కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ హృదయంతోను మనస్సుతోను దేవుణ్ణి వెదకండి

మీ హృదయంతోను మనస్సుతోను దేవుణ్ణి వెదకండి

మీ హృదయంతోను మనస్సుతోను దేవుణ్ణి వెదకండి

నిజమైన క్రైస్తవమతం దేవుణ్ణి సంతోషపరిచే విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి హృదయముతోపాటు మనస్సును కూడా ఉపయోగించమని ప్రోత్సహిస్తోంది.

వాస్తవానికి, క్రైస్తవత్వాన్ని స్థాపించిన యేసుక్రీస్తు మనం దేవుణ్ణి మన “పూర్ణహృదయముతో” మరియు “పూర్ణాత్మతో” మాత్రమేగాక “పూర్ణమనస్సుతో” లేదా వివేకముతో కూడా ప్రేమించాలని బోధించాడు. (మత్తయి 22:​37) అవును, మన ఆరాధనలో మన మానసిక సామర్థ్యాలు ఒక ప్రముఖ పాత్రను వహించాలి.

యేసు తను బోధించినవాటి గురించి ఆలోచించమని తన శ్రోతలను కోరేటప్పుడు, “మీకేమి తోచుచున్నది?” అని తరచుగా అన్నాడు. (మత్తయి 17:​25; 18:​11, 12; 21:​28; 22:​42) అదే విధంగా, తన తోటి విశ్వాసులు “నిర్మలమైన . . . మనస్సులను రేపు”టకు అపొస్తలుడైన పేతురు వారికి వ్రాశాడు. (2 పేతురు 3:​1, 2) అత్యంత విస్తృతంగా ప్రయాణించిన తొలి మిషనరీ అపొస్తలుడైన పౌలు, తాము “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొన”డానికి తమ “తర్కనా శక్తిని” వినియోగించమని క్రైస్తవులను మందలించాడు. (రోమీయులు 12:​1, 2, NW) క్రైస్తవులు తమ నమ్మకాలను అలా సమగ్రంగా, శ్రద్ధతో పరిశీలించుకున్నప్పుడే దేవునికి సంతోషాన్నిచ్చే విశ్వాసాన్ని నిర్మించుకోగలుగుతారు, అలాంటి విశ్వాసమే జీవితంలో ఎదురయ్యే పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.​—⁠హెబ్రీయులు 11:⁠1, 6.

అలాంటి విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి ఇతరులకు సహాయపడేందుకు, తొలి క్రైస్తవ సువార్తికులు ‘లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో తర్కించుచుండిరి.’ (అపొస్తలుల కార్యములు 17:​1-3) అలాంటి సహేతుకమైన బోధనా విధానం యథార్థహృదయులనుండి చక్కని ప్రతిస్పందనను రాబట్టేది. ఉదాహరణకు, మాసిదోనియ నగరమైన బెరయ ప్రజలు అనేకులు ‘ఆసక్తితో [దేవుని] వాక్యమును అంగీకరించి, [పౌలు, ఆయన సహవాసులు వివరించిన] సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.’ (అపొస్తలుల కార్యములు 17:​11) ఇక్కడ గమనించతగినవి రెండు విషయాలున్నాయి. మొదటిది, బెరయ ప్రజలు దేవుని వాక్యమును వినడానికి ఆసక్తితో ఉన్నారు; రెండవది, తాము విన్నది సరైనదేనని గ్రుడ్డిగా నమ్మకుండా, వారు లేఖనాలతో పోల్చి చూసుకున్నారు. అందుకే క్రైస్తవ మిషనరీ లూకా బెరయ ప్రజలను “శ్రేష్ఠబుద్ధిగలవారు,” (విత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) అని గౌరవంతో మెచ్చుకున్నాడు. ఆధ్యాత్మిక విషయాలను పరిశీలించేటప్పుడు మీరు కూడా అలాంటి శ్రేష్ఠబుద్ధిని కనబరుస్తారా?

మనస్సు, హృదయము కలిసి పనిచేస్తాయి

ఆరంభంలో పేర్కొన్నట్లు, సత్యారాధనలో మనస్సు హృదయము రెండూ ఉన్నాయి. (మార్కు 12:​30) దీని ముందటి ఆర్టికల్లో యజమానికి ఇష్టంలేని రంగులతో ఇంటికి పెయింటు వేసిన వ్యక్తి ఉపమానం గురించి మరోసారి ఆలోచించండి. అతను ఇంటి యజమాని సూచనలను శ్రద్ధగా వినుంటే, అతను తన పనిని హృదయపూర్వకంగా చేసుండేవాడు, తన పనికి యజమాని అంగీకారము ఉంటుందనే నమ్మకమూ ఉండి ఉండేది. అది, మన ఆరాధనకు కూడా వర్తిస్తుంది.

‘యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధిస్తారు’ అని యేసు చెప్పాడు. (యోహాను 4:​23) అందుకే, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అందుచేత . . . మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని . . . బతిమాలుచున్నాము.” (కొలొస్సయులు 1:​9, 10) యథార్థవంతులు ‘తమకు తెలిసినదానిని ఆరాధిస్తారు’ కాబట్టి వారు పూర్తి నమ్మకం కలిగి, తమ హృదయముతోనూ ఆత్మతోనూ ఆరాధించడానికి అలాంటి “సంపూర్ణజ్ఞానము” వారికి సహాయం చేస్తుంది.​—⁠యోహాను 4:​22.

ఈ కారణాలవల్లే, యెహోవాసాక్షులు చంటిపిల్లలకు గాని, లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయని ఆసక్తిగల క్రొత్తవారికి గాని బాప్తిస్మం ఇవ్వరు. యేసు తన అనుచరులకు ఇలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:​19, 20) కేవలం దేవుని చిత్తము యొక్క సంపూర్ణజ్ఞానమును పొందిన తర్వాతనే యథార్థవంతులైన బైబిలు విద్యార్థులు ఆరాధన విషయంలో వివేకవంతమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీరు అలాంటి పరిజ్ఞానమును పొందడానికి కృషి చేస్తున్నారా?

ప్రభువు ప్రార్థనను అర్థం చేసుకోవడం

బైబిలును గురించిన సంపూర్ణజ్ఞానము కలిగి ఉండడానికీ, పరిమితమైన జ్ఞానము కలిగి ఉండడానికీ మధ్యనున్న తేడాను చూడడానికి, మత్తయి 6:​9-13 లో నమోదు చేయబడిన, సాధారణంగా ప్రభువు ప్రార్థన అని పిలువబడే అంశాన్ని పరిశీలిద్దాం.

కోట్లమంది కంఠస్థం చేసిన యేసు మాదిరి ప్రార్థనను చర్చీల్లో క్రమంగా చెబుతారు. కానీ దాని భావం, ప్రత్యేకంగా దేవుని నామము, రాజ్యము సంబంధితమైన, ప్రార్థనలోని మొదటి భాగం గురించి ఎంతమందికి బోధించబడింది? ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టే యేసు వాటిని ప్రార్థనలో మొదట చేర్చాడు.

అది ఇలా ఆరంభమవుతుంది: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక;” అంటే పవిత్రం చేయబడునుగాక. దేవుని నామము పరిశుద్ధపరచబడాలని ప్రార్థించమని యేసు చెప్పాడన్న విషయం గమనించండి. అది, చాలా మందికి కనీసం రెండు ప్రశ్నలను రేకెత్తిస్తుంది. మొదటిది, దేవుని నామము ఏమిటి? రెండవది, ఆ నామము ఎందుకు పరిశుద్ధపరచబడాలి?

మొదటి ప్రశ్నకు సమాధానం మూలభాషల్లోని బైబిలులో 7,000 కంటే ఎక్కువసార్లు కనబడుతుంది. కీర్తన 83:​18 లో ఒకటి ఇలా ఉంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” దేవుని నామమైన యెహోవా గురించి, నిర్గమకాండము 3:15 ఇలా చెబుతోంది: “నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.” * కాని స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతిరూపమైన దేవుని నామము ఎందుకు పరిశుద్ధపరచబడాలి? ఎందుకంటే, మానవ చరిత్ర ఆరంభంలోనే దానిపై నిందవేయబడింది, అది దూషించబడింది.

ఏదెను తోటలో, నిషేధించబడిన ఫలమును తింటే చనిపోతారని దేవుడు ఆదాము హవ్వలకు చెప్పాడు. (ఆదికాండము 2:​17) దేవునికి పూర్తి విరుద్ధంగా, “మీరు చావనే చావరు,” అని సాతాను హవ్వతో అన్నాడు. కాబట్టి, దేవుడు అబద్ధం చెబుతున్నాడని సాతాను నిందించాడు. అతను అంతటితో ఆగలేదు. ‘మీరు [మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను] తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును’ అని హవ్వతో చెప్పి, ఎంతో విలువైన పరిజ్ఞానమును ఆమెకు అందకుండా దేవుడు అన్యాయం చేస్తున్నాడని దేవుని నామమును ఇంకా దూషించాడు. ఎంతటి అపనింద!​—⁠ఆదికాండము 3:⁠4, 5.

నిషేధించబడిన ఫలమును తినడం ద్వారా, ఆదాము, హవ్వలు సాతానుతో ఏకమయ్యారు. అప్పటినుండి అనేకమంది మానవులు, తెలిసో తెలియకో దేవుని నీతివంతమైన సూత్రాలను తిరస్కరించడం ద్వారా, ఆ మొదటి అపనిందకు మరింత అపకీర్తిని చేర్చారు. (1 యోహాను 5:​19) తమ బాధలకు కారణం తమ సొంత తప్పుడు మార్గాలే అయినప్పటికీ, ప్రజలు దేవుడే కారకుడు అని నిందిస్తూ ఇప్పటికీ ఆయనను దూషిస్తున్నారు. “ఒక మనిషి యొక్క బుద్ధిహీనత అతని జీవితాన్ని పాడు చేస్తుంది. కానీ అతడు యెహోవాను నిందిస్తాడు” అని సామెతలు 19:3 చెబుతోంది. (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తన తండ్రిని యథార్థంగా ప్రేమించిన యేసు, ఆయన నామము పరిశుద్ధపరచబడాలని ఎందుకు ప్రార్థించాడో మీరు గ్రహించారా?

“నీ రాజ్యము వచ్చునుగాక”

దేవుని నామము పరిశుద్ధపరచబడాలని ప్రార్థించిన తర్వాత, యేసు “నీ రాజ్యము వచ్చునుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,” అని అన్నాడు. (మత్తయి 6:​9, 10) ఈ భాగం గురించి మనమిలా అడగవచ్చు: ‘దేవుని రాజ్యము అంటే ఏమిటి? దాని రాకడకు, భూమిపై దేవుని చిత్తం నెరవేరడానికి సంబంధమేమిటి?’

బైబిల్లో, “రాజ్యము” అనే పదానికి ముఖ్యంగా “ఒక రాజు పరిపాలన” అని అర్థం. కాబట్టి, దేవుని రాజ్యము, దేవుడు తాను ఎంపిక చేసుకున్న ఒక రాజుతో చేసే పరిపాలనను, లేదా ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఆ రాజు మరెవరో కాదు, పునరుత్థానం చేయబడిన, ‘రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు’ అయిన యేసుక్రీస్తే. (ప్రకటన 19:​16; దానియేలు 7:​13, 14) యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న దేవుని మెస్సీయ రాజ్యము గురించి, దానియేలు ప్రవక్త ఇలా వ్రాశాడు: ‘ఆ రాజుల [ప్రస్తుతం పరిపాలిస్తున్న మానవ ప్రభుత్వాల] కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును” అంటే, నిరంతరము నిలుస్తుంది.​—⁠దానియేలు 2:​44.

అవును, దేవుని రాజ్యము భూమి మీది నుండి దుష్టులందరినీ నిర్మూలించి, “యుగముల వరకు” అంటే నిరంతరం పరిపాలిస్తూ భూమిని సంపూర్ణంగా స్వాధీనపరచుకుంటుంది. ఆ విధంగా దేవుని రాజ్యము ద్వారా యెహోవా నామము పరిశుద్ధపరచబడుతుంది. సాతాను, దుష్ట మానవులు చేసిన అబద్ధపు దూషణలన్నింటిని అది తొలగిస్తుంది.​—⁠యెహెజ్కేలు 36:​23.

అన్ని ప్రభుత్వాల్లాగే, దేవుని రాజ్యములో కూడా ప్రజలు ఉంటారు. వీరెవరు? బైబిలు సమాధానం చెబుతోంది: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:​11) అలాగే, యేసు ఇలా అన్నాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” వీరికి దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానం ఉంటుంది, జీవితానికి అది ఆవశ్యకం.​—⁠మత్తయి 5:⁠5; యోహాను 17:⁠3.

దేవుణ్ణి యథార్థంగా ప్రేమిస్తూ, ఒకరినొకరు ప్రేమించుకునే దీనులు, సాత్వికులతో ఈ భూమి అంతా నిండి ఉండడాన్ని మీరు ఊహించగలరా? (1 యోహాను 4:​7, 8) యేసు “నీ రాజ్యము వచ్చునుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,” అని అన్నప్పుడు ఆయన దీని కోసమే ప్రార్థించాడు. అలా ప్రార్థించమని యేసు తన అనుచరులకు ఎందుకు చెప్పాడో మీరు అర్థం చేసుకున్నారా? అతి ప్రాముఖ్యంగా, ఆ ప్రార్థన నెరవేర్పు వ్యక్తిగతంగా మీపై ఎలా ప్రభావం చూపగలదో మీరు గ్రహించారా?

ఇప్పుడు లక్షలాదిమంది లేఖనాలపై తర్కిస్తున్నారు

రాబోయే దేవుని రాజ్యము గురించి ప్రకటించే ఆధ్యాత్మిక విద్యా కార్యక్రమము ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని యేసు ప్రవచించాడు. ఆయనిలా అన్నాడు: ‘ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత [ప్రస్తుత లోకముకు లేదా విధానముకు] అంతము వచ్చును.’​—⁠మత్తయి 24:​14.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 లక్షలమంది యెహోవాసాక్షులు ఆ సువార్తను తమ పొరుగువారితో పంచుకుంటున్నారు. మీరు మీ తర్కనా శక్తిని ఉపయోగిస్తూ ‘లేఖనములను పరిశోధించడం’ ద్వారా దేవుని గురించి, ఆయన రాజ్యము గురించి మరింత తెలుసుకోవడానికి వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అలా చేయడం ద్వారా మీ విశ్వాసం దృఢమవుతుంది, “సముద్రము జలముతో నిండియున్నట్టు . . . యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి” ఉండే భూపరదైసుపై జీవితం అనే సంతోషకరమైన నిరీక్షణ లభిస్తుంది.​—⁠యెషయా 11:​6-9.

[అధస్సూచి]

^ పేరా 14 కొందరు విద్వాంసులు “యెహోవా”కు బదులుగా “యావే” అనే అనువాదాన్నే ఇష్టపడతారు. కానీ, అనేకమంది ఆధునిక బైబిలు అనువాదకులు తమ భాషాంతరీకరణాలనుండి (వర్షన్‌లనుండి) దేవుని నామము ఏ రూపంలోనూ లేకుండా తీసివేసి, వాటిస్థానంలో “ప్రభువు” లేక “దేవుడు” అనే సాధారణ పేర్లను పెట్టారు. దేవుని నామమును గురించిన లోతైన చర్చ కోసం, దయచేసి యెహోవాసాక్షులు ప్రచురించిన నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం) బ్రోషుర్‌ చూడండి.

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

గొప్ప బోధకుడిని అనుకరించండి

యేసు తరచుగా నిర్దిష్టమైన బైబిలు అంశాలపై అవధానాన్ని కేంద్రీకరించడం ద్వారా బోధించేవాడు. ఉదాహరణకు, యేసు పునరుత్థానుడైన తర్వాత, తన మరణం వల్ల సందిగ్ధావస్థలో పడిపోయిన ఇద్దరు శిష్యులకు దేవుని సంకల్పంలోని తన పాత్రను గురించి వివరించాడు. లూకా 24:⁠27 ఇలా చెబుతోంది: “మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.”

యేసు ఇక్కడ “తన్ను గూర్చిన” అంటే మెస్సీయను గురించిన ఒక నిర్దిష్టమైన అంశాన్ని ఎంపిక చేసుకోవడాన్ని, తన చర్చలో “లేఖనములన్నిటి” నుండి ఉదహరించడాన్ని గమనించండి. యేసు ఆ అంశానికి సంబంధించిన బైబిలు లేఖనాలను ఒకదాని తర్వాత మరొకటి పజిల్‌లోని ముక్కల్లాగ ప్రతిభావంతంగా చేర్చాడు, అది ఆయన శిష్యులు ఆధ్యాత్మిక సత్యపు స్పష్టమైన నమూనాను చూసేందుకు దోహదపడింది. (2 తిమోతి 1:​13) తత్ఫలితంగా, వారికి కేవలం జ్ఞానం కలగడం మాత్రమే కాదుగానీ, వాళ్ళు గాఢంగా కదిలించబడ్డారు. ఆ వృత్తాంతం మనకు ఇలా చెబుతోంది: “అప్పుడు వారు​—⁠ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.”​—⁠లూకా 24:​32.

యెహోవాసాక్షులు తమ పరిచర్యలో యేసు పద్ధతులను అనుకరించడానికి కృషి చేస్తారు. వారి ప్రధానమైన అధ్యయన సహాయకాలు, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్‌, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకము. ఇవి, “దేవుడెవరు?,” “దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు?,” “మీరు నిజమైన మతాన్ని ఎలా కనుగొనగలరు?,” “ఇవి అంత్యదినాలు!,” “దేవున్ని ఘనపర్చే కుటుంబాన్ని కట్టుట” వంటి అనేక ఆసక్తికరమైన బైబిలు అంశాలను చర్చిస్తాయి. ప్రతి పాఠములో అనేక లేఖనాలుంటాయి.

ఈ విషయాల గురించి, ఇతర విషయాల గురించి ఉచిత గృహ బైబిలు అధ్యయనం కోసం, మీ ప్రాంతంలోవున్న యెహోవాసాక్షులను కలవడానికి లేదా ఈ పత్రికలోని 2వ పేజీలోని చిరునామాకు వ్రాయడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

[చిత్రం]

నిర్దిష్టమైన బైబిలు అంశాలపై దృష్టి నిలపడం ద్వారా మీ విద్యార్థి హృదయాన్ని చేరండి

[7వ పేజీలోని చిత్రాలు]

యేసు మాదిరి ప్రార్థన యొక్క భావమేమిటో మీరు గ్రహించారా?

“పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక . . .”

‘నీ [మెస్సీయ] రాజ్యము వచ్చునుగాక . . .’

“నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక”