కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వర్గరహిత సమాజం నిజంగా వస్తుందా?

వర్గరహిత సమాజం నిజంగా వస్తుందా?

వర్గరహిత సమాజం నిజంగా వస్తుందా?

చారిత్రాత్మక స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసినవారిలో అమెరికా రెండవ అధ్యక్షుడు జాన్‌ ఆడమ్స్‌ ఒకరు. ఆ ప్రకటనలో ఆదర్శవంతమైన ఈ మాటలున్నాయి: “మనుష్యులందరు సమానంగా సృష్టించబడ్డారనే స్వతస్సిద్ధమైన వాస్తవాన్ని మేము నమ్ముతాము.” కానీ, జాన్‌ ఆడమ్స్‌కు ప్రజలు నిజంగా సమానులే అనడంలో సందేహం ఉండేదనిపిస్తుంది, ఎందుకిలా చెప్పాల్సివస్తుందంటే ఆయన ఇలా వ్రాశాడు: “సర్వశక్తుడైన దేవుడు మానవ స్వభావ రచన చేస్తున్నప్పుడు, మన మనసులోను, శరీరంలోను అసమానత్వాన్ని ఎంత బలంగా స్థాపించాడంటే ఏ ప్రణాళిక అయినా ఏ కార్యాచరణ విధానమైనా వారిని మానసికంగా శారీరకంగా సమానులను చేయదు.” దానికి భిన్నంగా, బ్రిటీష్‌ చరిత్రకారుడు హెచ్‌. జి. వెల్స్‌, మూడు విషయాల ఆధారంగా ప్రజలందరూ సమానమయ్యే ఒక సమాజాన్ని ఊహించగలిగాడు: స్వచ్ఛమైన, పవిత్రమైన ఏకైక విశ్వ మతం, విశ్వవ్యాప్తంగా ఒకేరకమైన బోధన, ఆయుధాలు ధరించని జనం.

ఇప్పటివరకు, వెల్స్‌ ఊహించినటువంటి సామరస్యమైన సమాజాన్ని చరిత్ర రూపొందించలేదు. మానవులు ఏమాత్రం సమాన భావంతో లేరు, సమాజంలో వర్గభేదాల సమస్య ఇప్పటికీ ప్రబలంగా ఉంది. ఇలాంటి వర్గాలు సమాజానికి ఏమైనా ప్రయోజనం చేకూర్చాయా? లేదు. సామాజిక వర్గ వ్యవస్థలు ప్రజలను విడదీస్తాయి, తత్ఫలితంగా ఈర్ష్యాద్వేషాలు, మానసికవ్యధ, విపరీతమైన రక్తపాతాలకు కారణమవుతాయి. ఒకప్పుడు తెల్లవారు ఆధిక్యులు అనే మనస్తత్త్వం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాల్లోని నల్లజాతివారిని మానసికంగా బాగా కృంగదీయడమేకాక, వాన్‌ డయెమెన్స్‌ లాండ్‌లోని (ఇప్పుడు టాస్మేనియా) ఆదిమవాసులను నిర్మూలం చేసింది. యూరప్‌లో, యూదులు తక్కువస్థాయివారిగా వర్గీకరించబడడం మూలంగా నాజీల మారణకాండకు కారణమయింది. ఉన్నత వంశీయ వర్గాల్లోని ఐశ్వర్యం, అతి నిమ్న తరగతివారిలోని, మధ్య తరగతివారిలోని అసంతృప్తి, 18వ శతాబ్దంలోని ఫ్రెంచి విప్లవానికి, 20వ శతాబ్దంలోని రష్యాలో బోల్షెవిక్‌ విప్లవానికి కారణాలయ్యాయి.

ఒక ప్రాచీన జ్ఞాని ఇలా వ్రాశాడు: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” (ప్రసంగి 8:⁠9) అధికారం చెలాయించేది వ్యక్తులైనా లేక వర్గాలైనా ఆయన మాటలు మాత్రం నిజమే. ఒక వర్గం మరో వర్గంపై హెచ్చించుకుంటే, దాని పరిణామం తప్పకుండా దుఃఖము, బాధలే.

దేవుని ఎదుట అందరూ సమానమే

కొన్ని జాతులకు జన్మతః ఇతర జాతులపై ఆధిక్యత ఉంటుందా? దేవుని దృష్టిలోనైతే ఉండదు. బైబిలు ఇలా చెబుతోంది: ‘యావద్భూమిమీద కాపురముండుటకు [దేవుడు] యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు.’ (అపొస్తలుల కార్యములు 17:​26) అంతేగాక, సృష్టికర్త ‘రాజులయెడల పక్షపాతము చూపడు బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడడు . . . వారందరు ఆయన నిర్మించినవారు.’ (యోబు 34:​19) మానవులందరు పరస్పర సంబంధీకులు, దేవుని ఎదుట అందరూ సమానులే.

ఇదికూడా గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఇతరులపై అధిక్యతను చూపించే ఆయన వాదనలన్నీ అంతరించిపోతాయి. ప్రాచీన ఐగుప్తీయులు దాన్ని నమ్మేవారు కాదు. ఫరో మరణించినప్పుడు, వాళ్ళు ఆయన సమాధిలో చాలా విలువైన వస్తువులను ఉంచేవారు. మరణం తర్వాతి జీవితంలో ఆయన తన ఉన్నత స్థాయిలోనే కొనసాగుతాడని, అప్పుడు ఆ వస్తువులు ఆయనకు ఉపయోగపడతాయని వారి నమ్మకం. ఆయన వాటిని అనుభవించాడా? లేదు. ఆ సంపదల్లో చాలామటుకు సమాధులను కొల్లగొట్టేవారికి చిక్కాయి, దొంగిలించబడకుండా మిగిలిన అనేక వస్తువులు నేడు పురావస్తు ప్రదర్శనశాలల్లో చూడవచ్చు.

ఫరో మరణించాడు కాబట్టి, ఆ విలువైన వస్తువుల్లో ఒక్కటి కూడా ఆయనకు ఉపయోగపడలేదు. మరణంలో, ఉచ్ఛ, నీచ వర్గాలేమీ ఉండవు, కలిమి లేములు ఉండవు. బైబిలు ఇలా స్పష్టంగా వ్యక్తం చేస్తోంది: “వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు. . . . ధనికులు నిరంతరం జీవించలేరు. వారు జంతువుల్లా మరణిస్తారు.” (కీర్తన 49:​10, 12, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.) మనము రాజులమైనా, బానిసలమైనా ఈ ప్రేరేపిత మాటలు మనందరికీ వర్తిస్తాయి: “చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . వారికిక ఏ లాభమును కలుగదు. . . . నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”​—⁠ప్రసంగి 9:5, 10.

మనం అందరమూ దేవుని దృష్టిలో సమానంగానే జన్మించాము, మరణించాక ఒకే చోటికి చేరుకుంటాము. అలాంటప్పుడు, అల్పమైన ఈ జీవిత కాలంలో ఒక జాతి మరో జాతిపై ఆధిక్యతను చూపించడం ఎంత పనికిమాలినతనం!

వర్గ రహిత సమాజం​—⁠ఎలా సాధ్యం?

అయినా, సామాజిక వర్గం అనేదానికి ఏ మాత్రం ప్రాముఖ్యతనివ్వని ప్రజలతో ఉండే ఒక సమాజం ఏదో ఒకరోజు వస్తుందనడానికి ఏదైనా ఆశ ఉందా? ఉంది. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసు భూమ్మీద ఉన్నప్పుడు, అలాంటి సమాజం కోసం పునాదులు వేయబడ్డాయి. యేసు ‘తనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు,’ విశ్వసించే మానవులందరి కోసం తన జీవితాన్ని విమోచన క్రయధన బలిగా ఇచ్చాడు.​—⁠యోహాను 3:16.

తన శిష్యుల్లో ఎవ్వరు కూడా తోటి విశ్వాసులపై తమను తాము హెచ్చించుకోకూడదని తెలియజేయడానికి యేసు ఇలా అన్నాడు: “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.” (మత్తయి 23:​8-12) దేవుని దృష్టిలో, యేసు నిజ శిష్యులందరూ విశ్వాసంలో సమానులు.

తొలి క్రైస్తవులు పరస్పరం సమానులుగా దృష్టించుకున్నారా? యేసు బోధను గ్రహించినవారు అలాగే చేశారు. వారు ఒకరినొకరు విశ్వాసంలో సమానులుగా భావిస్తూ, “సహోదరుడా” అని ఒకరినొకరు పిలుచుకోవడం ద్వారా ఆ సమానత్వాన్ని వ్యక్తం చేశారు. (ఫిలేమోను 1, 7, 20) తాను ఇతరులకంటే శ్రేష్ఠుడనని భావించడానికి ఎవరూ ప్రోత్సహించబడలేదు. ఉదాహరణకు, పేతురు తన రెండవ పత్రికలో తనను తాను ఎంత అణకువతో వర్ణించుకున్నాడో గమనించండి: “యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.” (2 పేతురు 1:⁠1) పేతురు యేసుచేత వ్యక్తిగతంగా ఉపదేశం పొందాడు, ఒక అపొస్తలుడిగా ఆయనకు బాధ్యతగల ప్రముఖ స్థానం ఉంది. అయినప్పటికీ, ఆయన తాను ఒక దాసుడనని, ఇతర క్రైస్తవులు కూడా తనలాగే సత్యం విషయంలో ఆధిక్యతలు గలవారని గుర్తించాడు.

క్రైస్తవులకు ముందు కాలంలో దేవుడు ఇశ్రాయేలునే తన ప్రత్యేక జనాంగముగా చేయడం, సమానత్వపు ఆదర్శ సూత్రానికి విరుద్ధమని కొందరు అంటుండవచ్చు. (నిర్గమకాండము 19:​5, 6) జాతి ఆధిక్యతలకు అది ఒక మాదిరి అని వాళ్ళు వాదిస్తుండవచ్చు, కానీ అది నిజం కాదు. ఇశ్రాయేలీయులు అబ్రాహాము వంశీయులుగా, దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని అనుభవించారన్నది, దైవిక ప్రకటనలకు ఒక మాధ్యమంగా ఉపయోగించబడ్డారన్నది నిజమే. (రోమీయులు 3:​1, 2) కాని దీని ఉద్దేశం వారిని హెచ్చించాలని కాదు. బదులుగా, ‘జనములన్నియు ఆశీర్వదించబడాలని’ చేయబడిన ఏర్పాటు అది.​—⁠ఆదికాండము 22:18; గలతీయులు 3:8.

అయితే, ఇశ్రాయేలీయుల్లోనుండి చాలామంది తమ పూర్వీకుడైన అబ్రాహామును అనుసరించలేదని రుజువైంది. వారు విశ్వాస ఘాతకులై, యేసును మెస్సీయాగా అంగీకరించలేదు. ఆ కారణంగా దేవుడు వారిని తిరస్కరించాడు. (మత్తయి 21:​43) అయితే, మానవజాతిలోని నమ్రులు వాగ్దానం చేయబడిన మంచి విషయాలను కోల్పోలేదు. సా.శ. 33 పెంతెకొస్తు రోజున క్రైస్తవ సంఘం జన్మించింది. పరిశుద్ధాత్మచేత అభిషిక్తులైన ఈ క్రైస్తవుల సంఘం, “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడి, పొందబోయే ఆశీర్వాదాలకు మాధ్యమంగా నిరూపించబడింది.​—⁠గలతీయులు 6:16.

ఆ సంఘంలోని కొందరు సభ్యులు సమానత్వం గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు పేదవారికంటే, ధనవంతులైన క్రైస్తవులను ఎక్కువగా గౌరవిస్తున్నవారిని శిష్యుడైన యాకోబు మందలించాడు. (యాకోబు 2:​1-4) అది సరైనది కాదు. అపొస్తలుడైన పౌలు అన్య క్రైస్తవులు యూదా క్రైస్తవులకు ఎంతమాత్రం తక్కువస్థాయివారు కాదని, క్రైస్తవ స్త్రీలు మగవారికంటే ఎంతమాత్రం తక్కువస్థాయివారు కాదని చూపించాడు. ఆయనిలా వ్రాశాడు: “యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు. క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.”​—⁠గలతీయులు 3:26-28.

నేడు వర్గ భేదాల్లేని ఒక జనం

నేడు యెహోవాసాక్షులు లేఖనాధారిత సూత్రాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. దేవుని దృష్టిలో సామాజిక వర్గాలకు ఎటువంటి అర్థమూ లేదని వారికి తెలుసు. అందుకే వారిలో ప్రీస్టులు/సామాన్యులు అని విభాగాలు లేవు, శరీరవర్ణమును లేక ధనమును బట్టి వారు విభజించబడలేదు. వారిలో కొందరు ధనవంతులైనప్పటికీ, వారు “జీవపుడంబము”పై మనసు కేంద్రీకరించరు, అలాంటివి కేవలం గతించిపోయేవేనని వారికి తెలుసు. (1 యోహాను 2:​15-17) ముఖ్యంగా, వారందరు విశ్వసర్వాధిపతియైన యెహోవా దేవుని ఆరాధనలో ఐక్యంగా ఉంటారు.

వారిలో ప్రతి ఒక్కరు తమ తోటివారికి రాజ్య సువార్తను ప్రకటించే పనిలో బాధ్యత వహిస్తారు. తాడిత పీడిత ప్రజలను, నిర్లక్ష్యం చేయబడిన ప్రజలను వారి ఇండ్లల్లో కలుసుకొని, దేవుని వాక్యాన్ని నేర్పిస్తామని చెప్పడం ద్వారా సాక్షులు వారిని యేసు గౌరవించినట్లే గౌరవిస్తారు. జీవితంలో తక్కువ స్థాయిలో ఉన్నవారు, కొందరిచేత ఉన్నత స్థాయివారు అని దృష్టించబడినవారితో కలిసి పని చేస్తారు. వారికి విలువైనవి ఆధ్యాత్మిక లక్షణాలు, సామాజిక వర్గం కాదు. మొదటి శతాబ్దంలోలాగే, అందరూ విశ్వాసంలో సహోదరులు, సహోదరీలు.

సమానత్వం వైవిధ్యాన్ని అనుమతిస్తుంది

సమానత్వం అంటే ఏకరీతిగా ఉండడం ఎంత మాత్రం కాదు. ఈ క్రైస్తవ సంస్థలో చాలామంది అనేక జాతులకు, భాషలకు, దేశాలకు, ఆర్థిక నేపథ్యాలకు చెందిన స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు అందరూ ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరికి మానసిక, శారీరక సామర్థ్యాలు భిన్నంగా ఉన్నాయి. కాని ఆ వ్యత్యాసాలు వారిలో కొందరిని హెచ్చించవు, మరి కొందరిని తగ్గించవు. బదులుగా, అలాంటి వ్యత్యాసాలు ఆహ్లాదకరమైన వైవిధ్యాలుగా ఉంటాయి. ఆ క్రైస్తవులు తమలో ఎటువంటి నైపుణ్యతలు ఉన్నా అవి దేవుడిచ్చిన వరాలని, తాము గొప్పవారిమని భావించడానికి ఎలాంటి కారణము లేదని గ్రహించారు.

మానవుడు దేవుని మార్గదర్శకత్వంలో కాకుండా స్వయంగా పరిపాలించుకోవడానికి చేసిన ప్రయత్నాలే వర్గాలు ఆవిర్భవించడానికి కారణాలు. త్వరలోనే, భూమ్మీది నేటి పరిపాలనా స్థానాన్ని దేవుని రాజ్యం ఆక్రమించుకుంటుంది. తత్ఫలితంగా, మనుష్యులు సృష్టించిన వర్గభేదాలతోపాటు, యుగ యుగాలుగా బాధలకు కారణమైన ఇతర విషయాలన్నీ అంతరించి పోతాయి. అప్పుడు, నిజమైన భావంలో, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు.” (కీర్తన 37:​11) ఉన్నతస్థాయినిబట్టి హెచ్చించుకునే కారణాలన్నీ సమసిపోతాయి. ప్రపంచవ్యాప్త మానవ సౌభ్రాతృత్వాన్ని విభజించడానికి మళ్ళీ సామాజిక వర్గాలకు ఎంత మాత్రం అవకాశముండదు.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

సృష్టికర్త, ‘రాజులయెడల పక్షపాతము చూపలేదు, బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడలేదు, వారందరు ఆయన నిర్మించినవారు.’​యోబు 34:19.

[6వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులు తమ పొరుగువారిని గౌరవిస్తారు

[7వ పేజీలోని చిత్రాలు]

ఆధ్యాత్మిక లక్షణాలే నిజ క్రైస్తవులకు విలువైనవి