“ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి”
“ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి”
“ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” (మత్తయి 10:8) యేసు తన అపొస్తలులను సువార్త ప్రకటించడానికి పంపించేటప్పుడు వారికి ఆ ఆజ్ఞ ఇచ్చాడు. అపొస్తలులు ఆ ఆజ్ఞను శిరసావహించారా? అవును, యేసు భూమిపైనుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు దాన్ని పాటించడం కొనసాగించారు.
ఉదాహరణకు, లోగడ గారడీలు చేసే సీమోను అపొస్తలులైన పేతురు యోహానులకున్న అద్భుత శక్తులను చూసినప్పుడు, ఆ శక్తిని తనకిస్తే డబ్బులిస్తానని అడిగాడు. కానీ పేతురు సీమోనును ఇలా మందలించాడు: “నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.”—అపొస్తలుల కార్యములు 8:18-20
పేతురు కనబరచినటువంటి స్ఫూర్తినే అపొస్తలుడైన పౌలు చూపించాడు. ఆయన కొరింథులోని తన క్రైస్తవ సహోదరులపై కావాలనుకుంటే ఆర్థికంగా తన భారాన్ని మోపగలిగేవాడే. కానీ ఆయన తనను తాను పోషించుకోవడానికి స్వహస్తాలతో పనిచేశాడు. (అపొస్తలుల కార్యములు 18:1-3) ఆ కారణంగానే ఆయన, నేను కొరింథీయులకు సువార్తను “ఉచితముగా” ప్రకటించాను అని ధైర్యంగా చెప్పగలిగాడు.—1 కొరింథీయులు 4:12; 9:18
క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకునే అనేకమంది ‘ఉచితంగా ఇవ్వడానికి’ అదే ఇష్టతను చూపించకపోవడం శోచనీయం. వాస్తవానికి, క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులు అనేకమంది ‘కూలికే బోధిస్తారు.’ (మీకా 3:11) కొందరు మతనాయకులైతే తమ మందల నుండి పోగుచేసుకున్న డబ్బుతో సంపన్నులయ్యారు. 1989లో ఒక అమెరికా ఇవెంజలిస్టుకు 45 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కారణమేంటి? అతను “మద్దతుదారులను లక్షలాది డాలర్ల విషయంలో మోసం చేసి వాటిలో కొంత డబ్బును ఇండ్లు, కార్లు కొనుక్కోవడానికి, వినోదయాత్రలకు, చివరికి తన కుక్కల కోసం ఒక ఎయిర్ కండిషన్ కుక్కల దొడ్డిని ఏర్పాటు చేయించుకోవడానికి ఉపయోగించుకున్నాడు.”—పీపుల్స్ డెయిలీ గ్రాఫిక్, అక్టోబరు 7, 1989.
మార్చి 31, 1990నాటి గనాయన్ టైమ్స్ పత్రిక ప్రకారం, ఘానాలో ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్టు, ఒకానొక చర్చి కూటంలో సేకరించబడిన డబ్బును తిరిగి వారిమీదికే విసిరేశాడు. “దానికి ఆయనిచ్చిన కారణమేమిటంటే, ఎదిగిన మనుషులుగా వారు ఇంకా ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని అపేక్షించబడుతుంది” అని ఆ పత్రిక చెబుతోంది. అనేక చర్చీలు డబ్బు సేకరించడం కోసం జూదానికి సంబంధించిన కార్యకలాపాలను, ఇతర స్కీములను చురుగ్గా ప్రోత్సహిస్తూ తమ సభ్యుల్లో స్వార్థాన్ని చెలరేపుతున్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు.
దానికి భిన్నంగా యెహోవాసాక్షులు యేసును, ఆయన తొలి శిష్యులను అనుకరించడానికి కృషిచేస్తారు. జీతాలు తీసుకొని పనిచేసే మతనాయక వర్గం వారికి లేదు. ప్రతి సాక్షి ఒక సేవకుడే, “రాజ్య సువార్త”ను ఇతరులకు ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరికి అప్పగించబడింది. (మత్తయి 24:14) అందుకే ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలకుపైగావున్న వీరు, “జీవజలమును” ప్రజలకు ఉచితముగా చేరవేయడంలో నిమగ్నమై ఉన్నారు. (ప్రకటన 22:17) ఈ విధంగా “రూకలులేనివా[రు]” కూడా బైబిలు సందేశం నుండి ప్రయోజనం పొందవచ్చు. (యెషయా 55:1) ప్రపంచవ్యాప్తంగా వారు చేస్తున్న పని స్వచ్ఛంద విరాళాలతోనే నడుస్తున్నప్పటికీ, వారు డబ్బులిమ్మని ఎన్నడూ అడగరు. దేవుని నిజ పరిచారకులుగా వారు “దేవుని వాక్యమును కలిపి చెరిపెడు” వారు కాదు, కానీ వారు ‘నిష్కాపట్యముతో దేవునివలన నియమింపబడిన వారిగా’ మాట్లాడతారు.—2 కొరింథీయులు 2:17.
అయితే యెహోవాసాక్షులు తమ సొంత ఖర్చులతో ఇతరులకు సహాయం చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? వారిని ఏమి పురికొల్పుతోంది? ఉచితముగా ఇవ్వడమంటే, వారు తమ ప్రయత్నాలకు ఎలాంటి ఫలితం లేకుండానే చేస్తారా?
సాతాను సవాలుకు జవాబు
నేడు నిజ క్రైస్తవులు ప్రధానంగా పురికొల్పబడుతున్నది యెహోవాను సంతోషపరచాలన్న కోరికతోనే—తమను తాము సంపన్నులను చేసుకోవాలని కాదు. అపవాదియైన సాతాను శతాబ్దాల క్రితం లేవదీసిన ఒక సవాలుకు ఆ విధంగా వారు జవాబివ్వగలుగుతున్నారు. యోబు అనే ఒక యథార్థవర్తనుడి గురించి సాతాను మాట్లాడుతూ, “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?” అని యెహోవాను సవాలు చేశాడు. దేవుడు యోబును కాపాడుతున్నందు వల్లనే, యోబు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని సాతాను వాదించాడు. యోబుకు వస్తుసంపదలు లేకుండాచేసినట్లయితే ఆయన దేవుణ్ణి ముఖం మీదే దూషిస్తాడు అని సాతాను వాదించాడు.—యోబు 1:7-11.
ఈ సవాలుకు జవాబివ్వడం కోసం దేవుడు, “ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది” అని చెప్పి యోబును పరీక్షించేందుకు సాతానుకు అనుమతిచ్చాడు. (యోబు 1:12) దాని ఫలితం ఏమిటి? సాతాను అబద్ధికుడని యోబు నిరూపించాడు. ఆయనపై ఎలాంటి విపత్తులు వచ్చిపడినా ఆయన విశ్వసనీయంగా ఉన్నాడు. “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని ఆయనన్నాడు.—యోబు 27:5, 6.
సత్యారాధకులు నేడు, యోబు చూపించిన వైఖరినే చూపిస్తారు. వారు దేవునికి చేసే సేవ భౌతిక విషయాల పట్ల ఉండే ఆసక్తితో ప్రేరేపించబడలేదు.
దేవుని కృపాపూర్వక ఉచిత బహుమతి
క్రైస్తవులు ‘ఉచితముగా ఇవ్వడానికి’గల మరొక కారణమేమిటంటే, వారు కూడా దేవుని నుండి ‘ఉచితముగానే పొందారు.’ మన పితరుడైన ఆదాము చేసిన పాపము వల్ల మానవాళి పాపమరణాల బంధనంలో చిక్కుకుంది. (రోమీయులు 5:12) యెహోవా తన కుమారుడు బలిగా మరణించే ఏర్పాటును ప్రేమపూర్వకంగా చేశాడు—దానికి ఆయన ఎంతో మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దాన్ని పొందే యోగ్యత మానవాళికి ఏమాత్రం లేదు. అవును అది దేవుడిచ్చిన బహుమానం.—రోమీయులు 4:4; 5:8; 6:23.
రోమీయులు 3:23, 24లో నమోదు చేయబడిన ప్రకారం, పౌలు అభిషిక్త క్రైస్తవులతో ఇలా చెప్పాడు: “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.” భూమిపై నిత్యం జీవించే నిరీక్షణగలవారు ‘ఉచిత బహుమతి’ పొందినటువంటివారే. ఈ బహుమతిలో యెహోవా స్నేహితులుగా నీతిమంతులుగా తీర్చబడే మహత్తర అవకాశముంది.—యాకోబు 2:23; ప్రకటన 7:14.
క్రీస్తు విమోచన క్రయధన బలి, క్రైస్తవులందరూ దేవుని పరిచారకులుగా సేవచేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవుడు . . . నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు [మర్మానికి] పరిచారకుడనైతిని.” (ఎఫెసీయులు 3:4-7) వారు కృపతోనే ఈ సేవచేయడానికి పిలువబడ్డారు, దేవుని నిజ పరిచారకులు, పొందడానికి తాము అర్హులుకాని లేదా తాము సంపాదించుకోలేని ఒక బహుమతి ద్వారా ఈ పరిచర్యను పొంది దాని గురించిన వార్తను ఇతరులతో పంచుకోవడానికి తమకు వస్తుపరమైన వేతనం ఇవ్వబడాలని ఆశించలేరు.
నిత్యజీవము—స్వార్థాన్ని ప్రేరేపిస్తుందా?
అంటే క్రైస్తవులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవచేయాలని దేవుడు కోరుతున్నాడని దీని భావమా? కాదు, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులతో ఇలా అన్నాడు: “తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:10; ద్వితీయోపదేశకాండము 32:4) దానికి భిన్నంగా యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువా[డు].” (హెబ్రీయులు 11:6) అయినా పరదైసులో నిత్యం జీవించే వాగ్దానం స్వార్థాన్ని ప్రేరేపించదా?—లూకా 23:43.
ఎంతమాత్రం ప్రేరేపించదు. దానికి ఒక కారణమేమిటంటే, భూపరదైసులో నిత్యం జీవించాలనే కోరికకు మూలకారకుడు యెహోవాయే. ఈ ఉత్తరాపేక్షను మొదటి మానవ దంపతులకు ఇచ్చింది ఆయనే. (ఆదికాండము 1:28; 2:15-17) ఆదాము హవ్వలు ఈ నిరీక్షణను తమ సంతానం పొందకుండా చేజార్చినప్పుడు, దాన్ని పునఃస్థాపించే ఏర్పాట్లను కూడా ఆయన చేశాడు. అందుకే దేవుడు తన వాక్యంలో ‘సృష్టి నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతుంది’ అని వాగ్దానం చేస్తున్నాడు. (రోమీయులు 8:20, 21) కాబట్టి నేటి క్రైస్తవులు, పూర్వపు మోషేలాగే ‘ప్రతిఫలముగా కలుగబోవు బహుమానంపై దృష్టి ఉంచడము’ సమంజసమే. (హెబ్రీయులు 11:24-26) ఈ ప్రతిఫలాన్ని దేవుడు లంచముగా ఇవ్వడం లేదు. తన సేవ చేసేవారి పట్ల గల యథార్థమైన ప్రేమ వల్లనే ఆయన దాన్ని ఇస్తున్నాడు. (2 థెస్సలొనీకయులు 2:16, 17) దానికి ప్రతిస్పందనగా ‘ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమిస్తాము.’—1 యోహాను 4:19.
దేవుణ్ణి సేవించడానికి సరైన ప్రేరణ
ఏదేమైనా నేడు క్రైస్తవులు తాము దేవుణ్ణి సేవించడానికిగల తమ ఉద్దేశాలను నిరంతరం పరీక్షించుకోవాలి. యోహాను 6:10-13 వచనాల్లో, యేసు అయిదువేల కంటే ఎక్కువమందికి అద్భుతమైన రీతిలో భోజన ఏర్పాటు చేశాడని మనం చదువుతాం. దాని తర్వాత కొందరు పూర్తిగా తమ స్వార్థపు కారణాల వల్లనే యేసును అనుసరించడం ప్రారంభించారు. యేసు వారితో ఇలా అన్నాడు: “మీరు . . . రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నా[రు].” (యోహాను 6:26) అదేవిధంగా దశాబ్దాల తర్వాత కొందరు సమర్పిత క్రైస్తవులు దేవుని సేవచేశారు, కానీ ‘శుద్ధమనస్సుతో కాదు.’ (ఫిలిప్పీయులు 1:15-17) ‘యేసుక్రీస్తు హితవాక్యములను అంగీకరింపని’ కొందరైతే క్రైస్తవులతో సహవసించడం ద్వారా వ్యక్తిగతంగా లాభం పొందడానికి మార్గాలను కూడా వెతుక్కున్నారు.—1 తిమోతి 6:3-5.
నేడు ఒక క్రైస్తవుడు తాను పరదైసులో నిత్యం జీవించాలన్న కాంక్షతో సేవిస్తున్నట్లయితే అతను కూడా స్వార్థ ప్రేరణతోనే సేవిస్తున్నట్లు. చివరకు అది ఆధ్యాత్మిక వైఫల్యానికి దారితీసే అవకాశముంది. సాతాను విధానం అనుకున్నదాని కంటే ఎక్కువకాలం ఉన్నట్లనిపించడం వల్ల, అంతం రావడం ఆలస్యమవుతోందని భావిస్తూ అతను ‘అలసిపోతుండవచ్చు.’ (గలతీయులు 6:9) తను చేసిన భౌతిక త్యాగాల గురించి అతను బాధపడుతుండవచ్చు కూడా. యేసు మనకిలా గుర్తుచేస్తున్నాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె[ను].” (మత్తయి 22:37) అవును దేవుణ్ణి సేవించడానికి ప్రేమే ప్రధాన కారణంగా ఉన్న వ్యక్తి, తను చేసే సేవకు సమయ పరిమితులు పెట్టుకోడు. ఆయన యెహోవాను ఎల్లప్పుడూ సేవించడానికి దృఢంగా నిశ్చయించుకున్నాడు! (మీకా 4:5) దేవునికి తాను చేసే సేవకు సంబంధించి తాను చేసిన త్యాగాలకు ఆయన ఏ మాత్రం పశ్చాత్తాపం చెందడు. (హెబ్రీయులు 13:15, 16) ఆయన తన జీవితంలో దేవుని ఆసక్తులకే మొదటి స్థానం ఇచ్చేలా ఆయనకు దేవుని పట్ల ఉన్న ప్రేమే ఆయనను ప్రేరేపిస్తుంది.—మత్తయి 6:33.
నేడు 60 లక్షలకంటే ఎక్కువమంది సత్యారాధకులు యెహోవాను “ఇష్టపూర్వకముగా” సేవిస్తున్నారు. (కీర్తన 110:3) మీరూ వారిలో ఉన్నారా? లేనట్లయితే దేవుడు ఇవ్వజూపుతున్న వాటి గురించి ఆలోచించండి: సత్యం గురించిన స్వచ్ఛమైన పరిజ్ఞానం; (యోహాను 17:3) అబద్ధ మత బోధనల బంధం నుండి విముక్తి; (యోహాను 8:32) నిత్యజీవపు నిరీక్షణ. (ప్రకటన 21:3, 4) మీరు వీటన్నింటినీ దేవుని నుండి ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సహాయం చేస్తారు—అదీ ఉచితంగా.
[22వ పేజీలోని బ్లర్బ్]
నేడు నిజ క్రైస్తవులు యెహోవాను సంతోషపరచాలన్న కోరికతోనే ప్రధానంగా ప్రేరేపించబడుతున్నారు—తమను తాము సంపన్నులను చేసుకోవాలన్న కోరికతో కాదు
[21వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు సువార్త ఉచితంగా పంచుకునేలా దేవుని ఉచిత బహుమానమైన విమోచన క్రయధనమే ప్రేరేపిస్తోంది