మానవ బలహీనతలపై విజయం సాధించడం
మానవ బలహీనతలపై విజయం సాధించడం
“శరీరానుసారమైన మనస్సు మరణము.”—రోమీయులు 8:5.
1. కొందరు మానవ శరీరాన్ని ఎలా దృష్టిస్తారు, ఏ ప్రశ్న పరిశీలించదగినదై ఉంది?
“నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (కీర్తన 139:14) కీర్తనకర్తయైన దావీదు, యెహోవా సృష్టిలో ఒకటైన మానవుని శరీర నిర్మాణాన్ని గురించి ఆలోచించినప్పుడు అలా పాడాడు. కారణసహితమైన అలాంటి చక్కని స్తుతిని చెల్లించడానికి బదులు, కొందరు మతబోధకులు శరీరాన్ని పాపం దాగి ఉండే స్థలంగా, పాపం చేతిలో పావుగా పరిగణిస్తారు. శరీరం “అజ్ఞానాన్ని మరుగు చేసే వస్త్రమనీ, దుర్గుణానికి పునాది అనీ, అవినీతి సంకెళ్ళనీ, అంధకారపు బందిఖానా అనీ, జీవచ్ఛవమనీ, కదిలే శవమనీ, నడిచే సమాధియనీ” పిలువబడుతోంది. “నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని” అపొస్తలుడైన పౌలు అన్నాడన్నది నిజమే. (రోమీయులు 7:18) అయితే, ఏవిధమైన నిరీక్షణా లేకుండా మనం పాపభరితమైన శరీరంలో చిక్కుకుపోయామని దాని అర్థమా?
2. (ఎ) ‘శరీరాన్ననుసరించడం’ అంటే ఏమిటి? (బి) దేవుణ్ణి ప్రీతిపరచాలని కోరుకునే మానవుల్లో ‘శరీరానికీ’, “ఆత్మ”కూ మధ్య ఎటువంటి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది?
2 తిరుగుబాటుదారుడైన ఆదాము యొక్క పాపభరిత సంతానంగా అపరిపూర్ణ స్థితిలో ఉన్న మానవులను సూచించేందుకు లేఖనాలు కొన్నిసార్లు “శరీరము” అనే మాటను ఉపయోగిస్తాయి. (ఎఫెసీయులు 2:3; కీర్తన 51:5; రోమీయులు 5:12) ఆయననుండి మనం పొందిన వారసత్వం మూలంగా మనకు “శరీర బలహీనత” కలిగింది. (రోమీయులు 6:19) “శరీరానుసారమైన మనస్సు మరణము” అని పౌలు హెచ్చరించాడు. (రోమీయులు 8:5) ‘శరీరాన్ననుసరించడం’ అంటే పాపభరితమైన శరీర కోరికల చేత నియంత్రించబడడమనీ, పురికొల్పబడడమనీ అర్థం. (1 యోహాను 2:16) కాబట్టి మనం దేవుణ్ణి ప్రీతిపరచాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మన ఆధ్యాత్మికతకూ, “శరీరకార్యములు” చేయాలని ఎడతెగక ఒత్తిడి చేసే మన పాపభరిత స్వభావానికీ మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. (గలతీయులు 5:17-23; 1 పేతురు 2:11) పౌలు తనలో జరుగుతున్న ఈ బాధాకరమైన సంఘర్షణను గురించి వివరించిన తర్వాత, “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” అని అన్నాడు. (రోమీయులు 7:24) అపొస్తలుడైన పౌలు, తప్పు చేయాలన్న శోధన నుండి తప్పించుకోలేని ఎరగా ఉన్నాడా? ఆయన అలా తప్పించుకోలేని ఎరగా లేడన్న సమాధానాన్ని బైబిలు నొక్కి చెబుతుంది!
శోధనా పాపమూ గురించిన వాస్తవికత
3. అనేకులు పాపాన్నీ శోధననూ ఎలా దృష్టిస్తారు, అలాంటి దృక్పథాన్ని గురించి బైబిలు ఏమని హెచ్చరిస్తుంది?
3 నేడు అనేకులకు, పాపం అనేది అంగీకరించలేని తలంపుగా ఉంది. “పాపం” అనే మాటను పాతకాలపు మాటగా కొందరు వ్యంగ్యంగా ఉపయోగిస్తారు, ఏవైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే పాపం చేశానంటారు. “తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును” అని వాళ్ళు గ్రహించడం లేదు. (2 కొరింథీయులు 5:10) “శోధనను తప్ప నేను దేన్నైనా ఎదిరించగలను!” అని ఇతరులు తేలిగ్గా అనవచ్చు. ఆహారం, లైంగికత, సరదాలు లేదా కార్యసాధన వంటి ఏ విషయాల్లో అయినా సరే తమకు కలిగే కోరికను వెంటనే తీర్చుకునే సంస్కృతిలో కొందరు జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళు ప్రతి దాన్నీ కోరుకుంటారు, అదీ తక్షణమే కావాలని కోరుకుంటారు! (లూకా 15:12) వాళ్ళు క్షణికానందానికి మించి భవిష్యత్తులో రానున్న ‘వాస్తవమైన జీవిత’ ఆనందాన్ని చూడరు. (1 తిమోతి 6:18) అయితే, జాగ్రత్తగా ఆలోచించాలని, దూరదృష్టి గలవారై ఉండాలని, ఆధ్యాత్మికంగా గానీ, మరే విధంగా గానీ మనకు హాని కలిగించే దేనినైనా నివారించుకోవాలని బైబిలు మనకు బోధిస్తుంది. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అని ప్రేరేపిత సామెత ఒకటి చెబుతోంది.—సామెతలు 27:12.
4. మొదటి కొరింథీయులు 10:12, 13లలో పౌలు మనకు ఏ ఉపదేశాన్నిచ్చాడు?
4 నైతికంగా దిగజారిన నగరంగా పేరు గాంచిన కొరింథులో నివసిస్తున్న క్రైస్తవులకు తాను వ్రాసిన పత్రికలో, శోధననూ పాపపు శక్తినీ ఎదిరించమని వాస్తవికమైన ఒక హెచ్చరికను పౌలు ఇచ్చాడు. “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును” అని ఆయన అన్నాడు. (1 కొరింథీయులు 10:12, 13) మనమందరమూ, పెద్దవారమైనా చిన్నవారమైనా ఆడవారమైనా మగవారమైనా పాఠశాలల్లో, పనిచేసే చోటా, మరితర చోట్లా అనేక శోధనలకు గురవుతుంటాం. కనుక, పౌలు మాటలను పరిశీలించి, అవి మన విషయంలో ఏ అర్థాన్ని కలిగివున్నాయో చూద్దాం.
మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండకండి
5. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎందుకు ప్రమాదకరం?
5 “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను” అని పౌలు పేర్కొంటున్నాడు. మన నైతిక బలాన్ని గురించి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కల్గివుండడం ప్రమాదకరం. అది పాపపు స్వభావాన్ని గురించీ, దాని శక్తిని గురించీ సరైన అవగాహన లేకపోవడాన్ని వెల్లడిచేస్తుంది. మోషే, దావీదు, సొలొమోను, అపొస్తలుడైన పేతురులాంటి వాళ్ళే పాపంలో పడిపోగా, మనం పాపానికి అతీతులమని భావించాలా? (సంఖ్యాకాండము 20:2-13; 2 సమూయేలు 11:1-27; 1 రాజులు 11:1-6; మత్తయి 26:69-75) “జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును” అని సామెతలు 14:16 చెబుతుంది. అంతేకాక, “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని” యేసు చెప్పాడు. (మత్తయి 26:41) అపరిపూర్ణులైన మానవుల్లో ఎవరూ కూడా చెడు కోరికలకు అతీతులు కారు కనుక, పౌలు ఉపదేశాన్ని మనం గంభీరంగా తీసుకుంటూ, శోధనలను ఎదిరించవలసిన అవసరం ఉంది. అలా ఎదిరించకపోతే మనం పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది.—యిర్మీయా 17:9.
6. శోధనలను ఎదిరించడానికి మనం ఎప్పుడు ఎలా సిద్ధపడాలి?
6 అకస్మాత్తుగా రాగల కష్టాల కోసం ముందే సిద్ధపడడం తెలివైన పని. రాజైన ఆసా, రక్షణదుర్గాలను నిర్మించుకోవడానికి నెమ్మదిగా ఉన్న సమయమే సరైన సమయమని గుర్తించాడు. (2 దినవృత్తాంతములు 14:2, 6, 7) దాడి జరిగే సమయంలో రక్షణదుర్గాలను నిర్మించుకోవడానికి సిద్ధపడడం వల్ల ఒరిగేదేమీ ఉండదని ఆయనకు తెలుసు. అలాగే, శోధనలకు గురైనప్పుడు ఏం చెయ్యాలన్న దాని గురించిన నిర్ణయాలను, సమస్యలేమీ లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో తీసుకోవడమే ఉత్తమం. (కీర్తన 63:4) దానియేలూ, దైవభయంగల ఆయన స్నేహితులూ, యెహోవా ధర్మశాస్త్రానికి తాము నమ్మకంగా ఉంటామన్న నిర్ణయాన్ని రాజరికపు కమ్మని భోజనాన్ని తినడానికి తాము ఒత్తిడి చేయబడడానికి ముందే తీసుకున్నారు. కనుక, వాళ్ళు తమ నమ్మకాలకు అంటిపెట్టుకొని ఉండడానికీ వెనుకంజవేయలేదు; అపవిత్రమైన భోజనం చేయనూ లేదు. (దానియేలు 1:8) మనం నైతికంగా పవిత్రంగా ఉండాలన్న మన తీర్మానాన్ని మనం శోధనలకు గురికాకముందే దృఢపరచుకుందాం. అప్పుడు మనం పాపాన్ని ఎదిరించగల్గుతాం.
7. శోధనలను ఇతరులు విజయవంతంగా అధిగమించారని తెలుసుకోవడం ఎందుకు ఊరట కలిగిస్తుంది?
7 “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు” అని పౌలు అన్న మాటల నుండి 1 కొరింథీయులు 10:13) “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని [అపవాదిని] ఎదిరించుడి” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (1 పేతురు 5:9) అవును, ఇతరులు కూడా అటువంటి శోధనలను ఎదుర్కొన్నప్పుడు, దేవుని సహాయంతో వాటిని విజయవంతంగా ఎదిరించారు, మనం కూడా అలాగే ఎదిరించగలం. అయినప్పటికీ, దిగజారిన లోకంలో నివసిస్తున్న నిజ క్రైస్తవులముగా మనమందరమూ ఎప్పుడో ఒకప్పుడు తప్పక శోధనలకు గురౌతామని నిరీక్షించవచ్చు. అయితే, మానవ బలహీనతపైనా ఫలానిది చేయడం పాపం అని తెలిసినా అది చెయ్యాలనిపించే శోధనపైనా విజయం సాధించగలమన్న నమ్మకాన్ని మనమెలా కలిగి ఉండగలం?
మనమెంత ఊరట పొందుతామో కదా! (శోధనలకు దూరంగా ఉండగలం!
8. శోధనలను నివారించుకోగల ప్రాథమిక మార్గం ఏమిటి?
8 “పాపమునకు దాసులము కాకుండుటకు” ప్రాథమిక మార్గం, సాధ్యమైనంత మేరకు శోధనలను నివారించుకోవడమే. (రోమీయులు 6:6) “భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము” అని సామెతలు 4:14, 15 వచనాలు మనకు బోధిస్తున్నాయి. ఫలానా పరిస్థితులు పాపం చేయడానికి మనలను నడిపించగలవని మనకు తరచూ ముందుగానే తెలుస్తూ ఉంటుంది. కనుక, మనలో తప్పుడు కోరికలను పుట్టించి, అపవిత్రమైన వ్యామోహాన్ని రేకెత్తించే ఏ వ్యక్తి నుండైనా, దేన్నుండైనా, ఏ స్థలం నుండైనా దూరంగా “తొలగి”పోవడమే క్రైస్తవులముగా మనం చేయగల పని అని స్పష్టమవుతుంది.
9. శోధన నుండి పారిపోవాలన్న విషయాన్ని లేఖనాలు ఎలా నొక్కి చెబుతున్నాయి?
9 శోధనపై విజయం సాధించే మరో ప్రాథమిక మార్గం శోధించే పరిస్థితి నుండి పారిపోవడమే. “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని పౌలు ఉపదేశించాడు. (1 కొరింథీయులు 6:18) “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” అని కూడా ఆయన వ్రాశాడు. (1 కొరింథీయులు 10:14) ఆ అపొస్తలుడు, సిరిసంపదల కోసమైన తీవ్ర వాంఛ నుండి, అలాగే “యౌవనేచ్ఛలనుండి” పారిపొమ్మని కూడా తిమోతిని హెచ్చరించాడు.—2 తిమోతి 2:22; 1 తిమోతి 6:9-11.
10. లైంగిక శోధన నుండి పారిపోవడంలో ఉన్న విలువను పరస్పర విరుద్ధమైన ఏ రెండు ఉదాహరణలు చూపుతున్నాయి?
10 ఇశ్రాయేలు రాజైన దావీదు విషయమే తీసుకోండి. ఆయన తన భవనపు మిద్దె మీది నుండి చూసినప్పుడు, అందమైన ఒక స్త్రీ స్నానం చేయడం కనిపించింది, అప్పుడు ఆయన హృదయం తప్పుడు కోరికలతో నిండిపోయింది. ఆయన ఆ మిద్దె మీది నుండి క్రిందికి వెళ్ళిపోయి, లైంగిక శోధన నుండి పారిపోవాల్సింది. దానికి బదులు, ఆయన బత్షెబ అనే ఆ స్త్రీ గురించి వాకబు చేశాడు, దాని తర్వాత కలిగిన పర్యవసానాలు చాలా వినాశకరమైనవి. (2 సమూయేలు 11:1–12:23) మరొకవైపు, అనైతిక స్త్రీయైన తన యజమానుని భార్య తనతో శయనించమని బలవంతం చేసినప్పుడు యోసేపు ఎలా ప్రవర్తించాడు? “దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు” అని ఆ వృత్తాంతం మనకు చెబుతుంది. మోషే ధర్మశాస్త్ర కట్టడలు అప్పటికింకా ఇవ్వబడలేదు. అప్పట్లో ధర్మశాస్త్ర కట్టడలు లేకపోయినా సరే, యోసేపు “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని” ఆమెతో అన్నాడు. అయితే, ఒకనాడు ఆమె ఆయన్ని పట్టుకొని “తనతో శయనింపుమని” కోరింది. అప్పుడు యోసేపు అక్కడే నిలబడి ఆమెతో తర్కించడానికి ప్రయత్నించాడా? లేదు. ఆయన ‘తప్పించుకొని బయటికి పారిపోయాడు.’ లైంగిక శోధన తనను లోబర్చుకునేందుకు ఆయన తావివ్వలేదు. ఆయన పారిపోయాడు!—ఆదికాండము 39:7-16.
11. ఒక శోధనకు పదే పదే గురౌతున్నట్లయితే, దాన్ని తిరస్కరించేందుకు బహుశా ఏమి చేయడం సాధ్యమౌతుంది?
11 శోధన నుండి పారిపోవడం అనేది పిరికితనంగా కొన్నిసార్లు పరిగణించబడినప్పటికీ, ఒకానొక పరిస్థితి నుండి మనం అక్షరార్థంగా తప్పుకోవడమనేది తరచూ తెలివైన పనౌతుంది. బహుశా, ఉద్యోగ స్థలంలో మనం పదే పదే ఒక శోధనకు గురౌతున్నామనుకోండి. బహుశా మనం మన ఉద్యోగాలను మార్చుకోలేక పోయినప్పటికీ, శోధించే పరిస్థితుల నుండి మనం తప్పుకోవడానికి వేరే మార్గాలు ఉండవచ్చు. మనకు తప్పని తెలిసిన దేన్నుండైనా సరే మనం పారిపోవలసిన అవసరం ఉంది; సరైనది మాత్రమే చేయాలని మనం దృఢ నిశ్చయం చేసుకోవాలి. (ఆమోసు 5:15) ఇతరత్రా విషయాల్లో శోధనలను తప్పించుకునేందుకు, అశ్లీలమైన ఇంటర్నెట్ సైట్లనూ, సందేహాస్పదమైన వినోద స్థలాలనూ విడిచిపెట్టడం అవసరమౌతుంది. అంతేకాక, అశ్లీల సాహిత్యాన్ని నాశనం చేయడమూ లేదా దేవుణ్ణి ప్రేమించే, మనకు సహాయం చేయగలిగే క్రొత్త స్నేహితులను కనుగొనడమూ కూడా అవసరమౌతుంది. (సామెతలు 13:20) పాపం చేసేలా మనలను శోధించే దేన్నైనా సరే, మనం దృఢనిశ్చయంతో తిరస్కరిస్తే వివేకులమన్నమాట.—రోమీయులు 12:9.
ప్రార్థన ఎలా సహాయపడగలదు?
12. ‘మమ్మును శోధనలోకి తేవొద్దు’ అని మనం ప్రార్థిస్తున్నామంటే మనం దేవుణ్ణి ఏమని అడుగుతున్నట్లు?
12 “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును” అన్న హృదయానందకరమైన అభయాన్ని పౌలు ఇస్తున్నాడు. (1 కొరింథీయులు 10:13) యెహోవా మనకు సహాయం చేసే ఒక మార్గం ఏమిటంటే, శోధనను తాళుకొని నిలబడేందుకు ఆయన సహాయాన్నర్థిస్తూ మనం చేసే ప్రార్థనలకు జవాబివ్వడమే. “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము” అని ప్రార్థించమని యేసు మనకు బోధించాడు. (మత్తయి 6:13) అలాంటి హృదయపూర్వకమైన ప్రార్థనకు యెహోవా ప్రతిస్పందిస్తూ, మనం శోధనలో లేదా ప్రలోభంలో పడిపోకుండా కాపాడతాడు; సాతాను నుండీ వాడి కుయుక్తుల నుండీ మనలను విడిపిస్తాడు. (ఎఫెసీయులు 6:11) శోధనలను గుర్తించేందుకూ, వాటిని ఎదిరించే శక్తిని కలిగివుండేందుకూ సహాయం చేయమని మనం దేవుణ్ణి ప్రార్థించాలి. మనం శోధించబడినప్పుడు దానికి లొంగిపోయేలా మనల్ని అనుమతించవద్దని మనం ఆయనను వేడుకున్నట్లయితే, మనం ‘దుష్టుడైన’ సాతాను చేతికి చిక్కకుండా ఉండేలా ఆయన మనకు సహాయం చేస్తాడు.
13. మనం ఒక శోధనకు ఎడతెగక గురవుతున్నప్పుడు ఏమి చేయాలి?
13 ముఖ్యంగా మనం ఏదైనా ఒక శోధనకు ఎడతెగక గురవుతున్నప్పుడు మనం పట్టు విడవకుండా ప్రార్థించడం అవసరం. మనం నిజంగా ఎంత బలహీనులమన్న విషయాన్ని మనకు గుర్తు చేసేటువంటి తలంపులతో దృక్పథాలతో మనలో అంతర్గతంగా తీవ్రమైన సంఘర్షణలు జరిగేందుకు కొన్ని శోధనలు కారణమవుతాయి. (కీర్తన 51:5) ఉదాహరణకు, మన మునుపటి చెడు అలవాట్లను గురించిన జ్ఞాపకాలు మనలను పట్టి పీడిస్తున్నట్లయితే, మనమేమి చేయగలం? మనం తిరిగి ఆ చెడు అలవాట్లకు లోనయ్యే శోధనకు గురవుతున్నట్లయితే, అప్పుడేం చేయాలి? అలాంటి ఆలోచనలను అణచివేయడానికి కేవలం ప్రయత్నించడమే కాక, ఆ విషయాన్ని ప్రార్థనలో యెహోవా ముందు పెట్టండి—అవసరమైతే ఆ విషయాన్ని గురించి మళ్ళీ మళ్ళీ ప్రార్థించండి. (కీర్తన 55:22) అపవిత్రమైన విషయాలకు మొగ్గు చూపే మన మనస్సును పవిత్రపరచుకునేందుకు ఆయన తన వాక్య బలం ద్వారా, తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు సహాయం చేయగలడు.—కీర్తన 19:8, 9.
14. శోధనను తట్టుకొని నిలబడేందుకు ప్రార్థన ఎందుకు అవసరం?
14 గెత్సేమనే తోటలో తన అపొస్తలులు నిద్రమత్తులో ఉండడం గమనించి, “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని” యేసు బోధించాడు. (మత్తయి 26:41) శోధనను అధిగమించే ఒక మార్గం ఏమిటంటే, శోధన సంతరించుకునే వివిధ రూపాల విషయంలో అప్రమత్తంగా ఉండి, త్వరగా కనిపించని దాని స్వభావాలను గుర్తించడమే. ఆలస్యం చేయకుండా ఆ శోధనను గురించి యెహోవాకు ప్రార్థన చేయడం కూడా ముఖ్యం. అలాగైతే దానితో పోరాడేందుకు మనం ఆధ్యాత్మికంగా సంసిద్ధులమవ్వగల్గుతాం. మనం ఏ విషయంలో బలహీనంగా ఉంటామో ఆ విషయంలోనే శోధనకు గురవుతుంటాం కనుక, మనం దానిని ఒంటరిగా ఎదిరించలేం. దేవుడిచ్చే బలం, మనం సాతానును ఎదిరించి నిలబడేందుకు మనకు మద్దతునివ్వగలదు కనుక ప్రార్థన చాలా ముఖ్యం. (ఫిలిప్పీయులు 4:6, 7) “సంఘపు పెద్దల” ఆధ్యాత్మిక సహాయమూ, ప్రార్థనలూ కూడా మనకు అవసరం కావచ్చు.—యాకోబు 5:13-18.
శోధనను గట్టిగా ఎదిరించండి
15. శోధనలను ఎదిరించడంలో ఏమి ఇమిడి ఉంది?
15 సాధ్యమైనప్పుడల్లా, శోధనను నివారించుకోవడమే కాక, అది పూర్తిగా తొలగిపోయే వరకు లేదా పరిస్థితి మారే వరకు మనం తప్పనిసరిగా గట్టిగా ఎదిరించాలి. అపవాదియైన సాతాను తనను శోధించాలని చూసినప్పుడు, వాడు వదిలి వెళ్ళిపోయేంత వరకూ యేసు ఎదిరించాడు. (మత్తయి 4:1-11) “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకోబు 4:7) అలా ఎదిరించడం అనేది, మన మనస్సును దేవుని వాక్యంతో బలపరచుకొని ఆయన ప్రమాణాలను అంటిపెట్టుకుంటామని గట్టిగా నిర్ణయించుకోవడంతో మొదలవుతుంది. మన నిర్దిష్ట బలహీనతలను గురించి చర్చించే ముఖ్య లేఖనాలను కంఠస్థం చేసుకుని వాటిని ధ్యానించడం మంచిది. పరిపక్వత గల ఒక క్రైస్తవుడ్ని, బహుశా ఒక పెద్దను కలవడం తెలివైన పని. ఆయనతో మన చింతలను పంచుకోవచ్చు, తప్పు చేయాలన్న శోధనకు గురవుతున్నప్పుడు ఆయన సహాయాన్ని కోరవచ్చు.—సామెతలు 22:17.
16. మనం నైతికంగా పరిశుభ్రంగా ఎలా కొనసాగగలం?
16 క్రొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోమని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. (ఎఫెసీయులు 4:24) మన వ్యక్తిత్వాన్ని మలచేందుకు, మనలను మార్చేందుకు యెహోవాను అనుమతించాలని దానర్థం. “నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము [“వెంటాడుము,” NW]. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి”తివి అని తన తోటి పనివాడైన తిమోతికి పౌలు వ్రాశాడు. (1 తిమోతి 6:11, 12) మనం దేవుని వ్యక్తిత్వాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా, ఆయన కోరేవిధంగా ప్రవర్తించడం ద్వారా మనం “నీతిని వెంటాడ”గలం. మన షెడ్యూల్ సువార్తను ప్రకటించడం, కూటాలకు హాజరు కావడం వంటి క్రైస్తవ కార్యకలాపాలతో నిండి ఉండడం కూడా ప్రాముఖ్యం. దేవునికి దగ్గరవుతూ ఆయన చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్ల నుండి పూర్తిగా ప్రయోజనం పొందడం, మనం ఆధ్యాత్మికంగా ఎదిగి నైతికంగా పరిశుభ్రంగా కొనసాగడానికి సహాయపడుతుంది.—యాకోబు 4:8.
17. శోధనకు గురైనప్పుడు దేవుడు మనలను ఎడబాయడని మనకెలా తెలుసు?
17 మనం ఏ శోధనకు గురైనా మనం దానితో వ్యవహరించేందుకు దేవుడు మనకిచ్చే శక్తికి మించినదై ఉండదని పౌలు అభయమిస్తున్నాడు. మనం శోధనను ‘సహించగలిగేలా దాన్ని తప్పించుకునే మార్గాన్ని’ యెహోవా ‘కలుగజేస్తాడు.’ (1 కొరింథీయులు 10:13) మనం యెహోవా మీద ఆధారపడడంలో కొనసాగుతున్నట్లయితే, మనం యథార్థతను కాపాడుకోలేనంతగా మనకున్న ఆధ్యాత్మిక బలం ఉడిగిపోయే మేరకు శోధన విజృంభించడానికి నిశ్చయంగా దేవుడు అనుమతించడు. ఆయన దృష్టిలో తప్పైన దాన్ని చేయాలన్న శోధనను గట్టిగా ఎదిరించడంలో మనం విజయవంతులం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాక, “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని ఆయన చేసిన వాగ్దానంపై మనం నమ్మకం ఉంచవచ్చు.—హెబ్రీయులు 13:5.
18. మానవ బలహీనతపై విజయం సాధించవచ్చన్న నిశ్చయతను మనం ఎందుకు కల్గివుండవచ్చు?
18 మానవ బలహీనతకు వ్యతిరేకంగా తాను వ్యక్తిగతంగా చేసే పోరాటంలో తుది ఫలితమేంటో పౌలుకు ఖచ్చితంగా తెలుసు. తన శరీర కోరికలకు గురయ్యే దయనీయమైన నిస్సహాయమైన పావుగా ఆయన తనను తాను ఎంచుకోలేదు. దానికి భిన్నంగా, “నేను గురి చూడనివానివలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను” అని ఆయన చెప్పాడు. (1 కొరింథీయులు 9:26, 27) అపరిపూర్ణ శరీరానికి వ్యతిరేకంగా మనం కూడా విజయవంతంగా పోరాడవచ్చు. మనం నీతియుక్తమైన మార్గాన్ని వెంబడించేందుకు మనకు సహాయపడే జ్ఞాపికలను లేఖనాల ద్వారా, బైబిలుపై ఆధారపడిన ప్రచురణల ద్వారా, క్రైస్తవ కూటాల ద్వారా, పరిపక్వతగల తోటి క్రైస్తవుల ద్వారా మన పరలోక తండ్రి ఎడతెగక ఇస్తున్నాడు. ఆయన సహాయంతో, మానవ బలహీనతపై మనం విజయం సాధించవచ్చు!
మీకు జ్ఞాపకమున్నాయా?
• ‘శరీరాన్ననుసరించడం’ అంటే ఏమిటి?
• శోధనకు గురికాక ముందే దానికోసం మనమెలా సిద్ధపడగలం?
• శోధనను తట్టుకొని నిలబడేందుకు మనం ఏం చేయగలం?
• శోధనతో వ్యవహరించడంలో ప్రార్థన ఏ పాత్రను నిర్వహిస్తుంది?
• మానవ బలహీనతపై విజయం సాధించడం సాధ్యమేనని మనకెలా తెలుసు?
[అధ్యయన ప్రశ్నలు]
[10వ పేజీలోని చిత్రాలు]
మనం మన శరీర కోరికలకు నిస్సహాయ బాధితులమని బైబిలు బోధించడంలేదు
[12వ పేజీలోని చిత్రం]
పాపం చేయకుండా దాన్ని నివారించుకునేందుకు ప్రాథమిక మార్గం శోధన నుండి పారిపోవడమే