కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేము యెహోవాను శోధించాము

మేము యెహోవాను శోధించాము

జీవిత కథ

మేము యెహోవాను శోధించాము

పాల్‌ స్క్రైబ్నర్‌ చెప్పినది

“గుడ్‌మార్నింగ్‌ మిసెస్‌ స్టాక్‌హౌస్‌. నేను ఈస్టర్‌ పండగకు కేకుల ఆర్డర్లు తీసుకోవడానికి వచ్చాను. మీఫామిలీకి కూడా కావాలి కదూ!” అది 1938వ సంవత్సరం, వసంతకాల ప్రారంభం. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఆట్కో పట్టణమది. జనరల్‌ బేకింగ్‌ కంపెనీలో పనిచేస్తున్న నేను ఒక చాలా మంచి కస్టమర్‌ని అలా అడిగాను. మిసెస్‌ స్టాక్‌హౌస్‌ జవాబువిని నేను ఆశ్చర్యపోయాను.

“మాకు వద్దండీ” అంది ఆమె. “మేము ఈస్టర్‌ జరుపుకోము.”

అప్పుడు నేనేమనాలో తోచలేదు. ఈస్టర్‌ జరుపుకోకపోవడమా? అదేంటి? వ్యాపారంలో కస్టమర్‌ ఎప్పుడూ రైటేనన్నది ఒక సూత్రం. మరిప్పుడేమిటి చేయడం? “సరేనండీ” నేను ధైర్యం చేశాను, “కానీ, ఇది చాలా మంచి కేకు. మీరు మాకంపెనీ ఉత్పత్తుల్ని ఇష్టపడతారని నాకు తెలుసు. మరి ... మరి, మీరు ఈస్టర్‌ జరుపుకోకపోయినా కేకు తిని మీరూ మీపిల్లలూ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు, ఏమంటారు?”

“మాకు వద్దండీ” మళ్ళీ అన్నదామె, “కానీ ఒక్క నిమిషం మిస్టర్‌ స్క్రైబ్నర్‌, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ఇది సరైన సమయమని నాకనిపిస్తోంది.” అలా అప్పుడు జరిగిన ఆసంభాషణ నా జీవితాన్నే మార్చేసింది! న్యూజెర్సీలోని యెహోవాసాక్షుల బెర్లిన్‌ సంఘ సభ్యురాలైన మిసెస్‌ స్టాక్‌హౌస్‌, ఈస్టర్‌ పండుగ ఎక్కడ ప్రారంభమైందో వివరించి నాకు మూడు చిన్న పుస్తకాలు ఇచ్చింది. వాటి పేర్లు, సేఫ్టీ, అన్‌కవర్డ్‌, ప్రొటెక్షన్‌. నేను ఆచిన్న పుస్తకాలు తీసుకుని ఇంటికి వెళ్ళాను, మనసులో ఉత్సుకతగా ఉన్నా కాస్త భయంగా కూడా ఉంది. మిసెస్‌ స్టాక్‌హౌస్‌ చెప్పినదాంట్లో నాకు ఇంతకు ముందే తెలిసినదేదో ఉన్నట్లనిపించింది, అది నా చిన్నప్పటి జ్ఞాపకాలకు సంబంధించినది.

బైబిలు విద్యార్థులతో తొలి పరిచయం

నేను 1907, జనవరి 31న పుట్టాను, 1915 లో నాకు ఎనిమిదేళ్ళప్పుడు మానాన్నగారు కాన్సర్‌తో చనిపోయారు. అందుకని, నేనూ మాఅమ్మ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మస్సాచుసెట్స్‌లోని మాల్డెన్‌లో ఒక పెద్దింట్లో ఉండనారంభించాము. మామామయ్య అత్తయ్య కూడా అక్కడే మూడో అంతస్తులో ఉంటున్నారు. మామయ్య పేరు బెన్‌, ఆయన 20వ శతాబ్దం ప్రారంభం కావడానికి ముందునుంచే బైబిలు విద్యార్థులతో సహవసిస్తున్నారు, యెహోవాసాక్షులు అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడేవారు. నాకు బెన్‌ మామయ్యంటే చాలా ఇష్టం, కానీ మెథడిస్టు చర్చికి చెందిన మాఅమ్మవైపు వాళ్లంతా ఆయనను వింత మనిషిగా చూసేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆయన భార్య విడాకులివ్వడానికి ముందు ఆయన మత విశ్వాసాల కారణంగా ఆయనను కొంతకాలంపాటు పిచ్చాసుపత్రిలో కూడా చేర్పించింది! బెన్‌ మామయ్యలో ఏ లోపమూ లేదని కొద్దిరోజులకే తెలుసుకోవడంతో ఆసుపత్రిలోని వైద్యులు మన్నించమని కోరుతూ ఆయనను విడుదల చేశారు.

బెన్‌ మామయ్య నన్ను తనతోపాటు బోస్టన్‌లోని అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల కూటాలకు తీసుకువెళ్ళేవాడు, ప్రత్యేకంగా వేరే ప్రాంతాల నుండి ప్రసంగీకులు వచ్చినప్పుడు, ప్రత్యేక సందర్భాల్లోను తీసుకువెళ్ళేవాడు. అలాంటి ఒక ప్రత్యేక సందర్భంలో వచ్చిన ప్రసంగీకుడు ఎవరో కాదు, ఆరోజుల్లో ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్న చార్లెస్‌ తేజ్‌ రస్సెలే. వేరొక ప్రత్యేక సందర్భం “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” ప్రదర్శన. అదెప్పుడో 1915 లో జరిగినా, నేటికీ అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించడానికి కొండపైకి తీసుకువెళ్తున్న చిత్రం నాకు స్పష్టంగా జ్ఞాపకముంది. (ఆదికాండము 22వ అధ్యాయం) యెహోవాపై అపారమైన నమ్మకంతో అబ్రాహాము ఇస్సాకుతోపాటు కర్రలు మోస్తూ కష్టపడి ఆకొండమీదికి ఎక్కడం నాకిప్పటికీ కనబడుతూనే ఉంది. నేను తండ్రి లేనివాడిని కావడంతో అది నన్ను చాలా ఆకట్టుకుంది.

అటు తరువాత బెన్‌ మామయ్య అత్తయ్యతోపాటు మెయిన్‌కి మారాడు, మాఅమ్మ మళ్ళీ పెళ్ళి చేసుకుని మమ్మల్ని న్యూజెర్సీకి తీసుకువచ్చింది. దాంతో చాలాకాలంపాటు నేను బెన్‌ మామయ్యను ఎక్కువగా కలవలేకపోయాను. న్యూజెర్సీలో నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు ప్రెస్బిటేరియన్‌ చర్చికి చెందిన ఒక కుటుంబాన్ని సందర్శిస్తూ ఉండేవాడిని, ఎనిమిది మంది పిల్లల్లో ఒకరైన మెరీయన్‌ నెఫ్‌ని అప్పుడే కలిశాను. వాళ్ళింటికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉండేది నాకు. నేనా కుటుంబంతోను వాళ్ళ చర్చి యువతీ యువకుల గుంపుతో ఎన్ని ఆదివారం సాయంత్రాలు గడిపానంటే, చివరికి నేను కూడా ప్రెస్బిటేరియన్‌ అయిపోయాను. అయినా, బైబిలు విద్యార్థుల కూటాల్లో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు నా మనస్సులో ఇంకా ఉన్నాయి. నేనూ మెరీయన్‌ 1928 లో పెళ్ళి చేసుకున్నాము, 1935, 1938 సంవత్సరాల్లో మాఇద్దరు అమ్మయిలు డోరిస్‌, లూయీస్‌లు పుట్టారు. తప్పటడుగులు వేస్తూ ఉన్న ఒక పాప, ఉయ్యాలలో మరో పాప ఉన్న మాకు మాకుటుంబాన్ని పెంచడానికి ఆధ్యాత్మిక నడిపింపు అవసరం ఉందని గ్రహించాము.

ఆ చిన్న పుస్తకాల్లో సత్యాన్ని కనుగొనడం

ఏదైనా ఒక చర్చిలో చేరదామని వెతుకుతున్న నేనూ మెరీయన్‌ ఒక పద్ధతి గురించి ఆలోచించాం. ప్రతి ఆదివారము వంతులవారిగా మాఇద్దర్లో ఒకరు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటుండగా, మరొకరు ఏదో ఒక చర్చికి వెళ్ళాలి. ఆఆదివారం ఇంటి దగ్గరుండే వంతు మెరీయన్‌ది, కానీ మిసెస్‌ స్టాక్‌హౌస్‌ ఇచ్చిన మూడు చిన్న పుస్తకాల్లో మొదటిదైన సేఫ్టీని చదువుదామని పిల్లల దగ్గర నేనుంటానని చెప్పాను. చదవడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపలేకపోయాను! ఏచర్చీ బోధించనిదాన్ని నేను కనుగొన్నానని నాకు చదివేకొద్దీ నమ్మకం ఏర్పడిపోయింది. ఆతర్వాతి ఆదివారమూ అలానే జరిగింది, చిన్న పుస్తకాల్లో రెండవదైన అన్‌కవర్డ్‌ చదువుతూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చేశాను. నేను చదువుతున్న విషయాలు ముందెక్కడో విన్నట్లుగా తోచింది. బెన్‌ మామయ్య నమ్ముతున్నది వీటినే కదూ? ఆయన మతం పిచ్చిదని మాకుటుంబంవారు అనుకున్నారు. మరి మెరీయన్‌ ఏమనుకుంటుంది? నేను పెద్దగా చింతించాల్సిన అవసరం లేకపోయింది. నేను అన్‌కవర్డ్‌ చదివిన కొద్దిరోజుల తర్వాత పని నుండి ఇంటికి వచ్చినప్పుడు, మెరీయన్‌ “మీరు ఇంటికి తెచ్చిన ఆచిన్న పుస్తకాల్ని నేను చదివాను. చదువుతుంటే చాలా ఆసక్తికరంగా ఉంది” అంటూ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గుండెలనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నాను!

ఆ చిన్న పుస్తకాల వెనుక అప్పుడే విడుదలైన శత్రువులు (ఆంగ్లం) అనే పుస్తకం గురించిన వివరాలున్నాయి, అది అబద్ధ మతాన్ని ఎండగడుతూ వ్రాయబడిన పుస్తకం. ఆపుస్తకాన్ని సంపాదించాలని మేము నిశ్చయించుకున్నాము. అయితే మేము మాఆర్డరుని పోస్టు చేయడానికి ముందే ఒక యెహోవాసాక్షి మాఇంటి తలుపు తట్టి అదే పుస్తకాన్ని అందించాడు. అంతే! మేము చర్చీలకు వెళ్ళడం మానుకుని, న్యూజెర్సీలోని కామ్‌డెన్‌లో ఉన్న యెహోవాసాక్షుల సంఘ కూటాలకు వెళ్ళడం ప్రారంభించాం. కొద్ది నెలల తరువాత, 1938, జూలై 31, ఆదివారం రోజున మేము 50 మందిమి కలిసి సహోదరి స్టాక్‌హౌస్‌ ఇంటి ముందు లాన్‌లో కలిసాము​—⁠అవును, నేను ఈస్టర్‌ కేకులు అమ్మడానికి ప్రయత్నించిన ఆఇంటి పెరట్లోనే. అక్కడ మేము బాప్తిస్మంపై జడ్జి రూథర్‌ఫోర్డ్‌ ఇచ్చిన రికార్డు చేయబడిన ప్రసంగం విన్నాము. ప్రసంగం తర్వాత మేమా ఇంట్లో మాబట్టలు మార్చుకుని మాలో 19 మందిమి దగ్గర్లోని ఒక సెలయేరులో బాప్తిస్మం పొందాము.

పయినీరు అవ్వాలని దృఢ నిశ్చయం

నా బాప్తిస్మం తర్వాత సంఘంలోని ఒక సహోదరి, బహిరంగ పరిచర్యను తమ ప్రధాన కార్యకలాపంగా చేసుకునే పయినీర్లని పిలువబడే వారి గురించి చెప్పింది. నాలో జిజ్ఞాస మొదలైంది, వెంటనే కుటుంబమంతా పయినీర్లుగా ఉన్న ఒక కుటుంబం గురించి తెలుసుకున్నాను. పెద్ద వయస్సున్న సహోదరుడు కోనిగ్‌, ఆయన భార్య, ఎదిగిన ఆయన కూతురు అందరూ దగ్గర్లోని ఒక సంఘంలో పయినీర్లే. చిన్న పిల్లలున్న కుటుంబానికి తండ్రినైన నేను కోనిగ్‌ కుటుంబ సభ్యులు పరిచర్యలో అనుభవిస్తున్న సంతోషాన్ని చూసి చాలా ప్రభావితం చెందాను. వారు ఇంటింటి పరిచర్యలో ఉన్నప్పుడు నేను నా బేకరీ ట్రక్కుని ఆపి అడపా దడపా వారితో సమయాన్ని గడిపేవాడిని. నేను కూడా పయినీరు అవ్వాలన్న కోరిక నాలో ప్రవేశించడానికి ఎంతోకాలం పట్టలేదు. కానీ ఎలా? మాకు ఇద్దరు పిల్లలున్నారు, నాకు తీరిక దొరకదు. చెప్పాలంటే, యూరప్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుండగా అమెరికాలోని మిలటరీలో యౌవనస్థులు చేరడం ఎక్కువైపోయింది. దాంతో పౌరసంబంధ ఉద్యోగాలు చేసే మాలాంటి వారికి పని ఒత్తిడి ఎక్కువైంది. నేను మరిన్ని అమ్మకాలు చేయాలని బలవంతపెడుతున్నారు, ఇలాంటి పనితో నేనిక ఎన్నడూ పయినీరు సేవ చేయడం అసాధ్యమని నాకర్థమైంది.

పయినీరు సేవ చేయాలన్న నా కోరికను గురించి సహోదరుడు కోనిగ్‌కి చెప్పినప్పుడు ఆయనిలా అన్నాడు: “యెహోవా సేవలో కష్టపడి పనిచేస్తూ ఉండు, నీ లక్ష్యాన్ని గురించి ప్రార్థనలో ఆయన ముందుంచు. దాన్ని సాధించడానికి ఆయనే నీకు సహాయం చేస్తాడు.” ఒక సంవత్సరం పైగా నేనలానే చేస్తూ వచ్చాను. మనం అడగడానికి ముందే మన అవసరాల గురించి యెహోవాకు తెలుసని హామీ ఇచ్చే మత్తయి 6:8 లాంటి వచనాల గురించి నేను తరచు తలపోస్తూ ఉండేవాడిని. అదే సమయంలో నేను మత్తయి 6:33 లోని సలహాను​—⁠దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకాలన్న సలహాను అనుసరించడానికి కూడా తదేకంగా ప్రయత్నించాను. ప్రాంతీయ పైవిచారణకర్తయైన సహోదరుడు మెల్విన్‌ విన్‌చెస్టర్‌ కూడా నన్ను ప్రోత్సహించాడు.

నా లక్ష్యాల గురించి మెరీయన్‌తో మాట్లాడాను. యెహోవాను శోధించి, ఆయన మనపై దీవెనల్ని కుమ్మరిస్తాడో లేదో చూడమని ప్రోత్సహిస్తున్న మలాకీ 3:​10 లోని మాటల్ని గురించి మేము మాట్లాడుకున్నాము. ఆమె ప్రతిస్పందనను చూసి నేను ప్రోత్సాహాన్ని పొందాను: “మీరు పయినీరు సేవ చేయాలనుకుంటే, నా మూలంగా ఆగవద్దు. మీరు పయినీరింగ్‌ చేస్తున్నప్పుడు పాపల్ని నేను చూసుకోగలను. మనకంత వస్తు సంపదలు కూడా అవసరం లేదు కదా?” మా12 ఏండ్ల వివాహజీవితంలో మెరీయన్‌ డబ్బు పొదుపుగా వాడుతుందని, బహు జాగ్రత్తపరురాలైన ఇల్లాలని గ్రహించాను. అటుతర్వాతి సంవత్సరాల్లో ఆమె నాకు పయినీరు భాగస్వామిగా అద్భుతంగా పనిచేసింది, మా60 ఏండ్ల పూర్తికాల సేవలోని విజయానికి రహస్యం ఏమిటంటే, ఎంతో ఎక్కువగా భావిస్తూ కొంచెంలోనే సంతృప్తిగా ఉండే ఆమె స్వభావమే.

ఎన్నో నెలలుగా ప్రార్థనాపూర్వకంగా ప్రణాళికలు వేసుకున్న తర్వాత నేనూ మెరీయన్‌ కొంత డబ్బును ఆదాచేసి దానితో, నేనూ నా కుటుంబమూ నివసించగల ఐదున్నర మీటర్ల పొడవున్న ట్రెయిలర్‌ వాహనాన్ని 1941 వేసవిలో కొన్నాము. నేను నా ఉద్యోగాన్ని వదులుకుని 1941 జూలైలో క్రమ పయినీరునయ్యాను, ఇక అప్పటి నుండి పూర్తికాల సేవలోనే ఉన్నాను. నా మొట్టమొదటి నియామకం రూట్‌ నంబరు 50 లో న్యూజెర్సీకీ మిస్సూరీలోని సెయింట్‌ లూయిస్‌కీ మధ్యనున్న 10 స్టాపుల మధ్యనున్న ప్రాంతము. ఆగస్టులో సెయింట్‌ లూయిస్‌లో మాసమావేశం జరగాల్సివుంది. ఆరూట్లోని సహోదరుల పేర్లు చిరునామాలు నాకు పంపించబడ్డాయి, నేను ఆయా ప్రాంతాలకు ఎప్పుడెప్పుడు చేరుకుంటానో వారికి ముందే ఉత్తరాలు వ్రాసి తెలియజేసేవాడిని. చివరికి మేము సమావేశానికి చేరుకుని పయినీర్‌ విభాగం దగ్గరికి వెళ్ళి మరో నియామకాన్ని పొందాల్సివుంది.

“నేను యెహోవాను శోధించబోతున్నాను”

మేము మాచిన్న ట్రెయిలర్‌ బండిలో ప్రచురణలను నింపుకొని సహోదరులకు వీడ్కోలు పలకడానికి కామ్‌డెన్‌లోని చివరి కూటానికి హాజరయ్యాము. మేము ఇద్దరు చిన్ని పాపలను చూసుకోవాలి, సమావేశం తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు, అందుకని మాకార్యవిధానాలు కాస్త తికమకగా ఉన్నట్లు సహోదరుల్లో కొందరికి అనిపించివుంటాయి. కొందరు, “త్వరలోనే మీరు తిరిగి వస్తారు” అన్నారు. నేను వారితో, “నేను రానని చెప్పడంలేదు. యెహోవా నన్ను చూసుకుంటాడని చెప్పాడు, కాబట్టి నేను యెహోవాను శోధించబోతున్నాను” అని చెప్పడం నాకు గుర్తుంది.

మస్సాచుసెట్స్‌ నుండి మిస్సిసిపీ వరకు 20 పట్టణాల్లో ఆరు దశాబ్దాలపాటు పయినీరు సేవచేసిన తరువాత, యెహోవా తన వాగ్దానాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకున్నాడని మేము ఇప్పటికీ చెప్పగలము. నాపైనా మెరీయన్‌పైనా మాఇద్దరు అమ్మాయిలపైనా ఆయన కుమ్మరించిన దీవెనలు వెనుకటికి 1941 నేనాశించిన వాటిని ఎంతో మించిపోయాయి. ఆదీవెనల్లో రెండు, మాఇద్దరు కూతుళ్ళు దగ్గర్లోని సంఘాల్లో పయినీర్లుగా విశ్వసనీయంగా సేవచేయడం, అమెరికాలోని తూర్పు తీరమంతట్లో అక్కడక్కడా ఉన్న (చివరిసారి లెక్కబెట్టినప్పుడు) దాదాపు వంద మంది ఆధ్యాత్మిక కుమారులు కుమార్తెలు ఉన్నారు. నేను అధ్యయనం చేసినవారిలో 52 మంది, మెరీయన్‌ అధ్యయనం చేసినవారిలో 48 మంది తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నారు.

1941 ఆగస్టులో మేము సెయింట్‌ లూయిస్‌కి చేరుకున్నాక నేనక్కడ బేతేలు నుండి వచ్చిన సహోదరుడు టీ.జె. సల్లివన్‌ను కలిశాను. ఆయన దగ్గర నన్ను మత పరిచారకునిగా నియమిస్తున్న ఉత్తరం ఉంది, అది ఎంతో అవసరం ఎందుకంటే యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి, యౌవనస్థుల్ని సైన్యంలో భర్తీ చేస్తున్నారు. నేను పరిచర్యలో ఎంత సమయం గడుపుతున్నానో దాదాపు అంతే సమయం నా భార్య కూడా గడుపుతుందనీ ఆమె కూడా నాతోపాటు పయినీరు సేవ చేయాలనుకుంటోందని సహోదరుడు సల్లివన్‌తో అన్నాను. సమావేశం వద్ద అప్పటికింకా పయినీరు విభాగాన్ని నెలకొల్పకపోయినా సహోదరుడు సల్లివన్‌ అప్పటికప్పుడు మెరీయన్‌ను పయినీరుగా నియమిస్తూ సంతకం చేసి మమ్మల్నిలా అడిగాడు: “సమావేశం తర్వాత మీరు పయినీరు సేవ ఎక్కడ చేయబోతున్నారు?” మాకు జవాబు తెలీదు. “కంగారు పడకండి” అని అభయమిస్తూ ఆయనిలా అన్నాడు: “పయినీర్ల అవసరం ఉన్న ప్రాంతంలోని వారెవరైనా ఈసమావేశంలో కలుస్తారు, అన్నీ సర్దుకుంటాయి. మీరెక్కడున్నారో మాకు తెలియజేస్తూ ఉత్తరం వ్రాయండి, మీకు నియామక ఉత్తరాన్ని పంపిస్తాము.” సరిగ్గా అలానే జరిగింది. మునుపు ప్రాంతీయ కాపరిగా సేవచేసిన సహోదరుడు జాక్‌ డ్వైట్‌కు వర్జీనియాలోని న్యూ మార్కెట్‌లో కొందరు వ్యక్తులు తెలుసు. వారికి అక్కడ ఒక పయినీరు గృహం ఉంది, అంతేకాదు మరికొంతమంది పయినీర్ల అవసరం కూడా అక్కడ ఉంది. అలా ఆసమావేశం తర్వాత మేము న్యూ మార్కెట్‌కు పయనమయ్యాము.

న్యూ మార్కెట్‌కి వెళ్ళేసరికి మాకోసం ఒక ఆశ్చర్యకరమైన విషయం వేచివుంది. పయినీరు సేవలో మాతోపాటు పనిచేయడానికి ఫిలడెల్ఫియా నుండి ఎవరొచ్చారనుకున్నారు? బెంజమిన్‌ రాన్సమ్‌! అవును, బెన్‌ మామయ్య! దాదాపు 25 సంవత్సరాల క్రితం బోస్టన్‌లో ఆయన నా హృదయంలో సత్యపు విత్తనాలు నాటిన తర్వాత, ఇప్పుడు ఇంటింటి పరిచర్యలో ఆయనతోపాటు పాల్గొనడం ఎంత ఆనందకరంగా ఉంది! సంవత్సరాలపాటు ప్రజల్లో ఉదాసీనతను, వారి నుండి ఎగతాళిని, చివరికి తన కుటుంబం నుండి హింసలను కూడా ఎదుర్కొన్నప్పటికీ బెన్‌ మామయ్య యెహోవా పట్ల, పరిచర్య పట్ల తన ప్రేమను కోల్పోలేదు.

న్యూ మార్కెట్‌లోని పయినీరు గృహంలో ఎనిమిది నెలలపాటు మేము ఎంతో ఆనందంగా గడిపాము. ఆసమయంలో మేమెన్నింటినో నేర్చుకొన్నాము, ఉదాహరణకు మేము సాహిత్యమిచ్చి కోళ్ళను కోడిగుడ్లను ఎలా మార్పిడి చేసుకోవచ్చో నేర్చుకున్నాము. తర్వాత నాకూ, బెన్‌ మామయ్యకు, మెరీయన్‌కు ఇంకా వేరే ముగ్గురికి పెన్సిల్వేనియాలోని హనోవర్‌లో ప్రత్యేక పయినీర్లుగా సేవచేయడానికి నియామకాలు వచ్చాయి​—⁠1942 నుండి 1945 వరకు పెన్సిల్వేనియాలో మేము పాల్గొన్న ఆరు సేవానియామకాల్లో ఇది మొదటిది.

రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రత్యేక పయినీరు సేవ

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు మాతటస్థత మూలంగా మేము చాలా వ్యతిరేకతను ఎదుర్కోవలసివచ్చింది, కానీ యెహోవా మాకు మద్దతునివ్వకుండా ఎన్నడూ ఉండలేదు. ఒకసారి మస్సాచుసెట్స్‌లోని ప్రావిన్స్‌టౌన్‌లో మాపాత బ్యూక్‌ కారు పాడైపోయింది, దాంతో నేను పునర్దర్శనాలు చేయడానికి ఎంతో శత్రుభావంతో ఉన్న క్యాథలిక్కుల ప్రాంతంగుండా కొన్ని కిలోమీటర్లు నడవాల్సివచ్చింది. అలా కొంతమంది గుండాల ముందు నుంచి వెళ్లాను, వాళ్ళు నన్ను గుర్తుపట్టి కేకలు వేయడం మొదలుపెట్టారు. నా చెవుల ప్రక్కనుండి రాళ్ళు రివ్వుమని దూసుకుపోతుండగా నేను ఆయౌవనస్థులు వెంటపడడం లేదు కదా అని అనుకుంటూనే పరుగెత్తాను. చివరికి ఎటువంటి గాయాలు తగలకుండానే సత్యంలో ఆసక్తిని చూపిస్తున్న ఒక వ్యక్తి ఇంటికి చేరుకున్నాను. కానీ అమెరికన్‌ మాజీ సైనికుల సంఘంలో గౌరవనీయ సభ్యుడైన ఆఇంటి యజమాని క్షమించమని కోరుతూ, “ఈ సాయంత్రం నేను మీతో సమయం గడపలేను, మేము టౌన్లోకి సినిమా చూడ్డానికి వెళ్తున్నామని మీకు చెప్పడం మర్చిపోయాను” అన్నాడు. ఆసందులో రాళ్ళు విసిరిన ఆరౌడీ మూక నేను మళ్ళీ అటువైపు తిరిగి వస్తానని వేచి చూస్తుంటారన్న తలంపు రాగానే నా గుండె బేజారైపోయింది. అయితే ఆయన, “మీరు మాతోపాటు నడవకూడదూ? దార్లో మాట్లాడుకుంటూ వెళ్దాము” అనగానే హమ్మయ్య అనుకున్నాను. అలా నేనాయనకు చక్కని సాక్ష్యం ఇవ్వగలిగాను, ఆసందు గుండా సురక్షితంగా ముందుకు వెళ్ళిపోయాము.

కుటుంబం పరిచర్యల మధ్య సమతూకం

యుద్ధం తర్వాత మేము వర్జీనియాలో అనేక నియామకాలను పొందాము, వాటిలో ఒక నియామకాన్ని నిర్వర్తిస్తూ షార్లట్స్‌విల్‌లో ప్రత్యేక, క్రమ పయినీర్లుగా ఎనిమిది సంవత్సరాలున్నాము. 1956కల్లా అమ్మాయిలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నేనూ మెరీయన్‌ మళ్ళీ మాపయనం ప్రారంభించాము. అలా వర్జీనియాలోని హారిసన్‌బర్గ్‌లో పయినీర్లుగాను నార్త్‌ కారొలైనాలో ప్రత్యేక పయినీర్లుగాను సేవచేశాము.

1966 లో నన్ను ప్రాంతీయ సేవలో నియమించారు, అంటే ఒక సంఘం నుండి మరో సంఘానికి ప్రయాణిస్తూ సహోదరులను ప్రోత్సహిస్తూ, సరిగ్గా 1930లలో న్యూజెర్సీలో సహోదరుడు విన్‌చెస్టర్‌ నన్ను ప్రోత్సహించినట్లే చేయాలన్నమాట. నేను రెండు సంవత్సరాలపాటు టెన్నెస్సీలోని ఒక సర్క్యూట్‌లోని సంఘాల్లో సేవచేశాను. తర్వాత మాకెంతో ప్రీతికరమైన ప్రత్యేక పయినీరింగ్‌లోకి మారమని మమ్మల్ని అడిగారు. అలా మేము 1968 నుండి 1977 వరకు అమెరికాలో పూర్తిగా దక్షిణంగా ఉన్న ప్రాంతంలో, జార్జియా నుండి మిస్సిసిపీ రాష్ట్రం వరకు ప్రత్యేక పయినీరు సేవ చేశాము.

జార్జియాలోని ఈస్ట్‌మన్‌లో నేను సంఘ పైవిచారణకర్తగా (ఇప్పుడు ప్రిసైడింగ్‌ పైవిచారణకర్త అని పిలువబడుతుంది) నియమించబడ్డాను. ఆస్థానంలో ముందు పావెల్‌ కిర్క్‌లాండ్‌ అనే ఎంతో ప్రియమైన వృద్ధ సహోదరుడు సేవచేశాడు, ఆయన ప్రాంతీయ పైవిచారణకర్తగా కూడా సేవచేశాడు, కానీ ఆరోగ్యం పాడుకావడం ప్రారంభమైంది. ఆయన హృదయం నిండా మెప్పుదల కలిగి, ఎంతో మద్దతును కూడా ఇచ్చేవాడు. ఆయన మద్దతు చాలా అవసరమైంది ఎందుకంటే సంఘ సభ్యుల మధ్య కొంత అసమ్మతి ఏర్పడింది, అందులో కొందరు ప్రముఖులు కూడా ఇమిడివున్నారు. వివాదం మరింత అధికం కావడంతో నేను యెహోవాకు ప్రార్థిస్తూ చాలా సమయాన్ని గడిపాను. సామెతలు 3:​5,6 వంటి వచనాలు నా మనస్సులోకి వచ్చాయి: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:​5,6) విషయాలను సామరస్యంగా చర్చించుకోవడానికి గట్టి కృషి సల్పడం ద్వారా మేము సంఘాన్ని ఐక్యపర్చగలిగాము, అందరికీ మంచి ఫలితాలు లభించాయి.

1977 లో మావార్థక్య ప్రభావాల్ని కాస్త అనుభవించడం ప్రారంభమైంది, అందుకని మమ్మల్ని, మాఇద్దరు కూతుళ్ళు తమ కుటుంబాలతోపాటు నివసిస్తున్న షార్లట్స్‌విల్‌ ప్రాంతంలో నియమించారు. గత 23 ఏండ్లుగా ఈప్రాంతంలో పనిచేయడం మాకు ఆనందకరమైన అనుభవంగా ఉంది, వర్జీనియాలోని రక్కర్స్‌విల్‌ సంఘాన్ని ప్రారంభించడంలో తోడ్పడ్డాము. మాతొలి బైబిలు విద్యార్థుల పిల్లలు, మనుమళ్ళు మనుమరాండ్రు పెరిగి పెద్దయి సంఘ పెద్దలుగా, పయినీర్లుగా, బేతేలు కుటుంబ సభ్యులుగా కావడం మాకు ఆనందకరంగా ఉంది. నేనూ మెరీయన్‌ ఇప్పటికీ మాక్షేత్ర సేవను చక్కగా చేయగలుగుతున్నాము, నేను షార్లట్స్‌విల్‌లోని తూర్పు సంఘంలో ఇప్పటికీ ఒక సంఘ పెద్దగా, పుస్తక అధ్యయన నిర్వాహకునిగా, బహిరంగ ప్రసంగీకునిగా చురుకుగా సేవచేయగలుగుతున్నాను.

ఈ సంవత్సరాలన్నింట్లో అందరూ ఎదుర్కొన్నట్లే మేమూ సమస్యల్ని ఎదుర్కొన్నాము. ఉదాహరణకు మేమెంత కృషి చేసినప్పటికీ డోరిస్‌ తన లేతవయస్సులోనే ఆధ్యాత్మికంగా బలహీనంగా అయిపోయింది, సాక్షికాని వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆమె యెహోవాపట్ల తనకున్న ప్రేమను ఎన్నడూ కోల్పోలేదు, ఆమె కుమారుడు బిల్‌ ఇప్పటికి 15 సంవత్సరాలుగా న్యూయార్క్‌లోని వాల్కిల్‌లోని బేతేలులో సేవచేస్తున్నాడు. డోరిస్‌, లూయీస్‌ ఇద్దరూ ఇప్పుడు విధవరాండ్రే, కానీ వారు దగ్గర్లో క్రమ పయినీర్లుగా ఆనందంగా సేవచేస్తున్నారు.

సంవత్సరాల అనుభవంలో నేర్చుకున్న పాఠాలు

నేను యెహోవా సేవలో విజయానికి కీలకమైన కొన్ని సరళమైన నియమాలను అన్వయించుకోవడం నేర్చుకున్నాను: జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోండి. మీఏకాంత జీవితంతో సహా మీప్రవర్తన అంతటిలో మాదిరికరంగా ఉండండి. అన్ని విషయాల్లోను “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” నడిపింపును అన్వయించుకోండి.​—⁠మత్తయి 24:⁠45.

పిల్లలను పెంచుతూనే విజయవంతంగా పయినీరు సేవ చేసేందుకు కావలసిన విషయాల ఒక చిన్న పట్టికను మెరీయన్‌ తయారు చేసింది, పట్టిక చిన్నదే అయినా చాలా ప్రభావవంతమైంది: ఆచరణయోగ్యమైన కార్య పట్టికను ఏర్పరచుకుని దానికి కట్టుబడి ఉండండి. మీపయినీరు పరిచర్యను ఒక నిజమైన వృత్తిగా చేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొంటూ ఉండండి. సరైన విశ్రాంతిని తీసుకోండి. వినోద కార్యకలాపాలను మితంగా ఉంచండి. మీపిల్లల జీవితాల్లో సత్యాన్నీ, పరిచర్యలోని అన్ని అంశాలనూ ఆనందించదగ్గ అనుభవాలుగా చేయండి. వారికి అన్ని సమయాల్లోను పరిచర్య ఆసక్తికరమైన అనుభవంగా ఉండేలా చేయండి.

మేమిప్పుడు 90వ పడిలో ఉన్నాము. స్టాక్‌హౌస్‌ ఇంటి ముందు పెరట్లో బాప్తిస్మం ప్రసంగం విని ఇప్పటికి 62 సంవత్సరాలు గడిచిపోయాయి, మేము 60 సంవత్సరాలు పూర్తికాల సేవలో గడిపాము. నేనూ మెరీయన్‌ మాజీవితంలో ప్రగాఢమైన సంపూర్ణమైన సంతృప్తితో ఉన్నామని నిజాయితీగా చెప్పగలము. యౌవనస్థుడైన తండ్రిగా నేను ఆధ్యాత్మిక లక్ష్యాల్ని ముందుంచాలనీ, వాటిని సాధించడానికి కృషిచేస్తూ ముందుకు సాగిపోవాలనీ నేను పొందిన ప్రోత్సాహాన్ని బట్టి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావాన్ని కలిగివున్నాను. నా ప్రియమైన భార్యయైన మెరీయన్‌కీ, నా పిల్లలకీ వాళ్ళు ఏళ్ళ తరబడి అందించిన మద్దతు నిమిత్తం నేనెంతో కృతజ్ఞుడను. మాకు వస్తుసంపదలు లేకపోయినా నేను తరచు ప్రసంగి 2:25NW లోని వచనాలను నాకు వర్తింపజేసుకుంటూ ఉంటాను: “నాకన్నా ఎవడు బాగా భోజనము చేసి పానము చేస్తాడు?”

నిజంగానే, మావిషయంలో మలాకీ 3:10 లోని వాగ్దానాన్ని యెహోవా మహా సమృద్ధిగా నెరవేర్చాడు. ఆయన నిజంగానే ‘పట్టజాలనంత విస్తారంగా మాపై దీవెనలను కుమ్మరించాడు’!

[29వ పేజీలోని బాక్సు/చిత్రం]

యుద్ధ సంవత్సరాల స్మృతులు

యుద్ధం జరిగి దాదాపు 60 సంవత్సరాలు కావస్తుండగా కూడా కుటుంబమంతటికీ ఆసంవత్సరాల స్మృతులు సుస్పష్టంగా ఉన్నాయి.

“పెన్సిల్వేనియా విపరీతమైన చలి ఉన్న ప్రదేశం, ఒక రాత్రి ఉష్ణోగ్రత మైనస్‌ 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకొంది” అని డోరిస్‌ గుర్తు చేసుకుంటోంది. లూయీస్‌ ఇలా అంటోంది: “నేనూ డోరిస్‌ మాపాత బ్యూక్‌ కారు వెనుక సీట్లో మాపాదాలు చల్లబడిపోకుండా ఉండేందుకు ఒకరి పాదాలపై మరొకరం కూర్చునేవాళ్ళము.”

డోరిస్‌ ఇంకా ఇలా అంటోంది: “కానీ మేమెన్నడూ బీదరికంలో ఉన్నట్లు లేదా ఏదో కొరతగా ఉన్నట్లు భావించలేదు. మేము మిగతా ప్రజలకన్నా ఎక్కువ ప్రాంతాల్లో తిరిగామని మాకు తెలుసు, కానీ మాకెప్పుడూ తినడానికి సమృద్ధిగా ఉండేది. ఒహాయోలోని మాతల్లిదండ్రుల స్నేహితుల అమ్మాయిలకు మాకన్నా కాస్త పెద్ద వయస్సు ఉంటుంది, వారి దగ్గర నుండి మాకు దాదాపు క్రొత్త బట్టలే వచ్చేవి, అలా ధరించడానికి చక్కని బట్టలుండేవి.”

“మమ్మీ డాడీలు మేమెప్పుడూ ప్రేమించబడుతున్నట్లే మేమంటే తమకు మెప్పుదల ఉన్నట్లే చూసుకున్నారు. పరిచర్యలో వారితోపాటు మేమెంతో సమయాన్ని గడిపేవాళ్ళము. అది మేము వారి దృష్టిలో ప్రత్యేకమైనవారిగా, వారికెంతో సన్నిహితమైనవారిగా భావించేలా చేసింది” అని లూయీస్‌ పేర్కొంటోంది.

పాల్‌ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నాకు ఒక 1936 బ్యూక్‌ స్పెషల్‌ ఉండేది. ఆమోడల్‌ కార్ల యాక్సిల్‌లు విరిగిపోవడం వాటి ప్రత్యేకత. ఇంజిన్‌ కారుకి అవసరమైన దానికన్నా పవర్‌ఫుల్‌గా ఉండేది. చలి విపరీతంగా ఉన్న రాత్రుల్లోనే అలా యాక్సిల్‌ విరిగిపోయేది, ఇక నేను మరో యాక్సిల్‌ కోసం పాతకార్లను పడేసే స్థలానికి పరుగెత్తేవాడిని. వాటిని మార్చడంలో నేను ఎక్స్‌పర్ట్‌ అయ్యాను.”

“రేషన్‌ కార్డుల సంగతి మర్చిపోయారేం” అంటుంది మెరీయన్‌, “ప్రతీదీ రేషన్‌ కార్డు మీదే తెచ్చుకోవాలి​—⁠మాంసం, పెట్రోలు, కార్ల టైర్లు, సమస్తమన్నమాట. మేము క్రొత్త నియామకానికి వెళ్ళినప్పుడల్లా స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి రేషన్‌ కార్డుకోసం దరఖాస్తు పెట్టుకునేవాళ్ళము. కొన్నిసార్లు క్రొత్తది రావడానికి కొన్ని నెలలు పట్టేది, తీరా మాకు అది అందేసరికి, మేము మరో స్థలానికి మారుతూ ఉండేవారము. పని మళ్ళీ మొదటికి వచ్చేది. కానీ యెహోవా మమ్మల్ని ఎల్లప్పుడూ చూసుకున్నాడు.”

[చిత్రం]

డోరిస్‌ (ఎడమ), లూయీస్‌లతో మెరీయన్‌ నేను, 2000

[25వ పేజీలోని చిత్రం]

1918 లో అమ్మతో, నాకప్పుడు పదకొండు

[26వ పేజీలోని చిత్రం]

లూయీస్‌, మెరీయన్‌, డోరిస్‌లతో 1948 లో, అమ్మాయిలు అప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు

[26వ పేజీలోని చిత్రం]

మా పెళ్ళి ఫోటో, 1928 అక్టోబరు

[26వ పేజీలోని చిత్రం]

1955 లో యాంకీ స్టేడియంలో మాపాపలు (ఎడమ, కుడి) నేను