కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు మేం ఒంటరిగా లేము

మా విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు మేం ఒంటరిగా లేము

మా విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు మేం ఒంటరిగా లేము

విక్కీ చక్కని ఆరోగ్యంతో ఆకర్షణీయంగా, జీవకళ ఉట్టిపడుతుండే అందమైన పాప. అవును, 1993 వసంత కాలంలో పాప పుట్టినప్పుడు, మా సంతోషానికి హద్దుల్లేకుండా పోయింది. స్వీడన్‌లో దక్షిణ ప్రాంతమందున్న ఒక చిన్న పట్టణంలో మేం నివసిస్తుండేవాళ్ళం. జీవితం అద్భుతంగా ఉండేది.

యితే విక్కీకి సంవత్సరమున్నర వయస్సున్నప్పుడు, మా చిన్ని ప్రపంచంలో అలజడి ప్రారంభమైనట్టు కనబడింది. పాపకు కొన్ని రోజులపాటు ఒంట్లో బాగోలేదు. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఎక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ లుకేమియాతో అంటే తెల్ల రక్త కణాలపై ప్రభావాన్ని చూపించే చిన్న పిల్లలకొచ్చే ఒక రకమైన క్యాన్సర్‌తో మా అమ్మాయి బాధపడుతోందని డాక్టర్‌ చెప్పిన క్షణాన్ని మేం ఎప్పటికీ మర్చిపోలేం.

ఆ భయంకరమైన రోగం మా చిన్నారి పాపకు వచ్చిందన్న వాస్తవాన్ని మేం జీర్ణించుకోలేక పోయాం. తన చుట్టూ ఉన్న లోకం గురించి ఇప్పుడిప్పుడే పాపకు తెలుస్తోంది, అంతలోనే ఆమె చనిపోతోంది. మమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ, దానికొక విజయవంతమైన చక్కని చికిత్స ఉందనీ, దాంట్లో రక్త మార్పిడులు అనేకసార్లు చేయాల్సిన కెమోథెరపీ చేరివుందనీ డాక్టరు చెప్పారు. అది మాకింకో షాక్‌.

మా విశ్వాసం పరీక్షించబడింది

మా పాపంటే మాకు ప్రాణం, ఆమెకు చక్కని వైద్య సహాయం లభ్యం కావాలని మేం కోరుకున్నాం. అయినప్పటికీ, రక్త మార్పిడులకు తలొగ్గే ప్రసక్తేలేదు. క్రైస్తవులు ‘రక్తాన్ని విసర్జించాలి’ అని స్పష్టంగా చెబుతున్న దేవుని వాక్యమైన బైబిల్ని మేము దృఢంగా నమ్ముతాం. (అపొస్తలుల కార్యములు 15:​28, 29) రక్త మార్పిడులు ప్రమాదభరితమైనవని కూడా మాకు తెలుసు. రక్త మార్పిడులు మూలంగా వేలాదిమంది లేని రోగాల్ని కొని తెచ్చుకొని, చివరకు మరణించారు. మాకున్న ఏకైక ప్రత్యామ్నాయం, రక్త మార్పిడుల్లేని అత్యంత నాణ్యవంతమైన చికిత్సే. ఈ విషయంలో మా విశ్వాస పోరాటం ఆరంభమైంది.

మేం ఏం చేయగలం? యెహోవాసాక్షుల స్వీడెన్‌ బ్రాంచ్‌ కార్యాలయంలో ఉన్న హాస్పిటల్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌కు ఫోన్‌చేసి, సహాయాన్ని అర్థించాం. * రక్త మార్పిడి లేకుండా కెమోథెరపీ చేయడానికి సుముఖత చూపించే హాస్పిటల్‌ కోసం, డాక్టర్‌ కోసం అన్వేషిస్తూ యూరప్‌లో ఉన్న వేర్వేరు హాస్పిటల్స్‌కు ఫాక్స్‌లు పంపించాం. మాకు సహాయం చేసేందుకు మా క్రైస్తవ సహోదరులు చేసిన ప్రయత్నాల్లో వాళ్లు చూపించిన శద్ధాసక్తులూ ప్రేమా మమ్మల్ని ఎంతో బలపర్చాయి. విశ్వాసం కోసం మేం చేసే పోరాటంలో వాళ్ళు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు.

కొన్ని గంటల్లోనే, జర్మనీలోని హామ్‌బర్గ్‌/సార్‌లో రక్తమార్పిడి లేకుండా చికిత్సచేసే ఒక ఆసుపత్రినీ, డాక్టర్నీ కనుగొనగలిగాం. మరుసటి రోజున విక్కీని పరీక్ష చేయించడానికి మేమక్కడికి చేరుకునేందుకు విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. మేమక్కడ దిగేసరికి హామ్‌బర్గ్‌లో ఉన్న యెహోవాసాక్షుల స్థానిక సంఘం నుంచి వచ్చిన మా క్రైస్తవ సహోదరులతోపాటు మా బంధువుల్లో కొందరు మా కోసం ఎదిరి చూస్తున్నారు. ఆసుపత్రి అనుసంధాన కమిటీ ప్రతినిధి మమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. ఆయన ఆసుపత్రికి మాతోపాటు వచ్చాడు, మాకు కావాల్సినంత మద్దతును ఇచ్చాడు. ఒక విదేశంలో కూడా మాకు మద్దతుగా ఆధ్యాత్మిక సహోదరులు ఉండడాన్ని చూసి ఎంతో ఓదార్పు పొందాం.

హాస్పిటల్లో మేం డాక్టర్‌ గ్రాప్‌ను కలిసినప్పుడు మేం మరలా ఓదార్పు పొందాం. ఆయన మమ్మల్ని బాగా అర్థంచేసుకొని, రక్త మార్పిడిలేకుండా విక్కీకి వైద్యం చేయడానికి తాను చేయగల్గినంతా చేస్తానని హామీ ఇచ్చాడు. ఒకవేళ మా పాప హెమోగ్లోబిన్‌ స్థాయి 5 g/dlలకు పడిపోయినా, రక్త మార్పిడిలేకుండా చికిత్సను కొనసాగించడానికి తాను సిద్ధంగా ఉంటానన్నాడు. రోగ నిర్ధారణ చాలా త్వరగా జరిగి, విక్కీని వెంటనే ఇక్కడకు తీసుకురావడం మూలంగా దానికి విజయవంతమైన చికిత్స పొందే అవకాశం దొరికిందని కూడా ఆయన అన్నాడు. విక్కీలాంటి రోగులకు రక్తమార్పిడి లేకుండా కెమోథెరపీ చికిత్సను తాను చేయడం ఇదే మొదటిసారని కూడా ఆయన ఒప్పుకున్నారు. డాక్టర్‌ గ్రాప్‌కున్న ధైర్యాన్నీ నిశ్చయతనూ చూసి మేం ఆశ్చర్యపోయాం, ఆయనకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాం.

ఆర్థిక సమస్యలు

విక్కీ చికిత్సకయ్యే ఖర్చుల్ని చెల్లించడమెలా అన్న విషయం ఇప్పుడొక పెద్ద ప్రశ్నై కూర్చుంది. రెండు సంవత్సరాల పాటు జరిగే చికిత్సకు దాదాపు 1,50,000 డ్యూష్‌ మార్క్‌లు వరకూ అవుతుందని మాకు తెలియజేసినప్పుడు మేం దిగ్భ్రాంతికి గురయ్యాం. అంత డబ్బులో కనీసం కొంతైనా మా దగ్గర లేదు, అయినప్పటికీ విక్కీకి చికిత్స వెంటనే ప్రారంభించడం తప్పనిసరి. జర్మనీలో చికిత్స పొందడం కోసం స్వీడన్‌ నుంచి రావడంతో, ఏ ప్రజా ఆరోగ్య ఇన్సూరెన్సు నుంచైనా సహాయాన్ని పొందే హక్కు మాకు ఇప్పుడు లేదు. రోగగ్రస్థురాలైన మా చిన్నారిని చూస్తే అలా ఉంది, వైద్యం చేయడానికి నిపుణుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మా దగ్గర సరిపడినంత డబ్బు లేదు.

హాస్పిటల్‌ మానేజ్‌మెంట్‌ మమ్మల్ని ఆదుకొని, మేం వెంటనే 20,000 మార్కుల్ని చెల్లించి మిగతా డబ్బును చెల్లిస్తామన్న హామీ పత్రంపై సంతకం చేస్తే చికిత్స వెంటనే ప్రారంభిస్తామని మాకు చెప్పారు. మా దగ్గర ఉన్న డబ్బూ, మా స్నేహితులూ బంధువులూ ప్రేమపూర్వకంగా ఇచ్చిందీ మొత్తం కలిపి మేమా 20,000 మార్కుల్ని చెల్లించగలిగాం, అయితే మరి మిగతా మొత్తం సంగతేంటి?

విశ్వాసం కోసం చేసే మా పోరాటంలో మేం ఒంటరివారం కామని మాకు మరోసారి గుర్తుచేయబడింది. అప్పట్లో మాకు అపరిచితుడైన ఒక ఆధ్యాత్మిక సహోదరుడు మిగతా మొత్తాన్ని చెల్లించే బాధ్యతను తనమీద వేసుకున్నాడు. అయితే, ఆ ఉదార సహాయాన్ని మేం ఉపయోగించుకోవాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే మేము ఆ డబ్బును చెల్లించడానికి ఇతర ఏర్పాట్లను చేసుకోగలిగాము.

చికిత్సలో వైద్య నిపుణత

కెమోథెరపీ చేయడం ప్రారంభమైంది. రోజులూ వారాలూ గడిచిపోయాయి. కొన్నిసార్లు, మాకూ మా చిన్నారికీ చాలా కష్టమైపోయేది, సత్తువ కోల్పోయినట్టయ్యేది. మరోవైపున, మా పాప కొద్ది కొద్దిగా కోలుకుంటున్న ప్రతీసారీ మేం సంతోషంతో తబ్బిబ్బైపోయి, కృతజ్ఞతతో మా హృదయాలు నిండిపోయేవి. కెమోథెరపీ పూర్తవ్వడానికి ఎనిమిది నెలలు పట్టింది. విక్కీకి హెమోగ్లోబిన్‌ అల్పస్థాయి శాతం 6 g/dl అయింది. డాక్టర్‌ గ్రాప్‌ తన మాటను నిలుపుకున్నాడు.

ఆరు సంవత్సరాలు గడచిపోయిన తర్వాత, పాప వెన్నుపూసలో ఉన్న ద్రవంలో లుకేమియా జాడలు కనబడలేదు. ఆ రోగానికి సంబంధించిన ఏ లక్షణాల్లేకుండా మా చిన్నారి ఇప్పుడు సంతోషంగా ఉంది. అలాంటి రోగానికి గురైన చిన్న పిల్లలు కెమోథెరపీనీ, రక్తమార్పిడులనూ చేయించుకున్నప్పటికీ వారిలో అనేకమంది చనిపోయిన సంగతి మాకు తెలుసు. అవును, విక్కీ పూర్తిగా కోలుకోవడమనేది నిజంగా ఒక అద్భుతం!

విశ్వాసం కోసమైన మా పోరాటంలో మేము విజయం సాధించాం. అయితే అది మా బంధువుల, క్రైస్తవ సహోదర సహోదరీల, వైద్య నిపుణుల సహాయంతోనే సాధించాం. హాస్పిటల్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ మాకు 24 గంటలూ పూర్తి మద్దతును ఇచ్చారు. డాక్టర్‌ గ్రాప్‌, ఆయన తోటి వైద్య సిబ్బందీ మా విక్కీ కోలుకునేలా సహాయపడేందుకు తమ తమ నైపుణ్యాలు ఉపయోగించారు. వారు చేసిన సహాయానికి మేం నిజంగా కృతజ్ఞులమై ఉన్నాం.

మా విశ్వాసం బలపర్చబడింది

అన్నింటికన్నా ఎక్కువగా, తన వాక్యమైన బైబిలు ద్వారా మేం పొందిన ఆయన ప్రేమపూర్వకమైన శ్రద్ధనుబట్టీ, బలాన్నిబట్టీ మేం మా దేవుడైన యెహోవాకు కృతజ్ఞులమై ఉన్నాం. మేం వెనక్కి తిరిగి చూసినప్పుడు, మేం ఎంత నేర్చుకున్నామో, జీవితంలో ఎంతో బాధాకరమైన ఈ అనుభవం మా విశ్వాసానికి ఎంత బలాన్ని చేకూర్చిందో మేం గ్రహించాం.

మా దేవుడైన యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకొని, ఆయన కట్టడలకు అనుగుణంగా జీవించడంలో ఉన్న విలువను మా పాపకు బోధించాలన్నదే ఇప్పుడు మా హృదయపూర్వక కోరిక. అవును, రానైవున్న పరదైసు భూమిలో నిత్యజీవం కోసమైన ఒక మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మా చిన్నారికి ఇవ్వాలని మేం కోరుకుంటున్నాం.​—⁠ఉచిత వ్యాసం.

[అధస్సూచి]

^ పేరా 7 ఆసుపత్రి అనుసంధాన కమిటీల అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను హాస్పిటల్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ పర్యవేక్షిస్తుంది. ఈ అనుసంధాన కమిటీలు, డాక్టర్లకూ రోగానికి గురైన సాక్షులకూ మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించేందుకు తర్ఫీదు ఇవ్వబడిన క్రైస్తవ స్వచ్ఛంద సేవకులతో రూపొందించబడ్డాయి. 1,400కన్నా ఎక్కువగానే ఉన్న ఈ ఆసుపత్రి అనుసంధాన కమిటీలు, 200కన్నా ఎక్కువ దేశాల్లో రోగులకు సహాయం చేస్తున్నాయి.