‘వాక్యమును ప్రకటించుట’ సేదదీరుస్తుంది
“నా యొ ద్ద కు రం డి; నే ను మీ కు వి శ్రాం తి క లు గ జే తు ను”
‘వాక్యమును ప్రకటించుట’ సేదదీరుస్తుంది
ఆయన ఒక ముఖ్యమైన పని కొరకు వచ్చిన పరిపూర్ణ మానవుడు. ఆయన బోధనా పద్ధతులు ఎంత సమర్థవంతమైనవంటే “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” (మత్తయి 7:28) ఆయన అలయక ప్రకటించేవాడు. ఆయనకున్న సమయం, శక్తి, మరియు వనరులు, ముఖ్యంగా దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికే ఉపయోగించబడేవి. నిజమే, యేసు క్రీస్తు సాటిలేని ప్రచారకుడిగా బోధకుడిగా తన స్వదేశమందు నలుమూలలా ప్రయాణించాడు.—మత్తయి 9:35.
“రాజ్యమును గూర్చిన సువార్తను” తన సమకాలీనులకు ప్రకటించి, అదే పనిని తన శిష్యులు భూగోళవ్యాప్తంగా చేసేందుకు వారికి శిక్షణనివ్వడమే యేసు చేయవలసిన అత్యవసర పని. (మత్తయి 4:23; 24:14; 28:19, 20) అపరిపూర్ణతా, పరిమితులూ గల తన అనుచరులు తమకివ్వబడిన ప్రకటనా పని అనే బరువైన బాధ్యత, దాన్ని సత్వరంగా నెరవేర్చవలసిన అవసరత, అలాగే, ఆ పని యొక్క విస్తృతి మూలంగా ఒత్తిడికి గురవుతారా?
అలా ఎంతమాత్రం కారు! “కోత యజమాను”డైన యెహోవా దేవుణ్ణి, ఎక్కువ పనివారికొరకు ప్రార్థించమని తన శిష్యులకు ఉపదేశించిన తర్వాత యేసు వారిని ప్రజలకు బోధించడానికి పంపించాడు. (మత్తయి 9:38; 10:1) ప్రకటించే పనితో సహా తన శిష్యులుగా ఉండే బాధ్యత నిజమైన ఉపశమనాన్ని, ఓదార్పుని కలుగజేస్తుందని వారికి హామీ ఇచ్చాడు. ‘నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతిని కలుగజేతును [“మిమ్మల్ని సేదదీరుస్తాను,” NW] ’ అని యేసు అన్నాడు.—మత్తయి 11:28.
ఆనందానికి మూలం
ఆ ఆహ్వానంలో ఎంత సానుభూతి, ప్రేమ, దయ ఉన్నాయో కదా! అది తన అనుచరుల అవసరాలను గురించి యేసుకున్న శ్రద్ధను సూచిస్తుంది. దేవుని రాజ్య “సువార్త” ప్రకటించమని వారికివ్వబడిన బాధ్యతను నెరవేర్చడంలో అయన శిష్యులు సేదదీర్చుకుంటారు. అది వారికి నిజమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది.—యోహాను 4:36.
ఆనందం, దేవునికి చేసే పరిశుద్ధ సేవ యొక్క ప్రత్యేకతై ఉంటుందని యేసు భూమిమీదకు రాకముందే లేఖనాలు నొక్కి చెప్పాయి. “సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి” అని కీర్తనకర్త పాడినప్పుడు అది వ్యక్తమవుతుంది. (కీర్తన 100:1, 2) ఈనాడు అన్ని జాతుల ప్రజలు యెహోవాయందు ఆనందిస్తున్నారు, గెలుపొందిన సైన్యం విజయోత్సాహంతో పెట్టిన కేకలవలే వారి స్తుతిగానాలు ఉన్నాయి. యెహోవాకు నిజంగా సమర్పించుకున్నవారు ఆయన సన్నిధికి “ఉత్సాహగానము చేయుచు” వస్తారు. యెహోవా “సంతోషముగల దేవుడు” గనుక, తన సేవకులు తమ సమర్పణను నెరవేర్చడంలో ఆనందాన్ని పొందాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక, వాళ్ళలా రావడం సముచితమే.—1 తిమోతి 1:11 NW.
సేదదీర్చుకున్న పరిచారకులు
క్షేత్ర పరిచర్యలో చేసే శ్రమతోకూడిన పని అలసట కలిగించేదిగా గాక, సేదదీర్చేదిగా ఉండడం ఎలా సాధ్యం? యెహోవా సేవచేయడం యేసుకి నూతనబలాన్నిచ్చే ఆహారంగా ఉండింది. అందుకే ఆయన “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది” అని అన్నాడు.—యోహాను 4:34.
అదేవిధంగా, నేడు ఉత్సాహవంతులైన క్రైస్తవ ప్రచారకులు “వాక్యమును ప్రకటించు”టలో ఆనందాన్ని పొందుతున్నారు. (2 తిమోతి 4:2) “రోజంతా పరిచర్యలో పాల్గొన్న తర్వాత అలసిపోయినప్పటికీ నాకు సంతృప్తిగా సంతోషంగా ఉంటుంది” అని ప్రతి నెలా ప్రకటనా పనిలో 70 కన్నా ఎక్కువ గంటలు గడిపే కోనీ అనే మధ్య వయస్కురాలైన క్రైస్తవ స్త్రీ అంటుంది.
మరి, రాజ్య సువార్తకు అనుకూలమైన ప్రతిస్పందన రాకపోతే అప్పుడేమిటి? కోనీ ఇలా కొనసాగిస్తుంది: “ప్రతిస్పందన ఎలాగున్నా, పరిచర్యలో పాల్గొన్నందుకు నేను ఏనాడు విచారించలేదు. నేను యెహోవాను సంతోషపరిచే పని చేస్తున్నాను అని తెలుసుకోవడమే కాకుండా, సత్యం గురించి మాట్లాడడం ఆహ్లాదకరమైన పనిగా ఎంచుతాను ఎందుకంటే నేనలా మాట్లాడుతున్నప్పుడు
బైబిలిచ్చే అద్భుతమైన నిరీక్షణ నా హృదయంలో మరింత బలపడుతుంది.”దేవుని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకొనేందుకు ఇతరులకు సహాయపడడం, తమ సొంత జీవితాలకు అర్థాన్నిస్తుందని కొందరు కనుగొన్నారు. క్రమంగా నెలకు 50 కంటె ఎక్కువ గంటలు ప్రకటనా పనిలో గడిపే మెలనీ అనే యువతి, “పరిచర్య నా జీవితానికి నిర్దిష్ట మార్గాన్ని మరియు సంకల్పాన్ని ఇస్తుంది కాబట్టి అది సేదదీర్చేదిగా ఉంటుంది. నేను పరిచర్యలో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత సమస్యలు మరియు రోజూవారి ఆందోళనలు అంత ప్రాముఖ్యం కానట్లనిపిస్తాయి” అని అంటోంది.
యెహోవాసాక్షుల్లో ఉత్సాహవంత పరిచారకురాలైన మిలిసెంట్, “నేను ఇతరులతో, మానవజాతి కొరకు దేవునికున్న సంకల్పాలను గురించి మాట్లాడుతూ, భూమ్మీద పరదైసు ఎలా పునఃస్థాపించబడుతుందో వివరిస్తూ పరిచర్యలో గడిపిన ప్రతి రోజూ విలువైనదిగా ఉంటుంది. అది యెహోవాను ఒక నిజమైన వ్యక్తిగా చేసి నాకు ప్రశాంతతను, ఆంతరంగిక సంతోషాన్ని ఇస్తుంది. వేరే ఏ పని చేసినా అది సాధ్యపడదు” అని అంటుంది.
స్వీకరించినవారు కూడా సేదదీర్చుకున్నారు
రాజ్య ప్రచారకులు నిస్సందేహంగా క్రైస్తవ పరిచర్య ద్వారా సేదదీర్చుకున్నారు, మరియు జీవాన్నిచ్చే సందేశాన్ని స్వీకరించినవారు కూడా ఓదార్పును పొందుతున్నారు. పోర్చుగల్లోని ఒక స్కూలు టీచరు ప్రీస్టులనుండి, నన్లనుండి శిక్షణ పొందినప్పటికీ, ఆమె ఆధ్యాత్మిక అవసరాలను చర్చి తీర్చలేకపోయిందని ఆమె భావించింది. ఆమె బైబిలు ప్రశ్నలకు జవాబులు దొరకలేదు. యెహోవాసాక్షుల్లో ఒకరు క్రమ బైబిలు అధ్యయనం నిర్వహించడం ద్వారా, ఆమెకు లేఖనాల అంతర్దృష్టి క్రమక్రమంగా లభించింది. ఈ స్కూలు టీచరు ఆనందానుభూతిని పొందింది. “నేను ప్రతి బుధవారం నా అధ్యయనం కోసం ఆత్రంగా ఎదురుచూసేదాన్ని, నా ఒక్కొక్క ప్రశ్నకు నమ్మదగ్గ బైబిలు రుజువుల ద్వారా జవాబివ్వబడేది” అని ఆమె అంది. నేడు, ఈ స్త్రీ యెహోవాకు సమర్పించుకున్న సేవకురాలు, తను కూడా బైబిలు సత్యం ద్వారా ఇతరులను సేదదీరుస్తుంది.
కాబట్టి ప్రకటించాలన్న ఆజ్ఞయొక్క గాంభీర్యాన్ని బట్టి కానీ, పనిచేయవలసిన భూగోళవ్యాప్త క్షేత్ర విస్తృతిని బట్టి కానీ యెహోవాసాక్షులు క్రుంగిపోవడం లేదని స్పష్టమవుతుంది. నిర్లిప్తతగానీ, వ్యతిరేకతగానీ వారిని నిరాశపర్చవు. వారికివ్వబడ్డ రాజ్యప్రకటనా పనిని నెరవేర్చటానికి వారు ఉత్సాహంతో తమను తాము సమర్పించుకున్నారు. ప్రజలను ఎక్కడ కనుగొంటే అక్కడ, అది (1వ చిత్రం) అమెరికాలో ట్రక్కులు ఆగే చోటే గానివ్వండి, (2) కొరియన్ విమానాశ్రయంలోనే గానివ్వండి, (3) ఆండిస్లోనే గానివ్వండి, (4) లేక లండన్ మార్కెట్లో గానివ్వండి, సాక్షులు వారితో సువార్తను పంచుకుంటున్నారు. యేసుయొక్క ఆధునిక అనుచరులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిఫలదాయకమైన పనిని ఆనందంగా కొనసాగిస్తున్నారు. మరియు ఆయన వాగ్దానానికి తగ్గట్టు ఆయన వారిని సేదదీర్చి, వారు ఇతరులను సేదదీర్చేందుకు వారిని ఉపయోగిస్తున్నాడు.—ప్రకటన 22:17.