పునరుద్ధారిత యెహోవా ప్రజలు భూవ్యాప్తంగా ఆయనను స్తుతిస్తున్నారు
పునరుద్ధారిత యెహోవా ప్రజలు భూవ్యాప్తంగా ఆయనను స్తుతిస్తున్నారు
“జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.”—జెఫన్యా 3:9.
1. యూదాపై మరితర జనాంగాలపై నాశన సందేశాలు ఎందుకు నెరవేర్చబడతాయి?
ఎంతటి శక్తివంతమైన తీర్పు సందేశాలను ప్రకటించడానికి యెహోవా జెఫన్యాను ప్రేరేపించాడో కదా! నాయకులూ ప్రజలూ కూడా దేవుని చిత్తాన్ని చేయడం లేదు గనుక యూదాపై, దాని ముఖ్యపట్టణమైన యెరూషలేముపై ఆ నాశన సందేశాలు నెరవేర్చబడ్డాయి. చుట్టుప్రక్కల జనాంగాలైన ఫిలిష్తీయ, మోయాబు, అమ్మోనులు కూడా యెహోవా ఉగ్రతను అనుభవిస్తాయి. ఎందుకు? ఎందుకంటే అవి శతాబ్దాల తరబడి దేవుని ప్రజలను క్రూరంగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. అదే కారణాన్నిబట్టి ప్రపంచ శక్తియైన అష్షూరు కూడా నాశనం చేయబడుతుంది, అది ఇక ఎన్నటికీ పునస్థాపించబడదు.
2. జెఫన్యా 3:8 లోని మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పబడ్డాయి?
2 అయితే, ప్రాచీన యూదాలో కొందరు నిర్ణయింపబడిన వారున్నారు. దుష్టులపై దేవుని తీర్పు అమలు చేయబడాలని ఎదురు చూస్తున్న వీరిని ఉద్దేశించే ఈ మాటలు చెప్పినట్లు కన్పిస్తుంది: “యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా—నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్నిచేత భూమియంతయు కాలిపోవును.”—జెఫన్యా 3:8.
“స్వచ్ఛమైన భాష,” ఎవరికి?
3. ఏ నిరీక్షణా సందేశాన్ని ప్రకటించేందుకు జెఫన్యా ప్రేరేపించబడ్డాడు?
3 అవును, యెహోవా ఇచ్చిన నాశన సందేశాలను జెఫన్యా ప్రకటించాడు. అంతేకాక, అద్భుతమైన నిరీక్షణా సందేశాన్ని కూడా అందులో చేర్చడానికి ఆయన ప్రేరేపించబడ్డాడు—యెహోవాపట్ల నమ్మకంగా ఉండడంలో కొనసాగిన దేవుని ప్రజలకిది ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. జెఫన్యా 3:9వ వచనంలో వ్రాయబడినట్లుగా యెహోవా ఇలా ప్రకటించాడు: “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల [“స్వచ్ఛమైన భాష,” NW] నిచ్చెదను.”
4, 5. (ఎ) అనీతిమంతులకు ఏమి జరగనైవుంది? (బి) దీని నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు, ఎందుకు?
జెఫన్యా 3:11) కాబట్టి, దేవుని శాసనాలను అలక్ష్యం చేస్తూ అవినీతికార్యాలకు పాల్పడే గర్విష్టులందరూ తీసివేయబడనైవున్నారు. దీని నుండి ఎవరు ప్రయోజనం పొందనైవున్నారు? జెఫన్యా 3:12, 13 ఇలా చెప్తుంది: “దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండ నిత్తును. ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగలవారై అన్నపానములు పుచ్చుకొందురు.”
4 అయితే, ఈ స్వచ్ఛమైన భాష ఇవ్వబడని ప్రజలు కూడా ఉన్నారు. ఆ ప్రవచనం వారిని గురించి ఇలా అంటోంది: “ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతోషించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును.” (5 ప్రాచీన యూదాలోని నమ్మకంగా ఉన్న శేషించినవారు ప్రయోజనం పొందనైవున్నారు. ఎందుకు? ఎందుకంటే వారు ఈ మాటలకు అనుగుణంగా చర్య తీసుకున్నారు: “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”—జెఫన్యా 2:3.
6. జెఫన్యా ప్రవచనంలోని ప్రథమ నెరవేర్పుగా ఏమి సంభవించింది?
6 జెఫన్యా ప్రవచన ప్రథమ నెరవేర్పుగా సా.శ.పూ. 607 లో అవిశ్వాస యూదాను ప్రపంచ శక్తియైన బబులోను చెరపట్టడానికి అనుమతించడం ద్వారా యెహోవా దాన్ని శిక్షించాడు. యిర్మీయా, మరికొందరు తప్పించుకున్నారు, మరితరులు చెరలో బందీలుగానే ఉండి యెహోవాపట్ల తమ యథార్థతను కాపాడుకున్నారు. ఆ తర్వాత, రాజైన కోరెషు ఆధ్వర్యంలోని మాదీయ-పారశీకులు సా.శ.పూ. 539 లో బబులోనును కూలద్రోశారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత కోరెషు జారీచేసిన ఆజ్ఞనుబట్టి ఇశ్రాయేలీయుల్లో శేషించినవారు తమ స్వదేశానికి తిరిగి రాగల్గారు. కొంతకాలానికి, యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడింది, ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేందుకు యెహోవా యాజకవర్గాన్ని పునరుద్ధరించాడు. (మలాకీ 2:7) కాబట్టి, పునరుద్ధరించబడిన ప్రజలు నమ్మకంగా కొనసాగినంత కాలం యెహోవా వారిని వర్థిల్లజేశాడు.
7, 8, జెఫన్యా 3:14-17 లోని ప్రవచనాత్మక మాటలు ఎవరికి వర్తించాయి, అలా అని మీరెందుకు చెప్తారు?
7 అలా పునరుద్ధరించబడే వారి గురించి జెఫన్యా ముందుగానే తెలియజేశాడు: “సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణహృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇకమీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు—యెరూషలేమూ, భయపడకుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము; నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతమువహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.”—జెఫన్యా 3:14-17.
8 బబులోను చెర నుండి విడిపించబడి, సమకూర్చబడి తమ పితరుల దేశానికి తిరిగి తీసుకురాబడిన శేషం గురించి ఆ ప్రవచనాత్మక మాటలు చెప్పబడ్డాయి. అది జెఫన్యా 3:18-20 వచనాల్లో స్పష్టం చేయబడింది, అక్కడ మనమిలా చదువుతాము: “నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను [యెహోవానైన] నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.”
9. యూదాకు సంబంధించి యెహోవా తన నామానికి ఎలా ఖ్యాతిని తెచ్చుకున్నాడు?
9 దేవుని ప్రజల శత్రువులైన ఇరుగుపొరుగున ఉన్న జనాంగాలకు కలిగే విభ్రాంతిని ఒక్కసారి ఊహించండి! బలిష్ఠమైన బబులోను, యూదా నివాసులను చెరగా కొనిపోయింది, తిరిగి వచ్చే ఆశ ఎంతమాత్రం లేదు. వారి దేశం పాడుగా విడవబడింది. అయితే, యెహోవా శక్తి మూలంగా 70 సంవత్సరాల తర్వాత వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చారు, కానీ వారి శత్రుదేశాలు మాత్రం నాశనం వైపు పయనిస్తున్నాయి. నమ్మకమైన శేషాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా యెహోవా తనకు తాను ఎంతటి పేరును తెచ్చుకున్నాడో కదా! ఆయన వారికి “జనులందరి దృష్టి[లో] . . . ఖ్యాతిని మంచి పేరును” తెచ్చాడు. ఈ పునరుద్ధరణ యెహోవాకూ, ఆయన నామాన్ని ధరించిన వారికీ ఎంతటి ఖ్యాతియో కదా!
యెహోవా ఆరాధన ఉన్నతపర్చబడింది
10, 11. పునరుద్ధరణకు సంబంధించిన జెఫన్యా ప్రవచన ప్రముఖ నెరవేర్పు ఎప్పుడు జరగనైవుంది, దీనిని మనమెలా తెలుసుకోగలము?
10 సామాన్యశకం మొదటి శతాబ్దంలో యేసు ఇశ్రాయేలీయుల్లో శేషించిన వారిని సత్యారాధనకు సమకూర్చినప్పుడు మరొక పునరుద్ధరణ జరిగింది. ఇది రాబోవు దానికి ముంగుర్తు, అయితే పునరుద్ధరణకు సంబంధించిన ప్రముఖ నెరవేర్పు భవిష్యత్తులో జరగనై ఉంది. మీకా ప్రవచనం ముందే ఇలా చెప్పింది: “అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.”—మీకా 4:1.
11 ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రవచనం చెప్పినట్లు “అంత్యదినములలో”నే—అవును, ఈ “అంత్యదినములలో”నే జరుగుతుంది. (2 తిమోతి 3:1) జనాంగాలు ఇంకా తమ అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తుండగానే ఈ దుష్ట విధానం అంతం కాకమునుపే ఇది జరుగుతుంది. మీకా 4:5 ఇలా అంటుంది: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు.” మరి సత్యారాధకుల విషయమేమిటి? మీకా ప్రవచనం ఇలా సమాధానమిస్తుంది: “మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”
12. ఈ అంత్యదినాల్లో సత్యారాధన ఎలా ఉన్నతపర్చబడింది?
12 ఆ విధంగా ఈ అంత్యదినాల్లో ‘యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడుతుంది.’ అతిఎత్తైన పర్వత శిఖరంలా యెహోవా సత్యారాధన ఇతర అన్ని రకాల మతాల ఆరాధన కంటే ఉన్నతంగా, స్థిరంగా పునరుద్ధరించబడుతుంది. మీకా ప్రవచనం ముందుగానే చెప్పినట్లుగా, “ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.” సత్యారాధనను అనుసరించే వారంతా తమ “దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించు”కుంటారు.
13, 14. ఈ లోకం దాని “అంత్యదినముల” చివరి భాగంలోకి ఎప్పుడు ప్రవేశించింది, సత్యారాధన విషయంలో అప్పటినుండి ఏమి జరుగుతుంది?
13 బైబిలు ప్రవచనంలోని సంఘటనల నెరవేర్పు, 1914వ సంవత్సరంలో ఈ లోకం దాని “అంత్యదినముల” చివరి భాగంలో ప్రవేశించిందని చూపిస్తుంది. (మార్కు 13:4-10) పరలోక నిరీక్షణగల నమ్మకమైన అభిషిక్త శేషాన్ని సత్యారాధన కోసం యెహోవా సమకూర్చడం మొదలుపెట్టాడని చరిత్ర చూపుతోంది. అది జరిగిన తర్వాత, భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణ గల ఒక “గొప్పసమూహము,” “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు” సమకూర్చబడుతోంది.—ప్రకటన 7:9.
14 యెహోవా ఆరాధన, మొదటి ప్రపంచ యుద్ధకాలం నుండి నేటి వరకు, ఆయన నడిపింపు క్రింద, ఆయన నామం ధరించిన ప్రజల ద్వారా గొప్ప ప్రగతిని సాధించింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం కేవలం కొద్దివేలమందిగా ఉన్న యెహోవా ఆరాధకులు నేడు 235 దేశాల్లో దాదాపు 91,000 సంఘాల్లో ఇంచుమించు 60 లక్షలుగా వృద్ధిచెందారు. యెహోవాను బహిరంగంగా స్తుతించేందుకు వీరు ప్రతి సంవత్సరం 100 కోట్ల కన్నా ఎక్కువ గంటలను వెచ్చిస్తున్నారు. యెహోవాకు సాక్షులైన వీరు యేసు ప్రవచనాత్మక మాటలను నెరవేరుస్తున్నారని స్పష్టమౌతుంది: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24: 14.
15. జెఫన్యా 2:3 ఇప్పుడెలా నెరవేరుతుంది?
15జెఫన్యా 3:17 ఇలా చెప్తుంది: “నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును.” సర్వశక్తిమంతుడైన యెహోవా ‘తమ మధ్య’ ఉన్నందుకే ఆయన సేవకులు ఈ అంత్యదినాల్లో ఆధ్యాత్మిక కలిమిని అనుభవిస్తున్నారు. సా.శ.పూ. 537 లో ప్రాచీన యూదా పునరుద్ధరించబడినప్పుడు అది నిజమని నిరూపించబడినట్లే నేడు కూడా నిరూపించబడుతుంది. అలా “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి” అని చెప్తున్న జెఫన్యా 2:3 మన కాలంలో ఎలా ప్రముఖ నెరవేర్పును కలిగివుందో ఇప్పుడు మనకు తెలుసు. (ఇటాలిక్కులు మావి.) “సమస్త” జనులు అన్నది, సా.శ.పూ. 537 లో బబులోను చెరనుండి తిరిగి వచ్చిన యూదుల శేషాన్ని సూచించింది. ఇప్పుడైతే అది భూవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనాపనికి అనుకూలంగా ప్రతిస్పందించి ‘యెహోవా మందిర పర్వతానికి’ ప్రవాహంవలె వస్తున్న సమస్త దేశాల్లోని సాత్వికులైన ప్రజలను సూచిస్తుంది.
సత్యారాధన వర్థిల్లుతోంది
16. ఆధునిక కాలాల్లో యెహోవా సేవకుల సమృద్ధిని చూసి వారి శత్రువుల ప్రతిస్పందన ఎలా ఉంది?
16 దేవుని సేవకులు సా.శ.పూ. 537 లో తమ స్వదేశానికి తిరిగి వచ్చి సత్యారాధనను పునరుద్ధరించినప్పుడు ఇరుగుపొరుగు దేశాలు అవాక్కయ్యాయి. అయితే, ఆ పునరుద్ధరణ చాలా స్వల్ప పరిధిలో జరిగింది. ఆధునిక కాలాల్లో యెహోవా సేవకుల అద్భుతమైన అభివృద్ధిని, సమృద్ధిని, ప్రగతిని చూసి దేవుని ప్రజల శత్రువుల్లో కొందరు సహితం ఇప్పుడు ఏమంటున్నారో మీరు ఊహించగలరా? ప్రజలు యేసు దగ్గరికి తండోపతండాలుగా తరలి రావడం చూసి పరిసయ్యులు ఎలా భావించారో, ఈ శత్రువులు కూడా అలాగే భావిస్తున్నారనడంలో సందేహం లేదు. వారిలా తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు: “ఇదిగో! లోకము ఆయనవెంట పోయన[ది].”—యోహాను 12:19.
17. యెహోవాసాక్షుల గురించి ఒక రచయిత ఏమన్నాడు, వారెలాంటి అభివృద్ధిని సాధించారు?
17దీజ్ ఆల్సో బిలీవ్ అనే పుస్తకంలో ప్రొఫెసర్ ఛార్లెస్ యస్. బ్రాడెన్ ఇలా పేర్కొన్నాడు: “యెహోవాసాక్షులు అక్షరార్థంగా భూమినంతటినీ తమ సాక్ష్యంతో నింపివేశారు. రాజ్యసువార్తను వ్యాప్తిచేయడంలో లోకంలోని మరే ఇతర మతగుంపూ యెహోవాసాక్షులకంటే ఎక్కువగా ఆసక్తిని, పట్టుదలను చూపలేదన్నది వాస్తవం. ఇది అంతకంతకూ అధికమౌతూనే ఉంటుంది.” అతడు చెప్పింది ఎంత వాస్తవం! అతడు ఆ మాటలను 50 సంవత్సరాల క్రితం వ్రాశాడు, అప్పుడు ప్రపంచమంతటా ప్రకటించడానికి కేవలం 3,00,000 మంది సాక్షులు మాత్రమే ఉన్నారు. నేడు మన పని విస్తృతిని చూసి, అంటే దాదాపు 20 రెట్లు అధికమైన, 60 లక్షల ప్రచారకుల సంఖ్యను చూసి అతడేమంటాడు?
18. స్వచ్ఛమైన భాష అంటే ఏమిటి, దానిని దేవుడు ఎవరికి ఇచ్చాడు?
18 తన ప్రవక్త ద్వారా దేవుడు ఇలా వాగ్దానం చేశాడు: “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల [“స్వచ్ఛమైన భాష,” NW] నిచ్చెదను.” (జెఫన్యా 3:9) ఈ అంత్యదినాల్లో యెహోవా నామమును బట్టి ప్రార్థించే ఆయన సాక్షులైన సేవకులు విడదీయరాని ప్రేమబంధంలో ఐక్యమై, అవును, “యేకమనస్కులై” ఆయన సేవ చేస్తున్నారు. యెహోవా తన స్వచ్ఛమైన భాషను ప్రసాదించింది వారికే. ఈ స్వచ్ఛమైన భాషలో దేవుని గూర్చిన, ఆయన సంకల్పాలను గూర్చిన సరియైన అవగాహన ఇమిడి ఉంది. దీనిని కేవలం యెహోవాయే తన పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వగలడు. (1 కొరింథీయులు 2:10) యెహోవా తన పరిశుద్ధాత్మను ఎవరికి అనుగ్రహిస్తాడు? “తనకు విధేయులైన వారికి” మాత్రమే దానిని అనుగ్రహిస్తాడు. (అపొస్తలుల కార్యములు 5:32) ప్రతి విషయంలోను తమ పరిపాలకునిగా దేవునికి లోబడడానికి ఇష్టపడుతున్నది కేవలం యెహోవాసాక్షులు మాత్రమే. అందుకే వారు దేవుని ఆత్మనూ, స్వచ్ఛమైన భాషను అంటే యెహోవాను గూర్చిన, ఆయన అద్భుతమైన సంకల్పాలను గూర్చిన సత్యాన్నీ పొందగలిగారు. వారు ఈ స్వచ్ఛమైన భాషను భూవ్యాప్తంగా విస్తృతస్థాయిలో, దినదిన ప్రవర్థమానంగా యెహోవాను స్తుతించేందుకు ఉపయోగిస్తున్నారు.
19. స్వచ్ఛమైన భాషలో మాట్లాడడంలో ఇమిడివున్నదేమిటి?
19 స్వచ్ఛమైన భాషలో మాట్లాడడంలో, సత్యాన్ని అంగీకరించి, ఇతరులకు బోధించడం మాత్రమే ఇమిడిలేదు, ఒకరి యావత్ జీవన విధానం దేవుని నియమాలకూ సూత్రాలకూ అనుగుణ్యంగా ఉండడం కూడా ఇమిడివుంది. అభిషిక్తులు యెహోవాను వెదుకుతూ, స్వచ్ఛమైన భాషలో మాట్లాడడంలో నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకూ సాధించబడిన దానిని గురించి ఒక్కసారి ఆలోచించండి! వారి సంఖ్య 8,700కు తగ్గిపోయినప్పటికీ, భూనిరీక్షణగల 60 లక్షలమంది ఇతరులు యెహోవాను వెదకడం ద్వారా, స్వచ్ఛమైన భాషలో మాట్లాడడం ద్వారా వారి విశ్వాసాన్ని అనుకరిస్తున్నారు. యేసు విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచి, దేవుని ఆధ్యాత్మిక దేవాలయపు భూ ప్రాంగణంలో పవిత్రసేవను అందిస్తూ ఈ అవినీతికరమైన లోకముపైకి అతిత్వరలో రాబోతున్న “మహాశ్రమ” నుండి తప్పించుకొనే ఆయా జనాంగముల నుండి వచ్చి ప్రకటన 7:9, 14, 15.
గొప్ప సమూహంగా అభివృద్ధి చెందుతున్నది వీరే.—20. విశ్వాసులైన అభిషిక్తులకు, గొప్ప సమూహముగా రూపొందినవారికీ మున్ముందు ఏమి వేచివుంది?
20 గొప్ప సమూహము దేవుని నూతన లోకంలోకి నడిపించబడుతుంది. (2 పేతురు 3:13) యేసుక్రీస్తూ, రాజులుగా యాజకులుగా పరలోక జీవానికి పునరుత్థానము చేయబడిన 1,44,000 మంది అభిషిక్తులూ పాలకవర్గంగా రూపొందుతారు. (రోమీయులు 8:16, 17; ప్రకటన 7:4; 20:6) మహాశ్రమల నుండి తప్పించబడినవారు భూమిని పరదైసుగా మార్చడంలో నిమగ్నమౌతారు, దేవుడిచ్చిన స్వచ్ఛమైన భాషను ఉపయోగించడంలోనూ కొనసాగుతారు. సూత్రబద్ధంగా వారి విషయంలో ఈ మాటలు నెరవేరతాయి: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు.”—యెషయా 54:13, 14.
చరిత్రలోనే గొప్ప బోధనాపని
21, 22. (ఎ) అపొస్తలుల కార్యములు 24:14, 15 లో సూచించబడినట్లుగా స్వచ్ఛమైన భాష బోధించబడాల్సిన అవసరమున్న వ్యక్తులు ఎవరు? (బి) రాజ్యపరిపాలన క్రింద ఏ అసమానమైన బోధనాపని జరుగబోతుంది?
21 నూతన లోకంలో స్వచ్ఛమైన భాషను నేర్చుకొనే అవకాశమివ్వబడే ఒక పెద్ద గుంపును గూర్చి అపొస్తలుల కార్యములు 24:14, 15 లో ప్రస్తావించబడింది, అక్కడిలా ఉంది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న[ది].” గతంలో జీవించిన కోట్లాదిమంది ప్రజలు యెహోవాను గూర్చిన ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందకుండానే చనిపోయారు. ఒక క్రమం ప్రకారం ఆయన వారిని సజీవులనుగా చేస్తాడు. అలా పునరుత్థానులైన వారందరికి స్వచ్ఛమైన భాషను బోధించాల్సి ఉంటుంది.
22 ఆ గొప్ప బోధనాపనిలో భాగం వహించడం ఎంత శ్రేష్ఠమైన ఆధిక్యత! నిజానికి, అది మానవజాతి చరిత్రలోనే అతి గొప్ప బోధనాపనిగా ఉంటుంది. క్రీస్తుయేసు రాజ్యాధికార సుభిక్ష పరిపాలన క్రింద సమస్తం సాధించబడుతుంది. ఫలితంగా సకాలంలో యెషయా 11:9 నెరవేర్పును మానవజాతి చవిచూస్తుంది: “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.”
23. యెహోవా ప్రజలముగా మనం గొప్ప ఆధిక్యతగలవారమని మీరెందుకు చెప్తారు?
23 భూమంతా యెహోవా జ్ఞానముతో నిండివుండే ఆ అద్భుతమైన సమయం కోసం సన్నద్ధులమవ్వడానికి మనకు ఈ చివరి దినాల్లో ఎంత గొప్ప ఆధిక్యత లభించిందో కదా! జెఫన్యా 3:20 లో వ్రాయబడిన మాటల గొప్ప నెరవేర్పును అనుభవించే దేవుని ప్రజలముగా ఇప్పుడే మనకు ఎంతటి ఆధిక్యత! అక్కడ యెహోవా ఇలా హామీనిస్తున్నాడు: “నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును.”
మీరెలా ప్రతిస్పందిస్తారు?
• జెఫన్యా పునరుద్ధరణ ప్రవచనం ఎలాంటి నెరవేర్పులను కలిగివుంది?
• ఈ అంత్యదినాల్లో సత్యారాధన ఎలా అభివృద్ధి చెందుతోంది?
• నూతనలోకంలో ఏ గొప్ప బోధనాపని చోటుచేసుకుంటుంది?
[అధ్యయన ప్రశ్నలు]
[25వ పేజీలోని చిత్రం]
యెహోవా ప్రజలు స్వచ్ఛమైన ఆరాధనను పునఃస్థాపించడానికి వారి స్వదేశానికి తిరిగివచ్చారు. నేడు దీనికి ఎలాంటి ప్రాముఖ్యం ఉందో మీకు తెలుసా?
[26వ పేజీలోని చిత్రాలు]
“స్వచ్ఛమైన భాష”లో మాట్లాడడం ద్వారా యెహోవాసాక్షులు బైబిలు యొక్క ఆదరణకరమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు