కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాళ్ళు శరీరంలో ముళ్ళలాంటి సమస్యలను అధిగమించారు

వాళ్ళు శరీరంలో ముళ్ళలాంటి సమస్యలను అధిగమించారు

వాళ్ళు శరీరంలో ముళ్ళలాంటి సమస్యలను అధిగమించారు

“నాకు శరీరములో ఒక ముల్లు, . . . నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.”​—⁠2 కొరింథీయులు 12:⁠7.

1. నేడు ప్రజలు ఎదుర్కుంటున్న కొన్ని సమస్యలు ఏవి?

ఎంతోకాలంగా మీరు ఏదైనా శ్రమను ఎదుర్కొంటున్నారా? అలాగైతే, మీరు ఒంటరివారు కాదు. ఈ “అపాయకరమైన కాలముల”లో నమ్మకమైన క్రైస్తవులు తీవ్రమైన వ్యతిరేకతను, కుటుంబ సమస్యలను, రోగమును, ఆర్థిక చింతలను, భావోద్వేగపరమైన ఒత్తిళ్ళను, ప్రియమైనవారిని మరణం మూలంగా కోల్పోయిన బాధను, మరితర సవాళ్ళనూ ఎదుర్కొంటున్నారు. (2 తిమోతి 3:​1-5) కొన్ని దేశాల్లో, ఆహార కొరతల మూలంగాను, యుద్ధాల మూలంగాను అనేకుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి.

2, 3. మనకు ఎదురయ్యే ముళ్ళలాంటి సమస్యల వల్ల ఎలాంటి ప్రతికూల దృక్పథం ఏర్పడగలదు, అది ప్రమాదకరంగా ఎలా పరిణమించగలదు?

2 అలాంటి సమస్యలు, ముఖ్యంగా అనేక రకాల కష్టాలు ఒకే సమయంలో వచ్చి పడినప్పుడు తాను పూర్తిగా నిస్సహాయుడైనట్లు ఒకరు భావించవచ్చు. సామెతలు 24:⁠10 ఏమి చెబుతుందో గమనించండి. “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు” అని చెబుతోంది. అవును, మన శ్రమలను బట్టి నిరుత్సాహపడితే మనకు ఎంతో అవసరమైన బలాన్ని అది హరించేయగలదు, చివరి వరకూ సహించాలన్న మన దృఢనిర్ణయాన్ని బలహీనపరచగలదు. ఎలా?

3 ఎలాగంటే, మనం విషయాలను ఉన్నది ఉన్నట్లు గ్రహించగల సామర్థ్యాన్ని కోల్పోయేందుకు నిరుత్సాహం కారణం కాగలదు. ఉదాహరణకు, మనకున్న గోరంత కష్టాలను కొండంతలుగా భావించి, మన మీద మనమే జాలిపడనారంభించడం చాలా సులభం. “నాకిలా జరిగేందుకు నువ్వెందుకు అనుమతిస్తున్నావు?” అని కూడా కొందరు దేవునికి మొఱ్ఱపెట్టుకోవచ్చు. అలాంటి ప్రతికూల దృక్పథం ఒక వ్యక్తి హృదయంలో వేళ్ళూనినట్లయితే, అది ఆయన ఆనందాన్ని నమ్మకాన్ని హరించివేయగలదు. దేవుని సేవకులలో ఒకరు, చివరికి “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము” పోరాడకుండా వదిలిపెట్టేంతగా నిరుత్సాహం చెందవచ్చు.​—⁠1 తిమోతి 6:⁠12.

4, 5. కొన్నిసార్లు, మన సమస్యల్లో సాతానుకు ఎలాంటి పాత్ర ఉంటుంది, అయినప్పటికీ మనం దేని గురించి నమ్మకం కలిగివుండగలము?

4 మన శ్రమలకు నిశ్చయంగా యెహోవా దేవుడు కారకుడు కాడు. (యాకోబు 1:​13) మనం ఆయనకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నందువల్లే మనకు కొన్ని పరీక్షలు ఎదురవుతుంటాయి. వాస్తవానికి, యెహోవాను సేవించే వారందరూ ఆయనకు ప్రధాన శత్రువైన అపవాదియైన సాతాను దాడికి గురవుతారు. యెహోవాను ప్రేమిస్తున్న ఎవరైనా సరే ఆయన చిత్తాన్ని చేయడాన్ని వదిలిపెట్టేలా చేయాలని “ఈ యుగ సంబంధమైన దేవత”యైన దుష్టుడు, తనకు మిగిలివున్న కొంచెం సమయంలో ప్రయత్నిస్తున్నాడు. (2 కొరింథీయులు 4:⁠4) ప్రపంచవ్యాప్తంగావున్న మన సహోదరులందరి మీదికి ఎన్ని కష్టాలను తీసుకు రాగలిగితే అన్ని కష్టాలను సాతాను తీసుకువస్తాడు. (1 పేతురు 5:⁠9) నిజమే, మన సమస్యలన్నింటికీ నేరుగా సాతానే కారణం కాడు, కానీ మనకు ఎదురయ్యే సమస్యలను తనకు అనువుగా ఉపయోగించుకుంటూ మనలను మరింత బలహీనులనుగా చేసేందుకు అతడు ప్రయత్నిస్తాడు.

5 సాతాను, అతని ఆయుధాలు ఎంత శక్తిమంతంగా ఉన్నప్పటికీ మనమతనిపై విజయం సాధించగలము! విజయం సాధించగలమన్న నిశ్చయతను మనమెలా కలిగివుండగలం? యెహోవా మన పక్షాన పోరాడుతాడు కనుక మనకు ఆ నిశ్చయత ఉంది. తన సేవకులు సాతాను తంత్రాలను ఎరిగినవారై ఉండేందుకు కావలసిన ఏర్పాట్లను ఆయన చేశాడు. (2 కొరింథీయులు 2:​11) నిజానికి, నిజక్రైస్తవులకు కలిగే శ్రమలను గురించి దేవుని వాక్యం మనకు చాలా చెబుతుంది. బైబిలు, అపొస్తలుడైన పౌలు గురించి చెబుతూ, “శరీరములో ఒక ముల్లు” అనే పదబంధాన్ని ఉపయోగిస్తుంది. ఎందుకు? ఆ పద బంధాన్ని దేవుని వాక్యం ఎలా వివరిస్తుందో మనం పరిశీలిద్దాం. శ్రమలపై విజయం సాధించడానికి యెహోవా సహాయం అవసరమున్నది మనకు మాత్రమే కాదని మనమప్పుడు తెలుసుకుంటాం.

శ్రమలు ముళ్ళలా ఉండడానికి కారణం

6. “శరీరములో ఒక ముల్లు” అని పౌలు అన్నప్పుడు దేనిని ఉద్దేశించివుండవచ్చు, ఆ ముల్లు ఏమై ఉండవచ్చు?

6 తీవ్రమైన శ్రమలకు గురైన పౌలు, “నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను” అని వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు. (2 కొరింథీయులు 12:⁠7) పౌలు శరీరంలోని ఈ ముల్లు ఏమిటి? లోతుగా గుచ్చుకుపోయిన ముల్లు నిశ్చయంగా చాలా నొప్పి కలిగిస్తుంది. ఈ రూపకాలంకార పదం, పౌలుకు కలిగిన బాధకు కారణాన్ని సూచిస్తుంది, ఆ బాధ శారీరకమైనదే కావచ్చు, భావోద్వేగపరమైనదే కావచ్చు, లేక రెండు విధాలా కావచ్చు. బహుశా, పౌలు నేత్ర సంబంధిత సమస్యతో గానీ, శారీరకమైన వేరే ఏదైనా వైకల్యంతో గానీ బాధపడివుండవచ్చు. లేదా ఆ ముల్లు, అపొస్తలుడుగా ఉండేందుకు పౌలుకున్న యోగ్యతలను సవాలు చేసి, ఆయన చేసిన బోధనా ప్రకటనా పనుల విలువను శంకించిన వ్యక్తులు అయ్యుండవచ్చు. (2 కొరింథీయులు 10:​10-12; 11:​5, 6, 13) పౌలు శరీరంలోని ఆ ముల్లు ఏదైనప్పటికీ, అది ఆయనతోనే ఉంది, తొలగిపోనిదిగా ఉంది.

7, 8. (ఎ) “నలగగొట్టు” అన్న మాట దేనిని సూచిస్తుంది? (బి) ఇప్పుడు మనలను బాధించే ముళ్ళలాంటి ఏ సమస్యలనైనా మనం అధిగమించడమెందుకు ప్రాముఖ్యము?

7 ఆ ముల్లు ఆయనను నలగగొడుతూనే ఉండేదన్న విషయం గమనించండి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ పౌలు ఉపయోగించిన గ్రీకు క్రియాపదం “చేతి వేలి కణుపులు” అనే మాట నుండి వచ్చింది. ఆ గ్రీకు క్రియా పదం, మత్తయి 26:67 లో అక్షరార్థంగాను, 1 కొరింథీయులు 4:11 లో ఆలంకారికంగాను ఉపయోగించబడింది. పిడిగుద్దులు తిన్నారన్న విషయాన్ని అది ఆ వచనాల్లో వ్యక్తం చేస్తుంది. సాతాను యెహోవాను, ఆయన సేవకులను తీవ్రంగా ద్వేషిస్తున్నాడన్నదాని దృష్ట్యా, పౌలును నలగగొట్టడానికి ఒక ముల్లు ఉంచబడినందుకు అపవాది సంతోషించాడని నిశ్చయంగా చెప్పవచ్చు. నేడు, శరీరములో ముల్లులాంటి సమస్యతో మనం బాధపడుతున్నప్పుడు కూడా సాతాను అలాగే ఆనందిస్తున్నాడు.

8 కాబట్టి, ముళ్ళలాంటి సమస్యలను అధిగమించడమెలాగో పౌలులా మనమూ తెలుసుకోవలసిన అవసరముంది. అలా చేయడం మన ప్రాణరక్షణకు ఎంతో అవసరం! ముళ్ళలాంటి సమస్యలేమీ మనలను బాధించని తన క్రొత్త లోకంలో మన జీవితాన్ని పొడిగించాలని యెహోవా కోరుకుంటున్నాడని గుర్తుచేసుకోండి. అద్భుతమైన ఆ బహుమానాన్ని మనం గెలుచుకునేలా మనకు సహాయపడేందుకు, తన నమ్మకమైన సేవకులు శరీరములో ముళ్ళలాంటి సమస్యలను విజయవంతంగా అధిగమించారని చూపించే అనేక ఉదాహరణలను దేవుడు తన పరిశుద్ధ వాక్యమైన బైబిలులో ఇచ్చాడు. వారు కూడ మనలాగే సామాన్యులైన అపరిపూర్ణులైన మానవులే. ఈ గొప్ప “సాక్షి సమూహము”లోని కొందరిని గురించి పరిశీలించడం, ‘మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తడానికి’ మనకు సహాయపడవచ్చు. (హెబ్రీయులు 12:⁠1) వాళ్ళు సహించినవాటిని గురించి ధ్యానించినప్పుడు, సాతాను మనకు విరోధముగా ఉపయోగించే ముళ్ళలాంటి ఏ సమస్యలనైనా అధిగమించగలమన్న మన నమ్మకం బలపడుతుంది.

మెఫీబోషెతును బాధపెట్టిన ముళ్ళలాంటి సమస్యలు

9, 10. (ఎ) మెఫీబోషెతుకు శరీరములో ముల్లులాంటి సమస్య ఎలా వచ్చింది? (బి) రాజైన దావీదు మెఫీబోషెతుకు ఏ విధమైన దయను చూపించాడు, మనం దావీదును ఎలా అనుకరించగలము?

9 మెఫీబోషెతును గురించి చూద్దాం. ఆయన దావీదు స్నేహితుడైన యోనాతాను కుమారుడు. ఆయనకు ఐదేండ్లున్నప్పుడు, ఆయన తండ్రి యోనాతాను, తాతగారు రాజు అయిన సౌలు చంపబడ్డారన్న వార్త అందింది. అప్పుడు ఆయన దాది చాలా భయపడిపోయింది. ‘ఆయన దాది ఆయనను ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా ఆయన పడి కుంటివాడయ్యాడు.’ (2 సమూయేలు 4:⁠4) ఆ అవిటితనము, ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు నిత్యం సహించవలసిన ఒక ముల్లులా ఆయనను ఎంతగానో బాధపెట్టివుండవచ్చు.

10 కొన్ని సంవత్సరాల తర్వాత, దావీదు రాజు తనకు యోనాతాను మీదున్న గొప్ప ప్రేమను బట్టి మెఫీబోషెతు మీద ప్రేమపూర్వక దయను చూపించాడు. దావీదు, సౌలు ఆస్తినంతటినీ ఆయనకు తిరిగి ఇచ్చి, ఆ భూమిని సాగుచేయడానికి సౌలు సేవకుడైన సీబాను నియమించాడు. ‘నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువు’ అని కూడా మెఫీబోషెతుతో దావీదు అన్నాడు. (2 సమూయేలు 9:​6-10) దావీదు చూపిన ప్రేమపూర్వక దయ, మెఫీబోషెతును ఓదార్చింది, తన అవిటితనం మూలంగా తనకున్న బాధ తగ్గడానికి సహాయపడింది అనడంలో సందేహం లేదు. ఎంత మంచి పాఠం! మనం కూడా శరీరములో ముల్లులాంటి సమస్యతో పోరాడుతున్నవారికి దయ చూపాలి.

11. మెఫీబోషెతు గురించి సీబా ఏమని చెప్పాడు, ఆయన అబద్ధం చెప్పాడని మనకెలా తెలుసు? (అధస్సూచి చూడండి.)

11 తర్వాత, మెఫీబోషెతు తన శరీరములో మరొక ముల్లులాంటి సమస్యతో పోరాడవలసి వచ్చింది. రాజైన దావీదు తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు మూలంగా యెరూషలేము నుండి పారిపోతున్న సమయంలో, మెఫీబోషెతు సేవకుడైన సీబా వెళ్ళి, దావీదు ఎదుట మెఫీబోషెతు మీద అబద్ధం చెప్పాడు. మెఫీబోషెతు విశ్వాసం చూపించక, తనకు తాను రాజత్వం సంపాదించుకోవాలనే ఆశతో, యెరూషలేములోనే ఉండిపోయాడని సీబా చెప్పాడు. * సీబా చెప్పిన అబద్ధాన్ని దావీదు నమ్మి, మెఫీబోషెతు ఆస్తినంతటినీ ఆ అబద్ధికుడికి ఇచ్చాడు.​—⁠2 సమూయేలు 16:​1-4.

12. తనకెదురైన పరిస్థితికి మెఫీబోషెతు ఎలా ప్రతిస్పందించాడు, ఆయన మనకెలా ఒక మంచి మాదిరినుంచాడు?

12 అయితే, మెఫీబోషెతు చివరికి దావీదు రాజును కలిసినప్పుడు, నిజానికి ఏమి జరిగిందో ఆయనకు చెప్పాడు. తను దావీదుతో పాటు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా, సీబా తనను మోసం చేసి, తానే ముందుకు వచ్చి తన స్థానంలో వెళ్ళాడు. దావీదు ఈ తప్పును సరిదిద్దుకున్నాడా? పాక్షికంగా సరిదిద్దుకున్నాడు. ఆయన ఆ ఆస్తిని వారిరువురికి పంచాడు. అప్పుడు మెఫీబోషెతుకు శరీరములో మరొక ముల్లు దిగినట్లుగా అనిపించే అవకాశం ఉంది. ఆయన తీవ్ర నిరాశకు గురయ్యాడా? అది అన్యాయమంటూ ఆయన దావీదు నిర్ణయానికి అసమ్మతిని తెలిపాడా? లేదు, ఆయన రాజు అభీష్టానికి వినయంగా తల ఒగ్గాడు. ఆయన మంచి విషయాలపై మనస్సు కేంద్రీకరించాడు. న్యాయంగా ఇశ్రాయేలుకు రాజుగా ఉండవలసిన వ్యక్తి సురక్షితంగా తిరిగి వచ్చినందుకు ఆనందించాడు. ఆయన అశక్తతనూ అపనిందను, నిరాశను సహించడం ద్వారా నిజంగా ఉత్తమమైన మాదిరిని ఉంచాడు.​—⁠2 సమూయేలు 19:​24-30.

నెహెమ్యా శ్రమలను అధిగమించాడు

13, 14. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలను పునర్నిర్మించడానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన సహించవలసి వచ్చిన ముళ్ళు ఏవి?

13 నెహెమ్యా సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో ప్రాకారములు లేని యెరూషలేము నగరానికి తిరిగి వచ్చినప్పుడు, సహించిన ఆలంకారిక ముళ్ళను గురించి ఆలోచించండి. ఆ నగరం నిజంగా ఏమాత్రం భద్రత లేనిదిగా ఉండటం చూశాడు, తిరిగి వచ్చిన యూదుల మధ్య సంస్థీకరణ లేదు, వారు నిరుత్సాహము చెంది ఉన్నారు, యెహోవా దృష్టిలో అపవిత్రులుగా ఉన్నారు. యెరూషలేము ప్రాకారములను పునర్నిర్మించడానికి అర్తహషస్త రాజు తనకు అధికారమిచ్చినప్పటికీ, తన నియామకం పొరుగు దేశాల అధిపతులకు అయిష్టంగా ఉందని నెహెమ్యా త్వరలోనే తెలుసుకున్నాడు. వారు “ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.”​—⁠నెహెమ్యా 2:⁠10.

14 విదేశీయులైన ఆ వ్యతిరేకులు నెహెమ్యా పనిని ఆపేందుకు తాము చేయగలిగినవన్నీ చేశారు. వాళ్ళ బెదిరింపులు, అబద్ధాలు, అపవాదులు, భయపెట్టడమూ, తనను నిరుత్సాహపరచడానికి వాళ్ళు వేగులవాళ్ళను పంపడంతో సహా అన్నీ, ఎంతోకాలంగా ఆయన శరీరంలో ఉన్న ముళ్ళలా ఉండివుండవచ్చు. ఆ శత్రువుల తంత్రాలకు ఆయన లొంగిపోయాడా? ఎంత మాత్రమూ లొంగలేదు! ఆయన తన దేవునిపై సంపూర్ణ నమ్మకాన్ని ఉంచాడే తప్ప అశక్తుడవుతున్నట్లు భావించలేదు. అలా, యెరూషలేము ప్రాకారాల నిర్మాణం చివరికి పూర్తయినప్పుడు, యెహోవా నెహెమ్యాకు ప్రేమపూర్వక మద్దతునిచ్చాడనేందుకు అది తిరుగులేని సాక్ష్యాన్నిచ్చింది.​—⁠నెహెమ్యా 4:​1-12; 6:​1-19.

15. యూదుల మధ్యవున్న ఏయే సమస్యలు నెహెమ్యాను తీవ్రంగా కలతపెట్టాయి?

15 అధికారిగా, నెహెమ్యా దేవుని ప్రజల మధ్య ఉన్న అనేక సమస్యలతో పోరాడవలసి వచ్చింది. ఆ కష్టాలు ముళ్ళలా ఆయనను బాగా బాధపెట్టాయి, ఎందుకంటే అవి ప్రజలకు యెహోవాతో ఉన్న సంబంధంపై ప్రభావాన్ని చూపించాయి. ధనవంతులు, చాలా ఎక్కువ వడ్డీలను తీసుకుంటున్నారు, పేదవాళ్ళైన వారి సహోదరులు ఆ అప్పులను తీర్చుకోవడానికి, పారసీక రాజుకు పన్నులను చెల్లించడానికి, తమ భూమిని వదులుకోవలసి వచ్చింది, చివరికి తమ పిల్లలను దాసులుగా అమ్ముకోవలసి వచ్చింది. (నెహెమ్యా 5:​1-10) చాలా మంది యూదులు విశ్రాంతిదినాన్ని అతిక్రమిస్తున్నారు, లేవీయులకు, ఆలయానికి మద్దతునివ్వడం లేదు. అంతేకాక కొందరు, “అష్డోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను” వివాహము చేసుకొన్నారు. అవన్నీ నెహెమ్యాను ఎంత బాధ పెట్టాయో! కానీ అవేవీ కూడా ఆయన పట్టువదిలేలా చేయలేకపోయాయి. దేవుని నీతియుక్తమైన నియమాలకు ఆసక్తిగా మద్దతునిచ్చేవానిగా ఆయన ఆ సవాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవలసివచ్చింది. నెహెమ్యాలాగే, మనం కూడా, ఇతరుల విశ్వాసఘాతుకమైన ప్రవర్తన యెహోవాకు మనం నమ్మకంగా చేస్తున్న సేవను ఆపివేసేలా చేయడానికి అనుమతించకుండా ఉందాం.​—⁠నెహెమ్యా 13:​10-13, 23-27.

ఇంకా అనేక మంది నమ్మకమైనవారు అధిగమించారు

16-18. కుటుంబ వైషమ్యం, ఇస్సాకును, రిబ్కాను, హన్నాను, దావీదును, హోషేయను ఎలా తీవ్రంగా బాధపెట్టింది?

16 ముళ్ళలాంటి బాధాకరమైన పరిస్థితులను అధిగమించిన ప్రజలను గురించిన ఇంకా అనేక ఉదాహరణలు బైబిలులో ఉన్నాయి. అలాంటి ముళ్లకు ఒక సాధారణ కారణం కుటుంబ సమస్యలు. ఏశావు యొక్క ఇద్దరు భార్యలు ఆయన తల్లిదండ్రులైన “ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.” వారి మూలంగా తన ప్రాణం విసిగిందని కూడా రిబ్కా అంది. (ఆదికాండము 26:​34, 35; 27:​46) హన్నా గురించి, ఆమె సవతీ ఆమె వైరి అయిన పెనిన్నా గురించి ఆలోచించండి. హన్నా గొడ్రాలైనందువల్ల, పెనిన్నా “ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.” బహుశా ఇంట్లో ఎవరూ లేనప్పుడు హన్నా తరచూ అలా వేధింపుకు గురైవుండవచ్చు. అలాగే వాళ్ళు కుటుంబ సమేతంగా పండుగకు షిలోహుకు వెళ్ళినప్పుడు, బహిరంగంగా కూడా, అంటే బంధువుల మధ్యా స్నేహితుల మధ్యా ఉన్నప్పుడు కూడా పెనిన్నా ఆమెకు కోపం పుట్టించివుంటుందనడంలో సందేహం లేదు. అది హన్నా శరీరంలోని ముల్లును ఇంకా లోతుకు గుచ్చుతున్నట్లుగా ఉండేది.​—⁠1 సమూయేలు 1:​4-7.

17 తన మామగారు రాజు అయిన సౌలుకున్న మహాచెడ్డ ఈర్ష్య వల్ల దావీదు సహించవలసి వచ్చినవాటిని గురించి ఆలోచించండి. దావీదు తన సొంత ప్రాణాన్ని కాపాడుకునేందుకు, ఏన్గెదీ అడవిలోని గుహల్లో నివసించవలసి వచ్చింది. అక్కడ ఆయన కొండల మధ్యనున్న నిట్రమైన ప్రమాదకరమైన ఇరుకు దారుల్లో గుండా పైకి ఎక్కి పోవలసి వచ్చేది. ఆయన సౌలుకు విరోధముగా ఏ తప్పిదమూ చేయలేదు కనుక, ఆ అన్యాయం ఆయనకు ఎంతో బాధను కోపాన్ని కలిగించివుండవచ్చు. దావీదు ఇంకా అనేక సంవత్సరాలు పలాయన జీవితాన్ని గడపవలసి వచ్చింది. దానికంతటికీ కారణం సౌలుకున్న ఈర్ష్యనే.​—⁠1 సమూయేలు 24:​14, 15; సామెతలు 27:⁠4.

18 హోషేయ ప్రవక్తను విపరీతంగా బాధపెట్టిన కుటుంబ వైషమ్యాన్ని ఊహించి చూడండి. ఆయన భార్య వ్యభిచారిణిగా మారింది. ఆమె అనైతిక ప్రవర్తన ఆయన హృదయంలోకి గుచ్చబడిన ముళ్ళలా ఉండి ఉండవచ్చు. ఆమె తన వ్యభిచారము మూలంగా ఇద్దరు అక్రమ సంతానానికి జన్మనిచ్చినప్పుడు ఆయన ఇంకా ఎంత బాధను అనుభవించివుండవచ్చు!​—⁠హోషేయ 1:​2-9.

19. మీకాయా ప్రవక్తను బాధించిన హింసలు ఏవి?

19 హింస శరీరములో మరొక ముల్లులాంటిది. ప్రవక్తయైన మీకాయా అనుభవమే తీసుకోండి. దుష్ట రాజు ఆహాబు తన చుట్టూ అబద్ధ ప్రవక్తలను పెట్టుకోవడాన్ని, ఆయన వారు చెప్పే అబద్ధపు సందేశాలను నమ్మడాన్ని చూడడం నీతిహృదయంగల మీకాయాను ఎంతో బాధపెట్టి ఉంటుంది. తర్వాత, ఆ ప్రవక్తలందరూ “అబద్ధమాడు ఆత్మ”తో మాట్లాడుతున్నారని మీకాయా ఆహాబుకు చెప్పినప్పుడు, ఆ అబద్ధ ప్రవక్తల నాయకుడు ఏమి చేశాడు? ‘మీకాయాను చెంపమీద కొట్టాడు’! రామోత్గిలాదును తిరిగి పొందాలని చేసే దండయాత్రలో ఓటమే ఎదురవుతుందని యెహోవా ఇచ్చిన హెచ్చరికకు ఆహాబు మరింత ఘోరంగా ప్రతిస్పందించాడు. మీకాయాను బందీగృహములో వేసి, అన్నము నీళ్ళు చాలా తక్కువగా ఇవ్వమని ఆహాబు ఆదేశించాడు. (1 రాజులు 22:​6, 9, 15-17, 23-28) యిర్మీయానూ, హత్యకు హింసలకు పాల్పడేవారు ఆయనతో అనుచితంగా వ్యవహరించిన తీరునూ కూడా గుర్తుచేసుకోండి.​—⁠యిర్మీయా 20:​1-9.

20. నయోమి సహించవలసి వచ్చిన ముళ్ళు ఏవి, ఆమెకు ఎలా ప్రతిఫలమివ్వబడింది?

20 బాధాకరమైన మరొక పరిస్థితి, ప్రియమైనవారిని కోల్పోవడం. అది శరీరములో ఒక ముల్లుగా ఉండగలదు. నయోమి, తన భర్తను, తన ఇద్దరు కుమారులను మృత్యువు మూలంగా కోల్పోయిన బాధాకరమైన నష్టాన్ని సహించవలసి వచ్చింది. ఆమె ఆ విషాద భావాలతోనే బేత్లెహేముకు తిరిగి వెళ్ళింది. తనను నయోమి అని పిలువక మారా అని పిలవమని ఆమె తన స్నేహితులకు చెప్పింది, మారా అనే పేరు ఆమె చేదు అనుభవాల తీవ్రతను ప్రతిబింబించింది. అయితే, చివరికి ఆమె ఓరిమికి ప్రతిఫలంగా యెహోవా ఆమెకు మనవడినిచ్చాడు. ఆ మనవడే తరువాత మెస్సీయ వంశపు పూర్వికుల్లో ఒకడయ్యాడు.​—⁠రూతు 1:​3-5, 19-21; 4:​13-17; మత్తయి 1:⁠1, 5.

21, 22. యోబును నష్టాలెలా ముంచెత్తాయి, ఆయనెలా ప్రతిస్పందించాడు?

21 ప్రియమైన తన పది మంది పిల్లలు అకస్మాత్తుగా దారుణంగా చనిపోయారన్న వార్తను, అలాగే తన పశుసంపద నాశనమైంది, తన సేవకులు చనిపోయారు అన్న వార్తను విని యోబు ఎలా నిశ్చేష్టుడై ఉంటాడో ఊహించుకోండి. ఆకస్మికంగా ఆయన ప్రపంచమంతా కుప్పకూలిపోతున్నట్లుగా ఉండింది! యోబు ఆ దెబ్బలతో కుమిలిపోతుండగా, సాతాను అతనిని బాధాకరమైన వ్యాధితో మొత్తాడు. ఆ వ్యాధి తనను చంపబోతోందని యోబు అనుకొనివుండవచ్చు. ఆయనకు నొప్పి భరించలేనంత తీవ్రంగా మారేసరికి, మరణమే తనకు విడుదలనివ్వగలదని అనుకున్నాడు.​—⁠యోబు 1:​13-20; 2:⁠7, 8.

22 ఇవన్నీ సరిపోనట్లు, దుఃఖంతో వ్యాకులతతో ఉన్న ఆయన భార్య, ఆయన దగ్గరకు వచ్చి, ‘దేవుని దూషించి మరణము కమ్ము’ అంది. దాంతో, నొప్పితో ఉన్న ఆయన శరీరంలో మరొక ముల్లు దిగినట్లయ్యింది! తర్వాత, యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చి, ఆయనను ఓదార్చే బదులు, పైకి సబబుగా అనిపించే మాటలతో ఆయన మీద దాడిచేశారు. ఆయన రహస్యంగా పాపాలు చేసి ఉంటాడని ఆరోపించారు, ఆ పాపాలే ఆయన కష్టాలకు కారణమని అన్నారు. వాళ్ళు తమ తప్పుడు వాదనలతో ఆయన శరీరంలోని ముళ్ళను ఇంకా లోతుగా గుచ్చినట్లయింది. తన జీవితంలో ఈ భయంకరమైన విషయాలు ఎందుకు జరుగుతున్నాయన్నది గానీ, తన ప్రాణం కాపాడబడుతుందని గానీ యోబుకు తెలియదన్న విషయం కూడా గుర్తుచేసుకోండి. అయినప్పటికీ, “ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.” (యోబు 1:​22; 2:​9, 10; 3:⁠3; 14:​13; 30:⁠17) ఆయన ఒకేసారి అనేక ముళ్లతో బాధపడవలసి వచ్చినప్పటికీ, యథార్థతతోకూడిన తన జీవితవిధానాన్ని వీడలేదు. ఎంత ప్రోత్సాహకరమది!

23. మనం చర్చించిన నమ్మకమైనవారు శరీరంలో వివిధ రకాల ముళ్ళను సహించగలగడానికి కారణం ఏమిటి?

23 అటువంటి వారి ఉదాహరణలు ఇంతటితో అయిపోలేదు. బైబిలులో ఇంకా చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి. ఈ నమ్మకమైన సేవకులందరూ తమకున్న ఆలంకారిక ముళ్ళతో పోరాడవలసి వచ్చింది. వాళ్ళు ఎంత విభిన్నమైన సమస్యలను ఎదుర్కొన్నారు! అయినప్పటికీ వాళ్ళందరిలో ఒక విషయం సామాన్యంగా కనిపిస్తుంది. వాళ్ళలో ఒక్కరు కూడా యెహోవాకు తాము చేసే సేవను విడిచిపెట్టలేదు. ఎంతో కలతపరచే ఆ పరీక్షలన్నీ వాళ్ళకు ఎదురైనప్పటికీ, యెహోవా వారికిచ్చిన బలంతో వారు సాతానును జయించారు. ఎలా? ఈ ప్రశ్నకు తర్వాతి ఆర్టికల్‌ జవాబిస్తుంది, మన శరీరంలో ముల్లులా ఉన్న దేనినైనా మనమెలా అధిగమించవచ్చో కూడా చూపిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 11 ఎంతో కృతజ్ఞతా వినయమూ గల మెఫీబోషెతు వ్యక్తిత్వానికి, ఆ విధంగా దురాశతో పన్నాగాలు పన్నడమనేది పూర్తి విరుద్ధం. తన తండ్రియైన యోనాతాను నమ్మకమైనవాడిగా జీవించాడని ఆయనకు బాగా తెలుసన్న విషయంలో సందేహం లేదు. తాను, రాజైన సౌలు కుమారుడైనప్పటికీ, ఇశ్రాయేలుపై రాజయ్యేందుకు యెహోవా దావీదునే ఎంపికచేసుకున్నాడన్న విషయాన్ని యోనాతాను వినయంగా అంగీకరించాడు. (1 సమూయేలు 20:​12-17) మెఫీబోషెతు యొక్క దైవభయంగల తండ్రీ, దావీదుకు నమ్మకమైన స్నేహితుడూ అయిన యోనాతాను జీవించివుంటే, రాజ్యాధికారాన్ని కాంక్షించమని చిన్నవాడైన తన కుమారునికి బోధించివుండేవాడు కాదు.

మీరెలా జవాబిస్తారు?

• మనకు ఎదురయ్యే సమస్యలను శరీరములో ముళ్లతో ఎందుకు పోల్చవచ్చు?

• మెఫీబోషెతు, నెహెమ్యా సహించవలసి వచ్చిన ముళ్ళలో కొన్ని ఏవి?

• శరీరములో వేర్వేరు ముళ్ళను సహించిన స్త్రీపురుషులను గురించి లేఖనాలు చెబుతున్న ఉదాహరణల్లో ప్రత్యేకించి ఎవరి ఉదాహరణ మిమ్మల్ని కదిలించినట్లుగా ఉంది, ఎందుకని?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రాలు]

మెఫీబోషెతు తన అశక్తతనూ అపనిందనూ నిరుత్సాహాన్నీ అధిగమించవలసి ఉండింది

[16వ పేజీలోని చిత్రం]

నెహెమ్యాకు వ్యతిరేకత ఎదురైనప్పటికీ పట్టువిడువకుండా ఉన్నాడు