వాల్డెన్సులు చర్చివిరోధం నుండి ప్రొటెస్టెంటిజమ్ వైపుకు వారి పయనం
వాల్డెన్సులు చర్చివిరోధం నుండి ప్రొటెస్టెంటిజమ్ వైపుకు వారి పయనం
అది దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న ప్రవాన్స్‌లోని అందమైన లూయీబేరన్ ప్రాంతం, 1545వ సంవత్సరం. మతసహనం కొరవడడం మూలంగా రేకెత్తిన తీవ్రమైన దుష్కార్యాన్ని నిర్వర్తించడానికి సైన్యం సమావేశమైవుంది. ఆ తర్వాత వారం రోజులపాటు రక్తపుటేర్లు ప్రవహించాయి.
గ్రామాలకు గ్రామాలే నేలమట్టమయ్యాయి, వాటి నివాసుల్లో కొందరు ఖైదు చేయబడ్డారు మరికొందరు హతులయ్యారు. కఠోరులైన సైనికులు రేకెత్తించిన క్రూరమైన అత్యాచారాల మూలంగా పరిణమించిన మారణకాండను చూసి యూరప్ గజగజ వణికింది. దాదాపు 2,700 మంది మృత్యు కోరలకు బలయ్యారు, 600 మంది ఓడల్లో తెడ్లువేసే బానిసలుగా మార్చబడ్డారు, స్త్రీలు పిల్లలు అనుభవించిన బాధల గురించైతే ఇక చెప్పనక్కరలేదు. ఈ రక్తపాతాన్ని జరిగించిన సైన్యాధ్యక్షుడ్ని ఫ్రెంచి రాజు, పోప్ ఎంతగానో మెచ్చుకున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన క్యాథలిక్ రాజు ఫ్రాన్సిస్ I, ప్రొటెస్టెంటిజమ్ వ్యాప్తిచెందుతున్నందుకు ఆందోళనచెంది తన రాజ్యంలోని చర్చివిరోధులని ముద్రపడినవారిని గురించి వాకబు చేశాడు, అప్పటికే జర్మనీని సంస్కరణోద్యమం రెండుగా విభాగించింది. ఫ్రాన్స్‌లోని చర్చివిరోధులను ఒక్కొక్కరిని పట్టుకోవడానికి బదులుగా ప్రవాన్స్‌లోని అధికారులు, మత అసమ్మతిదారులు ఉన్నారని గ్రామాలకు గ్రామాలనే చుట్టుముట్టారు. ఈ చర్చివిరోధాన్ని తుడిచిపెట్టేందుకు ఒక శాసనం జారీచేయబడి చివరికి అది 1545 లో మారణకాండకు దారితీసింది.
ఈ చర్చివిరోధులు ఎవరు? వీరు హింసాత్మకమైన మత అసహనానికి ఎందుకు గురయ్యారు?
సిరి సంపదల నుండి కటిక పేదరికానికి
ఈ నరమేధంలో మరణించినవారు 12వ శతాబ్దానికి చెందిన ఒక మత ఉద్యమానికి చెందినవారు, వీరు యూరప్‌లోని చాలా భాగంలో విస్తరించివున్నారు. ఈ మతం వ్యాప్తిచెంది కొన్ని శతాబ్దాల వరకు మనుగడ సాగించిన విధానం మత అసమ్మతిదారుల చరిత్రలో దీన్ని విశేషమైనదిగా చేసింది. ఈ మత ఉద్యమం దాదాపు 1170 లో ప్రారంభమైందని అత్యధిక చరిత్రకారులు సమ్మతిస్తారు. ఫ్రెంచి నగరమైన లైయన్స్‌లో వాడే అనే పేరుగల ఒక ధనిక వ్యాపారికి దేవుణ్ణి ప్రీతిపరచడం ఎలాగో తెలుసుకోవాలని తీవ్రమైన ఆసక్తి ఏర్పడింది. తన ఆస్తిని అమ్మి బీదలకిమ్మని ఒక ధనికుణ్ణి యేసుక్రీస్తు ఉద్బోధించడం బహుశ వాడేను ప్రేరేపించినందున ఈయన తన కుటుంబానికి ఆర్థిక మద్దతును ఏర్పాటు చేసి తన ఆస్తిని త్యజించి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. మత్తయి 19:16-22) ఈయనకు త్వరలోనే కొందరు అనుచరులు ఏర్పడ్డారు, వారు ఆ తర్వాత వాల్డెన్సులు అని పిలువబడ్డారు. *
(వాడే జీవితంలో బీదరికం, ప్రకటనా పని, బైబిలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పాదిరీల సిరిసంపదలకు అసమ్మతి తెలపడం ఈయనతోనే ప్రారంభం కాదు. అప్పటికి కొంతకాలంగా చర్చిలోని అధికార దుర్వినియోగాలపై దురాచారాలపై పాదిరీల అసమ్మతిదారులు అనేకులు ధ్వజమెత్తారు. కానీ వాడే సామాన్యుడు, ఆయన అనుచరుల్లో అత్యధికులు కూడా సామాన్య ప్రజలే. బైబిలు ప్రాంతీయ భాషలో అంటే ప్రజలందరికీ తెలిసిన భాషలో ఉండాలని ఆయనెందుకు భావించాడో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. చర్చియొక్క లాటిన్ భాషలోని బైబిలు కేవలం పాదిరీలకు మాత్రమే అందుబాటులో ఉండేది, అందుకని సువార్తలను బైబిలులోని మరితర పుస్తకాలను ఫ్రాంకో-ప్రావెన్‌కాల్‌లోకి అంటే తూర్పు మరియు మధ్య ఫ్రాన్స్‌లోని సామాన్య ప్రజలు అర్థం చేసుకొనే భాషలోకి అనువదించబడాలని వాడే ఆదేశించాడు. * ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా లైయన్స్‌లోని బీదలు తమ సందేశాన్ని బహిరంగంగా ప్రకటించడం ప్రారంభించారు. (మత్తయి 28:19, 20) బహిరంగ ప్రకటనా పనిని వాల్డెన్సులు నొక్కి చెప్పడం వారి పట్ల చర్చి వైఖరిలో ఒక నిర్ణాయక విషయమైందని చరిత్రకారుడైన గబ్రీయెల్ ఆడీస్యో వివరిస్తున్నాడు.
క్యాథలిక్కుల నుండి చర్చివిరోధులుగా
ఆ రోజుల్లో ప్రకటనా పని పాదిరీలకే పరిమితమై ఉండేది, ప్రకటించే అధికారాన్ని ఇచ్చే హక్కు చర్చికే ఉండేది. వాల్డెన్సులు అజ్ఞానులని నిరక్షరాస్యులని పాదిరీలు పరిగణించారు, కానీ 1179 లో వాడే తన ప్రకటనా పనికి అధికారం ఇమ్మని పోప్ అలెగ్జాండర్ IIIను కోరాడు. అనుమతి ఇచ్చారు—అయితే స్థానిక ప్రీస్టులు ఆమోదిస్తేనే అన్న షరతుపై ఇచ్చారు. “ఇది దాదాపు అనుమతిని పూర్తిగా నిరాకరించడంతో సమానం” అని చరిత్రకారుడైన మాల్కమ్ లాంబెర్ట్ అంటున్నాడు. నిజానికి, లైయన్స్‌లోని ప్రధాన బిషప్పు ఝాన్ బెల్మెన్, సామాన్యులు ప్రకటించడాన్ని లాంఛనప్రాయంగా నిషేధించాడు. “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా” అని అపొస్తలుల కార్యములు 5:29ని ఎత్తి చెబుతూ వాడే ప్రతిస్పందించాడు. నిషేధాన్ని ఖాతరు చేయకపోవడంతో వాడే 1184 లో చర్చి నుండి బహిష్కరించబడ్డాడు.
వాల్డెన్సులు లైయన్స్ ప్రాంతంలో నిషేధించబడ్డారు, నగరం వెలుపలికి తరిమివేయబడ్డారు. కానీ, నిషేధాజ్ఞలు మొదట్లో అంత ఖచ్చితంగా అమలుపరచబడలేదని అనిపిస్తోంది. నిజాయితీ గల జీవితాలు గడుపుతున్నందుకు చాలామంది సామాన్యులు వాల్డెన్సులను కొనియాడారు, చివరికి బిషప్పులు కూడా వారితో మాట్లాడడం కొనసాగించారు.
యూవన్ కామెరన్ అనే చరిత్రకారుడి ప్రకారం, వాల్డెన్స్ ప్రచారకులు “రోమన్ చర్చిని నిష్కారణంగా వ్యతిరేకించలేదన్నట్లు” కనిపిస్తోంది. వారు కేవలం “ప్రకటించాలని బోధించాలని కోరుకున్నారు” అంతే. శాసనాల మీద శాసనాలు వెలువడడంతో క్రమేణా వారి అధికారము ప్రాబల్యము తగ్గిపోయాయని, వీరి ఉద్యమంపై చర్చివిరోధ ముద్ర పడిపోయిందని చరిత్రకారులు చెబుతారు. 1215 లో నాలుగవ లాటెరన్ సభ వాల్డెన్సులపై విధించిన నిషేధంతో చర్చి వేస్తున్న నిందారోపణలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇది వారి ప్రకటనా పనిని ఎలా ప్రభావితం చేసింది?
వారు అజ్ఞాతవాసం చేపట్టారు
వాడే 1217వ సంవత్సరంలో చనిపోయాడు, ఆయన అనుచరులు హింసల మూలంగా ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వత లోయల్లోకి, జర్మనీలోకి, ఉత్తర ఇటలీలోకి, మధ్య
మరియు తూర్పు యూరప్‌లలోకి చెల్లాచెదురయ్యారు. హింసల మూలంగా వాల్డెన్సులు గ్రామీణ ప్రాంతాల్లో స్థిరపడ్డారు కూడా, ఈ విధంగా వారి ప్రకటనా కార్యకలాపాలు చాలా విధాలుగా పరిమితమయ్యాయి.క్యాథలిక్ చర్చి దక్షిణ ఫ్రాన్స్‌లో కాథార్‌లకు, లేదా అల్బిజెన్సులకు విరుద్ధంగా చేసిన యుద్ధాలను 1229 లో ముగించింది. * ఆ తర్వాత వాల్డెన్సులు అలాంటి తీవ్రమైన దాడులకు గురయ్యారు. కొద్దికాలం తర్వాత చర్చి విరోధులందరిపై ‘చర్చి విచారణలు’ క్రూరాతి క్రూరంగా ఎక్కుపెట్టబడనై ఉన్నాయి. వాల్డెన్సులు భయకంపితులై అజ్ఞాతవాసం చేపట్టారు. 1230 కల్లా వారు బహిరంగంగా ప్రకటించడం మానుకున్నారు. ఆడీస్యో ఇలా వివరిస్తున్నాడు: “క్రొత్త గొఱ్ఱెలను వెదకడానికి బదులుగా . . . వారు మతమార్పిడి చేసుకున్నవారిపట్ల శ్రద్ధ వహించడానికి, వారు బాహ్య ఒత్తిడి హింసలు ఉన్నా విశ్వాసంలో కొనసాగేలా చేయడానికి కృషిచేశారు.” “ప్రకటించడం ప్రాముఖ్యమైనదిగానే ఉంది, కానీ ఆచరణలో పెట్టే విధానం పూర్తిగా మారిపోయింది” అని కూడా ఆయన అంటున్నాడు.
వారి నమ్మకాలు, ఆచారాలు
స్త్రీలూ పురుషులూ ప్రకటనా కార్యకలాపాల్లో పాల్గొనడానికి బదులుగా 14వ శతాబ్దానికల్లా వాల్డెన్సులు ప్రచారకులకు విశ్వాసులకు మధ్య ఒక బేధాన్ని ఏర్పరిచారు. కేవలం సుశిక్షితులైన పురుషులు మాత్రమే కాపరి పనిలో పాల్గొనడం ప్రారంభించారు. వేర్వేరు ప్రాంతాలను సందర్శించే ఈ పరిచారకులు అటు తర్వాత బార్బ్‌లు (అంకుల్స్) అని పిలువబడ్డారు.
వాల్డెన్సుల కుటుంబాలను వారి గృహాల్లో సందర్శించే బార్బ్‌లు ఆ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి బదులుగా దాన్ని ఉనికిలో ఉంచేందుకు కృషిచేశారు. బార్బ్‌లందరికీ చదవడం వ్రాయడం వచ్చేది, ఆరు సంవత్సరాలు పట్టే వారి శిక్షణ బైబిలు ఆధారితంగా ఉండేది. తమ భాషలో బైబిలును ఉపయోగించడం వారు తమ మందకు దాన్ని వివరించేందుకు సహాయపడింది. వాల్డెన్సుల్లోనూ, వారి పిల్లల్లోనూ బలమైన బైబిలు సంస్కృతి ఉండేదని, లేఖనాల్లో పెద్ద భాగాలను ఎత్తిచెప్పగలిగేవారని వ్యతిరేకులు సహితం ఒప్పుకునేవారు.
తొలి వాల్డెన్సులు తిరస్కరించిన వాటిలో అబద్ధాలాడడం, పాపవిమోచన లోకం, మృతుల కోసం మాస్ జరపడం, పోప్ క్షమాపణలు అందించడం పాపపరిహార పత్రాలు జారీచేయడం, మరియను ఇతర “సెయింట్”లను ఆరాధించడం ఉన్నాయి. వారు ప్రతి సంవత్సరం ప్రభురాత్రి భోజనాన్ని, అంటే చివరి భోజనాన్ని ఆచరించేవారు. లాంబెర్ట్ చెబుతున్నదాని ప్రకారం వారి ఆరాధనా విధానం “ఒక విధంగా సామాన్యుడి మతంగా” ఉంది.
“ద్వంద్వ జీవితం”
వాల్డెన్సుల సమాజాలు సన్నిహితంగా మెలిగేవి. తమలో తాము వివాహాలు చేసుకునేవారు, శతాబ్దాలుగా ఇలా జరగడంతో వాల్డెన్స్‌ల ఇంటిపేర్లు ప్రత్యేకమైనవిగా ఏర్పడ్డాయి. అయితే మనుగడ సాగించడానికి వాల్డెన్సులు చేసిన పోరాటంలో భాగంగా వారు తమ దృక్కోణాలను దాయడానికి ప్రయత్నించారు. తమ మత నమ్మకాలను ఆచారాలను రహస్యంగా ఉంచినందున వారి వ్యతిరేకులు వారికి విరుద్ధంగా విపరీతమైన నిందారోపణలు చేయడం సాధ్యమైంది, ఉదాహరణకు వారు సాతాను ఆరాధనలో పాల్గొన్నారని ఆరోపించబడింది. *
అలాంటి నిందారోపణలను త్రిప్పికొట్టడానికి వాల్డెన్సులు క్యాథలిక్ ఆరాధనతో రాజీపడడం, ఆ ఆరాధనను ఆచరించడం మొదలుపెట్టారు. క్యాథలిక్ ఆరాధనకు “అనుగుణంగా చాలా తక్కువగా మారడం” అని కామెరన్ దాని గురించి వ్యాఖ్యానించాడు. చాలామంది వాల్డెన్సులు, క్యాథలిక్ ప్రీస్టులకు పాపాలను ఒప్పుకోవడం, మాస్‌కు హాజరవడం, పవిత్ర జలాన్ని ఉపయోగించడం, చివరికి తీర్థయాత్రలకు వెళ్ళడం వంటి పనులు చేశారు. “అనేక విషయాల్లో వారు క్యాథలిక్కులైన తమ పొరుగువారిలానే చేశారు” అని లాంబెర్ట్ వ్యాఖ్యానిస్తున్నాడు. వాల్డెన్సులు కొంతకాలానికి “ద్వంద్వ జీవితానికి అలవాటు పడ్డారని” ఆడీస్యో నిష్కర్షగా చెబుతున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “ఒకవైపు వారు కొంతమేరకు శాంతిని కాపాడుకోవడానికి పైకి క్యాథలిక్కులుగానే కనబడ్డారు; మరోవైపు, తమ సమాజం ఉనికిలో ఉండేందుకుగాను అనేక ఆచారాలను అలవాట్లను తమలో తాము పాటించడం కొనసాగించారు.”
చర్చివిరోధం నుండి ప్రొటెస్టెంటిజమ్ వైపుకు వారి పయనం
16వ శతాబ్దంలో యూరప్‌లోని సంస్కరణోద్యమం మత రంగాన్ని సమూలంగా మార్చివేసింది. మత అసహనానికి గురైనవారు అటు తమ స్వదేశంలో చట్టబద్ధమైన గుర్తింపును
పొందలేకపోయారు, ఇటు మరింత సానుకూల పరిస్థితులున్న ప్రాంతాల అన్వేషణలో వలసవెళ్ళలేకపోయారు. చర్చివిరోధం అనే తలంపు కూడా ప్రాముఖ్యతను కోల్పోయింది, ఎందుకంటే చాలామంది ప్రజలు సుస్థాపిత మత సాంప్రదాయవాదాన్ని ఎదిరించడం ప్రారంభించారు.దాదాపు 1523 లో ప్రఖ్యాతిగాంచిన సంస్కరణోద్యమ నాయకుడు మార్టిన్ లూధర్ వాల్డెన్సుల గురించి పేర్కొన్నాడు. యూరప్‌లో ఏర్పడుతున్న మత పురోభివృద్ధుల వార్తలను వాల్డెన్సుల బార్బ్‌లలో ఒకాయన 1526 లో ఆల్ప్స్ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ప్రొటెస్టెంటు సమాజాలు తమ తలంపులను వాల్డెన్సులతో పంచుకోవడం కొంతకాలంపాటు కొనసాగింది. బైబిలును ఆదిమ భాషల నుండి ఫ్రెంచిలోకి అనువదించడం ప్రారంభించమని ప్రొటెస్టెంటులు వాల్డెన్సులను ప్రోత్సహించారు. 1535 లో ముద్రించబడిన ఆ అనువాదం అటు తర్వాత ఓలీవేటాన్ బైబిలు అని పిలువబడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాల్డెన్సుల్లో అత్యధికులు ఫ్రెంచి అర్థం చేసుకోలేరు.
క్యాథలిక్ చర్చి నుండి హింసలు కొనసాగుతుండగా వాల్డెన్సుల్లో చాలామంది ప్రొటెస్టెంటు వలసదారుల్లానే దక్షిణ ఫ్రాన్స్‌లోని మరింత సురక్షితమైన ప్రవాన్స్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ వలసల విషయంలో అధికారులు వెంటనే అప్రమత్తులయ్యారు. వాల్డెన్సుల జీవనశైలి, వారి నైతిక విలువల గురించి అనుకూల అభిప్రాయాలు ఉన్నప్పటికీ కొందరు ప్రజలు వారి యథార్థతను సందేహించారు, సమాజంలోని శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లజేస్తారని వారు నిందించబడ్డారు. మెరిండోల్ శాసనం జారీ చేయబడింది, తత్ఫలితంగా ప్రారంభంలో పేర్కొనబడిన ఆ భయంకరమైన రక్తపాతం జరిగింది.
క్యాథలిక్కులకు వాల్డెన్సులకు మధ్య సంబంధాలు క్షీణిస్తూనే ఉన్నాయి. తమకు విరుద్ధంగా చేపట్టిన దాడులకు ప్రతిస్పందనగా వాల్డెన్సులు చివరికి తమను తాము కాపాడుకోవడానికిగాను సైనిక బలగాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సంఘర్షణలే వారు ప్రొటెస్టెంటు గుంపులో కలవడానికి కారణమయ్యాయి. ఆ విధంగా వాల్డెన్సులు ప్రధాన ప్రొటెస్టెంటువాదంతో మిత్రత్వం ఏర్పరచుకున్నారు.
శతాబ్దాలు గడుస్తుండగా వాల్డెన్సుల చర్చీలు ప్రాన్స్‌కు ఎంతో దూరంగా ఉరుగ్వేలోను అమెరికాలోను స్థాపించబడ్డాయి. అయితే, “వాల్డెన్సియనిజం సంస్కరణోద్యమం కాలంలోనే అంతమైంది,” దాన్ని ప్రొటెస్టెంటిజమ్ “తనలో కలిపేసుకుంది” అంటున్న ఆడీస్యోతో చరిత్రకారుల్లో అత్యధికులు ఏకీభవిస్తారు. నిజానికి, వాల్డెన్స్ ఉద్యమం శతాబ్దాల క్రితం ఉన్నటువంటి తొలి ఆసక్తిని చాలామట్టుకు కోల్పోయింది. దాని సభ్యులు భయంతో బైబిలు ఆధారిత ప్రకటనా బోధనా పనులను విడనాడినప్పుడు అది సంభవించింది.
[అధస్సూచీలు]
^ పేరా 7 వాడేను వాల్డెస్ అనీ, వాల్డీజీయస్ అనీ, లేక వాల్డో అనీ వేర్వేరుగా పిలిచేవారు. “వాల్డెన్సులు” అనే పేరుకు ఈ చివరి పేరు ఆధారమైంది. వాల్డెన్సులు లేదా వాల్డెన్సియన్లు ‘లైయన్స్‌లోని బీదలు’ అని కూడా పిలువబడ్డారు.
^ పేరా 8 ప్రజలు లాటిన్ కాని ప్రాంతీయ భాషలో బైబిలును చదువుతున్నారని ఈశాన్య ఫ్రాన్స్‌లోని మెట్స్ నగర బిషప్ దాదాపు 1199వ సంవత్సరంలోనే పోప్ ఇన్నొసెంట్ IIIకు ఫిర్యాదు చేశాడు. ఈ బిషప్ బహుశ వాల్డెన్సుల గురించే అలా చెప్పివుంటాడు.
^ పేరా 15 కావలికోట, సెప్టెంబరు 1, 1995, 27-30 పేజీల్లోని “కాథార్‌లు—వారు క్రైస్తవ హతసాక్షులైయుండిరా?” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 21 వాల్డెన్సులను అపఖ్యాతికి గురిచేయడానికి నిరంతర ప్రయత్నం జరగడం మూలంగా వాడేరీ (వాడ్వా అనే ఫ్రెంచి పదం నుండి వచ్చింది) అనే పదం ఏర్పడింది. చర్చివిరోధులని లేదా సాతాను ఆరాధకులని అనుమానించినవారిని వర్ణించడానికి ఆ పదం ఉపయోగించబడింది.
[23వ పేజీలోని మ్యాపు/చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
వాల్డెన్సులచే ప్రభావితమైన ప్రాంతం
ఫ్రాన్స్
లైయన్స్
ప్రవాన్స్
లూయీబేరన్
స్ట్రాస్‌బర్గ్
మిలాన్
రోము
బెర్లిన్
ప్రాగ్
వియన్నా
[చిత్రం]
వాల్డెన్సులు 1535 లో ఓలీవేటాన్ బైబిలు అనువాదాన్ని ప్రారంభించారు
[చిత్రసౌజన్యం]
బైబిలు: © Cliché Bibliothèque nationale de France, Paris
[20, 21వ పేజీలోని చిత్రాలు]
వాడే
ఇద్దరు వాల్డెన్స్ వృద్ధ మహిళల దహనం
[చిత్రసౌజన్యం]
20, 21 పేజీలు: © Landesbildstelle Baden, Karlsruhe