కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఒకరి యెడల ఒకరు ప్రేమగలవారై’ ఉండండి

‘ఒకరి యెడల ఒకరు ప్రేమగలవారై’ ఉండండి

‘ఒకరి యెడల ఒకరు ప్రేమగలవారై’ ఉండండి

‘మీరు ఒకరియెడల ఒకరు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.’​యోహాను 13:​35.

“పిల్లలారా.” (యోహాను 13:​33) యేసు తన మరణానికి ముందు సాయంకాలం తన అపొస్తలులను ప్రేమపూర్వకంగా అలా సంబోధించాడు. యేసు అంతకు ముందు వారితో మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకమైన ఈ పదాన్ని ఉపయోగించినట్లు తెలిపే విషయమేదీ సువార్త వృత్తాంతాల్లో లేదు. అయితే ఆ ప్రత్యేకమైన రాత్రి, తన అనుచరులపట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమను తెలియజేయడానికి ఆయన ఈ వాత్సల్యభరితమైన సంబోధనను ఉపయోగించడానికి పురికొల్పబడ్డాడు. వాస్తవానికి, యేసు ఆ రాత్రి ప్రేమ గురించి దాదాపు 30 సార్లు ప్రస్తావించాడు. ఈ లక్షణానికి ఆయనెందుకంత ప్రాధాన్యతనిచ్చాడు?

2 ప్రేమ ఎందుకంత ప్రాముఖ్యమైనదో యేసు వివరించాడు. ‘మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు’ అని ఆయన అన్నాడు. (యోహాను 13:35; 15:​12, 17) క్రీస్తు అనుచరుడిగా ఉండడానికీ సహోదర ప్రేమ చూపించడానికీ దగ్గర సంబంధం ఉంది. నిజ క్రైస్తవులు ఒక ప్రత్యేక విధమైన వస్త్రధారణ వల్లనో అసాధారణమైన ఆచారాల వల్లనో కాదు గానీ వారు ఒకరి పట్ల ఒకరు చూపించుకునే వాత్సల్యభరితమైన ప్రేమను బట్టి గుర్తించబడతారు. ఈ విశేష విధమైన ప్రేమ కలిగివుండడం, ముందటి ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించబడినట్లుగా, క్రీస్తు శిష్యులుగా ఉండడానికి అవసరమైన మూడు ముఖ్యమైన విధులలో రెండవది. దీన్ని నిరంతరం నెరవేరుస్తూ ఉండడానికి మనకేమి సహాయం చేస్తుంది?

‘ప్రేమయందు మరియెక్కువగా అభివృద్ధినొందడం’

3 మొదటి శతాబ్దంలోని క్రీస్తు అనుచరుల మధ్య గమనించగలిగినట్లుగానే, నేడు క్రీస్తు నిజమైన శిష్యుల మధ్య విశేషమైన ఈ ప్రేమను చూడవచ్చు. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. . . . సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు.” అయినప్పటికీ పౌలు ఇంకా ఇలా అన్నాడు: “మీరు ప్రేమయందు మరియెక్కువగా అభివృద్ధినొం[దుడి].” (1 థెస్సలొనీకయులు 3:​12, 13; 4:​9-12) పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని మనం కూడా లక్ష్యపెట్టి, ఒకరి పట్ల ఒకరం ప్రేమ చూపించడంలో ‘మరియెక్కువగా అభివృద్ధినొందాలి.’

4 అదే ప్రేరేపిత పత్రికలో పౌలు, “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి” అని తన తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు. (1 థెస్సలొనీకయులు 5:14) మరో సందర్భంలో ఆయన, ‘బలవంతులైనవారు బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులైయున్నారు’ అని క్రైస్తవులకు గుర్తుచేశాడు. (రోమీయులు 15:⁠1) బలహీనులకు సహాయం చేయడం గురించి యేసు కూడా ఉపదేశాలిచ్చాడు. ఆయన తాను నిర్బంధించబడే రాత్రి పేతురు తనను ఎరుగనని చెబుతాడని ప్రవచించిన తర్వాత, పేతురుతో ఇలా అన్నాడు: “నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు[ము].” ఎందుకు? ఎందుకంటే వారు కూడా యేసును విడనాడి సహాయం అవసరమైన స్థితిలో ఉండే అవకాశముంది. (లూకా 22:32; యోహాను 21:​15-17) కాబట్టి ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారికి, క్రైస్తవ సంఘం నుండి దూరమైన వారికి ప్రేమను చూపించమని దేవుని వాక్యం మనల్ని నిర్దేశిస్తోంది. (హెబ్రీయులు 12:​12) మనమెందుకలా చేయాలి? యేసు చెప్పిన రెండు శక్తివంతమైన దృష్టాంతాలు సమాధానాన్నిస్తాయి.

తప్పిపోయిన గొఱ్ఱె, పోయిన నాణెము

5 దారి తప్పిన వారిని యెహోవా ఎలా దృష్టిస్తాడనే విషయాన్ని తన శ్రోతలకు బోధించడానికి యేసు రెండు క్లుప్తమైన దృష్టాంతాలను ఉపయోగించాడు. ఒకటి గొఱ్ఱెలకాపరిని గురించినది. యేసు ఇలా అన్నాడు: “మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి​—⁠మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.”​—⁠లూకా 15:​4-7.

6 రెండవ దృష్టాంతం ఒక స్త్రీని గురించినది. యేసు ఇలా అన్నాడు: “ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి​—⁠నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నా[ను].”​—⁠లూకా 15:​8-10.

7 ఈ క్లుప్తమైన దృష్టాంతాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అవి, (1) బలహీనులైన వారి గురించి మనమెలా భావించాలి, (2) వారికి సహాయం చేయడానికి మనమేమి చేయాలి అనే విషయాలను మనకు తెలియజేస్తాయి. మనమీ విషయాలను పరిశీలిద్దాము.

పోయినా అమూల్యమైనవే

8 రెండు దృష్టాంతాల్లోనూ ఏదో ఒకటి పోయింది, అయితే వాటి సొంతదారుల ప్రతిస్పందనను గమనించండి. గొఱ్ఱెలకాపరి, ‘ఒకటి పోతే పోయింది నా దగ్గర ఇంకా 99 గొఱ్ఱెలున్నాయిగా, ఆ ఒక్కటీ లేకపోయినా ఫరవాలేదు’ అనలేదు. అలాగే ఆ స్త్రీ, ‘ఆ ఒక్క నాణెము గురించి చింతించడం దేనికి? నా దగ్గర మిగిలివున్న తొమ్మిది నాణేలు నాకు చాలు’ అనలేదు. బదులుగా ఆ గొఱ్ఱెలకాపరి తన దగ్గరున్నది ఆ ఒక్క గొఱ్ఱే అన్నట్లుగా దాని కోసం వెదికాడు. ఆ స్త్రీ తన దగ్గరున్నది ఆ ఒక్క నాణెమే అన్నట్లుగా దాని కోసం బాధపడింది. రెండు సందర్భాల్లోనూ పోయినది సొంతదారునికి అమూల్యమైనదిగానే ఉంది. ఇది ఏమి స్పష్టపరుస్తోంది?

9 రెండు సందర్భాల్లోనూ యేసు ఎలా ముగించాడో గమనించండి: “అటువలె . . . మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును,” “అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నా[ను].” కాబట్టి గొఱ్ఱెలకాపరికి, స్త్రీకి ఉన్న శ్రద్ధ యెహోవా భావాలను, ఆయన పరలోక సృష్టిప్రాణుల భావాలను కొంత మేరకు ప్రతిబింబిస్తుంది. గొఱ్ఱెలకాపరి దృష్టిలోనూ స్త్రీ దృష్టిలోనూ తాము పోగొట్టుకున్నది అమూల్యమైనదిగా ఉన్నట్లే, దేవుని ప్రజలకు దూరమై వారితో సహవాసాన్ని కోల్పోయిన వారు యెహోవా దృష్టిలో అమూల్యమైనవారిగా ఉంటారు. (యిర్మీయా 31:⁠3) అలాంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉండవచ్చు, అంత మాత్రాన వారేమీ తిరుగుబాటుదారులు కానవసరం లేదు. వారు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ వారు కొంతమేరకు యెహోవా కోరేవాటికి అనుగుణంగా జీవిస్తుండవచ్చు. (కీర్తన 119:176; అపొస్తలుల కార్యములు 15:​28, 29) కాబట్టి గత కాలాల్లోలాగే ఇప్పుడు కూడా, యెహోవా “తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్ట[డు].”​—⁠2 రాజులు 13:​23.

10 యెహోవా, యేసు వలే మనం కూడా బలహీనులపట్ల క్రైస్తవ సంఘానికి రావడం మానుకున్నవారిపట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాము. (యెహెజ్కేలు 34:16; లూకా 19:​10) ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వ్యక్తిని మనం తప్పిపోయిన గొఱ్ఱెగా దృష్టిస్తామే గానీ ఆ వ్యక్తి ఇక మారే ప్రసక్తే లేదని భావించము. ‘ఒక బలహీనుడి గురించి చింతించడం దేనికి? ఆయన లేకపోయినా సంఘం బాగానే ఉంది’ అని మనమనుకోము. బదులుగా, యెహోవా దృష్టించినట్లే, దూరమై తిరిగి రావాలనుకుంటున్న వారిని విలువైనవారిగా దృష్టిస్తాము.

11 అయితే మన శ్రద్ధను మనమెలా వ్యక్తం చేయవచ్చు? (1) చొరవ తీసుకోవడం ద్వారా, (2) దయాపూర్వకంగా వ్యవహరించడం ద్వారా, (3) ఆసక్తి కలిగివుండడం ద్వారా మనం శ్రద్ధను వ్యక్తం చేయవచ్చని యేసు చెప్పిన రెండు దృష్టాంతాలు సూచిస్తున్నాయి. ఈ అంశాల్లో ఒక్కోదాన్ని మనం పరిశీలిద్దాము.

చొరవ తీసుకోండి

12 రెండు దృష్టాంతాల్లోని మొదటిదానిలో, గొఱ్ఱెలకాపరి “తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక” వెళ్తాడని యేసు చెబుతున్నాడు. గొఱ్ఱెలకాపరి చొరవ తీసుకొని, తప్పిపోయిన గొఱ్ఱెను వెదకడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కష్టం, ప్రమాదం, దూరం ఇవేమీ ఆయనను ఆపవు. “తప్పిపోయినది దొరకు వరకు” ఆ కాపరి తీవ్రంగా ప్రయత్నిస్తాడు.​—⁠లూకా 15:⁠4.

13 అదే విధంగా, ప్రోత్సాహం అవసరమైన వ్యక్తికి సహాయం చేయడానికి తరచూ బలవంతుడైన వ్యక్తి చొరవ తీసుకోవాలి. ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన వారు దీన్ని అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు, సౌలు రాజు కుమారుడైన యోనాతాను తన సన్నిహిత స్నేహితుడైన దావీదుకు ప్రోత్సాహం అవసరమని గమనించినప్పుడు, యోనాతాను “లేచి, వనములోనున్న దావీదునొద్దకు వచ్చి . . . దేవునిబట్టి అతని బలపరచెను.” (1 సమూయేలు 23:​15-18) శతాబ్దాల తర్వాత, యూదులైన తన సహోదరులు కొందరు నిరుత్సాహపడుతున్నారని అధికారియైన నెహెమ్యా చూసినప్పుడు ఆయన కూడా వెంటనే “లేచి,” ‘యెహోవాను జ్ఞాపకము చేసికొనమని’ వారిని ప్రోత్సహించాడు. (నెహెమ్యా 4:​14) నేడు మనం కూడా నిరుత్సాహంతో ఉన్న వారిని బలపరచడానికి ‘లేవాలని’ అంటే చొరవ తీసుకోవాలని కోరుకుంటాము. అయితే సంఘంలోని ఎవరు అలా చేయాలి?

14 ‘సడలిన చేతులను బలపరచవలసిన, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచవలసిన’ బాధ్యత, ‘తత్తరిల్లు హృదయులతో​—⁠భయపడక ధైర్యముగా ఉండుడి’ అని చెప్పవలసిన బాధ్యత ప్రాముఖ్యంగా క్రైస్తవ పెద్దలకు ఉంది. (యెషయా 35:3, 4; 1 పేతురు 5:​1, 2) అయితే “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి” అనే ఉపదేశాన్ని పౌలు ఇచ్చింది కేవలం పెద్దలకు మాత్రమే కాదని గమనించండి. బదులుగా, పౌలు “థెస్సలొనీకయుల సంఘము” అంతటినీ ఉద్దేశించి ఆ మాటలు చెప్పాడు. (1 థెస్సలొనీకయులు 1:1; 5:​14) కాబట్టి బలహీనంగా ఉన్నవారికి సహాయం చేయవలసిన బాధ్యత క్రైస్తవులందరికీ ఉంది. దృష్టాంతంలోని గొఱ్ఱెలకాపరిలా, ప్రతి క్రైస్తవుడు “తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక” వెళ్ళడానికి పురికొల్పబడాలి. అయితే పెద్దలతో సహకరించడం ద్వారా ఈ పనిని మరింత సమర్థవంతంగా చేయవచ్చు. మీ సంఘంలోని బలహీనంగా ఉన్న ఒకరికి సహాయం చేయడానికి మీరు చర్యలు తీసుకుంటారా?

దయాపూర్వకంగా వ్యవహరించండి

15 గొఱ్ఱెలకాపరి తప్పిపోయిన గొఱ్ఱెను చివరికి కనుగొన్నప్పుడు ఏమి చేస్తాడు? ‘దానిని తన భుజములమీద వేసుకుంటాడు.’ (లూకా 15:⁠5) ఎంతటి కదిలింపచేసే, సమర్థమైన వివరణ! ఆ గొఱ్ఱె ఎన్నో పగళ్ళు, రాత్రుళ్ళు తనకు తెలియని ప్రాంతాల్లో దిక్కుతోచకుండా తిరుగుతూ, వేటకోసం తిరిగే సింహాల బారిన పడగల ప్రమాదానికి కూడా గురై ఉంటుంది. (యోబు 38:​39, 40) తిండిలేక గొఱ్ఱె బలహీనమైపోయి ఉంటుందనడంలో సందేహం లేదు. తిరిగి మందను చేరుకోవడానికి చేసే ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను అది తన సొంత శక్తితో అధిగమించలేనంత బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి గొఱ్ఱెలకాపరి క్రిందికి వంగి, గొఱ్ఱెను దయాపూర్వకంగా పైకెత్తుకొని, దాన్ని మోసుకుంటూ అన్ని ఆటంకాలను అధిగమిస్తూ దాన్ని తిరిగి మందతో చేరుస్తాడు. ఈ గొఱ్ఱెలకాపరి చూపించిన శ్రద్ధను మనమెలా చూపించగలము?

16 సంఘంతో సంబంధాన్ని కోల్పోయిన వ్యక్తి ఆధ్యాత్మిక భావంలో శక్తి ఉడిగిపోయి ఉండవచ్చు. గొఱ్ఱెలకాపరి నుండి విడిపోయిన గొఱ్ఱెలా, అలాంటి వ్యక్తి ఈ లోకపు ప్రతికూల ప్రాంతంలో గమ్యం లేకుండా తిరిగి ఉండవచ్చు. క్రైస్తవ సంఘమనే గొర్రెలదొడ్డి ఇచ్చే కాపుదల లేకుండా ఆయన, “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగు[తున్న]” అపవాది దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. (1 పేతురు 5:⁠8) అంతేగాక ఆయన ఆధ్యాత్మిక ఆహార లేమివల్ల బలహీనమయ్యాడు. కాబట్టి ఆయన సంఘానికి తిరిగి రావడంలో ఎదురయ్యే ఆటంకాలను తాను స్వయంగా అధిగమించలేనంత బలహీనంగా ఉండవచ్చు. ఆ కారణంగా, సూచనార్థకంగా చెప్పాలంటే, మనం క్రిందికి వంగి దయాపూర్వకంగా ఆ బలహీనుడిని పైకెత్తుకొని వెనక్కి తీసుకురావాలి. (గలతీయులు 6:⁠2) దాన్ని మనమెలా చేయవచ్చు?

17 అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఎవరికైనా బలహీనత ఉంటే నాకూ బలహీనత ఉన్నట్లుండదా?” (2 కొరింథీయులు 11:​29, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం; 1 కొరింథీయులు 9:​22) బలహీనులతో సహా ప్రజలంటే పౌలుకు సహానుభూతి ఉండేది. బలహీనులపట్ల మనం కూడా అలాంటి భావాన్నే వ్యక్తం చేయాలనుకుంటాము. ఆధ్యాత్మికంగా బలహీనుడైన ఒక క్రైస్తవుడ్ని సందర్శిస్తున్నప్పుడు ఆయన యెహోవా దృష్టిలో విలువైనవాడనీ తోటి సాక్షులు ఆయన లేని లోటును ఎంతగానో అనుభవిస్తున్నారనీ ఆయనకు హామీ ఇవ్వండి. (1 థెస్సలొనీకయులు 2:​17) ఆయనకు సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారనీ, ‘దుర్దశలో సహోదరులుగా ఉండడానికి’ వారు సుముఖంగా ఉన్నారనీ ఆయనకు తెలపండి. (సామెతలు 17:17; కీర్తన 34:​18) మన ప్రేమగల మాటలు, ఆయన తిరిగి మందలోకి రాగలిగేలా ఆయనను దయతో క్రమంగా లేవనెత్తే అవకాశముంది. ఆ తర్వాత మనమేమి చేయాలి? స్త్రీ, పోయిన నాణెము గురించిన దృష్టాంతం మనకు మార్గదర్శకాన్నిస్తుంది.

ఆసక్తి కలిగివుండండి

18 నాణెమును పోగొట్టుకున్న స్త్రీకి, పరిస్థితి కష్టభరితంగా ఉందేగానీ నిరాశాపూరితంగా లేదని తెలుసు. నాణెము గనుక దట్టంగా పెరిగిన పెద్ద పొలములోనో మురికిగా ఉన్న లోతైన కాలువలోనో పడితే ఇక దాన్ని తిరిగి పొందే అవకాశం లేదని ఆమె ఆశలు వదులుకునేదే. అయితే ఆ నాణెము తన ఇంట్లోనే ఎక్కడో ఉండి ఉంటుందని, దాన్ని వెతికి పట్టుకోవడం సాధ్యమేనని భావించి ఆమె తీవ్రంగా ఇల్లంతా వెదకడం ప్రారంభిస్తుంది. (లూకా 15:⁠8) మొదట, చీకటిగా ఉన్న తన ఇంట్లో వెలుగు కోసం ఆమె ఒక దీపం వెలిగిస్తుంది. ఆ తర్వాత, నాణెము కదిలితే శబ్దం వినిపిస్తుందనే ఆశతో చీపురు తీసుకొని ఇల్లు ఊడుస్తుంది. చివరిగా, ఆ వెండి నాణెము దీపపు వెలుగులో తళుక్కుమనేంత వరకూ ఆమె జాగ్రత్తగా ప్రతీ మూల వెదకుతుంది. ఆ స్త్రీ చేసిన తీవ్ర ప్రయత్నానికి ప్రతిఫలం లభిస్తుంది!

19 ఈ దృష్టాంతంలోని వివరణ మనకు గుర్తు చేస్తున్నట్లుగా, బలహీనులైన క్రైస్తవులకు సహాయం చేయవలసిన లేఖనాధారిత బాధ్యత మన శక్తికి మించినదేమీ కాదు. అదే సమయంలో, దానికి కృషి అవసరమని మనం గుర్తిస్తాము. నిజానికి అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని పెద్దలకు ఇలా చెప్పాడు: “మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలె[ను].” (అపొస్తలుల కార్యములు 20:​35ఎ) ఆ స్త్రీ తన ఇంట్లో ఊరికే అక్కడా ఇక్కడా లేదా యాదృచ్చికంగా ఎప్పుడో ఒకసారి ఏదో పైపైన చూసినంతనే నాణెము దొరకలేదని మనస్సులో ఉంచుకోండి. ఆమె “అది దొరకువరకు జాగ్రత్తగా” ఒక పద్ధతి ప్రకారం వెదకినందుకే ఆమె ప్రయాస సఫలమైంది. అలాగే, ఆధ్యాత్మికంగా బలహీనుడైన ఒక వ్యక్తిని తిరిగి సంపాదించుకోవడానికి మనం ఆసక్తితో, లక్ష్యంతో ప్రయత్నించవలసిన అవసరముంది. మనమేమి చేయవచ్చు?

20 బలహీనుడైన ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని, కృతజ్ఞతను పెంపొందింపజేసుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు? సముచితమైన ఒక క్రైస్తవ ప్రచురణ నుండి ఆయన వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడమే సరిపోతుండవచ్చు. వాస్తవానికి, బలహీనుడైన ఒక వ్యక్తితో బైబిలు అధ్యయనం చేయడం మనం ఆయనకు సంగతంగా, సంపూర్ణంగా సహాయం చేయడానికి అవకాశాన్నిస్తుంది. అవసరమైన సహాయాన్ని ఎవరు అందించాలనేది నిర్ణయించడానికి సరైన వ్యక్తి బహుశా సేవా పైవిచారణకర్తే కావచ్చు. ఏ విషయాలను అధ్యయనం చేయవచ్చు, ఏ ప్రచురణ అత్యంత సహాయకరంగా ఉండగలదు అనేవి ఆయన సూచించవచ్చు. దృష్టాంతంలోని స్త్రీ తన పనిని సాధించుకోవడానికి సహాయకరమైన ఉపకరణాలను ఉపయోగించినట్లే, బలహీనులకు సహాయం చేయడమనే దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి తోడ్పడే ఉపకరణాలు నేడు మనకున్నాయి. మన కొత్త ఉపకరణాల్లో లేక ప్రచురణల్లో రెండు ఈ విషయంలో ప్రత్యేకంగా సహాయకరంగా ఉంటాయి. అవి ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం), యెహోవాకు సన్నిహితమవ్వండి (ఆంగ్లం). *

21 బలహీనులకు సహాయం చేయడం అందరికీ ఆశీర్వాదాలను తెస్తుంది. సహాయం పొందినవారికి, నిజమైన స్నేహితులతో తిరిగి కలవడం వల్ల కలిగే ఆనందం లభిస్తుంది. ఇవ్వడం మాత్రమే తీసుకురాగల హృదయపూర్వకమైన సంతోషం మనకు లభిస్తుంది. (లూకా 15:6, 9; అపొస్తలుల కార్యములు 20:​35) ప్రతి సభ్యుడు ఇతరుల పట్ల ప్రేమపూర్వకమైన ఆసక్తిని చూపించినప్పుడు వాత్సల్యం చూపించడంలో సంఘమంతా అభివృద్ధి చెందుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మన ప్రేమగల కాపరులైన యెహోవాకు, యేసుకు ఘనత కలుగుతుంది, ఎందుకంటే బలహీనులకు సహాయం చేయాలన్న వారి కోరిక వారి భూ సేవకులలో ప్రతిబింబిస్తుంది. (కీర్తన 72:12-14; మత్తయి 11:28-30; 1 కొరింథీయులు 11:1; ఎఫెసీయులు 5:⁠1) కాబట్టి ‘ఒకరి యెడల ఒకరం ప్రేమగలవారమై’ ఉండడానికి మనకు ఎంత మంచి కారణాలున్నాయో కదా!

[అధస్సూచీలు]

^ పేరా 28 యెహోవాసాక్షులు ప్రచురించినవి.

మీరు వివరించగలరా?

• ప్రేమ చూపించడం మనకందరికీ ఎందుకు ఆవశ్యకం?

• బలహీనులపట్ల మనమెందుకు ప్రేమ చూపించాలి?

• తప్పిపోయిన గొఱ్ఱె, పోయిన నాణెము దృష్టాంతాలు మనకెలాంటి పాఠాలను బోధిస్తున్నాయి?

• బలహీనులకు సహాయం చేయడానికి మనం ఎలాంటి ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు తాను మరణించడానికి కొంత సమయం ముందు ఏ లక్షణం గురించి నొక్కి చెప్పాడు?

2. ప్రేమ చూపించడం క్రైస్తవులకు ఎందుకంత ప్రాముఖ్యం?

3. అపొస్తలుడైన పౌలు ప్రేమ గురించి ఏ ఉపదేశాన్నిచ్చాడు?

4. యేసు, పౌలు చెప్పిన దాని ప్రకారం, మనం ఎవరిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి?

5, 6. (ఎ) యేసు క్లుప్తమైన ఏ రెండు దృష్టాంతాలను చెప్పాడు? (బి) ఈ దృష్టాంతాలు యెహోవా గురించి ఏమి తెలియజేస్తున్నాయి?

7. తప్పిపోయిన గొఱ్ఱె, పోయిన నాణెము గురించిన దృష్టాంతాలలో మన కోసం ఏ రెండు పాఠాలున్నాయి?

8. (ఎ) గొఱ్ఱెలకాపరి, స్త్రీ తాము పోగొట్టుకున్న దాన్ని బట్టి ఎలా ప్రతిస్పందించారు? (బి) పోగొట్టుకున్న దాన్ని వాళ్ళెలా దృష్టించారనే దాని గురించి వారి ప్రతిస్పందన మనకేమి చెబుతోంది?

9. గొఱ్ఱెలకాపరి, స్త్రీ చూపించిన శ్రద్ధ దేన్ని సోదాహరణంగా తెలియజేస్తోంది?

10, 11. (ఎ) సంఘానికి దూరమైన వారిని మనమెలా దృష్టించాలనుకుంటాము? (బి) యేసు చెప్పిన రెండు దృష్టాంతాల ప్రకారం, వారిపట్ల మనకున్న శ్రద్ధను మనమెలా వ్యక్తం చేయవచ్చు?

12. “తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక” వెళ్తాడనే మాటలు కాపరి దృక్పథం గురించి మనకేమి తెలియజేస్తున్నాయి?

13. నిరుత్సాహపడుతున్న వారి అవసరాలకు ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైనవారు ఎలా ప్రతిస్పందించారు, అలాంటి బైబిలు ఉదాహరణలను మనమెలా అనుకరించవచ్చు?

14. బలహీనులకు సహాయం చేయవలసిన బాధ్యత క్రైస్తవ సంఘంలో ఎవరికి ఉంది?

15. గొఱ్ఱెలకాపరి ఎందుకలా చేసి ఉండవచ్చు?

16. తప్పిపోయిన గొఱ్ఱెపట్ల గొఱ్ఱెలకాపరి చూపించిన వాత్సల్యాన్ని మనమెందుకు చూపించాలి?

17. బలహీనంగా ఉన్న ఒక వ్యక్తిని సందర్శించినప్పుడు అపొస్తలుడైన పౌలును మనమెలా అనుకరించవచ్చు?

18. (ఎ) దృష్టాంతంలోని స్త్రీ ఎందుకు ఆశను వదులుకోదు? (బి) ఆ స్త్రీ ఎలాంటి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది, దాని ఫలితమేమిటి?

19. బలహీనులకు సహాయం చేయడంలో, పోయిన నాణెమును గురించిన దృష్టాంతంలోని స్త్రీ చేసిన చర్యల నుండి మనం ఏ పాఠాలను నేర్చుకోవచ్చు?

20. బలహీనులకు సహాయం చేయడానికి ఏమి చేయవచ్చు?

21. బలహీనులకు సహాయం చేయడం ఎలా అందరికీ ఆశీర్వాదాలను తెస్తుంది?

[16, 17వ పేజీలోని చిత్రాలు]

బలహీనులకు సహాయం చేయడంలో మనం చొరవ తీసుకొని, దయాపూర్వకంగా వ్యవహరిస్తూ ఆసక్తి కలిగివుంటాము

[16, 17వ పేజీలోని చిత్రం]

బలహీనులకు సహాయం చేయడం అందరికీ ఆశీర్వాదాలను తెస్తుంది