వృక్ష భక్షకులు
వృక్ష భక్షకులు
బైబిలు కాలాల్లో వృక్షాలను చాలా విలువైన వర్తకపు సరుకులుగా పరిగణించేవారు. ఉదాహరణకు అబ్రాహాము తన ప్రియమైన భార్య శారా శవాన్ని పాతిపెట్టడానికి భూమిని కొన్నప్పుడు ఆస్థలహక్కు మార్పిడి ఒప్పందపత్రంలో చెట్లు కూడా పేర్కొనబడ్డాయి.—ఆదికాండము 23:15-18.
అదేమాదిరి నేడు, చెట్లను చాలా విలువైనవిగా ఎంచుతున్నారు, అడవులను కాపాడ్డంలో అంతర్జాతీయ స్థాయిలో శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. స్టేట్ ఆఫ్ ద వరల్డ్ 1998 అనే పుస్తకం ఇలా చెబుతోంది: “సమశీతోష్ణ దేశాల్లోని అనేకమంది ఉష్ణమండలాల్లోని అడవులు పాడవుతున్నాయని వ్యాకులతను వ్యక్తపరచినప్పటికీ, వాళ్ళు తమ స్వంత దేశాల్లోని అన్ని రకాల అడవులు ముక్కలు ముక్కలుగా చేయబడుతున్నాయనీ అవి నాశకరమైన ప్రభావాలకు గురవుతున్నాయనీ బహుశా గ్రహించలేకపోతున్నారు.” ఇంతకూ యూరోపు, ఉత్తర అమెరికా లాంటి ఉత్తర దేశాల్లోని సమశీతోష్ణ అడవులకు ప్రమాదం వాటిల్లజేస్తున్నది ఏమిటి? అడవులను నరికివేయడమే అందుకు కారణమని చాలామంది అంటారు, కానీ కొన్ని శక్తులు రెమ్మ రెమ్మను లేక కొమ్మ కొమ్మను నెమ్మనెమ్మదిగా పాడు చేస్తూ, మనం గమనించేలోపు మొత్తం చెట్టునే ధ్వంసం చేస్తాయి. ఏమిటా శక్తులు? కలుషిత వాయువు, ఆమ్ల వర్షం. ఇవి చెట్లను పురుగులకు, రోగాలకు గురయ్యేలా నెమ్మదిగా బలహీనపరుస్తాయి.
దశాబ్దాలుగా, పర్యావరణ శాస్త్రజ్ఞులు, ఇతర సంబంధిత వ్యక్తులు ఈభూమి యొక్క ఆవరణ వ్యవస్థను రక్షించాల్సిన అవసరముందని హెచ్చరించారు. 1980 లో జర్మనీలో శాస్త్రజ్ఞులు కలుషిత వాయువు, ఆమ్ల వర్షపు ప్రభావాలను గురించి అధ్యయనం చేసిన తర్వాత ఒక ముగింపుకు వచ్చారు: ‘ఏ చర్యలూ తీసుకోకపోతే 2000 సంవత్సరంనాటికి ప్రజలు అడవులను కేవలం ఫోటోల్లో సినిమాల్లో మాత్రమే చూసి ఆనందించే పరిస్థితి వస్తుంది.’ సంతోషకరంగా, ఈభూమి యొక్క పునరుత్పాదక శక్తి చాలా బలమైనది కాబట్టి ముందు చెప్పిన హానిని ఇప్పటి వరకు తట్టుకొని నిలదొక్కుకోగలిగింది.
అయినా, మన పర్యావరణ వ్యవస్థను దేవుడే శాశ్వతంగా కాపాడతాడు. “తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును,” మరియు “పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూరమొక్కలను ఆయన మొలిపించుచున్నాడు.” అంతేగాక, ‘భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్న[ది]’ అని ఆయన వాగ్దానం చేశాడు. (కీర్తన 104:13, 14; ప్రకటన 11:18) భూనివాసులు కాలుష్యంలేని వాతావరణాన్ని నిరంతరం అనుభవించే ఆసమయం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!—కీర్తన 37:9-11.