కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మన ఆశ్రయము

యెహోవా మన ఆశ్రయము

యెహోవా మన ఆశ్రయము

‘యెహోవా, నీవే నా ఆశ్రయము అని అంటివి. నీకు అపాయమేమియు రాదు.’​—⁠కీర్తన 91:9,10.

1. యెహోవా మన ఆశ్రయమని ఎందుకు చెప్పగలము?

తన ప్రజలకు యెహోవా నిజమైన ఆశ్రయము. మనలను మనం ఆయనకు సంపూర్ణంగా అర్పించుకుంటే, ‘ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.’ ఎందుకు? ఎందుకంటే, యెహోవా మనకు “బలాధిక్యము” కలుగజేస్తాడు. (2 కొరింథీయులు 4:​7-9) అవును, మన పరలోకపు తండ్రి మనం దైవిక జీవితాన్ని గడిపేందుకు మనకు సహాయం చేస్తాడు, మనం కీర్తనకర్త మాటలను మనస్సులో పెట్టుకోవాలి: “యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు. నీకు అపాయమేమియు రాదు.”​—⁠కీర్తన 91:9,10.

2. కీర్తన 91 గురించి ఏమి చెప్పగలము, అది ఏమని వాగ్దానం చేస్తోంది?

2కీర్తన 91 లోని ఈమాటలను మోషే వ్రాసివుండవచ్చు. 90వ కీర్తన పైవిలాసం మోషే రచయిత అని చెబుతోంది, దాని తర్వాత మధ్యలో మరే రచయితనూ పేర్కొనకుండా 91వ కీర్తన ప్రారంభమవుతుంది. 91వ కీర్తనను పాడే విధానం బహుశ ఇలా ఉండివుంటుంది: మొదట ఒకరు పాడగా (91:​1,2), ఒక బృందం అందుకు ప్రతిస్పందించి పాడివుంటుంది (91:3-8). ఆతర్వాత బహుశ ఒకరు పాడగా (91:9ఎ), ఒక బృందం జవాబిచ్చివుంటుంది (91:9బి-13). తర్వాత ఒక గాయకుడు మిగతా వచనాల్ని పాడివుంటాడు (91:​14-16). ఎలా పాడినప్పటికీ, 91వ కీర్తన ఒక తరగతిగా అభిషిక్త క్రైస్తవులకు ఆధ్యాత్మిక భద్రతను వాగ్దానం చేస్తోంది, ఒక సమూహముగా వారి సమర్పిత సహవాసులకు కూడా అలాంటి హామీనే ఇస్తుంది. * మనమీ కీర్తనను అలాంటి యెహోవా సేవకులందరి దృక్కోణం నుండి పరిశీలిద్దాము.

‘దేవుని చాటున’ భద్రత

3. (ఎ) “మహోన్నతుని చాటు” ఏమిటి? (బి)‘సర్వశక్తుని నీడను విశ్రమించడం’ ద్వారా మనం ఏమి అనుభవిస్తాము?

3 కీర్తనకర్త ఇలా పాడుతున్నాడు: “మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.​—⁠ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.” (కీర్తన 91:​1,2) “మహోన్నతుని చాటు” అనేది మనకు సూచనార్థక భద్రతా స్థలం, ప్రత్యేకంగా అపవాది దాడులకు ప్రధాన లక్ష్యంగా ఉన్న అభిషిక్తులకు భద్రతా స్థలం. (ప్రకటన 12:​15-17) దేవుని ఆధ్యాత్మిక అతిథులుగా విశ్రమించేవారిగా మనం అనుభవిస్తున్న కాపుదలే లేకపోయినట్లైతే సాతాను మనందర్నీ నాశనం చేసివుండేవాడే. ‘సర్వశక్తుని నీడను విశ్రమించడం’ ద్వారా మనం దేవుని కాపుదలతో కూడిన ఛాయలో లేదా నీడలో ఉంటాము. (కీర్తన 15:​1,2; 121:⁠5) సర్వశక్తుడైన ప్రభువైన యెహోవా కన్నా ఎక్కువ దుర్భేద్యమైన కోట మరింత సురక్షితమైన ఆశ్రయము మరేదీ లేదు.​—⁠సామెతలు 18:⁠10.

4. ‘వేటకాడు’ అయిన సాతాను ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తాడు, మనం ఎలా తప్పించుకుంటాము?

4 కీర్తనకర్త ఇంకా ఇలా అంటున్నాడు: ‘వేటకాని ఉరిలోనుండి ఆయన [యెహోవా] నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును.’ (కీర్తన 91:⁠3) ప్రాచీన ఇశ్రాయేలులోని వేటకాడు పక్షులను ఉరులు లేదా ఉచ్చులు ఉపయోగించి పట్టేవాడు. ‘వేటకాడు’ అయిన సాతాను ఉపయోగించే ఉరుల్లో వాని దుష్ట సంస్థ, వాని ‘తంత్రములు’ ఉన్నాయి. (ఎఫెసీయులు 6:​11) మనలను దుష్టత్వంలోకి లాగడానికి మనం ఆధ్యాత్మికంగా వినాశనమవ్వడానికి మన మార్గంలో పైకి కనిపించని ఉరులు ఉంచబడ్డాయి. (కీర్తన 142:⁠3) అయితే మనం అవినీతిని విడిచిపెట్టాము కాబట్టి ‘మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొనే పక్షిలా’ ఉన్నది. (కీర్తన 124:​7,8) యెహోవా మనల్ని దుష్టుడైన “వేటకాని” నుండి తప్పిస్తున్నందుకు మనమాయనకు ఎంత కృతజ్ఞులమై ఉన్నాము!​—⁠మత్తయి 6:⁠13.

5, 6. ఏ “తెగులు” ‘నాశనములను’ కలుగజేసింది, కానీ యెహోవా ప్రజలు దానికి ఎందుకు లొంగిపోరు?

5 కీర్తనకర్త “నాశనకరమైన తెగులు” గురించి మాట్లాడుతున్నాడు. మానవ కుటుంబానికీ, యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించే వారికీ సాంక్రమిక వ్యాధిలాంటి ‘నాశనాన్ని’ తీసుకువచ్చేది ఒకటుంది. ఈవిషయంలో చరిత్రకారుడైన ఆర్నాల్డ్‌ టోన్‌బీ ఇలా వ్రాశాడు: “రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుండి జాతీయవాదం మూలంగా సర్వసత్తాక స్వతంత్ర రాజ్యాల సంఖ్య రెండింతలైంది ... మానవజాతి ప్రస్తుత వైఖరి అంతకంతకూ విభజనవైపే మొగ్గుతోంది.”

6 గత శతాబ్దాలన్నింటిలోను కొందరు పరిపాలకులు విభజనను సృష్టించే విధంగా అంతర్జాతీయ సంఘర్షణా జ్వాలలకు ఆజ్యంపోశారు. వారు తమకూ లేదా వివిధ ప్రతిమలకూ చిహ్నాలకూ పూజ్యభావాన్ని చూపించాలని కూడా కోరారు. కానీ విశ్వాసంగల తన ప్రజలు అలాంటి “తెగులు”కు లొంగిపోయేందుకు యెహోవా ఎన్నడూ అనుమతించలేదు. (దానియేలు 3:1, 2, 20-27; 6:​7-10,16-22) ప్రేమపూర్వకమైన అంతర్జాతీయ సహోదరులమైన మనం యెహోవాపట్ల అనితర భక్తిని కలిగివుంటాము, లేఖనాధారిత తటస్థతను వహిస్తాము, ‘ప్రతి జనములోను [దేవునికి] భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును’ అని పక్షపాతం లేకుండా గుర్తిస్తాము. (అపొస్తలుల కార్యములు 10:​34,35; నిర్గమకాండము 20:​4-6; యోహాను 13:​34,35; 17:​16; 1 పేతురు 5:​8,9) క్రైస్తవులుగా మనం హింసల రూపంలో ‘నాశనములను’ అనుభవించినప్పటికీ ఆనందంగా ఉంటాము, “మహోన్నతుని చాటున” ఆధ్యాత్మికంగా భద్రతను అనుభవిస్తాము.

7. యెహోవా మనల్ని “తన రెక్కలతో” ఎలా కాపాడతాడు?

7 యెహోవాను మన ఆశ్రయముగా కలిగివున్నందున మనం ఈమాటల నుండి ఓదార్పును పొందుతాము: ‘ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడెమును డాలునై [“అడ్డుకట్టనై,” NW] యున్నది.’ (కీర్తన 91:⁠4) తల్లి పక్షి తన పిల్ల మీదుగా కాపుదల కోసం ఎగురుతున్నట్లే దేవుడు మనల్ని కాపాడతాడు. (యెషయా 31:⁠5) ‘ఆయన తన రెక్కలతో మనలను కప్పును.’ పక్షి తన రెక్కలతో తన పిల్లలను కప్పుతూ ఇతర ప్రాణుల నుండి వాటిని కాపాడుతుంది. మనం పక్షిపిల్లల్లా యెహోవా సూచనార్థక రెక్కల క్రింద భద్రతను అనుభవిస్తాము, ఎందుకంటే మనం ఆయన నిజమైన క్రైస్తవ సంస్థలో ఆశ్రయాన్ని పొందాము.​—⁠రూతు 2:12; కీర్తన 5:1,11.

8. యెహోవా “సత్యము” ఎలా ఒక పెద్ద కేడెము, అడ్డుకట్టలాంటిది?

8 మనం “సత్యము”లో లేదా విశ్వాస్యతలో నమ్మకం ఉంచుతాము. అది ప్రాచీన కాలాల్లోని తలుపు ఆకారంలోని కేడెములాంటిది, ఒక వ్యక్తి శరీరాన్నంతటినీ కప్పుతుంది. (కీర్తన 5:​12) అలాంటి రక్షణలో నమ్మకం ఉంచడం మూలంగా మనం భయవిముక్తులం అవుతాము. (ఆదికాండము 15:⁠1; కీర్తన 84:​11) మన విశ్వాసంలాగే దేవుని సత్యము సంరక్షకమైన పెద్ద కేడెముగా సాతాను అగ్నిబాణములను ఆపుతుంది, శత్రువుల దెబ్బలనుండి కాపాడుతుంది. (ఎఫెసీయులు 6:​16) అది అడ్డుకట్టలాంటిది కూడాను, అంటే సంరక్షణార్థమైన గట్టి మట్టిదిబ్బలాంటిది, దాని వెనుక మనం స్థిరంగా నిలబడతాము.

‘మనం భయపడము’

9. రాత్రి భయాన్ని పుట్టించే సమయంగా ఎందుకు ఉంటుంది, కానీ మనం ఎందుకు భయపడము?

9 దేవుని కాపుదల ఉండగా కీర్తనకర్త ఇలా అంటున్నాడు: “రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.” (కీర్తన 91:​5,6) చీకటి ముసుగులోనే అనేక దుష్టక్రియలు జరుగుతాయి కాబట్టి రాత్రి భయాన్ని పుట్టించే సమయంగా ఉంటుంది. నేడు భూమిని ఆవరించివున్న ఆధ్యాత్మిక చీకటిలో మన శత్రువులు మన ఆధ్యాత్మికతను నాశనం చేయడానికి, మన ప్రకటనా పనిని ఆపుచేయడానికైన ప్రయత్నంలో తరచు మోసపూరిత చర్యలకు ఒడిగడుతుంటారు. కానీ ‘రాత్రివేళ కలుగు భయమునకు మనం భయపడము’ ఎందుకంటే యెహోవా మనల్ని కాపాడుతాడు.​—⁠కీర్తన 64:​1,2; 121:⁠4; యెషయా 60:⁠2.

10. (ఎ) “పగటివేళ ఎగురు బాణము” దేనిని సూచిస్తున్నట్లు కనబడుతోంది, దానికి మనమెలా ప్రతిస్పందిస్తాము? (బి)“చీకటిలో సంచరించు తెగులు” ఎలాంటిది, మనం దానికెందుకు భయపడము?

10 “పగటివేళ ఎగురు బాణము” మౌఖిక దాడిని సూచిస్తున్నట్లు కనబడుతోంది. (కీర్తన 64:​3-5; 94:​20) సత్యమైన సమాచారాన్ని చేరవేయడంలో మనం పట్టుదలతో ముందుకు సాగుతుండగా మన పవిత్ర సేవపట్ల అలాంటి బాహాటమైన వ్యతిరేకత నిష్ఫలమేనని తేలుతుంది. అంతేగాక, మనం “చీకటిలో సంచరించు తెగులునకైనను” భయపడము. ఇది నైతికంగా, మతపరంగా వ్యాధిగ్రస్తమైన, సాతాను ఆధీనంలోనున్న ఈలోకపు చీకటిలో ఉద్భవించిన సూచనార్థకమైన తెగులు. (1 యోహాను 5:​19) అది ప్రాణాంతకమైన మనఃస్థితిని హృదయస్థితిని ఉత్పత్తిచేస్తుంది, యెహోవాను గురించి, ఆయన సంకల్పాలను గురించి, ఆయన ప్రేమపూర్వక ఏర్పాట్లను గురించి ప్రజలను అజ్ఞానాంధకారంలో ఉంచుతుంది. (1 తిమోతి 6:⁠4) ఈచీకటిలో మనం భయపడము, ఎందుకంటే మనం ప్రకాశవంతమైన ఆధ్యాత్మిక వెలుగులో ఉన్నాము.​—⁠కీర్తన 43:⁠3.

11. ‘మధ్యాహ్నమందు పాడు’ అనుభవించేవారికి ఏమి సంభవిస్తుంది?

11 “మధ్యాహ్నమందు పాడుచేయు రోగము” కూడా మనల్ని భయపెట్టదు. ‘మధ్యాహ్నం’ ఈలోకపు జ్ఞానోదయాన్ని సూచిస్తుండవచ్చు. వస్తుసంపదల విషయంలో దాని దృక్కోణానికి లొంగిపోయేవారు ఆధ్యాత్మిక వినాశనాన్ని అనుభవిస్తారు. (1 తిమోతి 6:​20,21) మనం ధైర్యంగా రాజ్య సందేశాన్ని ప్రకటిస్తుండగా మన శత్రువులకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యెహోవా మన సంరక్షకుడు.​—⁠కీర్తన 64:⁠1; సామెతలు 3:25,26.

12. ఎవరి ప్రక్కన వేలాదిమంది ‘పడతారు,’ ఏ విధంగా?

12 కీర్తనకర్త ఇంకా ముందుకు సాగుతున్నాడు: “నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును.” (కీర్తన 91:​7,8) యెహోవాను తమ ఆశ్రయముగా చేసుకోవడంలో విఫలమవడం మూలంగా చాలామంది మన ‘ప్రక్కనే’ ఆధ్యాత్మిక మరణంలో ‘కూలిపోతారు.’ ఆవిధంగా, నేటి ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల “కుడి ప్రక్కను పదివేల మంది” కూలిపోయారు. (గలతీయులు 6:​16) కానీ మనం అభిషిక్త క్రైస్తవులమైనా లేదా వారి సమర్పిత సహవాసులమైనా మనం దేవుని “చాటున” భద్రంగా ఉన్నాము. మనం ‘భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుండగా కన్నులార చూస్తాము,’ వారు వాణిజ్యపరమైన, మతపరమైన, మరితర రంగాల్లో సమస్యలనే పంటను కోస్తున్నారు.​—⁠గలతీయులు 6:⁠7.

‘మనకు అపాయమేమీ రాదు’

13. మనకు ఎలాంటి అపాయాలు సంభవించవు, ఎందుకని?

13 ఈ లోకంలోని భద్రతాభావం వమ్ము అవుతున్నా మనం దేవుణ్ణి మొదట ఉంచుతాము, కీర్తనకర్త చెప్పిన ఈమాటల్లో ధైర్యాన్ని పొందుతాము: “యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు. నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు.” (కీర్తన 91:​9,10) అవును, యెహోవాయే మన ఆశ్రయము. అయితే మనం సర్వోన్నతుడైన దేవుణ్ణి ‘మన నివాసస్థలముగా’ కూడా చేసుకుంటాము, అక్కడే మనం సురక్షితంగా ఉంటాము. విశ్వ సర్వాధిపతిగా మనం యెహోవాను స్తుతిస్తాము, మన భద్రతకు మూలం అయిన ఆయనలో మనం ‘నివసిస్తాము,’ ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తాము. (మత్తయి 24:​14) కాబట్టి ‘మనకు అపాయమేమియు రాదు’​—⁠ఈ కీర్తనలో ఇంతకు ముందు చెప్పబడిన అపాయాలేవీ రావు. భూకంపాలు, తుపానులు, వరదలు, కరవులు, యుద్ధ బీభత్సాలు వంటి అపాయాలు కలిగినా అవి మన విశ్వాసాన్ని లేదా ఆధ్యాత్మిక భద్రతను నాశనం చేయలేవు.

14. యెహోవా సేవకులమైన మనకు ప్రాణాంతకమైన తెగుళ్ళు ఎందుకు సోకలేదు?

14 అభిషిక్త క్రైస్తవులు ఈవిధానానికి వెలుపల గుడారాల్లో నివసిస్తున్న పరదేశుల వంటివారు. (1 పేతురు 2:​11) ‘ఏ తెగులును వారి గుడారమును సమీపించదు.’ మన నిరీక్షణ పరలోక జీవితమైనా భూ జీవితమైనా మనం ఈలోకసంబంధులం కాము, అంతేకాదు మనకు అనైతికత, వస్తుసంపదల దాహం, అబద్ధమతం, “క్రూరమృగము”ను దాని “ప్రతిమ” అయిన ఐక్యరాజ్య సమితిని ఆరాధించడం వంటి ఆధ్యాత్మికంగా ప్రాణాంతకమైన తెగుళ్ళు సోకలేదు.​—⁠ప్రకటన 9:​20,21; 13:​1-18; యోహాను 17:⁠16.

15. మనకు దేవదూతల సహాయం ఏయే విధాలుగా లభిస్తుంది?

15 మనం అనుభవించే కాపుదలను గురించి కీర్తనకర్త ఇలా అంటూ కొనసాగిస్తున్నాడు: “నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు.” (కీర్తన 91:​11,12) మనల్ని కాపాడడానికి దేవదూతలకు శక్తి ఇవ్వబడింది. (2 రాజులు 6:​17; కీర్తన 34:​7-9; 104:⁠4; మత్తయి 26:​53; లూకా 1:​19) వారు ‘మన మార్గములన్నిటిలో’ మనల్ని కావలికాస్తుంటారు. (మత్తయి 18:​10) రాజ్య ప్రచారకులుగా మనకు దేవదూతల నడిపింపూ, సంరక్షణా ఉన్నది, మనం ఆధ్యాత్మికంగా తొట్రుపడము. (ప్రకటన 14:​6,7) చివరికి మన పనికి విరుద్ధంగా నిషేధాలు విధించడం వంటి ‘రాళ్ళు’ కూడా మనం తొట్రుపడి దైవిక అనుగ్రహాన్ని కోల్పోయి క్రింద పడిపోయేలా చేయలేదు.

16. “సింహము” దాడి చేసే విధానానికి “నాగుపాము” కాటు వేసే విధానానికి తేడా ఏమిటి, మనం వాటికి ఎలా ప్రతిస్పందిస్తాము?

16 కీర్తనకర్త ఇంకా ఇలా కొనసాగాడు: “నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు.” (కీర్తన 91:​13) సింహము ఎలాగైతే బహిరంగంగా, ముఖాముఖిగా దాడిచేస్తుందో అలానే మన శత్రువుల్లో కొందరు మన ప్రకటనా పనిని ఆపుచేయడానికి చట్టాలను రూపొందిస్తూ తమ వ్యతిరేకతను బహిరంగంగానే చూపిస్తుంటారు. కానీ నాగుపాము చాటుగా ఉన్న చోటినుండి ఒక్కసారిగా ముందుకి వచ్చి ఎలా కాటు వేస్తుందో అలానే అనూహ్యమైన దాడులు కూడా మనపైకి వస్తుంటాయి. తెరవెనుక ఉంటూ కొన్నిసార్లు పాదిరీలు శాసనకర్తల ద్వారా, జడ్జీల ద్వారా, మరితరుల ద్వారా మనపై దాడిచేస్తుంటారు. కానీ యెహోవా మద్దతుతో మనం శాంతియుతంగా కోర్టుల్లో సహాయాన్ని కోరతాము, అలా మనం ‘సువార్తపక్షమున వాదిస్తూ, దానిని స్థిరపరుస్తాము.’​—⁠ఫిలిప్పీయులు 1:⁠7; కీర్తన 94:14, 20-22.

17. మనం ‘కొదమ సింహమును’ ఎలా అణగ ద్రొక్కుతాము?

17 కీర్తనకర్త ‘కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కడం’ గురించి మాట్లాడుతున్నాడు. కొదమ సింహము చాలా భయంకరంగా ఉండగలదు, ఒక భుజంగము చాలా పెద్ద పరిమాణంలోని ఒక సరీసృపమై ఉండవచ్చు. (యెషయా 31:⁠4) అయితే, ముఖాముఖిగా దాడి చేస్తున్నప్పుడు కొదమ సింహము ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ మనం, సింహములాంటి మనుష్యులకు లేదా సంస్థలకు కాక దేవునికి లోబడడం ద్వారా సూచనార్థకంగా దాన్ని అణగద్రొక్కుతాము. (అపొస్తలుల కార్యములు 5:​29) కాబట్టి భీతినిగొల్పే “సింహము” మనకు ఆధ్యాత్మిక హానిని కలుగజేయలేదు.

18. “భుజంగము” మనకు ఎవరిని గుర్తుకు తెస్తుంది, మనపై దాడి జరిగినప్పుడు మనం ఏమి చేయాలి?

18 గ్రీకు సెప్టాజింట్‌లో “భుజంగము” అన్నది “ఘటసర్పము” అని పిలువబడింది. ఇది మనకు ‘అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘటసర్పమును’ గుర్తుచేయవచ్చు. (ప్రకటన 12:7-9; ఆదికాండము 3:​15) ఆయన తన వేటను పట్టుకొని నుజ్జునుజ్జు చేసి మ్రింగివేసేయగల మహా సరీసృపంలాంటివాడు. (యిర్మీయా 51:​34) సాతాను మన చుట్టూ పాములా చుట్టేసి, ఈలోక ఒత్తిళ్ళతో మనల్ని నుజ్జునుజ్జు చేసి మ్రింగేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, మనల్ని మనం వాని పట్టునుండి వదిలించుకుని ఆ‘భుజంగాన్ని’ కాళ్ళక్రింద చితుకత్రొక్కుదాము. (1 పేతురు 5:⁠8) అభిషిక్త క్రైస్తవులు రోమీయులు 16:⁠20 నెరవేర్పులో భాగం వహించాలనుకుంటే అలా చేయాల్సిందే.

యెహోవా​—⁠మన రక్షణకు మూలం

19. మనం యెహోవా ఆశ్రయాన్ని ఎందుకు పొందుతాము?

19 సత్యారాధకుడి గురించి దేవుడిలా అంటున్నట్లు కీర్తనకర్త దేవునికి ప్రాతినిధ్యం వహిస్తూ చెబుతున్నాడు: “అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను.” (కీర్తన 91:​14) “నేనతని ఘనపరచెదను” అన్న మాటలకు అక్షరార్థంగా “నేనతని ఉన్నత స్థలములో ఉంచెదను” అని భావం, అంటే అందనంత ఎత్తులోనన్నమాట. మనం యెహోవా ఆరాధకులుగా ఆయన ఆశ్రయాన్ని పొందుతాము, ప్రాముఖ్యంగా దానికిగల కారణం ‘మనం ఆయనను ప్రేమిస్తున్నాము’ అన్నదే. (మార్కు 12:​29,30; 1 యోహాను 4:​19) అందుకు ప్రతిగా దేవుడు మనల్ని మన శత్రువుల నుండి ‘తప్పిస్తాడు.’ మనం ఎన్నటికీ నాశనం కాము. బదులుగా మనం రక్షణ పొందుతాము, ఎందుకంటే మనకు దేవుని నామము తెలుసు, విశ్వాసంతో ఆనామాన్ని మనం ఉపయోగిస్తూ ప్రార్థిస్తాము. (రోమీయులు 10:​11-13) అంతేకాదు, మనం ఎల్లప్పుడు ‘యెహోవా నామమున నడవాలని’ దృఢ సంకల్పంతో ఉన్నాము.​—⁠మీకా 4:⁠5; యెషయా 43:10-12.

20. కీర్తన 91 ముగింపులో యెహోవా తన విశ్వసనీయుడైన సేవకుడితో ఏమని వాగ్దానం చేశాడు?

20కీర్తన 91 ముగింపులో యెహోవా విశ్వసనీయుడైన తన సేవకుడితో ఇలా అంటాడు: “అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువుచేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను.” (కీర్తన 91:​15,16) మనం ఆయన చిత్తానికి అనుగుణంగా ఆయన నామమున ప్రార్థిస్తున్నప్పుడు ఆయన జవాబిస్తాడు. (1 యోహాను 5:​13-15) మనం ఇప్పటికే సాతాను రేకెత్తించిన శత్రుత్వం మూలంగా ఎన్నో శ్రమలను అనుభవించాము. కానీ “శ్రమలో నేనతనికి తోడై యుండెదను” అన్న మాటలు మనల్ని భవిష్యత్తులో రాబోయే శ్రమలకు సిద్ధం చేస్తాయి, అలాగే ఈదుష్ట విధానం నాశనమైనప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడన్న భరోసానిస్తాయి.

21. అభిషిక్తులు ఇప్పటికే ఎలా మహిమపరచబడ్డారు?

21 సాతాను ఎంతో క్రోధంతో వ్యతిరేకించినప్పటికీ మన మధ్యనున్న అభిషిక్తుల్లో ప్రతి ఒక్కరు యెహోవా యుక్త కాలంలో​—⁠భూమ్మీద “దీర్ఘాయువు” అనుభవించిన తర్వాత పరలోకంలోకి మహిమపరచబడతారు. అయితే దేవుని విశిష్టమైన రక్షణ చర్యలు ఇప్పటికే అభిషిక్తులకు ఆధ్యాత్మిక మహిమను తీసుకువచ్చాయి. ఈఅంత్య దినాల్లో భూమ్మీద యెహోవాకు సాక్షులుగా నాయకత్వం వహించే ఎంతటి గొప్ప ఘనత వారికి ఉన్నది! (యెషయా 43:​10-12) యెహోవా తన ప్రజల్ని రక్షించే అతిగొప్ప కార్యం అర్మగిద్దోను అనే ఆయన గొప్ప యుద్ధ సమయంలో జరుగుతుంది, ఆసమయంలో ఆయన తన సర్వాధిపత్యాన్ని రుజువుచేసుకుంటాడు, తన పవిత్ర నామాన్ని పరిశుద్ధపరచుకొంటాడు.​—⁠కీర్తన 83:​18; యెహెజ్కేలు 38:​23; ప్రకటన 16:14,16.

22. యెహోవా ఎవరికి ‘రక్షణను చూపిస్తాడు’?

22 అభిషిక్త క్రైస్తవులమైనా లేదా వారి సమర్పిత సహవాసులమైనా మనం రక్షణ నిమిత్తం దేవునివైపు చూస్తాము. “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము”న యెహోవాను యథార్థముగా సేవిస్తున్నవారు రక్షించబడతారు. (యోవేలు 2:​30-32) దేవుని నూతన లోకంలోకి ప్రవేశించే “గొప్ప సమూహము”నకు చెందేవారినీ, అలాగే ఒక చివరి పరీక్షలో విశ్వసనీయంగా ఉండే వారినీ ‘దేవుడు దీర్ఘాయువుచేత’​—⁠అంతంలేని జీవితంచేత ‘తృప్తిపరుస్తాడు.’ దేవుడు ఎంతోమందిని పునరుత్థానం కూడా చేస్తాడు. (ప్రకటన 7:⁠9; 20:​7-15) యేసుక్రీస్తు ద్వారా ‘మనకు రక్షణ చూపించడంలో’ యెహోవా నిజంగా ఎంతో ఆనందిస్తాడు. (కీర్తన 3:⁠8) అలాంటి మహిమాన్వితమైన నిరీక్షణలు మనముందుండగా మనం యెహోవా మహిమార్థం మన దినములను లెక్కించడంలో ఆయన సహాయాన్ని కోరుతూ ఉందాము. మన మాటల ద్వారా చర్యల ద్వారా యెహోవా మన ఆశ్రయము అని నిరూపిస్తూ ఉందాము.

[అధస్సూచి]

^ పేరా 2 క్రైస్తవ గ్రీకు లేఖనాల రచయితలు 91వ కీర్తనను మెస్సీయ ప్రవచనంగా చర్చించలేదు. అయితే, మనుష్యుడైన యేసుక్రీస్తుకు అలాగే “అంత్యకాలము”లో అభిషిక్తులైన యేసు అనుచరులకు వారి సమర్పిత సహవాసులకు కూడా యెహోవా ఆశ్రయముగా కోటగా ఉన్నాడు.​—⁠దానియేలు 12:⁠4.

మీరెలా జవాబిస్తారు?

• “మహోన్నతుని చాటు” అంటే ఏమిటి?

• మనం ఎందుకు భయపడము?

• ఎందుకు ‘మనకు అపాయమేమియు రాదు’?

• యెహోవాయే మన రక్షణకు మూలమని మనం ఎందుకు చెప్పగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రం]

యెహోవా సత్యము మనకు పెద్ద కేడెముగా ఎలా ఉందో మీకు తెలుసా?

[చిత్రసౌజన్యం]

నాగుపాము: A. N. Jagannatha Rao, Trustee, Madras Snake Park Trust

[18వ పేజీలోని చిత్రాలు]

తన సేవకులు అనూహ్యమైన దాడులు జరిగినప్పటికీ వ్యతిరేకత ఉన్నప్పటికీ తమ పరిచర్యను జరిగించడానికి యెహోవా సహాయం చేస్తాడు