యెహోవా ఉగ్రత దినం రాకముందే ఆయనను వెదకండి
యెహోవా ఉగ్రత దినం రాకముందే ఆయనను వెదకండి
“యెహోవాను వెదకుడి . . . వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”—జెఫన్యా 2:3.
1. జెఫన్యా తన ప్రవచన పనిని ప్రారంభించేటప్పటికి యూదా యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఏమైవుంది?
యూదా చరిత్రలోని కీలకమైన సమయంలో జెఫన్యా తన ప్రవచన పనిని ప్రారంభించాడు. ఆ జనాంగం ఆధ్యాత్మికంగా దుర్భరమైన స్థితిలో ఉంది. ప్రజలు యెహోవా దేవునిపై నమ్మకముంచే బదులు నడిపింపు కోసం అన్యమత యాజకుల వైపు, జ్యోతిష్కుల వైపు తిరిగారు. సంతాన సాఫల్య ఆచారాలతో కూడిన బయలు ఆరాధన ఆ దేశంలో ప్రబలమైపోయింది. పౌర అధికారులు అంటే, అధిపతులు, కులీనులు, న్యాయాధిపతులు తాము ఎవరిని కాపాడవలసి ఉందో వారినే అణచివేస్తున్నారు. (జెఫన్యా 1:9; 3:3) యెహోవా యూదానూ యెరూషలేమునూ నాశనం చేసేందుకు ‘తన హస్తాన్ని చాపడానికి’ నిర్ణయించుకున్నాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు!—జెఫన్యా 1:4.
2. యూదాలోని నమ్మకస్థులైన దేవుని సేవకులకు ఏ నిరీక్షణ వేచివుంది?
2 పరిస్థితి అంత ఘోరంగా ఉన్నా, చిన్న ఆశాకిరణం మిణుకుమిణుకు మంటుంది. ఆమోను కుమారుడైన యోషీయా సింహాసనమెక్కాడు. ఆయన బాలుడే అయినప్పటికీ, యెహోవాపట్ల యథార్థమైన ప్రేమగలిగివున్నాడు. ఈ క్రొత్త రాజు యూదాలో సత్యారాధనను పునఃస్థాపిస్తే, నమ్మకంగా సత్యదేవుని సేవచేస్తున్న కొద్దిమందికి అది ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! ఇతరులు వారితో కలవడానికి అలాగే యెహోవా ఉగ్రత దినాన్నుండి కాపాడబడడానికి అది నడిపించవచ్చు.
రక్షించబడేందుకు కావాల్సినవి
3, 4. “యెహోవా ఉగ్రతదినము” నుండి ఒక వ్యక్తి తప్పించబడాలంటే అత్యావశ్యకమైన ఏ మూడు అంశాల్ని నెరవేర్చాలి?
3 యెహోవా ఉగ్రత దినాన్ని కొంతమంది నిజంగానే తప్పించుకుంటారా? అవును, తప్పించుకుంటారు, అయితే, వారు జెఫన్యా 2:2, 3 వచనాల్లో పేర్కొనబడిన మూడు షరతుల్ని ఆచరణలో పెట్టాలి. ఈ వచనాలను మనం చదువుతుండగా, అత్యావశ్యకమైన ఈ అంశాలకు ప్రత్యేకించి అవధానమిద్దాం. జెఫన్యా ఇలా వ్రాశాడు: “విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”
4 ఒక వ్యక్తి కాపాడబడాలంటే (1) యెహోవాను వెదకాలి, (2) నీతిని అనుసరించాలి, (3) వినయం కలిగివుండాలి. అత్యావశ్యకమైన ఈ అంశాలు నేడు మనకెంతో ప్రాముఖ్యమైనవి. ఎందుకు? ఎందుకంటే, సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో యూదా, యెరూషలేములు ఎలాగైతే దండనదినాన్ని ఎదుర్కొన్నాయో అలాగే క్రైస్తవమత సామ్రాజ్య దేశాలూ, నిజానికి దుష్టులందరూ రాబోయే “మహాశ్రమ” సమయంలో యెహోవా దేవుని ఎదుట లెక్క ఒప్పజెప్పాల్సివున్నారు. (మత్తయి 24:21) ఆ సమయంలో దాచబడాలని ఎవరైనా కోరుకుంటున్నట్లయితే, ఇప్పుడే ఒక నిర్ణయాత్మకమైన చర్యను తీసుకోవాలి. ఎలా? సమయం మించిపోక ముందే యెహోవాను వెదకి, నీతిని అనుసరించి, వినయముగలవారై ఉండడం ద్వారా అలా చేయవచ్చు!
5. నేడు ‘యెహోవాను వెదకడంలో’ ఏమి ఇమిడివుంది?
5 ‘నేను దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం పొందిన సేవకుడ్ని, యెహోవాసాక్షిని. ఆ మూడింటినీ నేను ఇప్పటికే చేయడంలేదా?’ అని మీరనవచ్చు. నిజం చెప్పాలంటే, ఇందులో మనల్ని మనం యెహోవాకు సమర్పించుకోవడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది. ఇశ్రాయేలీయులు కూడా సమర్పిత జనాంగమే కానీ, జెఫన్యా దినాలలో యూదా ప్రజలు తమ సమర్పణకు తగినట్లు జీవించలేదు. తత్ఫలితంగా ఆ జనాంగం చివరికి విడనాడబడింది. నేడు ‘యెహోవాను వెదకడం’లో, ఆయన భూసంబంధ సంస్థతో సహవసిస్తూ, ఆయనతో ప్రేమపూర్వకమైన వ్యక్తిగత ద్వితీయోపదేశకాండము 6:5; గలతీయులు 5:22-25; ఫిలిప్పీయులు 4:6, 7; ప్రకటన 4:10, 11.
సంబంధాన్ని ఏర్పరచుకుని దాన్ని కాపాడుకోవడం ఇమిడివుంది. అంటే, విషయాలను దేవుడు ఎలా దృష్టిస్తున్నాడో తెలుసుకొని, ఆయన భావాలకు అవధానమివ్వాలి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి, ధ్యానించి, ఆ హెచ్చరికలను మన జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు మనం యెహోవాను వెదకగలం. పట్టుదలతో కూడిన ప్రార్థనలో మనం నడిపింపు కోసం యెహోవా వైపు చూస్తుండగా ఆయన ఆత్మ నడిపింపును అనుసరిస్తుండగా యెహోవాతో మనకున్న సంబంధం పటిష్ఠమౌతుంది, ‘పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను’ ఆయనను సేవించడానికి మనం పురికొల్పబడతాం.—6. మనం ఎలా ‘నీతిని అనుసరించ’గలము, ఈ లోకములో కూడా అది ఎలా సాధ్యమవుతుంది?
6 రెండవ ఆవశ్యకమైన అంశంగా ‘నీతిని అనుసరించమని’ జెఫన్యా 2:3 లో ప్రస్తావించబడింది. మనం క్రైస్తవ బాప్తిస్మానికి అర్హులమవ్వడానికి మనలో అనేకమందిమి మన జీవితాల్లో ప్రాముఖ్యమైన మార్పులు చేసుకున్నాం, అయితే, యెహోవా నీతియుక్త నైతిక ప్రమాణాలను హత్తుకొని ఉండడంలో మనం మన జీవితకాలమంతా కొనసాగాలి. ఈ విషయంలో చక్కగా పయనం ప్రారంభించిన కొందరు, లోకం తమను కలుషితం చేయడానికి అనుమతించారు. లైంగిక అనైతికత, అబద్ధాలు, మోసం వంటివాటిని సాధారణ విషయాలుగా పరిగణించే ప్రజల మధ్య జీవిస్తున్న మనకు నీతిని అనుసరించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయినప్పటికీ, యెహోవాను ప్రీతిపర్చాలనే దృఢమైన కోరిక, లోకంతో కలిసిపోవడానికి ప్రయత్నించడం ద్వారా దాని అంగీకారాన్ని చూరగొనాలన్న ఎలాంటి కోరికనైనా అధిగమించగలదు. యూదా తన అన్యమతస్థులైన పొరుగువారిని అనుకరించటానికి ప్రయత్నించినందువల్ల యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయింది. కాబట్టి, లోకాన్ని పోలి దాన్ని అనుసరించే బదులు ‘నీతియు యథార్థమైన భక్తియుగలవారమై, దేవుని చిత్తమునకు అనుగుణ్యంగా సృష్టించబడిన నవీనస్వభావమును’ పెంపొందించుకోవడంలో కొనసాగుతూ “దేవునిపోలి నడుచు”కుందాం.—ఎఫెసీయులు 4:24; 5:1.
7. మనమెలా ‘వినయం గలవారమై’ ఉండగలము?
7 దేవుని ఉగ్రత దినాన్నుండి దాచబడాలంటే మనం ‘వినయం గలవారమై ఉండాలి’ అనే ఆవశ్యకమైన మూడవ అంశం జెఫన్యా 2:3 లో తెలియజేయబడుతుంది. ప్రతిరోజు మనం వినయం ఏమాత్రం లేని స్త్రీపురుషులను, యౌవనులను కలుస్తూ ఉంటాం. వారి దృష్టిలో దీనమనస్సు కల్గి ఉండడమంటే ఒక లోపం. లోబడి ఉండడాన్ని వారు గంభీరమైన బలహీనతగా పరిగణిస్తారు. వారు అహంకారులు, స్వార్థప్రియులు, మొండివారు, వారు తమ వ్యక్తిగత “హక్కులు”గా లేదా ఇష్టాలుగా భావించినవి, ఎట్టి పరిస్థితుల్లోనైనా వారికి లభించి తీరాలి. అటువంటి స్వభావాలేవైనా మనకుగానీ సోకితే ఎంత విచారకరం! ‘వినయం గలవారమై ఉండే’ సమయం ఇదే. ఎలా? దేవునికి విధేయులమైవుండడం ద్వారా వినయంగా ఆయనిచ్చే శిక్షణను అంగీకరించడం ద్వారా ఆయన చిత్తానికి అనుగుణ్యంగా మనల్ని మనం మల్చుకోవడం ద్వారా మనమలా చేయగలము.
“ఒకవేళ” దాచబడడం ఎందుకు?
8. జెఫన్యా 2:3 లోని “ఒకవేళ” అనే పదాన్ని ఉపయోగించడం దేనిని సూచిస్తుంది?
8జెఫన్యా 2:3 వచనం ఏమంటుందో గమనించండి: “ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” ‘దేశములోవున్న సాత్వికులను’ ఉద్దేశించి మాట్లాడుతూ జెఫన్యా “ఒకవేళ” అన్నమాటను ఎందుకు ఉపయోగిస్తున్నాడు? ఆ సాత్వికులు తగిన చర్యలే తీసుకున్నారు, కానీ వారికి ఆత్మ-విశ్వాసం ఉండడం ఏమాత్రం మంచిది కాదు. విశ్వాసం విషయంలో వారి జీవితపయనం ఇంకా ముగింపుకు రాలేదు. గనుక వారిలో కొందరు పాపంలో పడిపోవచ్చని అర్థమౌతుంది. మన విషయంలో కూడా ఇది నిజం. యేసు ఇలా అన్నాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:13) అవును, యెహోవా ఉగ్రత దినమున కాపాడబడడమనేది మనం ఆయన దృష్టిలో సరియైన దానిని చేస్తూ ఉండడంపై ఆధారపడి ఉంటుంది. మీ స్థిర నిశ్చయత అదేనా?
9. యౌవనస్థుడైన రాజైన యోషీయా ఎలాంటి నీతియుక్త చర్యలు తీసుకున్నాడు?
9 స్పష్టంగా జెఫన్యా మాటలకు ప్రతిస్పందనగా రాజైన యోషీయా ‘యెహోవాను వెదికేలా’ కదిలించబడ్డాడు. లేఖనం ఇలా చెప్తుంది: “తన యేలుబడి యందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై [16 ఏండ్లవాడు] యుండగానే అతడు [యోషీయా] తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు [లేదా “వెదకుటకు,” న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్] పూనుకొ[నెను].” (2 దినవృత్తాంతములు 34:3) యోషీయా ‘నీతిని అనుసరించాడు’ కూడా, ఎందుకలా చెప్పవచ్చంటే మనం ఇలా చదువుతాము: “పండ్రెండవయేట [యోషీయా 20 ఏండ్ల ప్రాయంలో ఉన్నప్పుడు] ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదా దేశమును యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి[రి].” (2 దినవృత్తాంతములు 34:3, 4) యోషీయా ‘వినయం గలవాడు’ కూడా, విగ్రహారాధనతోను ఇతర అబద్ధమత ఆచారాలతోను నిండిన దేశాన్ని శుభ్రపరచడం, వినయంతో యెహోవాను సంతోషపర్చేందుకు ఆయనను నడిపించింది. ఈ అభివృద్ధులను చూసి వినయంగల ఇతరులు ఎంత సంతోషించి ఉంటారో కదా!
10. సా.శ.పూ. 607 లో యూదాలో ఏమి జరిగింది, కానీ ఎవరు తప్పించబడ్డారు?
10 యోషీయా పరిపాలనలో అనేకమంది యూదులు యెహోవావైపుకు తిరిగారు. ఆ రాజు మరణించిన తరువాత, అనేకులు యెహోవాకు అంగీకారయుక్తము కాని తమ పాతమార్గాలను తిరిగి అనుసరించారు. యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే బబులోను యూదాపై దండెత్తి సా.శ.పూ. 607 లో దాని ముఖ్య పట్టణమైన యెరూషలేమును నాశనం చేసింది. అయితే, అందరూ నాశనం కాలేదు. ప్రవక్తయైన యిర్మీయా, ఐతియొపీయుడైన ఎబెద్మెలెకు, యోనాదాబు వంశస్థులు, మరికొందరు విశ్వసనీయులు “యెహోవా ఉగ్రతదినమున” కాపాడబడ్డారు.—యిర్మీయా 35:18, 19; 39:11, 12, 15-18.
దేవుని శత్రువుల్లారా—గుర్తుంచుకోండి!
11. నేడు యెహోవాకు విశ్వసనీయంగా జీవించడం ఎందుకు సవాలుతో కూడినది, యెహోవా శత్రువులైన వాళ్ళు ఏమి తెలుసుకోవడం మంచిది?
11 ఈ దుష్టవిధానంపై యెహోవా ఉగ్రత దినము కోసం మనం ఎదురుచూస్తూండగా “నానా విధములైన శోధనల”ను ఎదుర్కొంటాము. (యాకోబు 1:2, 3) మత స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తామని చెప్పుకునే అనేక దేశాల్లో తంత్రగాళ్లైన మతనాయకులు లౌకిక అధికారులతో కుమ్ముక్కై దేవుని ప్రజలను తీవ్రంగా హింసించారు. నీతినియమాల్లేని వ్యక్తులు “అపాయకరమైన తెగ” అని యెహోవాసాక్షులపై నిందమోపారు. ఈ చర్యలన్నీ దేవునికి తెలుసు, ఆయన వారిని శిక్షించకమానడు. ప్రాచీన కాలంలో ఫిలిష్తీయుల వంటి తన ప్రజల శత్రువులకు ఏమి సంభవించిందో, ఆయన శత్రువులైన వీళ్లు తెలుసుకోవడం మంచిది. ప్రవచనం ఇలా చెప్తుంది: “గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును.” గాజా, అష్కెలోను, అష్డోదు, ఎక్రోను అనే ఫిలిష్తీయుల ప్రముఖ నగరాలు పూర్తిగా నాశనం కానున్నాయి.—జెఫన్యా 2:4-7.
12. ఫిలిష్తీయ మోయాబు అమ్మోనులకు ఏమి జరిగింది?
12 ప్రవచనం ఇలా కొనసాగుతుంది: “మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణమాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.” (జెఫన్యా 2:8) నిజమే, ఐగుప్తు, ఇతియోపియాలు బబులోను ఆక్రమణదారుల చేతిలో బాధలు పడ్డాయి. కానీ అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు వంశీయులైన మోయాబు, అమ్మోను జనాంగాలకు యెహోవా ఎలాంటి తీర్పునిచ్చాడు? యెహోవా ముందుగానే ఇలా చెప్పాడు: “మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును.” అంటే సొదొమ, గొమొఱ్ఱాల నాశనాన్నుండి తప్పించుకున్న తమ పూర్వీకురాండ్రైన లోతు ఇద్దరు కుమార్తెల వలె మోయాబు, అమ్మోను జనాంగాలవారు దేవుని కోపాగ్ని నుండి తప్పించుకోలేరు. (జెఫన్యా 2:9-12; ఆదికాండము 19:16, 23-26, 36-38) నేడు ఆ ఫిలిష్తీయ దేశము, దాని పట్టణాలు ఎక్కడ ఉన్నాయి? ఒకప్పుడు విర్రవీగిన మోయాబు అమ్మోనులకు ఏమయ్యింది? మీరు వాటి కోసం వెదకినా అవి మీకు కన్పించవు.
13. నీనెవెను గూర్చి పురావస్తు శాస్త్రం ఏమి బయల్పర్చింది?
13 జెఫన్యా దినాల్లో అష్షూరు సామ్రాజ్యం శిఖరాగ్ర స్థాయిలో వర్ధిల్లుతోంది. అష్షూరు ముఖ్య పట్టణమైన నీనెవెలో జరిగిన త్రవ్వకాల్లో తాను కనుగొన్న రాజభవనంలోని ఒక భాగాన్ని గురించి వర్ణిస్తూ పురావస్తు శాస్త్రవేత్త అయిన ఆస్టిన్ లేయార్డ్ ఇలా వ్రాశాడు: “పైకప్పులు . . . చతురస్ర విభాగాలుగా విభజించబడి ఉన్నాయి, పువ్వులు లేదా జంతువుల చిత్రాలు వాటిపై చిత్రీకరించబడి ఉన్నాయి. కొన్నింటిపై ఏనుగు దంతంతో చేసిన వాటిని పొదిగారు. ప్రతి విభాగం సొగసైన అంచులతో శిల్పకళలతో నిండి ఉంది. బహుశా స్తంభాలు, గదులగోడలు వెండి బంగారాలతో పూతపూయబడి లేదా రేకుతో పొదగబడి ఉండి ఉంటాయి; అతి అరుదైన చెక్కను, బహుశా దేవదారు చెక్కను ఉపయోగించడం జరిగిందని స్పష్టమౌతుంది.” అయితేనేమి, జెఫన్యా ప్రవచనంలో ప్రవచించబడినట్లు నీనెవె పాడు దిబ్బగాను, ఎడారిలో నీరులేని ప్రాంతంగాను మారనైవుంది.—జెఫన్యా 2:13.
14. నీనెవె విషయంలో జెఫన్యా ప్రవచనం ఎలా నెరవేరింది?
14 జెఫన్యా ఈ మాటలను పలికిన కేవలం 15 సంవత్సరాల తరువాత పటిష్ఠమైన నీనెవె పట్టణం నాశనమయ్యింది, జెఫన్యా 2:14, 15) నీనెవె రాజభవంతులు కేవలం గూడబాతులకు, తుంబోళ్ళకు నివాసస్థలాలుగా మారిపోయాయి. పట్టణవీధుల్లో వ్యాపారాల రణగొణ ధ్వనులు, యుద్ధయోధుల అరుపులు, పూజారుల ప్రార్థనలు ఇక వినిపించడం లేదు. ఒకప్పుడు సందడిగా ఉన్న ఆ రాజవీధుల్లో ఇప్పుడు కేవలం కిటికీలలో నుండి కూతలు మాత్రం వినిపిస్తున్నాయి, ఆ కూతలు బహుశా పక్షుల అరుపులో లేదా గాలిచేసే భీకరధ్వనులో అయ్యుండవచ్చు. దేవుని శత్రువులందరూ అదేవిధంగా నాశనమౌతారు!
దాని రాజభవనం శిథిలమైపోయింది. అవును, ఆ గర్విష్టి నగరం బూడిదగా మారిపోయింది. దాని నాశనం ఎంత విస్తృతంగా ఉంటుందో అది విస్పష్టమైన రీతుల్లో ప్రవచించబడింది: “గూడ బాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కనుపించును.” (15. మోయాబు, అమ్మోను, ఫిలిష్తీయ, అష్షూరులకు సంభవించిన దాన్ని పరిశీలించడం ద్వారా మనమేమి నేర్చుకోగలం?
15 మోయాబు, అమ్మోను, ఫిలిష్తీయ, అష్షూరులకు సంభవించిన దాన్ని పరిశీలించడం ద్వారా మనమేమి నేర్చుకోగలం? ఇదే: దేవుని సేవకులముగా మనం మన శత్రువుల గురించి భయపడవలసిన పనేమీలేదు. తన ప్రజలను వ్యతిరేకించేవారు చేస్తున్నవి దేవుని దృష్టిలో పడకుండా పోలేదు. గతంలో ఆయన తన శత్రువుల విషయంలో చర్య తీసుకున్నాడు, అలాగే, నేడు యెహోవా తీర్పు భూమి అంతటిపైకి వస్తుంది. అయితే, తప్పించుకొనేవారు కూడా ఉంటారు, వాళ్లే ‘ప్రతి జనాంగంలో నుండి వచ్చిన ఒక గొప్ప సమూహము.’ (ప్రకటన 7:9) మీరు కూడా వారిలో ఒకరై ఉండవచ్చు—అయితే, మీరు యెహోవాను వెదుకుతూ, నీతిని అనుసరిస్తూ, వినయం కలిగి ఉండడంలో కొనసాగుతూ ఉంటేనే అది సాధ్యమౌతుంది.
గర్విష్ఠులైన తప్పిదస్థులకు శ్రమ!
16. యూదా అధిపతుల, మతనాయకుల గురించి జెఫన్యా ప్రవచనం ఏమని చెప్తుంది, ఈ వచనాలు క్రైస్తవమత సామ్రాజ్యానికి ఎందుకు సరిపోతాయి?
16 జెఫన్యా ప్రవచనం యూదా, యెరూషలేములపై మళ్ళీ దృష్టిసారిస్తుంది. జెఫన్యా 3:1, 2 ఇలా చెప్తుంది: “ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు.” యెహోవా హెచ్చరికలను అలక్ష్యం చేసి, ఆయన తన ప్రజలకిస్తున్న క్రమశిక్షణను తృణీకరించిన వారికి ఎంతటి దుస్థితి! అధిపతులు, అధికారులు, న్యాయాధిపతులు కనబర్చిన క్రూరత్వం చాలా దౌర్భాగ్యకరమైన విషయం. మతనాయకుల, ప్రవక్తల, యాజకుల సిగ్గుమాలినతనాన్ని జెఫన్యా ఖండిస్తూ ఇలా చెప్తున్నాడు: “దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు.” (జెఫన్యా 3:3, 4) ఈ మాటలు నేడు క్రైస్తవమత సామ్రాజ్యంలోని ప్రవక్తల, మతాధికారుల పరిస్థితిని ఎంతో చక్కగా వర్ణిస్తున్నాయి! వారు గర్వాంధులై దేవుని నామాన్ని తమ బైబిలు అనువాదాల నుండి తొలగించి, తాము ఆరాధిస్తున్నామని చెప్పుకొనే ఆయనను గురించి వాళ్లు తప్పుడు సిద్ధాంతాలను బోధించారు.
17. ప్రజలు విన్నా వినకపోయినా సువార్తను ప్రకటించడంలో కొనసాగుతూనే ఉండడం ఎందుకు అవసరం?
17 యెహోవా తాను తీసుకోబోయే చర్యను గురించి ప్రజలకు ముందుగానే హెచ్చరించాడు. పశ్చాత్తాపపడమని ప్రజలకు చెప్పమని ఆయన జెఫన్యా, యిర్మీయా, మరితర ప్రవక్తలైన సేవకులను పంపాడు. అవును, “యెహోవా . . . అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయవిధులను బయలుపరచును.” ఫలితమేమిటి? “అయినను నీతిహీనులు సిగ్గెరుగరు” అని జెఫన్యా చెప్తున్నాడు. (జెఫన్యా 3:5) అలాంటి హెచ్చరికే ఇప్పుడు కూడా ఇవ్వబడుతోంది. మీరు సువార్తను ప్రకటించే ప్రచారకులైతే, ఈ హెచ్చరికా పనిలో మీరూ భాగం వహిస్తున్నట్లే. కాబట్టి, సువార్తను నిరంతరాయంగా ప్రకటించడంలో ముందుకు కొనసాగండి! ప్రజలు విన్నా వినకపోయినా మీరు దాన్ని నమ్మకంగా కొనసాగిస్తే దేవుని దృష్టిలో మీ పరిచర్య విజయవంతమైనట్లే, మీరు పట్టుదలతో దేవుని పని చేస్తుండగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు.
18. జెఫన్యా 3:6 ఎలా నెరవేరుతుంది?
18 యెహోవా దేవుని తీర్పు క్రైస్తవమత సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి మాత్రమే పరిమితమైలేదు. యెహోవా తన హెచ్చరికను భూజనాంగాలన్నింటికీ విస్తరింపజేస్తాడు: “నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసియున్నాను, జనము లేకుండను వాటియందెవరును కాపురముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.” (జెఫన్యా 3:6) ఆ మాటలు ఎంత నమ్మదగినవంటే, ఆ నాశనం అప్పటికే సంభవించినట్లు యెహోవా మాట్లాడుతున్నాడు. మోయాబు, అమ్మోను, ఫిలిష్తీయ పట్టణాలకు ఏమి జరిగింది? అష్షూరు ముఖ్య పట్టణమైన నీనెవె సంగతేమిటి? వాటి నాశనం నేటి జనాంగాలకు ఒక హెచ్చరికా దృష్టాంతంగా పనిచేయాలి. దేవుడు వెక్కిరించబడడు.
యెహోవాను వెదుకుతూ ఉండండి
19. మనం ఆలోచనరేకెత్తించే ఏ ప్రశ్నలను వేసుకోవాలి?
19 జెఫన్యా దినాల్లో “దుష్క్రియలు చేయుటయందు అత్యాశగల”వారిపైకి దేవుని ఉగ్రత క్రుమ్మరించబడింది. (జెఫన్యా 3:7) అలాగే మన దినాల్లో కూడా జరగబోతోంది. యెహోవా ఉగ్రత దినం సమీపించిందనే దాని రుజువును మీరు చూశారా? ఆయన వాక్యాన్ని క్రమంగా, ప్రతిదినం పఠించడం ద్వారా “యెహోవాను వెద”కడంలో మీరు కొనసాగుతున్నారా? దేవుని ప్రమాణాలకు అనుగుణ్యమైన రీతిలో నైతికంగా పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం ద్వారా మీరు నిజంగా “నీతిని అనుసరి”స్తున్నారా? రక్షణ కోసం దేవుడు చేసిన ఏర్పాట్లపట్ల విధేయతాపూర్వకమైన వినయపూర్వకమైన వైఖరిని ప్రదర్శించడం ద్వారా మీరు “వినయముగలవారై” ఉంటున్నారా?
20. జెఫన్యా ప్రవచనంపై ఈ పరంపరలోని చివరి ఆర్టికల్లో మనం ఏ ప్రశ్నలను పరిశీలించబోతున్నాము?
20 యెహోవాను వెదుకుతూ, నీతిని అనుసరిస్తూ, వినయం గలవారమై ఉండడంలో మనం నమ్మకంగా కొనసాగుతున్నట్లయితే, ఇప్పుడు ఎన్నో ఆశీర్వాదాలను మనం అనుభవించగల్గుతాం—అవును, విశ్వాసానికి పరీక్షగా ఉన్న ఈ “అంత్యదినములలో” కూడా. (2 తిమోతి 3:1-5; సామెతలు 10:22) మనల్ని మనమిలా ప్రశ్నించుకోవాలనుకోవాలి: ‘ప్రస్తుతదిన సేవకులముగా మనం ఏ యే విధాలుగా ఆశీర్వదించబడ్డాము, అతి శీఘ్రంగా సమీపించే యెహోవా ఉగ్రత దినాన దాచబడే వారి ముందు జెఫన్యా ప్రవచనం ఏ భవిష్యద్ ఆశీర్వాదాలను ఉంచుతుంది?’
మీరెలా ప్రతిస్పందిస్తారు
• ప్రజలు ఎలా ‘యెహోవాను వెదుకుతారు’?
• “నీతిని అనుసరిం[చడం]”లో ఏమి ఇమిడివుంది?
• మనం ‘వినయం గలవారమై ఉండడం’ ఎలా సాధ్యం?
• మనం ఎందుకు యెహోవాను వెదకి నీతిని అనుసరించి వినయంగలవారమై ఉండాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[18వ పేజీలోని చిత్రం]
బైబిలు అధ్యయనం ద్వారా పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారా మీరు యెహోవాను వెదుకుతున్నారా?
[21వ పేజీలోని చిత్రం]
గొప్ప సమూహములోనివారు యెహోవాను వెదకడంలో కొనసాగుతూ ఉండడంవల్లనే యెహోవా ఉగ్రత దినాన్ని తప్పించుకుంటారు