యేసు రక్షించును —కానీ ఎలా?
యేసు రక్షించును —కానీ ఎలా?
“యేసు రక్షించును!” “యేసే మన రక్షకుడు!” ఇలాంటి సందేశాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గోడలపైనా మరితర బహిరంగ స్థలాల్లోను వ్రాయబడివుంటాయి. కోట్లాదిమంది యేసే తమ రక్షకుడని హృదయపూర్వకంగా నమ్ముతారు. మీరు గనుక వారిని, “యేసు ఎలా రక్షిస్తాడు?” అనడిగితే వారు బహుశ “యేసు మనకోసం మరణించాడు” అనో లేదా “యేసు మన పాపముల నిమిత్తం మరణించాడు” అనో జవాబిస్తారు. అవును, యేసు మరణం మనకు రక్షణను సాధ్యం చేస్తుంది. కానీ ఒక్క పురుషుడి మరణం కోట్లాదిమంది పాపాలకు ఎలా మూల్యాన్ని చెల్లిస్తుంది? “యేసు మరణం మనల్ని ఎలా రక్షించగలదు?” అని మిమ్మల్ని అడిగితే మీరేమని జవాబిస్తారు?
ఆప్రశ్నకు బైబిలు ఇచ్చే జవాబు చాలా సరళమైనది, అంతేకాదు స్పష్టమైనదీ ఎంతో ప్రాముఖ్యమైనది కూడాను. అయితే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మొదట మనం యేసు జీవితము మరణము చాలా సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారమని గ్రహించాలి. అప్పుడు మాత్రమే మనం యేసు మరణానికిగల గొప్ప విలువను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాము.
ఆదాము పాపం చేసినప్పుడు తలెత్తిన ఒక పరిస్థితితో వ్యవహరిస్తూ దేవుడు, యేసు తన జీవాన్ని ఇచ్చేలా చేశాడు. అది ఎంతటి విషాదకరమైన పాపం! మొట్టమొదటి పురుషుడు, ఆయన భార్య హవ్వ పరిపూర్ణులు. అందమైన ఏదెను తోట వారి గృహము. దేవుడు వారికి తమ వనగృహాన్ని సేద్యంచేయడమనే అర్థవంతమైన పనిని ఇచ్చాడు. వారు భూమ్మీది ఇతర ప్రాణుల పట్ల ప్రేమపూర్వకమైన పర్యవేక్షణ ఆదికాండము 1:28) వారికి ఎంత ఆహ్లాదకరమైన ఉత్తేజకరమైన పని ఇవ్వబడిందో కదా! అంతేకాదు, వారికి ప్రేమపూర్వకమైన పరస్పర సహవాసం ఉంది. (ఆదికాండము 2:18) వారికేమీ కొదువ లేదు. సంతోషంతో కూడిన నిత్య జీవితం వారిముందు ఉంది.
కలిగివుండాలి. మానవుల సంఖ్య పెరిగి భూమిని తమలాంటి కోట్లాది మందితో నింపుతుండగా వారు పరదైసును భూమి నలుదిశలకు విస్తరింపజేయాలి. (ఆదాము హవ్వలు ఎలా పాపం చేయగలిగారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ మొదటి మానవ జత తమను సృష్టించిన యెహోవా దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. ఆత్మ ప్రాణియైన అపవాదియైన సాతాను ఒక సర్పాన్ని ఉపయోగించి యెహోవాకు అవిధేయురాలయ్యేలా మొదట హవ్వను మోసం చేసింది, తర్వాత ఆదాము ఆమెను అనుసరించాడు.—ఆదికాండము 3:1-6.
సృష్టికర్త ఆదాము హవ్వలను ఏమి చేస్తాడన్నదానిలో ఏ సందేహమూ లేదు. అవిధేయతకు పరిణామమేమిటో ఆయన అంతకు ముందే స్పష్టంగా ఇలా చెప్పాడు: ‘ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.’ (ఆదికాండము 2:16,17) ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రశ్నకు జవాబు కావాల్సివచ్చింది.
మానవజాతి ఎదుట ఒక కష్టతరమైన సమస్య
తొలిపాపము మానవజాతికి చాలా గంభీరమైన సమస్యను సృష్టించింది. ఆదాము తన జీవితాన్ని ఒక పరిపూర్ణ వ్యక్తిగా ప్రారంభించాడు. కాబట్టి ఆయన పిల్లలు పరిపూర్ణమైన నిత్య జీవితాన్ని అనుభవించగలిగేవారు. అయితే ఆదాము పిల్లల్ని కనకముందే పాపం చేశాడు. ఆయన ఈశిక్షను పొందేనాటికి పూర్తి మానవజాతే ఆయన గర్భవాసమున ఉంది: ‘నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.’ (ఆదికాండము 3:19) కాబట్టి ఆదాము పాపం చేసి దేవుడు చెప్పినట్లే చనిపోవడం ప్రారంభించినప్పుడు ఆయనతోపాటు మానవజాతి అంతా మరణశిక్షకు గురైంది.
అందుకు తగినట్లే అపొస్తలుడైన పౌలు తర్వాత ఇలా వ్రాశాడు: ‘ఒక మనుష్యునిద్వారా [ఆదాము] పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.’ (రోమీయులు 5:12) అవును, తొలి పాపం మూలంగా, అనంత జీవితపు భవిష్యత్తుతో పరిపూర్ణులుగా జన్మించాల్సిన పిల్లలు వ్యాధులు, వృద్ధాప్యము, మరణము వంటివే తమ భవిష్యత్తుగా జన్మించారు.
“అది న్యాయం కాదు” అని ఎవరైనా అనవచ్చు. “దేవునికి అవిధేయత మనం చూపించలేదు—ఆదాము చూపించాడు. అందుకు నిరంతర జీవితం భవిష్యత్తుగా కలిగివుండడాన్ని సంతోషానందాల్ని మనమెందుకు కోల్పోవాలి?” అని వారడగవచ్చు. ఒక కోర్టు, తండ్రి కారు దొంగిలించినందుకు కుమారుణ్ణి జైల్లో వేస్తే ఆకుమారుడు “ఇది న్యాయం కాదు! నేనేమీ తప్పు చేయలేదు” అని ఫిర్యాదు చేయడం సరైనదేనని మనకు తెలుసు.—ద్వితీయోపదేశకాండము 24:16.
సాతాను మొదటి స్త్రీపురుషులను పాపం చేసేలా ప్రలోభపెట్టడం ద్వారా తాను దేవుణ్ణి సందిగ్ధావస్థలో పడేయగలనని అనుకుని ఉండవచ్చు. అపవాది మానవజాతి చరిత్ర ఆరంభంలోనే దాడిచేశాడు, అంటే పిల్లలేమీ పుట్టకముందే దాడిచేశాడు. ఆదాము పాపం చేసిన ఆక్షణాన తలెత్తిన ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఆదాము హవ్వలకు పుట్టే పిల్లల విషయంలో యెహోవా ఏమి చేస్తాడు?
యెహోవా దేవుడు న్యాయవంతుడు. “దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము” అని నీతిమంతుడైన ఎలీహు ప్రకటించాడు. (యోబు 34:10) యెహోవాను గురించి ప్రవక్తయైన మోషే ఇలా వ్రాశాడు: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4) ఆదాము చేసిన పాపం సృష్టించిన సమస్యకు సత్య దేవుడు అందించిన పరిష్కారం, మనం పరదైసు భూమిపై నిరంతరం జీవించే అవకాశాన్ని లేకుండా చేయదు.
దేవుడు ఒక పరిపూర్ణమైన పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు
అపవాదియైన సాతానుపై తాను విధించిన శిక్షలో దేవుడు పేర్కొన్న పరిష్కార వివరాలను పరిశీలించండి. యెహోవా సాతానుతో ఇలా అన్నాడు: ‘నీకును స్త్రీకిని [దేవుని పరలోక సంస్థ] నీ సంతానమునకును [సాతాను ఆధీనంలో ఉన్న లోకము] ఆమె సంతానమునకును [యేసుక్రీస్తు] వైరము కలుగజేసెదను. అది నిన్ను [సాతాను] తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని [యేసు మరణం] చెప్పెను.’ (ఆదికాండము 3:15) బైబిలులోని ఈమొట్టమొదటి ప్రవచనంలో యెహోవా, తన పరలోక ఆత్మ కుమారుణ్ణి భూమి మీదికి పంపించి పరిపూర్ణ పురుషుడైన యేసుగా జీవించి ఆతర్వాత చనిపోయేలా, అంటే మడిమె మీద కొట్టబడేలా చేయాలన్న తన సంకల్పాన్ని సూచించాడు.
ఒక పరిపూర్ణ పురుషుడి మరణం అవసరమని దేవుడు ఎందుకు కోరాడు? ఆదాము పాపం చేస్తే అందుకు యెహోవా దేవుడు విధించే శిక్ష ఏమిటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆశిక్ష మృత్యువు కాదూ? (ఆదికాండము 2:16,17) “పాపమువలన వచ్చు జీతము మరణము” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 6:23) ఆదాము తన పాపం నిమిత్తం తన మరణాన్ని జీతంగా చెల్లించాడు. ఆయనకు జీవం ఇవ్వబడింది, కానీ ఆయన పాపాన్ని ఎంపిక చేసుకున్నాడు, తన పాపానికి శిక్షగా ఆయన మరణించాడు. (ఆదికాండము 3:19) ఆపాపం మూలంగా పూర్తి మానవజాతి అనుభవిస్తున్న శిక్ష విషయమేమిటి? వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక మరణం అవసరమైంది. కానీ ఎవరి మరణం మొత్తం మానవజాతి పాపాలను చట్టబద్ధంగా కప్పగలదు?
ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ‘ప్రాణమునకు ప్రాణము [లేదా, జీవానికి జీవం]’ చెల్లించాలని చెప్పింది. (నిర్గమకాండము 21:23) ఈచట్టబద్ధమైన సూత్రం ప్రకారం మానవజాతి పాపాలను కప్పే మరణం ఆదాము కోల్పోయిన దానికి సరిసమానమైన విలువగలదై ఉండాలి. మరో పరిపూర్ణ పురుషుడి మరణం మాత్రమే పాపపు జీతాన్ని చెల్లించగలదు. యేసు అలాంటి పురుషుడే. నిజానికి ఆదాము నుండి పుట్టిన మానవజాతిలో విమోచించబడగలవారందరిని రక్షించడానికి యేసు “తత్సమానమైన విమోచన క్రయధనముగా” ఉన్నాడు.—1 తిమోతి 2:6, NW; రోమీయులు 5:16,17.
యేసు మరణానికి గొప్ప విలువ ఉంది
ఆదాము మరణానికి ఏమాత్రం విలువ లేదు; ఆయన తన పాపం నిమిత్తం చనిపోవడానికే అర్హుడు. అయితే యేసు మరణానికి గొప్ప విలువ ఉంది ఎందుకంటే ఆయన పాపరహిత స్థితిలో మరణించాడు. యెహోవా దేవుడు పాపభరితుడైన ఆదాముకు పుట్టిన విధేయులైన సంతానాన్ని విడిపించడానికి యేసు పరిపూర్ణ జీవితాన్ని విమోచన క్రయధనముగా స్వీకరించాడు. యేసు బలి విలువ, మన గత పాపాలకు జీతాన్ని చెల్లించే ప్రభావం మాత్రమే కలిగిలేదు. ఒకవేళ దాని ప్రభావం అంతే అయితే మనకు ఎలాంటి భవిష్యత్తు నిరీక్షణ ఉండేది కాదు. పాపంలో పుట్టినందుకు మనం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాము. (కీర్తన 51:5) యేసు మరణం, ఆదిలో ఆదాము హవ్వల సంతానం కోసం యెహోవా ఉద్దేశించిన పరిపూర్ణత్వాన్ని పొందే అవకాశం మనకు ఇస్తున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి!
మనల్ని చాలా అప్పుల్లో (పాపము) కూరుకుపోయిన పరిస్థితిలో విడిచిపెట్టి చనిపోయిన ఒక తండ్రిలాంటివాడు ఆదాము, దాన్ని తీర్చడానికి సాధ్యమయ్యే మార్గమేదీ మనకు లేదు. మరోవైపున, యేసు చనిపోయి మనకు గొప్ప ఆస్తిని వారసత్వంగా విడిచిపెట్టిన మంచి తండ్రిలాంటివాడు, ఆఆస్తి ఆదాము మనపై వదిలిన మొత్తం అప్పునుండి మనల్ని స్వతంత్రులను చేయడమే కాక మనం నిత్యం జీవించడానికి కూడా సరిపోతుంది. యేసు మరణం కేవలం మన గత పాపాలను కొట్టివేయడానికి మాత్రమే కాదు; అది మన భవిష్యత్తు కోసం కూడా అద్భుతమైన ఏర్పాటు.
యేసు మానవజాతికి రక్షకుడు, ఎందుకంటే ఆయన మనకోసం మరణించాడు. ఆయన మరణం మనకు ఎంత అమూల్యమైన ఏర్పాటో కదా! మనం దాన్ని ఆదాము చేసిన పాపం వలన తలెత్తిన సంక్లిష్టమైన సమస్యకు దేవుడిచ్చిన పరిష్కారమని గ్రహించినప్పుడు యెహోవాపైనా ఆయన కార్యవిధానాలపైనా మన విశ్వాసం బలపడుతుంది. అవును యేసు మరణం, ఆయనపై ‘విశ్వాసముంచు ప్రతివ్యక్తిని’ పాపము నుండి, వ్యాధుల నుండి, వృద్ధాప్యం నుండి, చివరికి మరణం నుండి కూడా రక్షించే మాధ్యమం. (యోహాను 3:16) మన రక్షణార్థం ఈప్రేమపూర్వక ఏర్పాటును చేసినందుకు దేవునికి మీరు కృతజ్ఞులై ఉన్నారా?
[5వ పేజీలోని చిత్రం]
ఆదాము మానవజాతిపైకి పాపాన్ని మరణాన్ని తీసుకువచ్చాడు
[6వ పేజీలోని చిత్రం]
యెహోవా పరిపూర్ణమైన పరిష్కారాన్ని అందించాడు