కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మీ సమర్పణకు తగ్గట్టు జీవిస్తున్నారా?

మీరు మీ సమర్పణకు తగ్గట్టు జీవిస్తున్నారా?

మీరు మీ సమర్పణకు తగ్గట్టు జీవిస్తున్నారా?

“మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” ​—⁠కొలొస్సయులు 3:​23, 24.

1. లౌకికపరంగా చూస్తే, “అంకితం చేసుకోవడం” లేక “సమర్పించుకోవడం” అనే పదం దేన్ని సూచిస్తుంది?

క్రీడాకారులు తమ సర్వశ్రేష్ఠమైన ప్రతిభను ఎలా ప్రదర్శించగలరు? టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బేస్‌బాల్‌, ట్రాక్‌, గోల్ఫ్‌ లేక మరే ఇతర క్రీడ అయినా సరే, ఉత్తమ ఆటగాళ్లు తాము ఆడే ఆటకు తమను తాము పూర్తిగా అంకితం చేసుకోవడం లేక సమర్పించుకోవడం ద్వారా మాత్రమే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. శారీరకంగా మానసికంగా మంచి స్థితిలో ఉండడం ప్రాముఖ్యం. ఇది, “అంకితం చేసుకోవడం” లేక “సమర్పించుకోవడం” అని అనువదించబడిన ఆంగ్ల పదానికున్న నిర్వచనాల్లో ఒకటైన, “ఒక ప్రత్యేక ఆలోచనా విధానానికిగానీ, చర్యకుగానీ పూర్తిగా కట్టుబడి ఉండడం” అనేదానికి చక్కగా సరిపోతుంది.

2. బైబిలు భావంలో “సమర్పణ” అంటే ఏమిటి? సోదాహరణంగా తెల్పండి.

2 అయినప్పటికీ, బైబిలు భావంలో “సమర్పణ” అంటే ఏమిటి? “సమర్పణ” అని అనువదించబడిన హెబ్రీ క్రియా పదానికి “ప్రత్యేకంగా ఉండడం; వేరుగా ఉండడం; విడిగా ఉండడం” అనే భావాలున్నాయి. * ప్రాచీన ఇశ్రాయేలులో, ప్రధాన యాజకుడైన అహరోను తాను పెట్టుకునే తలపాగా మీద “సమర్పణ యొక్క పరిశుద్ధ సూచన”ను ధరించేవాడు. అది, “యెహోవా పరిశుద్ధుడు” అనే హెబ్రీ పదాలు చెక్కబడిన మెరిసే స్వచ్ఛమైన స్వర్ణ ఫలకం. ‘దేవుని అభిషేకతైలము అనే సమర్పణ యొక్క సూచన అతని మీద’ ఉంది గనుక, పరిశుద్ధ స్థలాన్ని కలుషితం చేసే దేన్నైనా చేయకుండా ఉండేలా అది ప్రధాన యాజకునికి ఒక జ్ఞాపికగా పనిచేస్తుంది.​—⁠నిర్గమకాండము 29:​6, 7, NW; లేవీయకాండము 21:⁠12, NW.

3. సమర్పణ మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేయాలి?

3 ఈ సందర్భాన్నిబట్టి సమర్పణ అన్నది గంభీరమైన విషయమని మనం గమనించవచ్చు. అది దేవుని సేవకునిగా ఒకరు తనను తాను స్వచ్ఛందంగా తెలుపుకోవడాన్ని సూచిస్తుంది, దానికి పరిశుభ్రమైన ప్రవర్తన అవసరం. కాబట్టి, “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని” యెహోవా చెప్తున్నట్లు అపొస్తలుడైన పేతురు ఎందుకు వ్రాశాడో మనం గుణగ్రహించవచ్చు. (1 పేతురు 1:​14-16) సమర్పిత క్రైస్తవులముగా మనం అంతం వరకు నమ్మకంగా ఉంటూ, మన సమర్పణకు తగిన విధంగా జీవించవలసిన బరువైన బాధ్యత మనపై ఉంది. అయితే క్రైస్తవ సమర్పణలో ఏమి ఇమిడి ఉంది?​—⁠లేవీయకాండము 19:2; మత్తయి 24:13.

4. సమర్పించుకునే స్థాయికి మనం ఎలా చేరుకుంటాం, దాన్ని దేనితో పోల్చవచ్చు?

4 యెహోవా దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి, యేసుక్రీస్తు గురించి, ఆ సంకల్పాల్లో యేసుక్రీస్తు పోషించే పాత్ర గురించి ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత, మనం మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుని సేవ చేయాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నాము. (మార్కు 8:​34; 12:​30; యోహాను 17:⁠3) దాన్ని ఏ షరతులు లేకుండా దేవునికి చేసుకున్న సమర్పణగా, ఒక వ్యక్తిగత ప్రమాణంగా కూడా దృష్టించవచ్చు. మనం సమర్పించుకున్నది ఏదో భావోద్వేగపరమైన చపలచిత్తంతో కాదు. తర్కశక్తిని ఉపయోగిస్తూ దాని గురించి జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా తలంచాము. కాబట్టి, అదొక తాత్కాలిక నిర్ణయం కాదు. నాగలితో పొలం దున్నడం మొదలుపెట్టి అది మరీ కష్టమైన పననో లేక పంట కోతకు వచ్చే సమయం ఇంకా చాలా దూరంలో ఉందనో లేక కోతకు వస్తుందని నిశ్చయంగా చెప్పలేమనో సగంలో దాన్ని వదిలేసే వ్యక్తిలా మనం ఉండలేము. దైవపరిపాలనా బాధ్యత అనే నాగటిపై చెయ్యి వేసి ప్రతివిధమైన కష్టనష్టాల్లోనూ వెనుక తీయని కొంతమంది ఉదాహరణలను పరిశీలించండి.​—⁠లూకా 9:62; రోమీయులు 12:1, 2.

వారు తమ సమర్పణను తృణీకరించలేదు

5. దేవుని సమర్పిత సేవకునిగా యిర్మీయా ఎలా ఒక విశేషమైన ఉదాహరణగా ఉన్నాడు?

5 యిర్మీయా యెరూషలేములో చేసిన ప్రవచన పరిచర్య 40 సంవత్సరాలకంటే (సా.శ.పూ. 647-607) ఎక్కువకాలం కొనసాగింది, అది అంత సులభమైన పని ఏమీ కాదు. ఆయనకు తన పరిమితుల గురించి బాగా తెలుసు. (యిర్మీయా 1:​2-6) కఠిన హృదయులైన యూదా ప్రజలను ప్రతిరోజు కలవడానికి ఆయనకు ధైర్యం, సహనం అవసరమయ్యాయి. (యిర్మీయా 18:​18; 38:​3-6) అయితే, యిర్మీయా యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచాడు, ఆయన నిజంగా దేవుని సమర్పిత సేవకునిగా తనను తాను నిరూపించుకునేలా యెహోవా ఆయనను బలపరిచాడు.​—⁠యిర్మీయా 1:18, 19.

6. అపొస్తలుడైన యోహాను మనకు ఏ మాదిరిని ఉంచాడు?

6 “దేవుని వాక్యము నిమిత్తము. . . యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తము” వృద్ధాప్యంలో పత్మాసు ద్వీపమందు పరవాసిగా ఉన్న నమ్మకమైన అపొస్తలుడైన యోహాను మాటేమిటి? (ప్రకటన 1:⁠9) ఆయన 60 సంవత్సరాలపాటు సహించి, క్రైస్తవునిగా తన సమర్పణ హోదాకు తగ్గట్టుగానే జీవించాడు. రోమా సైనికుల చేతుల్లో యెరూషలేము నాశనం కావడాన్ని ఆయన చూశాడు. ఒక సువార్తను, మూడు ప్రేరేపిత పత్రికలను, ప్రకటన గ్రంథాన్ని​—⁠అందులో ఆయన అర్మగిద్దోను యుద్ధాన్ని ముందే చూశాడు​—⁠వ్రాసే ఆధిక్యత ఆయనకు లభించింది. అర్మగిద్దోను తన జీవితకాలంలో రాదని ఆయనకు తెలిసినప్పుడు ఆయన వెనుకంజ వేశాడా? ఉదాసీనతలో పడిపోయాడా? లేదు, “సమయము సమీపించి”నప్పటికీ, తన దర్శనముల నెరవేర్పు ఇప్పుడే జరగదని తెలిసినా యోహాను మరణం వరకూ నమ్మకంగా ఉన్నాడు.​—⁠ప్రకటన 1:3; దానియేలు 12:⁠4.

సమర్పణకు సంబంధించిన ఆధునిక ఉదాహరణలు

7. క్రైస్తవ సమర్పణ విషయంలో ఒక సహోదరుడు ఎలా ఒక చక్కని మాదిరినుంచాడు?

7 ఆధునిక కాలాల్లో వేలాదిమంది నమ్మకమైన క్రైస్తవులు అర్మగిద్దోనును చూసేందుకు జీవించి ఉండలేకపోయినప్పటికీ ఎంతో ఆసక్తితో తమ సమర్పణకు తగినట్లు జీవించారు. ఒక ఉదాహరణ, ఇంగ్లాండ్‌కు చెందిన ఎర్నెస్ట్‌ ఈ. బీవర్‌. మొదటి ప్రపంచ యుద్ధారంభంలో అంటే 1939 లో ఆయన సాక్షి అయ్యాడు, పూర్తికాల పరిచర్యను ప్రారంభించేందుకు ప్రవర్థమానం చెందుతున్న తన ప్రెస్‌ ఫోటోగ్రఫీ వ్యాపారాన్ని వదిలేశాడు. తన క్రైస్తవ తటస్థతను కాపాడుకున్నందుకు ఆయన రెండు సంవత్సరాలపాటు జైలులో ఉన్నాడు. ఆయన కుటుంబం ఆయనకు మద్దతునిచ్చింది. ఆయన ముగ్గురు పిల్లలు 1950 లో, న్యూయార్క్‌లో మిషనరీల తర్ఫీదుకోసం వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరయ్యారు. సహోదరుడు బీవర్‌ ప్రకటనా కార్యకలాపాల్లో ఎంత ఆసక్తి కల్గివుండేవాడంటే, ఆయన స్నేహితులు ఆయనను అర్మగిద్దోను ఎర్నీ అని పిలిచేవారు. ఆయన తన సమర్పణకు తగినట్లు నమ్మకంగా జీవించాడు, 1986 లో తన మరణం వరకూ దేవుని యుద్ధమైన అర్మగిద్దోను రాకను గురించి ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన తన సమర్పణను, దేవునితో కుదుర్చుకున్న పరిమితకాల ఒప్పందంగా దృష్టించలేదు. *​—⁠1 కొరింథీయులు 15:⁠58.

8, 9. (ఎ) ఫ్రాంకో పరిపాలనా సమయంలో, స్పెయిన్‌లోని చాలామంది యౌవనస్థులు ఏ మాదిరిని ఉంచారు? (బి) ఏ ప్రశ్నలు వేసుకోవడం సముచితంగా ఉంటుంది?

8 చెక్కుచెదరని ఆసక్తి విషయంలో మరో ఉదాహరణ స్పెయిన్‌కు చెందినది. ఫ్రాంకో పరిపాలనా (1939-75) సమయంలో, వందలాదిమంది యౌవన సమర్పిత సాక్షులు తమ క్రైస్తవ తటస్థతను కాపాడుకున్నారు. వారిలో చాలామంది పది సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువకాలం సైనిక చెరసాలల్లో గడిపారు. కేసస్‌ మార్టీన్‌ అనే ఒక సాక్షికి మొత్తంగా 22 సంవత్సరాల జైలు శిక్షపడింది. ఉత్తర ఆఫ్రికాలోని సైనిక చెరసాలలో ఉన్నప్పుడు ఆయనను తీవ్రంగా కొట్టడం జరిగింది. వీటిలో దేన్నైనా సరే సహించడం అంత సులభమేమీ కాదు అయినా ఆయన రాజీపడడానికి నిరాకరించాడు.

9 ఈ యౌవనస్థులకు ఒకదాని తర్వాత మరొకటిగా అమలు చేయబడే అనేక శిక్షలు విధించబడ్డాయి గనుక తమను అసలు విడుదల చేస్తారో, చేయ్యరో ఒకవేళ చేసినా ఎప్పుడు చేస్తారో వారికి తెలియదు. అయినప్పటికీ, వారు నిర్బంధంలో ఉన్నప్పుడు తమ యథార్థతనూ, పరిచర్యపట్ల తమకున్న ఆసక్తినీ కాపాడుకున్నారు. చివరికి 1973 లో పరిస్థితి మెరుగుపడడం మొదలైనప్పుడు, అప్పట్లో తమ 30వ పడిలో ఉన్న ఈ సాక్షుల్లో చాలామంది చెరసాల నుండి విడుదల చేయబడి వారంతా నేరుగా పూర్తికాల పరిచర్యలోకి ప్రవేశించారు, వారిలో కొందరు ప్రత్యేక పయినీర్లు, కొందరు ప్రయాణ పైవిచారణకర్తలు అయ్యారు. వారు చెరసాలలో తమ సమర్పణకు తగినట్లు జీవించారు, విడుదల చేయబడిన తర్వాత కూడా చాలామంది అలాగే కొనసాగారు. * నేడు మన విషయమేమిటి? ఈ యథార్థవంతుల్లా మనం కూడా మన సమర్పణకు తగినట్లు నమ్మకంగా ఉంటున్నామా?​—⁠హెబ్రీయులు 10:​32-34; 13:⁠2, 3.

మన సమర్పణ గురించి సరైన దృక్పథాన్ని కల్గివుండడం

10. (ఎ) మనం మన సమర్పణను ఎలా దృష్టించాలి? (బి) యెహోవాకు మనం చేసే సేవను ఆయనెలా దృష్టిస్తాడు?

10 దేవుని చిత్తం చేసే విషయంలో మనం ఆయనకు చేసుకున్న సమర్పణను మనమెలా దృష్టిస్తాము? అది మన జీవితంలో ప్రధాన విషయమేనా? మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మనం వృద్ధులమైనా లేక యౌవనులమైనా, వివాహితులమైనా లేక ఒంటరివారమైనా, ఆరోగ్యవంతులమైనా లేక అనారోగ్యంతో బాధపడుతున్నవారమైనా, మనం మన పరిస్థితులకు అనుగుణ్యంగా మన సమర్పణకు తగినట్లు జీవించడానికి కృషి చేయాలి. పయినీరుగా, వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయంలో స్వచ్ఛంద సేవకునిగా, మిషనరీగా లేక ప్రయాణ పరిచర్యలో పూర్తికాలం సేవ చేసేందుకు ఒక వ్యక్తి పరిస్థితి ఆయనను అనుమతిస్తుండవచ్చు. అయితే మరోవైపున, కొంతమంది తల్లిదండ్రులు తమ కుటుంబ శారీరక, ఆధ్యాత్మిక అవసరతలను తీర్చడంలో నిమగ్నమై ఉండవచ్చు. యెహోవా దృష్టిలో, వారు ప్రతి నెల పరిచర్యలో సాపేక్షికంగా గడిపే కొద్దిగంటలు, ఒక పూర్తికాల సేవకుడు గడిపే అనేక గంటలకన్నా ఏమైనా తక్కువా? లేదు. మన దగ్గర ఏమి లేదో దాన్ని దేవుడు ఎన్నడూ కోరడు. అపొస్తలుడైన పౌలు ఈ సూత్రాన్ని పేర్కొన్నాడు: “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.”​—⁠2 కొరింథీయులు 8:⁠12.

11. మన రక్షణ దేనిపై ఆధారపడి ఉంది?

11 ఏదేమైనప్పటికీ, మన రక్షణ మనం చేసే దేనిపైనా ఆధారపడి లేదు గానీ మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా యెహోవా చూపించే కృపపైనే ఆధారపడి ఉంది. పౌలు స్పష్టంగా ఇలా వివరించాడు: “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.” అయితే, మన చర్యలు దేవుని వాగ్దానాలందు మనకున్న చురుకైన విశ్వాసానికి నిదర్శనాలై ఉంటాయి.​—⁠రోమీయులు 3:23, 24; యాకోబు 2:17, 18, 24.

12. మనం ఎందుకు ఇతరులతో పోల్చుకోకూడదు?

12 దేవుని సేవలో మనం గడిపే సమయం, అందించే బైబిలు సాహిత్యం, లేక నిర్వహించే బైబిలు అధ్యయనాల సంఖ్య వంటివాటి విషయంలో మనం ఇతరులతో పోల్చుకోవలసిన అవసరం లేదు. (గలతీయులు 6:​3, 4) మనం క్రైస్తవ పరిచర్యలో ఏమి సాధించినప్పటికీ, యేసు పలికిన వినయపూర్వకమైన ఈ మాటలను మనమందరం గుర్తుంచుకోవాలి: “మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత​—⁠మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పు[డి].” (లూకా 17:​10) మనకు “ఆజ్ఞాపింపబడినవన్ని” మనం చేశామని నిజంగా ఎంత తరచుగా చెప్పగలం? కాబట్టి ప్రశ్నేమిటంటే, మనం దేవునికి చేసే సేవ యొక్క నాణ్యత ఎలా ఉండాలి?​—⁠2 కొరింథీయులు 10:17, 18.

ప్రతిదినాన్ని విలువైనదిగా చేసుకోవడం

13. మనం మన సమర్పణలో కొనసాగుతుండగా ఎలాంటి దృక్పథం కల్గివుండాలి?

13 భార్యలకు, భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, దాసులకు ఉపదేశం ఇచ్చిన తర్వాత పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “[యెహోవా] వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి; మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు.” (కొలొస్సయులు 3:​23, 24) మనం యెహోవా సేవలో సాధించేదాన్ని బట్టి మనుష్యులను మెప్పించాలని మనం సేవ చేయడం లేదు. మనం యేసుక్రీస్తు మాదిరిని అనుసరించడం ద్వారా దేవుని సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాము. సాపేక్షికంగా స్వల్పకాల వ్యవధిగల తన పరిచర్యను ఆయన అత్యవసర భావంతో నెరవేర్చాడు.​—⁠1 పేతురు 2:⁠21.

14. అంత్య దినాల గురించి పేతురు ఏ హెచ్చరికనిచ్చాడు?

14 అపొస్తలుడైన పేతురు కూడా అత్యవసరభావాన్ని కనపరిచాడు. ఆయన తన రెండవ పత్రికలో, అంత్య దినములలో మతభ్రష్టులు, అనుమానస్థుల వంటి ఆక్షేపకులు ఉంటారని ఆయన హెచ్చరించాడు, వారు తమ స్వంత కోరికల ప్రకారం క్రీస్తు ప్రత్యక్షత గురించి ప్రశ్నలు లేవదీస్తారు. అయితే పేతురు ఇలా చెప్పాడు: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు [యెహోవా] తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. అయితే [యెహోవా] దినము దొంగవచ్చినట్లు వచ్చును.” అవును, యెహోవా దినము తప్పక వస్తుంది. కాబట్టి, దేవుని వాగ్దానమందు మన విశ్వాసం నిజంగా ఎంత ఖచ్చితంగా ఉంది, ఎంత దృఢంగా ఉందనేది మన అనుదిన చింతయై ఉండాలి.​—⁠2 పేతురు 3:3, 4, 9, 10.

15. మన జీవితంలోని ప్రతిదినాన్ని మనం ఎలా దృష్టించాలి?

15 మన సమర్పణకు తగినట్లు మనస్సాక్షిపూర్వకంగా జీవించాలంటే, మనం ప్రతిదినాన్ని యెహోవాను స్తుతించడానికి ఉపయోగించాలి. దినాంతాన, మనం పునరావలోకనం చేసుకుని దేవుని నామాన్ని పరిశుద్ధపర్చడానికీ, రాజ్యసువార్తను ప్రకటించడానికీ మనం ఎంత మేరకు దోహదపడ్డాము అన్న విషయాన్ని పరిశీలించుకోగలమా? బహుశా మన మంచి ప్రవర్తన ద్వారా, ప్రోత్సాహకరమైన మన సంభాషణ ద్వారా, లేక కుటుంబంపట్లా స్నేహితులపట్లా మనకున్న ప్రేమపూర్వకమైన శ్రద్ధ ద్వారా మనం అలా చేసివుండవచ్చు. మన క్రైస్తవ నిరీక్షణను ఇతరులతో పంచుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను మనం ఉపయోగించుకున్నామా? దేవుని వాగ్దానాల గురించి గంభీరంగా ఆలోచించడానికి ఎవరికైనా సహాయం చేశామా? సూచనార్థకంగా చెప్పాలంటే, ఆధ్యాత్మిక బాంక్‌ అక్కౌంట్‌ను చెప్పుకోదగినంతగా పెంచుకుంటున్నట్లు, ప్రతిరోజు ఆధ్యాత్మిక భావంలో ఏదైనా విలువైనది సమకూర్చుకుందాము.​—⁠మత్తయి 6:20; 1 పేతురు 2:12; 3:​15, 16; యాకోబు 3:⁠13.

మీ దృష్టిని స్పష్టంగా ఉంచుకోండి

16. దేవునికి మనం చేసుకున్న సమర్పణను సాతాను ఏ యే విధాలుగా బలహీనపర్చడానికి ప్రయత్నిస్తాడు?

16 క్రైస్తవులకు పరిస్థితులు మరింత కష్టమైపోతున్న కాలాల్లో మనం జీవిస్తున్నాము. సాతాను అతని ప్రతినిధులు మంచీచెడులకు, శుద్ధాశుద్ధతకు, నైతికానైతికతలకు, నీతీ దుర్నీతులకు మధ్యనున్న తేడా మసకబారిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తారు. (రోమీయులు 1:​24-28; 16:​17-19) కేవలం టీవీ రిమోట్‌ ద్వారా లేదా కంప్యూటర్‌ కీబోర్డ్‌ ద్వారా మన హృదయాలను మనస్సులను కలుషితం చేసుకోవడాన్ని అతడు సులభతరం చేశాడు. మన ఆధ్యాత్మిక దృష్టి మసకబారగలదు, అతని కుయుక్తితో కూడిన చర్యలను గ్రహించలేని విధంగా అది కేంద్రీకరించలేకపోవచ్చు. మన సమర్పణకు తగినట్లు జీవించాలన్న మన దృఢనిశ్చయత బలహీనమైపోయి, మన ఆధ్యాత్మిక విలువల విషయంలో రాజీపడిపోతే నాగలి మీద మనకున్న పట్టు సడలిపోగలదు.​—⁠లూకా 9:62; ఫిలిప్పీయులు 4:⁠8.

17. దేవునితో మన సంబంధాన్ని కాపాడుకునేందుకు పౌలు ఉపదేశం మనకెలా సహాయం చేయగలదు?

17 కాబట్టి పౌలు థెస్సలొనీక సంఘానికి వ్రాసిన ఈ మాటలు ఎంతో సమయోచితమైనవి: “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.” (1 థెస్సలొనీకయులు 4:​3-5) దేవునికి తాము చేసుకున్న సమర్పణను అలక్ష్యం చేసిన ప్రజలు కొందరు, అనైతికత మూలంగా క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడ్డారు. వారు, దేవుడు తమ జీవితాల్లో ఇక ఎంతమాత్రం ప్రముఖ విషయంగా ఉండకుండేలా ఆయనతో తమకు గల సంబంధం బలహీనమైపోయేందుకు అనుమతించారు. అయినప్పటికీ, పౌలు ఇలా చెప్పాడు: “పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.”​—⁠1 థెస్సలొనీకయులు 4:7, 8.

మీ నిశ్చయత ఏమిటి?

18. మన నిశ్చయమేమై ఉండాలి?

18 యెహోవా దేవునికి మనం చేసుకున్న సమర్పణ యొక్క గంభీరత విలువను మనం గుణగ్రహిస్తే, ఏమి చేయాలనేది మన నిశ్చయమై ఉండాలి? మన ప్రవర్తనకు, మన పరిచర్యకు సంబంధించి మంచి మనస్సాక్షి కల్గివుండాలనేది మన దృఢ నిశ్చయమై ఉండాలి. పేతురు ఇలా ఉద్బోధించాడు: “నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై [ఉండుడి]; . . . అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.” (1 పేతురు 3:​15, 16) మనం మన క్రైస్తవ ప్రవర్తనను బట్టి హింసించబడవచ్చు, దుర్వ్యవహారానికి గురికావచ్చు, అయితే క్రీస్తు కూడా దేవుని పట్ల తనకున్న విశ్వాస యథార్థతలను బట్టి వాటికి గురయ్యాడు. కాబట్టి, “క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు . . . పాపముతో జోలి యిక నేమియులేక యుండును.”​—⁠1 పేతురు 4:1.

19. మన గురించి ఏమి చెప్పబడాలని మనం కోరుకుంటాం?

19 నిజానికి, సమర్పణకు తగినట్లు జీవించాలనే మన దృఢ నిశ్చయం ఆధ్యాత్మికంగా, నైతికంగా, శారీరకంగా రోగగ్రస్థమైన సాతాను ప్రపంచపు ఆకర్షణల నుండి మనల్ని కాపాడుతుంది. అంతకంటే ఎక్కువే కూడా చేస్తుంది. సాతాను, అతని ప్రతినిధులు ఇవ్వగల దేనికంటే కూడా ఎంతో శ్రేష్ఠమైనదైన దేవుని అంగీకారం మనకుందన్న నమ్మకాన్ని మనం సంపాదించుకుంటాము. కాబట్టి, మనం మొదట సత్యం తెలుసుకున్నప్పుడు మనకున్న ప్రేమ ఇప్పుడు తగ్గిపోయిందని చెప్పే పరిస్థితి ఎన్నడూ రానివ్వకుందాము. బదులుగా, మొదటి శతాబ్దంలో తుయతైరలోని సంఘం గురించి చెప్పబడినట్లుగానే మన గురించి కూడా ఇలా చెప్పబడేలా చూసుకుందాము: “నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.” (ప్రకటన 2:​4, 18, 19) అవును, మనం మన సమర్పణ గురించి నులివెచ్చగా ఉండకూడదు గానీ, అంతం సమీపంలో ఉంది గనుక, అంతం వరకు ఆసక్తితోవుండి, “ఆత్మయందు తీవ్రత” కల్గివుందాము.​—⁠రోమీయులు 12:11; ప్రకటన 3:15, 16.

[అధస్సూచీలు]

^ పేరా 2 కావలికోట (ఆంగ్లం), ఏప్రిల్‌ 15, 1987, 31వ పేజీ చూడండి.

^ పేరా 7 ఎర్నెస్ట్‌ బీవర్‌ జీవితాన్ని గురించిన సవివరమైన వృత్తాంతం కోసం కావలికోట (ఆంగ్లం), మార్చి 15, 1980, 8-11 పేజీలు చూడండి.

^ పేరా 9 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన 1978 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం, 156-8, 201-18 పేజీలు చూడండి.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

• సమర్పణలో ఏమి ఇమిడి ఉంది?

• ప్రాచీన, ఆధునిక కాలాలకు చెందిన దేవుని సమర్పిత సేవకుల ఏ మాదిరులు మనం అనుకరించదగినవి?

• మనం దేవునికి చేసే సేవను మనమెలా దృష్టించాలి?

• దేవునికి మనం చేసుకున్న సమర్పణకు సంబంధించి మన నిశ్చయమేమై ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

దారుణమైన క్రూరత్వానికి గురైనప్పటికీ యిర్మీయా నమ్మకంగా ఉన్నాడు

[16వ పేజీలోని చిత్రం]

ఎర్నెస్ట్‌ బీవర్‌ ఆసక్తిగల క్రైస్తవునిగా తన పిల్లలకు మంచి మాదిరిని ఉంచాడు

[17వ పేజీలోని చిత్రం]

స్పానిష్‌ చెరసాలల్లోని వందలాదిమంది యౌవనసాక్షులు తమ యథార్థతను కాపాడుకున్నారు

[18వ పేజీలోని చిత్రాలు]

ప్రతిరోజు ఆధ్యాత్మిక భావంలో ఏదైనా విలువైనదానిని సమకూర్చుకుందాము