విని మరచిపోయేవారిగా తయారుకావద్దు
విని మరచిపోయేవారిగా తయారుకావద్దు
“మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.”—యాకోబు 1:22.
1. ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలు ఏ అద్భుతాల్ని చూసే ఆధిక్యతను పొందారు?
“మరపురానివి.” ప్రాచీన ఐగుప్తులో యెహోవా చేసిన అద్భుతకృత్యాల్ని వర్ణించడానికి అదొక మంచి పదం. పది తెగుళ్ళలో ప్రతీదీ నిజంగా అత్యద్భుతమైనదే. అలా దెబ్బ మీద దెబ్బ కొట్టిన తర్వాత యెహోవా, ఇశ్రాయేలు ప్రజల్ని రెండుగా చీలిన ఎఱ్ఱసముద్ర జలాల గుండా అద్భుతరీతిన విడుదల చేశాడు. (ద్వితీయోపదేశకాండము 34:10-12) మీరా సంఘటనలకు ప్రత్యక్షసాక్షిగా ఉండుంటే వాటి వెనుక ఉన్న వ్యక్తిని మీరెన్నడూ మరచిపోయి ఉండేవారు కాదు. కానీ, కీర్తనకర్త ఇలా పాడాడు: “ఐగుప్తులో గొప్ప కార్యములను, హాముదేశములో ఆశ్చర్యకార్యములను, ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని [ఇశ్రాయేలీయులు] మరచిపోయిరి.”—కీర్తన 106:21, 22.
2. దేవుని పరాక్రమ క్రియల పట్ల ఇశ్రాయేలీయుల్లో కృతజ్ఞతాభావం ఎంతోకాలం నిలవలేదని ఏమి చూపిస్తుంది?
2 ఎఱ్ఱసముద్రాన్ని దాటిన తర్వాత ఇశ్రాయేలీయులు “యెహోవాకు భయపడి యెహోవాయందు . . . నమ్మకముం[చారు].” (నిర్గమకాండము 14:31) ఇశ్రాయేలు పురుషులు యెహోవాకు విజయగీతికను పాడారు, అందుకు ప్రతిస్పందనగా మిర్యాము ఇతర స్త్రీలు తంబురలను వాయిస్తూ నాట్యమాడారు. (నిర్గమకాండము 15:1, 20) అవును, యెహోవా చేసిన పరాక్రమ క్రియల్ని చూసి ప్రజలు విస్మితులయ్యారు. కానీ ఆ క్రియలు చేసినవాని పట్ల వారిలో కృతజ్ఞతాభావం మాత్రం ఎంతోకాలం నిలవలేదు. అటుతర్వాత కొద్ది రోజులకే వారిలో చాలామంది అకస్మాత్తుగా తమ జ్ఞాపకశక్తిని కోల్పోయినట్లుగా ప్రవర్తించారు. వారు యెహోవాకు విరుద్ధంగా సణుగుతూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు విగ్రహారాధనలో పడిపోయి లైంగిక అనైతికతకు పాల్పడ్డారు.—సంఖ్యాకాండము 14:27; 25:1-9.
మనం మర్చిపోయేలా చేయగల్గేదేమిటి?
3. మన అపరిపూర్ణ స్వభావం కారణంగా మనం ఏమి మరచిపోయే అవకాశం ఉంది?
3 ఇశ్రాయేలీయుల్లో కృతజ్ఞతాభావం ఎందుకు కొట్టుకుపోయిందో నిజంగా అర్థం కాదు. అయితే, మనకు కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. నిజమే, మనం దేవుడు చేసిన అలాంటి అద్భుతాల్ని కళ్ళారా చూడలేదనుకోండి. అయితే, దేవునితో మనకున్న సంబంధంలో మరపుకు రాని కొన్ని సందర్భాలు మాత్రం తప్పకుండా ఉన్నాయి. మనలో కొందరు బైబిలులోని సత్యాన్ని స్వీకరించిన సమయాన్ని స్మరణకు తెచ్చుకోగలరు. ఆనందకరమైన మరితర సందర్భాల్లో, యెహోవాకు మనం సమర్పణా ప్రార్థనను చేసుకోవడం, నిజ క్రైస్తవులుగా నీటి బాప్తిస్మం తీసుకోవడం వంటివి ఉండవచ్చు. మనలో చాలామందిమి మన జీవితాల్లోని వివిధ దశల్లో యెహోవా అందించిన అభయ హస్తాన్ని చవిచూశాము. (కీర్తన 118:15) అన్నింటికీ మించి, దేవుని స్వంత కుమారుడైన యేసుక్రీస్తు బలిపూర్వక మరణం ద్వారా మనం రక్షణ నిరీక్షణను పొందాము. (యోహాను 3:16) అయినప్పటికీ తప్పుడు కోరికలు, జీవిత చింతలు మన ముందుకి వచ్చినప్పుడు, మన అపరిపూర్ణ స్వభావం కారణంగా, యెహోవా మనకోసం చేసిన ఉపకారాల్ని చాలా సులభంగా మరచిపోయే అవకాశం ఉంది.
4, 5. (ఎ) విని మరచిపోయే ప్రమాదాన్ని గురించి యాకోబు ఎలా హెచ్చరిస్తున్నాడు? (బి) అద్దంలో చూసుకునే మనిషిని గురించి యాకోబు ఇచ్చిన దృష్టాంతాన్ని మనమెలా అన్వయించుకోగలము?
4 యేసు మారుటి తమ్ముడైన యాకోబు తన తోటి క్రైస్తవులకు వ్రాసిన పత్రికలో విని మరచిపోయే ప్రమాదం గురించి హెచ్చరించాడు. ఆయనిలా వ్రాశాడు: “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని యాకోబు 1:22-24) యాకోబు ఏ భావంతో అలా వ్రాశాడు?
అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా.” (5 మనం ఉదయం నిద్రలేచిన తర్వాత, మన రూపానికి ఏ మెరుగులు దిద్దాలా అని సాధారణంగా అద్దంలో చూసుకుంటాము. తర్వాత రోజువారీ పనుల్లో పడిపోయి మన మనస్సు ఇతర విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తుండగా మనం అద్దంలో ఏమి చూశామన్న దాని గురించి ఆలోచించడం మానేస్తాము. ఇది ఆధ్యాత్మిక భావంలో కూడా జరిగే అవకాశం ఉంది. మనం దేవుని వాక్యమనే అద్దంలో చూస్తూ, మన అసలు రూపమేమిటన్నదాన్ని యెహోవా మనమెలా ఉండాలని ఆశిస్తున్నాడన్నదానితో పోల్చుకోగలము. అలా, మన బలహీనతలు మన కళ్ళకెదురుగా కనబడతాయి. ఈ గ్రహింపు మన వ్యక్తిత్వంలో మనం మార్పులు చేసుకునేలా మనల్ని ప్రేరేపించాలి. కానీ, దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి, అనేక సమస్యల్తో పెనుగులాడుతుండగా మనం ఆధ్యాత్మిక విషయాలను గురించి ఆలోచించడం చాలా సులభంగా ఆపేస్తుండవచ్చు. (మత్తయి 5:3; లూకా 21:34) అలా ఆపేయడం, దేవుడు మన పక్షాన చేసిన ప్రేమపూర్వక క్రియల్ని మనం మరచిపోయినట్లవుతుంది. అలా గనుక జరిగితే మనం పాపపు తలంపులకు లొంగిపోయే ప్రమాదంలో పడతాము.
6. యెహోవా వాక్యాన్ని మరచిపోకుండా ఉండేందుకు ఏ లేఖనాల పరిశీలన సహాయపడగలదు?
6 కొరింథీయులకు తాను వ్రాసిన మొదటి ప్రేరేపిత పత్రికలో అపొస్తలుడైన పౌలు అరణ్యంలోని మతిమరపు ఇశ్రాయేలీయుల్ని గురించి పేర్కొన్నాడు. పౌలు మాటల నుండి మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రయోజనం పొందిన విధంగానే, ఆయన వ్రాసినదాన్ని పునఃపరిశీలించడం ద్వారా మనం యెహోవా వాక్యాన్ని మరచిపోకుండా ఉండేందుకు సహాయాన్ని పొందగలం. కాబట్టి మనం 1 కొరింథీయులు 10:1-12 వచనాల్ని పరిశీలిద్దాం.
ఇహలోక కోరికల్ని త్యజించండి
7. యెహోవా ప్రేమకు ఎటువంటి నిర్వివాదమైన సాక్ష్యాధారాన్ని ఇశ్రాయేలీయులు పొందారు?
7 ఇశ్రాయేలీయుల గురించి పౌలు చెప్పింది క్రైస్తవులకు హెచ్చరికగా పనికి వస్తుంది. పౌలు వ్రాసిన దాంట్లో కొంత భాగమిది: “సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి; అందరును మోషేనుబట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి.” (1 కొరింథీయులు 10:1-4) మోషే కాలంలోని ఇశ్రాయేలు ప్రజలు దేవుని శక్తి మహత్తరమైన రీతిలో ప్రదర్శితమవ్వడాన్ని చూశారు. పగటివేళ వారిని నడిపించిన దేవుని అద్భుతమైన మేఘస్తంభాన్ని, ఎఱ్ఱ సముద్రము గుండా తప్పించుకునేందుకు వారికి సహాయం చేసిన మరో స్తంభాన్ని వారు చూశారు. (నిర్గమకాండము 13:21; 14:21, 22) అవును, ఆ ఇశ్రాయేలీయులపట్ల యెహోవాకుగల ప్రేమకు వారు నిర్వివాదమైన సాక్ష్యాధారాన్ని పొందారు.
8. ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక మతిమరపు ఎటువంటి పరిణామాలకు దారితీసింది?
8 “అయితే” అని ప్రారంభిస్తూ, పౌలు ఇలా అంటున్నాడు: “వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.” (1 కొరింథీయులు 10:5) ఎంత విచారకరమైన విషయం! ఐగుప్తు దేశం విడిచిపెట్టి వచ్చిన ఇశ్రాయేలీయుల్లో అత్యధికులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి తమను తాము చేజేతులా అయోగ్యుల్ని చేసుకున్నారు. తమ విశ్వాస రాహిత్యం మూలంగా దేవుని చేత తృణీకరించబడినందున వారు అరణ్యంలోనే చనిపోయారు. (హెబ్రీయులు 3:16-19) మనం దీన్నుండి ఏమి నేర్చుకోగలం? పౌలు ఇలా చెబుతున్నాడు: “వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.”—1 కొరింథీయులు 10:6.
9. యెహోవా తన ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు, ఇశ్రాయేలీయులు ఎలా ప్రతిస్పందించారు?
9 ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉండగా వారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరించడానికి వారికెన్నో విషయాలు ఉన్నాయి. వారు యెహోవాతో నిబంధనలోకి ప్రవేశించారు, ఆయనకు సమర్పించబడిన ఒక జనాంగం అయ్యారు. అంతేగాక, వారికి ఒక యాజకత్వం, ఆరాధనకు కేంద్రంగా ఒక గుడారము, యెహోవాకు బలులు అర్పించడానికి ఒక ఏర్పాటు ఇవ్వబడ్డాయి. అయితే వారు ఆ ఆధ్యాత్మిక కానుకలను బట్టి ఆనందించడానికి బదులుగా, దేవుడు తమకిచ్చిన వస్తుపరమైనవాటి విషయంలో అసంతృప్తి చెందారు.—సంఖ్యాకాండము 11:4-6.
10. మనం ఎల్లప్పుడు దేవుణ్ణి మన మనస్సుల్లో ఎందుకు ఉంచుకోవాలి?
10 అరణ్యంలోని ఇశ్రాయేలీయుల్లా కాక, నేడు యెహోవా ప్రజలు ఆయన ఆమోదాన్ని అనుభవిస్తున్నారు. అయితే, మనమందరం ఒక్కొక్కరిగా దేవుణ్ణి మన తలంపుల్లో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అలా చేయడం ద్వారా, మన ఆధ్యాత్మిక దృష్టి మసకబారిపోయేలా చేసే స్వార్థపూరితమైన వాంఛల్ని తిరస్కరించేందుకు సహాయం లభిస్తుంది. “భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను తీతు 2:12, 13) మనలో శిశుప్రాయం నుండే క్రైస్తవ సంఘంతో సహవహించేవారు, ఏవో సుఖాల్ని కోల్పోతున్నామని ఎన్నడూ అనుకోకూడదు. అలాంటి ఆలోచనలు మన మనస్సుల్లోకి క్షణమాత్రం ప్రవేశించినా, మనం యెహోవానూ ఆయన మనకోసం సిద్ధపర్చివుంచిన ఆశీర్వాదాల్ని జ్ఞాపకం చేసుకోవడం శ్రేయస్కరం.—హెబ్రీయులు 12:2, 3.
విసర్జించి, . . . ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని” మనం దృఢ నిశ్చయం చేసుకోవాలి. (యెహోవాకు సంపూర్ణ విధేయత
11, 12. చెక్కబడిన ప్రతిమలను ఆరాధించకుండానే ఒక వ్యక్తి విగ్రహారాధకుడు ఎలా అవ్వగలడు?
11 మరొక హెచ్చరికను ఇస్తూ పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి, అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.” (1 కొరింథీయులు 10:7) ఇశ్రాయేలీయులు అహరోనుపైకి ఒత్తిడి తెచ్చి బంగారు దూడను చేసేందుకు ఆయన్ను ఒప్పించిన సందర్భాన్ని పౌలు ఇక్కడ సూచిస్తున్నాడు. (నిర్గమకాండము 32:1-4) మనమంత ఘోరమైన రీతిలో విగ్రహారాధన వైపు తిరిగే సాధ్యత లేకపోయినా, మన స్వార్థపరమైన కోరికలు యెహోవాను పూర్ణ మనస్సుతో ఆరాధించకుండా మన మనస్సును ప్రక్కకి మరల్చేందుకు అనుమతించడం ద్వారా మనం విగ్రహారాధకులుగా మారగలము.—కొలొస్సయులు 3:5.
12 మరో సందర్భంలో, ఆధ్యాత్మిక విషయాలపై కాక ప్రధానంగా వస్తుపర విషయాలపైనే మనస్సు నిలిపిన కొందరి గురించి పౌలు వ్రాశాడు. “క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచు[న్న]” వారి గురించి ఆయనిలా వ్రాశాడు: “నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు.” (ఫిలిప్పీయులు 3:18, 19) వారి విగ్రహారాధనా వస్తువు ఏదో చెక్కబడిన ప్రతిమ కాదు. అది భౌతిక వస్తువులపై వారి కోరికే. నిజమే, కోరికలన్నీ తప్పేమీ కాదు. యెహోవా మనల్ని మానవీయ అవసరాలతో, వేర్వేరు సుఖానుభూతుల్ని అనుభవించే సామర్థ్యంతో సృష్టించాడు. కానీ సుఖానుభవాల్ని దేవునితో తమకుగల సంబంధంకన్నా మిన్నగా దృష్టిస్తూ వాటివెంటపడేవారు నిజానికి విగ్రహారాధకులే అవుతారు.—2 తిమోతి 3:1-5.
13. బంగారు దూడను గురించిన వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
13 ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత వారు ఆరాధించడానికి ఒక బంగారు దూడను చేసుకున్నారు. ఈ వృత్తాంతంలో విగ్రహారాధనకు విరుద్ధంగా హెచ్చరికనే కాక మరో ప్రాముఖ్యమైన పాఠం కూడా ఉంది. ఇశ్రాయేలీయులు యెహోవా ఇచ్చిన స్పష్టమైన నిర్దేశానికి అవిధేయత చూపించారు. (నిర్గమకాండము 20:4-6) అయితే, తమ దేవునిగా యెహోవాను తిరస్కరించే ఉద్దేశం మాత్రం వారికి లేదు. వారు పోతపోసిన దూడకు బలులర్పించి, ఆ సందర్భాన్ని “యెహోవాకు పండుగ” అని పిలిచారు. దేవుడు తమ అవిధేయతను ఉపేక్షిస్తాడని ఆలోచించేలా వారు తమను తాము ఎలాగో మోసపుచ్చుకున్నారు. అది యెహోవాకు అవమానం, అది ఆయనకు తీవ్రమైన కోపాన్ని తెప్పించింది.—నిర్గమకాండము 32:5, 7-10; కీర్తన 106:19, 20.
నిర్గమకాండము 20:18, 19, 22, 23) అయినా, ఇశ్రాయేలీయులు బంగారు దూడను ఆరాధించారు.
14 ఒక యెహోవాసాక్షి ఏదైనా అబద్ధమతంలో చేరడమన్నది చాలా అసాధారణమైన విషయమై ఉంటుంది. అయితే, సంఘంలో ఉంటూనే కొందరు యెహోవా అందించే నిర్దేశాల్ని మరితర మార్గాల్లో తిరస్కరించే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయులు విని మరచేవారిగా తయారయ్యేందుకు వారి దగ్గర ఎటువంటి యుక్తమైన కారణమూ లేదు. వారు పది ఆజ్ఞల్ని విన్నారు, అంతేకాదు “మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసికొనకూడదు” అన్న దేవుని ఆజ్ఞను మోషే వివరించినప్పుడు వారు అక్కడే ఉన్నారు. (14, 15. (ఎ) ఇశ్రాయేలీయులు విని మరచిపోయేందుకు వారి దగ్గర ఎందుకు యుక్తమైన కారణం లేదు? (బి) మనం విని మరచిపోయేవారిగా కాకూడదని తీర్మానించుకున్నట్లైతే యెహోవా ఆజ్ఞల సంబంధంగా మనం ఏమి చేస్తాము?
15 మనం కూడా విని మరచిపోయేవారిగా కావడానికి ఎటువంటి యుక్తమైన కారణమూ లేదు. లేఖనాల్లో మనకు జీవితంలోని అనేక రంగాల్లో దేవుని నిర్దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు, అప్పు చేసి తీర్చకుండా ఉండే అలవాటును యెహోవా వాక్యం స్పష్టంగా ఖండిస్తుంది. (కీర్తన 37:21) పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని ఆజ్ఞాపించబడ్డారు, తండ్రులు తమ పిల్లల్ని “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచాల్సి ఉంది. (ఎఫెసీయులు 6:1-4) అవివాహిత క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే” పెండ్లి చేసుకోవాలని ఆదేశించబడ్డారు, ఇంకా, వివాహితులైన దేవుని సేవకులకు ఇలా చెప్పబడింది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” (1 కొరింథీయులు 7:39; హెబ్రీయులు 13:4) మనం విని మరచిపోయేవారిగా కాకూడదని తీర్మానించుకున్నట్లైతే వీటినీ, దేవుని నుండి వచ్చిన మరితర నిర్దేశకాలనూ చాలా గంభీరంగా తీసుకుని వాటిని అనుసరిస్తాము.
16 ఇశ్రాయేలీయులు తమ చిత్తం వచ్చినట్లు తనను ఆరాధించడానికి చేసిన ప్రయత్నాన్ని యెహోవా అంగీకరించలేదు. ఫలితంగా, 3,000 మంది నాశనమయ్యారు, బహుశ బంగారు దూడను ఆరాధించడమనే తిరుగుబాటు చర్యలో ప్రముఖ పాత్రను వారు పోషించినందుకు కావచ్చును. మరితర తప్పిదస్థులు యెహోవా పంపించిన తెగులు బారిన పడ్డారు. (నిర్గమకాండము 32:28, 35) దేవుని వాక్యాన్ని చదివి కూడా తాము దేనికి విధేయత చూపాలని కోరుకుంటున్నారో దాన్ని తామే ఎంపిక చేసుకునే వారికి ఎంత గొప్ప పాఠం!
“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”
17. మొదటి కొరింథీయులు 10:8 ఏ సంఘటనను సూచిస్తోంది?
17 “మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి” అని చెప్పినప్పుడు పౌలు, శారీరక కోరికలు ఆధ్యాత్మిక మతిమరపును కలుగజేయగల ఒక రంగాన్ని ప్రస్తావించాడు. (1 కొరింథీయులు ) ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగాడిన తర్వాత మోయాబు మైదానంలో జరిగిన ఒక సంఘటనను పౌలు ఇక్కడ సూచిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాల్ని జయించేందుకు యెహోవా సహాయాన్ని అప్పుడే పొందారు. కానీ చాలామంది దాన్ని మరచిపోయారు, వారిలో కృతజ్ఞతాభావం కొరవడింది. వాగ్దాన దేశపు అంచున ఉండగా వారు లైంగిక అనైతికతలోనికీ, బయల్పెయోరు అపరిశుద్ధారాధనలోనికీ దిగజారిపోయారు. దాదాపు 24,000 మంది నాశనమయ్యారు, వారిలో 1,000 మంది ముఠానాయకులు.— 10:8సంఖ్యాకాండము 25:9.
18 నేడు యెహోవా ప్రజలు తమ సమున్నతమైన నైతిక విలువలకు పేరుగాంచారు. కానీ లైంగిక అనైతికత అనే శోధన ఎదురైనప్పుడు కొందరు క్రైస్తవులు దేవుని గురించీ ఆయన సూత్రాల గురించీ ఆలోచించడం మానుకున్నారు. వారు విని మరచిపోయినవారయ్యారు. మొదట్లో, ఆ శోధనలో వ్యభిచార క్రియ ఇమిడివుండకపోవచ్చు. బహుశ, అశ్లీల సాహిత్యాన్ని ఉత్సుకతతో తిరగేయడం, అనుచితమైన జోకులు వేయడం లేదా అసభ్యకరంగా సరసాలాడడం వంటివాటితో, లేక నైతికంగా బలహీనులైన వారితో సాన్నిహిత్యాన్ని కోరుకోవడంతోనే ప్రారంభం కావచ్చు. ఇవన్నీ క్రైస్తవులు పాపభరిత ప్రవర్తనలోకి పడిపోయేలా వారిని నడిపించాయి.—1 కొరింథీయులు 15:33; యాకోబు 4:4.
19 అనైతిక ప్రవర్తనలో పాల్గొనాలన్న శోధన ఎదురైనప్పుడు మనం యెహోవాను గురించి ఆలోచించడం మానేయకూడదు. బదులుగా మనం ఆయన వాక్యంలోని జ్ఞాపికల్ని పాటించాలి. (కీర్తన 119:1, 2) క్రైస్తవులముగా, మనలో అత్యధికులం నైతికంగా పరిశుభ్రంగా ఉండడానికి యథాశక్తి కృషి చేస్తాము, కానీ దేవుని దృష్టిలో సరైనది చేయడానికి నిరంతర పరిశ్రమ అవసరం. (1 కొరింథీయులు 9:27) రోములోని క్రైస్తవులకు పౌలు ఇలా వ్రాశాడు: “మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.” (రోమీయులు 16:19) తమ పాపాల నిమిత్తం 24,000 మంది ఇశ్రాయేలీయులకు మరణశిక్ష విధించబడినట్లుగానే, వ్యభిచారులూ మరితర తప్పిదస్థులూ త్వరలోనే యెహోవా నుండి వచ్చే ప్రతికూల తీర్పును అనుభవిస్తారు. (ఎఫెసీయులు 5:3-6) అందుకని, విని మరచిపోయేవారిగా కాకుండా మనం “జారత్వమునకు దూరముగా పారిపో[వాలి].”—1 కొరింథీయులు 6:18.
యెహోవా ఏర్పాట్ల నిమిత్తం ఎల్లప్పుడు కృతజ్ఞులై ఉండండి
20. ఇశ్రాయేలీయులు యెహోవాను ఎలా శోధించారు, ఫలితమేమిటి?
20 క్రైస్తవుల్లో అత్యధికులు ఎన్నడూ లైంగిక అనైతికతలో పడిపోరు. అయినా, మనం నిరంతరం సణుగుతూనే ఉండేవారమయ్యేలా చేసే వైఖరిని అనుసరించకుండా మనల్ని మనం నివారించుకోవాలి, అది దైవిక అనంగీకారానికి దారితీస్తుంది. పౌలు ఇలా ఉద్బోధ చేస్తున్నాడు: “మనము ప్రభువును శోధింపక యుందము; [ఇశ్రాయేలీయుల్లో] కొందరు శోధించి సర్పములవలన నశించిరి. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.” (1 కొరింథీయులు 10:9, 10) ఇశ్రాయేలీయులు మోషే అహరోనులకు విరుద్ధంగా సణిగారు—అవును చివరికి దేవునికే విరుద్ధంగా సణిగారు, అద్భుతరీతిన అందించబడిన మన్నాను గురించి ఫిర్యాదు చేశారు కూడా. (సంఖ్యాకాండము 16:41; 21:5) వారి వ్యభిచారం విషయంలో కన్నా వారి సణుగుడు విషయంలో యెహోవా తక్కువ క్రోధం చెందాడా? సణిగిన చాలామంది సర్పాలచే హతులయ్యారని బైబిలు వృత్తాంతం చెబుతోంది. (సంఖ్యాకాండము 21:6) మునుపు మరో సందర్భంలో 14,700 కన్నా ఎక్కువమంది సణిగి తిరుగుబాటుదారులైనందున నాశనమయ్యారు. (సంఖ్యాకాండము 16:49) కాబట్టి మనం యెహోవా చేసిన ఏర్పాట్లను అగౌరవంగా దృష్టిస్తూ ఆయన సహనానికి పరీక్ష పెట్టక ఉందాము.
21 తోటి క్రైస్తవులకు వ్రాస్తూ పౌలు హెచ్చరికల చిట్టాను ఈ ఉద్బోధతో ముగిస్తున్నాడు: “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:11, 12) ఇశ్రాయేలీయుల్లా మనమూ యెహోవా నుండి ఎన్నో ఆశీస్సులను పొందాము. అయితే వారిలా తయారుకాక, మనం దేవుడు మన పక్షాన చేస్తున్న ఉపకారాల నిమిత్తం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ఎన్నడూ మరువకుందాం. జీవిత చింతలు మనపై విపరీతమైన భారంగా ఉన్నప్పుడు ఆయన వాక్యంలో ఉన్న అద్భుతమైన వాగ్దానాలను మనం ధ్యానిద్దాం. యెహోవాతో మనకుగల అమూల్యమైన సంబంధాన్ని గుర్తుంచుకుంటూ, మనకు అప్పగించబడిన రాజ్యప్రకటనా పనిలో ముందుకు కొనసాగుదాం. (మత్తయి 24:14; 28:19, 20) ఈ జీవిత విధానం మనకు తప్పకుండా నిజమైన ఆనందాన్ని తెస్తుంది, ఎందుకంటే లేఖనాలిలా వాగ్దానం చేస్తున్నాయి: “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.”—యాకోబు 1:25.
మీరెలా జవాబిస్తారు?
• మనం దేనివల్ల విని మరచిపోయేవారిగా కాగలం?
• దేవునికి సంపూర్ణ విధేయత చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?
• మనమెలా ‘జారత్వము నుండి పారిపోగలం’?
• యెహోవా చేసిన ఏర్పాట్ల విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి?
[అధ్యయన ప్రశ్నలు]
16. బంగారు దూడను ఆరాధించడం మూలంగా కలిగిన పర్యవసానాలేమిటి?
18. ఎంటువంటి ప్రవర్తన లైంగిక అనైతికతకు నడిపించవచ్చు?
19. ‘జారత్వమునకు దూరముగా పారిపోయేందుకు’ మనకు ఏ లేఖనాధార సలహా సహాయపడుతుంది?
21. (ఎ) పౌలు ఏ ఉద్బోధను చేసేందుకు ప్రేరేపించబడ్డాడు? (బి) యాకోబు 1:25 ప్రకారం మనం నిజంగా ఎలా ఆనందంగా ఉండగలం?
[15వ పేజీలోని చిత్రం]
యెహోవా తమ పక్షాన చేసిన పరాక్రమ క్రియల్ని ఇశ్రాయేలీయులు మరచిపోయారు
[16వ పేజీలోని చిత్రం]
యెహోవా ప్రజలు సమున్నతమైన నైతిక ప్రమాణాల్ని అనుసరిస్తూనే ఉండడానికి తీర్మానించుకుని ఉన్నారు