కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”

“జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”

“జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”

ఆయనో కవి, ఆర్కిటెక్ట్‌, రాజు. సాలీనా 1,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగి భూమ్మీదున్న రాజులందరిలో కెల్లా అత్యధిక సంపదలతో తులతూగిన వ్యక్తి. తనకున్న జ్ఞానసంపదను బట్టి కూడా పేరుగాంచాడు. ఆయన్ని సందర్శించిన రాణి ఎంతగానో ప్రభావితురాలై, “ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి” అని ఆశ్చర్యంతో అంది. (1 రాజులు 10:​4-9) ప్రాచీనకాల ఇశ్రాయేలు రాజైన సొలొమోను హోదా అలాంటిది.

సొలొమోనుకు జ్ఞానమూ ఐశ్వర్యమూ రెండూ ఉన్నాయి. ఆ రెండింటిలో నిజంగా ఏది ఆవశ్యకమైనదన్న విషయాన్ని నిర్ణయించడానికి కావాల్సిన అసమానమైన యోగ్యతను కల్గివుండేలా చేసిందదే. ఆయన ఇలా రాశాడు: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.”​—⁠సామెతలు 3:​13-15.

అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఐశ్వర్యంకన్నా అది ఎందుకు విలువైంది? దాని ఆకర్షణీయ కోణాలు ఏమిటి? బైబిలు పుస్తకమైన సామెతలు గ్రంథంలోని సొలొమోను రచించిన 8వ అధ్యాయం ఆ ప్రశ్నలకు ఆకట్టుకునే జవాబుల్ని ఇస్తుంది. అక్కడ జ్ఞానం, మాట్లాడుతున్నట్టుగానూ పనిచేస్తున్నట్టుగానూ మూర్తీకరించబడింది. అక్కడ జ్ఞానం తన విన్నపాన్నీ, తన విలువనూ స్వయంగా బయల్పర్చడం జరిగింది.

“అది . . . గట్టిగా ప్రకటన చేయుచున్నది”

సామెతలు 8వ అధ్యాయం “జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది” అన్న మాటలతో ప్రారంభమౌతుంది. * అవును, చీకట్లో పొంచివుండి ఒంటరిగా, అనుభవంలేని యువకుని చెవుల్లో నయవంచనతో కూడిన మాటలను గుసగుసలాడే అవినీతికర స్త్రీలాగాక జ్ఞానవివేచనలు ఘోషిస్తున్నాయి. (సామెతలు 7:​12) “త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది . . . గట్టిగా ప్రకటన చేయుచున్నది.” (సామెతలు 8:​1-3) జ్ఞానానికున్న గంభీరమైన పెద్ద స్వరం, బహిరంగ స్థలాల్లో అంటే గుమ్మముల దగ్గర, నడి మార్గాల్లో, పుర ద్వారాల దగ్గర బిగ్గరగానూ, స్పష్టంగానూ వినబడుతోంది. ప్రజలు ఆ స్వరాన్ని ఇట్టే వినగలరు, ప్రతిస్పందించగలరు.

దైవ ప్రేరేపిత వాక్యమైన బైబిల్లో నమోదు చేయబడిన దైవిక జ్ఞానాన్ని పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ అంటే దాదాపుగా భూమ్మీదున్న ప్రతి ఒక్కరికీ అది అందుబాటులో ఉందన్న విషయాన్ని ఎవరు కాదనగలరు? “చరిత్రలో అత్యంత అధికంగా చదవబడిన గ్రంథం బైబిలు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. అదింకా ఇలా అంటోంది: “ఏ ఇతర గ్రంథంకన్నా బైబిలు ప్రతులు అధికంగా పంచిపెట్టబడ్డాయి. ఏ ఇతర గ్రంథంకన్నా బైబిలే అనేకసార్లు, అనేక భాషల్లోకి అనువదించబడింది.” పూర్తి బైబిలుగానీ, బైబిల్లోని కొన్ని పుస్తకాలుగానీ 2,100 కన్నా ఎక్కువ భాషల్లోనూ, మాండలికాల్లోనూ లభ్యమౌతుండడంతో, మానవజాతిలో 90 కన్నా ఎక్కువమంది ప్రజలు తమ సొంత భాషలో దేవుని వాక్యంలోని కనీసం కొంత భాగాన్నైనా చదువుకుంటున్నారు.

యెహోవాసాక్షులు బైబిలు సందేశాన్ని బహిరంగంగా, అంతటా ప్రకటిస్తున్నారు. 235 దేశాల్లో, దేవుని రాజ్య సువార్తను వారు చురుకుగా ప్రకటిస్తున్నారు, దేవుని వాక్యంలో ఉన్న సత్యాల్ని ప్రజలకు బోధిస్తున్నారు. 140 భాషల్లో ప్రచురించబడుతున్న కావలికోట, 83 భాషల్లో ముద్రించబడుతున్న తేజరిల్లు! అనే బైబిలు ఆధారిత పత్రికలలో ఒక్కోటీ 2 కోట్లకన్నా ఎక్కువ ప్రతులు పంచిపెట్టబడుతున్నాయి. బహిరంగ స్థలాల్లో జ్ఞానం నిజంగా ఘోషిస్తోంది!

“నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను”

మూర్తీభవించిన జ్ఞానం మాట్లాడడం ఆరంభించి, ఇలా అంటోంది: “మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.”​—సామెతలు 8:4, 5.

జ్ఞానపు పిలుపు సార్వత్రికమైనది. అది దాని ఆహ్వానాన్ని సర్వ మానవాళికీ విస్తృతపరుస్తోంది. జ్ఞానంలేనివారు జ్ఞానాన్నీ, బుద్ధిహీనులు బుద్ధినీ పొందేలా అది వారిని ఆహ్వానిస్తోంది. వాస్తవానికి, బైబిలు సర్వమానవాళి కోసమైన గ్రంథమని యెహోవాసాక్షులు నమ్ముతారు, అందులో ఉన్న జ్ఞానపు పలుకులను కనుగొనేలా దాన్ని చదవమని తాము కలుసుకున్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడానికి నిష్పాక్షికంగా కృషిచేస్తారు.

“నా నోరు సత్యమైన మాటలు పలుకును”

జ్ఞానం దాని విజ్ఞప్తిని విస్తృతపరుస్తూ ఇలా అంటోంది: “నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును; దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నియు నీతిగలవి. వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు.” అవును, జ్ఞానబోధలు శ్రేష్ఠమైనవి, యథార్థమైనవి, సత్యమైనవి, నీతిగలవి. వాటిలో మూర్ఖతగానీ, కుటిలత్వంగానీ లేదు. “అవియన్నియు వివేకికి తేటగాను, తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.”​—సామెతలు 8:​6-9.

దానికి తగ్గట్టుగానే జ్ఞానం ఇలా ఉద్బోధిస్తోంది: “వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.” ఈ విజ్ఞప్తి గ్రహించశక్యమైనది ఎందుకంటే, “జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.” (సామెతలు 8:10, 11) అయితే ఎందుకు సాటి కావు? జ్ఞానాన్ని ఐశ్వర్యంకన్నా అమూల్యమైందిగా ఏది చేస్తుంది?

“బంగారముకంటెను . . . నావలన కలుగు ఫలము మంచిది”

జ్ఞానాన్ని వినేవానికి అది అనుగ్రహించే బహుమానాలు బంగారంకన్నా వెండికన్నా, లేదా ముత్యాలకన్నా ఎం  శ్రేష్ఠమైనవి. ఆ బహుమతులు ఏంటో తెలియజేస్తూ, జ్ఞానం ఇలా అంటోంది: “జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును. యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.”​—⁠సామెతలు 8:12, 13.

జ్ఞానం దాన్ని పొందినవానికి చాతుర్యాన్నీ, ఆలోచనా సామర్థ్యాల్నీ ఇస్తుంది. దైవిక జ్ఞానాన్ని కల్గిన వ్యక్తి దేవుని పట్ల భక్తిపూర్వక భయాన్ని కల్గివుంటాడు ఎందుకంటే “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.” (సామెతలు 9:​10) కాబట్టి, యెహోవా అసహ్యించుకునే వాటిని అతడు అసహ్యించుకుంటాడు. అహంకారం, గర్వం, దుర్నీతికరమైన ప్రవర్తన, కుటిలమైన మాటలు అతనిలో కనబడవు. చెడుతనం పట్ల అతనికున్న అసహ్యం, అధికారాన్ని స్వార్థానికి ఉపయోగించుకోకుండా కాపాడుతుంది. జ్ఞానాన్ని వెదకడం క్రైస్తవ సంఘంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారికీ, అలాగే కుటుంబ శిరస్సులకూ ఎంత ప్రాముఖ్యమో కదా!

జ్ఞానము ఇంకా ఇలా కొనసాగిస్తోంది: “ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నావలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు. నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు.” (సామెతలు 8:​14-16) పాలకులకూ, ఉన్నతాధికారులకూ, ప్రధానులకూ మరింత అవసరమైన అంతర్దృష్టి, అవగాహన, పరాక్రమం వంటివి జ్ఞానఫలంలో చేరివున్నాయి. జ్ఞానం అధికార స్థానంలో ఉన్న వారికీ, ఇతరులకు సలహా ఇచ్చే వారికీ అత్యంతావశ్యకం.

నిజమైన జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంది. కానీ దాన్ని అందరూ కనుక్కోలేరు. అది తమ గవునుల దగ్గర ఉన్నప్పటికీ, కొందరు దాన్ని తిరస్కరిస్తారు లేదా విడనాడతారు. “నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు” అని అంటోది జ్ఞానం. (సామెతలు 8:​17) జ్ఞానం దాన్ని తీవ్రంగా వెదికేవారికి మాత్రమే దొరుకుతుంది.

జ్ఞాన మార్గాలు న్యాయమైనవి, నీతియుక్తమైనవి. వాటిని వెదకేవారికి అవి ప్రతిఫలాన్నిస్తాయి. జ్ఞానం ఇలా అంటోంది: “ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి. మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను. నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును.”​—సామెతలు 8:18-21.

విచక్షణ, ఆలోచనాసామర్థ్యం, అణుకువ, అంతర్దృష్టి, ఆచరణాత్మక జ్ఞానం, అవగాహన వంటి శ్రేష్ఠమైన గుణలక్షణాలతోపాటు జ్ఞానపు బహుమానాల్లో ఐశ్వర్య ఘనతలు కూడా చేరివున్నాయి. జ్ఞానియైనవాడు నీతియుక్త మార్గాల్లో సంపదను సంపాదిస్తాడు, ఆధ్యాత్మికంగా వర్థిల్లుతాడు. (3 యోహాను 2) జ్ఞానం ఒకనికి ఘనతను కూడా తెస్తుంది. అంతేగాక, అతడు తాను సంపాదించినవాటిని బట్టి సంతృప్తి చెందుతాడు, దేవునిపట్ల సమాధానకరమైన మనస్సునూ, పరిశుభ్రమైన మనస్సాక్షినీ కల్గివుంటాడు. అవును, జ్ఞానాన్ని సంపాదించినవాడు ధన్యుడు. జ్ఞానఫలం, నిశ్చయంగా శుద్ధిచేయబడిన బంగారంకన్నా, ప్రశస్తమైన వెండికన్నా ఎంతో శ్రేష్ఠమైనది.

ఏ విధంగానైనా ఎలాగైనా సరే డబ్బును సంపాదించడానికే అధిక ప్రాముఖ్యతను ఇచ్చే వస్తుసంబంధ లోకంలో జీవిస్తున్నాము గనుక మనకు ఈ సలహా ఎంత సమయానుకూలమైందో కదా! జ్ఞానం ఎంత విలువైందన్న విషయాన్నిగానీ, డబ్బును సంపాదించేందుకు అవినీతికరమైన మార్గాల్ని ఆశ్రయించకూడదన్న విషయాన్నిగానీ మనం ఎన్నడూ విస్మరించకూడదు. కేవలం డబ్బును సంపాదించడం కోసం జ్ఞానాన్ని పెంపొందించే ఏర్పాట్లను అంటే మన క్రైస్తవ కూటాలనూ, మన వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్నీ, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా అందించబడుతున్న ప్రచురణల వ్యక్తిగత అధ్యయనాన్నీ ఎన్నడూ అలక్ష్యం చేయకూడదు.​—⁠మత్తయి 24:45-47.

“అనాదికాలము మొదలుకొని . . . నేను నియమింపబడితిని”

సామెతలు 8వ అధ్యాయంలో మూర్తీభవించిన జ్ఞానం అనేది సైద్ధాంతిక లక్షణానికున్న గుణగణాలను వివరించే మాధ్యమం మాత్రమే కాదు. అది, యెహోవా దేవుని అత్యంత ప్రాముఖ్యమైన సృష్టిని సూచనార్థకంగా సూచిస్తోంది కూడా. జ్ఞానమిలా అంటోంది: “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.”​—సామెతలు 8:22-26.

మూర్తీభవించిన జ్ఞానాన్ని గురించిన వర్ణన, లేఖనాల్లో ‘వాక్యాన్ని’ గురించి తెలియజేయబడిన దానికి ఎంత చక్కగా సరిపోతుందో కదా! “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను” అని అపొస్తలుడైన యోహాను రాశాడు. (యోహాను 1:⁠1) మూర్తీభవించిన జ్ఞానం, అలంకారికంగా చెప్పాలంటే మానవపూర్వ ఉనికిలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. *

యేసుక్రీస్తు “సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని . . . సర్వమును ఆయనయందు సృజింపబడెను.” (కొలొస్సయులు 1:​15, 16) “ఆయన [యెహోవా] ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.” (సామెతలు 8:​27-31) యెహోవా దేవుని ఆదిసంభూతుడగు కుమారుడు, భూమ్యాకాశముల నిరుపమాన సృష్టికర్తయైన ఆయనతో చురుగ్గా పనిచేస్తూ తన తండ్రి దగ్గర ఉన్నాడు. యెహోవా దేవుడు మొదటి మానవుడ్ని సృష్టించినప్పుడు, ఆయన కుమారుడు ప్రధానశిల్పిగా ఆ పనిలో ఆయనతోపాటు పనిచేశాడు. (ఆదికాండము 1:​26) దేవుని కుమారుడు మానవులపట్ల అత్యంతాసక్తి కల్గివుండడంలో, వాళ్లను చూసి ఆనందించడంలో ఆశ్చర్యమేమీలేదు!

“నా ఉపదేశము వినువారు ధన్యులు”

మూర్తీభవించిన జ్ఞానముగా దేవుని కుమారుడు ఇలా అంటున్నాడు: “పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గముల ననుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి. అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును; నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.”​—⁠సామెతలు 8:32-36.

యేసుక్రీస్తు మూర్తీభవించిన దేవుని జ్ఞానం. “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.” (కొలొస్సయులు 2:⁠3) కాబట్టి అలక్ష్యంచేయకుండా ఆయన ఉపదేశాల్ని విని, ఆయన్ని సన్నిహితంగా అనుసరిద్దాం. (1 పేతురు 2:​21) “మరి ఎవనివలనను రక్షణ కలుగదు” గనుక ఆయన్ని తిరస్కరించడమంటే మనకు మనం హానిని కలుగజేసుకొని, మరణాన్ని ప్రేమించడమేనని అర్థం. (అపొస్తలుల కార్యములు 4:​12) నిస్సందేహంగా, మన రక్షణ కోసం దేవుడు అనుగ్రహించినవానిగా యేసును అంగీకరిద్దాం. (మత్తయి 20:28; యోహాను 3:​16) ఆ విధంగా, ‘జీవాన్ని కనుగొని యెహోవా కటాక్షాన్ని’ పొందడం మూలంగా వచ్చే సంతోషాన్ని అనుభవిస్తాం.

[అధస్సూచీలు]

^ పేరా 6 “జ్ఞానము” కోసం ఉపయోగించబడిన హెబ్రీ పదం స్త్రీలింగంలో ఉంది. అందుకని, కొన్ని అనువాదాలు జ్ఞానాన్ని సూచించేటప్పుడు స్త్రీలింగ సర్వనామాల్ని వాడుతాయి.

^ పేరా 25 “జ్ఞానం” కోసం ఉపయోగించబడిన హెబ్రీ పదం అన్ని వేళలా స్త్రీలింగాన్నే సూచిస్తుందన్న వాస్తవం, దేవుని కుమారునికి ప్రాతినిథ్యం వహించేలా జ్ఞానాన్ని ఉపయోగించడంతో విభేదించదు. “దేవుడు ప్రేమాస్వరూపి” అనే పదబంధంలో ఉన్న “ప్రేమ” కోసం ఉపయోగించబడిన గ్రీకు పదం కూడా స్త్రీలింగ రూపంగల పదమే. (1 యోహాను 4:⁠8) అయినప్పటికీ, దేవుణ్ణి సూచించేందుకు అది ఉపయోగించబడింది.

[26వ పేజీలోని చిత్రాలు]

జ్ఞానం, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారికి అత్యంతావశ్యకం

[27వ పేజీలోని చిత్రాలు]

జ్ఞానాన్ని పెంపొందించే ఏర్పాట్లను అలక్ష్యం చేయకండి