పరిశుభ్రత ఎంత ప్రాముఖ్యం?
పరిశుభ్రత ఎంత ప్రాముఖ్యం?
పరిశుభ్రత గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు, చేతులూ ముఖమూ కడుక్కోమని ఒక చిన్న బాబుకు వాడి తల్లి చెబితే, కుళాయి తెరిచి నీళ్ళ క్రింద తన వ్రేళ్ళను అలా ఉంచి, తన పెదాలను తడుపుకుంటే సరిపోతుందని వాడు అనుకోవచ్చు. కానీ ఎలా కడగాలన్నది తల్లికి బాగా తెలుసు. తల్లి వాడ్ని మళ్ళీ కుళాయి దగ్గరికి తీసుకువెళ్లి, వాడి చేతులూ ముఖమూ సబ్బుతో బాగా రుద్ది, కావలసినన్ని నీళ్ళతో కడుగుతుంది, వాడు గట్టిగా అరిచి గీ పెట్టినా పట్టించుకోదు!
నిజమే, పారిశుధ్య ప్రమాణాలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు, పరిశుభ్రతను గురించిన వేర్వేరు అభిప్రాయాలతో వ్యక్తులు పెరుగుతారు. గత కాలాల్లో, అనేక దేశాల్లో శుభ్రతా మంచి క్రమబద్ధతా ఉన్న పాఠశాల వాతావరణం, విద్యార్థులు మంచి పరిశుభ్రతా అలవాట్లను పెంచుకొనేందుకు సహాయపడింది. నేడు, కొన్ని స్కూల్ గ్రౌండులు, ఆట స్థలంగా లేక వ్యాయామ స్థలంగా కనిపించే బదులు, చెల్లాచెదురుగా పడివున్న వస్తువులతో విరిగిపోయిన పాడైపోయిన వస్తువులతో నిండిపోయి చెత్తదిబ్బల్లా కనిపిస్తున్నాయి. మరి క్లాస్‌రూముల మాటేమిటి? ఆస్ట్రేలియాలోని ఒక హైస్కూల్లో స్వీపర్‌గా పని చేస్తున్న డారన్, “ఇప్పుడు క్లాస్‌రూములో కూడా రోతపుట్టించే చెత్త కనిపిస్తుంది” అని అంటున్నాడు. “చెత్త ఎత్తు,” “శుభ్రం చెయ్యి” వంటి నిర్దేశాలను కొందరు విద్యార్థులు తమకు విధించబడిన శిక్షగా ఎంచుతున్నారు. సమస్య ఏమిటంటే, కొందరు ఉపాధ్యాయులు శుభ్రం చేయించడాన్ని శిక్షించే మార్గంగా ఉపయోగిస్తున్నారు.
మరోవైపు, పెద్దవాళ్ళు కూడా తమ దైనందిన జీవితంలో గాని, తమ వ్యాపార రంగంలో గాని పరిశుభ్రత విషయంలో అన్నివేళలా మాదిరికరంగా ఉండటం లేదు. ఉదాహరణకు, అనేక బహిరంగ స్థలాలు చెత్తతో చూడ్డానికి అసహ్యంగా ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. అయితే, కాలుష్యానికి కారణం మనుషులే, జీవంలేని పరిశ్రమలు లేదా వ్యాపారాలు కాదు. ప్రపంచవ్యాప్త కాలుష్య సమస్యకు ముఖ్య కారణం అత్యాశ, దాని దుష్పలితాలే కావచ్చు, కానీ, వ్యక్తుల అపరిశుభ్రమైన అలవాట్ల దుష్పరిణామాలు కూడ ఒక కారణమే. కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా మాజీ డైరెక్టర్ జనరల్, ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ, “ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలన్నింటిని గురించీ ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడూ, ప్రతి బిడ్డా ఆలోచించవలసి ఉంది” అన్నాడు.
అయినప్పటికీ, పరిశుభ్రత అనేది వ్యక్తిగత విషయమనీ దాని గురించి ఇతరులు పట్టించుకోనవసరం లేదని కొందరు అనుకుంటారు. అది నిజమా?
ఆహారపదార్థాల విషయంలో పరిశుభ్రతా ప్రాముఖ్యతను ఎంత నొక్కి చెప్పినా సరిపోదు, అది మనం మార్కెట్టులో కొనేదైనా, రెస్టారెంట్లో తినేదైనా, లేదా స్నేహితుని ఇంట్లో భుజించేదైనా సరే. మనం భుజించే ఆహారాన్ని తయారు చేసేవారైనా, వడ్డించేవారైనా చాలా శుభ్రంగా ఉండాలని ఎదురుచూస్తాము. మురికి
చేతులు వాళ్ళవైనా, మనవైనా సరే, అనేక రోగాలకు కారణం కాగలవు. వేరే ఏ స్థలం కన్నా ఎక్కువ పరిశుభ్రంగా ఉండాలని మనం ఆశించే ఆసుపత్రుల మాటేమిటి? ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఇన్ఫెక్షన్ అయి, అది బాగవ్వడానికి సంవత్సరానికి 1,000 కోట్ల డాలర్లు ఖర్చవ్వడానికి కారణం ఆసుపత్రుల్లోని డాక్టర్లు నర్సులు చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడమేనని ద న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదించింది. ఇతరుల అపరిశుభ్ర అలవాట్ల మూలంగా మన ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని మనం ఆశించడం న్యాయమే.ఎవరైనా, ఉద్దేశపూర్వకంగా లేక అనాలోచితంగా నీటి సరఫరాలను కలుషితం చేస్తే అది నిజంగా పట్టించుకోవలసిన గంభీరమైన విషయం. మత్తుమందు వ్యసనపరులు లేదా ఇతరులు ఉపయోగించి పారేసిన సిరంజీలు బీచ్ దగ్గర కనిపిస్తే, చెప్పులు వేసుకోకుండా ఆ బీచ్ వెంబడి నడవడం ఎంత సురక్షితమంటారు? అంతకన్నా ప్రాముఖ్యంగా, మా ఇంట్లో పరిశుభ్రతను పాటించే అలవాటుందా? అని మనమందరం వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి.
ఛేసింగ్ డర్ట్ అనే తన పుస్తకంలో, సూవలెన్ హోయ్, “మనం ముందున్నంత శుభ్రంగా ఉంటున్నామా?” అని అడిగింది. “బహుశా ఉండకపోవచ్చు” అని ఆమే జవాబిస్తుంది. మారుతున్న సామాజిక విలువలే దీనికి ముఖ్య కారణమని ఆమె అంటోంది. ప్రజలు ఇంటిదగ్గర వుండే సమయం తగ్గుతున్న కొలది, శుభ్రం చేసే పనిని చేయడానికి వాళ్ళు వేరే ఎవరినన్నా జీతానికి పెట్టుకుంటున్నారు. ఆ విధంగా, పరిసరాల శుభ్రత వ్యక్తిగతంగా అంత పట్టించుకోనవసరం లేని విషయంగా ఎంచబడుతోంది. “నేను షవర్‌ని శుభ్రం చేయను గానీ, నేను మాత్రం శుభ్రంగా ఉంటాను. మా ఇల్లు మురికిగా ఉంటేనేమి, కనీసం నేను శుభ్రంగా ఉంటాను” అని ఒక వ్యక్తి అన్నాడు.
అయితే, పరిశుభ్రత బాహ్య రూపానికి మాత్రమే సంబంధించింది కాదు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి సంబంధించిన అన్ని సూత్రాలూ పరిశుభ్రత క్రిందకే వస్తాయి. అంతేకాక, మన మానసిక స్థితీ హృదయ స్థితీ పరిశుభ్రత క్రిందకే వస్తాయి, అందులో నైతిక విలువలు, ఆరాధన చేరివున్నాయి. అదెలాగో మనం చూద్దాం.