కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బలిపీఠం ఆరాధనలో దానికి ఏ స్థానముంది?

బలిపీఠం ఆరాధనలో దానికి ఏ స్థానముంది?

బలిపీఠం ఆరాధనలో దానికి ఏ స్థానముంది?

మీఆరాధనలో బలిపీఠం ప్రధానభాగమని మీరు భావిస్తారా? క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలకు హాజరయ్యే అనేకులకు బలిపీఠం కేంద్రస్థానం కావచ్చు. ఆరాధనలో బలిపీఠములను ఉపయోగించడం గురించి బైబిలు ఏమి తెలియజేస్తుందో మీరెప్పుడైనా పరిశీలించారా?

జలప్రళయం తర్వాత, తమకు భద్రతనిచ్చిన ఓడలో నుండి బయటికి వచ్చాక జంతువులను బలి ఇవ్వడానికి నోవహు నిర్మించినదే బైబిలులో ప్రస్తావించబడిన మొట్టమొదటి బలిపీఠం. *​—⁠ఆదికాండము 8:​20.

బాబేలులో భాషలు తారుమారు చేయబడిన తర్వాత మానవజాతి భూమియందంతటా వ్యాపించింది. (ఆదికాండము 11:​1-9) ఆరాధన చేయాలని తమలో అంతర్గతంగా ఉన్న కోరికను బట్టి మానవులు దేవునికి సన్నిహితమవడానికి ప్రయత్నించారు, వారికి దేవుడంటే ఎవరో ఏమాత్రం తెలియదు, వారాయన కోసం గ్రుడ్డిగా ‘తడవులాడారు.’ (అపొస్తలుల కార్యములు 17:​26, 27; రోమీయులు 2:​14, 15) నోవహు కాలం నాటినుండి అనేకమంది ప్రజలు తమ దేవతల కోసం బలిపీఠములు కట్టారు. వివిధ మతాలకు, సంస్కృతులకు చెందిన ప్రజలు అబద్ధ ఆరాధనలో బలిపీఠములను ఉపయోగించారు. సత్య దేవుని నుండి దూరమైపోయిన కొందరు, మానవులను బలి ఇవ్వడం, చివరికి పిల్లలను కూడా బలి ఇవ్వడం వంటి హేయమైన ఆచారాల నిమిత్తం బలిపీఠములను ఉపయోగించారు. కొంతమంది ఇశ్రాయేలు రాజులు తాము యెహోవాను విడనాడినప్పుడు బయలు వంటి అన్య దేవుళ్ళ కోసం బలిపీఠములు కట్టించారు. (1 రాజులు 16:​29-32) అయితే సత్యారాధనలో బలిపీఠముల ఉపయోగం మాటేమిటి?

ఇశ్రాయేలులో బలిపీఠములు, సత్యారాధన

నోవహు తర్వాత, విశ్వసనీయులైన ఇతర పురుషులు సత్యదేవుడైన యెహోవా ఆరాధనలో ఉపయోగించడానికి బలిపీఠములను కట్టారు. అబ్రాహాము షెకెములో, బేతేలు దగ్గర ఒక స్థలంలో, హెబ్రోనులో, ఇస్సాకుకు బదులుగా దేవుడిచ్చిన పొట్టేలును తాను బలి అర్పించిన మోరీయా పర్వతంపై బలిపీఠములను కట్టించాడు. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, మోషే తాము దేవుడ్ని ఆరాధించడంలో ఉపయోగించడానికి అప్పటికప్పుడు బలిపీఠములు కట్టారు.​—⁠ఆదికాండము 12:6-8; 13:3, 18; 22:9-13; 26:23-25; 33:18-20; 35:1, 3, 7; నిర్గమకాండము 17:15, 16; 24:​4-8.

దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, తనను సమీపించడానికి చేయబడిన ఏర్పాటులో ప్రధాన భాగముగా ఎక్కడికైనా తీసుకువెళ్ళగలిగేలా ఉండే ఒక గుడారమును తయారు చేయమని ఆజ్ఞాపించాడు, అది “ప్రత్యక్షపు గుడారపు మందిరము” అని కూడా పిలువబడేది. (నిర్గమకాండము 39:​32, 40) ఆ గుడారములో రెండు బలిపీఠములు ఉండేవి. దహన బలులు అర్పించడానికి ఉపయోగించబడే బలిపీఠమును తుమ్మకఱ్ఱతో చేసి దానికి ఇత్తడి రేకు పొదిగి, ద్వారము ఎదుట ఉంచేవారు, అది జంతు బలులను అర్పించడానికి ఉపయోగించబడేది. (నిర్గమకాండము 27:1-8; 39:39; 40:​6, 29) తుమ్మకఱ్ఱతోనే చేయబడి బంగారు రేకు పొదగబడిన ధూప వేదిక ప్రత్యక్షపు గుడారములో అతిపరిశుద్ధ స్థలపు అడ్డ తెర ఎదుట ఉంచబడేది. (నిర్గమకాండము 30:1-6; 39:38; 40:​5, 26, 27) దానిమీద రోజుకు రెండుసార్లు, అంటే ఉదయం, సాయంకాలం ప్రత్యేకమైన ధూపం వేయబడేది. (నిర్గమకాండము 30:​7-9) సొలొమోను రాజు నిర్మించిన శాశ్వత ఆలయంలో గుడారపు నమూనాను అనుసరిస్తూ రెండు బలిపీఠములు ఉండేవి.

“నిజమైన గుడారము,” సూచనార్థక బలిపీఠం

యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, బలి అర్పించడానికీ ప్రార్థించడానికీ ప్రజలు ఆయనను సమీపించడాన్ని, వారి జీవితాలను నియంత్రించే విధులను ఇవ్వడమే గాక ఇంకా ఎంతో చేశాడు. దానిలోని అనేక ఏర్పాట్లు, అపొస్తలుడైన పౌలు ‘ఛాయారూపం,’ “ఉపమానము,” “మేలుల ఛాయ” అని చెప్పినదాన్ని సూచించాయి. (హెబ్రీయులు 8:3-5; 9:9; 10:1; కొలొస్సయులు 2:​17) వేరే మాటల్లో చెప్పాలంటే, ధర్మశాస్త్రములోని అనేక అంశాలు క్రీస్తు వచ్చే వరకు ఇశ్రాయేలీయులకు నడిపింపునివ్వడమే గాక యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడే దేవుని సంకల్పాలకు పూర్వచ్ఛాయగా కూడా పని చేశాయి. (గలతీయులు 3:​24) అవును, ధర్మశాస్త్రములోని అంశాలకు ప్రవచనార్థక విలువ ఉంది. ఉదాహరణకు పస్కా గొఱ్ఱెపిల్ల యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉంది, ఆ గొఱ్ఱెపిల్ల రక్తం ఇశ్రాయేలీయులకు రక్షణ సూచనగా ఉపయోగించబడింది. యేసుక్రీస్తు “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల,” మనల్ని పాపం నుండి స్వతంత్రులను చేయడానికి ఆయన రక్తం ఒలికించబడింది.​—⁠యోహాను 1:29; ఎఫెసీయులు 1:⁠7.

గుడారానికి, ఆలయ సేవకు సంబంధించిన అనేక విషయాలు ఆధ్యాత్మిక వాస్తవాలకు సూచనగా ఉన్నాయి. (హెబ్రీయులు 8:5; 9:​23) వాస్తవానికి, “మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము” గురించి పౌలు వ్రాస్తున్నాడు. ఆయన ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు: ‘హస్తకృతము కానిది, ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనది, పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడిగా వచ్చాడు.’ (హెబ్రీయులు 8:​1, 2; 9:​11) “మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము” యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటు. అదే, యేసుక్రీస్తు బలి ఆధారంగా మానవులు యెహోవాను సమీపించడానికి చేయబడిన ఏర్పాటని లేఖనాల భాష సూచిస్తోంది.​—⁠హెబ్రీయులు 9:​2-10, 23-28.

ధర్మశాస్త్రములోని కొన్ని ఏర్పాట్లు, ప్రమాణాలు మరింత గొప్ప మరింత అర్థవంతమైన ఆధ్యాత్మిక వాస్తవాలను సూచిస్తాయని దేవుని వాక్యం నుండి తెలుసుకోవడం, బైబిలు ప్రేరేపితమైనదనే విషయంపై మన విశ్వాసాన్ని తప్పక దృఢపరుస్తుంది. అంతేగాక లేఖనాల్లో అసమానమైన విధంగా వ్యక్తం చేయబడిన దైవిక జ్ఞానం పట్ల మన ప్రశంసను అది అధికం చేస్తుంది.​—⁠రోమీయులు 11:33; 2 తిమోతి 3:​16, 17.

దహన బలి అర్పించబడే బలిపీఠముకు కూడా ప్రవచనార్థక విలువ ఉంది. అది దేవుని “చిత్తము”ను లేదా యేసు పరిపూర్ణ మానవ బలిని అంగీకరించడానికి ఆయన సుముఖతను సూచిస్తున్నట్లుగా ఉంది.​—⁠హెబ్రీయులు 10:​1-10.

ఆ తర్వాత హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో, పౌలు ఆసక్తికరమైన ఈ వ్యాఖ్యానం చేస్తున్నాడు: “మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారము లేదు.” (హెబ్రీయులు 13:​10) ఆయన ఏ బలిపీఠమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు?

హెబ్రీయులు 13:⁠10లో ప్రస్తావించబడిన బలిపీఠము తుదివిందు​—⁠ప్రభువు రాత్రి భోజన సమయంలో క్రీస్తు బలిని పునరుజ్జీవింపజేస్తుందని చెప్పబడే “ప్రభు నివేదన సంస్కారం”​—⁠కోసం ఉపయోగించబడే పీఠమని చాలామంది క్యాథలిక్‌ అనువాదకులు అంటారు. కానీ పౌలు చర్చిస్తున్న బలిపీఠము అలంకారికమైనదని పూర్వాపర సందర్భం నుండి మీరు చూడవచ్చు. ఈ లేఖనంలోని “బలిపీఠము” అనే పదం సూచనార్థకమైనదేనని చాలామంది పండితులు భావిస్తున్నారు. జూజెప్పా బొన్సీర్‌వెన్‌ అనే ఒక జెసూట్‌ అభిప్రాయం ప్రకారం, “ఇది [హెబ్రీయులకు] వ్రాయబడిన పత్రికలోని మిగతా అన్ని సూచనార్థకమైన వాటితోనూ పూర్తిగా పొందిక కలిగివుంది.” “క్రైస్తవ పరిభాషలో, ‘బలిపీఠం’ అనే పదం ప్రారంభంలో ఆధ్యాత్మిక భావంలో ఉపయోగించబడింది, ఐరీనీస్‌, ప్రాముఖ్యంగా టెర్టూలియన్‌ మరియు సైప్రియన్‌ వచ్చిన తర్వాతే అది తుదివిందుకు, మరింత నిర్దిష్టంగా తుదివిందు బల్లకు అన్వయింపబడింది” అని కూడా ఆయన పేర్కొంటున్నాడు.

ఒక క్యాథలిక్‌ పత్రిక తెలియజేసినట్లు, “కాన్‌స్టాంటైన్‌ శకంలో చర్చి భవనాల నిర్మాణంతో” బలిపీఠముల ఉపయోగం వ్యాపించింది. రీవీస్టా డీ ఆర్కెయోలోజీయ క్రీస్టియానా (క్రైస్తవ పురావస్తు పునఃసమీక్ష) ఇలా అన్నది: “మొదటి రెండు శతాబ్దాల్లో ఆరాధనకు ఒక స్థిరమైన స్థలం ఉందన్న నిదర్శనం ఏదీ లేదన్నది ఖచ్చితం, అయితే ఇండ్లలోని గదుల్లో ప్రభువు రాత్రి భోజనం కోసం గుంపులు కూడుకునేవి . . . , అలా ఉపయోగించుకోబడిన గదులు ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే మళ్ళీ యథావిధిగా మునుపటిలాగే ఉపయోగించబడేవి.”

క్రైస్తవమత సామ్రాజ్యం బలిపీఠములను ఉపయోగించడం

“బలిపీఠం చర్చి భవనానికే కాదు సజీవ చర్చికి కూడా కేంద్రం” అని లా సీవీల్టా కాటొలీకా అనే పత్రిక అంటోంది. అయినప్పటికీ బలిపీఠంపై నిర్వహించవలసిన ఒక్క మతాచారాన్ని కూడా యేసుక్రీస్తు స్థాపించలేదు; బలిపీఠాన్ని ఉపయోగిస్తూ వేడుకలు చేసుకోమని కూడా ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించలేదు. మత్తయి 5:23, 24 వచనాల్లో, మరితర స్థలాల్లో యేసు బలిపీఠం గురించి ప్రస్తావించడం, యూదుల మధ్య వాడుకలో ఉన్న మతాచారాలను సూచిస్తుంది గానీ తన అనుచరులు బలిపీఠాన్ని ఉపయోగించి దేవుడ్ని ఆరాధించాలని ఆయన సూచించలేదు.

అమెరికా చరిత్రకారుడైన జార్జ్‌ ఫూట్‌ మూర్‌ (1851-1931), ఇలా వ్రాశాడు: “క్రైస్తవ ఆరాధనలోని ముఖ్యాంశాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉన్నాయి, కానీ రెండవ శతాబ్ద మధ్యభాగంలో జస్టిన్‌ వర్ణించిన చిన్న చిన్న ఆచారాలు కాలగమనంలో ఒక పెద్ద మతారాధన వ్యవస్థగా అవతరించాయి.” క్యాథలిక్‌ మతాచారాలు, ప్రజల మత సంబంధమైన కర్మలు ఎంత అధిక సంఖ్యలో ఎంత సంక్లిష్టంగా ఉండేవంటే చివరికి అవి క్యాథలిక్‌ పాఠశాలల్లో ఆచారకర్మలు అనే ఒక అధ్యయనాంశంగా రూపొందాయి. మూర్‌ ఇంకా ఇలా చెప్పాడు: “ఇలా చిన్న చిన్న ఆచారాలను పెద్ద మతారాధన వ్యవస్థగా చేయడమనే వైఖరి అన్ని మతాచారాల్లోనూ ఉంది, దీన్ని క్రైస్తవ మతనాయకులు దేవుడు నియమించిన మునుపటి మతవిధానంలోని యాజకత్వపు స్థానాన్ని తీసుకునేదిగా పరిగణించడం ప్రారంభించడంతో పాత నిబంధన ప్రభావం మూలంగా అధికంగా వృద్ధి చేయబడింది. ప్రధాన యాజకుని ఆడంబర వస్త్రధారణ, ఇతర యాజకుల ఆచారబద్ధమైన అధికారిక దుస్తులు, గంభీరమైన ఊరేగింపులు, కీర్తనలను ప్రత్యేక కంఠధ్వనితో ఉచ్చరించే లేవి సంబంధిత గాయకుల బృందగానాలు, వేలాడే ధూపార్తుల నుండి వెలువడే ధూపమేఘాలు​—⁠ఇవన్నీ మతసంబంధమైన ఆరాధనకు దేవుడిచ్చిన మాదిరిగా అనిపించాయి, ఇవి ప్రాచీనకాలంలోని అన్యమతాల వైభవాన్ని చర్చి తిరిగి పొందడం సరైనదేనని సమర్థించాయి.”

అనేక మతాచారాలు, లాంఛనాలు, చిహ్నాలుగల దుస్తులు, వివిధ చర్చీలు ఆరాధనలో ఉపయోగించే ఇతర వస్తువులు సువార్తల్లోని క్రైస్తవ బోధల అనుసారమైనవి కాదు గానీ అవి యూదామత, అన్యమత ఆచారాలకు కర్మలకు అనుసారంగా ఉన్నాయని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. క్యాథలిక్‌ మతం “బలిపీఠమును ఉపయోగించడాన్ని యూదా మతం నుండి కొంతమేరకు అన్యమతాల నుండి సంతరించుకుంది” అని ఎన్‌సైక్లోపీడియా కాటొలీకా పేర్కొంటోంది. క్రైస్తవులకు ‘ఆలయాలు గానీ బలిపీఠములు గానీ ఉండేవి కాదు’ అని సా.శ. మూడవ శతాబ్దానికి చెందిన అపాలజిస్ట్‌ అయిన మీనూక్యస్‌ ఫెలిక్స్‌ వ్రాశాడు. అదే విధంగా రాలీజోనీ ఏ మీటీ (మతాలు మరియు పురాణగాథలు) అనే ఎన్‌సైక్లోపీడిక్‌ డిక్షనరీ ఇలా అంటోంది: “తొలి క్రైస్తవులు తమను తాము యూదామత, అన్యమత ఆరాధన నుండి భిన్నంగా ఉంచుకునేందుకు బలిపీఠముల ఉపయోగాన్ని నిరాకరించారు.”

క్రైస్తవత్వం అన్ని దేశాల్లోనూ అనుదిన జీవితంలో అంగీకరించవలసిన, అన్వయించుకోవలసిన సూత్రాలపై ప్రాథమికంగా ఆధారపడి ఉంది కాబట్టి, భూమిపై పరిశుద్ధ నగరమూ బలిపీఠములున్న అక్షరార్థమైన ఆలయమూ విశేషమైన వస్త్రధారణలో ఉండే ప్రత్యేక వర్గానికి చెందిన మానవ యాజకులూ వంటివాటి అవసరత ఇక లేకుండా పోయింది. “ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. . . . యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది” అని యేసు చెప్పాడు. (యోహాను 4:​21, 23) అనేక చర్చీలు చేస్తున్న ఆచారాల సంక్లిష్టత, బలిపీఠముల ఉపయోగం, సత్యదేవుడు ఆరాధించబడవలసిన విధానం గురించి యేసు చెప్పినదాన్ని అలక్ష్యం చేస్తున్నాయి.

[అధస్సూచి]

^ పేరా 3 అంతకు ముందు కయీను, హేబేలు కూడా బలిపీఠములను ఉపయోగించే యెహోవాకు తమ అర్పణలను అర్పించివుంటారు.​—⁠ఆదికాండము 4:3, 4.