కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన ఓదార్పు ఎక్కడ లభిస్తుంది?

నిజమైన ఓదార్పు ఎక్కడ లభిస్తుంది?

నిజమైన ఓదార్పు ఎక్కడ లభిస్తుంది?

‘మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మన శ్రమ అంతటిలో మనలను ఆదరించును.’ ​2 కొరింథీయులు 1:3, 4.

అశక్తుణ్ణి చేసే అనారోగ్యం, ఒక వ్యక్తి తన జీవితమిక బాగుపడదని భావించేలా చేయవచ్చు. భూకంపాలు, తుఫానులు, కరువులు ప్రజలను దిక్కులేనివారిగా చేస్తాయి. యుద్ధాలవల్ల కుటుంబ సభ్యులు చనిపోవచ్చు, ఇళ్ళు నాశనమైపోవచ్చు లేదా ప్రజలు తమ ఇళ్ళు వదిలి పారిపోవలసి రావచ్చు. అన్యాయం వల్ల ప్రజలు తమకు ఎక్కడా ఉపశమనం లభించదని భావించవచ్చు. ఇలాంటి బాధలనుభవిస్తున్న వారికి వెంటనే ఓదార్పు అవసరం. అది ఎక్కడ లభిస్తుంది?

2 కొంతమంది ప్రజలు ఇతరులను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు, కొన్ని సంస్థలు కూడా ఓదార్పునివ్వడానికి ప్రయత్నిస్తాయి. వారందించే దయాపూర్వకమైన మాటలు కృతజ్ఞతతో స్వీకరించబడతాయి. అయితే భౌతికపరమైన సహాయాలు తాత్కాలిక అవసరాలు తీర్చడానికి మాత్రమే దోహదపడతాయి. కానీ సత్య దేవుడైన యెహోవా మాత్రమే జరిగిన నష్టాన్నంతటినీ సరిచేసి, అలాంటి విపత్తులు మళ్ళీ ఎన్నడూ సంభవించకుండా ఉండేందుకు అవసరమయ్యే సహాయాన్ని అందజేయగలడు. ఆయన గురించి బైబిలు ఇలా చెబుతోంది: “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.” (2 కొరింథీయులు 1:​3, 4) యెహోవా మనకు ఎలా ఓదార్పునిస్తాడు?

సమస్యల మూలకారణంతో వ్యవహరించడం

3 ఆదాము చేసిన పాపం కారణంగా మానవజాతంతా అపరిపూర్ణతను వారసత్వంగా పొందింది, దానివల్ల లెక్కలేనన్ని సమస్యలు తలెత్తి చివరకు ప్రజలు మరణిస్తున్నారు. (రోమీయులు 5:​12) అపవాదియైన సాతాను “ఈ లోకాధికారి” కావడం వల్ల పరిస్థితి మరింత విషమించింది. (యోహాను 12:31; 1 యోహాను 5:​19) మానవజాతి అనుభవిస్తున్న దుఃఖకరమైన పరిస్థితిని చూసి, యెహోవా కేవలం తన విచారాన్ని వ్యక్తంచేసి ఊరుకోలేదు. దానినుండి వారిని తప్పించడానికి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి విమోచన క్రయధనంగా పంపించాడు, తన కుమారుని మీద మనం విశ్వాసముంచితే ఆదాము పాపపు ప్రభావాల నుండి విముక్తులమవుతామని ఆయన మనకు చెప్పాడు. (యోహాను 3:16; 1 యోహాను 4:​10) పరలోకంలోను భూమిమీదను సర్వాధికారము పొందిన యేసుక్రీస్తు సాతానును, అతని దుష్ట విధానాన్నంతటిని నాశనం చేస్తాడని కూడా దేవుడు ముందుగా సూచించాడు.​—⁠మత్తయి 28:18; 1 యోహాను 3:8; ప్రకటన 6:2; 20:10.

4 దేవుడు తన వాగ్దానాల్లో మన విశ్వాసాన్ని బలపరచడానికి, జరగబోయే విషయాల గురించి తాను ముందుగా చెప్పినవన్నీ జరిగాయని తెలియజేసే రుజువులను సమృద్ధిగా భద్రపరిచాడు. (యెహోషువ 23:​14) మానవ దృక్కోణం నుండి చూస్తే తప్పించుకోవడం అసాధ్యము అనిపించే పరిస్థితుల నుండి తాను తన సేవకులను ఎలా రక్షించాడో తెలియజేసే వివరాలను బైబిలులో చేర్చాడు. (నిర్గమకాండము 14:4-31; 2 రాజులు 18:13-19:​37) ప్రజలు అనుభవించే “ప్రతివిధమైన వ్యాధిని” స్వస్థపరచడం, చనిపోయినవారిని పునరుత్థానం చేయడం కూడా తన సంకల్పంలో భాగమని యెహోవా యేసుక్రీస్తు ద్వారా చూపించాడు. (మత్తయి 9:35; 11:​3-6) ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? దానికి సమాధానముగా, దేవుని కొత్త ఆకాశము కొత్త భూమికంటే ముందు వచ్చే ఈ పాత విధానపు అంత్యదినాల గురించిన వర్ణన బైబిలులో ఉంది. యేసు వర్ణించింది మనం జీవిస్తున్న కాలంతో సరిగ్గా సరిపోతుంది.​—⁠మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5.

బాధలనుభవిస్తున్న ప్రజలకు ఓదార్పు

5 యెహోవా ప్రాచీన ఇశ్రాయేలుతో వ్యవహరించిన విధానం నుండి, ఆయన కష్ట సమయాల్లో వారిని ఎలా ఓదార్చాడో మనం నేర్చుకుంటాము. తాను ఎలాంటి దేవుడో ఆయన వారికి గుర్తుచేశాడు. అది ఆయన వాగ్దానాల్లో వారి విశ్వాసాన్ని బలపరచింది. యెహోవా సజీవుడైన సత్యదేవుడిగా తనకు, తమను తాము గానీ తమ ఆరాధకులను గానీ రక్షించుకోలేని విగ్రహాలకు మధ్యవున్న విశిష్టమైన తేడాలను తన ప్రవక్తలు ఉపయోగించేలా చేశాడు. (యెషయా 41:10; 46:1; యిర్మీయా 10:​2-15) “నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి” అని యెషయాకు చెబుతున్నప్పుడు యెహోవా ఏకైక సత్యదేవుడిగా తన గొప్పతనాన్ని ఉన్నతపరిచే తన సృష్టికార్యాల గురించి ఉపమానాలు, వర్ణనలు ఉపయోగించి చెప్పేలా తన ప్రవక్తను ప్రేరేపించాడు.​—⁠యెషయా 40:1-31.

6 కొన్నిసార్లు యెహోవా తన ప్రజలు రక్షించబడే నిర్దిష్టమైన సమయాన్ని​—⁠అది సమీప కాలంలోనైనా లేదా భవిష్యత్తులోనైనా కావచ్చు​—⁠తెలియజేయడం ద్వారా వారిని ఓదార్చాడు. ఐగుప్తు నుండి విడుదల సమీపిస్తుండగా, అణచివేయబడిన ఇశ్రాయేలీయులకు ఆయన ఇలా తెలియజేశాడు: “ఫరోమీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును.” (నిర్గమకాండము 11:⁠1) యెహోషాపాతు రాజు కాలంలో యూదా రాజ్యాన్ని మూడు దేశాలు కలిసి ముట్టడించినప్పుడు, “రేపు” మీ పక్షం వహిస్తానని యెహోవా వారికి చెప్పాడు. (2 దినవృత్తాంతములు 20:​1-4, 14-17) మరో వైపున బబులోను నుండి వారు పొందే విడుదలను యెషయా 200 సంవత్సరాల ముందే నమోదు చేశాడు, విడుదలకు దాదాపు వంద సంవత్సరాల ముందు యిర్మీయా దానికి సంబంధించిన అదనపు వివరాలను తెలియజేశాడు. విడుదల సమయం సమీపించినప్పుడు దేవుని సేవకులకు ఆ ప్రవచనాలు ఎంత ప్రోత్సాహకరంగా ఉండివుంటాయో కదా!​—⁠యెషయా 44:26-45:3; యిర్మీయా 25:11-14.

7 దేవుని ప్రజలకు ఓదార్పునిచ్చిన వాగ్దానాల్లో తరచూ మెస్సీయా గురించిన సమాచారం ఉండేదనే విషయం గమనార్హం. (యెషయా 53:​1-12) తరము తర్వాత తరము, నమ్మకమైన ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమాచారం వారికి నిరీక్షణను ఇచ్చాయి. లూకా 2:25లో మనం ఇలా చదువుతాము: “యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణకొరకు [లేదా ఓదార్పుకొరకు, నిజానికి మెస్సీయా రాకకొరకు] కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.” లేఖనాల్లో నమోదుచేయబడిన మెస్సీయా సంబంధిత నిరీక్షణ గురించి సుమెయోనుకు తెలుసు, అది తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకం ఆయన జీవితాన్ని మలచింది. అదంతా ఎలా నెరవేరుతుందో ఆయనకు అర్థం కాలేదు, ప్రవచించబడిన ఆ రక్షణ నెరవేర్పు చూసేంతవరకూ ఆయన జీవించలేదు, అయినప్పటికీ దేవుని “రక్షణ”గా ఉండే వ్యక్తిని తాను గుర్తుపట్టినప్పుడు ఆయన ఆనందించాడు.​—⁠లూకా 2:29-32.

యేసు ద్వారా ఇవ్వబడిన ఓదార్పు

8 యేసుక్రీస్తు భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రజలు తమకు అవసరమని తలంచిన సహాయాన్ని ఆయన ఎల్లప్పుడూ అందించలేదు. ద్వేషించబడే రోమా సామ్రాజ్యపు అధికారం నుండి తమను విడిపించే మెస్సీయా కోసం కొంతమంది ఆతురతతో ఎదురుచూశారు. కానీ యేసు తిరుగుబాటును సమర్థించలేదు; ‘కైసరువి కైసరుకు చెల్లించండి’ అని ఆయన వారికి చెప్పాడు. (మత్తయి 22:​21) ఒక రాజకీయ వ్యవస్థ ఆధీనం నుండి ప్రజలను విడుదల చేయాలన్నది మాత్రమే దేవుని సంకల్పం కాదు. ప్రజలు యేసును రాజుగా చేయాలనుకున్నారు కానీ ఆయన “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము” ఇస్తానని చెప్పాడు. (మత్తయి 20:28; యోహాను 6:​15) ఆయన రాజయ్యే సమయం అప్పటికింకా రాలేదు, అంతేకాక పరిపాలించే అధికారం ఆయనకు యెహోవా ఇస్తాడు కానీ అసంతృప్తితో ఉన్న ప్రజలు కాదు.

9 యేసు ఇచ్చిన ఓదార్పు “దేవుని రాజ్యసువార్త”లో ఒక భాగం. యేసు ఎక్కడికి వెళితే అక్కడ ఆయన ప్రకటించిన సందేశం అదే. (లూకా 4:​43) మెస్సీయా పరిపాలకుడిగా తాను మానవజాతి కోసం చేయబోయే పనులను చేసి చూపించడం ద్వారా ఆయన ప్రజల దైనందిన సమస్యలకు ఆ సందేశానికి సంబంధముందని నొక్కి చెప్పాడు. ఆయన గుడ్డివారిని మూగవారిని స్వస్థపరచడం ద్వారా (మత్తయి 12:22; మార్కు 10:51, 52), అశక్తమైన చేతులను బాగుచేయడం ద్వారా (మార్కు 2:3-12), తోటి ఇశ్రాయేలీయుల జుగుప్సాకరమైన వ్యాధులను నయం చేయడం ద్వారా (లూకా 5:12, 13), వారికున్న గంభీరమైన ఆరోగ్య సమస్యల నుండి వారికి ఉపశమనం కలుగజేయడం ద్వారా (మార్కు 5:​25-29) బాధలనుభవిస్తున్న మానవులకు జీవించడానికి కొత్త కారణాన్ని ఇచ్చాడు. బాధపడుతున్న ప్రజల పిల్లలను పునరుత్థానం చేయడం ద్వారా ఆయన వారి కుటుంబ సభ్యులకు గొప్ప ఊరట కలిగించాడు. (లూకా 7:11-15; 8:​49-56) ప్రమాదకరమైన తుఫానులను అదుపుచేయగల, ఎంతోమంది ప్రజల ఆహార అవసరాలను తీర్చగల తన సామర్థ్యాన్ని ఆయన ప్రదర్శించాడు. (మార్కు 4:37-41; 8:​2-9) అంతేకాక సమస్యలతో సమర్థవంతంగా వ్యవహరించేందుకు సహాయం చేయగల సూత్రాలను, మెస్సీయా నీతియుక్తమైన పరిపాలన గురించిన నిరీక్షణతో ప్రజల హృదయాలను నింపగల జీవిత సూత్రాలను యేసు వారికి బోధించాడు. అలా యేసు తన పరిచర్యను కొనసాగిస్తూ, విశ్వాసంతో వినేవారిని ఓదార్చడమే కాకుండా రాబోయే వేలాది సంవత్సరాల వరకూ ప్రజలను ప్రోత్సహించడానికి ఆధారాన్ని కూడా ఏర్పాటు చేశాడు.

10 యేసు తన ప్రాణాన్ని బలిగా అర్పించి పరలోక జీవితానికి పునరుత్థానమైన 60 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.” (1 యోహాను 2:​1, 2) యేసు పరిపూర్ణ మానవ బలి ప్రయోజనాలవల్ల మనం ఎంతో ఓదార్పు పొందాము. మన పాపాలు క్షమించబడతాయని, మనం నిర్మలమైన మనస్సాక్షి కలిగివుండవచ్చని, దేవునితో అంగీకారయోగ్యమైన సంబంధం కలిగివుండవచ్చని, నిత్యం జీవించే నిరీక్షణతో ఉండవచ్చని మనకు తెలుసు.​—⁠యోహాను 14:6; రోమీయులు 6:23; హెబ్రీయులు 9:24-28; 1 పేతురు 3:21.

ఓదార్పునిచ్చే పరిశుద్ధాత్మ

11 యేసు తాను బలిగా మరణించడానికి ముందు తన అపొస్తలులతో గడిపిన చివరి రాత్రి, తన పరలోక తండ్రి వారిని ఓదార్చడానికి చేసిన మరో ఏర్పాటు గురించి మాట్లాడాడు. యేసు ఇలా అన్నాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను [ఓదార్పునిచ్చేదానిని; గ్రీక్‌ పారాక్లిటోస్‌], అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.” “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” అని యేసు వారికి హామీ ఇచ్చాడు. (యోహాను 14:​16, 17, 26) అయితే పరిశుద్ధాత్మ వారిని ఎలా ఓదార్చింది?

12 యేసు తన అపొస్తలులకు ఎంతో శిక్షణనిచ్చాడు. వారు ఆ అనుభవాన్ని ఎన్నటికీ మరచిపోరు కానీ వారు ఆయన చెప్పిన విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోగలరా? అపరిపూర్ణమైన వారి జ్ఞాపకశక్తి వల్ల ప్రాముఖ్యమైన ఆ ఉపదేశాలను వారు మరచిపోతారా? పరిశుద్ధాత్మ ‘తాను వారికి చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకము చేస్తుంది’ అని యేసు వారికి హామీ ఇచ్చాడు. కాబట్టి యేసు చనిపోయి దాదాపు ఎనిమిది సంత్సరాలు గడిచిన తర్వాత మత్తయి మొదటి సువార్తను వ్రాయగలిగాడు, అందులో ఆయన యేసు కొండమీద ఇచ్చిన ఉల్లాసకరమైన ప్రసంగాన్ని, రాజ్యం గురించి చెప్పిన అనేక ఉపమానాలను, తన ప్రత్యక్షత గురించి ఇచ్చిన వివరాలను నమోదు చేశాడు. అపొస్తలుడైన యోహాను 50 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత, యేసు భూ జీవితంలోని ఆఖరి రోజుల గురించిన అనేక వివరాలతో కూడిన నమ్మదగిన నివేదికను వ్రాయగలిగాడు. మన కాలం వరకు కూడా ఈ ప్రేరేపిత నివేదికలు ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయో కదా!

13 పరిశుద్ధాత్మ, యేసు మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి శిష్యులకు సహాయం చేయడమే కాక వారికి బోధించి, దేవుని సంకల్పాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి వారికి మార్గనిర్దేశాన్నిచ్చింది. యేసు తన శిష్యులతో ఉన్నప్పుడు ఆయన చెప్పిన అనేక విషయాలను వారు అప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత యోహాను, పేతురు, యాకోబు, యూదా, పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని సంకల్పాల గురించి మరింత వివరంగా వ్రాశారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ ఒక బోధకుడిగా పనిచేయడం ద్వారా, తాము దేవుని ద్వారా నడిపించబడుతున్నామనే విలువైన హామీని శిష్యులకు ఇచ్చింది.

14 దేవుడు తన అనుగ్రహాన్ని భౌతిక ఇశ్రాయేలుపై నుండి క్రైస్తవ సంఘంపైకి మార్చాడని స్పష్టం చేయడానికి కూడా పరిశుద్ధాత్మ కృపావరములు సహాయం చేశాయి. (హెబ్రీయులు 2:⁠3) యేసు నిజమైన శిష్యులను గుర్తించడానికి ఆ వ్యక్తుల జీవితాల్లో పరిశుద్ధాత్మ ఫలం కూడా ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. (యోహాను 13:35; గలతీయులు 5:​22-24) ధైర్యంగా నిర్భయంగా సాక్ష్యమివ్వడానికి సంఘ సభ్యులను పరిశుద్ధాత్మ బలపరచింది.​—⁠అపొస్తలుల కార్యములు 4:31.

తీవ్రమైన ఒత్తిళ్ళను అనుభవిస్తున్నప్పుడు ఇవ్వబడే సహాయం

15 యెహోవా దేవునికి భక్తితో సేవ చేసేవారు, ఆయనకు విశ్వసనీయంగా ఉండేవారు అందరూ ఏదో ఒక విధమైన హింసను అనుభవిస్తారు. (2 తిమోతి 3:​12) అయితే చాలామంది క్రైస్తవులు ఎంతో తీవ్రమైన ఒత్తిడిని అనుభవించారు. ఆధునిక కాలాల్లో కొంతమంది అల్లరి మూకల ద్వారా హింసించబడ్డారు, నిర్బంధ శిబిరాల్లో, చెరసాలల్లో, లేబర్‌ క్యాంపుల్లో అమానుష పరిస్థితుల్లో ఉంచబడ్డారు. యెహోవా ప్రజలను ప్రభుత్వాలు హింసించాయి, అనైతిక వ్యక్తులు శిక్షించబడకుండా హింసాత్మకమైన క్రియలు చేయడానికి అవి అనుమతించాయి. అంతేకాక క్రైస్తవులు ఘోరమైన అనారోగ్య సమస్యలను, గంభీరమైన కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నారు. ఎంతోమంది తోటి విశ్వాసులకు కష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలియజేసే పరిణతి చెందిన క్రైస్తవులు కూడా ఒత్తిడికి గురికావచ్చు. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఇతరులను ప్రోత్సహించే వారికి కూడా ప్రోత్సాహం అవసరం కావచ్చు.

16 సౌలు రాజు దావీదును చంపడానికి వెంటాడుతున్నప్పుడు దావీదు సహాయం కోసం దేవుని వైపు చూశాడు: “దేవా, నా ప్రార్థన ఆలకింపుము” అని ఆయన వేడుకొన్నాడు. “నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను” అని ఆయన అన్నాడు. (కీర్తన 54:2, 4; 57:⁠1) దావీదుకు సహాయం లభించిందా? లభించింది. ఆ సమయంలో ప్రవక్తయైన గాదు, యాజకుడైన అబ్యాతారుల ద్వారా యెహోవా దావీదుకు మార్గనిర్దేశకాన్నిచ్చాడు, ఆయన సౌలు కుమారుడైన యోనాతాను ద్వారా దావీదును బలపరిచాడు. (1 సమూయేలు 22:1, 5; 23:​9-13, 16-18) ఆ అన్వేషణనుండి సౌలు అవధానాన్ని మళ్ళించడానికి యెహోవా ఆ దేశంపై ఫిలిష్తీయులు దాడి చేయడానికి కూడా అనుమతించాడు.​—⁠1 సమూయేలు 23:27, 28.

17 తన భూ జీవితపు ముగింపులో యేసుక్రీస్తు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. తన ప్రవర్తన తన పరలోక తండ్రి నామంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, మొత్తం మానవజాతి భవిష్యత్తును అది ఎలా ప్రభావితం చేస్తుందో ఆయనకు పూర్తిగా తెలుసు. ఆయన “వేదనపడి” ఎంతో ఆతురతతో ప్రార్థించాడు. ఆ కష్ట సమయంలో యేసుకు అవసరమైన మద్దతు లభించేలా దేవుడు నిశ్చయపరచుకున్నాడు.​—⁠లూకా 22:​41-44.

18 తొలి శతాబ్దంలో సంఘం స్థాపించబడిన తర్వాత క్రైస్తవులు ఎంత క్రూరంగా హింసించబడ్డారంటే అపొస్తలులు తప్ప మిగతా వారందరూ యెరూషలేము విడిచి వెళ్ళిపోయారు. స్త్రీ పురుషులు వారి ఇళ్ళనుండి బయటకు ఈడ్చబడేవారు. అప్పుడు దేవుడు వారికి ఎలాంటి ఓదార్పునిచ్చాడు? వారికి “మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని” అంటే క్రీస్తుతోపాటు ఖచ్చితంగా పరలోకంలో ఉండే స్వాస్థ్యముందని తన వాక్యం ద్వారా హామీ ఇచ్చాడు. (హెబ్రీయులు 10:34; ఎఫెసీయులు 1:​18-20) వారు ప్రకటిస్తుండగా దేవుని ఆత్మ తమతో ఉందనడానికి రుజువులను చూశారు, వారి అనుభవాలు కూడా వారు సంతోషించడానికి అదనపు కారణాన్ని ఇచ్చాయి.​—⁠మత్తయి 5:11, 12; అపొస్తలుల కార్యములు 8:1-40.

19 చివరికి, ఒకప్పుడు క్రైస్తవులను తీవ్రంగా హింసించే వ్యక్తిగా ఉన్న సౌలు (పౌలు) కూడా క్రైస్తవుడిగా మారినందుకు హింసించబడ్డాడు. కుప్ర ద్వీపంలోని ఒక గారడివాడు మోసం చేయడం ద్వారా, వాస్తవాలను వక్రీకరించి చెప్పడం ద్వారా పౌలు పరిచర్యను ఆటంకపరచడానికి ప్రయత్నించాడు. గలతీయలోని ప్రజలు పౌలుపై రాళ్ళు రువ్వి, ఆయన చనిపోయాడనుకొని వదిలేశారు. (అపొస్తలుల కార్యములు 13:8-10; 14:​19) మాసిదోనియలో ఆయనను బెత్తములతో కొట్టారు. (అపొస్తలుల కార్యములు 16:​22, 23) ఎఫెసులో అల్లరి మూకలు దౌర్జన్యం చేసిన తర్వాత ఆయన ఇలా వ్రాశాడు: “మేము బ్రదుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి. . . . మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.” (2 కొరింథీయులు 1:​8, 9) కానీ అదే ఉత్తరంలో పౌలు ఈ ఆర్టికల్‌లోని 2వ పేరాలో ప్రస్తావించబడిన ఓదార్పుకరమైన మాటలను వ్రాశాడు.​—⁠2 కొరింథీయులు 1:3, 4.

20 మీరు ఇలాంటి ఓదార్పునివ్వడంలో ఎలా భాగం వహించవచ్చు? వేలాదిమందిపై ఆకస్మికంగా ప్రభావం చూపే విపత్తు కారణంగా లేదా కేవలం తమను మాత్రమే బాధిస్తున్న కష్టాల కారణంగా బాధపడుతూ నేడు ఓదార్పు కావలసినవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి ఎలా ఓదార్పునివ్వవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

మీకు జ్ఞాపకమున్నాయా?

• దేవుడిచ్చే ఓదార్పు ఎందుకు అత్యంత విలువైనది?

• క్రీస్తు ద్వారా ఎలాంటి ఓదార్పు ఇవ్వబడింది?

• పరిశుద్ధాత్మ ఎలా ఓదార్పునిచ్చింది?

• దేవుని సేవకులు తీవ్రమైన ఒత్తిళ్ళను అనుభవిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఓదార్పుకు సంబంధించిన ఉదాహరణలను తెలియజేయండి.

[అధ్యయన ప్రశ్నలు]

1. ఎలాంటి పరిస్థితుల వల్ల ప్రజలు తమకు ఓదార్పు ఎంతో అవసరమని భావించవచ్చు?

2. యెహోవా ఇచ్చే ఓదార్పు ఎందుకు సాటిలేనిది?

3. దేవుడిచ్చే ఓదార్పు, మానవజాతి సమస్యలకు మూలకారణంతో ఎలా వ్యవహరిస్తుంది?

4. (ఎ) యెహోవా ఉపశమనం కలుగజేస్తానని తాను చేసిన వాగ్దానాల్లో మన విశ్వాసాన్ని బలపరచడానికి ఏమి చేశాడు? (బి) విడుదల ఎప్పుడు లభిస్తుందో మనం గ్రహించడానికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడు?

5. ప్రాచీన ఇశ్రాయేలుకు ఓదార్పునిస్తున్నప్పుడు యెహోవా వారి అవధానాన్ని దేనివైపుకు మళ్ళించాడు?

6. తన ప్రజలు ఎప్పుడు రక్షించబడతారో తెలియజేయడానికి కొన్నిసార్లు యెహోవా ఎలాంటి సూచనలు ఇచ్చాడు?

7. రక్షణ వాగ్దానాల్లో తరచూ ఎవరి గురించిన వివరాలు ఉండేవి, ఇశ్రాయేలులోని నమ్మకమైన ప్రజలను అవి ఎలా ప్రభావితం చేశాయి?

8. చాలామంది ప్రజలు తమకు అవసరమని తలంచిన సహాయానికి, యేసు అందించిన సహాయానికి తేడా ఏమిటి?

9. (ఎ) యేసు ప్రకటించిన ఓదార్పుకరమైన సందేశం ఏమిటి? (బి) ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఆ సందేశానికి సంబంధముందని యేసు ఎలా చూపించాడు? (సి) యేసు పరిచర్య దేనికి ఆధారాన్ని ఏర్పాటు చేసింది?

10 యేసు బలి మూలంగా ఏది సాధ్యం చేయబడింది?

11. యేసు తాను మరణించడానికి ముందు ఓదార్పు కోసం వాగ్దానం చేసిన మరో ఏర్పాటు ఏమిటి?

12. యేసు శిష్యులకు జ్ఞాపక సాధనంగా పరిశుద్ధాత్మ వహించిన పాత్ర అనేకులకు ఎలా ఓదార్పునిస్తుంది?

13. పరిశుద్ధాత్మ తొలి క్రైస్తవులకు ఒక బోధకుడిగా ఎలా పనిచేసింది?

14. పరిశుద్ధాత్మ యెహోవా ప్రజలకు ఏయే విధాల్లో సహాయం చేసింది?

15. (ఎ) క్రైస్తవులు గతంలో ఎలాంటి ఒత్తిళ్ళను ఎదుర్కొన్నారు, ప్రస్తుతం ఎలాంటి ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నారు? (బి) ఇతరులను ప్రోత్సహించేవారికి కూడా కొన్నిసార్లు ప్రోత్సాహం ఎందుకు అవసరం కావచ్చు?

16. దావీదు తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఆయనకు సహాయం ఎలా లభించింది?

17. తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు యేసు సహాయం కోసం ఎవరి వైపు చూశాడు?

18. ఘోరంగా హింసించబడిన తొలి క్రైస్తవులకు దేవుడు ఎలాంటి ఓదార్పునిచ్చాడు?

19. పౌలు తీవ్రమైన హింసను అనుభవించినప్పటికీ దేవుడిచ్చే ఓదార్పు గురించి ఆయన ఎలా భావించాడు?

20. తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలించబోతున్నాము?

[15వ పేజీలోని చిత్రాలు]

 యిహోవా తన ప్రజలను విడిపించడం ద్వారా వారికి ఓదార్పునిచ్చాడని బైబిలు మనకు చూపిస్తోంది

[16వ పేజీలోని చిత్రాలు]

యేసు బోధించడం ద్వారా, స్వస్థపరచడం ద్వారా, మరణించినవారిని పునరుత్థానం చేయడం ద్వారా ఓదార్పునిచ్చాడు

[18వ పేజీలోని చిత్రం]

యేసు పరలోకము నుండి సహాయాన్ని పొందాడు