కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవునియొద్దకు రండి”

“దేవునియొద్దకు రండి”

“దేవునియొద్దకు రండి”

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”​యాకోబు 4:⁠8.

1, 2. (ఎ) సాధారణంగా మానవులు ఏమని చెప్పుకుంటారు? (బి) యాకోబు ఏమని ఉద్బోధించాడు, అదెందుకు అవసరమైంది?

“దేవుడు మనతో ఉన్నాడు.” ఈ మాటలు జాతీయ చిహ్నాలపైనా చివరికి సైనికుల యూనిఫారాలపైనా అలంకరణగా కనబడతాయి. “దేవుని మీద మాకు నమ్మకముంది” వంటి మాటలు ఆధునిక కాలంలోని అసంఖ్యాకమైన నాణేలపై కరెన్సీ నోట్లపై చిత్రించబడ్డాయి. తమకు దేవునితో సన్నిహిత సంబంధం ఉందని చెప్పుకోవడం మానవులకు పరిపాటి. అయితే, అలాంటి సంబంధం ఉండాలంటే కేవలం ఆ సంబంధం గురించి మాట్లాడడమో, లేదా దాని గురించి నినాదాలను వ్రాసి పెట్టుకోవడమో మాత్రమే సరిపోదని మీరు అంగీకరించరా?

2 దేవునితో అనుబంధం కలిగివుండడం సాధ్యమేనని బైబిలు చూపిస్తోంది. అయితే అందుకు కృషి చేయాల్సిన అవసరముంది. మొదటి శతాబ్దంలోని కొందరు అభిషిక్త క్రైస్తవులు సహితం యెహోవా దేవునితో తమ అనుబంధాన్ని పటిష్ఠపరుచుకోవలసిన అవసరం ఏర్పడింది. భోగేచ్ఛల విషయంలో, ఆధ్యాత్మిక పరిశుభ్రతను కోల్పోతున్న విషయంలో క్రైస్తవ పైవిచారణకర్తయైన యాకోబు కొందరిని హెచ్చరించాల్సివచ్చింది. ఆ హితబోధలో ఆయన “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అనే శక్తివంతమైన ప్రబోధకాన్ని ఇచ్చాడు. (యాకోబు 4:​1-12) “యొద్దకు రండి” అన్నప్పుడు యాకోబు ఉద్దేశం ఏమిటి?

3, 4. (ఎ) మొదటి శతాబ్దంలోని యాకోబు పాఠకుల్లో కొందరికి “దేవునియొద్దకు రండి” అనే పదబంధం దేన్ని గుర్తుచేసివుంటుంది? (బి) దేవుణ్ణి సమీపించడం సాధ్యమేనని మనమెందుకు గట్టిగా నమ్మవచ్చు?

3 యాకోబు ఉపయోగించిన పదబంధం తన పాఠకుల్లో చాలామందికి సుపరిచితమైనదే అయ్యుండవచ్చు. యాజకులు యెహోవా ప్రజల పక్షాన ఆయన ‘యొద్దకు రావడానికి’ లేదా ఆయనను సమీపించడానికి సంబంధించిన నిర్దిష్టమైన ఆదేశాలను మోషే ధర్మశాస్త్రం అందించింది. (నిర్గమకాండము 19:​22) ఆ విధంగా, యెహోవాయొద్దకు రావడం అంటే తేలిగ్గా తీసుకునే విషయం కాదని యాకోబు తన పాఠకులకు గుర్తుచేసి ఉండవచ్చు. ఈ విశ్వంలోని అత్యంత ఉన్నత స్థానం యెహోవాదే.

4 మరోవైపున, ఒక బైబిలు పండితుడు చెబుతున్నదాని ప్రకారం, “ఈ ఉద్బోధ [యాకోబు 4:8 లోనిది] చాలా బలమైన ఆశావాదాన్ని వ్యక్తం చేస్తుంది.” యెహోవా అపరిపూర్ణ మానవులను తనకు దగ్గరవమని అన్ని సందర్భాలలోను ప్రేమపూర్వకంగా ఆహ్వానించాడని యాకోబుకు తెలుసు. (2 దినవృత్తాంతములు 15:⁠2) యేసు బలి ఒక సంపూర్ణ విధానంలో మనం యెహోవాను సమీపించే మార్గాన్ని తెరిచింది. (ఎఫెసీయులు 3:​8-12) నేడు, దేవుణ్ణి సమీపించే మార్గం లక్షలాదిమందికి తెరవబడింది! అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని మనమెలా సద్వినియోగం చేసుకోవచ్చు? యెహోవా దేవునికి దగ్గరవగలిగే మూడు మార్గాలను మనం క్లుప్తంగా పరిశీలిద్దాం.

దేవుని గురించిన “పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం”లో కొనసాగండి

5, 6. దేవుని గురించిన “పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం” అంటే ఏమిటో యౌవనుడైన సమూయేలు ఉదాహరణ ఎలా స్పష్టం చేస్తోంది?

5యోహాను 17:3 ప్రకారం, యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” ఈ అనువాదానికీ మరితర అనేక అనువాదాలకూ కొంచెం భిన్నంగా నూతన లోక అనువాదము (ఆంగ్లం) ఉంది. అది దేవుని “ఎరుగుట” లేదా దేవుణ్ణి ‘తెలుసుకోవడం’ అనడానికి బదులుగా దేవుని గురించిన “పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం” అనే పదబంధాన్ని ఉపయోగిస్తోంది. అంతేగాక మూల గ్రీకు భాషలో ఉపయోగించబడిన పదానికి ఎంతో అర్థం ఉందనీ, అది అవతలి వ్యక్తితో సన్నిహిత స్నేహానికి దారితీయగల ఒక నిరంతర ప్రక్రియను కూడా సూచిస్తోందనీ అనేకమంది పండితులు అంటున్నారు.

6 దేవునికి బాగా సన్నిహితమవడమనేది యేసు కాలంలోని ప్రజలకు కొత్త తలంపేమీ కాదు. ఉదాహరణకు హీబ్రూ లేఖనాల్లో, సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన “అప్పటికి యెహోవాను ఎరుగకుండెను” అని మనం చదువుతాం. (1 సమూయేలు 3:⁠7) దీనర్థం సమూయేలుకు తన దేవుని గురించి చాలా తక్కువ తెలుసనా? కాదు. ఆయన తల్లిదండ్రులు, యాజకులు నిస్సందేహంగా ఆయనకెన్నో విషయాలు నేర్పించివుండవచ్చు. అయితే, ఈ వచనంలో ఉపయోగించబడిన హీబ్రూ పదం, ఒక పండితుడు చెప్పినదాని ప్రకారం, “అత్యంత సన్నిహితమైన స్నేహానికి ఉపయోగించవచ్చు.” సమూయేలు అప్పటికింకా యెహోవాను అంత సన్నిహితంగా తెలుసుకోలేదు, అటు తర్వాతి కాలంలో ఆయన యెహోవా వాగ్దూతగా సేవచేసేటప్పుడు యెహోవాను ఎంతో సన్నిహితంగా తెలుసుకుంటాడు. సమూయేలు ఎదుగుతుండగా ఆయన యెహోవాను నిజంగా తెలుసుకోవడం ప్రారంభించాడు, యెహోవాతో సన్నిహితమైన వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు.​—⁠1 సమూయేలు 3:19, 20.

7, 8. (ఎ) బైబిలులోని లోతైన విషయాలను తెలుసుకోవడంలో మనమెందుకు నిరుత్సాహపడకూడదు? (బి) మనం దేవుని వాక్యంలోని ఎలాంటి లోతైన సత్యాలను అధ్యయనం చేయడం మంచిది?

7 యెహోవాను సన్నిహితంగా తెలుసుకునేందుకు మీరు ఆయన గురించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకొంటున్నారా? అలా సంపాదించుకోవాలంటే మీరు దేవుడు అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని ‘అపేక్షించాలి.’ (1 పేతురు 2:⁠1-3) ప్రాథమిక బోధలతోనే సంతృప్తి చెందకండి. బైబిలు లోతైన బోధలను కొన్నింటిని నేర్చుకోవడానికి కృషి చేయండి. (హెబ్రీయులు 5:​12-14) అలాంటి బోధలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని భావిస్తూ మీరు నిరుత్సాహపడుతున్నారా? అలాగైతే యెహోవా “మహోపదేశకుడు” అన్న విషయాన్ని జ్ఞాపకముంచుకోండి. (యెషయా 30:​20, NW) అపరిపూర్ణ మానవుల మనస్సులకు అర్థమయ్యే విధంగా లోతైన సత్యాలను ఎలా అందజేయాలో ఆయనకు తెలుసు. అంతేకాదు, ఆయన బోధించేవాటిని గ్రహించడానికి మీరు చేసే హృదయపూర్వకమైన కృషిని ఆయన ఆశీర్వదించగలడు కూడా.​—⁠కీర్తన 25:⁠4.

8 ‘దేవుని మర్మములలో’ కొన్నింటి గురించి మీరే స్వయంగా ఎందుకు పరీక్షించకూడదు? (1 కొరింథీయులు 2:​10) అవి దైవశాస్త్ర పండితులు, పాదిరీలు వాదించేటువంటి నిరాసక్తమైన అంశాలు ఏ మాత్రం కావు. అవి మన ప్రేమగల తండ్రి మనస్సు గురించి హృదయం గురించి ఎంతో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే అవకాశమిచ్చే ప్రయోజనకరమైన సిద్ధాంతాలు. ఉదాహరణకు విమోచన క్రయధనము, “మర్మము,” యెహోవా తన ప్రజలను ఆశీర్వదించడానికీ తన సంకల్పాలను నెరవేర్చడానికీ ఉపయోగించిన వివిధ నిబంధనలు మాత్రమేగాక అలాంటివి మరెన్నో ఇతర విషయాలు వ్యక్తిగతంగా పరిశోధించడానికీ అధ్యయనం చేయడానికీ ఎంతో ఆహ్లాదకరమైన ప్రతిఫలదాయకమైన అంశాలు.​—⁠1 కొరింథీయులు 2:⁠7.

9, 10. (ఎ) గర్వం ఎందుకు ప్రమాదకరమైనది, దాన్నుండి దూరంగా ఉండేందుకు మనకేమి సహాయపడుతుంది? (బి) యెహోవాను గురించిన పరిజ్ఞానం విషయంలో మనం నమ్రతగా ఉండడానికి ఎందుకు కృషి చేయాలి?

9 మీరు లోతైన ఆధ్యాత్మిక సత్యాల పరిజ్ఞానంలో ఎదుగుతుండగా, పరిజ్ఞానంతోపాటు వచ్చే అవకాశమున్న ఒక ప్రమాదం విషయమై జాగ్రత్తగా ఉండండి​—⁠ఆ ప్రమాదమే గర్వం. (1 కొరింథీయులు 8:⁠1) గర్వం చాలా ప్రమాదకరమైనది, అది మానవులను దేవుని నుండి దూరం చేస్తుంది. (సామెతలు 16:⁠5; యాకోబు 4:⁠6) ఏ మానవుడికీ తన పరిజ్ఞానం విషయమై గర్వపడాల్సిన హేతువేదీ లేదన్న విషయం గుర్తుంచుకోండి. ఉదాహరణకు, మానవులు ఇటీవలి కాలంలో సాధించిన వైజ్ఞానిక పురోభివృద్ధులను సమీక్షిస్తున్న ఒక పుస్తకంలో ఉన్న ఉపోద్ఘాతంలోని ఈ మాటలను పరిశీలించండి: “మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, మనకు తెలిసింది చాలా తక్కువనే విషయాన్ని అంత ఎక్కువగా గ్రహిస్తాం. . . . మనం ఇంకా తెలుసుకోవలసిన వాటితో పోల్చి చూస్తే ఇప్పటి వరకు తెలుసుకున్నవన్నీ చాలా తక్కువే.” అలాంటి నమ్రత పునరుత్తేజకరమైనది. ఇక, అత్యంత విస్తారమైన పరిజ్ఞాన సముదాయమైన యెహోవా దేవుని పరిజ్ఞానం విషయానికి వస్తే మనం నమ్రతతో ఉండడానికి చాలా గొప్ప కారణముంది. ఎందుకని?

10 యెహోవా గురించి బైబిలు వ్యాఖ్యానాలను కొన్నింటిని గమనించండి. “నీ ఆలోచనలు అతిగంభీరములు.” (కీర్తన 92:⁠5) “[యెహోవా] జ్ఞానమునకు [“అవగాహనకు,” NW] మితిలేదు.” (కీర్తన 147:⁠5) “[యెహోవా] జ్ఞానమును [“అవగాహనను,” NW] శోధించుట అసాధ్యము.” (యెషయా 40:​28) “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల [“జ్ఞాన, పరిజ్ఞానముల,” NW] బాహుళ్యము ఎంతో గంభీరము.” (రోమీయులు 11:​33) కాబట్టి యెహోవా గురించి తెలుసుకోవలసిన దాన్నంతటినీ మనం ఎన్నటికీ తెలుసుకోలేమని స్పష్టమవుతోంది. (ప్రసంగి 3:​11) ఆయన మనకెన్నో అద్భుతమైన విషయాలను బోధించాడు, అయినా మనం నేర్చుకోవడానికి ఇంకా మన ఎదుట అపరిమితమైన పరిజ్ఞానం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి భవిష్యత్తు మనకు ఉత్తేజకరంగాను నమ్రతాభావాన్ని పుట్టించేదిగాను లేదా? కాబట్టి మనం ఆ పరిజ్ఞాన్ని తెలుసుకొంటుండగా, దాన్ని మనం యెహోవాకు దగ్గరవడానికి, అలాగే ఇతరులు కూడా ఆయనకు దగ్గరయ్యేందుకు వారికి సహాయపడడానికి ఎల్లప్పుడూ ఆధారంగా ఉపయోగించుదాం, కానీ దాన్ని మనల్ని మనం ఇతరులపై హెచ్చించుకోవడానికి ఒక మార్గంగా మాత్రం ఎన్నడూ ఉపయోగించకుండా ఉందాం.​—⁠మత్తయి 23:​12; లూకా 9:⁠48.

యెహోవా మీద మీకున్న ప్రేమను వ్యక్తంచేయండి

11, 12. (ఎ) యెహోవా గురించి మనం సంపాదించుకునే పరిజ్ఞానం మనల్ని ఎలా ప్రభావితం చేయాలి? (బి) ఒక వ్యక్తికి దేవుని మీదున్న ప్రేమ నిజమైనదో కాదో ఏది నిర్ధారిస్తుంది?

11 అపొస్తలుడైన పౌలు సముచితంగానే జ్ఞానాన్ని ప్రేమతో ముడిపెట్టాడు. ఆయనిలా వ్రాశాడు: “మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను [“ఖచ్చితమైన పరిజ్ఞానముతోను, సంపూర్ణ అవగాహనతోను,” NW] కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెనని . . . ప్రార్థించుచున్నాను.” (ఫిలిప్పీయులు 1:⁠9-11) యెహోవా గురించి ఆయన సంకల్పాల గురించి మనం నేర్చుకొనే ప్రతి అపురూపమైన సత్యం మనల్ని గర్వంతో మిడిసిపడేలా చేయక, మన పరలోక తండ్రి మీద మనకున్న ప్రేమ అధికమయ్యేలా చేయాలి.

12 దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునే అనేకమంది ఆయనను నిజంగా ప్రేమించడం లేదన్నది నిస్సంశయం. వారు తమ హృదయాల్లో పెల్లుబికే బలమైన భావాలను నిజాయితీగానే వ్యక్తం చేస్తుండవచ్చు. అలాంటి భావాలు ఖచ్చితమైన పరిజ్ఞానముతో పొందిక గలవైతే అవి మంచివే కాక, ప్రశంసార్హమైనవి కూడా. కానీ అవి మాత్రమే దేవుని మీది నిజమైన ప్రేమకు నిదర్శనం కాదు. ఎందుకని? అలాంటి ప్రేమను దేవుని వాక్యం ఎలా నిర్వచిస్తోందో గమనించండి: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:⁠3) కాబట్టి యెహోవా మీదున్న ప్రేమ విధేయతాపూర్వక చర్యల ద్వారా వ్యక్తమైనప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది.

13. యెహోవా పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి దైవిక భయం మనకెలా సహాయపడుతుంది?

13 దైవిక భయం మనం యెహోవాకు విధేయత చూపేందుకు సహాయపడుతుంది. ఆయనను గురించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా, ఆయన అత్యున్నతమైన పరిశుద్ధత, అపారమైన మహిమ, అపరిమితమైన శక్తి, పరిపూర్ణమైన న్యాయం, అపరిమితమైన జ్ఞానం, గాఢమైన ప్రేమల గురించి తెలుసుకోవడం ద్వారా యెహోవా పట్ల ప్రగాఢమైన భయము, హృదయపూర్వకమైన గౌరవము కలుగుతాయి. ఆయనకు సన్నిహితం కావడానికి అలాంటి భయం చాలా కీలకమైనది. నిజానికి కీర్తన 25:⁠14 ఏమి చెబుతోందో గమనించండి: “యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది.” కాబట్టి మన ప్రియమైన పరలోక తండ్రిని అసంతృప్తిపరచకూడదనే ఆరోగ్యకరమైన భయం మనలో ఉంటే మనం ఆయనకు దగ్గరవచ్చు. సామెతలు 3:6 లో నమోదు చేయబడిన, “నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అనే జ్ఞానవంతమైన సలహాను పాటించడానికి మనకు దైవిక భయము సహాయం చేస్తుంది. దాని భావమేమిటి?

14, 15. (ఎ) దైనందిన జీవితంలో మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఏవి? (బి) మనం మన దైవిక భయం వ్యక్తమయ్యే విధంగా నిర్ణయాలను ఎలా తీసుకోవచ్చు?

14 పెద్దవే కానీ చిన్నవే కానీ, మీరు ప్రతిదినం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ సహోద్యోగులతో, తోటి విద్యార్థులతో, పొరుగువారితో ఎలాంటి సంభాషణల్లో పాల్గొంటారు? (లూకా 6:​45) మీకిచ్చిన పనిని పూర్తి చేయడానికి మీరు బాగా కష్టపడతారా లేక ఎక్కువ కష్టపడకుండా ఆ పనిని పూర్తి చేయడానికి ఏమైనా మార్గాలను వెదుకుతారా? (కొలొస్సయులు 3:​23, 24) మీరు యెహోవా అంటే ఓ మోస్తరుగా ప్రేమ చూపించేవారికి లేదా ఏమాత్రం చూపించనివారికి దగ్గరవుతారా, లేక ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రజలతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారా? (సామెతలు 13:​20) చిన్న చిన్న మార్గాల్లోనైనా దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలకు మద్దతునిచ్చేందుకు మీరేమి చేస్తారు? (మత్తయి 6:​33) ఇక్కడ ఉదహరించబడినటువంటి లేఖనాధారిత సూత్రాలు మీ దైనందిన నిర్ణయాలకు మార్గదర్శకంగా ఉన్నట్లయితే, మీరు “[మీ] ప్రవర్తన అంతటియందు” యెహోవా అధికారమును నిజంగా ఒప్పుకుంటున్నట్లే.

15 వాస్తవానికి మనం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ముందు, ‘నేనేమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు? ఎలాంటి నిర్ణయం ఆయనకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది?’ వంటి ప్రశ్నలను ఆలోచించడం మనకు మార్గదర్శకంగా ఉండాలి. (సామెతలు 27:​11) ఈ విధంగా మనం దైవిక భయాన్ని చూపించడం, యెహోవా మీదున్న మన ప్రేమను వ్యక్తం చేయడానికి శ్రేష్ఠమైన మార్గం. దైవిక భయం మనం ఆధ్యాత్మికంగా, నైతికంగా, శారీరకంగా పరిశుభ్రంగా ఉండేందుకు కూడా మనల్ని పురికొల్పుతుంది. “దేవునియొద్దకు రండి” అని యాకోబు ఉద్బోధిస్తున్న వచనంలోనే, “పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి” అని కూడా ఆయన పురికొల్పుతున్నాడన్న విషయం గుర్తుంచుకోండి.​—⁠యాకోబు 4:⁠8.

16. యెహోవాకు ఇవ్వడం ద్వారా మనం ఎన్నటికీ నెరవేర్చలేనిదేమిటి, అయినా అలా ఇవ్వడం ద్వారా మనం ఎల్లప్పుడూ సాధించేదేమిటి?

16 యెహోవా మీదున్న మన ప్రేమను వ్యక్తం చేయడంలో, చెడుతనానికి దూరంగా ఉండడం కంటే ఎక్కువే ఉందన్నది నిస్సంశయం. మనం మంచి చేసేందుకు కూడా ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. ఉదాహరణకు, యెహోవా చూపే అత్యంత గొప్ప ఔదార్యానికి మనమెలా ప్రతిస్పందిస్తాం? “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును” అని యాకోబు వ్రాశాడు. (యాకోబు 1:​17) నిజమే, మనకున్న వాటిని యెహోవాకు ఇవ్వడం వలన, మనం ఆయనను ధనవంతుడిగా ఏమీ చేయము. ఎందుకంటే లోకంలో ఉన్న సర్వమూ ఆయన సొంతమే. (కీర్తన 50:​12) కాబట్టి మనం యెహోవా కోసం మన సమయాన్ని, శక్తిని వెచ్చించినప్పుడు ఆయన తీర్చుకోలేని ఏదో అవసరాన్ని మనం తీర్చడం లేదు. ఒకవేళ మనం దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి నిరాకరించినా, ఆయన రాళ్ళతో మాట్లాడించగలడు! అలాంటప్పుడు, మనం మన వనరులను, సమయాన్ని, శక్తిని యెహోవాకు ఎందుకివ్వాలి? అన్నింటి కంటే ముఖ్యమైన కారణమేమిటంటే, ఆ విధంగా మనం ఆయన మీది ప్రేమను మన పూర్ణహృదయంతోను, ఆత్మతోను, వివేకముతోను, బలముతోను వ్యక్తం చేయగలుగుతాం.​—⁠మార్కు 12:​29, 30.

17. యెహోవాకు సంతోషంగా ఇచ్చేందుకు మనల్ని ఏమి పురికొల్పుతుంది?

17 మనం యెహోవాకు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, ఎందుకంటే “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:⁠7) ద్వితీయోపదేశకాండము 16:​17 లో ఉన్న, “నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను” అనే సూత్రం మనం సంతోషంగా ఇచ్చేందుకు సహాయపడుతుంది. యెహోవా మనతో ఎంత ఔదార్యంగా ఉన్నాడో మననం చేసుకున్నప్పుడు, మనం కూడా ఆయనకు అంత ఉదారంగా ఇవ్వాలని కోరుకుంటాం. అలా ఇవ్వడం ఒక తండ్రికి తన ప్రియమైన కుమారుడిచ్చే చిన్న బహుమతి ఏ విధంగా సంతోషాన్ని కలిగిస్తుందో అదేవిధంగా, ఆయనకు సంతోషం కలిగిస్తుంది. ఆ విధంగా మన ప్రేమను వ్యక్తం చేయడం, మనం యెహోవాకు దగ్గరయ్యేందుకు దోహదపడుతుంది.

ప్రార్థన ద్వారా సాన్నిహిత్యాన్ని పెంచుకోండి

18. మన ప్రార్థనలను మెరుగుపరుచుకోవడం విషయమై ఆలోచించడం ఎందుకు సరైనది?

18 మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే క్షణాలు మన ఆంతరంగిక విషయాలను, రహస్యాలను మన పరలోకపు తండ్రితో మాట్లాడుకోవడానికి లభ్యమయ్యే అమూల్యమైన అవకాశాలనిస్తాయి. (ఫిలిప్పీయులు 4:⁠6) ప్రార్థన దేవునికి దగ్గరయ్యేందుకు ఒక ప్రధానమైన మార్గం కాబట్టి, మనం కాస్సేపాగి మన ప్రార్థనల నాణ్యతను గురించి ఆలోచించడం మంచిది. అవి వాక్చాతుర్యంతో రూపొందించబడినవిగా కాక, హృదయంలో నుండి వచ్చే యథార్థమైన మాటలై ఉండాలి. మన ప్రార్థనల నాణ్యతను మనమెలా మెరుగుపరుచుకోవచ్చు?

19, 20. ప్రార్థించడానికి ముందు మనమెందుకు ధ్యానించాలి, అలా ధ్యానించడానికి తగిన అంశాలు కొన్ని ఏవి?

19 మనం ప్రార్థించడానికి ముందుగా విషయాలను మననం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మనం ముందుగానే అలా చేసుకుంటే, మనం మన ప్రార్థనలను నిర్దిష్టమైనవిగా, అర్థవంతమైనవిగా చేసుకోవచ్చు. ఆ విధంగా మనం మన మనసుకు బాగా పరిచయమున్నట్లు అనిపించి, వెంటనే మనసులోకి వచ్చే ఒకే రకమైన పదబంధాలను పదేపదే పలికే అలవాటును మానుకోవచ్చు. (సామెతలు 15:​28, 29) యేసు తన మాదిరి ప్రార్థనలో ప్రస్తావించిన కొన్ని అంశాలను మననం చేసుకోవడం, ఆ తర్వాత అవి మన పరిస్థితులతో ఎలా సంబంధం కలిగివున్నాయనేది ఆలోచించడం బహుశా సహాయకరంగా ఉండవచ్చు. (మత్తయి 6:​9-13) ఉదాహరణకు, ఇక్కడ భూమ్మీద యెహోవా చిత్తం నెరవేరే విషయంలో మనం వహించగల అవకాశమున్న చిన్న పాత్ర ఏమిటని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. మనకు సాధ్యమైనంత వరకు ఆయనకు ఉపయోగకరమైన విధంగా ఉండాలనే కోరికను యెహోవాకు వ్యక్తం చేస్తూ ఆయన మనకిచ్చిన నియామకం ఏదైనా సరే, దాన్ని నెరవేర్చడానికి ఆయన సహాయాన్ని అడుగుతామా? మనం మన భౌతిక అవసరాల చింతల్లో కూరుకుపోయామా? ఏయే పాపాల విషయమై మనకు క్షమాపణ కావాలి, ఎవరి పట్ల మనం మరింత క్షమాగుణంతో ఉండాలి? ఎలాంటి శోధనలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఆ విషయంలో యెహోవా కాపుదల ఎంత అత్యవసరమో మనం గ్రహిస్తున్నామా?

20 వాటితో పాటు, మనకు తెలిసిన వారి గురించి ప్రత్యేకించి యెహోవా సహాయం ఆవశ్యకమైన వారి గురించి మనం ఆలోచించవచ్చు. (2 కొరింథీయులు 1:​11) అయితే, మనం కృతజ్ఞతలు చెల్లించడం మరచిపోకూడదు. మనం దాని గురించి కాస్సేపు ఆలోచించినట్లయితే, యెహోవా అపారమైన మంచితనానికి, మనం ఆయనకు కృతజ్ఞతలను తెలియజేయడానికి, ప్రతిదినం ఆయనను స్తుతించడానికి గల అనేక కారణాలు మన మనసులోకి తప్పకుండా వస్తాయి. (ద్వితీయోపదేశకాండము 8:​10; లూకా 10:​21) అలా చేయడం అదనపు ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది, అదేమింటే జీవితం గురించి మరింత ఆశాజనకమైన సానుకూలమైన దృక్పథంతో ఉండడానికి అది మనకు సహాయపడుతుంది.

21. ప్రార్థన ద్వారా యెహోవాను సమీపించేటప్పుడు, ఏయే లేఖనాధార ఉదాహరణలను చదవడం మనకు సహాయకరంగా ఉండవచ్చు?

21 అధ్యయనం కూడా మన ప్రార్థనలను మెరుగుపరచగలదు. విశ్వసనీయులైన స్త్రీ పురుషులు చేసిన విశిష్టమైన ప్రార్థనలు దేవుని వాక్యంలో నమోదు చేయబడ్డాయి. ఉదాహరణకు, మనకెదురైన సంక్లిష్టమైన సమస్య మన సంక్షేమానికి గానీ మనకు ప్రియమైన వారి సంక్షేమానికి గానీ ముప్పు వాటిల్లుతుందేమోననే వ్యాకులతను, భయాన్ని కలిగిస్తున్నప్పుడు యాకోబు తన సహోదరుడైన ఏశావు తనపై పగతీర్చుకోవడానికి వస్తున్నాడేమోనని భయపడిన సందర్భంలో చేసిన ప్రార్థనను మనం చదవవచ్చు. (ఆదికాండము 32:​9-12) లేదా దేవుని ప్రజలను భయభ్రాంతులను చేస్తూ దాదాపు పది లక్షల మంది కూషీయులు దండెత్తి వచ్చినప్పుడు, రాజైన ఆసా చేసిన ప్రార్థనను పరిశీలించవచ్చు. (2 దినవృత్తాంతములు 14:​11, 12) యెహోవా ప్రతిష్ఠకు మచ్చ తీసుకురాగల సమస్యతో మనం సతమతమవుతున్నట్లయితే, ఏలీయా కర్మెలు పర్వతం వద్ద బయలు ఆరాధకుల ఎదుట చేసిన ప్రార్థనను, అదే విధంగా నెహెమ్యా యెరూషలేము దుస్థితి విషయమై చేసిన ప్రార్థనను పరిశీలించడం మంచిది. (1 రాజులు 18:​36, 37; నెహెమ్యా 1:​4-11) అలాంటి ప్రార్థనలను చదవడం, వాటిని ధ్యానించడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, మనల్ని కృంగదీసేటువంటి సమస్యలతో యెహోవాను సమీపించడం ఎంత ఉత్తమమో తెలిపే ఆలోచనలను ఇస్తుంది.

22. రెండు వేల మూడవ సంవత్సరానికి వార్షిక వచనం ఏమిటి, సంవత్సరమంతటా అప్పుడప్పుడు మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

22 యాకోబు ఇచ్చిన “దేవునియొద్దకు రండి” అనే సలహాను పాటించడాన్ని మించిన గొప్ప ఘనత గానీ శ్రేష్ఠమైన లక్ష్యం గానీ ఏదీ లేదన్నది విస్పష్టం. (యాకోబు 4:⁠8) దేవుని గురించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడంలో కొనసాగడం ద్వారా, ఆయన మీదున్న మన ప్రేమను రోజు రోజుకూ మరింత ఎక్కువగా వ్యక్తం చేయడానికి ప్రయత్నించడం ద్వారా, మన ప్రార్థనల ద్వారా ఆయనతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనమాయనకు దగ్గరవుదాం. 2003వ సంవత్సరమంతా యాకోబు 4:8వ వచనాన్ని వార్షిక వచనంగా మనసులో పెట్టుకొని, మనం యెహోవాకు నిజంగా దగ్గరవుతున్నామా లేదా అని మనల్ని మనం నిరంతరం పరీక్షించుకుందాం. అయితే, ఆ వ్యాఖ్యానంలోని రెండవ భాగం విషయం ఏమిటి? యెహోవా ఏ భావంలో “మీయొద్దకు వ[స్తాడు],” ఎలాంటి ప్రయోజనాలను తెస్తాడు? దీని తర్వాతి ఆర్టికల్‌ ఆ విషయాన్ని పరిశీలిస్తుంది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యెహోవాకు దగ్గరవడం ఎందుకు గంభీరంగా తీసుకోవలసిన విషయం?

• యెహోవా పరిజ్ఞానాన్ని సంపాదించుకొనే విషయంలో మనం పెట్టుకోగల కొన్ని లక్ష్యాలు ఏవి?

• యెహోవా మీద మనకు నిజమైన ప్రేమ ఉందని మనమెలా చూపించవచ్చు?

• మనం ప్రార్థన ద్వారా యెహోవాతో అత్యంత సాన్నిహిత్యాన్ని ఏయే మార్గాల్లో పెంపొందించుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని బ్లర్బ్‌]

2003కు వార్షిక వచనం: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”​—⁠యాకోబు 4:8.

[8, 9వ పేజీలోని చిత్రం]

సమూయేలు ఎదుగుతుండగా యెహోవాను బాగా తెలుసుకున్నాడు

[12వ పేజీలోని చిత్రం]

కర్మెలు పర్వతం దగ్గర ఏలీయా చేసిన ప్రార్థన మనకు చక్కని ఉదాహరణ