారీరక వ్యాయామం విషయంలో సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండమని కూడా బైబిలు ప్రోత్సహిస్తుంది. కానీ అదింకా ఇలా జత చేస్తుంది: “దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.” (1 తిమోతి 4:⁠8) ‘దైవభక్తి ఇప్పుడు కూడా ఎలా ప్రయోజనకరం కాగలదు?’ అని మీరు అడగవచ్చు. ఎన్నో విధాలుగా. దైవభక్తి ఒకరి జీవితానికి ఆవశ్యకమైన ఆధ్యాత్మిక కోణాన్ని అందించడమే గాక, ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశానిగ్రహము వంటి ప్రయోజనకరమైన లక్షణాలను పెంపొందింపజేస్తుంది, ఈ లక్షణాలన్నీ ఆశాజనక దృక్పథానికీ మంచి ఆరోగ్యానికీ దోహదపడతాయి.​—⁠గలతీయులు 5:​22-24.

లైంగిక దుర్నీతి వల్ల కలిగే చేదు పర్యవసానాలు

నేడు కోట్లమంది నైతికపరమైన ఆంక్షలకు తిలోదకాలిచ్చేశారు. దాని పర్యవసానాల్లో ఒకటి ఎయిడ్స్‌ మహామారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నదాని ప్రకారం, ఎయిడ్స్‌ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి 1.6 కోట్లకన్నా ఎక్కువమంది మరణించారు, ప్రస్తుతం 3.4 కోట్లమందికి ఎయిడ్స్‌కు కారణమయ్యే హెఐవి వైరస్‌ సోకింది. ఎయిడ్స్‌తో బాధపడుతున్న చాలామంది లైంగిక విచ్చలవిడితనం మూలంగానూ, మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉపయోగించిన సిరంజీలు లేక కలుషితమైన రక్తమార్పిడుల వంటివాటి మూలంగానూ ఆ వ్యాధిని కొని తెచ్చుకున్నారు.

నైతిక ప్రవర్తన లేకపోవడం వల్ల కలిగే ఇతర పర్యవసానాలలో హెర్పిస్‌, గనేరియా, హెపటైటిస్‌ బి మరియు సి, సిఫిలిస్‌ వంటి రోగాలు చేరివున్నాయి. అలాంటి వైద్యసంబంధ పదాలు బైబిలు కాలాల్లో ఉపయోగంలో లేకపోయినప్పటికీ, కొన్ని రకాలైన లైంగిక సంబంధ రోగాల మూలంగా ఆ కాలంలో సర్వసాధారణంగా దెబ్బతిన్న అవయవాలు తెలిసినవే. ఉదాహరణకు, సామెతలు 7:​23, వ్యభిచారం మూలంగా కలిగే భయంకరమైన పర్యవసానాలను ‘గుండెను [‘కాలేయాన్ని,’ NW] చీల్చే అంబుగా’ వర్ణిస్తుంది. హెపటైటిస్‌లాగే సిఫిలిసిస్‌ కూడా సాధారణంగా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అవును, ‘రక్తమును, జారత్వమును విసర్జించమని’ క్రైస్తవులకు బైబిలు ఇస్తున్న ఉపదేశం ఎంత సమయానుకూలమైనదో, ప్రేమపూర్వకమైనదో కదా!​—⁠అపొస్తలుల కార్యములు 15:28, 29.

ధనాపేక్ష అనే ఉరి

త్వరగా ధనవంతులు కావాలనే ప్రయత్నంలో చాలామంది తమ డబ్బుకు సంబంధించి చాలా ప్రమాదకరమైన చర్యలు తీసుకుంటారు. దుఃఖకరంగా అలాంటి ప్రమాదకరమైన చర్యలు చేపట్టడం తరచూ ఆర్థిక నష్టానికి లేక నాశనానికి దారి తీస్తుంది. అయితే దేవుని సేవకునికి బైబిలు ఇలా చెప్తుంది: “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.” (ఎఫెసీయులు 4:​27, 28) నిజమే, కష్టపడి పనిచేసే వ్యక్తి ఎల్లప్పుడూ ధనవంతుడు కాకపోవచ్చు. అయినప్పటికీ ఆయనకు మనశ్శాంతి, ఆత్మగౌరవం ఉంటాయి. అంతేగాక మంచి పనుల కోసం విరాళాలు కూడా ఇవ్వగల్గుతాడు.

బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి . . . నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” (1 తిమోతి 6:​9, 10) ‘ధనవంతులవ్వాలని అపేక్షించే’ చాలామంది ధనవంతులు అవుతారన్న విషయాన్ని కాదనలేము. అయితే దాని కోసం వారు ఏమి చెల్లించవలసి ఉంటుంది? వారు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, ఆధ్యాత్మికతను, చివరికి తమ నిద్రను కూడా కోల్పోవలసి ఉంటుందన్నది వాస్తవం కాదా?​—⁠ప్రసంగి 5:⁠12.

‘కలిమి విస్తరించుట తన జీవమునకు మూలము కాదని’ జ్ఞానవంతుడైన వ్యక్తి గుర్తిస్తాడు. (లూకా 12:​15) చాలా సమాజాల్లో డబ్బు, కొన్ని ఆస్తిపాస్తులు అవసరమన్నది నిజమే. వాస్తవానికి, “ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని బైబిలు పేర్కొంటుంది. అయితే “జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును” అని అది జతచేస్తుంది. (ప్రసంగి 7:​12) డబ్బులా కాకుండా సరైన జ్ఞానము, బుద్ధి మనకు అన్ని పరిస్థితుల్లోనూ ప్రాముఖ్యంగా మన జీవితాన్ని ప్రభావితం చేసే విషయాల్లో సహాయం చేయగలవు.​—⁠సామెతలు 4:5-9.

జ్ఞానము మాత్రమే మనల్ని కాపాడేటప్పుడు

నిజమైన జ్ఞానము, ‘దాని పొందిన వారి ప్రాణమును’ త్వరలోనే విశేషమైన విధంగా రక్షించును, దేవుడు దుష్టులను నాశనం చేసేటప్పుడు అంటే త్వరగా సమీపిస్తున్న “శ్రమ” సమయంలో కాపుదలనిస్తుంది. (మత్తయి 24:​21) ఆ సమయంలో ప్రజలు తమ డబ్బును “నిషిద్ధమని” వీధుల్లో పడేస్తారని బైబిలు చెప్తుంది. ఎందుకు? ఎందుకంటే “యెహోవా ఉగ్రత దినమందు” వెండి బంగారాలు తమ ప్రాణాన్ని కాపాడలేవని చేదు అనుభవం ద్వారా వాళ్లు తెలుసుకుంటారు. (యెహెజ్కేలు 7:​19) మరోవైపున, ఆధ్యాత్మిక ఆసక్తులకు తమ జీవితంలో మొదటిస్థానం ఇవ్వడం ద్వారా జ్ఞానయుక్తంగా ‘పరలోకమందు తమ కోసం ధనమును కూర్చుకున్న’ “గొప్ప సమూహము” తాము పెట్టిన పెట్టుబడిని బట్టి ప్రయోజనం పొంది పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందుతారు.​—⁠మత్తయి 6:19, 20; ప్రకటన 7:9, 14; 21: 3, 4.

ఈ సురక్షితమైన భవిష్యత్తును మనం ఎలా సంపాదించుకోగలం? యేసు ఇలా సమాధానమిస్తున్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) లక్షలాదిమంది దేవుని వాక్యమైన బైబిలులో ఈ జ్ఞానాన్ని కనుగొన్నారు. అలాంటి వారికి భవిష్యత్తు గురించి అద్భుతమైన నిరీక్షణ ఉండడమే గాక, ఇప్పుడు సమాధానాన్ని భద్రతను కూడా అనుభవిస్తున్నారు. అది, కీర్తనకర్త వ్యక్తపర్చినట్లుగా ఇలా ఉంటుంది: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.”​—⁠కీర్తన 4:⁠8.

మీ ఆరోగ్యానికి, ప్రాణానికి ఏర్పడగల ప్రమాదాలను తగ్గించుకోవడానికి బైబిలు చేసినంత సహాయాన్ని చేయగల సమాచార మూలం మరొకటేదైనా ఉందంటారా? మరే పుస్తకానికీ బైబిలుకున్నంతటి అధికారం లేదు, నేటి ప్రమాదాల ప్రపంచంలో నిజమైన భద్రతను కనుగొనడానికి మరే పుస్తకమూ మీకు సహాయం చేయలేదు. బైబిలును మరింతగా ఎందుకు పరిశీలించకూడదు?

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

బైబిలు సహాయంతో​—⁠మంచి ఆరోగ్యం, భద్రత

జీవిత వాస్తవాలను తప్పించుకోవాలని జేన్‌ * అనే యౌవనస్థురాలు గంజాయి, పొగాకు, కోక్‌, యాంఫిటమైన్స్‌, ఎల్‌ఎస్‌డి, ఇతర మాదక ద్రవ్యాలు వంటి వాటిని అలవాటుగా తీసుకునేది. ఆమె విపరీతంగా మద్యపానం కూడా సేవించేది. జేన్‌ చెప్తున్నదాని ప్రకారం, ఆమె భర్త కూడా అదే స్థితిలో ఉన్నాడు. వారికి భవిష్యత్తు అంధకారమయంగా ఉంది. అప్పుడు జేన్‌ యెహోవాసాక్షులను కలిసింది. ఆమె క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టి, కావలికోట మరియు దాని సహ పత్రికయైన తేజరిల్లు!లను చదివి, ఆ విషయాలను తన భర్తతో పంచుకునేది. వారిద్దరూ సాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. యెహోవా ఉన్నత ప్రమాణాల పట్ల వారు ప్రశంసను పెంపొందింపజేసుకుని మత్తుపదార్థాలను ఉపయోగించడం మానేశారు. ఫలితం? కొన్ని సంవత్సరాల తర్వాత జేన్‌ ఇలా వ్రాసింది: “మా క్రొత్త జీవితం మాకెంతో ఆనందాన్ని తెచ్చింది. యెహోవా వాక్యానికున్న శుభ్రపరిచే శక్తిని బట్టి, మేమిప్పుడు అనుభవించగల్గుతున్న స్వేచ్ఛాపూరితమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞురాలిని.”

నిజాయితీగల యజమానిగా ఉండడం యొక్క విలువ కుర్ట్‌ విషయంలో స్పష్టమైంది, ఆయన కంప్యూటర్ల సిస్టమ్‌లను చూసుకొనే పని చేస్తాడు. క్రొత్త పరికరాలు అవసరమయ్యాయి, మంచి ధరకు వాటిని కొనే బాధ్యతను కుర్ట్‌ యజమాని ఆయనకు అప్పగించాడు. కుర్ట్‌ ఒక మంచి పంపిణీదారుడ్ని కనుగొనడంతో ఇరువర్గాలు కలిసి ఒక వెలను నిర్ణయించుకున్నారు. అయితే, పంపిణీదారుల క్లర్క్‌ ఒక పొరపాటు చేసి తప్పు ధర వ్రాయడంతో, దాదాపు 20,00,000 రూపాయల మేరకు వెల తగ్గిపోయింది. కుర్ట్‌ పొరపాటును గ్రహించి, కంపెనీకి విషయాన్ని తెలియజేశాడు, తన 25 ఏళ్ల అనుభవంలో అంత నిజాయితీని తాను ఎన్నడూ చూడలేదని ఆ కంపెనీ మేనేజరు అన్నాడు. తన మనస్సాక్షి బైబిలుచే మలచబడిందని కుర్ట్‌ వివరించాడు. ఫలితమేమిటంటే, తాను తన తోటి ఉద్యోగులకు పంచిపెట్టేందుకు, వ్యాపార విషయాల్లో నిజాయితీగా ఉండడాన్ని ప్రస్తావించిన తేజరిల్లు! పత్రిక యొక్క 300 ప్రతులను తనకు ఇవ్వమని ఆ మేనేజరు కోరాడు. కుర్ట్‌ విషయానికొస్తే, ఆయన నిజాయితీ వల్ల ఆయనకు ప్రమోషన్‌ వచ్చింది.

[అధస్సూచీలు]

^ పేరా 30 పేర్లు మార్చబడ్డాయి.

[7వ పేజీలోని చిత్రం]

“నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును”

యెషయా 48:17