మతం పేరట హింస ఎందుకు?
మతం పేరట హింస ఎందుకు?
మతం కారణంగా ప్రజలు హింసించబడాలని మీరు అనుకుంటున్నారా? మీరలా అనుకోకపోవచ్చు—కనీసం ఇతరుల హక్కులను భంగపరచనంత వరకూ వారు హింసించబడాలని మీరు అనుకోకపోవచ్చు. అయినప్పటికీ మతం కారణంగా ప్రజలు ఎంతోకాలం నుండి హింసించబడుతున్నారు, అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఉదాహరణకు యూరప్‌లో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేకమంది యెహోవాసాక్షులకు తరచూ మత స్వాతంత్య్రం లేకుండా చేయబడేది, 20వ శతాబ్దమంతటిలో వారు క్రూరంగా హింసించబడ్డారు.
ఆ కాలంలో, రెండు ప్రధాన నియంతృత్వ పాలనలలోనూ యెహోవాసాక్షులు క్రూరంగా, ఒక పద్ధతి ప్రకారం, దీర్ఘకాలంపాటు హింసించబడ్డారు. వారి అనుభవం మనకు మతపరమైన హింస గురించి ఏమి తెలియజేస్తుంది? వారు ఆ హింసకు ప్రతిస్పందించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
“లోకసంబంధులు కారు”
యెహోవాసాక్షులు చట్టానికి కట్టుబడివుండేవారిగా, శాంతియుతమైనవారిగా, నైతికంగా సరైనది చేసే ప్రజలుగా ఉండేందుకు కృషి చేస్తారు. వారు ప్రభుత్వాలను వ్యతిరేకించరు లేదా వాటితో వివాదాలు పెట్టుకోరు అంతేగాక వారు హతసాక్షులుగా మరణించాలనే ఉద్దేశంతో హింసను ప్రేరేపించరు. ఈ క్రైస్తవులు రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటారు. ‘నేను లోకసంబంధిని కానట్టు [నా అనుచరులు] లోకసంబంధులు కారు’ అని యేసు చెప్పిన మాటలకు అనుగుణంగా వారలా తటస్థంగా ఉంటారు. (యోహాను 17:16) అనేక ప్రభుత్వాలు సాక్షుల తటస్థ స్థానం న్యాయసమ్మతమేనని అంగీకరిస్తాయి. కానీ క్రైస్తవులు లోకసంబంధులుగా ఉండకూడదనే బైబిలు నియమాన్ని నియంతృత్వ పాలకులు గౌరవించరు.
దానికి కారణమేమిటో, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ హీడల్బర్గ్లో 2000వ సంవత్సరం నవంబరు నెలలో జరిగిన ఒక సమావేశంలో వివరించబడింది. “రిప్రెషన్ అండ్ సెల్ఫ్-అసర్షన్: జెహోవాస్ విట్నెసెస్ అండర్ ద నేషనల్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్” అనేది ఆ సమావేశపు అంశం. హన్నా-ఆరెంట్-ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇంటు టోటాలిటేరియనిజమ్కు చెందిన డా. క్లెమెన్స్ ఫాల్న్హాల్స్ ఇలా వ్యాఖ్యానించారు: “నియంతృత్వ పాలనలు తమ కార్యకలాపాలను రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయవు. అవి సంపూర్ణ విధేయతను కోరతాయి.”
నిజక్రైస్తవులు ఒక మానవ ప్రభుత్వానికి తమ “సంపూర్ణ విధేయతను” చూపించలేరు ఎందుకంటే వారు కేవలం యెహోవా దేవునికి మాత్రమే పూర్తిగా విశ్వసనీయంగా ఉంటామని ప్రమాణం చేశారు. నియంతృత్వ పరిపాలన క్రింద జీవిస్తున్న సాక్షులు, కొన్నిసార్లు దేశం తమనుండి కోరేవి తమ విశ్వాసం తమనుండి కోరేవాటికి వ్యతిరేకంగా ఉన్నట్లు గ్రహించారు. అలాంటి వివాదాలతో వ్యవహరించేటప్పుడు వారు ఏమి చేశారు? ‘మనుష్యులకు కాదు దేవునికే [మనము] లోబడవలెను’ అని యేసుక్రీస్తు శిష్యులు తెలియజేసిన సూత్రాన్ని యెహోవాసాక్షులు గతంలో ఎన్నోసార్లు తమ జీవితాల్లో అన్వయించుకున్నారు.—అపొస్తలుల కార్యములు 5:29.
వేలాదిమంది సాక్షులు క్రూరాతిక్రూరమైన హింసను ఎదుర్కున్నప్పుడు కూడా తమ విశ్వాసం విషయంలో యథార్థంగా ఉండి, రాజకీయ విషయాలలో తటస్థంగా ఉన్నారు. వారు హింసను ఎలా సహించగలిగారు? అలా సహించడానికి కావలసిన శక్తి వారికి ఎక్కడనుండి వచ్చింది? ఈ ప్రశ్నలకు వారినే సమాధానం చెప్పనివ్వండి. సాక్షులు, సాక్షేతరులు వారి అనుభవాలనుండి ఏమి నేర్చుకోవచ్చో మనం చూద్దాం.
[4వ పేజీలోని బ్లర్బ్]
జర్మనీలోని యెహోవాసాక్షులు 20వ శతాబ్దంలోని రెండు నియంతృత్వ పరిపాలనా విధానాల్లో దీర్ఘకాలంపాటు క్రూరమైన హింసను అనుభవించారు
[4వ పేజీలోని బ్లర్బ్]
“నియంతృత్వ పాలనలు తమ కార్యకలాపాలను రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయవు. అవి సంపూర్ణ విధేయతను కోరతాయి.”—డా. క్లెమెన్స్ ఫాల్న్హాల్స్
[4వ పేజీలోని చిత్రం]
కుస్రో కుటుంబం తమ విశ్వాసంతో రాజీపడనందుకు స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది
[4వ పేజీలోని చిత్రం]
యోహాన్నస్ హార్మజ్ తన నమ్మకాల కారణంగా నాజీ చెరసాలలో చంపబడ్డాడు