కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అలెగ్జాండర్‌ VI రోమ్‌ మర్చిపోని పోప్‌

అలెగ్జాండర్‌ VI రోమ్‌ మర్చిపోని పోప్‌

అలెగ్జాండర్‌ VI రోమ్‌ మర్చిపోని పోప్‌

“క్యాథలిక్కుల దృష్టిలో అలెగ్జాండర్‌ VIను తగిన మాటలతో పూర్తిగా ఖండించడం సాధ్యంకాదు.” (గెష్చ్‌టి డిర్‌ పాప్‌స్టెసీట్‌ డెమ్‌ ఆస్‌గాంగ్‌ డెస్‌ మిట్టెలాల్‌టర్స్‌ [మధ్యయుగ చివరికాలంనుండి పోప్‌ల చరిత్ర]) “అతని వ్యక్తిగత జీవితం ఎంత మాత్రం క్షమార్హం కాదు. . . . ఈ పోప్‌కు చర్చి అంటే గౌరవమే లేదని మనమంగీకరించాలి. బోర్జియా కుటుంబ సమకాలీనులు అట్టి నీచకార్యాలు జరగడం చూసినా వారి నేరాల్ని తీవ్ర భయంతో చూస్తుండిపోయారు. వారి దుశ్చర్యల పర్యవసానాలు నాలుగుకంటే ఎక్కువ శతాబ్దాల తర్వాత కూడా సమసిపోలేదు.”​—⁠లిగ్లీస్‌ ఎట్‌ లా రెనెయ్‌సెన్స్‌ (1449-1517) (చర్చి, పునరుజ్జీవనం).

రోమన్‌ క్యాథలిక్‌ చర్చికి సంబంధించిన గౌరవనీయమైన చరిత్ర గ్రంథాలే ఒక పోప్‌ గురించి, అతని కుటుంబం గురించి అంత తీవ్రంగా ఎందుకు వ్యాఖ్యానించాయి? అలాంటి విమర్శ వారికెందుకు తగినది? పోప్‌లకుండే తిరుగులేని అధికారాన్ని, ప్రత్యేకించి రోడ్రిగో బోర్జియా లేదా అలెగ్జాండర్‌ VI (పోప్‌ 1492-1503) ఆ అధికారాన్ని ఉపయోగించుకున్న విధానాన్ని వెనక్కి తిరిగిచూసే అవకాశాన్నిస్తూ ఈ బోర్జా లార్టె డెల్‌ పొటేరె (బోర్జియా కుటుంబం​—⁠వారి అధికార తంత్రం) అనే పేరుతో రోమ్‌లో (అక్టోబరు 2002-ఫిబ్రవరి 2003) ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

అధికారానికి రావడం

రోడ్రిగో బోర్జియా 1431లో ఆరగాన్‌ రాజ్యంలోని హాటీవాలో ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించాడు, ఇప్పుడా ప్రాంతం స్పెయిన్‌లోవుంది. వెలన్సియా బిషప్పుగావున్న అతని మామ అల్ఫాన్సో డి బోర్జియా అల్లుడ్ని చదివించి, రోడ్రిగో ఇంకా కుర్రవాడిగా ఉండగానే అతనికి ఆలయ పదవి (రాబడివున్న మతసంబంధ పదవి) వచ్చేలా చేశాడు. అప్పటికి కార్డినల్‌గా మారిన అల్ఫాన్సో సంరక్షణలో 18 ఏండ్ల రోడ్రిగో ఇటలీవెళ్లి న్యాయశాస్త్రం చదివాడు. అల్ఫాన్సో పోప్‌ కాలిక్స్‌టస్‌ III అవగానే రోడ్రిగోను, ఇంకో అల్లుడ్ని కార్డినల్స్‌ను చేశాడు. పారా లూయిస్‌ బోర్జియాను అనేక నగరాలమీద గవర్నరుగా నియమించాడు. త్వరలోనే రోడ్రిగోను చర్చి వైస్‌ ఛాన్స్‌లర్‌గా నియమించాడు. వేర్వేరు పోపుల క్రింద ఆయన ఈ స్థానంలో పనిచేశాడు. ఈ పదవులు తెచ్చిన విస్తారమైన ఆదాయంతో, అంతులేని సంపద కూడగట్టుకుని, విస్తృతమైన అధికారాన్ని చెలాయించి, విలాసవంతమైన రాజభోగం అనుభవించాడు.

రోడ్రిగో చాలా తెలివైనవాడు, మంచివక్త, కళాపోషకుడు, ఎలాగైనా తనమాట నెగ్గించుకోగల దిట్ట. అయితే అతనికి అనేక అక్రమ సంబంధాలుండేవి. జీవితాంతం ఉంచుకున్న స్త్రీకి కలిగిన నలుగురు పిల్లలతోసహా అతనికి ఇతర స్త్రీలతోవున్న అక్రమసంబంధంగా చాలామంది పిల్లలున్నారు. “విపరీత లైంగిక దుశ్చర్యల” విలాసం, “హద్దులేని సుఖభోగాల” విషయంలో పోప్‌ పయస్‌ II రోడ్రిగోను గద్దించినా అతడు తన పద్ధతి మార్చుకోలేదు.

పోప్‌ ఇన్నోసెంట్‌ VIII 1492లో మరణించడంతో, అతని వారసుణ్ణి ఎన్నుకోవడానికి చర్చి కార్డినల్స్‌ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో తోటి కార్డినల్స్‌ తననే పోప్‌ అలెగ్జాండర్‌ VIగా ఎన్నుకొనేలా రోడ్రిగో బోర్జియా విస్తారంగా డబ్బు, ఇతర లాభాల్ని బాహాటంగా వారికి ఎరగా వేశాడు. వారలా తనకే ఓట్లు వేసినందుకు అతను కార్డినల్స్‌కు ఏమేమిచ్చాడు? డబ్బు బాగావచ్చే ఆలయ పదవుల్ని, రాజగృహాల్ని, భవంతుల్ని, నగరాల్ని, మఠాల్ని, బిషప్‌ పాలిత ప్రాంతాల్ని ఇచ్చాడు. చర్చి చరిత్రకారుడొకరు అలెగ్జాండర్‌ VI పాలనను “రోమన్‌ చర్చి చరిత్రలో ఘోరాతిఘోరమైన కుంభకోణాల కాలమని” ఎందుకు పిలిచాడో మీరు అర్థంచేసుకోవచ్చు.

లౌకిక రాజులకంటే హీనం

చర్చి అధిపతిగా తన ఆధ్యాత్మిక అధికారాన్నిబట్టి అలెగ్జాండర్‌ VI అమెరికా ఖండాల్లో కొత్తగా కనుగొన్న ప్రాంతాలకు సంబంధించి స్పెయిన్‌ పోర్చుగల్‌ మధ్యగల విభజన వివాద పరిష్కారానికి సహాయం చేశాడు. అతని లౌకిక అధికారం, మధ్య ఇటలీలోని పోప్‌ పాలిత రాష్ట్రాల ఆయాప్రాంతాలకు అతన్ని అధిపతిని చేసింది. దాంతో పునర్జాగారణోద్యమ కాలపు ఇతర సార్వభౌమాధిపతుల మాదిరిగానే అతను తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ విధంగా అలెగ్జాండర్‌ VI పరిపాలన ఆయనకుముందూ, ఆ తర్వాత వచ్చిన పోప్‌ల మాదిరిగానే లంచగొండితనం, ఆశ్రితజన పక్షపాతం, హత్యలు చేశాడన్న అనుమానాలతో నిండిపోయింది.

ఈ సంక్షుభిత కాలంలో ఇటలీ అధీన ప్రాంతాల కోసం ప్రత్యర్థుల పోరాటాలప్పుడు పోప్‌ ఊరకే కూర్చోలేదు. తన అధికారం పెంచుకోవడానికి, కుమారుల జీవనరీతిని వృద్ధిచేయడానికి, బోర్జియా కుటుంబాన్ని అందరికంటే ఉన్నత స్థానానికి తీసుకురావడానికి అతడు రూపించిన రాజకీయ ఎత్తులు పొత్తులు, కుదిరాయి విరిగాయి. కాస్టెల్‌ రాజు చెల్లెల్ని పెండ్లి చేసుకున్న అతని కుమారుడు హాన్‌ను స్పెయిన్‌లోవున్న గాండియాకు సైన్యాధికారిగా నియమించాడు. అతని మరో కుమారుడు జోఫ్రా, నేపెల్స్‌ రాజు మనుమరాలిని పెండ్లి చేసుకున్నాడు.

ఫ్రాన్స్‌తో సంబంధాలు బలపర్చుకోవడానికి పోప్‌కు వివాహబంధుత్వం అవసరమయ్యేసరికి, ముందుగా ఆరగాన్‌దేశ ఉన్నతవర్గ ప్రముఖునికి తన 13 ఏండ్ల కుమార్తె లూక్రేసియాను ఇస్తానని చేసిన వివాహప్రధానం రద్దుచేసి ఆమెను మిలన్‌ సైన్యాధికారి బంధువుకిచ్చి పెండ్లిచేశాడు. తీరా ఆ వివాహం ఆశించిన రాజకీయ లబ్ది తీసుకురాకపోయేసరికి ఏదోవంకపెట్టి దాన్ని కూడా చెడగొట్టి లూక్రేసియాను ప్రత్యర్ధ రాజవంశస్థుడైన ఆరగాన్‌దేశ ఆలాఫాన్సోకిచ్చి పెండ్లిచేశాడు. ఈ లోగా ఆశబోతూ, క్రూరుడూ అయిన లూక్రేసియా సోదరుడు కేజారే బోర్జియా ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్‌ XIIతో వివాహబంధుత్వానికి సిద్ధపడడంతో, ఆరగాన్‌దేశస్థుడితో ఈమధ్యే జరిగిన తన సోదరిపెళ్ళి అవమానంతెచ్చింది. పరిష్కారమేమిటి? విచారకరంగా ఆమె భర్త ఆలాఫాన్సోపై “సెయింట్‌ పీటర్స్‌ బెసిలికా మెట్లమీద నలుగురు దుండగులు కత్తులతో దాడిచేసి గాయపర్చారని, ఆ తర్వాత కోలుకుంటుండగా కేజారే సేవకుడొకరు ఆయనను గొంతుపిసికి చంపేశాడని” ఒక గ్రంథం చెబుతోంది. కొత్త పన్నాగంతో వివాహబంధుత్వంకోరిన పోప్‌ మూడవసారి ఇప్పుడు 21 సంవత్సరాల లూక్రేసియాను గొప్ప అధికారంగల ఫెరారే సైన్యాధికారి కొడుకుకిచ్చి పెళ్ళిచేసే ఏర్పాటుచేశాడు.

కేజారే జీవితం “జుగుప్సాకరమైన రక్తపిపాస దుశ్చర్యలతో ఎర్రబారిన గాథ” అని వర్ణించబడింది. 17 సంవత్సరాల వయస్సప్పుడే కేజారేను అతని తండ్రి కార్డినల్‌గా నియమించినా, అతడు కుతంత్రుడు, ఆశబోతు, కొంతమంది ఇతరుల్లా అవినీతిపరుడైనందున చర్చికంటే, తగవులు పెట్టుకోవడానికే తగ్గట్టు ఉండేవాడు. మతాధికార పదవికి రాజీనామా ఇచ్చిన తర్వాత, అతడు ఫ్రెంచ్‌ రాజకుమారిని పెండ్లిచేసుకుని, వాలెంటినాయిస్‌ సైన్యాధికారం సంపాదించాడు. ఆ తర్వాత, ఫ్రెంచ్‌ సైన్యాల మద్దతుతో దాడులు, దారుణ మారణకాండలతో ఉత్తర ఇటలీని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దండయాత్ర ప్రారంభించాడు.

కేజారే లక్ష్యసాధనకు అవసరమైన ఫ్రెంచ్‌ సైన్యాల మద్దతు కూడగట్టే ఉద్దేశంతో, ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్‌ XII బ్రిటానీ రాణి ఆనీని పెండ్లిచేసుకోవడానికి వీలుగా అతని మోసపూరిత ఆలోచనమేరకు పోప్‌ అతనికి అనువుగా విడాకులిప్పించి, ఆ బ్రిటన్‌ రాణి పాలిత ప్రాంతంకూడా అతని రాజ్యంలో విలీనంచేసే వెసులుబాటు కల్పించాడు. నిజానికి, పోప్‌ “తన కుటుంబ సభ్యుల లౌకిక ప్రయోజనాల కోసం చర్చి ప్రతిష్ఠను, నియమనిష్ఠల్ని బలిచేశాడని” ఒక గ్రంథం చెబుతోంది.

పోప్‌ విపరీత ప్రవర్తన విమర్శలపాలయ్యింది

బోర్జియాల విపరీత ధోరణి శత్రువులను పెంచి విమర్శలపాలయ్యింది. అలాంటి విమర్శల్ని పోపు పెడచెవినబెట్టాడు, కానీ గిరొలామో సెవొనారోలాని అలక్ష్యం చేయడానికి వీలుకాలేదు. అతను డొమనిక్‌ సంప్రదాయ సన్యాసి, ప్రచండ మతప్రచారకుడు, ఫ్లోరోన్స్‌ రాజకీయ నాయకుడు. అతను పోపుసంబంధ న్యాయసభ దుర్మార్గాల్ని, పోప్‌ను అతని రాజకీయాల్ని ఖండించి అతని తొలగింపుకు, మతసంబంధ సంస్కరణలకు పిలుపిచ్చాడు. “చర్చి నాయకులారా, . . . మీరు రాత్రిపూట ఉంపుడుకత్తెల దగ్గరకెళ్తారు ఉదయం మాత్రం ధర్మాచరణ చేస్తారు” అని సెవొనారోలా అభిశంసించాడు. ఆ తర్వాత అతనిలా అన్నాడు: “[ఆ నాయకుల] ముఖం వేశ్యా ముఖం, వారి ప్రఖ్యాతి చర్చికి హానికరం. వీరికి క్రైస్తవ విశ్వాసమందు నమ్మకమే లేదని నేను మీకు చెబుతున్నాను.”

సెవొనారోలాను డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తూ పోప్‌ అతనికి కార్డినల్‌ పదవి ఆశచూపాడు కాని అతను దాన్ని తిరస్కరించాడు. అతని నాశనానికి కారణమైనది అతని పోప్‌వ్యతిరేక రాజకీయాలో లేక అతని మతప్రచారమోగాని, చివరకు అతన్ని వెలివేసి, జైల్లోవేసి, ఒప్పుకునేలా హింసించి, ఆ తర్వాత ఉరితీసి కాల్చివేశారు.

గంభీరమైన ప్రశ్నలు

ఈ చారిత్రక సంఘటనలు ప్రాముఖ్యమైన ప్రశ్నలను లేవదీస్తాయి. ఒక పోప్‌ యొక్క అలాంటి కుతంత్ర వ్యభిచార ప్రవర్తనెలా వివరింపబడగలదు? చరిత్రకారులు వాటినెలా వివరిస్తారు? వివిధ తర్కాలు ఉపయోగింపబడ్డాయి.

అలెగ్జాండర్‌ VIను అతని కాలంనాటి చారిత్రక సందర్భాన్నిబట్టి అర్థంచేసుకోవాలని అనేకమంది నమ్ముతారు. శాంతిని పరిరక్షించాలనే అభిలాష, ప్రత్యర్థ రాష్ట్రాలమధ్య సరితూకం కాపాడటం, పోప్‌ల అధికార వ్యవస్థకు ఊతమిచ్చే వివాహబంధువుల స్నేహన్ని బలోపేతం చేయడం, తుర్కీయుల బెదిరింపుకు వ్యతిరేకంగా క్రైస్తవ మతసామ్రాజ్య చక్రవర్తులను ఐక్యంగా ఉంచడంవంటివి అతని రాజకీయ, మతసంబంధ కార్యకలాపాల్ని ప్రభావితం చేశాయంటారు.

మరతని ప్రవర్తన? “చర్చి చరిత్రలోని ప్రతీ శకం చెడు క్రైస్తవుల్ని పరువుతక్కువ మతాచార్యులను చూసింది. దీన్నిబట్టి ఎవరూ దిగ్భ్రాంతి చెందకూడదని క్రీస్తే దీనిని ముందుగా చెప్పాడు; తన చర్చిని ఆయన గోధుమలు, గురుగులు కలిసి పెరిగే పొలంతో, లేదా మంచి చేపలు చెడ్డ చేపలు ఉన్న వలతో పోల్చాడు. ఆయన కూడా తన అపొస్తలుల మధ్య యూదాను సహించాడు” అని ఒక విద్వాంసుడంటున్నాడు. *

ఆ విద్వాంసుడే ఇంకా ఇలా అంటున్నాడు: “ఒక రత్నాన్ని సరిగా పొదగకపోయినా అదెలా దాని విలువ కోల్పోదో, అదే విధంగా ఒక మతాచార్యుడు చేసినపాపం . . . అవశ్యంగా అతడు బోధించే సిద్ధాంతాన్ని . . . చెడుగామార్చదు. . . . బంగారం అమ్మే చెయ్యి శుద్ధమైనా అశుద్ధమైనా బంగారం బంగారంగానే ఉంటుంది.” అలెగ్జాండర్‌ VI విషయంలో యథార్థ క్యాథలిక్కులు, ‘వారు చెప్పువాటిని గైకొనుడి, అయినా వారి క్రియలచొప్పున చేయకుడని’ శాస్త్రుల, పరిసయ్యుల విషయమై యేసు తన శిష్యులకిచ్చిన సలహాను పాటించివుండాల్సిందని ఒక క్యాథలిక్‌ చరిత్రకారుడు వాదిస్తున్నాడు. (మత్తయి 23:​2, 3) అయితే అలాంటి తర్కం మిమ్మల్ని నిజంగా ఒప్పిస్తుందా?

ఇది నిజమైన క్రైస్తవత్వమేనా?

క్రైస్తవులమని చెప్పుకొనేవారి నాణ్యతను పరీక్షించేందుకు యేసు ఒక తేలికపాటి నిర్దేశమిచ్చాడు: “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.”​—⁠మత్తయి 7:16-18, 20.

యేసు స్థాపించిన, ఆయన నిజ అనుచరులు మాదిరియుంచిన నిజ క్రైస్తవ ఆదర్శనియమాలకు గడచిన శతాబ్దాల కాలంలో మతనాయకులు ఎలా సరితూగారు, ఇప్పుడెలా సరితూగుతున్నారు? మనం కేవలం రెండు రంగాలను అంటే రాజకీయ ప్రమేయాన్ని, జీవనశైలిని పరిశీలిద్దాం.

యేసు ఇహలోక రాజుకాదు. ఆయనెంత నిరాడంబరంగా జీవించాడంటే, తనకు “తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని” ఆయన అంగీకరించాడు. ఆయన రాజ్యం “ఈ లోక సంబంధమైనది కాదు,” ఆయన శిష్యులు “[ఆయన] లోకసంబంధి . . . కానట్టు వారును లోకసంబంధులు కారు.” ఆ విధంగా యేసు తన కాలంనాటి రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చడానికి నిరాకరించాడు.​—⁠మత్తయి 8:20; యోహాను 6:​15; 17:​16; 18:36.

అయితే, మత సంస్థల అధికార దాహం కారణంగా సామాన్య ప్రజలెన్ని బాధలకు గురైనా అవి శతాబ్దాలుగా అధికార ఐశ్వర్యాల ప్రాప్తికోసం అదేపనిగా రాజకీయ శక్తులతో చేతులు కలుపలేదా? మతనాయకులు పరిచర్య చేయవలసిన ఆ విస్తార ప్రజానీకం బీదరికంలో మగ్గుతుండగా, వారిలో అనేకమంది భోగవిలాసాలతో జీవించడం కూడా నిజంకాదా?

యేసు సోదరుడైన యాకోబు ఇలా చెప్పాడు: “వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:⁠4) ఎందుకు “దేవునికి శత్రు[వు]” అవుతాడు? మొదటి యోహాను 5:⁠19 ఇలా వ్యక్తంచేస్తోంది: “లోకమంతయు దుష్టుని యందున్న[ది].”

అలెగ్జాండర్‌ VI నైతిక విలువల్నిగూర్చి బోర్జియా కాలానికిచెందిన చరిత్రకారుడు ఒకాయన ఇలా వ్రాశాడు: “అతని జీవనశైలి విశృంఖలం. అతనికి సిగ్గు, చిత్తశుద్ధి లేవు, మతం, విశ్వాసం అసలే లేవు. అతడు అంతులేని పేరాశతో, మితిమీరిన వాంఛతో, అనాగరిక క్రూరత్వంతో, అతనికున్న చాలామంది పిల్లల బాగుకోసం వెర్రివాంఛతో నిండినవాడు.” మతాచార్యుల పరంపరలో అలా ప్రవర్తించింది ఒక్క బోర్జియా మాత్రమే కాదు.

అలాంటి ప్రవర్తనను గూర్చి లేఖనాలు ఏమిచెబుతున్నాయి? “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా?” అని ప్రశ్నించి అపొస్తలుడైన పౌలు ఇంకా ఇలా అన్నాడు: “మోసపోకుడి; జారులైనను . . . వ్యభిచారులైనను . . . లోభులైనను . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.”​—⁠1 కొరింథీయులు 6:​9, 10.

బోర్జియాలను గూర్చి రోమ్‌లో ఇటీవల నిర్వహించిన ప్రదర్శన వెల్లడిచేసిన ఉద్దేశాల్లో ఒకటి ఏమంటే, “ఈ ప్రముఖులు జీవించిన కాలపు దృక్కోణంనుండి . . . వారిని అర్థంచేసుకోవాలన్నదేగాని వారిని అపరాధ విముక్తుల్ని చేయడమో లేక ఖండించడమో కాదు.” వాస్తవానికి, సందర్శకులు ఎవరి నిర్ణయాలకు వారు వదిలివేయబడ్డారు. కాబట్టి మీరే నిర్ణయానికొచ్చారు?

[అధస్సూచి]

^ పేరా 20 ఈ ఉపమానాల ఖచ్ఛితమైన వివరణల కోసం, కావలికోట ఫిబ్రవరి 1, 1995 5-6 పేజీలు, సెప్టెంబరు 1, 1992 19-24 పేజీలు చూడండి.

[26వ పేజీలోని చిత్రం]

రోడ్రిగో బోర్జియా, పోప్‌ అలెగ్జాండర్‌ VI

[27వ పేజీలోని చిత్రం]

లూక్రేసియా బోర్జియా తండ్రి తన అధికారాన్ని విస్తృతం చేసుకోవడానికి ఆమెను ఉపయోగించుకున్నాడు

[28వ పేజీలోని చిత్రం]

కేజారే బోర్జియా ఆశబోతు, అవినీతిపరుడు

[29వ పేజీలోని చిత్రం]

గిరొలామో సెవొనారోలా నోరు మూయించలేక, అతణ్ణి ఉరితీసి, కాల్చేశారు