కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధైర్యంగా యథార్థతను కాపాడుకున్న వ్యక్తులు, నాజీ హింసపై విజయం సాధించారు

ధైర్యంగా యథార్థతను కాపాడుకున్న వ్యక్తులు, నాజీ హింసపై విజయం సాధించారు

సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి

ధైర్యంగా యథార్థతను కాపాడుకున్న వ్యక్తులు, నాజీ హింసపై విజయం సాధించారు

“నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామెతలు 27:​11) దేవుని తెలివైన ప్రాణులు యెహోవా పట్ల నమ్మకంగానూ, యథార్థంగానూ ఉండగలరు గనుక వారు ఆయన హృదయాన్ని సంతోషపర్చగలరని ఆ హృదయపూర్వక విజ్ఞప్తి బయల్పరుస్తోంది. (జెఫన్యా 3:​17) అయినప్పటికీ, నిందించువాడైన సాతాను, యెహోవా సేవ చేస్తున్న వారి యథార్థతను తునాతునకలు చేయాలన్న కృతనిశ్చయతతో ఉన్నాడు.​—⁠యోబు 1:​10, 11.

విశేషంగా 20వ శతాబ్దపు తొలి సంవత్సరాల నుంచీ అంటే, తాను పరలోకంలో నుంచి భూమిపైకి పడద్రోయబడినప్పటి నుంచీ సాతాను యెహోవా ప్రజల పట్ల క్రోధాన్ని అధికంగా వెళ్లగ్రక్కుతున్నాడు. (ప్రకటన 12:​10, 12) అయినా, నిజ క్రైస్తవులు “సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా” ఉన్నారు, దేవుని పట్లగల తమ యథార్థతను కాపాడుకున్నారు. (కొలొస్సయులు 4:​12) యథార్థతను కాపాడుకున్న అలాంటి విశిష్టమైన మాదిరిని అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ముందూ, యుద్ధం జరుగుతున్న కాలంలోనూ జర్మనీలో ఉన్న యెహోవాసాక్షుల విశిష్టమైన మాదిరిని మనం క్లుప్తంగా పరిశీలిద్దాం.

ఉత్సాహవంతమైన క్రియాశీలత యథార్థతా పరీక్షలకు నడిపించింది

1920లలోనూ, 1930ల తొలి సంవత్సరాల్లోనూ బెబల్‌పొషర్‌​—⁠అప్పట్లో యెహోవాసాక్షులు జర్మనీలో అలా పిలవబడేవారు​—⁠బైబిలు సాహిత్యాలను అధిక మొత్తంలో పంచిపెట్టారు. 1919 నుంచి 1933 సంవత్సరాల మధ్య కాలంలో వాళ్లు జర్మనీలో నివసించే ప్రతీ కుటుంబానికి సగటున ఎనిమిది పుస్తకాలనూ, చిన్న పుస్తకాలనూ, లేదా పత్రికలనూ అందించారు.

ఆ సమయంలో, క్రీస్తు అభిషిక్త అనుచరులు అధిక సంఖ్యలో ఉన్న దేశాల్లో జర్మనీ ఒకటి. నిజానికి, 1933 లో ప్రభురాత్రి భోజనంలో ప్రపంచవ్యాప్తంగా పాలుపంచుకున్న 83,941 మందిలో దాదాపు 30 శాతం మంది జర్మనీలో నివసిస్తున్న వారే. ఎంతోకాలం గడవక ముందే ఈ జర్మన్‌ సాక్షులు తీవ్రమైన యథార్థతా పరీక్షలను ఎదుర్కొన్నారు. (ప్రకటన 12:17; 14:​12) పరిస్థితులు, ఉద్యోగాల నుంచి తీసివేయడం, ఇళ్లపై ఆకస్మిక దాడులు చేయడం, స్కూళ్ల నుంచి బహిష్కరించడం వంటివాటి నుంచి చితకకొట్టడం, అరెస్టులు చేయడం, జైళ్లో వేయడం వంటివాటికి చాలా త్వరగా మారిపోయాయి. (చిత్రం 1) తత్ఫలితంగా, రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసిన సంవత్సరాల్లో కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో నిర్బంధించబడిన వారిలో 5 నుంచి 10 శాతం వరకూ యెహోవాసాక్షులే ఉన్నారు.

నాజీలు సాక్షులను ఎందుకు హింసించారు?

అయితే, నాజీ సామ్రాజ్యపు రౌద్రాన్ని యెహోవాసాక్షులు ఎందుకు రెచ్చగొట్టారు? “నాజీ ప్రభుత్వం అడుగుతున్న ప్రతీదాన్నీ చేయడానికి మ్రొగ్గుచూపించేందుకు” ఒప్పుకోనందున సాక్షులు హింసాలక్ష్యంగా మారారు అని హిట్లర్‌​—⁠1889-1936: దురహంకారం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో చరిత్ర ప్రొఫెసర్‌ అయిన ఈన్‌ కర్షొ పేర్కొంటున్నారు.

సాక్షులు “హింసలోగానీ, సైనిక శక్తిలోగానీ భాగంవహించడానికి నిరాకరించారు. . . . సాక్షులు రాజకీయ తటస్థ వైఖరినందు నమ్మకముంచారు, అంటే హిట్లర్‌కు ఓటు వేయలేదనీ, హిట్లర్‌కు సెల్యూట్‌ చేయలేదనీ దానర్థం” అని చరిత్ర ప్రొఫెసర్‌ రాబర్ట్‌ పి. ఇరిక్‌సన్‌, జ్యూయిష్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ సుజనా హెషెల్‌ల సంపాదకత్వంలో ముద్రించబడిన బిట్రేయల్‌​—⁠జర్మన్‌ చర్చెస్‌ అండ్‌ ద హోలోకాస్ట్‌ అనే పుస్తకం వివరించింది. అలా చేయడం, నాజీల కోపాన్ని రెచ్చగొట్టి, సాక్షుల్ని అపాయకరమైన స్థితిలో పడవేసింది ఎందుకంటే “జాతీయ సాంఘికవాదం అలాంటి తిరస్కారాన్ని సహించబోదు” అని అదే పుస్తకం చెబుతోంది.

ప్రపంచవ్యాప్త అసమ్మతి, మూకుమ్మడి దాడి

1934 ఫిబ్రవరి 9న ఆ కాలంలో సేవలో అగ్రగామిగా ఉన్న జోసెఫ్‌. ఎఫ్‌. రూథర్డ్‌ఫర్డ్‌ నాజీ అసహనానికి ప్రతిస్పందనగా ఒక అసమ్మతి ఉత్తరాన్ని ప్రత్యేక దూత ద్వారా హిట్లర్‌కు పంపించారు. (చిత్రం 2) రూథర్డ్‌ఫర్డ్‌ ఉత్తరాన్ని అనుసరించి జర్మనీతోపాటు 50 దేశాల్లో ఉన్న యెహోవాసాక్షులు 1934 అక్టోబరు 7న అసమ్మతిని తెలియజేసే ఉత్తరాలనూ, టెలిగ్రామ్‌లనూ దాదాపు 20,000 వరకు హిట్లర్‌కు పంపించారు.

దానికి ప్రతిస్పందనగా నాజీలు తమ హింసను తీవ్రతరం చేశారు. 1935 ఏప్రిల్‌ 1న దేశవ్యాప్తంగా సాక్షులను నిషేధించారు. 1936 ఆగస్టు 28న గెస్టపో వారిపై మూకుమ్మడి దాడిని ప్రారంభించింది. అయినప్పటికీ, సాక్షులు “కరపత్రాలను పంచిపెడుతూనే ఉన్నారు, మరలా పంచిపెట్టలేనప్పుడు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు” అని బిట్రేయల్‌​—⁠జర్మన్‌ చర్చెస్‌ అండ్‌ ద హోలోకాస్ట్‌ పేర్కొంటోంది.

ఉదాహరణకు, గెస్టపో నిఘా తీవ్రంగా ఉన్నా దానికి తెలియకుండా 1936 డిసెంబరు 12న దాదాపు 3,500 మంది సాక్షులు తాము అనుభవిస్తున్న అనుచితమైన పరిస్థితిని గురించిన ఒక ముద్రిత తీర్మాన పత్రం ప్రతులను వేలకొలదిగా పంచిపెట్టారు. ఈ క్యాంపెయిన్‌ను గురించి కావలికోట ఇలా నివేదించింది: “విశ్వసనీయులైన పనివారల వర్ణించనశక్యమైన ఆనందానికి అదొక గొప్ప విజయం, శత్రువు గుండెల్లో దిగిన బాకు.”​—⁠రోమీయులు 9:⁠17.

హింస విఫలమయ్యింది!

యెహోవాసాక్షుల కోసమైన నాజీ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉండేవి. 1939 నాటికి, వారిలో ఆరువేల మంది జైళ్ళలో వేయబడ్డారు, వేలాదిమందిని కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో వేశారు. (చిత్రం 3) రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ఎటువంటి పరిస్థితి ఉంది? జైళ్లలో వేయబడిన వారిలో దాదాపు 2,000 మంది సాక్షులు చనిపోయారు, వారిలో 250 మంది కన్నా ఎక్కువ మందిని ఉరి తీశారు. అయినప్పటికీ, “కష్టాలను ఎదుర్కొన్నా యెహోవాసాక్షుల్లో ఎక్కువ మంది తమ విశ్వాసాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు” అని ప్రొఫెసర్లు రాబర్ట్‌ పి. ఇరిక్‌సన్‌, సుజనా హెషెల్‌లు రాశారు. తత్ఫలితంగా, హిట్లర్‌ పరిపాలన కుప్పకూలిపోయినప్పుడు, కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో నుంచి వెయ్యికన్నా ఎక్కువమంది సాక్షులు విజయోత్సాహంతో బయటకు వచ్చారు.​—⁠చిత్రం 4; అపొస్తలుల కార్యములు 5:38, 39; రోమీయులు 8:35-37.

హింసను తాళుకోవడానికి యెహోవా ప్రజలకు శక్తినిచ్చిందేమిటి? కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపు నుంచి సజీవంగా బయటికి వచ్చిన అఢాల్పొ అర్నాల్డ్‌ ఇలా వివరిస్తున్నారు: “బలహీనులై కృంగిపోయిన స్థితిలో మీరు ఉన్నప్పటికీ యెహోవా మిమ్మల్ని చూస్తాడు, మీరేమి అనుభవిస్తున్నారో ఆయనకు తెలుసు, ఆ పరిస్థితిని అధిగమించి విశ్వసనీయంగా ఉండడానికి అవసరమైన బలాన్ని మీకు ఇస్తాడు. ఆయన చెయ్యి బలపర్చలేనంత కురచకాలేదు.”

విశ్వాసులైన ఆ క్రైస్తవులకు జెఫన్యా ప్రవక్త మాటలు ఎంత చక్కగా అన్వయిస్తాయో కదా! ఆయన ఇలా తెలియజేశాడు: “నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును.” (జెఫన్యా 3:​17) నేటి సత్యదేవుని ఆరాధకులందరూ నాజీ హింసను ఎదుర్కోవడంలో యథార్థతను కాపాడుకున్న ఆ నమ్మకమైన సాక్షుల విశ్వాసాన్ని అనుసరిస్తూ, అదేవిధంగా యెహోవా హృదయాన్ని ఆనందపర్చాలి!​—⁠ఫిలిప్పీయులు 1:12-14.

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

Państwowe Muzeum Oświȩcim-Brzezinka, courtesy of the USHMM Photo Archives