కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లాట్వియా సువార్తకు ప్రతిస్పందించడం

లాట్వియా సువార్తకు ప్రతిస్పందించడం

రాజ్య ప్రచారకుల నివేదిక

లాట్వియా సువార్తకు ప్రతిస్పందించడం

“మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండాలన్నది దేవుని చిత్తమని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. (1 తిమోతి 2:⁠4) సువార్త వినే అవకాశాన్ని ఎన్నో సంవత్సరాలపాటు తిరస్కరించినవారు ఇప్పుడు వింటున్నారు! ప్రపంచంలోని ఇతర భాగాల్లోలాగే లాట్వియాలో కూడా వివిధ నేపథ్యాలకు చెందిన అన్ని వయస్సుల ప్రజలు సందేశానికి ప్రతిస్పందిస్తున్నారు, ఈ క్రింది అనుభవాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

• తూర్పు లాట్వియాలోని ఒక పట్టణమైన రీజక్నలో, ఒక తల్లీ కూతురు ఒక స్త్రీని తాము వెళ్లాల్సిన చోటుకి దారెటో చూపించమని అడిగారు. వారికి కావలసిన సమాచారాన్ని తెలియజేసిన తర్వాత, యెహోవాసాక్షి అయిన ఆ స్త్రీ, సాక్షుల కూటానికి రమ్మని వారిని ఆహ్వానించింది.

ఆ తల్లీ కూతుళ్లు మతసంబంధమైన ఆసక్తిగలవారు గనుక కూటాలకు వెళ్లాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. అక్కడేదైనా సరిగ్గా లేనట్లనిపిస్తే వెంటనే అక్కడి నుండి వచ్చేయాలని వాళ్లు దారిలోనే ఒప్పందం చేసుకున్నారు. కూటం ఎంత ఆసక్తికరంగా ఉందంటే, వెళ్లిపోవాలన్న తలంపే వాళ్లకు కలుగలేదు. బైబిలు అధ్యయనం చేయమని ఇవ్వబడిన ఆహ్వానాన్ని వారు వెంటనే అంగీకరించారు, కూటాలకు క్రమంగా హాజరవ్వడం మొదలుపెట్టారు. కేవలం మూడు నెలల్లో వాళ్లు ప్రకటనా పనిలో భాగం వహించాలనుందన్న తమ కోరికను వ్యక్తంచేసి, బాప్తిస్మం తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు.

• పశ్చిమ లాట్వియాలోని ఒక నగరంలో, ఒక సాక్షి అన్నా అనే 85 ఏళ్ల స్త్రీని కలిశాడు, ఆమె నిజమైన ఆసక్తిని చూపించి, బైబిలు అధ్యయనానికి అంగీకరించింది. ఆమె కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత గానీ తన వయస్సు, అనారోగ్యము గానీ తన బైబిలు అధ్యయనాన్ని ఆటంకపర్చేందుకు అన్నా అనుమతించలేదు.

తాను బాప్తిస్మం తీసుకోబోతున్నానని అన్నా ఒకరోజు తన కుమార్తెకు చెప్పింది. “నువ్వు గనుక బాప్తిస్మం తీసుకుంటే, నేను నిన్ను నర్సింగ్‌ హోమ్‌లో చేర్పిస్తాను” అని అన్నా కుమార్తె జవాబిచ్చింది. అయితే, ఈ బెదిరింపు అన్నాను భయపెట్టలేదు. ఆమె శారీరక స్థితిని బట్టి ఆమెకు ఆమె ఇంట్లోనే బాప్తిస్మం ఇవ్వబడింది.

దీనికి అన్నా కుమార్తె ఎలా ప్రతిస్పందించింది? ఆమె మనస్సు మార్చుకుని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ల అమ్మ కోసం స్పెషల్‌ భోజనాన్ని సిద్ధం చేసింది. “బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇప్పుడు నీవు ఎలా భావిస్తున్నావు?” అని ఆమె తన తల్లిని అడిగింది. “క్రొత్తగా జన్మించిన వ్యక్తిలా” అని అన్నా సమాధానమిచ్చింది.

• 1998 డిసెంబరులో, ఇద్దరు సాక్షులు మునుపటి రష్యాకు చెందిన ఒక మాజీ సైనికాధికారిని కలిశారు. ఆయనకు సృష్టికర్తయందు విశ్వాసం ఉంది గనుక ఆయన బైబిలు అధ్యయనానికి అంగీకరించాడు, తర్వాత ఆయన భార్య కూడా ఆయనతో కలిసింది. వారు త్వరగా అభివృద్ధి సాధించి, త్వరలోనే బాప్తిస్మం పొందని ప్రచారకులయ్యారు. తర్వాతి వేసవి కాలానికల్లా మాజీ సైనికాధికారి బాప్తిస్మం తీసుకున్నాడు. ఆధ్యాత్మిక విషయాల పట్ల వారికున్న గొప్ప ప్రేమ, సంఘంలోని వారినందరినీ ప్రోత్సహించింది. అంతేగాక, స్థానిక ఇంటిని చక్కని రాజ్యమందిరంగా మార్చడంలో వారు ఎంతో సహాయం చేశారు.