‘ఆయన మీ యొద్దకు వచ్చును’
‘ఆయన మీ యొద్దకు వచ్చును’
“ఆయన [దేవుడు] మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.”—అపొస్తలుల కార్యములు 17:26, 27.
1, 2. (ఎ) నక్షత్రాలతో నిండుగా ఉన్న ఆకాశాన్ని చూసినప్పుడు, సృష్టికర్త గురించి మనం ఏమని ప్రశ్నించుకోవచ్చు? (బి) మానవులు యెహోవా దృష్టిలో ఎంత మాత్రం అల్పులు కాదని బైబిలు మనకెలా హామీ ఇస్తోంది?
మీరెప్పుడైనా నిర్మలమైన రాత్రి నక్షత్రాలతో నిండుగా ఉన్న ఆకాశం వైపు చూసి అబ్బురపడ్డారా? అసంఖ్యాకమైన నక్షత్రాలు, సువిశాలమైన అంతరిక్షం సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. అఖండమైన ఈ విశ్వంలో భూమి కేవలం ఒక చిన్న చుక్క లాంటిది మాత్రమే. అంటే “సర్వలోకములో మహోన్నతు[డు]” అయిన సృష్టికర్త మానవుల గురించి ఆలోచించనంత ఉన్నతమైనవాడని లేదా ఆయన కోసం మానవులు వెదకినా దొరకనంత సుదూరంలో ఉంటాడని దాని భావమా?—కీర్తన 83:18.
2 యెహోవా దృష్టిలో మానవులు ఎంత మాత్రం అల్పులు కాదని బైబిలు మనకు హామీ ఇస్తోంది. నిజానికి “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అని చెబుతూ ఆయన కోసం వెదకమని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. (అపొస్తలుల కార్యములు 17:26, 27; 1 దినవృత్తాంతములు 28:9) మనం దేవునికి దగ్గరవడానికి చర్యలు తీసుకుంటే, ఆయన నిజంగానే మన ప్రయత్నాలకు ప్రతిస్పందిస్తాడు. ఏ విధంగా? మన 2003వ సంవత్సరపు వార్షిక వచనం మనోల్లాసకరమైన ఈ జవాబునిస్తోంది: “[ఆ]యన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:8) యెహోవా తనకు దగ్గరయ్యేవారిపై కుమ్మరించే అద్భుతమైన ఆశీర్వాదాల్లో కొన్నింటిని చర్చిద్దాం.
యెహోవా నుండి లభించే వ్యక్తిగతమైన ఒక బహుమతి
3. యెహోవా తనకు దగ్గరయ్యే వారికి ఇచ్చే బహుమతి ఏమిటి?
3 మొదట, యెహోవా సేవకులకు అమూల్యమైన ఒక బహుమతి ఉంది, దాన్ని ఆయన తన ప్రజలకు మాత్రమే ఇవ్వాలని ఉంచాడు. ఈ దుష్ట విధానం అందించే మొత్తం శక్తి, సంపదలు, విద్య ఏది కూడా ఇవ్వలేనటువంటి బహుమతి అది. అది వ్యక్తిగతంగా పొందే ఒక బహుమతి, యెహోవా దాన్ని తనకు సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే ఇస్తాడు. ఇంతకూ ఏమిటది? దేవుని వాక్యం ఇలా సమాధానమిస్తోంది: “నీవు . . . వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము [“పరిజ్ఞానము,” NW] నీకు లభించును. యెహోవాయే సామెతలు 2:3-6) “దేవుని గూర్చిన పరిజ్ఞానము”ను పొందడం అపరిపూర్ణ మానవులకు సాధ్యమవడాన్ని ఒక్కసారి ఊహించండి! ఆ బహుమతి, అంటే దేవుని వాక్యములో లభించే పరిజ్ఞానము “దాచబడిన ధనము”తో పోల్చబడింది. ఎందుకు?
జ్ఞానమిచ్చువాడు.” (4, 5. “దేవుని గురించిన పరిజ్ఞానము”ను “దాచబడిన ధనము”తో ఎందుకు పోల్చవచ్చు? విశదీకరించండి.
4 ఒక విషయమేమిటంటే, దేవుని పరిజ్ఞానానికి గొప్ప విలువవుంది. దాని వల్ల లభించే అత్యంత గొప్ప ఆశీర్వాదాల్లో ఒకటి, నిత్యజీవపు నిరీక్షణ. (యోహాను 17:3) అయితే ఆ పరిజ్ఞానము ఇప్పుడు కూడా మన జీవితాలను సుసంపన్నం చేస్తుంది. ఉదాహరణకు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం వల్ల దేవుని పేరు ఏమిటి? (కీర్తన 83:18) మరణించినవారి నిజమైన స్థితి ఏమిటి? (ప్రసంగి 9:5, 10) భూమి పట్ల, మానవాళి పట్ల దేవుని సంకల్పం ఏమిటి? (యెషయా 45:18) వంటి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవడంతో పాటు జీవించడానికి శ్రేష్ఠమైన మార్గం జ్ఞానయుక్తమైన బైబిలు సలహాలను అన్వయించుకోవడమేనని కూడా మనం తెలుసుకున్నాం. (యెషయా 30:20, 21; 48:17, 18) ఆ విధంగా మనకు జీవితంలోని చింతలను ఎదుర్కోవడానికీ నిజమైన సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చే జీవన శైలిలో కొనసాగడానికీ సహాయపడే చక్కని మార్గదర్శకం ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడంద్వారా మనం యెహోవా అద్భుతమైన లక్షణాలను తెలుసుకొని ఆయనకు దగ్గరయ్యేలా చేసింది. “దేవుని గురించిన పరిజ్ఞానము” ఆధారంగా యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుచుకోవడం కంటే ఇంకా ఎక్కువ విలువైనది ఏముంటుంది?
5 దేవుని గురించిన పరిజ్ఞానమును “దాచబడిన ధనము”తో ఎందుకు పోల్చవచ్చుననే దానికి మరొక కారణముంది. ఇతర ధనసంపదల్లాగే, ఈ ధనము కూడా ఈ లోకంలో చాలా అరుదుగా లభిస్తుంది. 600 కోట్ల భూనివాసులలో, దాదాపు 60 లక్షల మంది యెహోవా ఆరాధకులు, లేదా 1,000 లో దాదాపు ఒక్కరు మాత్రమే “దేవుని గురించిన పరిజ్ఞానము”ను కనుగొన్నారు. దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకోవడం ఎంత అరుదైన సంపదో స్పష్టం చేయడానికి, కేవలం ఒకే ఒక్క బైబిలు ప్రశ్నను పరిశీలించండి: మానవులు మరణించినప్పుడు వారికి ఏమి సంభవిస్తుంది? మనిషి చనిపోయిన తర్వాత ఇక స్పృహలో ఉండడని మనకు లేఖనాల ద్వారా తెలుసు. (యెషయా 38:18) అయినా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆయనలో ఏదో బ్రతికి ఉంటుందనే తప్పుడు నమ్మకాన్ని ఈ ప్రపంచంలోని అత్యధిక మతాలు స్వీకరించాయి. క్రైస్తవ మత సామ్రాజ్యంలో ఈ బోధన ప్రధానమైన భాగం. ఇది ఇస్లామ్, జైను, తావో, బౌద్ధ, యూదా, సిక్కు, షింటో, హిందూ మతాల్లో కూడా ప్రబలంగా ఉంది. ఈ ఒక్క తప్పుడు సిద్ధాంతంతో వందల కోట్ల మంది మోసగించబడడాన్ని ఒక్కసారి ఆలోచించండి!
6, 7. (ఎ) “దేవుని గురించిన పరిజ్ఞానము”ను ఎవరు మాత్రమే పొందగలరు? (బి) అనేకమంది “జ్ఞానులకును వివేకులకును” లభించని అంతర్దృష్టితో యెహోవా మనల్ని ఆశీర్వదించాడని ఏ ఉదాహరణ చూపిస్తోంది?
6 “దేవుని గురించిన పరిజ్ఞానము”ను ఎక్కువ మంది ఎందుకు పొందలేదు? ఎందుకంటే ఒకవ్యక్తి దేవుని సహాయం లేకుండా ఆయన వాక్య భావాన్ని పూర్తిగా గ్రహించలేడు. ఈ పరిజ్ఞానము ఒక బహుమతి అన్నది గుర్తుంచుకోండి. యెహోవా తన వాక్యం కోసం యథార్థంగా నమ్రతతో ఎవరైతే వెదకడానికి ఇష్టపడుతున్నారో వారికి మాత్రమే దాన్ని ఇస్తాడు. అలాంటి వారు “లోకరీతిని జ్ఞాను[లు]” కాకపోవచ్చు. (1 కొరింథీయులు 1:26) వారిలో అనేకమంది ఈ లోకపు ప్రమాణాల విషయంలో “విద్యలేని పామరు[లు]”గా కూడా పరిగణించబడవచ్చు. (అపొస్తలుల కార్యములు 4:13) అయినా అది అంత ప్రాముఖ్యం కాదు. మన హృదయాల్లో కనిపించే లక్షణాలను బట్టి యెహోవా మనకు “దేవుని గురించిన పరిజ్ఞానము” అనే ప్రతిఫలాన్ని ఇస్తాడు.
7 ఒక ఉదాహరణను పరిశీలించండి. క్రైస్తవ మత సామ్రాజ్యంలోని అనేకమంది విద్వాంసులు బైబిలు మీద విస్తృతమైన వ్యాఖ్యానాలను తయారుచేశారు. అలాంటి రెఫరెన్సులు చారిత్రక నేపథ్యాన్ని, హీబ్రూ గ్రీకు పదాల అర్థాలను తదితరమైన వాటిని వివరిస్తుండవచ్చు. తాము నేర్చుకున్న దానంతటితోనూ ఆ విద్వాంసులు “దేవుని గురించిన పరిజ్ఞానము”ను నిజంగా కనుగొన్నారా? యెహోవా తన సర్వాధిపత్యాన్ని తన పరలోక రాజ్యం ద్వారా రుజువుచేయడమనే బైబిలు ముఖ్యాంశాన్ని వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకున్నారా? యెహోవా దేవుడు త్రిత్వంలో ఒక భాగం కాదని వాళ్ళకు తెలుసా? ఆ విషయాలపై ఖచ్చితమైన అవగాహన మనకుంది. ఎందుకలా? ఎందుకంటే యెహోవా అనేకమంది “జ్ఞానులకును వివేకులకును” దొరకని ఆధ్యాత్మిక సత్యాలపై అంతర్దృష్టితో మనల్ని ఆశీర్వదించాడు. (మత్తయి 11:25) యెహోవా తనకు దగ్గరయ్యే వారిని ఎంత ఘనంగా ఆశీర్వదిస్తాడో కదా!
“యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును”
8, 9. (ఎ) యెహోవాకు సన్నిహితంగా ఉన్నవారు అనుభవించే మరో ఆశీర్వాదం గురించి దావీదు ఎలా వర్ణించాడు? (బి) నిజ క్రైస్తవులకు దేవుని కాపుదల ఎందుకు కావాలి?
8 యెహోవాకు సన్నిహితంగా ఉన్నవారు మరొక ఆశీర్వాదాన్ని కీర్తన 145:18-20) అవును, యెహోవా తనను ప్రేమించేవారికి దగ్గరగానే ఉంటాడు కాబట్టి, వారు సహాయం కోసం మొఱ్ఱపెట్టుకున్నప్పుడు వెంటనే ప్రతిస్పందించగలుగుతాడు.
కూడా అనుభవిస్తారు, అదే ఆయనిచ్చే కాపుదల. కష్టాలను బాగా ఎరిగిన కీర్తనకర్త దావీదు ఇలా వ్రాశాడు: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును.” (9 మనకు దేవుని కాపుదల ఎందుకవసరం? నిజ క్రైస్తవులు ఈ “అపాయకరమైన కాలము”లలో జీవిస్తుండడం వల్ల కలిగే ప్రభావాలను అనుభవించడంతో పాటు యెహోవా ప్రధాన శత్రువైన అపవాదియగు సాతానుకు ప్రధాన లక్ష్యంగా ఉన్నారు. (2 తిమోతి 3:1) ఆ జిత్తులమారి శత్రువు మనల్ని ‘మ్రింగాలని’ నిశ్చయించుకున్నాడు. (1 పేతురు 5:8) సాతాను మనల్ని హింసిస్తాడు, ఒత్తిడికి గురి చేస్తాడు, శోధిస్తాడు. అతడు తన స్వలాభం కోసం తాను ఉపయోగించుకోగల మన మనోవైఖరుల కోసం హృదయ దృక్పథాల కోసం కూడా చూస్తాడు. మన విశ్వాసాన్ని బలహీనపరిచి, మన ఆధ్యాత్మికతను నాశనం చేయాలన్నదే అతని మనోలక్ష్యం. (ప్రకటన 12:12, 17) మనం పోరాడడానికి అంతటి బలమైన శత్రువు ఉన్నాడు కాబట్టి, “యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును” అన్న విషయాన్ని తెలుసుకోవడం మనకు ధైర్యాన్నిచ్చేదిగా ఉండదూ?
10. (ఎ) యెహోవా తన ప్రజలను ఎలా కాపాడతాడు? (బి) అత్యంత ప్రాముఖ్యమైన రక్షణ ఏది, అది ఎందుకంత ప్రాముఖ్యమైనది?
10 అయితే, యెహోవా తన ప్రజలను ఎలా కాపాడతాడు? కాపాడతాననే ఆయన వాగ్దానం ఈ విధానంలో మనకు కష్టాల్లేని జీవితాన్ని హామీ ఇవ్వదు, మన తరఫున అద్భుతాలు చేయడం ఆయన కర్తవ్యం అంతకంటే కాదు. ఏది ఏమైనా, ఆయన తన ప్రజలను ఒక గుంపుగా భౌతికపరంగా కాపాడతాడు. సాతాను ఈ భూమ్మీది నుండి నిజమైన ఆరాధకులను తుడిచి వేయడానికి ఆయన ఎన్నడూ అనుమతించడు! (2 పేతురు 2:9, 10) అన్నింటికంటే ముఖ్యంగా, యెహోవా మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడతాడు. మనం కష్టాలను ఎదుర్కోవడానికి, ఆయనతో మన సంబంధాన్ని కాపాడుకోవడానికి కావలసిన వాటిని ఆయన మనకు సమకూరుస్తాడు. చివరికి ఆధ్యాత్మిక కాపుదలే మనకు కావలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన రక్షణ. ఎందుకు? యెహోవాతో మనకు సంబంధం ఉన్నంత కాలం, మనకు ఏది కూడా శాశ్వతంగా హాని కలిగించలేదు, చివరికి మరణం కూడా.—మత్తయి 10:28.
11. యెహోవా తన ప్రజలకు ఆధ్యాత్మిక కాపుదలను ఇవ్వడం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశాడు?
11 యెహోవా తనకు సన్నిహితంగా ఉన్నవారి ఆధ్యాత్మిక కాపుదల కోసం విస్తృతమైన ఏర్పాట్లను చేశాడు. ఆయన మనకెదురయ్యే పలువిధాల సమస్యలతో విజయవంతంగా వ్యవహరించడానికి కావలసిన జ్ఞానమును తన వాక్యమైన బైబిలు ద్వారా అందిస్తాడు. (యాకోబు 1:2-5) లేఖనాల్లో లభించే ఆచరణీయమైన సలహాలను అన్వయించుకోవడమే ఒక విధమైన కాపుదల. దానితో పాటు, యెహోవా “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను” ఇస్తాడు. (లూకా 11:13) ఆ ఆత్మ ఈ విశ్వమంతటిలోకి అత్యంత శక్తివంతమైనది, కాబట్టి అది మనకెదురయ్యే ఏ కష్టాన్నైనా ఏ శోధననైనా విజయవంతంగా ఎదుర్కొనేందుకు మనల్ని సిద్ధపరుస్తుందన్నది నిస్సంశయం. క్రీస్తు ద్వారా యెహోవా “మనుష్యులకు ఈవులను అనుగ్రహి[స్తాడు].” (ఎఫెసీయులు 4:8) ఆధ్యాత్మిక అర్హతలు గల ఈ పురుషులు తోటి ఆరాధకులకు సహాయం చేయడంలో యెహోవాకున్నటువంటి హృదయపూర్వకమైన కనికరమును వ్యక్తం చేయడానికి కృషి చేస్తారు.—యాకోబు 5:14, 15.
12, 13. (ఎ) యెహోవా మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని వేటి ద్వారా సమయోచితంగా అందిస్తున్నాడు? (బి) మన ఆధ్యాత్మిక సంక్షేమం కోసం యెహోవా చేసిన ఏర్పాట్లను బట్టి మీకేమనిపిస్తోంది?
12 యెహోవా మనల్ని రక్షించడానికి మరొక ఏర్పాటు కూడా చేశాడు: తగిన సమయానికి ఆధ్యాత్మిక ఆహారం అందించబడడం. (మత్తయి 24:45) కావలికోట, తేజరిల్లు! వంటి పత్రికలతోపాటు ఇతర ముద్రిత ప్రచురణల ద్వారా, కూటాల ద్వారా సమావేశాల ద్వారా యెహోవా మనకు ఎప్పుడు ఏమి అవసరమో దాన్ని అందిస్తున్నాడు. క్రైస్తవ కూటంలో గానీ సమావేశంలో గానీ విన్న ఒక విషయం మీ హృదయాన్ని స్పృశించి మిమ్మల్ని ప్రోత్సహించిన లేదా ఓదార్చిన ఒక సందర్భాన్ని మీరు గుర్తుచేసుకోగలరా? మీరు పైన పేర్కొన్న పత్రికల్లోని ఒకదానిలో ఏదైనా ఆర్టికల్ చదివి అది మీ కోసమే వ్రాయబడిందని ఎప్పుడైనా అనుకున్నారా?
13 సాతాను ఉపయోగించే అత్యంత సమర్థవంతమైన ఆయుధాల్లో ఒకటి నిరుత్సాహం, దాని ప్రభావానికి మనమేమీ అతీతులం కాము. ఎక్కువ కాలముండే నైరాశ్యం మన శక్తిని హరింపజేస్తుందనీ, చివరికి మనల్ని అశక్తులుగా చేస్తుందనీ అతడికి బాగా తెలుసు. (సామెతలు 24:10) సాతాను మన ప్రతికూల భావాలను తన స్వలాభానికి వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి, మనకు సహాయం అవసరం. మనం నిరుత్సాహాన్ని ఎదిరించడానికి సహాయపడే ఆర్టికల్‌లు కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో అప్పుడప్పుడు ప్రచురించబడ్డాయి. అలాంటి ఒక ఆర్టికల్ గురించి ఒక క్రైస్తవ సహోదరి ఇలా వ్రాసింది: “నేను ఆ ఆర్టికల్‌ను దాదాపు ప్రతిరోజు చదువుతాను, చదివినప్పుడల్లా ఇప్పటికీ కన్నీరు వరదలా ఉబికివస్తుంది. నాకు నిరుత్సాహం అనిపించినప్పుడల్లా చదివేందుకు వీలుగా నేను దాన్ని నా మంచం పక్కనే పెట్టుకుంటాను. ఇలాంటి ఆర్టికల్‌ల ద్వారా యెహోవా కాపాడే చేతులు నన్ను పెనవేసుకున్నట్లుగా నేను భావిస్తాను.” * యెహోవా మనకు సమయోచితంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నందుకు మనం కృతజ్ఞులమైలేమా? మన ఆధ్యాత్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన ఏర్పాట్లు ఆయన మనకు దగ్గరగా ఉన్నాడనేందుకు, మనల్ని తన సంరక్షణలో ఉంచుకున్నాడనేందుకు నిదర్శనాలని గుర్తుంచుకోండి.
“ప్రార్థన ఆలకించువా[ణ్ణి]” సమీపించే మార్గం
14, 15. (ఎ) యెహోవా తనకు సన్నిహితంగా ఉన్నవారికి అనుగ్రహించే వ్యక్తిగతమైన బహుమతి ఏమిటి? (బి) యెహోవాను ప్రార్థన ద్వారా నిరాటంకంగా సమీపించగలగడం ఎందుకు అసాధారణమైన బహుమతి?
14 మానవులు హోదా అధికారాలను పొందుతున్న కొలది సాధారణంగా వారి కింది స్థాయివారు సులభంగా సమీపించలేని విధంగా అవడాన్ని మీరెప్పుడైనా గమనించారా? మరైతే యెహోవా దేవుని విషయం ఏమిటి? అల్పులైన మానవులు ఆయనకు వ్యక్తం చేసే విషయాలపై ఆసక్తి చూపలేనంత దూరంలో ఆయనున్నాడా? లేదు, దానికి భిన్నంగా ఉన్నాడు! యెహోవా తనకు సన్నిహితంగా ఉన్నవారికి అనుగ్రహించే మరొక ఆశీర్వాదం, ప్రార్థన అనే బహుమతి. “ప్రార్థన ఆలకించువా[ణ్ణి]” నిరాటంకంగా సమీపించగలగడం నిజంగా అసాధారణమైన బహుమతి. (కీర్తన 65:2) ఎందుకు?
15 ఉదాహరణగా చెప్పాలంటే, ఒక పెద్ద సంస్థ యొక్క ప్రధాన కార్యనిర్వహణాధికారికి అనేక బాధ్యతలుంటాయి. ఏ పనులతో తాను స్వయంగా వ్యవహరించాలో, ఇతరులకు ఏ పనులు అప్పగించాలో నిర్ణయిస్తాడు. అదే విధంగా, ఈ విశ్వ సర్వాధిపతికి కూడా ఏ పనులను తాను స్వయంగా నిర్వహించాలో, ఇతరులకు ఏ పనులను అప్పగించాలో నిర్ణయించే స్వేచ్ఛ ఉంది. యెహోవా తనకు ఎంతో ప్రియమైన కుమారుడగు యేసుకు అప్పగించినవాటన్నింటి గురించి ఆలోచించండి. కుమారునికి ‘తీర్పుతీర్చే అధికారము’ ఇవ్వబడింది. (యోహాను 5:27) ఆయన “దూతలమీద[నూ] . . . అధికారము పొం[దాడు].” (1 పేతురు 3:22) శక్తివంతమైన యెహోవా పరిశుద్ధాత్మ ఆయనకు అందుబాటులో ఉంచబడింది, అది భూమ్మీది తన శిష్యులకు మార్గదర్శకాన్ని ఇచ్చేందుకు యేసుకు దోహదపడుతుంది. (యోహాను 15:26; 16:7) ఆ కారణంగానే “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది” అని యేసు చెప్పగలిగాడు. (మత్తయి 28:18) అయితే, మన ప్రార్థనల విషయానికి వచ్చేసరికి మాత్రం యెహోవా తానే స్వయంగా వినాలని ఎంపిక చేసుకున్నాడు. అందుకే మన ప్రార్థనలు యేసు నామం ద్వారా యెహోవాకు మాత్రమే ఉద్దేశించేవై ఉండాలని బైబిలు మనకు నిర్దేశిస్తోంది.—కీర్తన 69:13; యోహాను 14:6, 13.
16. యెహోవా మన ప్రార్థనలను నిజంగా వింటాడని మనమెందుకు దృఢ నమ్మకంతో ఉండవచ్చు?
16 యెహోవా మన ప్రార్థనలను నిజంగా వింటాడా? అలా పట్టించుకునేవాడే కానట్లయితే, “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అని గానీ మన భారములను చింతలను తనమీద మోపుమని గానీ ఎన్నడూ అని ఉండేవాడు కాదు. (రోమీయులు 12:12; కీర్తన 55:22; 1 పేతురు 5:7) యెహోవా తమ ప్రార్థనలు వింటాడనే పూర్తి నమ్మకం బైబిలు కాలాల్లోని విశ్వసనీయులైన సేవకులకు ఉండేది. (1 యోహాను 5:14) ఆ కారణంగానే కీర్తనకర్త దావీదు “[యెహోవా] నా ప్రార్థన నాలకించును” అని ప్రకటించాడు. (కీర్తన 55:17) యెహోవా మనకు దగ్గరగా ఉన్నాడని, మన ప్రతీ ఆలోచనను, చింతను వినడానికి సిద్ధంగా ఉన్నాడని దృఢంగా నమ్మడానికి మనకు కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి.
యెహోవా తన సేవకులకు ప్రతిఫలమిస్తాడు
17, 18. (ఎ) యెహోవా తన తెలివైన ప్రాణులు చేసే యథార్థమైన సేవ గురించి ఎలా భావిస్తాడు? (బి) మనం కనికరంతో చేసే కార్యాలను యెహోవా గమనిస్తాడని సామెతలు 19:17 ఎలా వ్యక్తం చేస్తోందో వివరించండి.
17 అల్పులైన మానవులు ఏమి చేసినా, చేయడానికి నిరాకరించినా అది విశ్వ సర్వాధిపతిగా యెహోవా స్థానాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేదు. అయినా యెహోవా, ప్రశంసలను వెంటనే తెలియజేసే దేవుడు. నిజానికి ఆయన తన తెలివైన ప్రాణులు చేసే యథార్థమైన సేవను విలువైనదిగా ఎంచుతాడు, సంతోషిస్తాడు. (కీర్తన 147:11) కాబట్టి, యెహోవాకు సన్నిహితంగా ఉండేవారు అనుభవించే మరొక ప్రయోజనం: ఆయన తన సేవకులకిచ్చే ప్రతిఫలం.—హెబ్రీయులు 11:6.
18 యెహోవా తన ఆరాధకులు చేసేదాన్ని విలువైనదిగా ఎంచుతాడని బైబిలు స్పష్టంగా చూపిస్తోంది. ఉదాహరణకు మనమిలా చదువుతాం: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” (సామెతలు 19:17) యెహోవా బీదవారిని దయాపూర్వకంగా పరిగణలోకి తీసుకోవడం మోషే ధర్మశాస్త్రంలో స్పష్టంగా కనబడుతోంది. (లేవీయకాండము 14:21; 19:15) మనం బీదవారితో వ్యవహరించేటప్పుడు యెహోవా చూపించే కరుణను మనం అనుకరిస్తే ఆయనెలా భావిస్తాడు? మనం బదులుగా ఏమీ ఆశించకుండా, బీదలకు ఇచ్చినప్పుడు, యెహోవా దాన్ని తనకు ఇచ్చిన అప్పుగా దృష్టిస్తాడు. యెహోవా ఆ బాకీని అనుగ్రహంతో, ఆశీర్వాదాలతో చెల్లిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. (సామెతలు 10:22; మత్తయి 6:3, 4; లూకా 14:12-14) అవును, అవసరంలో ఉన్న మన తోటి ఆరాధకుని పట్ల మనం కనికరం చూపినప్పుడు అది యెహోవా హృదయాన్ని స్పృశిస్తుంది. మనం కనికరంతో చేసే కార్యాలను మన పరలోకపు తండ్రి గమనిస్తున్నాడని తెలుసుకోవడానికి మనమెంతో కృతజ్ఞులం!—మత్తయి 5:7.
19. (ఎ) మనం ప్రకటనా పనిలో శిష్యులను చేసే పనిలో ఏమి చేసినా దాన్ని యెహోవా విలువైనదిగా ఎంచుతాడని మనమెందుకు నమ్మకంతో ఉండవచ్చు? (బి) యెహోవా తన రాజ్యానికి మద్దతునిస్తూ చేసే కార్యాలకు ప్రతిఫలాన్ని ఏ విధంగా ఇస్తాడు?
19 యెహోవా ప్రత్యేకించి మనం ఆయన రాజ్యానికి మద్దతుగా ఏమి చేస్తున్నామనేదాన్ని విలువైనదిగా ఎంచుతాడు. మనం యెహోవాకు దగ్గరైనప్పుడు, రాజ్య ప్రకటన పనిలో శిష్యులను చేసే పనిలో సాధ్యమైనంత పూర్తిగా పాల్గొనేందుకు మనం మన సమయాన్ని, శక్తిని, వనరులను ఉపయోగించాలని సహజంగానే కోరుకుంటాం. (మత్తయి 28:19, 20) కొన్నిసార్లు, మనం సాధిస్తున్నది చాలా తక్కువని భావిస్తుండవచ్చు. అపరిపూర్ణమైన మన హృదయం మన ప్రయత్నాలకు యెహోవా సంతోషిస్తున్నాడో లేదో అని సందేహించేలా కూడా చేయవచ్చు. (1 యోహాను 3:19, 20) కానీ ప్రేమతో పురికొల్పబడిన హృదయం నుండి ఉద్భవించే ప్రతీ బహుమతిని, అది ఎంత చిన్నదైనా సరే యెహోవా దాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాడు. (మార్కు 12:41-44) బైబిలు మనకు ఇలా హామీ ఇస్తోంది: “తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:10) నిజానికి, యెహోవా తన రాజ్యానికి మద్దతునిస్తూ చేసే ఎంత చిన్న సేవనైనా జ్ఞాపకముంచుకొని దానికి ప్రతిఫలమిస్తాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను విస్తృతంగా అనుభవించడంతో పాటు, రానున్న నూతనలోకంలోని జీవితపు ఆనందాల కోసం మనం ప్రతీక్షించవచ్చు. అక్కడ యెహోవా ఔదార్యంగా తన గుప్పిలి విప్పి తనకు సన్నిహితంగా ఉన్నవారందరి నీతియుక్తమైన కోరికలను తీరుస్తాడు!—కీర్తన 145:16; 2 పేతురు 3:13.
20. మనం 2003వ వార్షిక వచనాన్ని ఆ సంవత్సరమంతటా మన మనసులో ఎలా పెట్టుకోవచ్చు, దాని వల్ల ఎలాంటి ఫలితాలున్నాయి?
20 మనం మన పరలోకపు తండ్రికి దగ్గరయ్యేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నామో లేదో 2003వ సంవత్సరమంతా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనమలా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆయన తాను వాగ్దానం చేసినట్లుగా ప్రతిస్పందిస్తాడని నమ్మకం కలిగి ఉండవచ్చు. ఎందుకంటే ‘దేవుడు . . . అబద్ధమాడనేరడు.’ (తీతు 1:1-4) మీరు దేవునికి దగ్గరైతే ఆయన మీకు దగ్గరవుతాడు. (యాకోబు 4:8) దాని ఫలితమేమిటి? సుసంపన్నమైన ఆశీర్వాదాలు ఇప్పుడు, యెహోవాకు మరింత దగ్గరవుతామనే నిరీక్షణ భావి జీవితమంతటా!
[అధస్సూచి]
^ పేరా 13 కావలికోట మే 1, 2000 సంచిక 28-31 పేజీల్లోని “యెహోవా మన హృదయాలకంటె అధికుడు” అనే ఆర్టికల్‌కు వచ్చిన ఒక ప్రతిస్పందన.
మీకు జ్ఞాపకమున్నాయా?
• యెహోవా తనకు దగ్గరయ్యేవారికి ఎలాంటి బహుమతి ఇస్తాడు?
• యెహోవా తన ప్రజలకు ఆధ్యాత్మిక కాపుదలనిచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు?
• యెహోవాను ప్రార్థన ద్వారా నిరాటంకంగా సమీపించగలగడం ఎందుకు అసాధారణమైన బహుమతి?
• యెహోవా తన తెలివైన ప్రాణులు చేసే యథార్థమైన సేవను విలువైనదిగా ఎంచుతాడని బైబిలు ఎలా చూపిస్తోంది?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రం]
ఆధ్యాత్మిక సత్యాలపై అంతర్దృష్టితో యెహోవా మనల్ని ఆశీర్వదించాడు
[16, 17వ పేజీలోని చిత్రాలు]
యెహోవా ఆధ్యాత్మిక కాపుదలనిస్తాడు
[18వ పేజీలోని చిత్రం]
యెహోవా మన ప్రతీ ప్రార్థనను వినడానికి సిద్ధంగా మనకు సమీపంలోనే ఉన్నాడు