కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు ఆమె కన్నీటిని తుడిచాడు

దేవుడు ఆమె కన్నీటిని తుడిచాడు

రాజ్య ప్రచారకుల నివేదిక

దేవుడు ఆమె కన్నీటిని తుడిచాడు

యెహోవా నియమాలకు సూత్రాలకు అనుగుణంగా ప్రజలు తమ జీవితాలను మార్చుకున్నప్పుడు వారెంతో ఆశీర్వదించబడతారు. అవసరమైన మార్పులను చేసుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు, అయినా సహాయమూ ప్రోత్సాహమూ పూర్తి అందుబాటులో ఉన్నాయి. (కీర్తన 84:​11) ఆగ్నేయాసియా నుండి వచ్చిన ఈక్రింది అనుభవం దాన్ని రుజువు చేస్తుంది.

ఫ్రాన్స్‌లోని ఒక యెహోవాసాక్షి సహోదరి సెలవుల్లో ఉండగా కిమ్‌ * అనే ఒక దుకాణ యజమానురాలితో, భూమిపట్ల యెహోవా సంకల్పమేమిటో మాట్లాడింది. ఆసహోదరి కిమ్‌కు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని కూడా ఇచ్చింది. ఆపుస్తకాన్ని తిరగేస్తున్నప్పుడు కిమ్‌కు “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును” అన్న మాటలు కనిపించాయి. (ప్రకటన 21:⁠4) “ఆ వచనం నన్ను బాగా కదిలించింది” అని కిమ్‌ జ్ఞాపకం చేసుకుంటోంది. “దుకాణంలో ఉన్నప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే నేను సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటానని ఎవరూహించగలరు?” ఆమె తన దుఃఖానికిగల కారణాన్ని వెల్లడిచేస్తూ ఇలా చెబుతోంది: “నేనొకాయనతో గత 18 ఏండ్లుగా కలిసి ఉంటున్నాను. ఆయన నన్ను పెండ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో నేను చాలా దుఃఖపడ్డాను. ఈజీవితానికి స్వస్తి పలకాలని నేను కోరుకున్నాను, కానీ ఆయనతో ఇంత కాలం సహజీవనం చేసినందున నాలో ఆధైర్యం కలగలేదు.”

కొంత కాలం తర్వాత కిమ్‌ లిన్‌ అనే యెహోవాసాక్షితో బైబిలు అధ్యయనం చేయడానికి సమ్మతించింది. “బైబిలు బోధలను నా జీవితంలో ఆచరణలో పెట్టాలని నేనెంతో కోరుకున్నాను” అంటుంది కిమ్‌. ఆమె ఇంకా ఇలా అంటోంది: “ఉదాహరణకు, నేను నా పూర్వికులను ఆరాధించడం మానేశాను, అందుమూలంగా నా కుటుంబం నన్ను వ్యతిరేకించింది, అయినా నేను పట్టు వదలలేదు. అంతేకాదు, మాసంబంధాన్ని చట్టబద్ధం చేయడానికి నేను ప్రయత్నించాను కానీ ఆయనలా చేయడానికి నిరాకరించాడు. ఈకష్టకాలమంతటిలో ఫ్రాన్స్‌లోని సాక్షి నాకు బైబిలు ప్రచురణలు పంపిస్తూనే ఉంది, లిన్‌ కూడా నన్నెంతో ప్రోత్సహించింది. ఈసహోదరీల ఓపిక, ప్రేమపూర్వకమైన మద్దతు నేను పట్టుదలతో కొనసాగేలా చేశాయి, చివరికి నేను కలిసి ఉంటున్న వ్యక్తి నిజ స్వరూపమేమిటో గ్రహించగలిగాను. ఆయనకు అప్పటికే ఐదుగురు ‘భార్యలు,’ 25 మంది పిల్లలు ఉన్నట్లు నేను తెలుసుకున్నాను! దాంతో నేనాయన్ని విడిచిపెట్టడానికి ధైర్యాన్ని కూడగట్టుకోగలిగాను.

“అన్ని సౌకర్యాలూ ఉన్న పెద్ద ఇల్లును విడిచిపెట్టుకుని చిన్న అపార్ట్‌మెంటులోకి మారడం అంత సులభం కాదు. అంతేకాదు, నేనింతకు ముందు కలిసివున్న వ్యక్తి తనతో ఉండమని నన్ను మళ్ళీ ఒత్తిడిచేశాడు, నేను కాదంటే, ఆసిడ్‌ పోసి నన్ను కురూపిగా చేస్తానని బెదిరించాడు కూడా. యెహోవా సహాయంతో సరైనదేదో అది చేయగలిగాను.” కిమ్‌ అభివృద్ధి చెందుతూ ముందుకు సాగింది, చివరికి 1998 ఏప్రిల్‌లో బాప్తిస్మం పొందింది. అంతేకాదు, ఆమె అక్కా, చెల్లి, ఆమె టీనేజ్‌ కుమారుడు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించారు.

“నా జీవితం నిరాశానిస్పృహలతోనే నిండివుంటుందని నేననుకునే దాన్ని. కానీ ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను, రాత్రుళ్ళు ఏడవడం లేదు. యెహోవా ఇప్పటికే నా కన్నీటిని తుడిచేశాడు” అంటుంది కిమ్‌.

[అధస్సూచి]

^ పేరా 4 పేర్లు మార్చబడ్డాయి.