మీరు దేవుణ్ణి ఏమి అడగాలనుకుంటారు?
మీరు దేవుణ్ణి ఏమి అడగాలనుకుంటారు?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు జీవితం గురించి గంభీరమైన సందేహాలున్నాయి. మీకూ ఉన్నాయా? చాలామంది తమ సందేహాలను మత బోధకుల ఎదుటపెట్టారు, కానీ సంతృప్తికరమైన సమాధానాలను పొందలేకపోయారు. కొందరు ఈ సందేహాల గురించి స్వయంగా ఆలోచించారు. మరికొందరు మార్గనిర్దేశం కోసం ప్రార్థించారు. మిమ్మల్ని ఎంతగానో కలతపెడుతున్న విషయాల గురించి దేవుని నుండి సమాధానాలు పొందడం నిజంగా సాధ్యమేనా? చాలామంది దేవుణ్ణి ఈ ప్రశ్నలు అడగాలనుకుంటున్నామని చెప్పారు.
దేవా, నిజానికి నీవెవరు?
ప్రజలు దేవుణ్ణి ఎలా దృష్టిస్తారన్నది వారి సంస్కృతిపై, వారి తల్లిదండ్రుల మతంపై ఆధారపడివుండడమే కాక, వారు స్వయంగా ఎంపిక చేసుకొనేదానిపై కూడా ఆధారపడివుండవచ్చు. కొందరు దేవుణ్ణి పేరుపెట్టి పిలుస్తారు; మరికొందరు దేవా అని మాత్రమే పిలుస్తారు. ఆయనను ఎలా పిలవాలన్న విషయం అంత ప్రాముఖ్యమైనదా? తన గురించి తన పేరు గురించి తెలియజేసే సత్య దేవుడు ఒక్కడే ఉన్నాడా?
ఇన్ని బాధలు ఎందుకున్నాయి?
ఒక వ్యక్తి విచ్చలవిడిగా లేక అనైతికంగా జీవించడం వల్ల అతని ఆరోగ్యం పాడైనా లేక అతను పేదరికం పాలైనా తన పరిస్థితి బాగులేదని అతను అనవచ్చు. అయితే అతనెందుకు ఆ బాధలు అనుభవిస్తున్నాడో అతనికి బాగా తెలుసు.
కానీ ఇతరులనేకులు తాము ఏ తప్పూ చేయకుండానే తీవ్రమైన బాధలు అనుభవిస్తున్నారు. కొందరికి దీర్ఘకాలిక జబ్బులున్నాయి. మరికొందరు తమ కుటుంబాలకు తలదాచుకోవడానికి నీడ, తినడానికి సరిపడేంత తిండి సంపాదించడం దుర్గమమనిపించే వైరుధ్యాలతో తంటాలుపడుతున్నారు. కోట్లమంది నేరాలకు, యుద్ధాలకు, విచక్షణలేని హింసలకు, ప్రకృతి వైపరీత్యాలకు, అధికారులు చేసే అన్యాయాలకు బలవుతున్నారు.
అనేకమంది ఇలా అడగడం అర్థంచేసుకోదగినదే: ‘ఇలాంటి పరిస్థితులు ప్రబలంగా ఎందుకు ఉన్నాయి? ఈ బాధలన్నింటినీ దేవుడెందుకు అనుమతిస్తున్నాడు?’
నేనిక్కడ ఎందుకున్నాను? జీవిత సంకల్పమేమిటి?
ఒక వ్యక్తి తన దైనందిన కార్యకలాపాల్లో నిజమైన సంతృప్తి పొందలేనప్పుడు కలిగే నిరాశా నిస్పృహల నుండి తరచూ ఈ ప్రశ్నలు తలెత్తుతాయి, ఇలా చాలామందికి జరుగుతుంది. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒక్కో విధంగా ముందుగానే నిర్ణయించాడని లక్షలాదిమంది విశ్వసిస్తారు. అది నిజమేనా? దేవుడు నిజంగానే మీ కోసం ఓ ప్రత్యేక సంకల్పాన్ని కలిగి ఉన్నట్లయితే, అదేమిటో తెలుసుకోవాలని మీరు తప్పకుండా కోరుకుంటారు.
ప్రపంచంలో ఉన్న పుస్తకాల్లో దేవుని చేత ప్రేరేపించబడిందని స్పష్టంగా తెలియజేసే ఒక పుస్తకం ఉంది. మానవాళి కోసం నిజంగా దేవుడి నుండి వచ్చిన సందేశం ఎలా ఉండాలని మీరు ఆశిస్తారో సరిగ్గా అలాగే ఉండే ఈ పుస్తకం, ఇప్పటి వరకు వ్రాయబడిన పుస్తకాలన్నింటి కన్నా అత్యధిక భాషల్లో లభ్యమవుతోంది. ఆ పుస్తకమే పరిశుద్ధ బైబిలు. దానిలో పరలోకమును, భూమిని సృష్టించిన దేవుడు తానెవరో తన పేరేమిటో స్వయంగా తెలియజేస్తున్నాడు. మీకు ఆయన పేరు తెలుసా? దేవుడు ఎలాంటి వ్యక్తని బైబిలు చెబుతోందో మీకు తెలుసా? దేవుడు మీ నుండి ఏమి కోరుతున్నాడనే విషయంలో అదేమి చెబుతోందో మీకు తెలుసా?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
ముఖచిత్రం: Chad Ehlers/Index Stock Photography
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
కొండ: Chad Ehlers/Index Stock Photography