దైవభక్తిలేని లోకంలో హనోకు దేవునితో నడిచాడు
దైవభక్తిలేని లోకంలో హనోకు దేవునితో నడిచాడు
తాను మానవుల నందరినీ దేవుని నుండి దూరం చేయగలనని సాతాను వాదిస్తున్నాడు, కొన్నిసార్లు అతడు విజయం సాధిస్తున్నట్లుగానే అనిపించి ఉండవచ్చు. హేబెలు మరణించిన తర్వాత దాదాపు ఐదు శతాబ్దాల వరకు, ఎవరు కూడా యెహోవా విశ్వాసపరుడైన సేవకునిగా ప్రసిద్ధిగాంచలేదు. దానికి భిన్నంగా, పాపభరితమైన, దైవభక్తిలేని ప్రవర్తన ప్రమాణంగా మారింది.
ఆధ్యాత్మికంగా క్షీణదశలో ఉన్నటువంటి ఆసమయంలో హనోకు భూమిపై నివసించాడు. ఆయన సా.శ.పూ. 3404 లో జన్మించాడని బైబిలు వృత్తాంతం చూపిస్తోంది. తన సమకాలీనుల వలె కాక హనోకు తనను తాను దేవునికి అంగీకృతమైన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. అపొస్తలుడైన పౌలు, ఎవరి విశ్వాసమైతే క్రైస్తవులకు ఒక మాదిరిగా ఉందో ఆయెహోవా సేవకులలో హనోకును చేర్చాడు. హనోకు ఎవరు? ఆయన ఎలాంటి కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది? ఆయన వాటినెలా అధిగమించాడు? ఆయన చూపించిన యథార్థత మనకు ఎలాంటి ప్రాముఖ్యతను కలిగివుంది?
ఎనోషు కాలంలో అంటే హనోకు కాలానికి దాదాపు నాలుగు శతాబ్దాల ముందు, “యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.” (ఆదికాండము 4:26) మానవ చరిత్రారంభము నుండే దైవిక నామము ఉపయోగించబడుతోంది. కాబట్టి ఎనోషు జీవించివున్న కాలంలో ఆరంభమైనది, యెహోవాను విశ్వాసంతో స్వచ్ఛారాధనలో ప్రార్థించడం కాదని స్పష్టమవుతోంది. ఆదికాండము 4:26, “దూషణకరంగా” ప్రార్థించడం “ఆరంభమైంది” అని లేక “దూషించడం అప్పుడు ఆరంభమైంది” అని చదువబడాలని కొందరు హీబ్రూ పండితులు విశ్వసిస్తున్నారు. మానవులు తమకో లేక ఆరాధనలో తాము ఎవరి ద్వారానైతే దేవుడ్ని సమీపిస్తున్నట్లు నటించారో ఆఇతర మానవులకో యెహోవా నామమును అన్వయించి ఉండవచ్చు. లేక వారు ఆయన నామమును బహుశా విగ్రహములకు అన్వయించి ఉంటారు.
‘హనోకు దేవునితో నడిచెను’
హనోకు చుట్టూ భక్తిహీనత వ్యాపించివున్నప్పటికీ, ఆయన యెహోవా ‘దేవునితో నడిచాడు.’ ఆయన పూర్వికులైన షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, యెరెదు దేవునితో నడిచారని చెప్పబడలేదు. బహుశ వారు హనోకు నడిచినంత స్థాయిలో నడిచివుండరు, ఆయన జీవన విధానం వారి నుండి ఆయనను ప్రత్యేకపరచిందని స్పష్టమవుతోంది.—ఆదికాండము 5:3-27.
యెహోవాతో నడవడమన్నది దేవునితో ఉన్న సన్నిహితత్వాన్ని సూచిస్తుంది, హనోకు దైవిక చిత్తానుసారంగా జీవించాడు గనుకనే అది సాధ్యమైంది. యెహోవా హనోకు భక్తిని ఆమోదించాడు. వాస్తవానికి, “హనోకు [దేవునికి] ఇష్టమైనవాడు” అని గ్రీకు సెప్టాజింట్ చెబుతోంది, అపొస్తలుడైన పౌలు కూడా అదే తలంపును వ్యక్తపరిచాడు.—ఆదికాండము 5:22; హెబ్రీయులు 11:5.
హనోకుకు యెహోవాతో ఉన్న మంచి సంబంధానికి మూలాధారం ఆయన విశ్వాసమే. ఆయన దేవుని “స్త్రీ” యొక్క వాగ్దత్త “సంతానము”పై విశ్వాసముంచి ఉండవచ్చు. హనోకుకు ఆదాముతో వ్యక్తిగతంగా పరిచయం ఉండి ఉంటే, ఏదెనులో మొదటి మానవ జంటతో దేవుని వ్యవహారాలను గురించిన కొంత సమాచారాన్ని ఆయన పొందగలిగి ఉండవచ్చు. హనోకుకు దేవుని గురించి ఉన్న పరిజ్ఞానమే, ఆయనను దేవుడ్ని ‘వెదికే’ వ్యక్తిగా చేసింది.—ఆదికాండము 3:15; హెబ్రీయులు 11:6, 13.
హనోకు విషయంలోనూ, మన విషయంలోనూ, యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి కేవలం దేవుని గురించిన పరిజ్ఞానము కంటే ఎక్కువే అవసరం. మనం ప్రత్యేకంగా ఎవరైనా ఒక వ్యక్తికి సన్నిహితం కావడాన్ని విలువైనదిగా ఎంచితే, మన తలంపులు చర్యలు ఆయన దృక్కోణాలచే ప్రభావితం కావడం నిజం కాదంటారా? ఆస్నేహాన్ని కూలదోసే మాటలను లేక చర్యలను మనం నివారిస్తాం. మనం
మన సొంత పరిస్థితుల్లో ఏదైనా కొంత మార్పు చేసుకోవాలనుకుంటే, ఇది ఆసంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోమా?దేవునితో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకోవాలనే కోరిక కూడా మనం చేసే పనులపై ప్రభావాన్ని చూపుతుంది. ఆయన దేన్ని ఆమోదిస్తాడు దేన్ని ఆమోదించడు అనేదాన్ని గూర్చిన ఖచ్చితమైన పరిజ్ఞానం ఒక ఆవశ్యకత. ఇక మనం ఆపరిజ్ఞానంచే నడిపించబడుతూ, తలంపుల్లోను చర్యల్లోను ఆయనను ప్రీతిపరచడానికి కృషి చేయాలి.
అవును, దేవునితో నడవాలంటే మనం ఆయనను ప్రీతిపరచాలి. వందల సంవత్సరాల పాటు హనోకు చేసిందదే. వాస్తవానికి, హనోకు దేవునితో ‘నడిచాడు’ అని సూచించే హీబ్రూ క్రియాపద రూపం, పునరావృతమయ్యే కొనసాగే చర్యను సూచిస్తుంది. ‘దేవునితో నడచిన’ మరో విశ్వాసపరుడైన వ్యక్తి నోవహు.—ఆదికాండము 6:9.
హనోకు కుటుంబమున్న మనిషి, ఆయనకు భార్య, ‘కుమారులు కుమార్తెలు’ ఉన్నారు. ఆయన కుమారుల్లో మెతూషెల ఒకడు. (ఆదికాండము 5:21,22) తన కుటుంబాన్ని సరైన విధంగా పర్యవేక్షించడానికి హనోకు తాను చేయగలిగినదంతా చేసి ఉంటాడు. అయితే, తన చుట్టూ వ్యాపించి ఉన్న భక్తిహీనతతో, దేవుని సేవ చేయడం ఆయనకంత సులభం కాలేదు. నోవహు తండ్రి అయిన లెమెకు, యెహోవాయందు విశ్వాసం ఉంచిన ఆయన ఏకైక సమకాలీనుడై ఉండవచ్చు. (ఆదికాండము 5:28,29) అయినప్పటికీ, హనోకు ధైర్యంగా సత్యారాధనను అవలంబించాడు.
దేవుని ఎడల యథార్థంగా ఉండడానికి హనోకుకు ఏమి సహాయం చేసింది? నిస్సందేహంగా, యెహోవా నామమును దూషించేవారితో లేక దేవుని ఆరాధకునికి సరైన సహచరులుకాని ఇతరులతో ఆయన సహవసించలేదు. ప్రార్థనలో యెహోవా సహాయాన్ని కోరడం కూడా తన సృష్టికర్తకు అప్రీతికరమైన దేన్నీ చేయకూడదనే హనోకు నిశ్చయతను బలపరచి ఉండవచ్చు.
భక్తిహీనులకు వ్యతిరేకంగా ప్రవచనం
మనం భక్తిహీనులైన ప్రజల మధ్య ఉన్నప్పుడు ఉన్నత ప్రమాణాలను కాపాడుకోవడమే చాలా కష్టం. కానీ హనోకు దుష్టులకు వ్యతిరేకంగా రాజీపడని తీర్పు సందేశాన్ని కూడా ప్రకటించాడు. దేవుని ఆత్మచే నిర్దేశించబడి హనోకు ప్రవచనార్థకంగా ఇలా ప్రకటించాడు: “ఇదిగో! అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన యూదా 14,15.
పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.”—వక్రబుద్ధిగల అవిశ్వాసులపై ఆ సందేశం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అలాంటి ముక్కు సూటియైన మాటలు దెప్పిపొడుపులు, బెదిరింపులు రేకెత్తడానికి కారణమవుతూ హనోకు ద్వేషించబడేలా చేసివుంటాయని అనుకోవడం సహేతుకమే. శాశ్వతంగా ఆయన నోరు మూయించాలని కొందరు అనుకుని ఉండవచ్చు. అయితే, హనోకు భయపడిపోలేదు. నీతిమంతుడైన హేబెలుకు ఏమి జరిగిందో ఆయనకు తెలుసు, ఆయన వలెనే, ఏమి వచ్చినప్పటికీ దేవుని సేవ చేయాలని హనోకు కృతనిశ్చయం చేసుకున్నాడు.
“దేవుడతని తీసికొనిపోయెను”
‘దేవుడు హనోకును తీసికొనిపోయినప్పుడు’ ఆయన చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడని స్పష్టమవుతోంది. (ఆదికాండము 5:24) తన విశ్వాసపరుడైన ప్రవక్త ఉన్మాదులైన శత్రువుల చేతుల్లో బాధపడడానికి యెహోవా అనుమతించలేదు. అపొస్తలుడైన పౌలు మాటల ప్రకారం, “హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను.” (హెబ్రీయులు 11:5) అయితే, హనోకు మరణించలేదనీ, దేవుడు ఆయనను పరలోకానికి తీసుకువెళ్ళాడనీ, అక్కడాయన జీవితం కొనసాగించాడనీ అనేకులు అంటారు. కానీ యేసు స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: “పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” పరలోకానికి వెళ్ళే వారందరి “కంటె ముందుగా” యేసు ఆరోహణమయ్యాడు.—యోహాను 3:13; హెబ్రీయులు 6:19, 20.
మరి, హనోకుకు ఏమయ్యింది? ఆయన “మరణము చూడకుండునట్లు కొనిపో”బడడమనేది, దేవుడాయనను ప్రవచనార్థక దర్శనంలో పూర్తిగా నిమగ్నమయ్యేలా చేసి, ఆయన ఆస్థితిలో ఉండగానే ఆయన జీవితం ముగిసిపోయేలా చేశాడని సూచించవచ్చు. అలాంటి పరిస్థితుల్లోనైతే, హనోకు మరణ వేదనలను అనుభవించడు. తర్వాత, “అతడు కనబడలేదు” అంటే యెహోవా మోషే శరీరమును ఉనికిలో లేకుండా చేసినట్లే ఆయన శరీరమును కూడా చేశాడని స్పష్టమవుతోంది.—ద్వితీయోపదేశకాండము 34:5, 6.
హనోకు 365 సంవత్సరాలపాటు జీవించాడు, ఆయన సమకాలీనుల్లో అనేకులు జీవించినంత కాలం ఆయన జీవించలేదు. కానీ యెహోవా ప్రేమికులకు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మరణించేంత వరకు విశ్వాసంగా ఆయన సేవ చేయాలన్నదే. హనోకు అలాగే చేశాడని మనకు తెలుసు, ఎందుకంటే “అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను.” యెహోవా హనోకుకు ఈవిషయాన్ని ఎలా తెలియజేశాడో లేఖనాలు మనకు తెలియజేయడం లేదు. అయినప్పటికీ, హనోకు మరణించకముందు ఆయనకు దేవుని ఆమోదాన్ని గురించిన హామీ ఇవ్వబడింది, పునరుత్థానమప్పుడు యెహోవా ఆయనను జ్ఞాపకం చేసుకుంటాడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు.
హనోకు విశ్వాసాన్ని అనుకరించండి
దైవభక్తిగల వ్యక్తుల విశ్వాసాన్ని మనం సముచితంగా అనుకరించవచ్చు. (హెబ్రీయులు 13:7) విశ్వాసం మూలంగానే హనోకు దేవుని విశ్వాసపరుడైన మొదటి ప్రవక్తగా సేవ చేశాడు. హనోకు కాలంనాటి లోకం మన కాలంనాటి లోకంలానే దౌర్జన్యపూరితులైన, దూషకులైన, భక్తిహీనులైన ప్రజలతో నిండి ఉంది. అయితే, హనోకు భిన్నంగా ఉన్నాడు. ఆయనకు నిజమైన విశ్వాసం ఉంది, ఆయన దైవభక్తి విషయంలో చక్కని మాదిరి ఉంచాడు. అవును, యెహోవా ఆయనకు చాలా ప్రాముఖ్యమైన తీర్పు సందేశాన్ని ప్రకటించడానికి ఇచ్చాడు, అయితే ఆయన దాన్ని ప్రకటించేలా యెహోవా ఆయనను బలపరిచాడు కూడా. హనోకు ధైర్యంగా తన పనిని నెరవేర్చాడు, శత్రువుల వ్యతిరేకత సమయంలో దేవుడు ఆయన గురించి శ్రద్ధ తీసుకున్నాడు.
మనం హనోకు వలె విశ్వాసాన్ని కలిగివుంటే, ఈఅంత్యదినాల్లో యెహోవా సందేశాన్ని ప్రకటించడానికి ఆయన మనలను బలపరుస్తాడు. మనం వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు, మనకున్న దైవభక్తి, భక్తిహీనుల నుండి మనలను భిన్నంగా ఉంచుతుంది. దేవునితో నడవడానికీ, ఆయన హృదయానికి సంతోషం కలిగించే విధంగా ప్రవర్తించడానికీ విశ్వాసం మనకు సహాయం చేస్తుంది. (సామెతలు 27:11) విశ్వాసం మూలంగానే, నీతిమంతుడైన హనోకు భక్తిహీనమైన లోకంలో యెహోవాతో నడవడంలో సఫలీకృతుడయ్యాడు, మనమూ సఫలీకృతులం కాగలము.
[30వ పేజీలోని బాక్సు]
బైబిలు హనోకు గ్రంథం నుండి ఎత్తిచెబుతోందా?
హనోకు గ్రంథం ఒక అప్రమాణిక, కల్పిత మూలపాఠం. దాన్ని హనోకు వ్రాశాడని అబద్ధంగా ఆరోపించబడుతోంది. బహుశా సా.శ.పూ. ఒకటి లేక రెండవ శతాబ్దాల కాలంలో ఉత్పన్నం చేయబడిన ఈగ్రంథం విడ్డూరమైన, చారిత్రాధారంలేని యూదుల పురాణగాథల సంచయం, ఇది ఆదికాండములో హనోకు గురించి ఉన్న క్లుప్త ప్రస్తావన యొక్క వివరణాత్మకమైన విపులీకరణ అని స్పష్టమవుతోంది. హనోకు గ్రంథాన్ని త్రోసిపుచ్చడానికి దేవుని ప్రేరేపిత వాక్య ప్రేమికులకు ఈఒక్క వాస్తవం చాలు.
బైబిలులో, యూదా పుస్తకంలో మాత్రమే హనోకు యొక్క ఈప్రవచనార్థక మాటలు ఉన్నాయి: “ఇదిగో! అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.” (యూదా 14, 15) భక్తిహీనులైన తన సమకాలీనులకు వ్యతిరేకంగా హనోకు చెప్పిన ప్రవచనం హనోకు గ్రంథంలో నుండి సూటిగా ఎత్తి వ్రాయబడిందని చాలామంది పండితులు వాదిస్తారు. యూదా అవిశ్వసనీయమైన అప్రమాణిక గ్రంథాన్ని తనకు మూలపాఠంగా ఉపయోగించడం సాధ్యమేనా?
హనోకు ప్రవచనం గురించి యూదాకు ఎలా తెలుసన్నది లేఖనాలు బయలుపరచడం లేదు. ఆయన సాధారణ మూలం నుండి, సుధీర్ఘ ప్రాచీనతచే అందజేయబడిన నమ్మదగిన సాంప్రదాయ గ్రంథం నుండి ఎత్తి వ్రాసివుండవచ్చు. పౌలు కూడా యన్నే, యంబ్రే అనే వారి గురించి ప్రస్తావించినప్పుడు అలాగే చేసివుంటాడు, వీరు మోషేను ఎదిరించిన, ఫరో రాజాస్థానంలోని మాంత్రికులు, వీరి పేర్ల గురించి బైబిలులో మరెక్కడా చెప్పబడలేదు. హనోకు గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తికి ఈవిధమైన ప్రాచీన మూలం ఏదైనా అందుబాటులో ఉండివుంటే, యూదాకు కూడా అలాగే అందుబాటులో ఉండి ఉండవచ్చునన్న విషయాన్ని మనం ఎందుకు నిరాకరించాలి? *—నిర్గమకాండము 7:11, 22; 2 తిమోతి 3:8.
హనోకు భక్తిహీనులకు ఇచ్చిన సందేశాన్ని గురించిన సమాచారాన్ని యూదా ఎలా పొందాడనేది చాలా అల్పమైన విషయం. దాని విశ్వసనీయత, యూదా దైవ ప్రేరేపితుడై వ్రాశాడన్న వాస్తవంచే ధ్రువీకరించబడుతోంది. (2 తిమోతి 3:16) అసత్యమైనదేదీ చెప్పకుండా దేవుని పరిశుద్ధాత్మ ఆయనను కాపాడింది.
[అధస్సూచి]
^ పేరా 28 శిష్యుడైన స్తెఫెను కూడా బైబిలులో మరెక్కడా కనుగొనలేని సమాచారాన్ని అందజేశాడు. అది, మోషే ఐగుప్తు విద్యకు, ఆయన ఐగుప్తుకు పారిపోయినప్పుడు ఆయనకు 40 సంవత్సరాలన్న విషయానికి, ఆయన మిద్యానులో 40 సంవత్సరాలు గడపడానికి, మోషే ధర్మశాస్త్రాన్ని అందజేయడంలో దేవదూతల పాత్రకు సంబంధించినది.—అపొస్తలుల కార్యములు 7:22, 23, 30, 38.
[31వ పేజీలోని చిత్రం]
హనోకు యెహోవా సందేశాన్ని ధైర్యంగా ప్రకటించాడు