కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య బోధకులుగా సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నాము

దేవుని వాక్య బోధకులుగా సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నాము

దేవుని వాక్య బోధకులుగా సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నాము

‘ఆయనే [దేవుడే] . . . పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము [“యోగ్యత,” NW] కలిగించియున్నాడు.’​—⁠2 కొరింథీయులు 3:​5, 6.

1, 2. ప్రకటనా పనిలో కొన్నిసార్లు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, కానీ ఆ ప్రయత్నాలు సాధారణంగా ఎందుకు విఫలమవుతాయి?

మీరు చేయడానికి మీకు యోగ్యతలేని ఒక పనిని చేయమని మీకిస్తే మీరెలా భావిస్తారు? ఇలా ఊహించుకోండి: మీక్కావలసిన వస్తువులు మీ ముందు ఉంచబడ్డాయి. పనిముట్లు అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఆ పనెలా చెయ్యాలో మీకు ఏ మాత్రం తెలియదు. పైగా, ఆ పని వెంటనే పూర్తవ్వాలి. మీరు చేస్తారని ప్రజలు ఆశగా చూస్తున్నారు. అది ఎంత నిస్పృహను కలిగించే పరిస్థితో కదా!

2 అలాంటి సందిగ్ధావస్థ పూర్తిగా ఊహాకల్పితమేమీ కాదు. ఒక ఉదాహరణను పరిశీలించండి. క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన ఒక చర్చి, ఇంటింటి పరిచర్యను సంస్థీకరించి, దాన్ని కొనసాగించడానికి కొన్నిసార్లు ప్రయత్నించింది. అలాంటి ప్రయత్నాలు విఫలమై కొన్ని వారాల్లోనే లేదా కొన్ని నెలల్లోనే ఆగిపోయాయి. ఎందుకు? ఎందుకంటే తనను అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు ఆ పనికి యోగ్యులయ్యేలా క్రైస్తవమత సామ్రాజ్యం సహాయపడలేదు. పాదిరీలు సంవత్సరాల తరబడి లౌకిక విద్యను పొందినా, సెమినరీల్లో చదువుకున్నా, వాళ్ళు కూడా ప్రకటించే పనికి యోగ్యులుగా లేరు. లేరని మనం చెప్పగలగడానికి కారణమేమిటి?

3. రెండవ కొరింథీయులు 3:​5, 6, NWలో ఏ మాట మూడుసార్లు ఉపయోగించబడింది, దాని అర్థం ఏమిటి?

3 క్రైస్తవ సువార్త యొక్క నిజమైన ప్రచారకుడయ్యేందుకు యోగ్యుడిగా చేసేదేమిటో దేవుని వాక్యం వివరిస్తుంది. ‘మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని [“యోగ్యత కలిగివున్నామని,” NW] కాదు; మా సామర్థ్యము [“యోగ్యత,” NW] దేవునివలననే కలిగియున్నది. ఆయనే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము [“యోగ్యత,” NW] కలిగించియున్నాడు’ అని వ్రాసేందుకు అపొస్తలుడైన పౌలు ప్రేరేపించబడ్డాడు. (2 కొరింథీయులు 3:​5, 6) నూతనలోక అనువాదములో “యోగ్యత” అని మూడుసార్లు పేర్కొనబడడాన్ని గమనించండి. ఈ పదం భావమేమిటి? దీని “[గ్రీకు మూల పదం] ఏవైనా వస్తువులను గురించి చెబుతున్నప్పుడు ‘కావలసినంత’ అని సూచిస్తుంది . . . వ్యక్తుల గురించి చెబుతున్నప్పుడు ‘సమర్థులు’ ‘తగినవారు’ అన్న అర్థాలు ఉన్నాయి” అని వైన్స్‌ ఎక్స్‌పొజిటరీ డిక్షనరీ ఆఫ్‌ బిబ్లికల్‌ వర్డ్స్‌ చెబుతుంది. కాబట్టి “యోగ్యత”గలవారు తమకు అప్పగించబడిన పనిని నిర్వహించడానికి సమర్థులు, “తగినవారు.” అవును, నిజమైన సువార్త పరిచారకులు ఈ పని చేయడానికి యోగ్యులై ఉన్నారు. వారు ప్రకటించడానికి సమర్థులు, సరైనవారు, తగినవారు.

4. (ఎ) క్రైస్తవ పరిచర్యకు యోగ్యులయ్యేది ఎంపిక చేయబడిన కొందరు మాత్రమే కాదని పౌలు ఉదాహరణ ఎలా చూపిస్తుంది? (బి) యెహోవా మనలను పరిచారకులుగా యోగ్యులనుగా చేసేందుకు ఉపయోగించే మూడు మాధ్యమాలు ఏవి?

4 అయితే ఆ యోగ్యత ఎక్కడనుండి వస్తుంది? వ్యక్తిగత సామర్థ్యాల నుండా? ఉన్నత మేధాసంపత్తి నుండా? ప్రఖ్యాత కళాశాలల నుండి పొందిన ప్రత్యేక విద్య నుండా? అపొస్తలుడైన పౌలుకు ఇవన్నీ ఉన్నాయని స్పష్టమౌతుంది. (అపొస్తలుల కార్యములు 22:⁠3; ఫిలిప్పీయులు 3:​4, 5) అయినప్పటికీ, ఒక పరిచారకునిగా తనకున్న యోగ్యతలు ఉన్నత విద్యా సంస్థల నుండి కాదు గాని యెహోవా దేవుని నుండే కలిగాయని ఆయన వినయంగా అంగీకరించాడు. అలాంటి యోగ్యతలు కేవలం ఎంపికచేయబడిన కొద్దిమందికే ఉన్నాయా? ‘మాకు సామర్థ్యము [“మనకు యోగ్యత,” NW] దేవుని వలననే కలిగియున్నది’ అని కొరింథు సంఘానికి పౌలు వ్రాశాడు. (ఇటాలిక్కులు మావి.) తన నమ్మకమైన సేవకులు అందరూ యోగ్యులై వారికి తానప్పగించిన పని చేయడానికి యోగ్యులై ఉండేలా యెహోవా నిశ్చయపరచుకుంటాడని అది ఖచ్చితంగా సూచిస్తుంది. యెహోవా నేడు నిజ క్రైస్తవులను ఎలా యోగ్యులనుగా చేస్తాడు? ఆయన ఉపయోగించే మూడు మాధ్యమాల్ని మనం చర్చిద్దాము: (1) ఆయన వాక్యం, (2) ఆయన పరిశుద్ధాత్మ, (3) ఆయన భూసంస్థ.

యెహోవా వాక్యం మనలను యోగ్యులనుగా చేస్తుంది

5, 6. పరిశుద్ధ లేఖనాలు నిజ క్రైస్తవులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?

5 మొదటిగా, మనం పరిచారకులుగా యోగ్యులయ్యేందుకు దేవుని వాక్యం ఎలా సహాయపడుతుందో చూద్దాం. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని పౌలు వ్రాశాడు. (2 తిమోతి 3:​16, 17) కనుక, మనం ప్రజలకు దేవుని వాక్యం బోధించే “సత్కార్యము” జరిగించడానికి ‘సన్నద్ధులమై పూర్ణముగా సిద్ధపడియుండడానికి’ పరిశుద్ధ లేఖనాలు మనకు సహాయం చేస్తాయి. మరి క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలను అంటిపెట్టుకుని ఉండేవారందరి సంగతేమిటి? వాళ్ళకు కూడా బైబిలు అందుబాటులో ఉంది. ఒకే పుస్తకం యోగ్యతగల పరిచారకులుగా అయ్యేందుకు కొందరికి సహాయపడి కొందరికి సహాయపడకుండా ఎలా ఉంటుంది? దానికి జవాబు బైబిలు పట్ల మనకున్న దృక్పథంలో కనిపిస్తుంది.

6 విచారకరంగా, చర్చికి వెళ్ళే చాలా మంది, బైబిలు సందేశం “అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని” అంగీకరించరు. (1 థెస్సలొనీకయులు 2:​13) ఈ విషయంలో క్రైస్తవమత సామ్రాజ్యం అవమానకరమైన చరిత్రను సృష్టించుకుంది. పాదిరీలు వేదాంత కళాశాలల్లో అధ్యయనం చేస్తూ అనేక సంవత్సరాలు గడిపిన తర్వాత, దేవుని వాక్య బోధకులుగా సిద్ధపడ్డారా? నిజంగా సిద్ధపడలేదు. అంతెందుకు, ప్రీస్టుల కళాశాలలో అధ్యయనం ప్రారంభించినప్పుడు బైబిలును విశ్వసించిన కొందరు పట్టభద్రులయ్యే సరికి సంశయవాదులుగా మారుతారు! ఆ తర్వాత వారిలో చాలామంది దేవుని వాక్యాన్ని ఇక నమ్మరు. వారు దేవుని వాక్యాన్ని ప్రకటించే బదులు రాజకీయ వివాదాల్లో భాగం వహించడం, సాంఘిక సమస్యలను పరిష్కరించడానికి క్రైస్తవ సూత్రాలను అన్వయించడాన్ని ప్రోద్బలపరచడం, లేదా తమ మత ప్రసంగాల్లో మానవ తత్త్వజ్ఞానాన్ని ఉన్నతంగా చెప్పడం వంటివి చేస్తూ, ఇతర రంగాల్లో పరిచర్య చేయడం మొదలుపెడతారు. (2 తిమోతి 4:⁠3) వారికి భిన్నంగా నిజమైన క్రైస్తవులు యేసుక్రీస్తు మాదిరిని అనుసరిస్తారు.

7, 8. దేవుని వాక్యాన్ని గురించిన యేసు దృక్పథం, ఆయన కాలంనాటి మత నాయకుల దృక్పథానికి ఎలా భిన్నంగా ఉంది?

7 యేసు తన కాలంలోని మత నాయకులు తన ఆలోచనా సరళిపై ప్రభావం చూపేందుకు అనుమతించలేదు. యేసు, తన అపొస్తలుల వంటి చిన్న గుంపులకు బోధించేటప్పుడైనా లేక పెద్ద జనసమూహాలకు బోధించేటప్పుడైనా పరిశుద్ధ లేఖనాలను చక్కగా ఉపయోగించేవాడు. (మత్తయి 13:​10-17; 15:​1-11) ఆ పద్ధతి ఆయనను ఆ కాలంలోని మతనాయకులనుండి ప్రత్యేకించింది. సామాన్య ప్రజలు దేవుని గురించిన లోతైన విషయాలను పరిశీలించడాన్ని వారు గట్టిగా నిరుత్సాహపరిచారు. నిజానికి, బైబిలులోని కొన్ని భాగాలు చాలా లోతైనవి గనుక తనకు అందరికన్నా ప్రియమైన ఒక విద్యార్థితో మాత్రమే వాటిని చర్చించాలని, అదైనా తలపై ముసుగు వేసుకుని తగ్గు స్వరంలో చర్చించాలని ఒక బోధకుడు నమ్మడం ఆనాడు సర్వసాధారణమైన విషయం. ఆ మతనాయకులు దేవుని నామాన్ని ఉచ్చరించే విషయంలో ఎంత మూఢ విశ్వాసంతో ఉండేవారో, కొన్ని బైబిలు భాగాలను చర్చించే విషయంలో కూడా దాదాపు అంతే మూఢవిశ్వాసంతో ఉండేవారు!

8 క్రీస్తు అలాంటివాడు కాడు. కేవలం ఎంపిక చేయబడిన కొందరు మాత్రమే కాదుగాని ప్రజలందరూ ‘దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను’ పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన నమ్మాడు. పరిజ్ఞానాన్ని ప్రచురం చేసే ఆధిక్యతను, ఎంపిక చేయబడిన ఏదైనా ఒక విద్వాంసుల గుంపుకు ఇవ్వాలన్న ఆసక్తి యేసుకు లేదు. “చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి” అని ఆయన తన శిష్యులకు చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 4:⁠4; 10:​27) దేవుని గురించిన పరిజ్ఞానాన్ని ఎంత మందితో సాధ్యమైతే అంత మంది ప్రజలతో పంచుకోవాలని యేసు హృదయపూర్వకంగా కోరుకున్నాడు.

9. నిజ క్రైస్తవులు బైబిలును ఏ విధంగా ఉపయోగిస్తారు?

9 మన బోధలో దేవుని వాక్యానికి ప్రముఖ స్థానం ఉండాలి. ఉదాహరణకు, యెహోవా సాక్షుల రాజ్యమందిరంలో ప్రసంగం ఇచ్చేటప్పుడు, బైబిలు నుండి కేవలం ఎంపిక చేసుకున్న వచనాలను చదవడం మాత్రమే సరిపోదు. మనం ఒక లేఖనాన్ని వివరిస్తూ, సోదాహరణంగా చెబుతూ, ఆ సందర్భంలో అది ఎలా అన్వయిస్తుందో చెప్పవలసిన అవసరం ఉండవచ్చు. బైబిలు పుటల్లోని సందేశాన్ని మన శ్రోతల హృదయాలపై ముద్రించడమే మన ధ్యేయంగా ఉండాలి. (నెహెమ్యా 8:​8, 12) ఉపదేశాన్ని ఇవ్వవలసిన అవసరం వచ్చినప్పుడు, లేదా దిద్దుబాటుగా క్రమశిక్షణను అమలు చేయవలసి వచ్చినప్పుడు కూడా బైబిలును ఉపయోగించాలి. యెహోవా ప్రజలు విభిన్న భాషలు మాట్లాడేవారైనప్పటికీ వివిధ నేపథ్యాల నుండి వచ్చినవారైనప్పటికీ, వారందరూ సర్వోత్తమ గ్రంథమైన బైబిలును గౌరవిస్తారు.

10. బైబిలులోని ప్రేరేపిత సందేశం మనపై ఎలాంటి ప్రభావం చూపగలదు?

10 బైబిలును అలా గౌరవంతో ఉపయోగించినప్పుడు, దాని సందేశానికి శక్తివుంటుంది. (హెబ్రీయులు 4:​12) వ్యభిచారం, జారత్వం, విగ్రహారాధన, త్రాగుబోతుతనము, దొంగతనము వంటి లేఖనవిరుద్ధమైన అలవాట్లనుండి బయటికి రావడం వంటి మార్పులను తమ జీవితంలో చేసుకునేలా అది ప్రజలను కదిలిస్తుంది. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించేందుకు అది చాలా మందికి సహాయపడింది. (ఎఫెసీయులు 4:​20-24) ఏ మానవుల అభిప్రాయం కన్నా సాంప్రదాయం కన్నా బైబిలుకు ఎక్కువ గౌరవమిచ్చి, దాన్ని నమ్మకంగా ఉపయోగిస్తే, యోగ్యులైనవారిగా సంపూర్ణంగా సిద్ధపడినవారిగా అయ్యేందుకు దేవుని వాక్య బోధకులుగా బైబిలు మనకు సహాయం చేస్తుంది.

యెహోవా ఆత్మ మనలను యోగ్యులనుగా చేస్తుంది

11. యెహోవా ఆత్మను “ఆదరణకర్త” అని పేర్కోవడం సముచితమనడానికి కారణమేమిటి?

11 రెండవదిగా, మనలను సంపూర్ణంగా సిద్ధపడినవారిగా చేయడంలో యెహోవా పరిశుద్ధాత్మ, లేదా ఆయన చురుకైన శక్తి వహించే పాత్రను మనం చర్చిద్దాము. యెహోవా ఆత్మే అత్యంత బలమైన శక్తి అన్న విషయాన్ని మనమెన్నటికీ మర్చిపోకూడదు. ఆ సంభ్రమాశ్చర్యం కలిగించే శక్తిని నిజక్రైస్తవులందరి పక్షాన అధికారపూర్వకంగా ఉపయోగించేలా యెహోవా తన ప్రియ కుమారునికి శక్తిని ఇచ్చాడు. యేసు పరిశుద్ధాత్మను “ఆదరణకర్త” అని సముచితంగానే సూచించాడు. (యోహాను 16:⁠7) యెహోవా ఆ ఆత్మను ధారాళంగా దయచేస్తాడని హామీ ఇచ్చి, దాని కోసం యెహోవాను వేడుకోమని యేసు తన అనుచరులకు ఉద్బోధించాడు.​—⁠లూకా 11:​10-13; యాకోబు 1:⁠17.

12, 13. మనకు పరిచర్యలో సహాయం చేసేందుకు పరిశుద్ధాత్మనివ్వమని ప్రార్థించడమెందుకు ప్రాముఖ్యం? (బి) తమపై పరిశుద్ధాత్మ పని చేయడం లేదన్న విషయాన్ని పరిసయ్యులు ఎలా కనబరిచారు?

12 మనం ప్రతి రోజూ, ప్రత్యేకించి మన పరిచర్యలో సహాయపడేందుకు మనకు పరిశుద్ధాత్మనివ్వమని ప్రార్థించవలసిన అవసరం ఉంది. మనమీద ఆ చురుకైన శక్తి ఎలాంటి ప్రభావం చూపించగలదు? మనం మారడానికి, ఎదగడానికి ప్రాచీన స్వభావానికి బదులు నవీన స్వభావాన్ని ధరించడానికి సహాయపడుతూ, మన మనస్సులను హృదయాలను ప్రభావితం చేయగలదు. (కొలొస్సయులు 3:​9, 10) అది క్రీస్తుకున్నటువంటి ప్రశస్తమైన లక్షణాలను పెంపొందించుకోవడానికి మనకు సహాయం చేయగలదు. మనలో అనేకులం గలతీయులు 5:​22, 23 వచనాలను చూడకుండా చెప్పగలము. ఆ వచనాలు దేవుని ఆత్మ ఫలాలను వరుసగా చెబుతున్నాయి. మొదటిది ప్రేమ, ఆ లక్షణం మన పరిచర్యలో ఆవశ్యకం. ఎందుకు?

13 ప్రేమ గొప్ప ప్రేరకం. యెహోవా పట్ల, పొరుగువారి పట్ల ఉండే ప్రేమ సువార్తను పంచుకోవడానికి నిజ క్రైస్తవులను ప్రేరేపిస్తుంది. (మార్కు 12:​28-31) అలాంటి ప్రేమ లేకుంటే, దేవుని వాక్య బోధకులుగా నిజంగా యోగ్యులు కాలేము. యేసుకు, పరిసయ్యులకు గల భేదాన్ని గమనించండి. “ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి”నాడని మత్తయి 9:⁠36 యేసు గురించి చెబుతుంది. సామాన్య ప్రజల గురించి పరిసయ్యులు ఎలా భావించారు? ‘ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనది’ అని వాళ్ళన్నారు. (ఇటాలిక్కులు మావి.) (యోహాను 7:​49) ఆ పరిసయ్యులకు ప్రజలంటే పూర్తిగా తృణీకారభావమే గానీ, ప్రేమ లేదు. యెహోవా ఆత్మ వారిపై పనిచేయడం లేదు అన్నది స్పష్టం.

14. పరిచర్యలో ప్రేమను చూపించడంలో యేసు ఉంచిన మాదిరి మనలనెలా కదిలించాలి?

14 యేసుకు ప్రజల మీద సహానుభూతి ఉంది. వారి బాధ ఏమిటో ఆయనకు తెలుసు. వారు దగా చేయబడుతున్నారని, కాపరిలేని గొఱ్ఱెల్లా విసిగి చెదరి ఉన్నారని ఆయనకు తెలుసు. యేసు “మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు” అని యోహాను 2:⁠24 మనకు చెబుతోంది. సృష్టి జరుగుతున్నప్పుడు యేసు యెహోవా యొక్క ప్రధానశిల్పిగా ఉన్నాడు కాబట్టి, మానవనైజాన్ని గురించి ఆయనకు అపారమైన అవగాహన ఉంది. (సామెతలు 8:​30, 31) ఆ అవగాహనే ఆయనకున్న ప్రేమను మరింత ప్రగాఢం చేసింది. అలాంటి ప్రేమే మన ప్రకటనా కార్యక్రమానికి ఎల్లప్పుడూ ప్రేరణా శక్తిగా ఉండాలి! ఈ విషయంలో మనం మెరుగవ్వాల్సి ఉందని మనం భావిస్తున్నట్లయితే, యెహోవా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించి, మన ప్రార్థనలకు అనుగుణంగా నడుచుకుందాం. యెహోవా మనకు జవాబిస్తాడు. సువార్తను ప్రకటించడానికి సర్వోత్కృష్టమైన విధంగా యోగ్యుడైన క్రీస్తును మరెక్కువగా పోలి ఉండేలా మనకు సహాయపడేందుకు ఎవరూ ఆపలేని శక్తిని ఆయన పంపిస్తాడు.

15. యెషయా 61:​1-3 లోని మాటలు సముచితంగా యేసుకు ఎలా వర్తిస్తాయి, అదే సమయంలో శాస్త్రుల పరిసయ్యుల నిజస్వరూపాన్ని ఎలా బయల్పరుస్తాయి?

15 యేసుకు యోగ్యతలు ఎక్కడనుండి వచ్చాయి? “యెహోవా ఆత్మ నామీద ఉన్నది” అని ఆయనన్నాడు. (లూకా 4:​17-21) అవును, స్వయంగా యెహోవాయే తన పరిశుద్ధాత్మ ద్వారా యేసును నియమించాడు. యేసుకున్న యోగ్యతలను ధృవీకరించడానికి మరేవీ అవసరం లేదు. మరి ఆయన కాలం నాటి మతనాయకులు పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడ్డారా? వాళ్ళలా నియమించబడనూ లేదు. యేసు బిగ్గరగా చదివి, తనకు తాను అన్వయించుకున్న యెషయా 61:​1-3 నెరవేర్చేందుకు వాళ్ళు సిద్ధంగాను లేరు. దయచేసి ఆ వచనాలను చదివి, వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు యోగ్యులు కారన్న విషయాన్ని మీరే తెలుసుకోండి. బీదలకు ప్రకటించేందుకు వారి దగ్గర ఏ సువార్తా లేదు. ఇక అలాంటప్పుడు, చెరలో ఉన్నవారికి విడుదల లభిస్తుందనీ గ్రుడ్డివారికి చూపు తిరిగి లభిస్తుందనీ వాళ్ళు ఎలా ప్రకటించగలరు? ఆధ్యాత్మిక భావంలో వాళ్ళే గ్రుడ్డివారై ఉన్నారు, మానవ నిర్మిత పారంపర్యాచారాలకు బంధీలై ఉన్నారు! వాళ్ళలా కాక, మనం ప్రజలకు బోధించే యోగ్యత కలిగియున్నామా?

16. పరిచారకులుగా తమ యోగ్యతను గురించి నేడు యెహోవా ప్రజలు ఏమని నమ్మకం కలిగివుండవచ్చు?

16 నిజమే, క్రైస్తవమత సామ్రాజ్య కళాశాలల్లో మనం విద్యను అభ్యసించలేదు. బోధకులుగా వేదాంత కళాశాలల నుండి మనకు నియామకం లభించలేదు. అయితే, మనకు యోగ్యతలేమన్నా కొరవడ్డాయా? ఎంతమాత్రమూ కొరవడ లేదు. యెహోవాసాక్షులుగా మన నియామకం ఆయన నుండే వస్తుంది. (యెషయా 43:​10-12) మనమాయన ఆత్మ కోసం ప్రార్థించి, దానికనుగుణ్యంగా నడుచుకుంటే, మనకు అత్యున్నత యోగ్యతలున్నట్లే. నిజమే, మనం అపరిపూర్ణులం, గొప్ప బోధకుడైన యేసు మాదిరిని అనుకరించడంలో తప్పిపోతుంటాం. అయినప్పటికీ తన వాక్య బోధకులుగా మనలను యోగ్యులనుగా చేసేందుకు, సిద్ధపరచేందుకు యెహోవా తన ఆత్మను ఉపయోగిస్తున్నందుకు మనం కృతజ్ఞులముగా ఉండమా?

యెహోవా సంస్థ మనలను యోగ్యులుగా చేస్తుంది

17-19. యెహోవా సంస్థ ఏర్పాటు చేసిన వారపు ఐదు కూటాలు, మనం పరిచారకులుగా యోగ్యులమయ్యేందుకు ఎలా సహాయపడతాయి?

17 ఇప్పుడు, తన వాక్య బోధకులుగా మనలను సిద్ధం చేసేందుకు యెహోవా ఉపయోగించే మూడవ మాధ్యమాన్ని అంటే భూమిపైనున్న ఆయన సంఘాన్ని అంటే సంస్థను గురించి చర్చిద్దాం. అది మనం పరిచారకులయ్యేందుకు శిక్షణనిస్తుంది. ఎలా? మనం ప్రయోజనం పొందుతున్న ఉపదేశకార్యక్రమాన్ని గురించి ఆలోచించండి! ఒక వారంలో మనం ఐదు క్రైస్తవ కూటాలకు హాజరౌతాం. (హెబ్రీయులు 10:​24, 25) యెహోవా సంస్థ ద్వారా అందించబడిన ఒక పాఠ్యపుస్తకం ద్వారా లోతుగా బైబిలు అధ్యయనం చేయడానికి సంఘ పుస్తక అధ్యయనంలో చిన్న గుంపులుగా సమకూడుతాము. వ్యాఖ్యానించడం ద్వారా వినడం ద్వారా ఒకరి నుండి ఒకరం నేర్చుకుంటాము, పరస్పరం ప్రోత్సహించుకుంటాము. పుస్తక అధ్యయన పైవిచారణకర్త నుండి మనం వ్యక్తిగత ఉపదేశాన్ని శ్రద్ధను కూడా పొందుతాం. బహిరంగ కూటమి నుండి, కావలికోట అధ్యయనం నుండి మనం ఆధ్యాత్మిక పోషకాహారాన్ని మరింత పొందుతాం.

18 మన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, ఎలా బోధించాలన్న విషయంలో మనకు నిర్దేశాలనిచ్చేందుకు రూపొందించబడింది. వివిధ అంశాలను బోధించేందుకు దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో విద్యార్థి ప్రసంగాలకు సిద్ధపడడం ద్వారా మనం నేర్చుకుంటాము. (1 పేతురు 3:​15) ఎప్పుడైనా, ప్రసంగించడానికి మీకు ఇవ్వబడిన అంశం బాగా తెలిసినదే అని మీకు అనిపించినా దాని నుండి మీరు ఒక క్రొత్త విషయం నేర్చుకున్నారా? అది సాధారణంగా అందరికీ కలిగే అనుభవమే. ఒక అంశంపై మనకున్న పరిజ్ఞానాన్ని అధికం చేసేవాటిలో ఆ అంశాన్ని ఇతరులకు బోధించడం కంటే మించినదేదీ లేదు. ఒక అంశాన్ని గురించి ఇతరులకు బోధించే పనికన్నా ఎక్కువగా మరేదీ ఆ అంశంపై మనకున్న పరిజ్ఞానాన్ని పెంచదు. ఒక ప్రసంగం మనకు నియమించబడనప్పుడు కూడా మెరుగైన బోధకులుగా ఉండడానికి నేర్చుకోగలము. ప్రతి విద్యార్థిలో మనం మంచి లక్షణాలను గమనిస్తాము. ఆ లక్షణాల్ని ఎలా అనుకరించాలో మనం తలపోయగలము.

19 సేవా కూటం కూడా మనలను దేవుని వాక్య బోధకులుగా సిద్ధం చేయడానికి రూపొందించబడింది. ప్రతి వారం, మన పరిచర్య కోసం రూపకల్పన చేయబడిన ఉత్సాహభరితమైన ప్రసంగాలు, చర్చలు, ప్రదర్శనల నుండి ప్రయోజనం పొందుతాము. మనం ఏ అందింపును ఉపయోగిస్తాము? మన బహిరంగ పరిచర్యలోని ప్రత్యేక సవాళ్ళతో మనమెలా వ్యవహరించగలం? ప్రకటనా పనికి సంబంధించిన, మనం నైపుణ్యాన్ని పెంచుకోవలసిన వేరే ఏయే రంగాలు మన ఎదుట ఉన్నాయి? పునర్దర్శనాలు చేసేటప్పుడు, బైబిలు అధ్యయనాలు నిర్వహించేటప్పుడు మరింత ప్రభావవంతమైన బోధకులుగా ఉండేందుకు మనకు సహాయపడేదేమిటి? (1 కొరింథీయులు 9:​19-22) సేవా కూటంలో ఇలాంటి ప్రశ్నలకు అవధానమిచ్చి, వివరంగా చర్చించడం జరుగుతుంది. మన ప్రాముఖ్యమైన పని కోసం మనల్ని సిద్ధం చేయడానికి అందివ్వబడిన మరో ఉపకరణం మన రాజ్య పరిచర్య. సేవా కూటంలోని అనేక భాగాలు దానిలోని ఆర్టికల్‌లపై ఆధారపడివుంటాయి.

20. మనం కూటాల నుండి సమావేశాల నుండి ఎలా పూర్తిగా ప్రయోజనాన్ని పొందవచ్చు?

20 కూటాలకు సిద్ధపడడం ద్వారా, హాజరవడం ద్వారా, మనం నేర్చుకున్న దానిని మన బోధనా పనిలో ఉపయోగించడం ద్వారా మనం సమగ్రమైన శిక్షణను పొందుతాము. అయితే అంతటితో అయిపోలేదు. మరి పెద్దవైన కూటాలు అంటే ప్రత్యేక, ప్రాంతీయ, జిల్లా సమావేశాలు మనకున్నాయి. దేవుని వాక్య బోధకులుగా మనలను సిద్ధం చేసేందుకు అవి రూపొందించబడ్డాయి. అటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా వినడానికి, దాన్ని ఆచరణలో పెట్టడానికి మనమెంతగా ఎదురుచూస్తామో కదా!​—⁠లూకా 8:​18.

21. మనకు లభించిన శిక్షణ ప్రభావవంతంగా ఉందని ఏ రుజువు చూపిస్తుంది, దానికి ఘనత ఎవరికి చెందుతుంది?

21 యెహోవా ఇస్తున్న శిక్షణ ప్రభావవంతంగా ఉందా? రుజువులను పరిశీలిద్దాం. బైబిలులోని ప్రాథమిక సిద్ధాంతాలను నేర్చుకుని దేవుడు తమ నుండి కోరే వాటి అనుసారంగా జీవించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాదిమందికి సహాయం చేయబడుతోంది. మన సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే దాని ఘనత నాకే చెందుతుందని మనలో ఏ ఒక్కరమూ అనలేము. యేసు దృష్టించినట్లే, మనం కూడా విషయాలను వాస్తవికంగా దృష్టించాలి. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని ఆయన చెప్పాడు. ప్రాచీన కాల అపొస్తలుల వలెనే మనలో అనేకులం పామరులం, సామాన్యులం. (యోహాను 6:⁠44 అపొస్తలుల కార్యములు 4:⁠13) మన విజయం, యథార్థ హృదయులైన ప్రజల్ని సత్యంవైపు ఆకర్షించే యెహోవా మీదే ఆధారపడివుంది. దీన్ని పౌలు చక్కగా చెప్పాడు. “నేను నాటితిని, అపొల్లో నీళ్ళు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే” అని ఆయన అన్నాడు.​—⁠1 కొరింథీయులు 3:⁠6.

22. క్రైస్తవ పరిచర్యలో పూర్తిగా పాల్గొనలేకపోతున్నామని అమితంగా నిరుత్సాహం చెందకూడదు అనడానికి కారణం ఏమిటి?

22 అవును, తన వాక్య బోధకులుగా మనం చేసే పనిలో యెహోవా దేవుడు చురుకుగా భాగం వహిస్తున్నాడు. మనం యోగ్యతగల బోధకులమని ఎల్లప్పుడూ భావించకపోవచ్చు. కానీ, తనవైపుకు తన కుమారుని వైపుకు ప్రజల్ని ఆకర్షించేది యెహోవాయేనని గుర్తుంచుకోండి. మనం ఆ క్రొత్తవారికి పరిచారం చేసేందుకు యెహోవాయే తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా, తన భూసంస్థ ద్వారా మనల్ని యోగ్యులనుగా చేస్తాడు. దేవుని వాక్య బోధకులుగా మనలను సంపూర్ణంగా సిద్ధం చేసేందుకు యెహోవా ఇప్పుడు చేస్తున్న మంచి ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, ఆయన ఇచ్చే శిక్షణకు మనం ప్రతిస్పందిద్దాం!

మీరెలా జవాబిస్తారు?

• ప్రకటనా పనికి బైబిలు మనలను ఎలా సిద్ధం చేస్తుంది?

• మనం పరిచారకులుగా యోగ్యులయ్యేలా చేయడంలో పరిశుద్ధాత్మ వహించే పాత్ర ఏమిటి?

• సువార్త ప్రచారకులుగా మీరు యోగ్యులయ్యేందుకు యెహోవా యొక్క భూసంస్థ మీకు ఏయే విధాల్లో సహాయపడింది?

• మనం పరిచర్యలో నిమగ్నమైనప్పుడు ఎందుకు ధైర్యంగా ఉండగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[25వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్య బోధకుడుగా యేసు ప్రజల మీద ప్రేమను కనబరచాడు