“ఇద్దరు వ్యక్తులు మా తలుపు తట్టారు”
“ఇద్దరు వ్యక్తులు మా తలుపు తట్టారు”
“మా చిన్నారి పాప మమ్మల్ని శోకసముద్రంలో వదిలేసి ఇప్పటికి రెండు సంవత్సరాలైంది.” ఫ్రాన్సులోవున్న సెంట్ ఎట్నీలో ప్రచురించబడే ల ప్రొగ్రెస్ అనే దినపత్రికలోని ఒక ఉత్తరంలో తొలి మాటలివి.
“మూడు నెలల మేలీస, ట్రిసోమి 18 అని పిలువబడే భయంకరమైన వ్యాధికి గురైంది. చాలా దారుణమనిపించే ఆ విషాదం నుండి పూర్తిగా బయటపడడం ఎన్నడూ జరగదు. మేము క్యాథలిక్ మత విశ్వాసంలోనే పెరిగినప్పటికీ, ‘దేవా నువ్వు నిజంగా ఉంటే, ఇలా ఎందుకు జరగనిస్తావు?’ అని తలుస్తూ ఆవేదనచెందాము.” ఆ ఉత్తరం వ్రాసిన తల్లి, క్షోభతో నిస్సహాయంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆమె ఉత్తరం ఇంకా ఇలా కొనసాగింది:
“ఈ సంఘటనలు జరిగిన కొంతకాలానికి, ఇద్దరు వ్యక్తులు మా తలుపు తట్టారు. వారు యెహోవాసాక్షులని నేను వెంటనే గుర్తుపట్టాను. నేను వారిని మర్యాదగానే వెళ్ళిపొమ్మని చెప్పడానికి నిశ్చయించుకున్నాను, కానీ వారు ఇవ్వజూపుతున్న బ్రోషుర్‌ను గమనించాను. అది దేవుడు బాధలనెందుకు అనుమతిస్తున్నాడనే విషయం గురించి ఉన్న బ్రోషుర్. నేను వారి తర్కాలను కూలదోయాలనే ఉద్దేశంతో వారిని లోపలికి ఆహ్వానించాను. బాధల విషయానికొస్తే మా కుటుంబం చాలావరకు అనుభవించిందని నాకనిపిస్తుంది, ‘ఆమెను దేవుడే మాకిచ్చాడు, దేవుడే ఆమెను తీసుకెళ్ళాడు’ వంటి మాటలను ఎన్నోసార్లు విన్నాము. సాక్షులు గంటకంటే ఎక్కువ సేపే ఉన్నారు. నేను చెప్పేదంతా వారు సానుభూతితో విన్నారు, నాకు చాలా ఊరటగా అనిపించింది, వారు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వస్తామంటే సరే అన్నాను. అది రెండు సంవత్సరాల ముందటి మాట. నేను యెహోవాసాక్షిని కాలేదు, కానీ నేను వారితో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాను, నాకు వీలైనప్పుడల్లా వారి కూటాలకు హాజరవుతున్నాను.”