క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాల్లో ఎలా ఏలగలదు?
క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాల్లో ఎలా ఏలగలదు?
“క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి.”—కొలొస్సయులు 3:15.
1, 2. “క్రీస్తు అనుగ్రహించు సమాధానము” ఒక క్రైస్తవుని హృదయాన్ని ఏ విధంగా ఏలుతుంది?
ఏలబడడం, ఒకరి క్రింద పనిచేయడమంటే చాలామందికి రుచించదు, ఎందుకంటే అది బలవంతంగా, నేర్పుగా లోబరచుకోవడం అన్న తలంపులను మనస్సుకు తెస్తుంది. అందుకనే కొలొస్సయిలోని తోటి క్రైస్తవులకు పౌలు “క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి” అని ఇచ్చిన ఉద్బోధ కొందరికి నిర్హేతుకమైనదిగా అనిపిస్తుండవచ్చు. (కొలొస్సయులు 3:15) ఏం, మనకు స్వేచ్ఛా చిత్తం లేదా? మన హృదయాలను ఎవరో ఏలడమేమిటి? ఏదో నియంత్రించడమేమిటి?
2 కొలొస్సయులు తమ స్వేచ్ఛా చిత్తాన్ని వదులుకోవాలని పౌలు చెప్పడం లేదు. కొలొస్సయులు 3:15 లో “ఏలుచుండ నియ్యుడి” అని అనువదించబడిన గ్రీకు పదం, ఆకాలంలోని ఆటల పోటీల్లో బహుమతులను నిర్ధారించే అంపైర్‌కి ఉపయోగించే పదానికి దగ్గరగా ఉంటుంది. నియమాల పరిధిలో ఆటగాళ్ళకు కాస్త స్వేచ్ఛ ఉన్నా, చివర్లో ఎవరు నియమాలను అనుసరించారు తద్వారా పోటీల్లో ఎవరు నెగ్గారు అనేవి అంపైర్ నిర్ణయించేవాడు. అదే విధంగా, జీవితంలో అనేకమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మనకు ఉంది, కానీ మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాల్లో ఎల్లప్పుడు “అంపైర్”గా ఉండాలి—లేదా, అనువాదకుడైన ఎడ్గార్ జె.గుడ్‌స్పీడ్ అనువదించినట్లుగా అది మన హృదయాల్లో “నిర్దేశక సూత్రంగా” ఉండాలి.
3. “క్రీస్తు అనుగ్రహించు సమాధానము” అంటే ఏమిటి?
3 “క్రీస్తు అనుగ్రహించు సమాధానము” అంటే ఏమిటి? మనం యేసు శిష్యులమైనప్పుడు, యెహోవా దేవుడూ ఆయన కుమారుడూ మనల్ని ప్రేమిస్తున్నారని మనల్ని ఆమోదిస్తున్నారని తెలుసుకున్నప్పుడు మనం పొందే ప్రశాంతత, మనం అనుభవించే మనశ్శాంతే ఆసమాధానము. యేసు తన శిష్యులను విడిచి వెళ్ళేముందు వారికిలా చెప్పాడు: “నా శాంతినే [“సమాధానమునే,” అధస్సూచి] మీకనుగ్రహించుచున్నాను. ... మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.” (యోహాను 14:27) క్రీస్తు శరీరంలో సభ్యులైన నమ్మకమైన అభిషిక్తులు, దాదాపు 2,000 సంవత్సరాలనుండి ఆసమాధానమును ఆనందిస్తున్నారు, నేడు వారి సహవాసులైన “వేరే గొఱ్ఱెలు” దానిలో పాలుపంచుకుంటున్నారు. (యోహాను 10:16) ఆసమాధానము మన హృదయాల్లో ఏలేటువంటిదిగా ఉండాలి. కఠోరమైన పరీక్షల నెదుర్కుంటున్నప్పుడు మనం భయపడకుండా లేదా అతిగా కలవరపడకుండా ఉండడానికి అది మనకు సహాయంగా ఉండగలదు. మనకు అన్యాయం జరిగినప్పుడు, చింతలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, ఎందుకూ పనికిరామన్న భావనలు పట్టిపీడిస్తున్నప్పుడు ఇదెలా సహాయపడగలదో మనం తెలుసుకుందాం.
మనకు అన్యాయం జరిగినప్పుడు
4. (ఎ) యేసు ఎలాంటి అన్యాయాలకు గురయ్యాడు? (బి)అన్యాయాలను ఎదుర్కొన్న క్రైస్తవులు ఎలా ప్రతిస్పందించారు?
4 సొలొమోను రాజు ఇలా అన్నాడు: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” (ప్రసంగి 8:9) ఈమాటల్లో ఎంత నిజం ఉందో యేసుకు తెలుసు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు, మానవులు ఒకరికొకరు తలపెట్టిన ఘోరమైన అన్యాయాలను చూశాడు. భూమ్మీద ఉన్నప్పుడు, పాపరహితుడైన తనపై దైవదూషణ నిందారోపణ వేసి తనను నేరస్థుడికి విధించే చావుకు గురిచేసినప్పుడు ఆయన వ్యక్తిగతంగా అన్యాయాలకే అన్యాయం అనదగ్గదాన్ని అనుభవించాడు. (మత్తయి 26:63-66; మార్కు 15:27) నేడు అన్యాయాలు పెచ్చుపెరిగిపోతున్నాయి, నిజ క్రైస్తవులు “సకల జనములచేత ద్వేషింపబడు[తూ]” ఎన్నో బాధలనుభవించారు. (మత్తయి 24:9) అయినా, నాజీల మరణ శిబిరాల్లోను, సోవియట్ల గూలాగ్‌లనే కార్మిక శిబిరాల్లోను ఎన్నెన్నో దారుణాలను అనుభవించినా అల్లరిమూకల దాడులకు, అబద్ధ ఆరోపణలకు, తప్పుడు నిందలకు గురైనా క్రీస్తు అనుగ్రహించే సమాధానము వారు దృఢంగా నిలిచేలా కాపాడింది. వారు యేసును అనుకరించారు, ఆయన గురించి మనం ఇలా చదువుతాము: “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.”—1 పేతురు 2:23.
5. సంఘంలో ఏదైనా అన్యాయం జరిగిందని మనం విన్నప్పుడు మొట్టమొదట మనం దేన్ని పరిగణలోకి తీసుకోవాలి?
5 ఇంకా చిన్న స్థాయిలో చూస్తే, క్రైస్తవ సంఘంలో ఒకరితో అన్యాయంగా వ్యవహరించారని మనకు అనిపించవచ్చు. అలాంటి సందర్భంలో మనం పౌలులానే భావిస్తుండవచ్చు, ఆయనిలా అన్నాడు: “ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?” (2 కొరింథీయులు 11:29) అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘అది నిజంగా అన్యాయమేనా?’ సాధారణంగా జరిగేదేమంటే మనకు వాస్తవాలన్నీ స్పష్టంగా తెలీవు. జరిగిందంతా తనకు తెలుసని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి చెప్పేది విన్న తర్వాత మనం మరీ తీవ్రంగా ప్రతిస్పందిస్తుండవచ్చు. అలాంటి సందర్భానికి తగినట్లు బైబిలు ఇలా అనడానికి మంచి కారణమే ఉంది: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును.” (సామెతలు 14:15) కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
6. సంఘంలో అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు మనమెలా ప్రతిస్పందించవచ్చు?
6 అయితే, అన్యాయం మనకే జరిగిందని మనకు అనిపిస్తే అప్పుడేమిటి? తన హృదయంలో క్రీస్తు అనుగ్రహించిన సమాధానమున్న వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడు? మన పట్ల తప్పు చేశాడని అనిపించిన వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం ఉందని మనకనిపించవచ్చు. అటు తర్వాత, వినే ప్రతి ఒక్కరితో ఆవిషయాన్ని చర్చించడానికి బదులుగా ఆవిషయాన్ని ప్రార్థనలో ఎందుకు యెహోవా ముందుంచకూడదు, న్యాయం జరిగేలా చూస్తాడని ఆయనపై ఎందుకు నమ్మకం ఉంచకూడదు? (కీర్తన 9:10; సామెతలు 3:5) అలా చేసిన తర్వాత, ఆవిషయాన్ని మన హృదయాల్లోనే పరిష్కరించుకుని ‘ఊరకుండడంతోనే’ సంతృప్తి చెందవచ్చు. (కీర్తన 4:4) అత్యధిక సందర్భాల్లో పౌలు ఇచ్చిన ఈఉద్బోధ వర్తిస్తుంది: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.”—కొలొస్సయులు 3:13.
7. మన సహోదరులతో మన వ్యవహారాల్లో మనమెల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకోవలసినది ఏమిటి?
7 అయితే మనమేం చేసినా ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది: జరిగిపోయిన దానిని మనం అదుపు చేయలేకపోయినా, మనం మన ప్రతిస్పందనను అదుపు చేసుకోగలం. అన్యాయం జరిగిందని మనకు అనిపించినప్పుడు సమతుల్యాన్ని కోల్పోయి ప్రతిస్పందిస్తే, జరిగిన అన్యాయం కంటే కూడా అది మన శాంతిపైన హానికరమైన ప్రభావాన్ని చూపగలదు. (సామెతలు 18:14) చివరికి బహుశ మనం అభ్యంతరపడి, న్యాయం జరిగిందని మనకు అనిపించేంత వరకు సంఘంతో సహవసించడం మానేస్తుండవచ్చు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు “తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు” అని కీర్తనకర్త వ్రాశాడు. (కీర్తన 119:165) నిజం ఏమిటంటే, ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు అన్యాయాలను అనుభవిస్తూనే ఉంటారు. అలాంటి చేదైన అనుభవాలను మీరు యెహోవాకు చేసే సేవలో జోక్యం చేసుకోవడానికి అనుమతించకండి. బదులుగా క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీహృదయాలలో ఏలనివ్వండి.
చింతల్లో మనం చిక్కుకున్నప్పుడు
8. చింతలను పుట్టించే కొన్ని విషయాలు ఏమిటి, చింతల మూలంగా ఏమి జరుగుతుండవచ్చు?
8 చింతలనేవి ఈ“అంత్యదినములలో” జీవితంలో అనివార్యమైన భాగంగా తయారయ్యాయి. (2 తిమోతి 3:1) “ఏమి తిందుమో, అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి” అని యేసు అన్నాడన్నది నిజమే. (లూకా 12:22) కానీ చింతలన్నీ వస్తుసంపదల గురించి మాత్రమే ఉత్పన్నం కావు. సొదొమ ఎంతటి నైచ్య స్థితికి దిగజారిందో చూసి లోతు ‘బహు బాధపడ్డాడు.’ (2 పేతురు 2:7) “సంఘములన్నిటిని గూర్చిన చింత” పౌలును చుట్టు ముట్టింది. (2 కొరింథీయులు 11:28) యేసు తన మరణానికి ముందటి రాత్రి ఎంత వ్యధను అనుభవించాడంటే “ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” (లూకా 22:44) దీన్ని బట్టి స్పష్టమౌతున్న విషయం ఏమిటంటే చింతలన్నీ బలహీన విశ్వాసానికి రుజువులు కావు. అయితే వాటి మూలాలేమైనా సరే, చింతలు తీవ్రంగా ఉండి, దీర్ఘకాలం ఉన్నట్లైతే అవి మనకు మనశ్శాంతి లేకుండా చేయవచ్చు. యెహోవా సేవకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించలేమని భావించేలా చింతలు కొందరిని వెల్లువలా ముంచెత్తాయి. బైబిలు ఇలా చెబుతోంది: “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును.” (సామెతలు 12:25) అలాగైతే చింతలు మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మనం ఏమి చేయవచ్చు?
9. చింత నుండి ఉపశమనాన్ని పొందడానికి తీసుకోగల ఆచరణయోగ్యమైన కొన్ని చర్యలు ఏవి, కానీ చింతలను కలిగించే ఏ కారణాలను మనం నివారించలేము?
9 కొన్ని పరిస్థితుల్లో మనం కొన్ని ఆచరణయోగ్యమైన చర్యలను చేపట్టడం సాధ్యమౌతుండవచ్చు. మన చింతలకు ఏదైనా ఆరోగ్య సమస్య మూలకారణం అయితే, అది వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించినదైనప్పటికీ, మనం దాని గురించి బాగా ఆలోచించడం జ్ఞానయుక్తమైన పని. * (మత్తయి 9:12) మనపై బాధ్యతల భారం మరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే వాటిలో కొన్నింటిని ఇతరులకు అప్పగించవచ్చు. (నిర్గమకాండము 18:13-23) అయితే, ఇతరులకు అప్పగించలేనటువంటి తల్లిదండ్రుల బాధ్యతల వంటివాటి విషయం ఏమిటి? వ్యతిరేకిస్తున్న జీవిత భాగస్వామిగల క్రైస్తవుడి లేక క్రైస్తవురాలి విషయం ఏమిటి? ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్న లేదా యుద్ధ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబం విషయం ఏమిటి? ఈవిధానంలో చింతలకు మూలమయ్యే పరిస్థితులన్నింటినీ నివారించలేమన్నది స్పష్టం. అయినా మన హృదయాల్లో క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని కాపాడుకోగలము. ఎలా?
10. చింత నుండి ఉపశమనాన్ని పొందడానికి ఒక క్రైస్తవుడు అవలంబించగల రెండు మార్గాలు ఏవి?
10 దేవుని వాక్యంలో ఆదరణ కోసం వెదకడం అందుకు ఒక మార్గం. దావీదు రాజు ఇలా వ్రాశాడు: “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.” (కీర్తన 94:19) యెహోవా అందించే “ఆదరణ” బైబిలులో దొరుకుతుంది. దైవప్రేరేపితమైన ఆపుస్తకాన్ని క్రమంగా చదవడం ద్వారా మన హృదయాల్లో క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని కాపాడుకోగలుగుతాము. బైబిలు ఇలా చెబుతోంది: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:22) అదే రీతిలో పౌలు ఇలా వ్రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6,7) దీనాతి దీనంగా క్రమంగా ప్రార్థన చేయడం మన శాంతిని కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది.
11. (ఎ) ప్రార్థన విషయంలో యేసు ఎలా ఒక చక్కని మాదిరిగా ఉన్నాడు? (బి)మనం ప్రార్థనను ఎలా దృష్టించాలి?
11 ఈ విషయంలో యేసు అద్భుతమైన మాదిరి. ఒక సందర్భంలో ఆయన తన పరలోక తండ్రితో కొన్ని గంటలపాటు ఏకధాటిగా ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాడు. (మత్తయి 14:23; లూకా 6:12) అత్యంత ఘోరమైన పరీక్షలను సహించడానికి ఆయనకు ప్రార్థన సహాయం చేసింది. తాను చనిపోవడానికి ముందు రాత్రి ఆయన చింత మరింత తీవ్రతరమైంది. ఆయన ఎలా ప్రతిస్పందించాడు? ఆయన “మరింత ఆతురముగా ప్రార్థన” చేశాడు. (లూకా 22:44) అవును పరిపూర్ణుడైన దేవుని కుమారుడు ప్రార్థనాపరుడు. మరి అపరిపూర్ణులైన ఆయన అనుచరులు ప్రార్థనా అలవాటును ఇంకెంతగా అలవరచుకోవాలి! “విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె”నని యేసు తన శిష్యులకు బోధించాడు. (లూకా 18:1) మన గురించి మనకంటె బాగా తెలిసిన వ్యక్తితో సంభాషించే ఒక నిజమైన, కీలకమైన మాధ్యమం ప్రార్థన. (కీర్తన 103:14) మనం మన హృదయాల్లో క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని కాపాడుకోవాలంటే మనం “యెడతెగక ప్రార్థన” చేయాలి.—1 థెస్సలొనీకయులు 5:17.
మన పరిమితులను అధిగమించడం
12. తాము చేసే సేవ సరిపోదని కొందరు భావించడానికి కారణాలేమిటి?
12 యెహోవా తన ప్రతి సేవకుడ్ని అపురూపంగా దృష్టిస్తాడు. (హగ్గయి 2:7) అయితే దీన్ని అంగీకరించడం అనేకులకు కష్టంగా అనిపిస్తుంది. వృద్ధాప్యానికి ఎదగడం, కుటుంబ బాధ్యతలు పెరగడం, ఆరోగ్యం క్షీణించడం వంటి కారణాల మూలంగా కొందరు నిరుత్సాహం చెందుతుండవచ్చు. మరి కొందరు భయంకరమైన బాల్యజీవితం మూలంగా తాము సరైన స్థితిలో ఉన్నట్లు భావించకపోవచ్చు. ఇంకా ఇతరులు తాము గతంలో చేసిన తప్పుల మూలంగా మానసికంగా చిత్రహింసను అనుభవిస్తుండవచ్చు, యెహోవా తమను అసలు క్షమిస్తాడా అని సందేహిస్తుండవచ్చు. (కీర్తన 51:3) అలాంటి భావాలు కలిగినప్పుడు ఏమి చేయాలి?
13. ఎందుకూ పనికిరాని వారమని భావించేవారికి ఎలాంటి లేఖనాధారిత ఆదరణ ఉంది?
13 క్రీస్తు అనుగ్రహించే సమాధానము యెహోవా ప్రేమ విషయంలో మనం నిశ్చింతగా ఉండేందుకు సహాయపడుతుంది. మనం చేసే సేవను ఇతరులు చేసే సేవతో పోల్చడం ద్వారా, మన విలువ నిర్ధారించబడుతుందని యేసు ఎన్నడూ చెప్పలేదన్న వాస్తవాన్ని ధ్యానించడం ద్వారా మనమా సమాధానాన్ని మన హృదయాల్లో పునఃస్థాపించుకోవచ్చు. (మత్తయి 25:14,15; మార్కు 12:41-44) ఆయన ఘంటాపదంగా చెప్పినదేమంటే యథార్థత ఉండాలన్నదే. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:13) యేసు మనుష్యులచే ‘తృణీకరింపబడ్డాడు’ అయినా తన తండ్రి తనను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని ఆయనెన్నడూ సందేహించలేదు. (యెషయా 53:3; యోహాను 10:17) తన శిష్యులు కూడా ప్రేమించబడుతున్నారని ఆయన వారికి చెప్పాడు. (యోహాను 14:21) దీన్ని ఇంకా నొక్కిచెప్పడానికి యేసు ఇలా అన్నాడు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” (మత్తయి 10:29-31) యెహోవా ప్రేమను తెలిపే ఆహామీ హృదయాన్ని ఎంతగా రంజింపజేస్తుంది కదా!
14. యెహోవా మనలో ప్రతి ఒక్కరినీ అపురూపంగా దృష్టిస్తాడనడానికి ఎలాంటి హామీ ఉంది?
14 యేసు ఇలా కూడా అన్నాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:44) మనం యేసును అనుసరించేలా యెహోవాయే మనల్ని ఆకర్షించాడు కాబట్టి మనం రక్షణ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడన్నమాట. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు.” (మత్తయి 18:14) కాబట్టి మీరు పూర్ణ హృదయంతో సేవ చేస్తున్నట్లైతే మీరు చేసే మంచి పనిని బట్టి అతిశయించవచ్చు. (గలతీయులు 6:4) మీరు గతంలో చేసిన పొరబాట్ల విషయంలో క్షోభిస్తున్నట్లైతే, నిజంగా పశ్చాత్తాపపడేవారిని యెహోవా “బహుగా” క్షమిస్తాడని నిశ్చయత కలిగివుండండి. (యెషయా 43:25; 55:7) మీరు మరేదైనా కారణం చేత నిరుత్సాహం చెందుతున్నట్లైతే “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని గుర్తుంచుకోండి.—కీర్తన 34:18.
15. (ఎ) సాతాను మనకు మనశ్శాంతి లేకుండా చేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు? (బి)మనం యెహోవాపై ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకోవచ్చు?
15 మీకు మనశ్శాంతి లేకుండా చేయాలని సాతాను ప్రగాఢంగా వాంఛిస్తున్నాడు. మనందరం వారసత్వంగా వచ్చిన ఏ పాపానికి విరుద్ధంగానైతే పోరాడుతున్నామో ఆపాపానికి మూలం అతడే. (రోమీయులు 7:21-24) మీఅపరిపూర్ణత మూలంగా దేవుడు మీసేవను స్వీకరించడని మీరు భావించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. మీధైర్యాన్ని చెదరగొట్టడానికి సాతానును అనుమతించవద్దు! వాని పథకాలను గురించి పూర్తిగా ఎరిగి ఉండండి, మీరు చివరికంటా సహిస్తూ కొనసాగాలని కృత నిశ్చయతతో ఉండేందుకు ఆగ్రహింపును ఆధారం చేసుకోండి. (2 కొరింథీయులు 2:11; ఎఫెసీయులు 6:11-13) గుర్తుంచుకోండి, “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు.” (1 యోహాను 3:19,20) యెహోవా మన వైఫల్యాలను మాత్రమే చూడడు. ఆయన మన ఉద్దేశాలను, ఆలోచనలను కూడా చూస్తాడు. కాబట్టి కీర్తనకర్త వ్రాసిన ఈమాటల్లో ఆదరణను పొందండి: “యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.”—కీర్తన 94:14.
క్రీస్తు అనుగ్రహించే సమాధానములో ఐక్యం
16. మనం సహించడానికి కృషిచేస్తుండగా మనం ఏ విధంగా ఒంటరివాళ్ళం కాము?
16 మనం ‘ఒక్క శరీరముగా పిలువబడ్డాము’ కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాల్లో ఏలడానికి అనుమతించాలని పౌలు వ్రాశాడు. పౌలు ఎవరికైతే వ్రాశాడో ఆఅభిషిక్త క్రైస్తవులు క్రీస్తు శరీరములో భాగంగా ఉండేందుకు పిలువబడ్డారు, నేడు అభిషిక్తులలో శేషించిన వారు కూడా అందులో భాగమే. వారి “వేరే గొఱ్ఱెల” సహవాసులు, ‘ఒక్క కాపరియైన’ క్రీస్తు క్రింద ‘ఒక్క మందగా’ వారితో ఐక్యమయ్యారు. (యోహాను 10:16) లక్షలాదిమందితో కూడిన ప్రపంచవ్యాప్త “మంద”గా ఉన్న వీరు క్రీస్తు అనుగ్రహించే సమాధానము తమ హృదయాలలో ఏలేందుకు అనుమతిస్తున్నారు. మనం ఒంటరివారిగా లేమన్న గ్రహింపు మనం సహించడానికి సహాయం చేస్తుంది. పేతురు ఇలా వ్రాశాడు: “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై [సాతానును] ఎదిరించుడి.”—1 పేతురు 5:9.
17. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాల్లో ఏలనివ్వడానికి మనకు ఎలాంటి ప్రేరకం ఉంది?
17 కాబట్టి మనందరం, దేవుని పరిశుద్ధాత్మ ఫలాల్లో ఎంతో కీలకమైనదైన సమాధానాన్ని అలవరచుకోవడంలో కొనసాగుదాం. (గలతీయులు 5:22,23) యెహోవాకు నిష్కళంకులుగా, నిందారహితులుగా, సమాధానపరిచేవారిగా కనిపించేవారు చివరికి పరదైసు భూమిపై నిత్య జీవిత ఆశీర్వాదాన్ని పొందుతారు, అక్కడ నీతి నివసిస్తుంది. (2 పేతురు 3:13,14) క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాలలో ఏలనివ్వడానికి ఎన్నెన్నో కారణాలున్నాయి.
[అధస్సూచి]
^ పేరా 9 కొన్ని సందర్భాల్లో, క్లినికల్ డిప్రెషన్ (అనారోగ్యమని పరిగణించగల క్రుంగుదల స్థాయి) వంటి పరిస్థితుల్లో చింత ఏర్పడగలదు లేదా అధికం కాగలదు.
మీరు గుర్తుచేసుకోగలరా?
• క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఏమిటి?
• మనం అన్యాయాన్ని అనుభవించినప్పుడు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాలను ఎలా ఏలగలదు?
• క్రీస్తు అనుగ్రహించే సమాధానము మనం చింతలతో వ్యవహరించేందుకు ఎలా సహాయం చేస్తుంది?
• మనం ఎందుకూ పనికిరానివారమనే భావాలు కలిగినప్పుడు, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మనకు ఎలా ఆదరణనిస్తుంది?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రం]
తనను నిందిస్తున్న వారి ఎదుట యేసు తనను తాను యెహోవాకు అప్పగించుకున్నాడు
[16వ పేజీలోని చిత్రం]
ప్రేమగల తండ్రి వెచ్చని కౌగిలిలా యెహోవా అందించే ఆదరణ మన చింతల నుండి మనకు నెమ్మదిని కలుగజేస్తుంది
[18వ పేజీలోని చిత్రం]
సహనం దేవుని దృష్టిలో ఎంతో గొప్పది