కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పెంపకమెలాంటిదైనా మీరు విజయం సాధించగలరు

మీ పెంపకమెలాంటిదైనా మీరు విజయం సాధించగలరు

మీ పెంపకమెలాంటిదైనా మీరు విజయం సాధించగలరు

నికోలస్‌లో బాల్యంనుంచి తిరుగుబాటు స్వభావం ఉంది. * ఆయనలోని అంతర్గత సంఘర్షణలు కాలక్రమేణా ఆయనను మాదకద్రవ్యాలకూ, అమితమైన త్రాగుడుకూ అలవాటయ్యేలా చేశాయి. నికోలస్‌ ఇలా వివరిస్తున్నాడు: “మా నాన్న త్రాగుబోతు, ఆయన నాకూ మా చెల్లికీ ఎంతో కష్టం కల్గించాడు.”

మలిండా తల్లిదండ్రులు సమాజం దృష్టికి మాత్రం చర్చికి వెళ్ళే గౌరవప్రదమైన సభ్యులు. కానీ వాళ్ళు ఒక మతాచార వ్యవస్థను కూడా చాలా గాఢంగా హత్తుకొనివున్నారు. “వారి మతాచార వ్యవస్థలోని కొన్ని అలవాట్లు నాకు బాధ కలిగించే విధంగా ఉండి నా బాల్యపు ఉత్సాహాన్ని నాశనం చేశాయి” అని ఇప్పుడు 30వ పడిలో ఉన్న మలిండా వాపోయింది. ఆమె ఇంకా ఇలా అంటోంది: “నేను మరచిపోలేని విధంగా నా మనసులో నిరాశా భావమూ, పనికిరాననే భావమూ నాటుకుపోయాయి.”

అనేకమంది బాల్యం దౌర్జన్యానికీ, అత్యాచారాలకూ, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికీ, ఇతర ప్రతికూల సంఘటనలకూ గురై నాశనమైందనే విషయాన్ని ఎవరు కాదంటారు? విషాదకరమైన బాల్యంలోని గాయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ అలాంటి గాయాలు దేవుని వాక్యంలోని సత్యాన్ని స్వీకరించకుండా, దాని ద్వారా వచ్చే సంతోషాన్ని పొందకుండా ఒకరి అవకాశాన్ని శాశ్వతంగా నాశనం చేయాలా? నికోలస్‌, మలిండాల పెంపకం ఎలాంటిదైనా వాళ్ళు సజ్జనులుగా మారడంలో విజయం సాధించగలరా? ముందుగా యూదా రాజైన యోషీయా మాదిరిని పరిశీలించండి.

లేఖనాల్లోని ఒక మాదిరి

యోషీయా సా.శ.పూ ఏడవ శతాబ్దంలో 31 సంవత్సరాలు (సా.శ.పూ 659-629) యూదాను పరిపాలించాడు. యోషీయా తండ్రి హత్య చేయబడిన తర్వాత, ఆయనకు మారుగా యోషీయా రాజైనప్పుడు యూదాలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. బయలుదేవుని ఆరాధకులతోనూ అమ్మోనీయుల ప్రధాన దేవుడైన మిల్కోము నామమును బట్టి ప్రమాణాలు చేస్తున్నవారితోనూ యూదా, యెరూషలేమూ నిండివున్నాయి. యూదా అధిపతులు “గర్జనచేయు సింహములు,” న్యాయాధిపతులు “రాత్రియందు తిరుగులాడు . . . తోడేళ్లు” అని ఆ కాలంలోని దేవుని ప్రవక్తల్లో ఒకరైన జెఫన్యా అన్నాడు. అలాంటి వాళ్ళ కారణంగా, దేశమంతటా దౌర్జన్యం మోసం విస్తరించాయి. అనేకమంది “యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కా[డు]” అని మనస్సులో అనుకొంటున్నారు.​—⁠జెఫన్యా 3:​1-5; 1:​3–2:⁠3.

యోషీయా ఎటువంటి పరిపాలకుడని నిరూపించుకున్నాడు? బైబిలు తేదీలను లెక్క కట్టే శాస్త్రియైన ఎజ్రా ఇలా వ్రాశాడు: “[యోషీయా] యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగకుండ తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.” (2 దినవృత్తాంతములు 34:⁠1, 2) యోషీయా దేవుని దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయడంలో విజయాన్ని సాధించాడన్న విషయం స్పష్టమౌతుంది. కానీ ఆయన కుటుంబ నేపథ్యం ఎలా ఉండేది?

ఆయన బాల్యం ఉత్తేజభరితమైనదా లేక బాధాకరమైనదా?

యోషీయా సా.శ.పూ 667 లో జన్మించినప్పుడు, ఆయన తండ్రి ఆమోను కేవలం 16 ఏండ్లవాడు, ఆయన తాత మనష్షే యూదా రాజ్యాన్ని యేలుతున్నాడు. యూదాను యేలిన అత్యంత దుష్ట రాజుల్లో మనష్షే ఒకడు. బయలుకు బలిపీఠాలను కట్టించి, “యెహోవా దృష్టికి బహుగా చెడునడత న[డిచాడు].” అతడు తన కుమారుల్లో కొందరిని అగ్ని గుండం దాటించాడు, మంత్రతంత్రాలను అభ్యసించాడు, సోదె చెప్పేవారిని పోషించాడు, అభిచారపు అలవాట్లను పెంపొందింపజేశాడు, నిరపరాధుల రక్తాన్ని విస్తృతంగా చిందించాడు. చివరికి మనష్షే తాను చేయించిన దేవతాస్తంభపు చెక్కుడు విగ్రహాన్ని కూడా యెహోవా మందిరంలో నిలబెట్టాడు. అతడు యూదానూ యెరూషలేమునూ మోసపుచ్చినవాడై, “ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.”​—⁠2 దినవృత్తాంతములు 33:​1-9.

మనష్షే చాలా దుర్మార్గుడవ్వడం వల్ల యెహోవా ఆయనను అష్షూరు రాజుకు బందీ అయ్యేలా చేశాడు, అష్షూరుల గొప్ప పట్టణాల్లో ఒకటైన బబులోనుకు ఆయనను గొలుసులతో బంధించి తీసుకుపోబడేలా చేశాడు. బందీగా ఉన్నప్పుడు మనష్షే పశ్చాత్తాపం చెందాడు, తనను తాను తగ్గించుకున్నాడు, యెహోవాను క్షమాపణ కోసం వేడుకున్నాడు. దేవుడు అతని విన్నపములను ఆలకించి అతను యెరూషలేములోని తన రాజ్యాధికారానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు మనష్షే దురాచారాన్ని కొంతమేరకు అంతమొందించడం వల్ల కొన్ని మంచి ఫలితాలను పొందాడు.​—⁠2 దినవృత్తాంతములు 33:​10-17.

మనష్షే చెడుతనమూ, తర్వాత అతను చూపిన పశ్చాత్తాపమూ అతని కొడుకు ఆమోనుపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి? ఆమోను చాలా చెడ్డవాడయ్యాడు. మనష్షే పశ్చాత్తాపం చెంది, తానే పరిచయం చేసిన అపవిత్రతనుంచి దేశాన్ని శుభ్రపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమోను ప్రతిస్పందించలేదు. వారసత్వంగా వచ్చిన సింహాసనాన్ని తన 22వ ఏట అధిష్ఠించిన ఆమోను “తన తండ్రియైన మనష్షే నడచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడచెను.” యెహోవా ఎదుట నమ్రతగా ఉండడానికి బదులుగా “ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను” చేశాడు. (2 దినవృత్తాంతములు 33:​21-23) ఆమోను యూదాకు రాజైనప్పుడు యోషీయా కేవలం ఆరేళ్ళవాడు. యోషీయా బాల్యం ఎంత భయానకంగా ఉందో కదా!

రెండు సంవత్సరాల తర్వాత ఆమోనుపై అతని సేవకులే కుట్రచేసి చంపడంతో అతని దుష్ట పరిపాలన ముగిసింది. అయినప్పటికీ, దేశ ప్రజలు రాజైన ఆమోనుమీద కుట్రచేసిన వారినందరిని చంపి అతని కుమారుడైన యోషీయాను రాజుగా చేశారు.​—⁠2 దినవృత్తాంతములు 33:​24, 25.

యోషీయా బాల్యంలో బాధ కలిగించే పరిస్థితులున్నప్పటికీ, ఆయన యెహోవా దృష్టిలో ఏది మంచిదో దాన్ని చేస్తూ కొనసాగాడు. ఆయన పరిపాలన ఎంత విజయవంతంగా ఉందో బైబిలిలా పేర్కొంటోంది: “అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.”​—⁠2 రాజులు 23:​19-25.

భయానకమైన బాల్యాన్ని గడపాల్సి వచ్చిన వారికి యోషీయా మాదిరి ఎంతో ప్రోత్సాహకరమైనది! ఆయన మాదిరి నుంచి మనమేం నేర్చుకోవచ్చు? సరైన మార్గాన్ని ఎంచుకోవడానికీ, దానిలో నిలకడగా ఉండడానికీ యోషీయాకు ఏమి సహాయం చేసింది?

యెహోవాను తెలుసుకోవడానికి ప్రయత్నించండి

యోషీయా జీవితపు తొలిప్రాయంలో, పశ్చాత్తాపం చూపించిన ఆయన తాత మనష్షే ప్రోత్సాహకరమైన ప్రభావం కొంతవరకు పడింది. వాళ్ళిద్దరు ఎంత తరచుగా కలుసుకునేవారూ, మనష్షే తన మార్గాలను సరిదిద్దుకున్నప్పుడు యోషీయాకు ఎన్నేళ్ళూ అన్నది బైబిలు చెప్పడంలేదు. యూదుల కుటుంబాలు సన్నిహితంగా ఉండేవి కాబట్టి, తన మనవడి హృదయంలో సత్య దేవుడైన యెహోవాపట్లా ఆయన వాక్యంపట్లా కొంత గౌరవాన్ని పుట్టించడం ద్వారా, చుట్టు పక్కలనున్న చెడు ప్రభావాల నుంచి తన మనవడిని తప్పించడానికి మనష్షే ప్రయత్నించి ఉండవచ్చు. యోషీయా హృదయంలో, మనష్షే నాటగలిగిన సత్యపు విత్తనాలంటూ ఏమైనా ఉంటే అవి బహుశా ఇతర అనుకూల ప్రభావాలతో కలిసి, చివరికి సత్ఫలితాల్నిచ్చాయి. యూదా దేశాన్ని పరిపాలించడం ప్రారంభించిన ఎనిమిది సంవత్సరాలకు 15 ఏళ్ళ వాడైన యోషీయా, యెహోవా చిత్తాన్ని తెలుసుకోవడానికీ దాన్ని చేయడానికీ ప్రయత్నించాడు.​—⁠2 దినవృత్తాంతములు 34:​1-3.

కేవలం ఒకే ఒక వ్యక్తిద్వారా అంటే ఒక దూరపు బంధువు ద్వారానో, ఒక పరిచయస్థుడి ద్వారానో, లేక ఒక పొరుగు వ్యక్తి ద్వారానో కొందరికి బాల్యంలో ఆధ్యాత్మిక విషయాలు పరిచయమై ఉండవచ్చు. అయినప్పటికీ, అలా నాటబడిన ఆ విత్తనాలు గనుక పోషించబడితే తర్వాత మంచి ఫలితాలనిస్తాయి. మొదట పేర్కొన్న మలిండా పొరుగింట్లో ఆమె తాతగారి వయసున్న ఒకాయన ఉండేవారు, ఆయన క్రమంగా కావలికోట, తేజరిల్లు! పత్రికలను ఆమె ఇంటికి తెచ్చిస్తుండేవారు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మలిండా ఇలా అంది: “ఆ తాతగారు పండగలు చేసుకోకపోవడం నన్ను బాగా ఆకట్టుకుంది. అది నాకు చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే హాల్లొవీన్‌, ఇతర కొన్ని పండగల సందర్భాల్లోనే మా తల్లిదండ్రుల మతతెగలోనివారు మతాచారాలను పాటించేవారు.” ఒక దశాబ్దం తర్వాత, యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో క్రైస్తవ కూటానికి రమ్మని ఒక స్నేహితురాలు ఆహ్వానించినప్పుడు, ఆమెకు తన పొరుగింటి తాతగారు గుర్తుకువచ్చి, వెంటనే ఆ ఆహ్వానాన్ని అంగీకరించింది. సత్యాన్ని వెదకడానికి అది ఆమెకు సహాయపడింది.

దేవుని ఎదుట నమ్రతగా ఉండండి

యోషీయా పరిపాలన యూదా దేశమంతా చేసిన అద్భుతమయిన మత సంస్కరణలతో గుర్తించబడింది. విగ్రహారాధనకు వ్యతిరేకంగానూ, యూదా దేశ ప్రక్షాళన కోసమూ ఆరు సంవత్సరాలపాటు గొప్ప చర్యలు తీసుకున్న తర్వాత యోషీయా యెహోవా మందిరాన్ని బాగుచేయించడం ప్రారంభించాడు. మరమ్మత్తు పనులు కొనసాగుతుండగా, ప్రధాన యాజకుడైన హిల్కీయాకు “యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము” అసలు ప్రతి దొరికింది. అది ఎంత అమూల్యమైనదో! సంచలనాత్మకమైన ఆ గ్రంథాన్ని హిల్కీయా శాస్త్రియైన షాఫానుకు అప్పగించాడు, ఆయన రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయాల్ని వివరించాడు. అలా సాధించిన కార్యాలు 25 ఏళ్ళ యోషీయాను విర్రవీగేలా చేశాయా?​—⁠2 దినవృత్తాంతములు 34:​3-18.

“ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొ[న్నాడు]” అని ఎజ్రా వ్రాశాడు. ఆయన దుఃఖాన్ని తెలియజేసే హృదయపూర్వక వ్యక్తీకరణ అది, ఎందుకంటే తన పూర్వీకులు దేవుని ఆజ్ఞలను పూర్తిగా అనుసరించలేదని ఆయన గ్రహించాడు. నిజంగా నమ్రతకు అది ఒక గుర్తు! రాజు వెంటనే అయిదుగురు ప్రతినిధులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, హుల్దా అను ప్రవక్త్రి ద్వారా యెహోవా యొద్ద విచారించమని వారికి ఆజ్ఞాపించాడు. ఆ ప్రతినిధి వర్గం తెచ్చిన సందేశం ఇలా ఉంది: ‘యెహోవా ఆజ్ఞలకు అవిధేయత చూపినందువల్ల విపత్తు వస్తుంది, కానీ రాజైన యోషీయా, నిన్ను నీవు తగ్గించుకొన్నావు గనుక నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు, నేను రప్పించు అపాయమును నీవు చూడవు.’ (2 దినవృత్తాంతములు 34:​19-28) యోషీయా చూపిన మనోవైఖరిని బట్టి యెహోవా నిజంగా సంతోషించాడు.

మనం పెరిగిన నేపథ్యం ఎలాంటిదైనప్పటికీ మనం కూడా సత్య దేవుడైన యెహోవా ఎదుట నమ్రతగా ఉండగలం, ఆయనపట్లా ఆయన వాక్యంపట్లా గౌరవపూర్వకమైన వైఖరిని వ్యక్తపర్చగలం. ప్రారంభంలో పేర్కొన్న నికోలస్‌ అలాగే చేశాడు. ఆయనిలా అంటున్నాడు: “మాదకద్రవ్యాలు, అమితమైన త్రాగుడు వంటి అలవాట్ల కారణంగా, నా జీవితమంతా కష్టాలతోనూ సమస్యలతోనూ నిండి ఉన్నప్పటికీ, నాకు బైబిలు పట్ల ఆసక్తి ఉండేది, జీవితానికి ఒక సంకల్పం ఉండాలని కోరుకునేవాడిని. చివరికి, నేను యెహోవాసాక్షులను కలుసుకుని నా జీవిత విధానాన్ని మార్చుకుని, సత్యాన్ని హత్తుకున్నాను.” అవును, మన పరిసరాలు ఎటువంటివైనప్పటికీ, మనం దేవునిపట్లా ఆయన వాక్యంపట్లా గౌరవపూర్వకమైన వైఖరిని చూపించగలం.

యెహోవా చేసిన ఏర్పాటునుంచి ప్రయోజనం పొందండి

యోషీయాకు యెహోవా ప్రవక్తలపట్ల కూడా ప్రగాఢమైన గౌరవముండేది. ఆయన, ప్రవక్త్రియైన హుల్దా యొద్ద విచారించడం మాత్రమే కాదుగానీ ఆయన కాలంలోని ఇతర ప్రవక్తల ద్వారా కూడా ఆయన చాలా ప్రభావితుడయ్యాడు. ఉదాహరణకు యిర్మీయా, జెఫన్యాలు ఇరువురూ యూదాలో అనుసరిస్తున్న విగ్రహారాధనను బహిరంగంగా అవిరామంగా ఖండించారు. అప్పుడు వారి సందేశంపై అవధానాన్ని నిలపడం ద్వారా అబద్ధ ఆరాధనకు వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకునేలా యోషీయా ఎంత ఉత్తేజితుడై ఉంటాడో కదా!​—⁠యిర్మీయా 1:​1, 2; 3:​6-10; జెఫన్యా 1:​1-6.

‘యజమానుడైన’ యేసుక్రీస్తు, తన అభిషిక్త అనుచరుల బృందాన్ని “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డి]”గా, సరైన సమయానికి ఆధ్యాత్మిక ఆహారం అందించడానికి ఏర్పాటు చేశాడు. (మత్తయి 24:​45-47) బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా, సంఘ కూటాల ద్వారా దాసుని తరగతి, బైబిలు సలహాను లక్ష్యపెట్టడం మూలంగా కలిగే ప్రయోజనాల వైపు మన అవధానాన్ని మళ్ళిస్తుంది. మన అనుదిన జీవితాల్లో అనుసరించడానికి ఆచరణాత్మక సూచనలను అందిస్తుంది. మన మనసులో నాటుకు పోయిన హానికరమైన మనోవైఖరులేవైనా ఉంటే మనం వాటిని అధిగమించడానికి, యెహోవా చేసిన ఈ ఏర్పాటును ఉపయోగించుకోవడం ఎంత సముచితమైనదో కదా! నికోలస్‌కు చిన్నతనం నుంచి అధికారం పట్ల ఏవగింపు ఉండేది. ఆయన దేవుని వాక్యపు సత్యాన్ని నేర్చుకున్నప్పటికీ, ఆయనకున్న ఆ బలహీనత యెహోవాను ఎక్కువగా సేవించకుండా ఆయనను వెనక్కి లాగేది. ఆయనకు తన వైఖరిని మార్చుకోవడం అంత సులభమేమీ కాలేదు. కానీ కాలక్రమేణా ఆయన విజయం సాధించాడు. ఎలా? “నన్నర్థం చేసుకోగల ఇద్దరు పెద్దల సహాయంతో” సాధించానని చెబుతూ నికోలస్‌ ఇలా వివరిస్తున్నాడు: “నేను నా సమస్యను ఒప్పుకుని వారి ప్రేమపూర్వకమైన లేఖనాధారిత సలహాను అనుసరించడం ప్రారంభించాను. అప్పుడప్పుడు కాస్త ఆగ్రహం నాలో రగులుతున్నప్పటికీ, నేనిప్పుడు నా తిరుగుబాటు వైఖరిని అదుపు చేసుకున్నాను.”

మలిండా కూడా ఎప్పుడైనా తన జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్దల సలహాను అడుగుతోంది. ఆమె తన గతంలో అంటే తొలి సంవత్సరాల్లో జనించిన నిరాశా భావాన్నీ, పనికిరాననే భావాన్నీ అధిగమించడానికి ఆమె పొందిన అమూల్యమైన సహాయమేమిటంటే, కావలికోట, తేజరిల్లు!ల్లోని విభిన్నమైన ఆర్టికల్స్‌. ఆమె ఇలా అంటోంది: “కొన్నిసార్లు ఆర్టికల్‌లోని కేవలం ఒక పేరా లేక ఒక వాక్యం నా మనసును స్పృశించేది. అటువంటివాటిని దాచుకొని మళ్ళీ అప్పుడప్పుడు సులభంగా చదువుకునే విధంగా పుస్తకాల్లాగా చేసుకోవడం ప్రారంభించాను, సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం నుంచి అలా చేస్తున్నాను.” అలా ఆమె చేసుకున్న 3 పుస్తకాల్లో ఈ రోజు 400 ఆర్టికల్స్‌ ఉన్నాయి!

కుటుంబంలోని చెడు ప్రభావాలకు ఎవరూ శాశ్వత బాధితులు కావలసిన అవసరం లేదు. యెహోవా సహాయంతో వారు ఆధ్యాత్మిక విజయాన్ని సాధించగలరు. మంచి పరిస్థితుల్లో పెరిగిన ఒక వ్యక్తి నిజాయితీపరుడు అవుతాడని ఎలాగైతే గ్యారంటీ ఇవ్వలేమో అలాగే బాధాకరమైన బాల్యం ఒక వ్యక్తి దేవుని మీద భయభక్తులు గల వ్యక్తిగా మారకుండా ఆపదు.

మందిరం మరమ్మత్తు చేసేటప్పుడు ధర్మశాస్త్రం దొరికిన తర్వాత, యోషీయా ‘యెహోవాను అనుసరిస్తాననీ, తన పూర్ణహృదయంతోనూ పూర్ణమనస్సుతోనూ విధేయత కలిగి ఉంటాననీ యెహోవా సన్నిధిని ఒక నిబంధన చేసుకున్నాడు.’ (2 దినవృత్తాంతములు 34:​31) తను తీసుకున్న ఈ నిర్ణయాన్నుంచి చివరి శ్వాస వదిలేంత వరకు ఆయన వైదొలగలేదు. అదేవిధంగా మలిండా, నికోలస్‌లు యెహోవా దేవుని పట్ల యథార్థంగా ఉండి విజయాన్ని సాధించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. మీరు కూడా దేవునికి దగ్గరగా ఉంటూ ఆయనను నమ్మకంగా సేవించాలని దృఢంగా నిశ్చయించుకొందురు గాక! మీరు విజయాన్ని సాధించగలరని యెహోవా వాగ్దానాల పట్ల నిశ్చయం కలిగి ఉండండి: “నీకు తోడైయున్నాను భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.”​—⁠యెషయా 41:​9, 10, 13.

[అధస్సూచి]

^ పేరా 1 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[26వ పేజీలోని చిత్రాలు]

యోషీయా భయానకమైన బాల్య జీవితాన్ని గడిపినప్పటికీ యెహోవాను వెదకి, తెలుసుకొని తన జీవితంలో విజయాన్ని సాధించాడు

[28వ పేజీలోని చిత్రం]

గాఢంగా నాటుకుపోయిన వ్యక్తిత్వ లోపాన్ని అధిగమించడానికి పెద్దలు సహాయపడగలరు

[28వ పేజీలోని చిత్రం]

యథార్థతతో కొనసాగడానికి “కావలికోట” మరియు “తేజరిల్లు!”లు సహాయపడగలవు