కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా దినం సమీపిస్తుండగా మనం ప్రజలను ఎలా దృష్టించాలి?

యెహోవా దినం సమీపిస్తుండగా మనం ప్రజలను ఎలా దృష్టించాలి?

యెహోవా దినం సమీపిస్తుండగా మనం ప్రజలను ఎలా దృష్టించాలి?

“ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”​—⁠2 పేతురు 3:⁠9.

యెహోవా సేవకులకు, “సమస్త జనులను శిష్యులనుగా చేయ[మని]” ఆజ్ఞాపించబడింది. (మత్తయి 28:​19) మనం ఈ నియామకాన్ని పూర్తి చేస్తూ “యెహోవా మహా దినము” కోసం ఎదురుచూస్తుండగా, ప్రజలను ఆయనెలా దృష్టిస్తాడో మనమూ అలాగే దృష్టించవలసిన అవసరం ఉంది. (జెఫన్యా 1:​14) యెహోవా ఎలా దృష్టిస్తాడు? అపొస్తలుడైన పేతురు ఇలా చెబుతున్నాడు: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2 పేతురు 3:⁠9) దేవుడు మానవులను పశ్చాత్తాపపడే సాధ్యతవున్న వ్యక్తులుగా దృష్టిస్తాడు. “ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమోతి 2:⁠4) “దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన” యెహోవా సంతోషిస్తాడు.​—⁠యెహెజ్కేలు 33:​11.

2 ప్రజల గురించి యెహోవాకున్న దృక్కోణమే వ్యక్తిగతంగా మనకూ ఉందా? ఆయన వలె మనం ప్రతి జాతికి, దేశానికి చెందినవారిని ‘ఆయన మేపు గొఱ్ఱెలు’ కాగల సాధ్యత ఉన్నట్లు పరిగణిస్తామా? (కీర్తన 100:3; అపొస్తలుల కార్యములు 10:​34, 35) దేవుని దృక్కోణాన్ని కలిగివుండడం యొక్క ప్రాముఖ్యతను చూపే రెండు ఉదాహరణలను మనం పరిశీలిద్దాము. రెండు సందర్భాల్లోనూ నాశనం రాబోతూవుంది, యెహోవా సేవకులకు ఈ వాస్తవం గురించి ముందుగా తెలియజేయబడింది. యెహోవా మహా దినం కోసం మనం ఎదురు చూస్తుండగా ఈ ఉదాహరణలు ప్రాముఖ్యంగా గమనార్హమైనవి.

అబ్రాహాముకు యెహోవా దృక్కోణం ఉంది

3 మొదటి ఉదాహరణ విశ్వాసియైన పితరుడగు ఆబ్రాహాముకు, సొదొమ గొమొఱ్ఱాలనే దుష్ట నగరాలకు సంబంధించినది. యెహోవా “సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర” విన్నప్పుడు ఆయన ఆ నగరాలను, వాటిలోని నివాసులను వెంటనే నాశనం చేయలేదు. మొదట ఆయన విచారణచేసి తెలుసుకున్నాడు. (ఆదికాండము 18:​20, 21) సొదొమకు ఇద్దరు దేవదూతలు పంపబడ్డారు, వాళ్ళు నీతిమంతుడైన లోతు ఇంట్లో బసచేశారు. దేవదూతలు వచ్చిన ఆ రాత్రి, ‘ఆ పట్టణస్థులు, బాలురును వృద్ధులును ప్రజలందరును’ దేవదూతలతో లైంగిక సంపర్కపు కోరికతో ‘నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసిరి.’ ఆ పట్టణస్థుల నీచస్థితి, అది నాశనం చేయబడడానికి తగినదని నిరూపించింది. అయినా ఆ దేవదూతలు లోతుతో ఇలా అన్నారు: “ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము.” ఆ నగర వాసులను కొంతమందిని కాపాడడానికి యెహోవా మార్గం తెరిచాడు, కానీ చివరకు లోతు ఆయన ఇద్దరు కుమార్తెలు మాత్రమే నాశనాన్ని తప్పించుకోగలిగారు.​—⁠ఆదికాండము 19:4, 5, 12, 16, 23-26.

4 ఇప్పుడు మనం, సొదొమ గొమొఱ్ఱా నగరాలను విచారణచేసి చూడాలన్న తన కోరికను యెహోవా వ్యక్తంచేసిన సమయానికి వెళదాం. అప్పుడే అబ్రాహాము ఇలా వేడుకున్నాడు: “ఆ పట్టణములో ఒక వేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?” అబ్రాహాము “దూరమవు గాక” అనే పదబంధాన్ని రెండుసార్లు ఉపయోగించాడు. యెహోవా దుష్టులతోపాటు నీతిమంతులను నాశనం చేయడని అబ్రాహాముకు తన అనుభవం ద్వారా తెలుసు. “ఆ పట్టణములో ఒక వేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల” తాను సొదొమను నాశనం చేయనని యెహోవా చెప్పినప్పుడు, అబ్రాహాము ఆ సంఖ్యను కేవలం పదిమందికి చేరే వరకు క్రమంగా తగ్గిస్తూ వచ్చాడు.​—⁠ఆదికాండము 18:​22-33.

5 అబ్రాహాము విజ్ఞప్తి తన దృక్కోణానికి అనుగుణంగా లేకపోతే యెహోవా దాన్ని వినివుండేవాడా? ఖచ్చితంగా వినడు. ‘దేవుని స్నేహితునిగా’ అబ్రాహాముకు ఆయన దృక్కోణం గురించి తెలుసు, అంతేగాక ఆయనకు కూడా అదే దృక్కోణం ఉంది. (యాకోబు 2:​23) యెహోవా సొదొమ గొమొఱ్ఱాలవైపు తన అవధానాన్ని త్రిప్పినప్పుడు ఆయన అబ్రాహాము విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? ఎందుకంటే మన పరలోక తండ్రి “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు[న్నాడు.]”

ప్రజల గురించి యోనా దృక్కోణం పూర్తి భిన్నంగా ఉంది

6 ఇప్పుడు రెండో ఉదాహరణను పరిశీలించండి, అది యోనా ఉదాహరణ. ఈసారి నాశనానికి నియమింపబడిన నగరం నీనెవె. ఆ పట్టణపు దోషము ‘యెహోవా దృష్టికి’ వచ్చిందని ప్రకటించమని యోనా ప్రవక్తకు చెప్పబడింది. (యోనా 1:⁠2) నీనెవె పరిసర ప్రాంతాలతో సహా అది “మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల” పెద్ద నగరం. చివరికి యోనా విధేయత చూపించి నీనెవెలోకి ప్రవేశించి “ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని” ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు “నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.” చివరికి నీనెవె రాజు సహితం పశ్చాత్తాపపడ్డాడు.​—⁠యోనా 3:​1-6.

7 సొదొమలో వచ్చిన ప్రతిస్పందనకు ఇదెంతో భిన్నం! పశ్చాత్తాపపడిన నీనెవె నివాసులను యెహోవా ఎలా దృష్టించాడు? యోనా 3:⁠10 ఇలా చెబుతోంది: దేవుడు “పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.” యెహోవా ఏ భావంలో ‘పశ్చాత్తప్తుడయ్యాడంటే’, నీనెవె నివాసులు తమ మార్గాలను మార్చుకున్నారు కాబట్టి ఆయన వారితో తన వ్యవహార విధానం మార్చుకున్నాడు. దైవిక ప్రమాణాలు మారలేదు గానీ నీనెవె నివాసులు పశ్చాత్తాపపడడం చూసి యెహోవా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.​—⁠మలాకీ 3:⁠6.

8 నీనెవె నాశనం చేయబడదని యోనా గ్రహించినప్పుడు, ఆయనా విషయాన్ని యెహోవా దృక్కోణం నుండి చూశాడా? లేదు, ఎందుకంటే “యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొ[న్నాడు]” అని మనకు చెప్పబడుతోంది. యోనా ఇంకా ఏమి చేశాడు? వృత్తాంతం ఇలా చెబుతోంది: “యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని . . . [అని] యెహోవాకు మనవి చేసెను.” (యోనా 4:​1-3) యోనాకు యెహోవా లక్షణాల గురించి తెలుసు. అయితే ఆ సమయంలో ప్రవక్త కోపం తెచ్చుకుని, పశ్చాత్తాపపడిన నీనెవె నివాసుల గురించి దేవునికున్న దృక్కోణాన్ని కలిగివుండలేదు.

9 యోనా నీనెవె నుండి బయటికి వెళ్ళి, ఒక పందిలి వేసుకుని, “పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని” దాని నీడన కూర్చున్నాడు. యోనాకు నీడనిచ్చేలా యెహోవా ఒక సొరచెట్టు మొలిచేటట్లు చేశాడు. అయితే మరునాడు ఆ చెట్టు వాడిపోయింది. దాని గురించి యోనాకు కోపం వచ్చినప్పుడు, యెహోవా ఇలా అన్నాడు: “యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?” (యోనా 4:​5-11) ప్రజల గురించి యెహోవాకున్న దృక్కోణం విషయంలో యోనాకు ఎంత గొప్ప పాఠమో కదా!

10 నీనెవె వాసులపట్ల జాలిపడుతూ దేవుడు చేసిన వ్యాఖ్యానానికి యోనా ఎలా ప్రతిస్పందించాడన్నది వ్రాయబడిలేదు. అయినా, పశ్చాత్తప్తులైన నీనెవె నివాసులపట్ల ప్రవక్త తన దృక్కోణాన్ని సరిచేసుకున్నాడని స్పష్టమవుతోంది. ఈ ప్రేరేపిత వృత్తాంతం వ్రాయబడడానికి యెహోవా ఆయనను ఉపయోగించుకున్నాడన్న వాస్తవం నుండి మనమా నిర్ధారణకు చేరుకుంటాము.

మీకెలాంటి స్వభావం ఉంది?

11 నేడు మనం మరో నాశనాన్ని ఎదుర్కొనబోతున్నాము, అదే యెహోవా మహా దినమున జరిగే ప్రస్తుత దుష్ట విధాన నాశనం. (లూకా 17:26-30; గలతీయులు 1:4; 2 పేతురు 3:​10) నేడు అబ్రాహామే బ్రతికుంటే, త్వరలో నాశనం కాబోతున్న ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలను ఎలా దృష్టించి ఉండేవాడు? “రాజ్య సువార్త” ఇంకా వినని వారి గురించి ఆయన తప్పక శ్రద్ధకలిగి ఉండేవాడే. (మత్తయి 24:​14) సొదొమలో ఉండగల నీతిమంతుల గురించి అబ్రాహాము దేవుడ్ని పదే పదే వేడుకున్నాడు. పశ్చాత్తాపపడి, దేవుని సేవ చేసేందుకు అవకాశం ఇవ్వబడితే, సాతాను ఆధీనంలోవున్న ఈ లోక మార్గాలను తిరస్కరించే ప్రజల గురించి మనం వ్యక్తిగతంగా శ్రద్ధకలిగివున్నామా?​—⁠1 యోహాను 5:19; ప్రకటన 18:​2-4.

12 దుష్టత్వం అంతమవ్వాలని కోరుకోవడం సబబే. (హబక్కూకు 1:​2, 3) అయినా, పశ్చాత్తాపపడగల ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టింపులేని యోనా వంటి దృక్పథాన్ని వృద్ధి చేసుకోవడం చాలా సులభం. రాజ్య సందేశంతో మనం ప్రజల ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఉదాసీనంగా, ప్రతికూలంగా, లేదా జగడాలమారులుగా ఉన్న వ్యక్తులను కలిసినప్పుడు ప్రాముఖ్యంగా అలా జరుగుతుంది. ఈ దుష్ట విధానం నుండి యెహోవా ఇంకా సమకూర్చనున్న వారి గురించి మనం పట్టింపులేనివారం కావచ్చు. (రోమీయులు 2:⁠4) మనల్ని మనం గంభీరంగా పరిశీలించుకున్నప్పుడు, నీనెవె నివాసుల గురించి యోనాకు మునుపున్న దృక్పథం మనలో ఏ కాస్త ఉన్నట్లు వెల్లడైనా, మన దృక్కోణం యెహోవా దృక్కోణానికి అనుగుణంగా మలచుకునేందుకు సహాయం చేయమని ప్రార్థించవచ్చు.

13 ఇప్పటికింకా తన సేవ చేయడం ప్రారంభించని వారిగురించి యెహోవా శ్రద్ధ కలిగివున్నాడు, ఆయన తన సమర్పిత ప్రజల విన్నపాలను వింటాడు. (మత్తయి 10:​11) ఉదాహరణకు, వారి ప్రార్థనలకు సమాధానంగా ఆయన ‘వారికి న్యాయము తీరుస్తాడు.’ (లూకా 18:​7, 8) అంతేగాక, యెహోవా తన సొంత సమయంలో తన వాగ్దానాలన్నీ, సంకల్పాలన్నీ నెరవేరుస్తాడు. (హబక్కూకు 2:⁠3) దీనిలో భాగంగా, నీనెవె వాసులు మళ్ళీ దుష్టత్వంలో పడిపోయినప్పుడు దాన్ని నాశనం చేసినట్లుగానే భూమిపై నుండి సమస్త దుష్టత్వాన్ని నిర్మూలిస్తాడు.​—⁠నహూము 3:5-7.

14 యెహోవా మహా దినమున ఈ దుష్టవిధానం తీసివేయబడేంత వరకు మనం సహనంతో వేచివుండి, ఆయన చిత్తం చేయడంలో నిమగ్నమై ఉంటామా? యెహోవా దినం రాక ముందు మనం ఇంకా ఎంతమేరకు ప్రకటించాలో ఆ వివరాలు మనకు తెలియదు, కానీ అంతం రాకముందు దేవునికి సంతృప్తి కలిగేంత మేరకు భూవ్యాప్తంగా రాజ్య సువార్త ప్రకటించబడుతుందని మాత్రం మనకు తెలుసు. కాబట్టి యెహోవా తన మందిరమును మహిమతో నింపడాన్ని కొనసాగిస్తుండగా తీసుకు రాబడవలసిన “యిష్టవస్తువుల” గురించి మనం తప్పక శ్రద్ధ కలిగివుండాలి.​—⁠హగ్గయి 2:⁠7.

మన దృక్కోణం మన క్రియల ద్వారా స్పష్టమవుతుంది

15 బహుశా మనం ప్రకటనా పనికి అంతమంచి ఆహ్వానం లభించని సమాజంలో జీవిస్తుండవచ్చు, రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళలేని స్థితిలో ఉండవచ్చు. అంతం రాకముందు మన ప్రాంతంలో బహుశా పదిమందినే కనుగొనడం సాధ్యమవుతుందేమో. ఆ పదిమంది మనం వెదకడానికి తగినవారని మనం భావిస్తామా? ప్రజలు “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున” యేసు “వారిమీద కనికరప[డ్డాడు].” (మత్తయి 9:​36) బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని ఆర్టికల్స్‌ చదవడం ద్వారా మనం ఈ లోక దురవస్థ గురించి మరింత అంతర్దృష్టిని పొందవచ్చు. తత్ఫలితంగా ఇది సువార్త ప్రకటించవలసిన అవసరత పట్ల మన మెప్పును అధికం చేయగలదు. అంతేగాక, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా అందజేయబడుతున్న బైబిలు ఆధారిత సమాచారాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఉపయోగించుకోవడం, తరచూ పనిచేసిన ప్రాంతంలో సేవ చేసేటప్పుడు పట్టుదల కలిగివుండడానికి మనకు సహాయం చేస్తుంది.​—⁠మత్తయి 24:45-47; 2 తిమోతి 3:​14-17.

16 జీవదాయకమైన బైబిలు సందేశానికి ప్రతిస్పందించగల వారిపట్ల మనకున్న శ్రద్ధ, మన పరిచర్యలో గృహస్థులను వివిధ సమయాల్లో కలవడానికి, వివిధ మార్గాలను అవలంబించడానికి మనల్ని పురికొల్పుతుంది. మనం వెళ్ళినప్పుడు చాలామంది ఇళ్ళ వద్ద లేనట్లు కనుగొంటున్నామా? అలాగైతే, సాక్ష్యమిచ్చే మన కార్యకలాపాల సమయాలను, స్థలాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా మనం మరింత ప్రభావవంతంగా ఉండవచ్చు. చేపలు పట్టేవారు తాము చేపలు పట్టుకోగల సమయంలోనే చేపలు పట్టడానికి వెళ్తారు. మన ఆధ్యాత్మిక చేపలు పట్టేపనిలో మనమూ అలాగే చేయగలమా? (మార్కు 1:​16-18) సాయంకాలం సాక్ష్యమివ్వడానికి, చట్టబద్ధమైన చోట ఫోను ద్వారా సాక్ష్యమివ్వడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? కార్లు నిలిపే స్థలాలు, బస్సు డిపోలు, దుకాణాలు ఫలవంతమైన ‘చేపలుపట్టే స్థలాలుగా’ ఉన్నట్లు కొందరు కనుగొన్నారు. అనియతంగా సాక్ష్యమివ్వడానికి మనం అవకాశాలను చేజిక్కించుకున్నప్పుడు, మనకు ప్రజలపట్ల అబ్రాహాముకున్నటు వంటి దృక్కోణం ఉందని వెల్లడవుతుంది.

17 లక్షలాదిమంది ఇప్పటికింకా రాజ్య సందేశం వినలేదు. ప్రకటించడమేగాక, ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండానే అలాంటి ప్రజలపట్ల మనకున్న శ్రద్ధను చూపించగలమా? విదేశాల్లో సేవ చేస్తున్న మిషనరీల గురించి లేదా పూర్తికాల పరిచారకుల గురించి మనకు తెలుసా? అలాగైతే, వారు చేస్తున్న పనికి మన మెప్పును చూపించే విధంగా వారికి ఉత్తరాలు వ్రాయవచ్చు. అది సాధారణ ప్రజల పట్ల శ్రద్ధను ఎలా చూపిస్తుంది? మనం రాసే ప్రోత్సాహకరమైన, ప్రశంసాపూర్వకమైన ఉత్తరాలు మిషనరీలు తమ నియామకంలో కొనసాగుతూ ఇంకా అనేకులు సత్య జ్ఞానాన్ని పొందడానికి సహాయం చేసేందుకు వారిని బలపరుస్తాయి. (న్యాయాధిపతులు 11:​40) మిషనరీల కోసం, ఇతర దేశాల్లో సత్యం కోసం ఆకలిగొని ఉన్నవారి కోసం మనం ప్రార్థించవచ్చు కూడా. (ఎఫెసీయులు 6:​18-20) మనకున్న శ్రద్ధను చూపించడానికి మరో మార్గం యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి డబ్బు రూపేణా విరాళాలు అందజేయడం.​—⁠2 కొరింథీయులు 8:13, 14; 9:6, 7.

మీరు వేరే ప్రాంతానికి వెళ్ళగలరా?

18 రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న స్థలాలకు వెళ్ళినవారు తాము చేసిన స్వయంత్యాగపూరిత ప్రయత్నాలను బట్టి ఆశీర్వదించబడ్డారు. అయితే ఇతర యెహోవాసాక్షులు తమ సొంత దేశంలోనే ఉండి, వలసవచ్చిన ప్రజలకు ఆధ్యాత్మిక సహాయాన్ని అందించేందుకు వీలుగా మరో భాష నేర్చుకున్నారు. అలాంటి ప్రయత్నాలకు నిజంగా ప్రతిఫలాలు లభించాయి. ఉదాహరణకు, అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో చైనీయులకు సహాయం చేస్తున్న ఏడుగురు సాక్షులు 2001వ సంవత్సరపు, ప్రభువు రాత్రి భోజన ఆచరణకు 114మందిని ఆహ్వానించారు. అలాంటి గుంపులకు సహాయం చేస్తున్నవారు తమ పంటలు కోతకు సిద్ధంగా ఉన్నట్లు కనుగొన్నారు.​—⁠మత్తయి 9:​37, 38.

19 రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ఒకవేళ మీరు మీ కుటుంబం వెళ్ళగలిగే స్థితిలో ఉన్నామని మీరు భావిస్తుండవచ్చు. అయితే “కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచు”కోవడం జ్ఞానయుక్తం. (లూకా 14:​28) ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇది అవసరం. అలాంటి సాధ్యత గురించి ఆలోచిస్తున్నవారు తమను తాము ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నేను నా కుటుంబానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వగలనా? నేను తగిన వీసాను పొందగలనా? నాకు ఇప్పటికే ఆ దేశ భాష వచ్చా లేక నేర్చుకోవాలనే ఇష్టం ఉందా? అక్కడి వాతావరణం, సంస్కృతి గురించి ఆలోచించానా? నేను ఆ దేశంలోని తోటి విశ్వాసులకు ఒక భారంగా ఉండకుండా వారికి నిజంగా “ఆదరణ” కలిగించగలనా?’ (కొలొస్సయులు 4:​10, 11) మీరు వెళ్ళాలనుకుంటున్న దేశంలో అవసరత ఎంతగా ఉందనేది తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ముందుగా ఉత్తరం వ్రాయడం ఎల్లప్పుడు సముచితం. *

20 జపానులో రాజ్యమందిరాల నిర్మాణంలో పాల్గొనే ఒక క్రైస్తవుడు, పరాగ్వేలో ఆరాధనా స్థలాన్ని నిర్మించడానికి నిపుణులైన పనివారి అవసరం ఉందని తెలుసుకున్నాడు. అవివాహితుడు, సత్తువగల యౌవనస్థుడు అయిన ఈయన ఆ దేశానికి వెళ్ళి, ఆ పనిలో ఒంటరిగా ఎనిమిది నెలలపాటు పూర్తికాలం పనిచేశాడు. ఆయన అక్కడున్నప్పుడు స్పానిష్‌ భాష నేర్చుకుని గృహబైబిలు అధ్యయనాలు నిర్వహించాడు. ఆ దేశంలో రాజ్య ప్రచారకుల అవసరత ఉండడాన్ని ఆయన చూశాడు. ఆయన జపానుకు తిరిగి వచ్చినప్పటికీ ఆయన త్వరలోనే పరాగ్వేకు తిరిగి వెళ్ళి, అదే రాజ్యమందిరంలోకి ప్రజలను సమకూర్చడానికి సహాయపడ్డాడు.

21 దేవుడు తన చిత్తానికి అనుగుణంగా ప్రకటనా పని పూర్తిగా జరిగేలా చూస్తాడు. నేడు, ఆయన ఆధ్యాత్మిక తుది కోతను త్వరితం చేస్తున్నాడు. (యెషయా 60:​22) మనం యెహోవా దినం కోసం ఎదురుచూస్తుండగా కోత పనిలో ఆసక్తితో పాల్గొంటూ ప్రజలను మన ప్రేమగల దేవుడు దృష్టించినట్లుగానే దృష్టిద్దాము.

[అధస్సూచీలు]

^ పేరా 26 ప్రకటనా పని నిషేధించబడిన లేదా పరిమితంచేయబడిన దేశానికి మీరు వెళ్ళడం అన్నిసందర్భాల్లోనూ సహాయకరంగా ఉండదు. అలా చేయడం, అలాంటి పరిస్థితుల్లో వివేకయుక్తంగా పనిచేస్తున్న రాజ్య ప్రచారకులకు హాని కూడా కలిగించగలదు.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

మనం యెహోవా దినం కోసం ఎదురుచూస్తుండగా, ప్రజలను మనమెలా దృష్టించాలి?

సొదొమలో నివసిస్తున్న నీతిమంతుల గురించి అబ్రాహాము దృక్కోణం ఎలా ఉంది?

పశ్చాత్తాపపడిన నీనెవె వాసులను యోనా ఎలా దృష్టించాడు?

ఇప్పటి వరకు సువార్త వినని ప్రజల గురించి యెహోవాకున్న దృక్కోణమే మనకూ ఉందని మనమెలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) యెహోవా నేడు ప్రజలను ఎలా దృష్టిస్తాడు? (బి) మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవచ్చు?

3. సొదొమ గొమొఱ్ఱా నివాసుల గురించి యెహోవా దృక్కోణం ఏమిటి?

4, 5. సొదొమ నివాసుల కోసం అబ్రాహాము ఎందుకు మొరపెట్టాడు, ప్రజల గురించి ఆయనకున్న దృక్కోణం యెహోవా దృక్కోణంతో పొందిక కలిగివుందా?

6. యోనా ప్రకటనకు నీనెవె నివాసులు ఎలా ప్రతిస్పందించారు?

7. నీనెవె నివాసుల పశ్చాత్తప్త దృక్పథాన్ని యెహోవా ఎలా దృష్టించాడు?

8. యోనా ఎందుకు కోపం తెచ్చుకున్నాడు?

9, 10. (ఎ) యెహోవా యోనాకు ఏ పాఠం నేర్పించాడు? (బి) నీనెవె వాసుల గురించి యోనా చివరికి యెహోవా దృక్కోణాన్ని ఏర్పరచుకున్నాడని మనమెందుకు అనుకోవచ్చు?

11. నేడు జీవిస్తున్న ప్రజలను బహుశా అబ్రాహాము ఎలా దృష్టించి ఉండేవాడు?

12. మనం మన పరిచర్యలో కలిసే ప్రజల పట్ల యోనా వంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవడం ఎందుకు సులభం, దీని గురించి మనమేమి చేయవచ్చు?

13. యెహోవా నేడు ప్రజల గురించి శ్రద్ధ కలిగివున్నాడని మనమెందుకు చెప్పవచ్చు?

14. యెహోవా మహా దినం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే మనమేమి చేస్తూవుండాలి?

15. ప్రకటనా పని పట్ల మన మెప్పును ఏది అధికం చేయగలదు?

16. మన పరిచర్య సమర్థతను మనమెలా అధికం చేసుకోవచ్చు?

17. మిషనరీలను, విదేశాల్లో సేవ చేస్తున్న ఇతరులను మనం ఏయే విధాలుగా ప్రోత్సహించవచ్చు?

18. కొంతమంది క్రైస్తవులు తాము నివసిస్తున్న దేశంలో రాజ్యాసక్తులను అభివృద్ధి చేయడానికి ఏమి చేశారు?

19. వేరే దేశంలో రాజ్య ప్రకటనా పనిని విస్తరింపజేయడానికి అక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు ఏమి చేయడం మంచిదని ఉపదేశించబడుతోంది?

20. విదేశంలో ఉన్న తోటి విశ్వాసులకు, ఇతరులకు ప్రయోజనం చేకూరేవిధంగా ఒక యౌవన క్రైస్తవుడు తనను తాను ఎలా వెచ్చించుకున్నాడు?

21. యెహోవా మహా దినం కోసం మనం ఎదురుచూస్తుండగా మన ప్రధాన శ్రద్ధ, దృక్కోణం ఏమై ఉండాలి?

[16వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము ప్రజలను యెహోవా దృష్టించినట్లే దృష్టించాడు

[17వ పేజీలోని చిత్రం]

పశ్చాత్తాపపడిన నీనెవె వాసుల గురించి యోనా చివరకు యెహోవావంటి దృక్పథాన్ని ఏర్పరచుకున్నాడు

[18వ పేజీలోని చిత్రం]

ప్రజలపట్ల మనకున్న శ్రద్ధ మనం సువార్త ప్రకటించడానికి వివిధ సమయాల్లో వివిధ మార్గాలను అనుసరించేలా మనల్ని కదిలిస్తుంది