యెహోవాను గూర్చిన పరిజ్ఞానాన్నిబట్టి ఆనందించండి
యెహోవాను గూర్చిన పరిజ్ఞానాన్నిబట్టి ఆనందించండి
‘దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు ధన్యులు.’—లూకా 11:28.
1. యెహోవా మానవులతో ఎప్పుడు సంభాషణ మొదలుపెట్టాడు?
యెహోవా మానవులను ప్రేమిస్తున్నాడు, వారి యోగక్షేమాలపట్ల ఆయనకెంతో ఆసక్తి ఉంది. కాబట్టి ఆయన వారితో సంభాషించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయనిలా సంభాషించడం ఏదెను తోటలోనే ప్రారంభమైంది. ఆదికాండము 3:8 ప్రకారం, ఒకసారి “చల్లపూట” ఆదాము హవ్వలు “దేవుడైన యెహోవా స్వరమును” విన్నారు. ఇది, బహుశా ప్రతిరోజు ఈసమయంలోనే ఆదాము హవ్వలతో సంభాషించడం యెహోవాకు వాడుక అనే విషయాన్ని సూచిస్తుందని కొందరు చెబుతారు. ఏదేమైనప్పటికీ, మొదటి మానవుడికి ఉపదేశాలు ఇవ్వడానికే గాక అతడు తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలంటే అతడేమి తెలుసుకోవలసి ఉందో బోధించడానికి కూడా దేవుడు సమయాన్ని వెచ్చించాడని బైబిలు స్పష్టం చేస్తోంది.—ఆదికాండము 1:28-30.
2. మొదటి దంపతులు తమను తాము యెహోవా నడిపింపు నుండి ఎలా వేరు చేసుకున్నారు, దాని ఫలితమేమిటి?
2 యెహోవా ఆదాము హవ్వలకు జీవాన్నిచ్చాడు, జంతుజాలముపై ఆధిపత్యాన్నిచ్చాడు, యావత్ భూమిపై అధికారాన్నిచ్చాడు. అయితే ఒకటి మాత్రం నిషేధించబడింది—వారు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను మాత్రం తినకూడదు. సాతాను ప్రభావం మూలంగా ఆదాము హవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. (ఆదికాండము 2:16,17; 3:1-6) వారు తమకేది తప్పో ఏది ఒప్పో తమకు తాముగా నిర్ణయించుకుంటూ స్వతంత్రంగా చర్య తీసుకోవడానికి ఎంపిక చేసుకున్నారు. అలా చేయడంలో, వారు తమ ప్రేమగల సృష్టికర్త ఇచ్చే నడిపింపు నుండి తమను తాము మూర్ఖంగా దూరం చేసుకున్నారు. దాని పర్యవసానాలు వారికీ, ఇంకా జన్మించని వారి సంతానానికీ నాశనకరంగా పరిణమించాయి. ఆదాము హవ్వలు వృద్ధులై, పునరుత్థానం చేయబడే నిరీక్షణ లేకుండా చివరికి మరణించారు. వారి సంతానం, పాపాన్ని దాని పర్యవసానమైన మరణాన్ని వారసత్వంగా పొందింది.—రోమీయులు 5:12.
3. యెహోవా కయీనుతో ఎందుకు సంభాషించాడు, కయీను ఎలా ప్రతిస్పందించాడు?
3 ఏదెను తోటలో తిరుగుబాటు జరిగినప్పటికీ, యెహోవా తన మానవ సృష్టితో సంభాషణ కొనసాగించాడు. ఆదాము హవ్వల మొదటి సంతానమైన కయీను పాపపు ప్రలోభానికి లొంగిపోయే ప్రమాదంలో ఉన్నాడు. అతడు సమస్యల్లో చిక్కుకోబోతున్నాడని యెహోవా అతడిని హెచ్చరించి, ‘సత్క్రియ చేయమని’ అతడికి ఉపదేశించాడు. కయీను ఈప్రేమపూర్వకమైన ఉపదేశాన్ని నిరాకరించి, తన తమ్ముడ్ని హత్యచేశాడు. (ఆదికాండము 4:3-8) అలా, తమకు తాము ప్రయోజనం చేకూర్చుకునేలా తన ప్రజలకు ఉపదేశాన్నిచ్చే దేవుడైన తమ జీవదాత తమకిచ్చిన స్పష్టమైన నిర్దేశాన్ని భూమిపైనున్న మొదటి ముగ్గురు మానవులూ తిరస్కరించారు. (యెషయా 48:17) యెహోవాకు ఇదెంత నిరాశను కలిగించి ఉంటుందో కదా!
పూర్వికులకు యెహోవా తనను తాను బయల్పరచుకున్నాడు
4. ఆదాము సంతానం గురించి యెహోవా ఏనమ్మకాన్ని కలిగివున్నాడు, దాన్ని మనస్సులో ఉంచుకుని ఆయన వారికి ఏనిరీక్షణ సందేశాన్నిచ్చాడు?
4 మానవులతో సంభాషించడాన్ని మానుకునే పూర్తి హక్కు యెహోవాకు ఉన్నప్పటికీ, ఆయనలా చేయలేదు. ఆదాము సంతానంలో కొందరు జ్ఞానయుక్తంగా తన ఉపదేశాన్ని వింటారన్న నమ్మకం ఆయనకుంది. ఉదాహరణకు, ఆదాము హవ్వలపై తీర్పును ప్రకటించేటప్పుడు, అపవాదియగు సాతానైన సర్పమును ఎదిరించే “సంతానము” రావడాన్ని గురించి యెహోవా ప్రవచించాడు. తగిన సమయంలో సాతాను తలపై ప్రాణాంతకమైన దెబ్బ పడుతుంది. (ఆదికాండము 3:15) ‘దేవుని వాక్యమును విని దానిని గైకొనువారికి’ ఈప్రవచనం ఆనందభరితమైన నిరీక్షణా సందేశంగా ఉంది.—లూకా 11:28.
5, 6. సా.శ.మొదటి శతాబ్దానికి ముందు యెహోవా తన ప్రజలతో ఎలా సంభాషించాడు, ఇది వారికెలా ప్రయోజనం చేకూర్చింది?
ఆదికాండము 6:13; నిర్గమకాండము 33:1; యోబు 38:1-3) ఆతర్వాత, ఆయన యావత్ నియమావళిగల ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి అందజేశాడు. మోషే ధర్మశాస్త్రం వారికి ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూర్చింది. దాన్ని అనుసరించడం ద్వారా ఇశ్రాయేలు జనాంగం ఇతర ప్రజల నుండి దేవుని ప్రత్యేక జనాంగంగా వేరుపరచబడింది. ఇశ్రాయేలీయులు గనుక ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, తాను వారిని వస్తుపరంగా ఆశీర్వదించడమే గాక, వారిని యాజక రూపమైన రాజ్యంగా పరిశుద్ధ జనాంగంగా చేస్తూ ఆధ్యాత్మికంగా కూడా ఆశీర్వదిస్తానని దేవుడు వారికి హామీ ఇచ్చాడు. ధర్మశాస్త్రం చివరికి మంచి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే ఆహార నియమావళిని, పారిశుద్ధ్య సూత్రాలను కూడా వారికిచ్చింది. అయితే, అవిధేయత చూపిస్తే వచ్చే దుఃఖకరమైన పర్యవసానాల గురించి కూడా యెహోవా హెచ్చరించాడు.—నిర్గమకాండము 19:5,6; ద్వితీయోపదేశకాండము 28:1-68.
5 యెహోవా నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోబు వంటి నమ్మకమైన పితరులకు తన చిత్తాన్ని తెలియజేశాడు. (6 తగిన కాలంలో, ప్రామాణిక బైబిలు పుస్తకాల పట్టికకు మరితర ప్రేరేపిత పుస్తకాలు కూడా చేర్చబడ్డాయి. చారిత్రక వృత్తాంతాలు జనాంగాలతోనూ, ప్రజలతోనూ యెహోవా వ్యవహారాల గురించి తెలియజేశాయి. కావ్యరూపంలోవున్న పుస్తకాలు ఆయన లక్షణాలను అందంగా అభివర్ణించాయి. ప్రవచనార్థక పుస్తకాలు భవిష్యత్తులో యెహోవా చిత్తం ఎలా నెరవేరుతుందో తెలియజేశాయి. ప్రాచీనకాల విశ్వాసులు ఈప్రేరేపిత వ్రాతలను జాగ్రత్తగా అధ్యయనం చేసి, అన్వయించుకున్నారు. ఒకరు ఇలా వ్రాశారు: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” (కీర్తన 119:105) వినడానికి ఇష్టపడే వారికి యెహోవా విద్యను, జ్ఞానాన్ని దయచేశాడు.
వెలుగు మరింత ప్రకాశమానం కావడం
7. యేసు అద్భుతాలు చేసినప్పటికీ, ఆయన ప్రాథమికంగా అందరికీ ఎలా తెలుసు, ఎందుకు?
7 మొదటి శతాబ్దానికల్లా, యూదా మతగుంపులు ధర్మశాస్త్రానికి మానవ ఆచారాలను జతచేశాయి. ధర్మశాస్త్రం తప్పుగా అన్వయించబడింది, అది జ్ఞానాన్ని అనుగ్రహించేదై ఉండే బదులు ఆఆచారాల మూలంగా అదొక భారంగా తయారైంది. (మత్తయి 23:2-4) అయితే, సా.శ.29 లో యేసు మెస్సీయగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మానవజాతి కోసం తన ప్రాణం అర్పించడానికే గాక “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు” కూడా వచ్చాడు. ఆయన అద్భుతాలు చేసినప్పటికీ, ఆయన ప్రాథమికంగా ‘బోధకునిగానే’ అందరికీ తెలుసు. ఆయన చేసిన బోధ, ప్రజల మనస్సుల్లో అలుముకుని ఉన్న ఆధ్యాత్మికాంధకారాన్ని పారద్రోలే వెలుగులా ఉంది. “నేను లోకమునకు వెలుగును,” అని యేసు సరిగ్గానే చెప్పాడు.—యోహాను 8:12; 11:28; 18:37.
8. సా.శ.మొదటి శతాబ్దంలో ఏప్రేరేపిత పుస్తకాలు వ్రాయబడ్డాయి, అవి తొలి క్రైస్తవులకు ఎలా ప్రయోజనం చేకూర్చాయి?
8 ఆతర్వాత, యేసు జీవితాన్ని గుర్చిన నాలుగు లిఖిత వృత్తాంతాలైన సువార్తలు, యేసు మరణం తర్వాత క్రైస్తవత్వ వ్యాప్తిని తెలియజేసే చరిత్రయైన అపొస్తలుల కార్యముల పుస్తకము చేర్చబడ్డాయి. వీటి తర్వాత, యేసు శిష్యులు వ్రాసిన ప్రేరేపిత లేఖలు, అలాగే ప్రవచనార్థక పుస్తకమైన ప్రకటన గ్రంథము చేర్చబడ్డాయి. హీబ్రూ లేఖనాలతో పాటు ఈవ్రాతలు మొత్తం ప్రామాణిక బైబిలు పుస్తకాల పట్టికగా రూపొందాయి. ఈప్రేరేపిత గ్రంథాలయం సహాయంతో, క్రైస్తవులు “సమస్త పరిశుద్ధులతోకూడ [సత్యపు] వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించ”డం సాధ్యమౌతుంది. (ఎఫెసీయులు 3:14-18) వారు “క్రీస్తు మనస్సు” కలిగివుండవచ్చు. (1 కొరింథీయులు 2:16) అయినప్పటికీ, ఆతొలి క్రైస్తవులు యెహోవా సంకల్పాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పూర్తిగా గ్రహించలేదు. అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులకు ఇలా వ్రాశాడు: “ఇప్పుడు [“లోహపు,” NW] అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము.” (1 కొరింథీయులు 13:12) లోహపు అద్దములో కేవలం అస్పష్టమైన రూపురేఖలనే చూడగలుగుతాము గానీ అన్ని వివరాలనూ స్పష్టంగా చూడడం సాధ్యం కాదు. దేవుని వాక్య సంపూర్ణ అవగాహన ఇంకా రాబోతోంది.
9. “అంత్యదినముల”లో ఏజ్ఞానాభివృద్ధి కలిగింది?
9 నేడు మనం “అపాయకరమైన కాలముల”చే గుర్తించబడిన, “అంత్యదినముల”ని పిలువబడుతున్న కాలంలో జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1) ఈకాలంలో “తెలివి [“నిజమైన పరిజ్ఞానము,” NW] అధికమగును” అని ప్రవక్తయైన దానియేలు ప్రవచించాడు. (దానియేలు 12:4) కాబట్టి, సంభాషించే కళలో సర్వశ్రేష్ఠుడైన యెహోవా, యథార్థ హృదయులు తన వాక్యభావాన్ని గ్రహించడానికి సహాయం చేశాడు. క్రీస్తు యేసు 1914 లో అదృశ్య పరలోకంలో సింహాసనాసీనుడయ్యాడని అనేకానేకమంది నేడు అర్థం చేసుకొంటున్నారు. త్వరలోనే ఆయన దుష్టత్వాన్నంతటినీ నిర్మూలిస్తాడనీ, యావత్ భూమిని పరదైసుగా మారుస్తాడనీ కూడా వాళ్లకు తెలుసు. రాజ్యసువార్తకు సంబంధించిన ఈప్రాముఖ్యమైన అంశం ఇప్పుడు భూవ్యాప్తంగా ప్రకటించబడుతోంది.—మత్తయి 24:14.
10. శతాబ్దాలన్నిటిలోనూ, ప్రజలు యెహోవా ఉపదేశానికి ఎలా ప్రతిస్పందించారు?
10 అవును, చరిత్రంతటిలోనూ యెహోవా తన చిత్తాన్ని, సంకల్పాన్ని గూర్చిన సమాచారం భూమిపైనున్న ప్రజలకు అందజేశాడు. విన్నవారనేకులు దైవిక జ్ఞానాన్ని అన్వయించుకుని, అందునుబట్టి ఆశీర్వదించబడ్డారని బైబిలు వృత్తాంతం వివరిస్తోంది. ఆదాము హవ్వల నాశనకరమైన మార్గాన్ని అనుసరిస్తూ దేవుని ప్రేమపూర్వకమైన ఉపదేశాన్ని తిరస్కరించిన ఇతరుల గురించి అది చెబుతోంది. సూచనార్థకమైన రెండు మార్గాల గురించి మాట్లాడినప్పుడు యేసు ఈపరిస్థితిని సోదాహరణంగా తెలియజేశాడు. ఒకటి నాశనానికి నడిపిస్తుంది. అది వెడల్పైనది, విశాలమైనది, దేవుని వాక్యాన్ని తిరస్కరించే అనేకులు దానిలో వెళ్తారు. మరో ద్వారం నిత్యజీవానికి నడిపిస్తుంది. అది ఇరుగ్గా ఉన్నప్పటికీ, బైబిలు నిజముగానే దేవుని వాక్యమని అంగీకరిస్తూ, దానికి అనుగుణంగా జీవించే కొద్దిమంది ఆమార్గంలో ఉన్నారు.—మత్తయి 7:13,14.
మనకున్నదాన్నిబట్టి కృతజ్ఞులము
11. మన బైబిలు జ్ఞానము, దానిపట్ల మనకున్న నమ్మకము దేనికి నిదర్శనంగా ఉన్నాయి?
11 మీరు జీవానికి నడిపించే ద్వారాన్ని ఎంపిక చేసుకున్నవారిలో ఉన్నారా? అలాగైతే, మీరు దానిపైనే ఉండాలని నిస్సందేహంగా కోరుకుంటారు. మీరలా ఎలా చేయగలరు? బైబిలు సత్యాలు మీజీవితానికి తెచ్చిన ఆశీర్వాదాల గురించి మెప్పుదలతో క్రమంగా ధ్యానించండి. మీరు సువార్తకు ప్రతిస్పందించారన్న వాస్తవమే దేవుని ఆశీర్వాదానికి నిదర్శనంగా ఉంది. ఈమాటలతో తన తండ్రికి ప్రార్థించినప్పుడు యేసు దానిని సూచించాడు: “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.” (మత్తయి 11:25) జాలరులు, సుంకరులు యేసు బోధల భావాన్ని గ్రహించారు, అయితే విద్యావంతులైన మతనాయకులు గ్రహించలేకపోయారు. యేసు ఇంకా ఇలా అన్నాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:44) మీరు బైబిలును తెలుసుకుని, దాని బోధలను విశ్వసిస్తూ వాటిని అనుసరిస్తుంటే, యెహోవా మిమ్మల్ని ఆకర్షించాడనటానికి అదే నిదర్శనం. అది ఆనందదాయకమైన విషయం.
12. బైబిలు ఏయే విధాలుగా జ్ఞానాభివృద్ధిని కలిగిస్తుంది?
12 దేవుని వాక్యంలో స్వతంత్రులను చేసే సత్యాలున్నాయి, జ్ఞానాభివృద్ధి కలుగజేసే విషయాలున్నాయి. కోట్లాదిమంది జీవితాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న మూఢనమ్మకాల నుండి, అబద్ధ బోధల నుండి, అజ్ఞానం నుండి బైబిలు పరిజ్ఞానం ప్రకారం జీవించే వారు విముక్తి చేయబడతారు. ఉదాహరణకు, ఆత్మను గురించిన సత్యాన్ని తెలుసుకోవడం, మృతులు మనకు హాని చేస్తారేమోననే భయం నుండి లేక మరణించిన మన ప్రియమైనవారు బాధపడుతున్నారేమోననే చింత నుండి మనల్ని విముక్తులను చేస్తుంది. దుష్టులైన దేవదూతలను గూర్చిన సత్యాన్ని తెలుసుకోవడం అభిచార సంబంధమైన విపత్తులను నివారించడానికి సహాయం చేస్తుంది. పునరుత్థాన బోధ, తమ ప్రియమైన వారిని మరణమందు కోల్పోయిన వారికి ఓదార్పునిస్తుంది. (యోహాను 11:25) బైబిలు ప్రవచనాలు, మనం కాల ప్రవాహంలో ఎక్కడున్నామో చూపించి, భవిష్యత్తు కోసం దేవుడిచ్చిన వాగ్దానాలందు మనకు నమ్మకాన్ని కలిగిస్తాయి. నిరంతరం జీవించడమనే మన నిరీక్షణను అవి బలోపేతం కూడా చేస్తాయి.
13. దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టడం మనకు శారీరకంగా ఎలా సహాయం చేస్తుంది?
13 బైబిలులోని దైవిక సూత్రాలు, శారీరకమైన ప్రయోజనాలు చేకూరేవిధంగా జీవించడాన్ని మనకు బోధిస్తాయి. ఉదాహరణకు, పొగాకు, మరితర మత్తుపదార్థాల సేవనం వంటి మన శరీరాలను కలుషితం చేసే అలవాట్ల నుండి దూరంగా ఉండాలని మనం నేర్చుకొంటాం. మత్తుపానీయాల దుర్వినియోగాన్ని కూడా విసర్జిస్తాము. (2 కొరింథీయులు 7:1) దేవుని నైతిక సూత్రాలను అనుసరించడం లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది. (1 కొరింథీయులు 6:18) ధనాపేక్షకు దూరంగా ఉండమని దేవుడిస్తున్న ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా మనం మన మనశ్శాంతిని పాడుచేసుకోము, అనేకులు ధనసంపదల వెంటపడి తమ మనశ్శాంతిని కోల్పోయారు. (1 తిమోతి 6:10) దేవుని వాక్యాన్ని మీజీవితంలో అన్వయించుకోవడం ద్వారా మీరు శారీరకంగా ఏయే విధాలుగా ప్రయోజనం పొందారు?
14. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
14 మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, యెహోవా పరిశుద్ధాత్మను పొందుతాము. మనం కనికరం, కరుణ వంటి రమ్యమైన లక్షణాలతో కూడిన క్రీస్తువంటి వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటాము. (ఎఫెసీయులు 4:24,32) దేవుని ఆత్మ మనలో దాని ఫలాలైన—ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహములను కూడా ఫలింపజేస్తుంది. (గలతీయులు 5:22,23) ఈలక్షణాలు కుటుంబ సభ్యులతో సహా ఇతరులతో సంతోషకరమైన, అర్థవంతమైన సంబంధాలను పెంపొందింపజేస్తాయి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేసే అంతర్గత బలాన్ని మనం పొందుతాం. మీజీవితం మెరుగయ్యే విధంగా పరిశుద్ధాత్మ ఎలా ప్రభావితం చేసిందో మీరు గ్రహించారా?
15. మనం మన జీవితాలను దేవుని చిత్తానికి అనుగుణంగా మలచుకుంటుండగా, మనమెలా ప్రయోజనం పొందుతాము?
15 మనం మన జీవితాలను యెహోవా చిత్తానికి అనుగుణంగా మలచుకున్నప్పుడు, మనమాయనతో మనకున్న సంబంధాన్ని బలపరచుకుంటాము. ఆయన మనల్ని అర్థం చేసుకుని, మనల్ని ప్రేమిస్తున్నాడన్న మన నమ్మకం దృఢపడుతుంది. ఆయన మనకు కష్టకాలాల్లో మద్దతునిస్తాడని మనం అనుభవం ద్వారా తెలుసుకుంటాం. (కీర్తన 18:18) ఆయన నిజంగా మన ప్రార్థనలను వింటాడని మనం గ్రహిస్తాం. (కీర్తన 65:2) ఆయనిచ్చే నడిపింపు మనకు ప్రయోజనం చేకూరుస్తుందన్న నమ్మకంతో మనం ఆయన నడిపింపుపై ఆధారపడతాం. దేవుడు తన నిర్ణీత సమయంలో నమ్మకమైన వారిని పరిపూర్ణతకు తీసుకువచ్చి, వారికి నిత్యజీవ బహుమానాన్ని అనుగ్రహిస్తాడనే అద్భుతమైన నిరీక్షణ మనకుంది. (రోమీయులు 6:23) శిష్యుడైన యాకోబు, “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని వ్రాశాడు. (యాకోబు 4:8) మీరు యెహోవాకు సన్నిహితమవుతుండగా ఆయనతో మీకున్న సంబంధం బలపరచబడుతున్నట్లు మీరు భావించారా?
అనుపమానమైన సంపద
16. కొంతమంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏమార్పులు చేసుకొన్నారు?
16 మొదటి శతాబ్దానికి చెందిన ఆత్మాభిషిక్త క్రైస్తవులలో కొందరు ఒకప్పుడు జారులుగా, వ్యభిచారులుగా, స్వలింగసంయోగులుగా, దొంగలుగా, లోభులుగా, త్రాగుబోతులుగా, దూషకులుగా, దోచుకొనేవారిగా ఉండేవారని పౌలు వారికి గుర్తు చేశాడు. (1 కొరింథీయులు 6:9-11) బైబిలు సత్యం వారు గణనీయమైన మార్పులు చేసుకునేలా చేసింది; వారు ‘కడుగబడ్డారు.’ మీరు బైబిలు నుండి నేర్చుకొన్న స్వతంత్రులను చేసే సత్యాలు లేకుండా మీజీవితం ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించండి. నిజంగా సత్యం అనుపమానమైన సంపద. యెహోవా మనతో సంభాషిస్తున్నందుకు మనమెంతగా సంతోషిస్తున్నామో కదా!
17. క్రైస్తవ కూటాల్లో యెహోవాసాక్షులు ఆధ్యాత్మికంగా ఎలా పోషించబడుతున్నారు?
17 అంతేగాక, విభిన్న జాతులతో కూడిన సహోదరత్వంలో మనకున్న ఆశీర్వాదం గురించి ఆలోచించండి! ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు’ అనేక భాషల్లో మనకు బైబిళ్ళు, పత్రికలు, ఇతర ప్రచురణలతో సహా తగిన సమయంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని అందజేస్తున్నాడు. (మత్తయి 24:45-47) అనేక దేశాల్లోని యెహోవాసాక్షులు 2000వ సంవత్సరంలో, తమ సంఘ కూటాల్లో హీబ్రూ లేఖనాల్లోని ఎనిమిది పెద్ద పుస్తకాల నుండి ఉన్నతాంశాలను పరిశీలించారు. లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే రెండు పుస్తకాల్లో చర్చించబడిన 40 మంది బైబిలు వ్యక్తుల జీవితాలను గూర్చి ధ్యానించారు. వారు జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకంలో దాదాపు నాలుగవ వంతును, దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! అనే పుస్తకాన్ని దాదాపు మొత్తంగాను పరిశీలించారు. యాభైరెండు అధ్యయన ఆర్టికల్లతో పాటు కావలికోట పత్రిక నుండి 32 ఇతర ఆర్టికల్లు పరిశీలించబడ్డాయి. ఇంకా, యెహోవా ప్రజలు మన రాజ్యపరిచర్య 12 సంచికలతోనూ, వివిధ బైబిలు అంశాలపై వారపు బహిరంగ ప్రసంగాలతోనూ పోషించబడ్డారు. ఎంతటి ఆధ్యాత్మిక పరిజ్ఞాన సంపద లభ్యం చేయబడిందో కదా!
18. క్రైస్తవ సంఘంలో మనకు ఏయే విధాలుగా సహాయం లభిస్తుంది?
18 ప్రపంచవ్యాప్తంగా, 91,000 పైచిలుకు సంఘాలు కూటాల ద్వారానూ, సహవాసం ద్వారానూ మద్దతును, ప్రోత్సాహాన్ని అందజేస్తున్నాయి. మనకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి ఇష్టపడే, పరిణతి చెందిన తోటి క్రైస్తవుల మద్దతు కూడా మనకుంది. (ఎఫెసీయులు 4:11-13) అవును, మనం సత్య పరిజ్ఞానాన్ని పొంది ఎంతగానో ప్రయోజనం పొందాము. యెహోవాను తెలుసుకుని ఆయనను సేవించడం ఆనందదాయకమైన విషయం. “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు” అని వ్రాసిన కీర్తనకర్త మాటలు ఎంత నిజమో కదా!—కీర్తన 144:15.
మీకు జ్ఞాపకం ఉన్నాయా?
• క్రైస్తవపూర్వ కాలాల్లో యెహోవా ఎవరితో సంభాషించాడు?
• ఆధ్యాత్మిక వెలుగు మొదటి శతాబ్దంలోనూ, ఆధునిక కాలాల్లోనూ ఎలా ప్రకాశవంతమయ్యింది?
• యెహోవాను గూర్చిన పరిజ్ఞానానికి అనుగుణంగా జీవించడం ద్వారా ఏఆశీర్వాదాలు లభిస్తాయి?
• దేవుని గూర్చిన పరిజ్ఞానాన్ని బట్టి మనమెందుకు ఆనందిస్తాము?
[అధ్యయన ప్రశ్నలు]
[8, 9వ పేజీలోని చిత్రాలు]
యెహోవా నోవహుకు, అబ్రాహాముకు, మోషేకు తన చిత్తాన్ని తెలియజేశాడు
[9వ పేజీలోని చిత్రం]
మన కాలంలో యెహోవా తన వాక్యంపై వెలుగును ప్రసరింపజేశాడు
[10వ పేజీలోని చిత్రాలు]
మనకున్న భిన్నజాతుల సహోదరత్వమనే ఆశీర్వాదం గురించి ఆలోచించండి!