క్షామ బాధితులకు సహాయం అందుతోంది!
క్షామ బాధితులకు సహాయం అందుతోంది!
‘ఎటువంటి క్షామం?’ అని మీరు అడుగుతుండవచ్చు. అది ఆధ్యాత్మిక ఆహారానికి సంబంధించిన క్షామం! పూర్వం ఒక హీబ్రూ ప్రవక్త ఈ క్షామం గురించి ఇలా ప్రవచించాడు: “రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.” (ఆమోసు 8:11) ఆధ్యాత్మిక క్షామ బాధితులకు సహాయం అందించేందుకు, న్యూయార్క్‌లోని పాటర్‌సన్‌లోనున్న వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ నుండి 112వ తరగతిలోని 48 మంది సభ్యులు, 5 భూ ఖండాల్లోనూ సముద్ర ద్వీపాలపైనా ఉన్న 19 వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు.
వారు అక్షరార్థంగా ధాన్యమాంసాలతో కాదుగానీ పరిజ్ఞానమూ అనుభవమూ శిక్షణలతో సంసిద్ధులై వెళ్తున్నారు. విదేశాల్లో మిషనరీ సేవ చేసేందుకు అవసరమైన దృఢ విశ్వాసాన్ని మరింత పటిష్ఠపరచుకునేందుకు రూపొందించబడిన కృషితో కూడిన బైబిలు అధ్యయనంలో 5 నెలలపాటు పాల్గొన్నారు. 2002, మార్చి 9న హాజరైన 5,554 మంది, గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని విని ఆనందించారు.
యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యుడిగా సేవచేస్తున్న స్టీఫెన్ లెట్ కార్యక్రమాన్ని ఉత్సాహంతో ఆరంభించారు. ప్రత్యేకంగా, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అనేకమంది అతిథులకు ఆయన స్వాగతం చెప్పారు. ఆ తర్వాత ఆయన “మీరు లోకమునకు వెలుగైయున్నారు” అని యేసు అన్న మాటలను భవిష్యత్తులోని మిషనరీల సేవకు అన్వయించడం ఆరంభించారు. (మత్తయి 5:14) ఆయనిలా వివరించారు: ‘మీ నియామకాల్లో మీరు యెహోవా అద్భుత క్రియల విభిన్న పార్శ్వాల “వెలుగును వెదజల్లుతూ” యథార్థహృదయులు యెహోవా వ్యక్తిత్వ అందాన్ని ఆయన సంకల్పాల అందాన్ని చూసేలా చేస్తారు.’ అబద్ధపు సిద్ధాంతాల అంధకారాన్ని బట్టబయలు చేయడానికీ, సత్యాన్వేషకులకు మార్గం చూపించడానికీ దేవుని వాక్యపు వెలుగును ఉపయోగించమని సహోదరుడు లెట్ మిషనరీలను ప్రోత్సహించారు.
విజయానికి సరైన వైఖరి చాలా అవసరం
ఛైర్మన్ అలా ప్రారంభపు మాటలు చెప్పిన తర్వాత అమెరికా బ్రాంచి కమిటీ సభ్యుడైన బాల్తాసార్ పర్లా, గ్రాడ్యుయేట్లు మిషనరీలుగా సాఫల్యం పొందేందుకు సహాయకరంగా రూపొందించబడిన గోష్ఠిలోని మొదటి ప్రసంగాన్ని ఇచ్చారు. “బలముపొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనికి పూనుకోండి” అనే ప్రసంగాంశాన్ని ఆయన వివరించారు. (1 దినవృత్తాంతములు 28:20) ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను అంతకు ముందు తాను ఎన్నడూ చేయనటువంటి పనిని అంటే యెరూషలేములో మందిరం కట్టడమనే ఒక క్లిష్టమైన నియామకాన్ని పొందాడు. సొలొమోను ఆ పనికి పూనుకొన్నాడు, యెహోవా సహాయంతో మందిరం పూర్తయ్యింది. దానిలోని పాఠాన్ని తరగతికి అన్వయిస్తూ సహోదరుడు పర్లా, ‘మీరు మిషనరీగా ఒక క్రొత్త నియామకాన్ని పొందారు, కాబట్టి మీరు ధైర్యంగా దృఢంగా ఉండాల్సిన అవసరముంది’ అని అన్నారు. అలా విద్యార్థులు తాము యెహోవాకు సమీపంగా ఉన్నంత వరకు ఆయన తమను విడిచిపెట్టడు అన్న హామీనుండి ఓదార్పును పొందారు. సహోదరుడు పర్లా ‘మిషనరీలుగా మీరు ఎంతో మంచిని సాధించగలరు. నాకూ, మా కుటుంబానికీ సత్యాన్ని అందించింది మిషనరీలే!’ అని తన సొంత అనుభవాన్ని చెబుతూ ప్రేక్షకులను కదిలించారు.
“విజయం సాధించడానికి యెహోవా వైపు చూడండి” అన్నది పరిపాలక సభలోని మరొక సభ్యుడైన సామ్యుల్ హెర్డ్ ఇచ్చిన ప్రసంగాంశం. విద్యార్థులు మిషనరీ సేవను జీవితగమనంగా చేసుకొని బయలుదేరారు, వారి విజయం యెహోవాతో వారికుండే సంబంధం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సహోదరుడు హెర్డ్ వారికిలా జ్ఞాపకం చేశారు: ‘మీరు గిలియడ్‌లో చేసిన అధ్యయనాల ద్వారా బైబిలు పరిజ్ఞానాన్ని ఎంతో సంపాదించుకున్నారు. మీరు దాన్ని ఆనందంగా పొందారు. కానీ ఇప్పుడు, నిజమైన విజయాన్ని సాధించడం కోసం, మీరు నేర్చుకొన్నదానిని ఇవ్వడం ప్రారంభించబోతున్నారు.’ (అపొస్తలుల కార్యములు 20:35) ఇతరుల తరఫున తమను తాము “పానార్పణముగా” ధార పోసుకుంటుండగా అలా ఇచ్చే అవకాశాలు మిషనరీలకు అనేకం లభిస్తాయి.—ఫిలిప్పీయులు 2:17.
విద్యార్థులకు ఉపదేశకులు ఇచ్చిన వీడ్కోలు సలహా ఏమిటి? మార్క్ నూమర్ “ఇది ఎలా జరుగుతుందో మీకు తెలిసేంతవరకు ఊరుకోండి” అనే తన ప్రసంగాంశాన్ని రూతు 3:18 ఆధారంగా తీసుకున్నారు. నయోమి, రూతుల మాదిరులను ప్రస్తావిస్తూ ప్రసంగీకుడు, దేవుని భూసంస్థ స్థాపించిన ఏర్పాట్లపై పూర్తి నమ్మకాన్ని ఉంచమనీ దైవపరిపాలనా అధికారాన్ని గౌరవించమనీ గ్రాడ్యుయేట్లను ప్రోత్సహించారు. విద్యార్థుల హృదయాలను స్పృశిస్తూ సహోదరుడు నూమర్ ఇలా ప్రశ్నించారు: ‘మీ మీద ప్రభావం చూపే ఒకానొక నిర్ణయం ఎందుకు తీసుకోబడిందో మీకు అర్థంకాకపోయినా లేదా ఏదైనా ఒక పనిని మరో విధంగా చేసుండాల్సింది అని మీకు బలంగా అనిపించే కొన్ని సందర్భాలు ఎదురైతే మీరేం చేస్తారు? చొరవ తీసుకొని వాటిని మీరే చక్కబెట్టడానికి ప్రయత్నిస్తారా లేదా సకాలంలో ఆయన చివరికి మంచినే చేస్తాడన్న నమ్మకంతో దేవుని నిర్దేశం మీది ప్రగాఢ విశ్వాసంతో ‘ఊరుకుంటారా?’ (రోమీయులు 8:28) ‘రాజ్య ప్రయోజనాలను వృద్ధిచేయడం మీద మనసు నిలపండి, వ్యక్తిత్వాలపై కాకుండా యెహోవా సంస్థ చేస్తున్న దానిపై దృష్టి ఉంచండి’ అని ఆయన ఇచ్చిన సలహా భావి మిషనరీలకు తమ విదేశ నియామకాల్లో విలువైనదిగా రుజువవుతుందనడంలో సందేహం లేదు.
మొదటి గోష్ఠిలోని చివరి ప్రసంగాన్ని ఒకప్పుడు తానే మిషనరీగా ఉండి ప్రస్తుతం గిలియడ్ స్కూల్ ఉపదేశకుడిగా సేవ చేస్తున్న వాలెస్ లివరన్స్ ఇచ్చారు. ఆయన ప్రసంగాంశం “దృష్టిని కేంద్రీకరించి ఉండండి, దేవుని సేవలో నిలవండి.” దానియేలు ప్రవక్త బబులోను పడిపోవడాన్ని చూసి, యిర్మీయా ప్రవచించిన దాని ప్రకారం, ఇశ్రాయేలు విడుదల సమీపంలోనే ఉందన్నది తాను గ్రహించినట్లు ఆయన చూపించాడు. (యిర్మీయా 25:11; దానియేలు 9:2) దానియేలు యెహోవా కాలపట్టికపై శ్రద్ధ కలిగి ఉన్నాడు, అది దేవుని సంకల్పం బయలుపరచబడడంపై శ్రద్ధ నిలపడానికి ఆయనకు సహాయపడింది. దానికి భిన్నంగా హగ్గయి ప్రవక్త కాలంలోని ఇశ్రాయేలీయులు “సమయమింకరాలేదు” అని అన్నారు. (హగ్గయి 1:2) వారు తాము నివసిస్తున్న కాలంపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులు తమ సుఖజీవనాల పైనా స్వకీయానందాల పైనా మనసును కేంద్రీకరించారు, తాము బబులోను నుండి విడుదల చేయబడడానికి అసలు కారణమైన మందిర పునర్నిర్మాణ కార్యాన్ని గాలికి వదిలేశారు. సహోదరుడు లివరన్స్ తన ప్రసంగాన్ని ఈ మాటలతో ముగించారు: “కాబట్టి అన్ని సమయాల్లోనూ యెహోవా సంకల్పాన్ని మనస్సులో ఉంచుకోవడం ద్వారా దృష్టిని కేంద్రీకరించి ఉండండి.”
“దేవుని సజీవ వాక్యాన్ని ఉపయోగించేవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు” అనే చర్చాంశం గల ఒక భాగానికి గిలియడ్ స్కూల్ ఉపదేశకుడు లారెన్స్ బోవెన్ అధ్యక్షత వహించారు. (హెబ్రీయులు 4:12) ప్రకటించేటప్పుడు బోధించేటప్పుడు బైబిలును ఉపయోగించేవారిని యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడో ప్రాముఖ్యంగా చూపిస్తూ తరగతిలోనివారి క్షేత్ర అనుభవాలతో ఈ భాగం కొనసాగింది. అధ్యక్షుడు ‘తనంతట తానే బోధించడం లేదనీ తాను దేవుని వాక్యాన్నే బోధిస్తున్నాననీ యేసు యథార్థంగా చెప్పగలిగాడు’ అని అంటూ, దేవుని సేవకులందరికీ యేసుక్రీస్తు ఒక చక్కని మాదిరిని ఉంచాడని ఆయన సూచించారు. ఆనాడు యథార్థ హృదయులు సత్యాన్ని గ్రహించి దానికి సానుకూలంగా ప్రతిస్పందించారు. (యోహాను 7:16, 17) నేడు కూడా అలాగే జరుగుతోంది.
గిలియడ్ శిక్షణ అన్ని సత్కార్యాలకు సంసిద్ధులను చేస్తుంది
ఆ తర్వాత, దీర్ఘకాలంగా బేతేలు సేవ చేస్తున్న పాట్రిక్ లాఫ్రంక, రిచర్డ్ అబ్రహమ్‌సన్‌లు, ఆరుగురు గిలియడ్ గ్రాడ్యుయేట్లను—ప్రస్తుతం వేర్వేరు విధాల ప్రత్యేక పూర్తికాల సేవ చేస్తున్నవారిని—ఇంటర్వ్యూ చేశారు. ఆ ఆరుగురు తమ ప్రస్తుత నియామకమేదైనప్పటికీ బైబిలు అధ్యయనానికీ పరిశోధన ప్రణాళికలకూ అలాగే, ప్రజలతో సర్దుకుపోయే విషయానికీ సంబంధించి గిలియడ్ పాఠశాలలో తాము పొందిన శిక్షణను దశాబ్దాలు గడిచినప్పటికీ వినియోగిస్తూనే ఉన్నారని విని 112వ తరగతిలోని గ్రాడ్యుయేట్లు ప్రోత్సహించబడ్డారు.
కార్యక్రమంలోని ముఖ్య ప్రసంగాన్ని పరిపాలకసభ సభ్యుడైన థియోడోర్ జారస్ ఇచ్చారు. ఆ ప్రసంగాంశం “సాతాను ద్వేషాన్ని సహించడం ద్వారా సాధించబడినది.” గత అయిదు నెలలుగా విద్యార్థులు స్నేహపూర్వకమైన దైవపరిపాలనా వాతావరణంలో ఉన్నారు. అయితే వారి తరగతిలో జరిగిన అధ్యయనాలు సూచించినట్లు మనం ఒక శత్రు లోకంలో జీవిస్తున్నాం. యెహోవా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దాడికి గురవుతున్నారు. (మత్తయి 24:9) వివిధ బైబిలు వృత్తాంతాలను ఉపయోగిస్తూ సహోదరుడు జారస్ ‘అపవాది ప్రత్యేకించి మనపైనే కన్నేసి ఉంచాడు, కాబట్టి మనం యెహోవాతో మన సంబంధాన్ని బలపరచుకొని పరీక్షలను తట్టుకోవడానికి దృఢంగా ఉండాలి’ అని సూచించారు. (యోబు 1:8; దానియేలు 6:4; యోహాను 15:20; ప్రకటన 12:12, 17) దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ద్వేషం ఎప్పుడూ కొనసాగుతున్నప్పటికీ, యెషయా 54:17 చెబుతున్న ప్రకారం ‘మనకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. యెహోవా తన నిర్ణయ కాలంలో, తాను అనుకున్న రీతిలో మనం విడుదలయ్యేలా చూస్తాడు’ అని చెబుతూ సహోదరుడు జారస్ ముగించారు.
‘పూర్ణముగా సిద్ధపడిన’ 112వ గిలియడ్ తరగతిలోని గ్రాడ్యుయేట్లు, తాము సేవ చేయబోతున్న ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక క్షామ బాధితులకు సహాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తారనడంలో సందేహం లేదు. (2 తిమోతి 3:16, 17) ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ప్రతిఫలదాయకమైన సందేశాన్ని వారు ఎలా అందజేస్తారో తెలిపే నివేదికల కోసం మనం ఆతృతతో ఎదురు చూద్దాం.
[23వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 6
పంపించబడిన దేశాల సంఖ్య: 19
విధ్యార్థుల సంఖ్య: 48
సగటు వయస్సు: 33.2
సత్యంలో సగటు సంవత్సరాలు: 15.7
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు 12.2
[24వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 112వ తరగతి గ్రాడ్యుయేట్‌లు
ఈ క్రింద ఇవ్వబడిన లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలో ఎడమ వైపు నుండి కుడి వైపుకు పేర్కొనబడ్డాయి.
(1) పారొట్ ఎమ్.; హూకర్, ఈ.; ఆనాయా, ఆర్.; రెనాల్డ్స్, జె.; జెస్‌వాల్దీ, కె.; గొంసాలెస్, జె. (2) రాబిన్‌సన్, సి.; ఫిలిప్స్, బి.; మేడ్‌మంట్, కె.; మూర్, ఐ.; నోక్స్, జె.; బార్నెట్, ఎస్. (3) స్టైర్స్, టి.; పామర్, బి.; యంగ్, సి.; గ్రూత్యుస్, ఎస్.; గ్రోప్, టి.; బాక్, సి. (4) ఆనాయా, ఆర్.; సూకరఫ్, ఈ.; స్టీవర్ట్, కె.; సిమోస్‌రాగ్, ఎన్.; సిమొటెల్, సి.; బాక్, ఈ. (5) స్టీవర్ట్, ఆర్.; యంగ్, హెచ్.; జిల్‌ఫెదర్, ఎ.; హారిస్, ఆర్.; బార్నెట్, డి.; పారొట్, ఎస్. (6) మేడ్‌మంట్, ఎ.; మూర్, జె.; గ్రూత్యుస్, సి.; జిల్‌ఫెదర్, సి.; నోక్స్, ఎస్.; స్టైర్స్, టి. (7) జెస్‌వాల్దీ, డి.; గ్రోప్, టి.; సూకరఫ్, బి.; పామర్, జి.; ఫిలిప్స్, ఎన్.; సిమొటెల్, జె. (8) హారిస్, ఎస్.; హూకర్, పి.; గొంసాలెస్, జె.; సిమోస్‌రాగ్, డి.; రెనాల్డ్స్, డి.; రాబిన్‌సన్, ఎమ్.