కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

“ఆలోచనా సామర్థ్యం” ఒక రక్షణగా ఎలా ఉండగలదు? (సామెతలు 1:⁠4)

అది మనల్ని ఆధ్యాత్మిక అపాయాల గురించి అప్రమత్తులను చేయగలదు, ఉద్యోగ స్థలాల్లో లైంగికపరమైన ఆకర్షణలకు దూరంగా ఉండడం వంటి జ్ఞానవంతమైన చర్యలు తీసుకునేందుకు మనల్ని పురికొల్పుతుంది. తోటి క్రైస్తవులు అపరిపూర్ణులు అని గుర్తించేందుకు అది మనకు సహాయపడుతుంది, అలా గుర్తించడం, మనం రెచ్చగొట్టబడినప్పుడు తొందరపాటుతో ప్రతిస్పందించకుండా ఉండేందుకు మనల్ని కదిలించగలదు. మనల్ని ఆధ్యాత్మికత నుండి దారి మళ్ళించే అవకాశమున్న వస్తుసంబంధమైన ఒత్తిళ్ళను ఎదుర్కోగలిగేలా కూడా అది మనకు సహాయపడగలదు.​—⁠8/15, 21-4 పేజీలు.

పొరుగు వ్యక్తి ఒక ఆశీర్వాదంగా ఎలా కాగలడు?

మంచి పొరుగువాడిగా ఉండాలంటే ఔదార్యంతో ఇచ్చేవ్యక్తిగా ఉండడం, కృతజ్ఞతతో స్వీకరించే వ్యక్తిగా ఉండడం అనే రెండు మార్గాలున్నాయి. కష్టాలొచ్చినప్పుడు ఒక మంచి పొరుగువాడిగా ఉండడం చాలా ప్రాముఖ్యం. యెహోవాసాక్షులు, త్వరలో జరగనున్న సంఘటన గురించి అంటే దుష్టత్వాన్ని అంతం చేయడానికి దేవుడు తీసుకునే చర్య గురించి ఇతరులను హెచ్చరించడం ద్వారా మంచి పొరుగువారిగా ఉండడానికి కృషి చేస్తారు.​—⁠9/1, 4-7 పేజీలు.

బైబిలు ప్రకారం నిజమైన పరిశుద్ధులు ఎవరు, వారు మానవాళికి ఎలా సహాయం చేస్తారు?

తొలి క్రైస్తవులందరూ పరిశుద్ధులే, వారు మనుష్యుల చేతనో సంస్థల చేతనో పరిశుద్ధులుగా చేయబడలేదు గానీ దేవుని చేతనే చేయబడ్డారు. (రోమీయులు 1:​1-7) పరలోక జీవితానికి ఒకసారి పునరుత్థానం చేయబడిన తర్వాత భూమిపైనున్న విశ్వసనీయులను ఆశీర్వదించడంలో పరిశుద్ధులు క్రీస్తుతో పాలుపంచుకుంటారు. (ఎఫెసీయులు 1:​17-21)​—⁠9/15, 4-7 పేజీలు.

ప్రాచీన గ్రీసులోని అథ్లెటిక్‌ సంఘటనల గురించి ఏదైనా కొంత తెలుసుకోవడం వల్ల క్రైస్తవులకు ఏమైనా ప్రయోజనముండే అవకాశముందా?

అపొస్తలులైన పేతురు, పౌలు వ్రాసిన పత్రికల్లో ప్రాచీన ఆటల పోటీలపై ఆధారపడిన ఉపమానాలు ఉన్నాయి లేదా వాటిని గురించి పరోక్షంగా సూచించబడింది. (1 కొరింథీయులు 9:​26; 1 తిమోతి 4:⁠7; 2 తిమోతి 2:⁠5; 1 పేతురు 5:​10) ఒక ప్రాచీన అథ్లెట్‌కు మంచి శిక్షకుడు ఉండడం, స్వయం నియంత్రణ ఉండడం, తన ప్రయత్నాలను సరిగ్గా నిర్దేశించుకోవడం చాలా ప్రాముఖ్యం. నేడు క్రైస్తవులు చేస్తున్న ఆధ్యాత్మిక ప్రయత్నాల విషయంలో కూడా అవి ప్రాముఖ్యమైనవే.​—⁠10/1, 28-31 పేజీలు.

విదేశాల్లో పిల్లలను పెంచడంలో ఎలాంటి సవాళ్ళు, ప్రతిఫలాలు ఉన్నాయి?

చాలామంది పిల్లలు ఒక కొత్త భాషను తమ తల్లిదండ్రుల కంటే త్వరగా నేర్చుకుంటారు, తల్లిదండ్రులకు తమ పిల్లల ఆలోచనావిధానాన్ని, ప్రతిస్పందనలను అర్థంచేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. పిల్లలు తమ తల్లిదండ్రుల భాషలో బైబిలు బోధలను అంత సులభంగా గ్రహించలేకపోవచ్చు. అయినప్పటికీ, తల్లిదండ్రులు తమ భాషను పిల్లలకు నేర్పిస్తూ కుటుంబ బాంధవ్యాలను బలపరుచుకోవచ్చు, ఆ విధంగా పిల్లలు రెండు భాషలనూ తెలుసుకొని రెండు రకాల సంస్కృతులకూ పరిచయమవుతారు.​—⁠10/15, 22-6 పేజీలు.

క్షమించమని అడగడాన్ని నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

నిజాయితీగా కోరే క్షమాపణ పాడైపోయిన సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి తరచూ ఒక మార్గంగా ఉంటుంది. క్షమించడంలో గల శక్తిని తెలియజేసే ఉదాహరణలను బైబిలు అందిస్తోంది. (1 సమూయేలు 25:​2-35; అపొస్తలుల కార్యములు 23:​1-5) సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా భేదాభిప్రాయం కలిగినప్పుడు, ఇద్దరి వైపు నుండి కొంత తప్పు జరిగే ఉంటుంది. కాబట్టి పరస్పరం రాజీ పడడం, క్షమాపణలు చెప్పుకోవడం అవసరం.​—⁠11/1, 4-7 పేజీలు.

కేవలం చిన్న మొత్తాలే అయినా పందెం కాయడం ఎందుకు తప్పు?

జూదం బైబిలు ఖండించే ఆత్మస్తుతిని, పోటీతత్వాన్ని, దురాశను ఉత్పన్నం చేయగలదు. (1 కొరింథీయులు 6:​9, 10) జూదానికి దాసులైన చాలామంది మొదట చిన్న చిన్న మొత్తాలతో పందెం కాయడంతోనే ప్రారంభించారు.​—⁠11/1, 31వ పేజీ.

బైబిలులోని ఎక్కువ పుస్తకాలు గ్రీకు భాషలోనే వ్రాయబడినా, బైబిలును గ్రీకు భాషలోకి అనువదించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దాని ఫలితాలు ఏమిటి?

ఆధునిక గ్రీకు భాష, హీబ్రూ లేఖనాల సెప్టాజింట్‌ అనువాదంలో ఉపయోగించబడిన గ్రీకు భాషకు, క్రైస్తవ గ్రీకు లేఖనాల గ్రీకు భాషకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇటీవలి శతాబ్దాల్లో బైబిలులోని కొంత భాగమైనా లేదా మొత్తమైనా ఆధునిక గ్రీకు భాషలోకి అనువదించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. నేడు మొత్తంగా లేదా పాక్షికంగా దాదాపు 30 అనువాదాలు ఉన్నాయి, అవి గ్రీకు చదివే సగటు వ్యక్తి చదివి అర్థం చేసుకోగలిగేలా ఉన్నాయి. వాటిలో గమనార్హమైనది పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము, అది 1997 లో ప్రచురించబడింది.​—⁠11/15, 26-9 పేజీలు.

దశమభాగం ఇవ్వాల్సిన అవసరం క్రైస్తవులకు ఎందుకు లేదు?

ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ప్రకారం ఇవ్వబడే దశమభాగం లేవీయులకు, అవసరంలో ఉన్నవారికి మద్దతునివ్వడం కోసం చేసిన ఒక ఏర్పాటు. (లేవీయకాండము 27:​30; ద్వితీయోపదేశకాండము 14:​28, 29) యేసు బలి మరణం ఆ ధర్మశాస్త్రాన్నీ, దానిలో చెప్పబడిన దశమభాగం ఇవ్వడాన్నీ కొట్టివేసింది. (ఎఫెసీయులు 2:​13-15) తొలి క్రైస్తవ సంఘంలో ప్రతి క్రైస్తవుడు తన ఆర్థికస్థితిని బట్టి, తన హృదయములో నిశ్చయించుకొన్న ప్రకారం ఇచ్చే అలవాటు ఉండేది. (2 కొరింథీయులు 9:​5, 7)​—⁠12/1, 4-6 పేజీలు.

ప్రకటన 20:⁠8వ వచనానికి, చివరి పరీక్షలో సాతాను చాలా పెద్ద సంఖ్యలో ప్రజలను మోసగిస్తాడని భావమా?

మోసగించబడేవారు “సముద్రపు ఇసుకవలె” ఉంటారని లేఖనము చెబుతోంది. బైబిల్లో ఆ మాట గొప్పసంఖ్యను సూచించడం లేదు గానీ సాధారణంగా తెలియని సంఖ్యను సూచిస్తోంది. “సముద్రతీరమందలి యిసుకవలె” ఉంటుందని చెప్పబడిన అబ్రాహాము సంతానం, చివరికి యేసుతో పాటు ఉన్న 1,44,000 మంది వ్యక్తులని తేలింది. (ఆదికాండము 22:​17; ప్రకటన 14:​1-4)​—⁠12/1, 29వ పేజీ.