కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వయంత్యాగ స్ఫూర్తితో సేవ చేయడం

స్వయంత్యాగ స్ఫూర్తితో సేవ చేయడం

జీవిత కథ

స్వయంత్యాగ స్ఫూర్తితో సేవ చేయడం

డాన్‌ రెండల్‌ చెప్పినది

మా అమ్మ 1927 లో చనిపోయింది, అప్పుడు నాకు కేవలం ఐదేళ్ళు. అయినా ఆమె విశ్వాసం నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. అదెలా సాధ్యమయ్యింది?

అది మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాకముందు. మా అమ్మ సైనికుడైన మా నాన్నగారిని పెండ్లిచేసుకునేటప్పటికి, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌లో నిష్ఠగల సభ్యురాలు. 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, తన ప్రసంగ వేదికను సైనికులను భర్తీ చేసుకునే వేదికగా ఉపయోగిస్తున్నందుకు మా అమ్మ తన చర్చి వికార్‌తో విబేధించింది. ఆ పాదిరీ ఏమని జవాబిచ్చాడు? “ఇంటికి వెళ్ళు, ఇలాంటి ప్రశ్నల గురించి అంతగా ఆలోచించవద్దు!” ఆ జవాబు మా అమ్మను సంతృప్తిపరచలేదు.

1917 లో యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో మా అమ్మ “ఫొటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” చూడ్డానికి వెళ్ళింది. తాను సత్యాన్ని కనుగొన్నానన్న నమ్మకం ఏర్పడడంతో ఆమె బైబిలు విద్యార్థులతో సహవసించడానికి వెంటనే తన చర్చిని విడిచిపెట్టింది, అప్పట్లో యెహోవాసాక్షులు బైబిలు విద్యార్థులని పిలువబడేవారు. ఆమె యోవిల్‌లోని ఒక సంఘంలో కూటాలకు హాజరైంది; యోవిల్‌ ఇంగ్లాండ్‌లోని సోమర్‌సెట్‌ మండలంలో వెస్ట్‌ కోకర్‌ అనే మా ఊరికి దగ్గర్లోని పట్టణం.

మా అమ్మ, తాను క్రొత్తగా కనుగొన్న విశ్వాసాన్ని గురించి తన ఇద్దరు అక్కలకు తన చెల్లికి చెప్పింది. యోవిల్‌ సంఘంలోని వృద్ధులైన సభ్యులు, మా అమ్మా తన చెల్లి మిల్లీ ఇద్దరూ కలిసి అత్యాసక్తితో ఆ గ్రామీణ ప్రాంతమంతా ఎలా సైకిళ్ళపై తిరిగారో, లేఖనాల్లో అధ్యయనాలు (ఆంగ్లం) అనే బైబిలు అధ్యయన సహాయకాలను ఎలా పంచిపెట్టారో నాకు చెప్పారు. అయితే విచారకరంగా తన జీవితంలోని చివరి 18 నెలలు మా అమ్మ టీబీ మూలంగా తన మంచానికే పరిమితం అయిపోయింది, అప్పట్లో టీబీకి మందు లేదు.

ఆచరణలో స్వయంత్యాగం

అప్పట్లో మాతోనే ఉంటున్న మిల్లీ ఆంటీ మా అమ్మ అస్వస్థతకు గురైనప్పుడు ఆమెకు సేవలు చేసింది, నన్నూ ఏడేళ్ళ మా అక్క జోన్‌ను కూడా చూసుకుంది. అమ్మ చనిపోయిన వెంటనే మిల్లీ ఆంటీ మమ్మల్ని పెంచుకుంటానని ముందుకు వచ్చింది. నాన్నగారు మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత తప్పిపోయిందనే ఆనందంతో, మిల్లీ ఆంటీ కూడా మాతోనే ఎప్పటికీ ఉండిపోయేందుకు వెంటనే ఒప్పుకున్నారు.

మేము అప్పటికే ఆంటీ మీద ప్రేమను పెంచుకున్నాము, ఆమె మాతోనే ఉండిపోతుందని తెలుసుకుని చాలా ఆనందించాము. కానీ ఆమె అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అమ్మ వేసిన పునాదిపై నిర్మించడం కొనసాగించాల్సిన బాధ్యత తనకు ఉందని, అంటే, నాకూ జోన్‌కూ బైబిలు సత్యాన్ని బోధించాల్సిన బాధ్యత ఉందని అనేక సంవత్సరాల తర్వాత మిల్లీ ఆంటీ చెప్పింది. మా నాన్నగారు ఆ పని ఎన్నటికీ చేయరని ఆమె గ్రహించింది, ఎందుకంటే ఆయనకు మతంపైన ఆసక్తి లేదు.

ఆ తర్వాత, మిల్లీ ఆంటీ మరొక వ్యక్తిగత నిర్ణయం తీసుకుందని కూడా మేం తెలుసుకున్నాము. మా పట్ల చక్కగా శ్రద్ధ వహించడానికి గాను ఆమె పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఎంత త్యాగం చేసింది! నేనూ జోన్‌ ఆమెకెంతో ఋణపడి ఉన్నాము. మిల్లీ ఆంటీ మాకు బోధించిన విషయాలూ ఆమె అద్భుతమైన మాదిరీ మాతోనే ఉండిపోయాయి.

నిర్ణయం తీసుకోవాల్సిన సమయం

నేనూ జోన్‌ మా గ్రామంలోని చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు చెందిన పాఠశాలలో చదువుకున్నాము, అక్కడ మిల్లీ ఆంటీ మా మత విద్య విషయంలో ప్రధానోపాధ్యాయురాలి ఎదుట స్థిరంగా నిలబడింది. పిల్లలందరూ చర్చిలోకి మార్చ్‌ చేస్తూ వెళ్తుండగా మేము ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, మత ఉపదేశం చేయడానికి వికార్‌ మా స్కూలుకి వచ్చినప్పుడు మేము వేరుగా కూర్చునేవాళ్ళం, అక్కడ కంఠతా పెట్టమని లేఖనాలు ఇచ్చేవారు. అలా చేయడం నాకు ఆ తర్వాత చాలా ఉపయోగపడింది, ఎందుకంటే ఆ లేఖనాలు నా మనసులో గట్టిగా ముద్రించుకుపోయాయి.

నాకు పద్నాలుగేళ్ళప్పుడు స్కూలు విడిచిపెట్టి స్థానిక ఛీజ్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌గా నాలుగేళ్ళ కోర్సు చేశాను. నేను పియానో కూడా నేర్చుకున్నాను; సంగీతం, బాల్‌రూం నృత్యం నాకిష్టమైన వ్యాపకాలయ్యాయి. నా హృదయంలో బైబిలు సత్యం వేళ్ళూనుకుని ఉన్నా నన్నింకా అది పురికొల్పలేదు. అటువంటి పరిస్థితిలో 1940 మార్చి నెలలో ఒకరోజు, దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్విండన్‌లో ఒక సమావేశానికి తనతోపాటు రమ్మని ఒక వృద్ధురాలైన సాక్షి నన్ను కోరింది. బ్రిటన్‌లో యెహోవాసాక్షుల స్థానిక అధ్యక్షుడిగా ఉన్న ఆల్బర్ట్‌ డి. ష్రోడర్‌ బహిరంగ ప్రసంగం ఇచ్చాడు. ఆ సమావేశం నా జీవితంలో మలుపురాయి అయ్యింది.

ఓ ప్రక్క రెండవ ప్రపంచ యుద్ధం చెలరేగుతోంది. మరి, నా జీవితంలో నేనసలు ఏమి చేస్తున్నాను? యోవిల్‌లోని రాజ్యమందిరానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, అక్కడ నేను హాజరైన మొదటి కూటములో వీధి సాక్ష్యం పరిచయం చేయబడింది. నా పరిజ్ఞానం పరిమితమైనదే అయినప్పటికీ ఆ కార్యకలాపంలో పాల్గొనడానికి ముందుకు వచ్చాను. అనేకమంది బూటకపు స్నేహితులు నన్ను వీధిలో చూసి ఆశ్చర్యపోయి నన్ను దాటిపోతూ గేలి చేశారు!

1940 జూన్‌లో నేను బ్రిస్టాల్‌ నగరంలో బాప్తిస్మం తీసుకున్నాను. ఒక నెలలోపల నేను క్రమ పయినీరుగా​—⁠పూర్తికాల సువార్తికుడిగా చేరాను. కొంతకాలానికి మా అక్క కూడా నీటి బాప్తిస్మం ద్వారా తన సమర్పణను సూచించినప్పుడు నేనెంత ఆనందించానో!

యుద్ధ సమయంలో పయినీరింగ్‌

యుద్ధం ప్రారంభమైన తర్వాతి సంవత్సరం నన్ను సైన్యంలో చేర్చుకుంటున్నట్లు మా ఇంటికి ఆజ్ఞాపత్రాలు వచ్చాయి. సైనికసేవకు మనస్సాక్షి అనుమతించని వ్యక్తిగా నన్ను నేను యోవిల్‌లో రిజిస్టరు చేసుకోవడంతో నేను బ్రిస్టాల్‌లోని ట్రిబ్యునల్‌ ముందు హాజరు కావలసివచ్చింది. అప్పటికే నేను గ్లాస్టర్‌షైర్‌లోని సిండర్‌ఫర్డ్‌లోను ఆ తర్వాత జాన్‌ విన్‌తో వేల్స్‌లోని హావర్‌ఫర్డ్‌వెస్ట్‌లోను కార్‌మార్‌తెన్‌లోను పయినీరు సేవ చేస్తున్నాను. * తర్వాత, కార్‌మార్‌తెన్‌లోని ఒక కోర్టు విచారణలో నాకు స్వాన్‌సీ జైలులో మూడు నెలల కారాగార శిక్ష వేశారు, అలాగే 1,725 రూపాయల అదనపు జరిమానా కూడా వేశారు, అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే. జరిమానా చెల్లించకపోవడంతో నాకు మరి మూడు నెలల జైలు శిక్షపడింది.

మూడవ విచారణలో, “‘కైసరువి కైసరుకి చెల్లించాలని’ బైబిలు చెబుతుందని నీకు తెలీదా?” అని నన్ను అడిగారు. “తెలుసు” అన్నాను. “నాకా విషయం తెలుసు, కానీ ఆ వచనాన్ని పూర్తి చెయ్యనివ్వండి, ‘దేవునివి దేవునికి చెల్లించుడి’ అని కూడా ఆ వచనంలో ఉంది, నేను చేస్తున్నది అదే” అని జవాబిచ్చాను. (మత్తయి 22:​21) కొన్ని వారాల తర్వాత నన్ను సైనిక బాధ్యతల నుండి విముక్తుడ్ని చేస్తున్నట్లు ఒక ఉత్తరం వచ్చింది.

1945 తొలిభాగంలో లండన్‌లోని బేతేలు కుటుంబంలో చేరడానికి ఆహ్వానాన్ని అందుకున్నాను. ఆ సంవత్సరం చలికాలంలో, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని సంస్థీకరించడంలో నాయకత్వం వహిస్తున్న నేథన్‌ హెచ్‌. నార్‌, ఆయన కార్యదర్శి మిల్టన్‌ జి. హెన్షెల్‌ లండన్‌ను సందర్శించారు. బ్రిటన్‌ నుండి ఎనిమిది మంది యౌవన సహోదరులు మిషనరీ శిక్షణ పొందడం కోసం వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క ఎనిమిదవ తరగతిలో చేర్చుకోబడ్డారు, వారిలో నేనూ ఉన్నాను.

మిషనరీ నియామకాలు

1946, మే 23న మేము కార్న్‌వాల్‌లోని ఫావుయీ అనే చిన్న ఓడరేవు నుండి యుద్ధకాలానికి చెందిన ఒక లిబర్టీ నౌకలో పయనమయ్యాము. హార్బర్‌మాస్టర్‌ అయిన క్యాప్టెన్‌ కాలిన్స్‌ యెహోవాసాక్షే, మేము రేవునుండి బయల్దేరుతుండగా ఆయన సైరన్‌ను మోగించాడు. ఇంగ్లాండు భూభాగం కనుమరుగవుతుండగా సహజంగానే మా అందరిలో అనేక భావాలు కలిగాయి. అట్లాంటిక్‌ సముద్రాన్ని దాటడం చాలా కష్టతరంగా ఉంది, కానీ 13 రోజుల తర్వాత మేము అమెరికాలో క్షేమంగా అడుగుపెట్టాము.

ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో 1946, ఆగస్టు 4 నుండి 11 వరకు ఆనందభరిత దేశాల దైవపరిపాలనా సమావేశం అనే ఎనిమిది రోజుల అంతర్జాతీయ సమావేశానికి హాజరుకావడం ఒక చిరస్మరణీయమైన అనుభవం. ఆ సమావేశానికి ఎనభై వేలమంది హాజరయ్యారు, ఆ సంఖ్యలో 32 దేశాలనుండి వచ్చిన 302 మంది ఉన్నారు. సమావేశంలో తేజరిల్లు! * (ఆంగ్లం) పత్రిక, అలాగే “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఆంగ్లం) అనే బైబిలు అధ్యయన సహాయక పుస్తకం విడుదల చేయబడ్డాయి, ప్రేక్షకులు అత్యానందభరితులయ్యారు.

మేము 1947 లో గిలియడ్‌ నుండి పట్టభద్రులమయ్యాము, బిల్‌ కాప్సన్‌తోపాటు నన్ను ఈజిప్టుకి నియమించారు. కానీ వెళ్ళే ముందు నాకు బ్రూక్లిన్‌ బేతేలులోని రిచర్డ్‌ ఏబ్రాహామ్‌సన్‌ నుండి ఆఫీసు వ్యవహారాల్లో మంచి శిక్షణ లభించింది. మేము అలెగ్జాండ్రియాలో దిగాము, నేనైతే మధ్యప్రాచ్య జీవనశైలికి చాలా త్వరగా అలవాటుపడిపోయాను. అయితే అరబిక్‌ నేర్చుకోవడం మాత్రం సవాలుగా ఉండింది, నేను నాలుగు భాషల్లో సాక్ష్యపు కార్డులను ఉపయోగించాల్సి వచ్చింది.

బిల్‌ కాప్సన్‌ అక్కడ ఏడు సంవత్సరాలు ఉన్నాడు, కానీ నేను మొదటి సంవత్సరం తర్వాత నా వీసాను రిన్యూ చేయించుకోలేకపోయాను, అందుకని ఆ దేశం విడిచిపెట్టాల్సివచ్చింది. ఆ సంవత్సరపు మిషనరీ సేవను జ్ఞాపకం చేసుకుని దాన్ని నా జీవితంలో అత్యంత ఫలభరితమైన సంవత్సరంగా తలస్తాను. ప్రతి వారం 20 కంటే ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహించే ఆధిక్యత నాకు లభించేది, అప్పట్లో సత్యం నేర్చుకున్న కొందరు ఇప్పటికీ క్రియాశీలంగా యెహోవాను స్తుతిస్తున్నారు. ఈజిప్టు నుండి నన్ను సైప్రస్‌కు పంపించారు.

సైప్రస్‌, ఇజ్రాయిల్‌

నేనొక క్రొత్త భాష నేర్చుకోవడం ప్రారంభించాను, అదే గ్రీక్‌, అంతే కాకుండా స్థానిక మాండలికంతో పరిచయం పెంచుకోనారంభించాను. కొంతకాలం తర్వాత ఆంథోనీ సైడరిస్‌ను గ్రీస్‌కు వెళ్ళమని చెప్పిన తర్వాత నన్ను సైప్రస్‌లోని సేవకు పైవిచారణకర్తగా నియమించారు. అప్పట్లో సైప్రస్‌ బ్రాంచి కార్యాలయం ఇజ్రాయిల్‌ పనులను కూడా చూసుకునేది, ఇతర సహోదరులతోపాటు ఇజ్రాయిల్‌లోని సహోదరులను అప్పుడప్పుడు సందర్శించే అవకాశం నాకు లభించింది.

నేను మొదటిసారి ఇజ్రాయిల్‌కి వెళ్ళినప్పుడు, హైఫాలోని ఒక చిన్న రెస్టారెంట్లో మేము చిన్న సమావేశం జరుపుకున్నాము, 50 నుండి 60 మంది దాకా హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందినవారిని వేర్వేరుగా కూర్చోబెట్టిన తర్వాత, మేము సమావేశ కార్యక్రమాన్ని ఆరు భాషల్లో అందించాము! మరో సందర్భంలో నేను, యెహోవాసాక్షులు తయారు చేసిన ఒక ఫిల్మ్‌ను జెరూసలేమ్‌లో చూపించగలిగాను, ఒక బహిరంగ ప్రసంగం కూడా ఇచ్చాను, దాని గురించి ఒక ఆంగ్ల వార్తాపత్రిక మంచి నివేదికను ప్రచురించింది.

అప్పట్లో సైప్రస్‌లో 100 మంది సాక్షులున్నారు, వారు తమ విశ్వాసం నిమిత్తం గట్టి పోరాటాన్ని పోరాడవలసి వచ్చింది. గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చి నడిపింపులో అల్లరిమూకలు మన సమావేశాలకు అంతరాయం కలిగించేవారు, గ్రామీణ ప్రాంతాల్లో సాక్ష్యం ఇస్తుండగా రాళ్ళచే కొట్టబడడం నాకైతే క్రొత్త అనుభవమే. కన్నుమూసి తెరిచేంతలో పరిసరాల్లో కనబడకుండా పారిపోవడం ఎలాగో నేను నేర్చుకోవలసివచ్చింది! అలాంటి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నందున ఆ ద్వీపానికి ఇంకా కొంతమంది మిషనరీలు రావడంవల్ల మా విశ్వాసం బలపడింది. జోన్‌ హల్లీ, బెరిల్‌ హేవుడ్‌లతోపాటు డెన్నిస్‌ మాథ్యూస్‌ మేవిస్‌ మాథ్యూస్‌లు నన్ను ఫామాగుస్టాలో కలిశారు. టామ్‌ గూల్డెన్‌, మేరీ గూల్డెన్‌, లండన్‌లో పుట్టిన సైప్రస్‌వాసి అయిన నీనా కాన్‌స్టాంటీ అనే ముగ్గురు లీమాసోల్‌కు వెళ్ళారు. అదే సమయంలో బిల్‌ కాప్సన్‌ కూడా సైప్రస్‌కు బదిలీ చేయబడ్డాడు, తర్వాత బెర్ట్‌ వైసీ, బెరిల్‌ వైసీలు ఆయనతో కలిశారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా

1957వ సంవత్సరాంతానికి నేను అస్వస్థతకు గురయ్యాను, నా మిషనరీ నియామకంలో కొనసాగలేకపోయాను. నేను కోలుకోవడానికని ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళాలని ఎంతో విచారంతో నిర్ణయించుకున్నాను, ఇంగ్లాండులో నేను 1960 వరకు పయినీరింగ్‌ కొనసాగించాను. మా అక్క బావలు నన్ను దయతో చేరదీశారు, కానీ పరిస్థితులు మారాయి. జోన్‌ పరిస్థితులు కష్టతరంగా మారాయి. నేను లేని 17 సంవత్సరాల్లో తన భర్తను, యౌవనస్థురాలైన తన కూతుర్ని చూసుకోవడంతోపాటు, ఆమె మా నాన్నగారిని మిల్లీ ఆంటీని ప్రేమపూర్వకంగా చూసుకుంది, అప్పటికే వాళ్ళు చాలా వృద్ధులయ్యారు, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగాలేదు. మా ఆంటీ చూపించిన స్వయంత్యాగ స్ఫూర్తిని అనుకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం అయ్యింది, అందుకని మా నాన్నగారు మిల్లీ ఆంటీ ఇద్దరూ చనిపోయేంతవరకూ నేను అక్కతోటే ఉన్నాను.

ఇంగ్లాండులో స్థిరపడిపోవడం సులువుగానే ఉండేది, కానీ కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత నేను నా నియామకానికి తిరిగి వెళ్ళాల్సిన బాధ్యత ఉందని భావించాను. యెహోవా సంస్థ నాకు శిక్షణనిచ్చేందుకు ఎంతో డబ్బు వెచ్చించలేదా? అందుకని నేను 1972 లో మళ్ళీ సైప్రస్‌లో పయినీరింగ్‌ చేయడానికి నా అంతట నేనే తిరిగి వెళ్ళాను.

నేథన్‌ హెచ్‌. నార్‌ ఆ తర్వాతి సంవత్సరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. నేను తిరిగి వచ్చానని ఆయన తెలుసుకుని ఆ ద్వీపానికంతటికీ నన్ను ప్రాంతీయ పైవిచారణకర్తగా నియమించాలని సిఫారసు చేశాడు, ఆ ఆధిక్యతలో నేను నాలుగు సంవత్సరాలు సేవచేశాను. అయితే చాలామట్టుకు గ్రీకు భాష మాట్లాడాల్సివుంటుంది గనుక ఆ నియామకం నాకు చాలా భయాన్ని కలిగించింది.

శ్రమల కాలాలు

సైప్రస్‌కు చెందిన, గ్రీకు మాట్లాడే సాక్షి పాల్‌ ఆండ్రేయూతో ఉత్తర తీరంలోని కిరీన్యాకు తూర్పున ఉన్న కారాకూమీ అనే గ్రామంలో ఒక ఇంట్లో నేను ఉన్నాను. కిరీన్యా కొండలకు దక్షిణాన ఉన్న నికోసియాలో సైప్రస్‌ బ్రాంచి కార్యాలయం ఉంది. 1974 జూలై నెల తొలిభాగంలో నేను నికోసియాలో ఉండగా దేశాధ్యక్షుడైన మకారియోస్‌ను పదవీచ్యుతుడ్ని చేయడానికి ప్రభుత్వాన్ని కూలద్రోసే ప్రయత్నం జరిగింది, ఆయన భవనం అగ్నికి ఆహుతికావడం నేను కళ్ళారా చూశాను. ప్రయాణించడం సురక్షితమేనని నిర్ధారించుకున్న తర్వాత నేను వెంటనే కిరీన్యాకు వెళ్ళిపోయాను, అక్కడ మేము ప్రాంతీయ సమావేశానికి సిద్ధపడుతున్నాము. రెండు రోజుల తర్వాత రేవుమీద మొదటి బాంబు పడడం విన్నాను, దాడి నిమిత్తం టర్కీ నుండి బలగాలను తీసుకువస్తున్న హెలికాప్టర్లు ఆకాశాన్ని కమ్మేశాయి.

నేను బ్రిటీష్‌ పౌరుణ్ణి గనుక టర్కీ సైనికులు నన్ను నికోసియా శివార్లకు తీసుకువెళ్ళారు, అక్కడ ఐక్యరాజ్య సమితి అధికారులు నన్ను ప్రశ్నించి, బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించారు. ఇక ఆ తర్వాత నేను చిందరవందరగా పడివున్న టెలిఫోన్‌ తీగలను, కరెంటు తీగలను దాటుకుంటూ అధికార రహిత భూమికి అవతలివైపున ఉన్న నిర్జనమైన గృహాలకు చేరుకోవాలన్న గమ్యం నాకు భీతిగొల్పేదిగా కనిపించింది. యెహోవా దేవునితో నా సంభాషణా మార్గానికి అంతరాయం ఏర్పరచడానికి ఇతరులకు సాధ్యం అవ్వనందుకు నేనెంత ఆనందించానో! నా జీవితంలోని అత్యంత భయంకరమైన అనుభవాల్లో నా ప్రార్థనలు నన్ను బలపరిచాయి.

నేను నా వస్తువులన్నీ పోగొట్టుకున్నాను, కానీ బ్రాంచి కార్యాలయంలో భద్రత లభించినందుకు ఆనందించాను. అయితే ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగలేదు. కొన్ని రోజులకే, దండెత్తివచ్చిన బలగాలు ద్వీపంలోని ఉత్తరపు మూడవ భాగాన్ని అదుపులోకి తీసుకున్నాయి. అందరూ బేతేలును విడిచిపెట్టేయాల్సివచ్చింది, మేమందరం లీమాసోల్‌కు తరలిపోయాము. ఈ కల్లోల పరిస్థితి మూలంగా ప్రభావితమైన 300 మంది సహోదరులపట్ల శ్రద్ధ వహించేందుకు ఒక కమిటీ ఏర్పడినప్పుడు, అందులో నేనొక సభ్యుడిగా పనిచేస్తూ ఆనందించాను, వారిలో చాలామంది తమ గృహాలను కోల్పోయారు.

నియామకాల్లో మరిన్ని మార్పులు

1981 జనవరిలో, గ్రీసుకు బదిలీ అవ్వమని ఏథెన్స్‌లోని బేతేలు కుటుంబంలో చేరమని పరిపాలక సభ నన్ను కోరింది. కానీ మళ్ళీ ఆ సంవత్సరాంతానికి నేను తిరిగి సైప్రస్‌కి వచ్చాను, అక్కడ నేను బ్రాంచ్‌ కమిటీ కో-ఆర్డినేటర్‌గా నియమించబడ్డాను. లండన్‌ నుండి పంపించబడిన సైప్రస్‌ వాసులైన ఆంథ్రీయాస్‌ కోండోయోర్గీస్‌ ఆయన భార్య మారోల వలన నాకు ‘ఆదరణ కలిగింది.’​—⁠కొలొస్సయులు 4:⁠11.

1984 లో థియోడోర్‌ జారజ్‌ చేసిన జోన్‌ సందర్శనం చివర్లో నాకు పరిపాలక సభ నుండి ఒక ఉత్తరం లభించింది, అందులో కేవలం ఇదే ఉంది: “బ్రదర్‌ జారజ్‌ సందర్శించడం అయిపోయిన తర్వాత, ఆయనతోపాటు మీరు గ్రీస్‌కు వెళ్ళాలని మేము కోరుతున్నాము.” నాకెలాంటి కారణమూ చెప్పబడలేదు, కానీ నేను గ్రీస్‌కు చేరుకునే సరికి అక్కడి బ్రాంచ్‌ కమిటీకి మరొక ఉత్తరం చదవబడింది, అందులో నన్ను బ్రాంచ్‌ కమిటీ కో-ఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు ఉంది.

గ్రీసులో అప్పటికే మతభ్రష్టులు ప్రారంభమయ్యారు. చట్ట విరుద్ధంగా మతమార్పిడి చేస్తున్నామన్న ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ప్రతిదినం యెహోవా ప్రజలు అరెస్టయి, కోర్టులకీడ్వబడుతున్నారు. భక్తినిష్ఠల పరీక్షలకు తట్టుకుని నిలద్రొక్కుకున్న సహోదర సహోదరీలతో పరిచయం పెంచుకోవడం ఎంతటి ఆధిక్యత! వారిలో కొందరి కేసులు యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఎదుట విచారించబడ్డాయి, అక్కడ లభించిన అద్భుతమైన ఫలితాలు గ్రీస్‌లోని ప్రకటనా పనిపై చక్కని ప్రభావాన్ని చూపించాయి. *

నేను గ్రీసులో సేవచేస్తుండగా ఏథెన్స్‌లో, థెస్సలొనీకలో, రోడ్స్‌ మరియు క్రీట్‌ ద్వీపాల్లో జరిగిన చిరస్మరణీయమైన సమావేశాలకు హాజరయ్యాను. నాలుగు సంతోషదాయకమైన, ఫలదాయకమైన సంవత్సరాలవి, కానీ మరో మార్పు రాబోతోంది​—⁠1988 లో తిరిగి సైప్రస్‌కు వెళ్ళాల్సి వచ్చింది.

సైప్రస్‌కు, మళ్ళీ గ్రీస్‌కు

నేను సైప్రస్‌లో లేని సమయంలో సహోదరులు నికోసియాకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని నీసూలో క్రొత్త బ్రాంచి సముదాయాలను సంపాదించారు. యెహోవాసాక్షుల బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయాల నుండి వచ్చిన క్యారీ బార్బర్‌ ప్రతిష్ఠాపన ప్రసంగం ఇచ్చాడు. ఆ ద్వీపంలో పరిస్థితులు ఇప్పుడు కాస్త నిమ్మళించాయి, నేను అక్కడికి తిరిగివెళ్ళడానికి చాలా ఆనందించాను, కానీ అక్కడ పరిస్థితులు మళ్ళీ త్వరలోనే మారనైవున్నాయి.

గ్రీస్‌లోని ఏథెన్స్‌కు ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక క్రొత్త బేతేలు గృహాన్ని నిర్మించడానికి వేసిన ప్లానులను పరిపాలక సభ ఆమోదించింది. నేను ఇంగ్లీషు గ్రీకు భాషలు మాట్లాడగలను గనుక క్రొత్త నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సేవకుల కుటుంబంలో దుబాసీగా పనిచేయడానికి తిరిగి రమ్మని 1990 లో నాకు ఆహ్వానం అందింది. వేసవి నెలల్లో ఉదయం ఆరు గంటలకల్లా నిర్మాణ స్థలంలో ఉండడం ద్వారా పొందిన ఆనందం నాకింకా జ్ఞాపకం ఉంది, నిర్మాణకుల కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వందలాది గ్రీకు సహోదర సహోదరీలను ఆహ్వానించడం అద్భుతమైన అనుభవం! వారి ఆనందం, వారి ఆసక్తి, ఆ స్మృతులు ఎల్లప్పుడు నాతో ఉండిపోతాయి.

గ్రీక్‌ ఆర్థడాక్స్‌ ప్రీస్టులు, వారి మద్దతుదారులు నిర్మాణ స్థలంలోకి ప్రవేశించి పనికి ఆటంకం కలిగించాలని ప్రయత్నించారు, కానీ యెహోవా మా ప్రార్థనల్ని విన్నాడు, మేము కాపాడబడ్డాము. 1991, ఏప్రిల్‌ 13న క్రొత్త బేతేలు గృహం ప్రతిష్ఠాపించబడినప్పుడు నేను అక్కడే ఉన్నాను.

నా ప్రియమైన అక్కకు మద్దతు

ఆ తర్వాతి సంవత్సరం నేను సెలవు మీద ఇంగ్లాండు వెళ్ళి అక్కడ మా అక్క బావల వద్ద ఉన్నాను. విచారకరంగా, నేనక్కడ ఉన్నప్పుడు బావగారికి రెండుసార్లు గుండెపోటు వచ్చి చనిపోయారు. నా మిషనరీ సేవలో జోన్‌ నాకు ఎంతో ఔదార్యంతో సహాయహస్తాన్ని అందించింది. ఆమె వ్రాసిన ప్రోత్సాహకరమైన ఉత్తరం అందకుండా ఒక్క వారం కూడా గడవలేదు. ఏ మిషనరీకైనా అలాంటి ఉత్తరాలు ఆశీర్వాదమే! ఇప్పుడామె వితంతువు, ఆరోగ్యం క్షీణిస్తోంది, సహాయం అవసరం. నేనేమి చేయాలి?

జోన్‌ కూతురు థెల్మా, ఆమె భర్త తమ సంఘంలోని మరో విశ్వసనీయురాలైన విధవరాలిని చూసుకుంటున్నారు. ఆమె మా బంధువే, తీవ్రమైన అనారోగ్యంతో ఉంది. అందుకని ఎంతో ప్రార్థించిన తర్వాత నేను జోన్‌ను చూసుకోవడానికి ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. సర్దుబాట్లు చేసుకోవడం అంత సుళువు కాలేదు, కానీ యోవిల్‌లోని రెండు సంఘాల్లో ఒకటైన పెన్‌ మిల్‌లో సంఘ పెద్దగా సేవచేసే ఆధిక్యత నాకు లభించింది.

విదేశాల్లో నేను కలిసి పనిచేసిన సహోదరులు నాకు క్రమంగా ఫోనులు చేస్తూ ఉత్తరాలు వ్రాస్తూవున్నారు, అందుకు వారికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. నేనెప్పుడైనా గ్రీసుకి గాని సైప్రస్‌కి గాని రావాలన్న కోరికను వ్యక్తం చేస్తే చాలు, వెంటనే టిక్కెట్లు వస్తాయని నాకు తెలుసు. కానీ నాకిప్పుడు 80 ఏండ్లు, నా కంటిచూపుగాని నా ఆరోగ్యం గాని మునుపున్నంత బాగా లేవు. మునుపటిలా చురుకుగా ఉండలేకపోవడం నిస్పృహను కలిగిస్తుంది, కానీ నేను బేతేలు సేవలో గడిపిన సంవత్సరాల్లో అలవర్చుకున్న అలవాట్లు నేడు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు, నేను ఉదయం టిఫిన్‌ చేయడానికి ముందు ప్రతిరోజు దినవచనాన్ని చదువుతాను. ఇతరులతో సర్దుకుపోవడం, వారిని ప్రేమించడం నేర్చుకున్నాను​—⁠అదే విజయవంతమైన మిషనరీ సేవకు కీలకం.

యెహోవాను స్తుతిస్తూ గడిపిన దాదాపు గత 60 అద్భుతమైన సంవత్సరాలను వెనుదిరిగి చూసుకుంటూ, పూర్తికాల పరిచర్య అత్యంత గొప్ప కాపుదలగా ఉంటుందని, అతి శ్రేష్ఠమైన విద్యను అందిస్తుందని గుర్తుచేసుకుంటుంటాను. దావీదు యెహోవాతో పలికిన ఈ మాటలను, నేను హృదయపూర్వకంగా నా మాటలుగా పలుకుతాను: “నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు.”​—⁠కీర్తన 59:⁠16.

[అధస్సూచీలు]

^ పేరా 18 “నా హృదయం కృతజ్ఞతాభావంతో పొంగిపోతోంది” అనే జాన్‌ విన్‌ జీవిత కథ కావలికోట, సెప్టెంబరు 1, 1997, 25-8 పేజీల్లో వచ్చింది.

^ పేరా 23 మునుపు కన్సొలేషన్‌ అని పిలువబడింది.

^ పేరా 41 కావలికోట డిసెంబరు 1, 1998, 20-1 పేజీలు; సెప్టెంబరు 1, 1993, 27-31 పేజీలు; తేజరిల్లు! జనవరి 8, 1998, (ఆంగ్లం) 21-2 పేజీలు; మరియు ఏప్రిల్‌ 8, 1997, 11-13 పేజీలు చూడండి.

[24వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

గ్రీస్‌

ఏథెన్స్‌

సైప్రస్‌

నికోసియా

కిరీన్యా

ఫామాగుస్టా

లిమాసోల్‌

[21వ పేజీలోని చిత్రం]

1915 లో మా అమ్మ

[22వ పేజీలోని చిత్రం]

బ్రూక్లిన్‌ బేతేలు గృహం పైకప్పు మీద 1946 లో, నేను (ఎడమనుండి నాలుగవవాణ్ణి), గిలియడ్‌ ఎనిమిదవ తరగతికి చెందిన ఇతర సహోదరులు

[23వ పేజీలోని చిత్రం]

నేను మొదటిసారి ఇంగ్లాండుకు వచ్చినప్పుడు మిల్లీ ఆంటీతో