కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విభిన్న వైఖరులను పెంపొందించుకున్న సహోదరులు

విభిన్న వైఖరులను పెంపొందించుకున్న సహోదరులు

విభిన్న వైఖరులను పెంపొందించుకున్న సహోదరులు

తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు వారి పిల్లలపై తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విషయం పూర్వం ఏదెను తోటలోనూ, ఇప్పుడు ఈ కాలంలోనూ వర్తిస్తుంది. ఆదాము హవ్వల తిరుగుబాటు ధోరణి పూర్తి మానవజాతి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. (ఆదికాండము 2:​15, 16; 3:​1-6; రోమీయులు 5:​12) అయినప్పటికీ, మనలో ప్రతి ఒక్కరము కావాలనుకుంటే మన సృష్టికర్తతో మంచి సంబంధాన్ని పెంపొందించుకునే అవకాశముంది. మానవ చరిత్రలో మొదటి సహోదరులైన కయీను, హేబెలుల వృత్తాంతం ద్వారా అది ఉదాహరించబడింది.

ఏదెను నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడినట్లు లేఖనాల్లో ఎక్కడా లేదు. అయినప్పటికీ ఆయన వాళ్ళ కుమారులతో మాట్లాడకుండా ఉండలేదు. తోటలో ఏమి జరిగిందన్నది తమ తల్లిదండ్రుల ద్వారా కయీను, హేబెలులు తెలుసుకునే ఉంటారు. “కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను” వారు చూశారు. (ఆదికాండము 3:​24) ప్రయాసపడుతూ చెమట కార్చడం జీవితానుభవాలుగా ఉంటాయని దేవుడు చెప్పినట్లే జరగడం కూడా వారిరువురు కళ్ళారా చూశారు.​—ఆదికాండము 3:​16, 19.

“నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని” యెహోవా సర్పానికి చెప్పిన మాటలు కూడా కయీను, హేబెలులకు తెలిసి ఉండవచ్చు. (ఆదికాండము 3:​15) తమకు యెహోవా గురించి తెలిసిన విషయాలను బట్టి కయీను, హేబెలులు ఆయనతో ఆమోదయోగ్యమైన సంబంధాన్ని కలిగి ఉండగల్గేవారు.

యెహోవా చేసిన ప్రవచనం గురించి, ప్రేమతో తమ ప్రయోజనాన్ని ఆశించే వ్యక్తిగా ఆయనకున్న లక్షణాల గురించి ఆలోచించడమనేది కయీను హేబెలులలో దైవిక ఆమోదాన్ని పొందాలనే కోరికను కలిగించి ఉండవచ్చు. కాని వారు ఆ కోరికను ఏ స్థాయి వరకు పెంపొందించుకుంటారు? వారు దేవుణ్ణి ఆరాధించాలన్న తమ స్వాభావిక కోరికకు ప్రతిస్పందించి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండేంతగా తమ ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసుకుంటారా?​—మత్తయి 5:⁠3, NW.

సహోదరులు అర్పణలను తెస్తారు

కొంతకాలం తర్వాత కయీను హేబెలులు దేవునికి అర్పణలు తెస్తారు. కయీను పొలంలోని పంటను అర్పిస్తే, హేబెలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిని అర్పిస్తాడు. (ఆదికాండము 4:​3, 4) వీరిద్దరు దాదాపు 100 సంవత్సరాల వయస్సు కలవారై ఉండవచ్చు, ఎందుకంటే ఆదాము, తన కుమారుడైన షేతుకు తండ్రి అయినప్పుడు ఆయన వయస్సు 130 సంవత్సరాలు.​—⁠ఆదికాండము 4:​25; 5:⁠3.

కయీను, హేబెలులు తమ పాపభరిత పరిస్థితిని గుర్తించి, దేవుని అనుగ్రహం పొందాలనుకుంటున్నారని వారి అర్పణలు సూచించాయి. సర్పము మరియు స్త్రీ సంతానానికి సంబంధించిన యెహోవా ప్రవచనాన్ని గురించి వారు కొంతైనా ఆలోచించి ఉంటారు. యెహోవాతో మంచి సంబంధాన్ని పెంపొందించుకోవటానికి కయీను, హేబెలులు ఎంత సమయాన్ని వెచ్చించారు, ఎంత కృషి చేశారన్న దాని గురించి ఏమి చెప్పబడలేదు. కానీ, వారి అర్పణలకు దేవుడు ప్రతిస్పందించిన విధానం వారిరువురి ఆంతరంగిక ఆలోచనలను వెల్లడిచేస్తుంది.

సర్పాన్ని నాశనం చేసే “సంతానం” కయీనేనని హవ్వ దృష్టించినట్లు కొందరు విద్వాంసులు సూచిస్తున్నారు, ఎందుకంటే కయీను జన్మించినప్పుడు “ఆమె యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.” (ఆదికాండము 4:⁠1) కయీను కూడా ఇదే తలంపును కలిగి ఉంటే అతను పూర్తిగా పొరబడినట్లే. మరోవైపు, హేబెలు అర్పణకు విశ్వాసం తోడైవుంది. కాబట్టి, “విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను” అని చెప్పబడింది.​—⁠హెబ్రీయులు 11:⁠4.

హేబెలుకున్న ఆధ్యాత్మిక అంతర్దృష్టి కయీనుకు లోపించింది. ఈ సహోదరుల మధ్యనున్న తేడా అదొక్కటే కాదు. వారి మనోవైఖరులలో కూడా తేడా ఉంది. అందుకే “యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు.” బహుశా కయీను తన అర్పణ గూర్చి లోతుగా ఆలోచించకుండా ఏదో యాంత్రికంగా అర్పించి ఉండవచ్చు. కాని దేవుడు కేవలం నామమాత్రపు ఆరాధనను అంగీకరించలేదు. కయీను దుష్ట హృదయాన్ని పెంపొందించుకున్నాడు, అతను చెడ్డ ఉద్దేశాలను కలిగి ఉన్నాడని యెహోవా గుర్తించాడు. కయీను బలి అంగీకరించబడనప్పుడు అతని ప్రతిస్పందన అతని నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించే బదులు “కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చు”కొన్నాడు. (ఆదికాండము 4:​5) అతడి ప్రవర్తన అతడి దుష్ట ఆలోచనలను ఉద్దేశాలను వెల్లడి చేసింది.

హెచ్చరిక మరియు ప్రతిస్పందన

కయీను వైఖరి తెలుసు కాబట్టి, దేవుడు అతనిని, “నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదు”వని మందలించాడు.​—⁠ఆదికాండము 4:​6, 7.

దీనిలో మనకు ఒక పాఠము ఉంది. నిజానికి, పాపము మనలను మ్రింగివేయడానికి వాకిట పొంచి ఉంటుంది. అయినప్పటికీ, దేవుడు మనకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు గనుక మనము ఏది మంచో దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. యెహోవా కయీనును “సత్క్రియ” చేయమని ప్రోత్సహించాడు, కాని అతనిని మారమని ఆయన బలవంతం చేయలేదు. కయీను తన దారిని తానే ఎంపిక చేసుకున్నాడు.

ప్రేరేపిత వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.” (ఆదికాండము 4:⁠8) తద్వారా కయీను అవిధేయుడైన క్రూర హంతకుడయ్యాడు. యెహోవా అతనిని “నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని” అడిగినప్పుడు అతడు పరితాపం చెందుతున్నట్లు ఏ మాత్రం ప్రదర్శించలేదు. దానికి బదులు కఠినంగా, ధిక్కారపూర్వకంగా “నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా” అని సమాధానమిచ్చాడు. (ఆదికాండము 4:⁠9) అలా బాధ్యతారహితంగా కయీను చెప్పిన పచ్చి అబద్ధము అతడు నిర్దాక్షిణ్యుడని రుజువు చేసింది.

యెహోవా కయీనును శపించి ఏదెను పరిసరాలనుంచి బహిష్కరించాడు. భూమిమీద అప్పటికే ఉన్న శాపము కయీను విషయంలో ఇంకా తీవ్రతరమైయుంటుంది, తాను సాగుచేసిన భూమి సరైన ఫలాన్ని ఇవ్వకపోయుండవచ్చు. ఆయన దేశదిమ్మరిగా నిరాశ్రయుడుగా ఉండవలసి వచ్చింది. తనకివ్వబడిన శిక్ష తీవ్రత గురించి కయీను ఫిర్యాదు చేసినప్పుడు, తన సహోదరున్ని హత్య చేసినందుకు తన మీద కక్ష సాధించబడుతుందేమో అని బాధపడ్డాడే తప్ప నిజమైన పశ్చాత్తాపాన్ని కనబరచలేదు. యెహోవా కయీనుకు “ఒక గురుతును” వేశాడు​—⁠ఇది బహుశ ఇతరులు తెలుసుకునివుండి పాటించాల్సిన ఒక ఖండితమైన శాసనం అయివుండవచ్చు. ఇతరులు కయీనుపై పగబట్టి ఆయనను చంపకుండా ఉండేందుకు అది ఇవ్వబడింది.​—⁠ఆదికాండము 4:​10-15.

తర్వాత కయీను “యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.” (ఆదికాండము 4:​16) తన చెల్లెలినో, తన సహోదరుల లేక సహోదరీల కూతురినో భార్యగా స్వీకరించిన తర్వాత, అతడు ఒక ఊరు కట్టించి దానికి తన మొదటి కుమారుడైన హనోకు పేరు పెట్టాడు. కయీను వంశీయుడైన లెమెకు తన పితరునిలాగే దైవభక్తి లేకుండా దుష్ట స్వభావిగా తయారయ్యాడు. కయీను వంశమంతా నోవహు కాలంలోని జలప్రళయములో తుడిచిపెట్టుకుపోయింది.​—⁠ఆదికాండము 4:​17-24.

మనకు పాఠాలు

కయీను హేబెలుల వృత్తాంతాలనుంచి మనమెన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. “మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను” అని చెప్తూ అపొస్తలుడైన యోహాను క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించాలని ఉద్బోధిస్తున్నాడు. కయీను “క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను.” యోహాను ఇంకా ఇలా అంటున్నాడు: “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.” అవును, మనము మన సహోదరులతో ప్రవర్తించే విధానం, దేవునితో మనకున్న సంబంధంపై మరియు మన భవిష్యత్‌ జీవితంపై ప్రభావం చూపగలదు. మన సహోదరులలో ఎవరినైనా ద్వేషిస్తూ మనము దేవుని ఆమోదాన్ని పొందలేము.​—⁠1 యోహాను 3:​11-15; 4:​20.

కయీను హేబెలులు ఒకేరీతిలో పెంచబడ్డప్పటికీ, కయీనుకు దేవునియందు విశ్వాసం లోపించింది. నిజానికి, అతడు “అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై”న సాతాను స్వభావాన్ని కనబర్చాడు. (యోహాను 8:​44) మనందరికి ఎంపిక చేసుకునే అవకాశం ఉందనీ, పాపము చేయాలని ఎంపిక చేసుకునేవారు తమను తాము దేవునినుండి వేరుపర్చుకుంటారనీ, పశ్చాత్తాపపడని వారిపై యెహోవా తీర్పును అమలు చేస్తాడనీ కయీను జీవిత విధానం చూపిస్తుంది.

మరొకవైపు హేబెలు యెహోవాయందు విశ్వాసాన్ని ఉంచాడు. నిజమే “విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను.” లేఖనాలలో హేబెలు పలికిన మాట ఒక్కటి కూడా లేకపోయినప్పటికీ, అతని ఆదర్శప్రాయమైన విశ్వాసం ద్వారా అతడు “మాటలాడుచున్నాడు.”​—⁠హెబ్రీయులు 11:⁠4.

యథార్థతను కాపాడుకొన్న వ్యక్తులలో హేబెలు మొట్టమొదటి వ్యక్తి. యెహోవాకు ‘నేలలోనుండి మొరపెట్టు’కున్న అతని రక్తము మరువబడలేదు. (ఆదికాండము 4:​10; లూకా 11:​48-51) మనం కూడా హేబెలులాంటి విశ్వాసాన్ని కలిగివుంటే, యెహోవాతో అమూల్యమైన, శాశ్వతమైన సంబంధాన్ని అనుభవించవచ్చు.

[22వ పేజీలోని బాక్సు]

వ్యవసాయదారుడు మరియు పశువుల కాపరి

భూమిని సేద్యపరచడం, జంతువులను చూసుకోవడం దేవుడు ఆదాముకిచ్చిన మొదటి బాధ్యతలు. (ఆదికాండము 1:​28; 2:​15; 3:​23) అతని కుమారుడైన కయీను భూమిని సేద్యపరిచేవాడైతే, హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. (ఆదికాండము 4:⁠2) జలప్రళయానికి ముందు మానవజాతి ఆహారంలో కేవలం వృక్షఫలాలు, కూరగాయలు ఉండేవి. మరి, గొర్రెలని పెంచడం ఎందుకు?​—⁠ఆదికాండము 1:​29; 9:​3, 4.

గొర్రెలు సరిగ్గా పెరగాలంటే మానవుడు శ్రద్ధగా చూసుకోవటం అవసరం. మానవుని చరిత్ర ఆరంభంనుంచి కూడా అతడు సాధు జంతువులను పెంచేవాడని హేబెలు వృత్తి రూఢిపరుస్తుంది. ఆదాము సంతతివారు పశువుల పాలను ఆహారంగా వాడారా లేదా అన్నదాని గురించి లేఖనాలు ఏమి చెప్పటంలేదు, కాని శాఖాహారులు కూడా గొర్రెల ఉన్ని వాడవచ్చు. గొర్రెలు చనిపోతే వాటి చర్మాలు వివిధ రీతుల్లో పనికి వచ్చేవి. ఉదాహరణకు, ఆదాము హవ్వల శరీరాలను కప్పడానికి యెహోవా “చర్మపు చొక్కాయిలను” చేయించాడు. ​—⁠ఆదికాండము 3:​21.

ఏదేమైనప్పటికీ, కయీను హేబెలులు మొదట్లో ఒకరికొకరు సహకరించుకున్నారు అనుకోవడం సముచితమే. కుటుంబంలోని ఇతరులకు వస్త్రాలను మరియు ఆహారాన్ని కల్పించడానికి కావలసినవి వారు ఉత్పత్తి చేశారు.

[23వ పేజీలోని చిత్రం]

కయీను “క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను”