కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా “బలాధిక్యము” ఇచ్చాడు

యెహోవా “బలాధిక్యము” ఇచ్చాడు

జీ వి త క థ

యెహోవా “బలాధిక్యము” ఇచ్చాడు

హెలెన్‌ మార్క్స్‌ చెప్పినది

అది 1986 లోని వేసవికాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్న ఒక రోజు. యూరప్‌లో ప్రశాంతంగా ఉండే ఒక ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్‌ షెడ్డులో నేనొక్కదాన్నే ఉన్నాను. అది అల్బేనియా రాజధాని టిరానా. అది “ప్రపంచంలో మొట్టమొదటి నాస్తిక దేశం” అని ప్రకటించుకున్న దేశం.

సాయుధుడైన ఒక అధికారి నా సామాన్లను పరీక్షిస్తుండగా భయాందోళనలతో చూస్తున్నాను. ఆయనకు అనుమానం కలిగేలా ఏమైనా అన్నా, చేసినా నన్ను దేశం నుండి వెళ్ళగొడతారు, నాకోసం బయట వేచివున్న వారిని జైల్లోనో నిర్బంధ శిబిరాల్లోనో పెడతారు. అది గ్రహించిన నేను ఆ అధికారికి చూయింగ్‌ గమ్‌ని కొన్ని బిస్కెట్లని ఇచ్చి, ఆయన ఇంకా స్నేహపూర్వకంగా ఉండేలా చేయగలిగాను. అది సరే, 65 ఏళ్ళ దరిదాపుల్లో ఉన్న స్త్రీనైన నాకు ఈ పరిస్థితి ఎలా ఎదురైంది? హాయిగా సాగిపోయే జీవితాన్ని వదులుకుని మార్క్సిజం-లెనినిజం పట్టు గట్టిగా ఉన్న దేశాల్లో చివరిదైన ఈ దేశంలోకి రాజ్యాసక్తులను పెంపొందించడానికి ప్రయత్నించే సాహసం ఎందుకు చేస్తున్నాను?

అనారోగ్యపు అమ్మాయి బుర్రనిండా ప్రశ్నలు

నేను 1920 లో క్రీట్‌లోని ఈయరాపెట్రాలో పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలకు మా నాన్నగారు న్యుమోనియాతో చనిపోయారు. అమ్మ పేదరాలు, చదువురాదు. నేను నలుగురు పిల్లల్లో చివరిదాన్ని, నాకు పచ్చకామెర్లు వచ్చిన కారణంగా పాలిపోయి, రోగగ్రస్థురాలిగా ఉండేదాన్ని. మిగిలివున్న కొద్దిపాటి వనరుల్ని మిగతా ముగ్గురు పిల్లల కోసం ఖర్చుపెట్టమనీ నన్ను చనిపోనివ్వమనీ పొరుగువారు అమ్మకు సలహా ఇచ్చారు. ఆ సలహాను ఆమె పాటించనందుకు నేను కృతజ్ఞురాలిని.

నాన్నగారి ఆత్మ స్వర్గంలో విశ్రాంతిగా ఉందో లేదో తెలుసుకోవడానికిగాను అమ్మ తరచుగా శ్మశానానికి వెళ్ళి, ఆర్థడాక్సు ప్రీస్టుచేత మతకర్మలు చేయించేది. అయితే ఆ మతకర్మలు చేయటానికి ప్రీస్టు బాగానే డబ్బులు దండుకునేవాడు. ఒక క్రిస్మస్‌ రోజున ఎముకలు కొరికే చలిలో అమ్మ శ్మశానం నుండి నన్ను ఈడ్చుకుంటూ రావడం నాకింకా గుర్తుంది. మా దగ్గర చివరికి మిగిలిన డబ్బు కాస్తా ప్రీస్టుకి ఇచ్చేశాం. ఇంటికి వచ్చి అమ్మ కూరగాయలతో మాకు వంట చేసిపెట్టి, తను మాత్రం ఖాళీ కడుపుతో మరో గదిలోకి వెళ్ళిపోయింది, నిస్పృహతో ఏడ్చిన ఆమె బుగ్గలపై కన్నీటి చారికలయ్యాయి. కొంతసేపయ్యాక నేను ధైర్యం కూడగట్టుకుని ప్రీస్టు దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు ఎందుకు చనిపోయారనీ నిరుపేదైన మా అమ్మ మీకు డబ్బులెందుకు చెల్లించాల్సి వచ్చిందనీ అడిగాను. ఆయన ఏదో తప్పుచేసినవాడిలా అతి మెల్లని స్వరంతో, “ఆయనను దేవుడు తీసుకెళ్ళాడు. అదంతే. కొంతకాలానికి నీ బాధ తగ్గిపోతుందిలే” అన్నాడు.

ఆయనిచ్చిన జవాబుకు, నేను స్కూల్లో నేర్చుకున్న పరలోక ప్రార్థనకు పొత్తు కుదరక నేను సతమతమయ్యాను. ఆ ప్రార్థనలోని మనోహరమైన, అర్థవంతమైన తొలి మాటలు నాకప్పటికీ గుర్తున్నాయి: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చు గాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:​9, 10) దేవుడు, భూమిపై తన చిత్తాన్ని జరిగించాలన్న ఉద్దేశం కలిగివుంటే మరి మనం ఇన్ని బాధలు ఎందుకు అనుభవించాల్సివస్తోంది?

1929 లో యెహోవాసాక్షుల పూర్తికాల ప్రచారకుడైన ఇమ్మాన్వీల్‌ లియోనూడాకీస్‌ మా ఇంటిని సందర్శించినప్పుడు నా ప్రశ్నకు దాదాపు జవాబు దొరికినట్టే అయ్యింది. * ఆయనకేమి కావాలని మా అమ్మ అడిగినప్పుడు ఇమాన్వీల్‌ ఏమీ మాట్లాడకుండా సాక్ష్యమిచ్చే కార్డు ఆమె చేతిలో పెట్టాడు. చదవమని అమ్మ దాన్ని నా చేతికిచ్చింది. నాకప్పుడు తొమ్మిదేళ్ళే కాబట్టి నాకు సరిగా అర్థంకాలేదు. ఆ ప్రచారకుడు మూగవాడనుకుని మా అమ్మ “అయ్యో పాపం! నీకు మాటల్రావు, నాకు చదవడం రాదు” అంది. తర్వాత ఆయనకు సాదరంగా బయటికి దారి చూపించింది.

కొన్ని సంవత్సరాల తర్వాత చివరికి నాకు జవాబులు దొరికాయి. అదే పూర్తికాల సేవకుడి దగ్గర నుండి మా అన్నయ్య ఇమ్మాన్యల్‌ పాటెరాకిస్‌, యెహోవాసాక్షులు ప్రచురించిన మృతులు ఎక్కడ ఉన్నారు? (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని తీసుకున్నాడు. * దాన్ని చదివిన తర్వాత మా నాన్నగారిని దేవుడు తీసుకెళ్ళలేదని తెలుసుకుని నా మనస్సు కుదుటపడింది. మరణం అనేది మానవ అపరిపూర్ణత మూలంగా వచ్చిందని, మా నాన్నగారు భూ పరదైసులో జీవించేందుకు పునరుత్థానం కోసం వేచివున్నారని నేను గ్రహించాను.

“ఈ పుస్తకం నిన్ను నాశనం చేసింది”

బైబిలు సత్యం మాకు కనువిప్పు కలిగించింది. మా నాన్నగారి పాత బైబిలు మాకు దొరకడంతో దాన్ని చదవడం ప్రారంభించాము, చలిమంట చుట్టూ కూర్చుని తరచుగా కొవ్వొత్తుల వెలుగులో చదువుకునేవాళ్ళము. బైబిలు విషయంలో ఆసక్తిని ప్రదర్శించిన వారిలో నేనొక్కదాన్నే యౌవన స్త్రీని కావడంతో స్థానికంగా ఉన్న సాక్షుల చిన్న గుంపు పాల్గొనే కార్యకలాపాల్లో నన్ను చేర్చుకోలేదు. కొంతకాలంపాటు నేను ఈ మతం కేవలం పురుషుల కోసం మాత్రమేనని గాఢంగా నమ్మాను, నిజానికది వాస్తవం కాదు.

మా అన్న ప్రకటనా పని పట్ల చూపించిన ఆసక్తి నన్ను ప్రోత్సహించింది. కొద్ది రోజులకే పోలీసులు మా ఇంటిపై నిఘా ప్రారంభించారు, ఇమ్మాన్యల్‌ని పట్టుకోవడం కోసం సాహిత్యాలను వెదకడం కోసం మా ఇంటికి రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవారు. చర్చికి తిరిగి రమ్మని మమ్మల్ని ఒప్పించడానికి ఒక ప్రీస్టు రావడం నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఆయనకు దేవుని నామము యెహోవా అని బైబిలులోంచి ఇమ్మాన్యల్‌ చూపించినప్పుడు, ప్రీస్టు బైబిలు లాక్కుని, దాన్ని అన్న ముఖం ముందు ఊపుతూ బిగ్గరగా, “ఈ పుస్తకం నిన్ను నాశనం చేసింది!” అని అరిచాడు.

1940 లో ఇమ్మాన్యల్‌ సైన్యంలో చేరడానికి నిరాకరించినందుకు ఆయనను అరెస్టు చేసి అల్బేనియా యుద్ధరంగంలోకి పంపించారు. ఆయన నుండి ఎలాంటి సమాచారమూ లభించలేదు కాబట్టి చనిపోయాడని మేమనుకున్నాము. అయితే రెండు సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి ఆయన జైల్లోంచి వ్రాసిన ఒక ఉత్తరం మాకు అందింది. ఆయన సజీవంగా క్షేమంగా ఉన్నాడు! ఆ ఉత్తరంలో ఆయన పేర్కొన్న ఒక వచనం అప్పటి నుండి నా మనస్సు పొరల్లో నిక్షిప్తమైంది: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:⁠9) మాకు ఆ ప్రోత్సాహం ఎంతగా సహాయపడిందో!

మమ్మల్ని సందర్శించమని తనున్న జైల్లోంచే ఇమ్మాన్యల్‌ కొందరు సహోదరులను అడిగాడు. వెంటనే మా పట్టణం వెలుపల ఉన్న ఒక ఫార్మ్‌హౌస్‌లో రహస్య క్రైస్తవ కూటాలు జరిగేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. మమ్మల్ని అనుక్షణం పరిశీలిస్తున్నారని మాకు ఏ మాత్రం తెలీదు! ఒకరోజు ఆదివారం సాయుధులైన పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. మమ్మల్ని ఒక లారీలోకి ఎక్కించుకుని పట్టణం అంతటా ఊరేగించారు. ప్రజలు మమ్మల్ని గేలి చేస్తూ, తిట్టడం నాకిప్పటికీ వినిపిస్తుంది, కానీ యెహోవా తన ఆత్మ ద్వారా మాకు ఆంతరంగిక శాంతిని ప్రసాదించాడు.

తర్వాత వాళ్ళు మమ్మల్ని మరో పట్టణంలోకి తీసుకువెళ్లి, కటిక చీకటిగా ఉండి అసహ్యంగా ఉన్న చిన్న జైలు గదుల్లో మమ్మల్ని పడేశారు. ఒక బకెట్టే నా గదిలోని టాయ్‌లెట్‌, దాన్ని రోజుకొకసారి ఖాళీ చేస్తారు. నేను ఆ గుంపుకి “బోధకురాలు” అని వాళ్ళు భావించారు కాబట్టి, నాకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. అయితే జైల్లో ఉన్న ఒక సహోదరుడు తన లాయరు మా కేసు తీసుకునేలా ఏర్పాటు చేసి, మేము విడుదలయ్యేలా చేయించాడు.

ఒక క్రొత్త జీవితం

జైల్లోంచి విడుదల అయిన తర్వాత ఇమ్మాన్యల్‌ ప్రయాణ పైవిచారణకర్తగా ఏథెన్సులోని సంఘాలను సందర్శించడం ప్రారంభించాడు. 1947 లో నేనక్కడికి వెళ్ళాను. ఎట్టకేలకు, నేను సాక్షుల పెద్ద గుంపును కలవగలిగాను​—⁠అందులో పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. యెహోవాకు నేను చేసుకున్న నా సమర్పణను చివరికి 1947 జూలైలో నీటి బాప్తిస్మం ద్వారా సూచించగలిగాను. నేను మిషనరీని అవ్వాలని కలలుగనే దాన్ని, ఇంగ్లీషు నేర్చుకోవడానికి సాయంకాలం పూట స్కూలుకి హాజరవడం ప్రారంభించాను. నేను 1950 లో పయినీరునయ్యాను. అమ్మ నాదగ్గర ఉండడానికి వచ్చింది, ఆమె కూడా బైబిలు సత్యాన్ని స్వీకరించింది. ఆమె 34 సంవత్సరాల తర్వాత చనిపోయింది, అప్పటివరకు యెహోవాసాక్షిగానే ఉంది.

అదే సంవత్సరంలో నేను అమెరికా నుండి వచ్చిన జాన్‌ మార్క్స్‌ను కలిశాను, ఆయనకు మంచి పేరుంది, ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి. జాన్‌ దక్షిణ అల్బేనియాలో పుట్టాడు, అమెరికాకు వలసవెళ్ళిన తర్వాత యెహోవాసాక్షి అయ్యాడు. ఆయన 1950 లో గ్రీసులో ఉండి అల్బేనియా రావడానికి వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు​—⁠అప్పటికే అల్బేనియాకు రావడానికి అన్ని ద్వారాలూ మూసుకుపోయాయి, ఆ దేశం భయంకరమైన కమ్యూనిజం క్రింద ఉంది. జాన్‌ తన కుటుంబాన్ని 1936 నుండి చూడలేదు, అయినప్పటికీ అధికారులు ఆయన్ను అల్బేనియాలోకి అనుమతించలేదు. యెహోవా సేవ పట్ల, సహోదరత్వం కోసం ఉన్న ప్రగాఢమైన ప్రేమ పట్ల ఆయనకున్న మహోజ్వలమైన ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ప్రభావితమయ్యాను. మేము 1953, ఏప్రిల్‌ 3న పెండ్లి చేసుకున్నాము. తర్వాత అమెరికాలోని న్యూ జెర్సీలో మా క్రొత్త గృహానికి మారాము.

పూర్తికాలం ప్రకటిస్తూ మమ్మల్ని మేము పోషించుకోగలిగేలా నేనూ జాన్‌ న్యూ జెర్సీ తీరప్రాంతంలో జాలర్లకు ఉదయం అల్పాహారాన్ని అందించే చిన్న వ్యాపారం ప్రారంభించాము. మేము వేసవిలోనే తెల్లవారు జాము నుంచి 9:⁠00 గంటల వరకు పని చేసేవాళ్లం. మా జీవితాలను సరళంగా ఉంచుకోవడం ద్వారా మా ప్రాధాన్యతలను ఆధ్యాత్మిక కార్యకలాపాల మీద కేంద్రీకరించుకోవడం ద్వారా మేము ఎక్కువ సమయాన్ని ప్రకటనా పనిలోనే గడపగలిగాము. ఆ తర్వాతి సంవత్సరాల్లో ప్రకటనా పని చేసేవారి అవసరం ఎంతో ఉన్న అనేక పట్టణాలకు మమ్మల్ని పంపించారు. యెహోవా మద్దతుతో మేము వెళ్ళిన చోటల్లా ఆసక్తి చూపించిన వారికి సహాయం చేశాము, సంఘాలను స్థాపించాము, రాజ్యమందిరాలు నిర్మించడానికి దోహదపడ్డాము.

అవసరంలో ఉన్న మన సహోదరులకు సహాయపడడం

అయితే కొంతకాలానికి మాకొక ఉత్సాహవంతమైన అవకాశం లభించింది. మన కార్యకలాపాలు నిషేధంలో ఉన్న బాల్కన్‌ దేశాల్లో నివసిస్తున్న తోటి క్రైస్తవ సహోదరులతో సంబంధాల్ని స్థాపించాలని బాధ్యతగల సహోదరులు అనుకున్నారు. ఆ దేశాల్లోని యెహోవాసాక్షులకు అనేక సంవత్సరాలనుండి అంతర్జాతీయ సహోదరత్వంతో సంబంధాలు లేకుండాపోయాయి; వారికి ఆధ్యాత్మిక ఆహారం చాలా తక్కువగానో లేక అసలు దొరక్కుండానో పోయింది, భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. వారిలో అత్యధికులు నిరంతరం నిఘా క్రింద ఉండేవారు, అనేకులు జైళ్ళలోను లేదా లేబర్‌ క్యాంపుల్లోను ఉన్నారు. వారికి బైబిలు ఆధారిత ప్రచురణలు, నిర్దేశము, ప్రోత్సాహము అత్యవసరం. ఉదాహరణకు మాకు అల్బేనియా నుండి వచ్చిన సంకేత లిపిలోని ఒక సందేశం ఇలా ఉంది: “మాకోసం ప్రభువుకు ప్రార్థించండి. ఇంటింటి సాహిత్యం స్వాధీనం. మమ్మల్ని అధ్యయనం చేయనివ్వరు. ముగ్గురి ఖైదు.”

అందుకని మేము 1960 నవంబరులో అక్కడి కొన్ని దేశాలను సందర్శించడానికి ఆరు నెలల సుదీర్ఘమైన ప్రయాణం ప్రారంభించాము. మా లక్ష్యాన్ని సాధించడానికి మాకెంతో “బలాధిక్యము” కావాలన్నది స్పష్టం, దేవుని నుండి ధైర్యమూ కావాలి, అలాగే సాహసం బుద్ధికుశలత కూడా అవసరము. (2 కొరింథీయులు 4:⁠7) మా మొదటి గమ్యస్థానం అల్బేనియా. మేము పారిస్‌లో ఒక కారు కొనుక్కుని బయల్దేరాము. మేము రోమ్‌కు చేరుకున్న తర్వాత జాన్‌కు మాత్రమే అల్బేనియాకు వీసా దొరికింది. నేను గ్రీస్‌లోని ఏథెన్స్‌కు వెళ్ళి ఆయనకోసం వేచివుండాలి.

జాన్‌ 1961 ఫిబ్రవరి చివర్లో అల్బేనియాలోకి వెళ్ళి మార్చి చివరి వరకు అక్కడ ఉన్నాడు. టిరానాలో ఆయన 30 మంది సహోదరులను కలిశాడు. ఎంతో ఆవశ్యకమైన సాహిత్యాన్ని ప్రోత్సాహాన్ని పొందినందుకు వారెంత ఉత్తేజితులయ్యారో! వారిని 24 సంవత్సరాలనుండి బయటి దేశాలనుండి ఎవ్వరూ సందర్శించలేదు.

ఆ సహోదరుల యథార్థత మూలంగా సహనం మూలంగా జాన్‌ ఎంతో చలించిపోయాడు. కమ్యూనిస్టు ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొననందున వారిలో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని జైళ్ళపాలయ్యారని ఆయన తెలుసుకున్నాడు. 80వ పడిలో ఉన్న ఇద్దరు సహోదరులు ప్రకటనా పని కోసం తనకు దాదాపు 5,000 రూపాయలు విరాళం ఇచ్చినప్పుడు ఆయన ఎంతో ప్రభావితమయ్యాడు. చాలీచాలని తమ పెన్షన్‌లోంచి వారు సంవత్సరాలుగా దాచిపెట్టుకున్న డబ్బు అది.

జాన్‌ అల్బేనియాలో గడిపిన చివరి రోజు 1961, మార్చి 30​—⁠అది యేసు మరణ జ్ఞాపకార్థ దినం. అక్కడ హాజరైన 37 మందికి జాన్‌ జ్ఞాపకార్థ దిన ప్రసంగాన్నిచ్చాడు. ప్రసంగం అయిపోయిన వెంటనే సహోదరులు జాన్‌ను వెనుక ద్వారం గుండా డురాజో రేవుకి తీసుకెళ్ళారు, అక్కడాయన గ్రీస్‌లోని పిరయెస్‌కి వెళ్తున్న ఒక టర్కీదేశపు ఓడ ఎక్కాడు.

ఆయన సురక్షితంగా వచ్చినందుకు నేను ఆనందించాను. ఇక మేము మిగతా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాలన్నమాట. మేము ప్రయాణిస్తూ మన పని నిషేధించబడిన మూడు బాల్కన్‌ దేశాల్లోకి వెళ్ళాము​—⁠అది చాలా ప్రమాదకరమైనదే ఎందుకంటే మేము బైబిలు సాహిత్యాలను, టైపురైటర్లను, మరితర సామగ్రిని వెంట తీసుకెళ్తున్నాము. తమ ఉద్యోగాలను, తమ స్వేచ్ఛను, చివరికి తమ ప్రాణాలను కూడా యెహోవా కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న యథార్థతగల సహోదర సహోదరీలను కలిసే ఆధిక్యత మాకు లభించింది. వారి అత్యాసక్తి, నిజమైన ప్రేమ మాకు ప్రేరణనిచ్చాయి. యెహోవా మాకు ‘బలాధిక్యాన్ని’ ఇచ్చినందుకు కూడా మేము ఎంతో ఆనందించాము.

మా ప్రయాణం విజయవంతంగా ముగిసిన తర్వాత మేము అమెరికాకు తిరిగివచ్చాము. ఆ తర్వాతి సంవత్సరాల్లో మేము అల్బేనియాకు సాహిత్యాలను పంపించడానికి మన సహోదరుల కార్యకలాపాలను గురించిన నివేదికలను పొందడానికి అనేక పద్ధతులను ఉపయోగించాము.

అనేకసార్లు ప్రయాణములలోను, ఆపదలలోను

కాలం ముందుకు సాగింది, 1981 లో 76 ఏండ్ల వయస్సులో జాన్‌ మరణించడంతో నేను ఒంటరిదాన్నయ్యాను. మా అక్క కూతురు ఇవాంజిలీయా, ఆమె భర్త జార్జ్‌ ఆర్ఫనీడిస్‌ నన్ను దయతో ఆదరించారు, అప్పటి నుండి వారు నాకు అమూల్యమైన మానసిక మద్దతును, క్రియాత్మకమైన మద్దతును అందిస్తూ వచ్చారు. వారు కూడా సూడాన్‌లో నిషేధం క్రింద సేవ చేస్తున్నప్పుడు యెహోవా మద్దతును అనుభవించారు. *

చివరికి అల్బేనియాలోని మన సహోదరులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఒక క్రొత్త ప్రయత్నం ప్రారంభమైంది. నా భర్త బంధువులు అక్కడ ఉన్నారు కాబట్టి, మీరు ఆ దేశానికి వెళతారా అని నన్ను అడిగారు. అందులో సందేహం ఎందుకు, తప్పకుండా!

ఎన్నో నెలలు పట్టుదలతో ప్రయత్నించిన తర్వాత 1986 మే నెలలో నేను ఏథెన్స్‌లో ఉన్న అల్బేనియన్‌ ఎంబసీ నుండి వీసా సంపాదించగలిగాను. ఎలాంటి పొరబాటు జరిగినా బయటి ప్రపంచం నుండి సహాయం లభిస్తుందని ఆశించకని నన్ను అక్కడి దౌత్య కార్యాలయ సిబ్బంది గట్టిగా హెచ్చరించారు. అల్బేనియాకు విమాన టిక్కెట్టు కొనడానికి ఒక ట్రావెల్‌ ఏజెంటుని కలిసినప్పుడు ఆయన నోట మాటరాలేదు. నేను భయంతో వెనక్కి తగ్గకుండా, కొద్ది రోజుల్లోనే ఏథెన్స్‌ నుండి టిరానాకు వారానికి ఒక్కసారి వెళ్ళే విమానం ఎక్కాను. ఆ విమానంలో వయోవృద్ధులైన ముగ్గురు అల్బేనియన్లు మాత్రమే ఉన్నారు; వారు ఆరోగ్య కారణాల నిమిత్తం గ్రీసుకి వచ్చారు.

విమానం లాండ్‌ అవ్వగానే కస్టమ్స్‌ ఆఫీసులా ఉపయోగించబడుతున్న ఒక ఖాళీ షెడ్డులోకి నన్ను తీసుకెళ్ళారు. నా భర్త తమ్ముడు, చెల్లెలు యెహోవాసాక్షులు కాకపోయినా స్థానికంగా ఉన్న కొద్దిమంది సహోదరులతో నేను సంబంధాలు ఏర్పరచుకోవడానికి నాకు సహాయం చేసేందుకు సుముఖత చూపించారు. చట్ట ప్రకారం వాళ్ళు నా రాక గురించి సమాజ అధిపతికి తెలియజేయాలి. దాని ఫలితంగా నన్ను పోలీసులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఆ కారణంగా, మా బంధువులు టిరానాలోని ఇద్దరు సహోదరులను వెదికి తీసుకువచ్చేంత వరకు నేను తమ ఇంట్లోనే ఉండాలని అన్నారు.

ఆ సమయంలో అల్బేనియా అంతటా కేవలం తొమ్మిది మంది సమర్పిత సహోదరులు మాత్రమే ఉన్నట్లు తెలుసు. సంవత్సరాలు తరబడి నిషేధం, హింసలు, గట్టి నిఘా వారిని ఎంతో జాగరూకులుగా చేసింది. వారి ముఖాలపై చర్మం ముడతలు పడింది. నేను ఇద్దరు సహోదరుల నమ్మకాన్ని చూరగొన్న తర్వాత, వారి మొదటి ప్రశ్న: “కావలికోటలు ఏవి?” సంవత్సరాల తరబడి వారి దగ్గర పాత పుస్తకాల రెండు కాపీలు మాత్రమే ఉన్నాయి​—⁠చివరికి బైబిలు కూడా లేదు.

తమకు విరుద్ధంగా ఆ ప్రభుత్వం ఎంత క్రూరమైన చర్యలు చేపట్టిందో వారు పూస గుచ్చినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తటస్థంగా ఉండాలని తీర్మానించుకున్న ఒక ప్రియ సహోదరుడి గురించి కూడా వారు చెప్పారు. ప్రభుత్వం సమస్తాన్ని అదుపు చేస్తున్నందున, ఆయన గనుక తటస్థంగా ఉంటే కుటుంబానికి రేషన్‌లో ఎలాంటి సరుకులు దొరికే అవకాశం లేదు. అంతేగాక, ఆయన మత నమ్మకాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా వివాహితులైన ఆయన పిల్లలు, వారి కుటుంబ సభ్యులు అందరూ జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అందుకనే, ఆ కుటుంబ సభ్యులు భయకంపితులై, ఓటు వేయాల్సిన ముందు రోజే ఆయన్ను చంపేసి శవాన్ని బావిలో పడేసి, ఆయనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం చేశారని ఒక పుకారు.

ఆ తోటి క్రైస్తవుల బీదరికం చూస్తే గుండె తరుక్కు పోయింది. నేను వారిలో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వారు తీసుకోవడానికి నిరాకరిస్తూ “మాకు ఆధ్యాత్మిక ఆహారం మాత్రమే కావాలి” అన్నారు. ప్రజల్లో అధికశాతాన్ని నాస్తికులుగా మార్చడంలో విజయవంతమైన నిరంకుశ పరిపాలన క్రింద ఈ ప్రియ సహోదరులు దశాబ్దాలపాటు నివసించారు. కానీ వారి విశ్వాసము వారి కృత నిశ్చయము వేరే ప్రాంతాల్లో ఉన్న సాక్షుల్లాగే బలంగా ఉన్నాయి. రెండు వారాల తర్వాత నేను అల్బేనియా విడిచిపెట్టేసరికి, అత్యంత కష్టతరమైన పరిస్థితులున్నప్పటికీ సహించే “బలాధిక్యము”ను అందించడంలో యెహోవాకున్న సామర్థ్యం నిజంగా నా మనస్సుపై ఎంతో ప్రగాఢమైన ముద్రవేసింది.

1989 లోను మళ్ళీ 1991 లోను అల్బేనియా వెళ్ళే సువర్ణావకాశం నాకు లభించింది. ఆ దేశంలో వాక్‌స్వాతంత్ర్యము మత స్వాతంత్ర్యము లభించడం ప్రారంభమవుతుండగా యెహోవా ఆరాధకుల సంఖ్య వేగంగా పెరిగింది. 1986 లో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్న సమర్పిత క్రైస్తవుల సంఖ్య ఇప్పుడు క్రియాత్మకంగా ఉన్న 2,200 మంది ప్రచారకులకు పెరిగింది. వారిలో నా భర్త చెల్లెలు మెల్పో కూడా ఉంది. విశ్వసనీయులైన ఆ సమూహంపై యెహోవా ఆశీర్వాదం ఉన్నదనడంలో సందేహం ఏమైనా ఉండగలదా?

యెహోవా బలంతో సంపూర్ణమైన జీవితం

నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేనూ జాన్‌ చేసిన పని వ్యర్థం కాలేదని నమ్మకంగా చెప్పగలను. మేము మా యౌవన బలాన్ని అత్యంత ప్రయోజనకరమైన రీతిలో వినియోగించుకున్నాము. పూర్తికాల పరిచర్య కాకుండా వేరే ఎటువంటి జీవన విధానాన్ని ఎన్నుకున్నా మా జీవితం ఇంత అర్థవంతంగా ఉండేది కాదు. మేము బైబిలు సత్యం నేర్చుకోవడానికి సహాయపడిన అనేక ప్రియమైనవారి విషయమై నేను ఎంతో ఆనందిస్తున్నాను. నేనిప్పుడు వృద్ధురాలిని, యౌవనస్థులు ‘తమ బాల్య దినములందే తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని’ నేను పూర్ణ హృదయంతో ప్రోత్సహిస్తున్నాను.​—⁠ప్రసంగి 12:1-2.

నాకిప్పుడు 81 సంవత్సరాలు, అయినా నేను పూర్తికాల సువార్త ప్రకటనా పని చేయగలుగుతున్నాను. నేను ఉదయాన్నే లేచి బస్టాపుల్లోను, పార్కింగ్‌ స్థలాల్లోను, వీధుల్లోను, దుకాణాల్లోను, పార్కుల్లోను సాక్ష్యం ఇస్తున్నాను. వృద్ధాప్యం మూలంగా వచ్చే సమస్యలు ఇప్పుడు జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయి, కానీ నా ప్రియమైన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు​—⁠నా పెద్ద ఆధ్యాత్మిక కుటుంబం​—⁠అలాగే మా అక్క కూతురి కుటుంబసభ్యులు నాకు నిజంగా గట్టి మద్దతుని అందిస్తున్నారు. అన్నింటిని మించి ‘బలాధిక్యము మన మూలమైనది కాక దేవునిదై యున్నదని’ నేను తెలుసుకున్నాను.​—⁠2 కొరింథీయులు 4:⁠7.

[అధస్సూచీలు]

^ పేరా 10 ఇమ్మాన్వీల్‌ లియోనూడాకీస్‌ జీవిత కథ కోసం కావలికోట, సెప్టెంబరు 1, 1999, 25-9 పేజీలు చూడండి.

^ పేరా 11 ఇమ్మాన్యల్‌ పాటెరాకిస్‌ జీవిత కథ కోసం కావలికోట, నవంబరు 1, 1996, 22-7 పేజీలు చూడండి.

[25వ పేజీలోని చిత్రం]

పైన: 1950 లో ఏథెన్స్‌లో, బేతేలు సభ్యులతో, చివర జాన్‌ (ఎడమవైపు), నేను (మధ్యలో), ఎడమ ప్రక్కన మా అన్నయ్య ఇమ్మాన్యల్‌, ఆయనకు ఎడమ ప్రక్కన అమ్మ

[25వ పేజీలోని చిత్రం]

ఎడమ: 1956 లో న్యూ జెర్సీ సముద్రతీరాన మా వ్యాపార స్థలం దగ్గర జాన్‌తో

[26వ పేజీలోని చిత్రం]

1995 లో అల్బేనియాలోని టిరానాలో జిల్లా సమావేశం

[26వ పేజీలోని చిత్రం]

1996 లో పూర్తైన అల్బేనియాలోని టిరానాలో బేతేలు కాంప్లెక్స్‌

[26వ పేజీలోని చిత్రం]

పైన: 1940 “కావలికోట”లోని ఒక ఆర్టికల్‌, అల్బేనియన్‌లోకి రహస్యంగా అనువదించబడింది

[26వ పేజీలోని చిత్రం]

అక్క కూతురు ఇవాంజిలీయా ఆర్ఫనీడిస్‌ (కుడి పక్కన), ఆమె భర్త జార్జ్‌లతో