కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఒక క్రైస్తవ స్త్రీ, ఆధ్యాత్మిక కారణాలనుబట్టి ఎలాంటి పరిస్థితుల్లో తన తలమీద ముసుగు వేసుకోవడం సముచితమైనది?

“ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ఎందుకు? ఎందుకంటే శిరస్సత్వం గురించిన దేవుని సూత్రం ఇలా చెబుతోంది: ‘స్త్రీకి శిరస్సు పురుషుడు.’ క్రైస్తవ సంఘంలో ప్రార్థించడం గానీ బోధించడం గానీ సాధారణంగా పురుషుని బాధ్యత. కాబట్టి ఒక క్రైస్తవ స్త్రీ ఆరాధనకు సంబంధించిన విషయాల్లో సాధారణంగా తన భర్త గానీ బాప్తిస్మం పొందిన ఒక పురుషుడు గానీ నిర్వహించే వాటిని ఆమె నిర్వహిస్తున్నప్పుడు తన తలమీద ముసుగు వేసుకోవాలి.​—⁠1 కొరింథీయులు 11:​3-10.

ఒక క్రైస్తవ స్త్రీ తలమీద ముసుగు వేసుకోవాల్సిన పరిస్థితులు తన వైవాహిక సంబంధంలో ఎదురవుతుండవచ్చు. ఉదాహరణకు, కుటుంబమంతా బైబిలు అధ్యయనానికి గానీ భోజనానికి గానీ కూర్చున్నప్పుడు, బోధించడమూ అందరి తరపున దేవునికి ప్రార్థించడమూ సాధారణంగా భర్తే చేస్తాడు. కానీ ఆయన అవిశ్వాసి అయితే, ఆ బాధ్యత భార్య నిర్వహించవచ్చు. కాబట్టి, తన తరపునా ఇతరుల తరపునా బిగ్గరగా ప్రార్థించేటప్పుడు గానీ తన భర్త సమక్షంలో తన పిల్లలతో బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు గానీ ఒక క్రైస్తవ సహోదరి సముచితంగానే ముసుగు వేసుకొంటుంది. ఆమె భర్త అక్కడ లేకపోతే భార్య ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె తన పిల్లలకు బోధించడమనేది దేవుడిచ్చిన అధికారం.​—⁠సామెతలు 1:⁠8; 6:​20.

కానీ ఒక కుటుంబంలో, బాప్తిస్మం పొందిన యెహోవా దేవుని సేవకుడైన చిన్న అబ్బాయి ఉంటే అప్పుడెలా? ఆ అబ్బాయి క్రైస్తవ సంఘ సభ్యుడు కాబట్టి, సంఘంలోని సహోదరుల నుండి ఉపదేశం పొందాలి. (1 తిమోతి 2:​12) ఆ అబ్బాయి తండ్రి విశ్వాసి అయితే, తన తండ్రి చేత బోధించబడాలి. కానీ, తండ్రి అక్కడ లేనప్పుడు తల్లి బాప్తిస్మం పొందిన ఆ అబ్బాయితో గానీ ఇతర పిల్లలతో గానీ బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నట్లైతే ఆమె తన తలమీద ముసుగు వేసుకోవాలి. అలాంటి అధ్యయన సమయంలో గానీ భోజన సమయంలో గానీ ఆ అబ్బాయితో ప్రార్థన చేయించాలా వద్దా అన్నది ఆమె వివేచనపై ఆధారపడివుంటుంది. అందుకు తగిన సామర్థ్యం ఆయనలో ఇంకా కలగలేదని ఆమెకు అనిపిస్తే తనే ప్రార్థన చేయడానికి నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఆమె ప్రార్థిస్తున్నట్లైతే తన తలమీద ముసుగు వేసుకోవాలి.

ఒక క్రైస్తవ స్త్రీ కొన్ని సంఘ కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు తన తలమీద ముసుగు వేసుకోవాలి. ఉదాహరణకు, వారం మధ్యలో క్షేత్ర సేవ కోసం జరిగే కూటంలో బాప్తిస్మం పొందిన పురుషులెవరూ లేకుండా క్రైస్తవ సహోదరీలు మాత్రమే ఉండవచ్చు. లేదా ఒక క్రైస్తవ కూటంలో బాప్తిస్మం పొందిన పురుషులు ఎవరూ లేని ఇతర సందర్భాలు ఉండవచ్చు. అలాంటప్పుడు సంఘం తరపున ఏర్పాటు చేసిన ఒక కూటంలో గానీ క్షేత్ర సేవ కోసం జరిగే కూటంలో గానీ సాధారణంగా ఒక సహోదరుడు నిర్వహించే విధులను ఒక సహోదరి నిర్వహించాల్సి వస్తే ఆమె తన తలమీద ముసుగు వేసుకోవాలి.

ఒక క్రైస్తవ స్త్రీ క్రైస్తవ కూటంలో బైబిలు ప్రసంగాలను అనువదిస్తున్నప్పుడు గానీ వాటిని సంజ్ఞాభాషలో అనువదిస్తున్నప్పుడు గానీ సంఘ కూటంలో ఉపయోగిస్తున్న బైబిలు అధ్యయన సహాయకం నుండి కొన్ని పేరాలను బహిరంగంగా చదివేటప్పుడు గానీ ఆమె ముసుగు వేసుకోవాలా? అవసరం లేదు. అలాంటి విధులను నిర్వహిస్తున్న సహోదరీలు ఆ విధులకు అధ్యక్షత వహించడం గానీ బోధించడం గానీ చేయడం లేదు. అదే విధంగా, ప్రదర్శనలు ఇచ్చేటప్పుడూ అనుభవాలు చెప్పేటప్పుడూ లేదా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని ప్రసంగాలను నిర్వహించేటప్పుడూ సహోదరీలు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు.

సంఘంలో బోధించే బాధ్యత బాప్తిస్మం పొందిన పురుషులు చేపట్టగా, సంఘం బయట ప్రకటించే బాధ్యతా బోధించే బాధ్యతా స్త్రీ పురుషులిద్దరి మీదా ఉంది. (మత్తయి 24:​14; 28:​19, 20) కాబట్టి ఒక క్రైస్తవ స్త్రీ సంఘం బయట యెహోవాసాక్షి అయిన ఒక సహోదరుని సమక్షంలో దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు.

కానీ బాప్తిస్మం పొందిన పురుషుని సమక్షంలో, ఒక ఇంట్లో క్రమంగా బైబిలు అధ్యయనం నిర్వహించబడుతున్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అది ముందుగానే నిర్ణయించుకోబడిన బోధనా కార్యక్రమం, దానికి అధ్యయనం నిర్వహించే వ్యక్తే అధ్యక్షత వహిస్తారు. ఈ పరిస్థితుల్లో, ఆ అధ్యయనం సంఘానికి సంబంధించినదవుతుంది. అలాంటి అధ్యయనాన్ని బాప్తిస్మం పొందిన ఒక స్త్రీ బాప్తిస్మం పొందిన ఒక పురుషుని సమక్షంలో నిర్వహిస్తున్నట్లైతే, ఆమె తన తలమీద ముసుగు వేసుకోవడం సముచితమే. అయితే, బాప్తిస్మం పొందిన సహోదరుడే ప్రార్థన చేయాలి. బాప్తిస్మం పొందిన సహోదరుడు మాట్లాడే శక్తిని కోల్పోవడం వంటి ప్రత్యేక కారణం ఉంటే తప్ప ఆయన సమక్షంలో ఒక సహోదరి ప్రార్థన చేయకూడదు.

ఒక క్రైస్తవ సహోదరి బైబిలు అధ్యయనం చేయడానికి వెళ్తున్న సందర్భంలో బాప్తిస్మం పొందని ఒక రాజ్య ప్రచారకుడు తోడుగా వెళ్తుండవచ్చు. ఆమె కావాలనుకుంటే బైబిలు అధ్యయనం చేయమని ఆయనను కోరవచ్చు. కానీ ఆయన యెహోవాకు చేసే ప్రార్థనలో బాప్తిస్మం పొందిన ఆ సహోదరికి తగినట్లు ప్రాతినిధ్యం వహించలేడు కాబట్టి, ఆ అధ్యయనంలో ఆమె ప్రార్థించడమే సముచితమైనది. ఆ సహోదరి అధ్యయనం నిర్వహిస్తున్నా ప్రార్థిస్తున్నా తన తలమీద ముసుగు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రచారకుడు ఇంకా బాప్తిస్మం పొందనప్పటికీ ఆయన ప్రకటనా పనినిబట్టి బయటి వాళ్ళు ఆయనను సంఘానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తిస్తారు.

“దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. అవును, యెహోవా మీద భక్తివిశ్వాసాలతో ఆయనకు లోబడి ఉండడంలో కొనసాగుతున్న కోట్లాది దేవదూతలకు మంచి మాదిరులుగా ఉండే ఆధిక్యత క్రైస్తవ సహోదరీలకు ఉంది. భక్తిగల ఆ స్త్రీలు తలమీద ముసుగు వేసుకోవడం అవసరమైన సందర్భాలకు తగిన అవధానాన్ని ఇవ్వడం ఎంత సముచితం!

[26వ పేజీలోని చిత్రాలు]

తలమీది ముసుగు శిరస్సత్వానికి గౌరవ సూచన