ఆధునిక గ్రీకు భాషలో బైబిలు కోసం పోరాటం
ఆధునిక గ్రీకు భాషలో బైబిలు కోసం పోరాటం
కొన్నిసార్లు, స్వేచ్ఛా తలంపులకు మూలస్థానం అని పిలువబడే గ్రీస్‌లో, సాధారణ ప్రజలు మాట్లాడే భాషలోకి బైబిలును అనువదించడం దీర్ఘకాలం వరకూ కొనసాగిన ఒక తీవ్రమైన పోరాటం అని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, సులభంగా అర్థం చేసుకోగలిగే గ్రీకు బైబిలును తయారుచేయడాన్ని ఎవరు నిరోధిస్తారు? ఆ పనిని ఆపుచేయాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు?
పరిశుద్ధ లేఖనాలలో ఎంతో భాగం గ్రీకులోనే వ్రాయబడింది కాబట్టి, గ్రీకు మాట్లాడే ప్రజలు ఆధిక్యతగల ప్రజలు అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆధునిక గ్రీకు భాష, హీబ్రూ లేఖనాల సెప్టాజింట్ అనువాదంలో ఉపయోగించబడిన గ్రీకు భాష నుండి, క్రైస్తవ గ్రీకు లేఖనాలు వ్రాయడానికి ఉపయోగించబడిన గ్రీకు భాష నుండి చాలా భిన్నంగా ఉంటుంది. నిజానికి, గత ఆరు శతాబ్దాలుగా, గ్రీకు మాట్లాడే ప్రజలలో చాలామంది, విదేశీ భాషను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో బైబిలులో ఉపయోగించబడిన గ్రీకు భాషను అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టమని గ్రహించారు. పాత పదాల స్థానంలో క్రొత్త పదాలు వచ్చాయి, పదజాలం, వ్యాకరణం, వాక్యనిర్మాణం మారిపోయాయి.
మూడవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం మధ్య కాలానికి చెందిన గ్రీకు వ్రాతప్రతుల సంచయం, సెప్టాజింట్‌ను ఆధునిక గ్రీకులోకి అనువదించాలని చేసిన కృషికి సాక్ష్యమిస్తుంది. మూడవ శతాబ్దంలో, నియోసిజెరియా బిషప్ అయిన గ్రెగరీ (సుమారు సా.శ. 213 నుండి సుమారు సా.శ. 270 వరకు) ప్రసంగి పుస్తకాన్ని సెప్టాజింట్ నుండి సరళమైన గ్రీకులోకి అనువదించాడు. 11వ శతాబ్దంలో, మాసిడోనియాలో నివసించిన టోబాయస్ బెన్ ఎలియాజర్ అనే యూదుడు సెప్టాజింట్ పెంటాటుక్‌లోని కొన్ని భాగాలను రోజు మాట్లాడుకునే గ్రీకు భాషలోకి అనువదించాడు. కేవలం గ్రీకు భాషను మాట్లాడుతూ హీబ్రూ లిపిని చదివే మాసిడోనియన్ యూదుల ప్రయోజనం కోసం ఆయన హీబ్రూ అక్షరాలను కూడా ఉపయోగించాడు. ఈ రకానికి చెందిన ఒక సంపూర్ణ పెంటాటుక్ 1547వ సంవత్సరంలో కాన్‌స్టాంటినోపుల్‌లో ప్రచురించబడింది.
చీకటి మధ్య కొంత వెలుగు
15వ శతాబ్దంలో, బైజాంటైన్ సామ్రాజ్యంలోని గ్రీకు మాట్లాడే ప్రాంతాలు ఆటోమాన్‌ల అధికారం క్రిందకు వచ్చిన తర్వాత, ఆ ప్రాంతాలలోని అధిక శాతం ప్రజలు విద్యాభ్యాసం లేకుండా వదిలివేయబడ్డారు. ఆటోమాన్ సామ్రాజ్యంలో ఆర్థడాక్స్ చర్చీకి ప్రత్యేకమైన స్థానం ఉన్నప్పటికీ, అది తన సభ్యులు నిరుపేదలుగా, నిరక్షరాస్యులైన రైతాంగంగా తయారయ్యేలా వారిని నిర్లక్ష్యంగా వదిలేసింది. గ్రీకు రచయిత థామస్ స్పీల్యోస్ ఇలా వ్యాఖ్యానించాడు: “ఆర్థడాక్స్ చర్చీకి దాని విద్యా వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యమైన లక్ష్యం, తన చర్చీ సభ్యులను ఇస్లాం మత ఆక్రమణ నుండి, రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాల నుండి కాపాడడమే. దాని ఫలితంగా, గ్రీకు విద్యాభ్యాసం కొంతమేరకు మందగించింది.” ఇలాంటి నిరాశాపూరితమైన వాతావరణంలో, బాధతోవున్న ప్రజలకు బైబిలు పుస్తకమైన కీర్తనలనుండి ఉపశమనాన్ని, ఓదార్పును అందించాల్సిన అవసరాన్ని బైబిలును ప్రేమించే ప్రజలు గ్రహించారు. 1543వ సంవత్సరం నుండి 1835వ సంవత్సరం వరకూ కీర్తనల గ్రంథాన్ని వ్యవహారిక గ్రీకులోకి అనువదిస్తూ 18 అనువాదాలు తయారుచేయబడ్డాయి.
సంపూర్ణ క్రైస్తవ గ్రీకు లేఖనాల మొదటి గ్రీకు అనువాదాన్ని, 1630వ సంవత్సరంలో కాల్లిపోలిస్‌కు చెందిన గ్రీకు సన్యాసి మాక్సిమస్ కాలిపోలిటిస్ సిద్ధం చేశాడు. ఈ అనువాదపు పని, కాన్‌స్టాంటినోపుల్ బిషప్, ఆర్థడాక్స్ చర్చీకి కాబోయే సంస్కర్త అయిన సిరిల్ లూకారిస్ నిర్దేశం క్రిందా ఆయన ఆధ్వర్యం క్రిందా జరిగింది. అయితే, చర్చీలో ఉన్న లూకారిస్ వ్యతిరేకులు, సంస్కరణ * ఆయనను ఒక ద్రోహి అని గొంతు నులిమి చంపేశారు. అయినప్పటికీ, మాక్సిమస్ చేసిన అనువాదానికి సంబంధించిన దాదాపు 1,500 కాపీలు 1638వ సంవత్సరంలో ప్రచురించబడ్డాయి. ఈ అనువాదానికి ప్రతిస్పందనగా 34 సంవత్సరాల తర్వాత, యెరూషలేములోని ఒక ఆర్థడాక్స్ మతగురువుల సభ, లేఖనాలను “సామాన్య ప్రజలు చదవకూడదు, తగిన పరిశోధన చేసిన తర్వాత లోతైన ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు మాత్రమే చదవాలి” అని ప్రకటించింది. అంటే లేఖనాలను కేవలం విద్యాభ్యాసం చేసిన మతగురువులు మాత్రమే చదవాలని అర్థం.
ప్రయత్నాలను అంగీకరించేవారు కాదు, వ్యవహారిక భాషలో బైబిలు అనువాదానికి ఒప్పుకునేవారు కాదు.1703వ సంవత్సరంలో లెజ్‌వోస్ ద్వీపానికి చెందిన గ్రీకు సన్యాసి సెరాఫిమ్, లండన్‌లో మాక్సిమస్ అనువాదానికి ఒక సంస్కరణా అనువాదాన్ని ప్రచురించాలని ప్రయత్నించాడు. ఆర్థిక సహాయం చేస్తామని ఆంగ్లేయుల రాజాస్థానం చేసిన వాగ్దానాలు నెరవేరనప్పుడు, ఆయన తన సొంత డబ్బు ఖర్చుపెట్టి ఆ సంస్కరణా అనువాదాన్ని ప్రచురించాడు. ఆగ్రహపూరితమైన ఉపోద్ఘాతంలో ఆయన “దైవభక్తిగల ప్రతి క్రైస్తవుడు” బైబిలును చదవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాడు, ఉన్నత స్థానాల్లో ఉన్న చర్చీ మతగురువులు “ప్రజలను అజ్ఞానంలో ఉంచడం ద్వారా తమ తప్పుడు ప్రవర్తనను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని” ఆరోపించాడు. ఆర్థడాక్స్ వ్యతిరేకులు ఆయనను రష్యాలో అరెస్టు చేయించి, సైబీరియాకు బహిష్కరించారు, అక్కడ 1735వ సంవత్సరంలో ఆయన మరణించాడు, ఇలా జరుగుతుందని ఆయన ఊహించేవుంటాడు.
ఆ కాలంలో గ్రీకు మాట్లాడే ప్రజల తీవ్రమైన ఆధ్యాత్మిక ఆకలి గురించి వ్యాఖ్యానిస్తూ, మాక్సిమస్ అనువాదానికి చెందిన తర్వాతి సంస్కరణా అనువాదం గురించి ఒక గ్రీకు ప్రీస్టు ఇలా వ్యాఖ్యానించాడు: “ఇతర ప్రజలతో పాటు గ్రీకు ప్రజలు ఈ పరిశుద్ధ బైబిలును ప్రేమతో, ఆర్ద్రతతో స్వీకరించారు. వారు దాన్ని చదివారు. వారు తమలో ఉన్న బాధ ఉపశమింపజేయబడినట్లు భావించారు, దేవునిపై వారికున్న విశ్వాసం . . . బలపర్చబడింది.” అయితే, ప్రజలు బైబిలును అర్థం చేసుకోవడం మొదలుపెడితే, మతగురువుల లేఖన విరుద్ధమైన నమ్మకాలు, క్రియలు బయటపడిపోతాయని వారి ఆధ్యాత్మిక గురువులు భయపడ్డారు. కాబట్టి, 1823వ సంవత్సరంలో, తర్వాత మళ్ళీ 1836వ సంవత్సరంలో, కాన్‌స్టాంటినోపుల్ బిషప్ కార్యాలయం, ఇలాంటి బైబిలు అనువాదాలన్నింటినీ కాల్చివేయమని ప్రకటన జారీచేసింది.
ధైర్యవంతుడైన అనువాదకుడు
తీవ్రమైన వ్యతిరేకతా, బైబిలు జ్ఞానం కోసం హృదయపూర్వకమైన కోరికా గల ఈ నేపథ్యంలో, బైబిలును ఆధునిక గ్రీకు భాషలోకి అనువదించడంలో కీలకమైన పాత్ర వహించనున్న ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ముందుకువచ్చాడు. ధైర్యవంతుడైన ఆ వ్యక్తి నెయోఫిటోస్ వాంవాస్. ఆయన సుప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త, పేరొందిన బైబిలు పండితుడు, “దేశానికి చెందిన బోధకులు”లో ఒకరిగా పరిగణించబడ్డాడు.
ప్రజలు ఆధ్యాత్మికంగా నిరక్షరాస్యులుగా ఉండడానికి ఆర్థడాక్స్ చర్చే కారణమని వాంవాస్ స్పష్టంగా గ్రహించాడు. ప్రజలను ఆధ్యాత్మిక నిద్రనుండి మేల్కొల్పడానికి, బైబిలును సాధారణ గ్రీకు భాషలోకి అనువదించవలసిన అవసరం ఉందని ఆయన బలంగా విశ్వసించాడు. 1831వ సంవత్సరంలో, ఇతర పండితుల సహాయంతో ఆయన బైబిలును గ్రాంథిక గ్రీకు భాషలోకి అనువదించడం ప్రారంభించాడు. ఆయన సంపూర్ణ అనువాదం 1850వ సంవత్సరంలో ప్రచురించబడింది. గ్రీక్ ఆర్థడాక్స్ చర్చీ ఆయనకు మద్దతునివ్వలేదు కాబట్టి, తన అనువాదాన్ని ప్రచురించడం కోసం, వాటి పంపిణీ కోసం ఆయన బ్రిటీష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ (బి.ఎఫ్.బి.ఎస్) సహాయం తీసుకున్నాడు. చర్చీ ఆయనను “ప్రొటెస్టెంట్” అని పిలిచింది, త్వరలోనే ఆయన బహిష్కరించబడిన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
వాంవాస్ అనువాదం కింగ్ జేమ్స్ వర్షన్‌ను సన్నిహితంగా అంటిపెట్టుకుని చేయబడింది, ఆ కాలంలో బైబిలుకు సంబంధించిన జ్ఞానము, అవగాహన, భాషాశాస్త్రానికి సంబంధించిన జ్ఞానము పరిమితంగా ఉండడంవల్ల ఆ అనువాదంలో ఉన్న లోపాలను ఈ అనువాదం కూడా సంతరించుకుంది. అయినప్పటికీ, అనేక సంవత్సరాలపాటు, ప్రజలకు అందుబాటులో ఉన్న ఆధునిక గ్రీకు బైబిలు అదే. ఆసక్తికరంగా, ఈ అనువాదంలో ఆదికాండము 22:14; నిర్గమకాండము 6:3; 17:15; న్యాయాధిపతులు 6:24.
“ఇయోవా” రూపంలో దేవుని వ్యక్తిగత నామం నాలుగుసార్లు చేర్చబడింది.—అర్థం చేసుకోవడానికి సులభంగా ఉన్న ఈ బైబిలు, ఇతర బైబిలు అనువాదాల పట్ల ప్రజల సాధారణ ప్రతిస్పందన ఏమిటి? ప్రజలు అద్భుతంగా ప్రతిస్పందించారు! గ్రీకు ద్వీపాలలో ఒకదాని వద్ద ఒక పడవలో బి.ఎఫ్.బి.ఎస్‌కు చెందిన బైబిళ్ళను అమ్మే వ్యక్తి దగ్గరకు “[బైబిళ్ళ] కోసం పడవల నిండా ఎంత మంది చిన్నపిల్లలు వచ్చారంటే . . . ఆ ఓడరేవును వదిలి బయల్దేరమని క్యాప్టెన్‌కు ఆదేశం ఇవ్వడానికి ఆయన బలవంతపెట్టబడ్డాడు” లేకపోతే ఆయన దగ్గరున్న బైబిళ్ళన్నీ ఒకే స్థలంలో అయిపోయేవి! అయితే వ్యతిరేకులు కూడా వెంటనే ప్రతిస్పందించారు.
ఆర్థడాక్స్ ప్రీస్టులు ప్రజలను ఇలాంటి అనువాదాలు తీసుకోవద్దని హెచ్చరించారు. ఉదాహరణకు, ఏథెన్స్ నగరంలో బైబిళ్ళు జప్తు చేసుకోబడ్డాయి. 1833వ సంవత్సరంలో, క్రీట్‌కు చెందిన ఆర్థడాక్స్ బిషప్, ఒక క్రైస్తవ సన్యాసుల మఠంలో కనుగొన్న “క్రొత్త నిబంధనల”ను కాల్చివేశాడు. ఒక ప్రీస్టు ఒక బైబిలును దాచిపెట్టాడు, సమీపంలోవున్న గ్రామాలలోని ప్రజలు ఆ మతాధికారి ద్వీపాన్ని వదిలివెళ్ళిపోయేంతవరకూ తమ బైబిళ్ళను దాచిపెట్టుకున్నారు.
కొన్ని సంవత్సరాల తర్వాత, కోర్ఫూ ద్వీపంలో, గ్రీక్ ఆర్థడాక్స్ చర్చీకి చెందిన పరిశుద్ధ క్రైస్తవ మతగురువుల సభ వాంవాస్ అనువాదాన్ని నిషేధించింది. దాని అమ్మకం నిషేధించబడి, ప్రస్తుతం ప్రజలవద్ద ఉన్న కాపీలు నాశనం చేయబడ్డాయి. కియోస్, సిరోస్, మైకొనాస్ ద్వీపాల్లో స్థానిక ప్రీస్టుల ప్రతికూలత వల్ల బైబిళ్ళు కాల్చివేయబడ్డాయి. అయితే, బైబిలు అనువాదపు అణచివేత ఇంకా ముందుంది.
ఒక మహారాణి బైబిలుపట్ల ఆసక్తి చూపిస్తుంది
1870ల కాలంలో, గ్రీస్‌కు చెందిన మహారాణి ఓల్గా, సాధారణ గ్రీకు ప్రజలకు ఇప్పటికీ బైబిలు గురించి చాలా తక్కువ జ్ఞానం ఉందని గ్రహించింది. లేఖనాల జ్ఞానం, దేశానికి ఓదార్పునూ ఉపశమనాన్నీ కలుగజేస్తుందని నమ్మి ఆమె వాంవాస్ అనువాదం కన్నా సరళమైన భాషలో బైబిలు అనువదించబడేలా చేయాలని ప్రయత్నించింది.
ఏథెన్స్ ఆర్చ్‌బిషప్, పరిశుద్ధ క్రైస్తవ మతగురువుల సభ శిరస్సు అయిన ప్రోకోపాయిస్ ఈ పని విషయంలో మహారాణిని అనధికారికంగా ప్రోత్సహించాడు. అయితే ఆమె అధికారిక ఆమోదం కోసం పరిశుద్ధ క్రైస్తవ మతగురువుల సభకు దరఖాస్తు పెట్టినప్పుడు, ఆమెకు అనుమతి ఇవ్వబడలేదు. అయినప్పటికీ, ఆమె పట్టుదలతో మరో క్రొత్త దరఖాస్తును సమర్పించింది. ఈ సారి కూడా అంటే 1899వ సంవత్సరంలో ఆమెకు అనుమతి దొరకలేదు. ఆమె ఆ అనంగీకారాన్ని పట్టించుకోకుండా తన సొంత ఖర్చుతో కొన్ని కాపీలను మాత్రమే ప్రచురించడానికి నిశ్చయించుకుంది. 1900 లో ఆ అనువాదం ప్రచురించబడింది.
సులభంగా విడిచిపెట్టని వ్యతిరేకులు
1901వ సంవత్సరంలో, ఏథెన్స్‌కు చెందిన ఒక ప్రముఖ వార్తాపత్రిక ది ఆక్రోపోలిస్, ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌లో పనిచేస్తున్న అనువాదకుడైన అలెగ్జాండర్ పాల్లిస్ వ్యవహారికంగా ఉన్న ఆధునిక గ్రీకులోకి అనువదించిన మత్తయి సువార్తను ప్రచురించింది. పాల్లిస్, అతని సహోద్యోగుల ఉద్దేశం, ‘గ్రీకులకు
నేర్పించాలి,’ నైతిక పతనం నుండి “దేశం కోలుకోవడానికి సహాయపడాలి” అన్నదేనని స్పష్టమవుతోంది.ఆర్థడాక్స్ మతధర్మశాస్త్ర విద్యార్థులు, వారి ప్రొఫెసర్లు ఈ అనువాదాన్ని “దేశానికి సంబంధించిన అత్యంత విలువైన, పూజ్యనీయమైన వాటిని ఎగతాళి చేయడం,” అనీ బైబిలును అపవిత్రపర్చడమనీ అన్నారు. కాన్‌స్టాంటినోపుల్‌కు చెందిన ఇయోయాకిమ్ III అనే బిషప్ ఈ అనువాదానికి అసమ్మతి తెలుపుతూ శాసనాన్ని జారీచేశాడు. ఈ వివాదం రాజకీయ రూపం దాల్చింది, పోరాటం సాగిస్తున్న రాజకీయ క్యాంపులు దాన్ని వక్రంగా ఉపయోగించుకున్నాయి.
ఏథీనియన్ ప్రెస్‌లో పలుకుబడి గలవారు పాల్లిస్ అనువాద మద్దతుదారులను “నాస్తికులు,” “ద్రోహులు,” గ్రీకు సమాజాన్ని బలహీనపర్చాలని తీర్మానించుకున్న “విదేశీ శక్తుల ప్రతినిధులు” అని పిలుస్తూ పాల్లిస్ అనువాదంపై దాడి చేయడం ప్రారంభించారు. 1901వ సంవత్సరం, నవంబరు 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు, గ్రీక్ ఆర్థడాక్స్ చర్చీకి సంబంధించిన అతి పూర్వాచారపరాయణ గుంపుల పురికొల్పుతో విద్యార్థులు ఏథెన్స్‌లో కలహాలు రేపారు. వారు ది ఆక్రోపోలిస్ కార్యాలయాలపై దాడి చేశారు, రాజభవనానికి వ్యతిరేకంగా తమ అసమ్మతిని ప్రకటించారు, ఏథెన్స్ విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించుకున్నారు, ప్రభుత్వాన్ని రాజీనామా చేయమని అడిగారు. కలహాలు ముగిసేసరికి, సైన్యంతో జరిగిన ఘర్షణలో 8 మంది మరణించారు. మరుసటి రోజు, ఆర్చ్‌బిషప్ ప్రోకోపాయిస్‌ను రాజీనామా చేయమని రాజు ఆజ్ఞాపించాడు. రెండు రోజుల తర్వాత మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది.
ఒక నెల తర్వాత, విద్యార్థులు మళ్ళీ కలహాలు సృష్టించి పాల్లిస్ అనువదించిన బైబిల్‌ను బహిరంగంగా కాల్చేశారు. ఈ అనువాదపు పంపిణీకి వ్యతిరేకంగా వారు ఒక తీర్మానాన్ని జారీ చేసి, భవిష్యత్తులో అలా అనువదించడానికి ప్రయత్నించినవారికి తీవ్రమైన శిక్ష విధించబడాలని కోరారు. బైబిలుకు సంబంధించిన ఏ ఆధునిక గ్రీకు అనువాదం ఉపయోగాన్నైనా నిషేధించేందుకు ఇది ఒక సాకులా ఉపయోగపడింది. అది నిజంగానే చీకటి సమయం!
“ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును”
1924వ సంవత్సరంలో ఆధునిక గ్రీకు భాషలో బైబిలు ఉపయోగానికి వ్యతిరేకంగా చేసిన నిషేధం రద్దుచేయబడింది. అప్పటినుండి, బైబిలును ప్రజల నుండి దూరంగా ఉంచాలని గ్రీక్ ఆర్థడాక్స్ చర్చీ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమయ్యింది. అదే సమయంలో మరోవైపు, అనేక ఇతర దేశాలలో చేసినట్లే గ్రీస్‌లో బైబిలు విద్యను విస్తరింపజేయడంలో యెహోవాసాక్షులు నాయకత్వం వహించారు. వేలాదిమంది గ్రీకు మాట్లాడే ప్రజలు బైబిలు సత్యానికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకునేందుకు సహాయపడడానికి 1905 నుండి వారు వాంవాస్ అనువాదాన్ని ఉపయోగించారు.
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, అనేకమంది విద్వాంసులు, అధ్యాపకులు కలిసి ఆధునిక గ్రీకులో బైబిలును తయారుచేయడానికి ప్రశంసనీయమైన కృషి చేశారు. నేడు, సాధారణ గ్రీకు మాట్లాడే వ్యక్తి చదవగలిగేలా సంపూర్ణ బైబిలు లేదా బైబిలులోని కొంతభాగం దాదాపు 30 అనువాదాలలో లభిస్తుంది. ఆ అనువాదాలలో న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్‌కు సంబంధించిన గ్రీకు అనువాదం నిజంగా అమూల్యమైనది. ప్రపంచవ్యాప్తంగా గ్రీకు భాష మాట్లాడే కోటీ అరవై లక్షల మంది ప్రయోజనార్థం ఈ అనువాదం 1997 లో విడుదల చేయబడింది. యెహోవాసాక్షుల ద్వారా ప్రచురించబడిన ఈ అనువాదం, మూలప్రతికి నమ్మకంగా హత్తుకుని, దేవుని వాక్యాన్ని చదవడానికి సులభంగా ఉండేలా, అర్థం చేసుకోగలిగేలా తయారుచేయబడింది.
ఆధునిక గ్రీకులో బైబిలు కోసం జరిగిన పోరాటం ఒక ప్రాముఖ్యమైన వాస్తవాన్ని ఉదహరిస్తుంది. మానవులు ప్రతికూల ప్రయత్నాలు చేసినప్పటికీ, “ప్రభువు [“యెహోవా,” NW] వాక్యము ఎల్లప్పుడును నిలుచును” అని అది స్పష్టంగా సూచిస్తుంది.—1 పేతురు 1:24.
[అధస్సూచి]
^ పేరా 7 సిరిల్ లూకారిస్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం కావలికోట, ఫిబ్రవరి 15, 2000, 26-9 పేజీలు చూడండి.
[27వ పేజీలోని చిత్రం]
సంపూర్ణ క్రైస్తవ గ్రీకు లేఖనాల మొదటి గ్రీకు అనువాదాన్ని సిరిల్ లూకారిస్ 1630 లో నిర్దేశించాడు
[చిత్రసౌజన్యం]
Bib. Publ. Univ. de Genève
[28వ పేజీలోని చిత్రాలు]
వ్యవహారిక గ్రీకులోని కొన్ని అనువాదాలు: (1) 1828 లో ఇలారియన్‌చే, (2) 1832 లో వాంవాస్‌చే, (3) 1643 లో జూల్యానస్‌చే ప్రచురించబడిన కీర్తనలు. (4) 1840 లో వాంవాస్‌చే ప్రచురించబడిన “పాత నిబంధన.”
ఓల్గా మహారాణి
[చిత్రసౌజన్యం]
బైబిళ్ళు: National Library of Greece; ఓల్గా మహారాణి: Culver Pictures
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
పపైరస్: Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin
[29వ పేజీలోని చిత్రసౌజన్యం]
పపైరస్: Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin