మీరు యెహోవాను మనస్ఫూర్తిగా వెదకుతున్నారా?
మీరు యెహోవాను మనస్ఫూర్తిగా వెదకుతున్నారా?
ఒక క్రైస్తవుడు ట్రైన్‌లోని తన తోటి ప్రయాణికులతో బైబిలునుండి సువార్త పంచుకోవాలని గాఢంగా కోరుకున్నాడు. (మార్కు 13:10) అయితే భయం ఆయనను కృంగదీసింది. ఆయన తన ప్రయత్నం విరమించుకున్నాడా? లేదు, దాని విషయమే ఆయన పట్టుదలగా ప్రార్థించి, సంభాషణ ఆరంభించే పద్ధతి నేర్చుకోవడానికి కృషిచేశాడు. యెహోవా దేవుడు ఆయన విన్నపం ఆలకించి సాక్ష్యమిచ్చేందుకు తగిన బలమిచ్చాడు.
మనం యెహోవాను, ఆయన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా వెదకడం అవశ్యం. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను [“మనస్ఫూర్తిగా,” NW] వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.” (హెబ్రీయులు 11:6) కేవలం యెహోవాను వెదకడమే సరిపోదు. ‘మనస్ఫూర్తిగా వెదకడం’ అని అనువదించబడిన గ్రీకు క్రియాపదం తీవ్రంగా, ఏకాగ్రతతో ప్రయత్నించడం అనే భావమిచ్చేదిగా ఉంది. దీనిలో ఒక వ్యక్తి పూర్ణ హృదయం, మనస్సు, ఆత్మ, బలం చేరివున్నాయి. మనం మనస్ఫూర్తిగా యెహోవాను వెదకుతున్నట్లయితే, మనం ఉదాసీనంగా, కృషి చేయడానికి ఇష్టంలేనట్లుగా లేదా సోమరులుగా ప్రవర్తించం. బదులుగా, మనం ఆయనను వెంబడించడంలో నిజమైన ఆసక్తి చూపిస్తాము.—అపొస్తలుల కార్యములు 15:17.
యెహోవాను మనస్ఫూర్తిగా వెదకినవారు
యెహోవాను వెదకడానికి ఏకాగ్రతతో ప్రయత్నం చేసినవారి ఉదాహరణలు లేఖనాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి వారిలో యాకోబు ఒకరు. ఆయన మానవరూపం దాల్చిన దేవదూతతో తెల్లవారేవరకు తీవ్రంగా పెనుగులాడాడు. తత్ఫలితంగా, ఆయనకు ఇశ్రాయేలు (దేవునితో పోరాడినవాడు) అని పేరుపెట్టబడింది, ఎందుకంటే ఆయన దేవునితో పోరాడాడు, లేదా పట్టుదల చూపాడు, శ్రమించాడు, పట్టువదల్లేదు. ఆయన మనస్ఫూర్తిగా చేసిన కృషికి ఆ దేవదూత ఆయనను ఆశీర్వదించాడు.—ఆదికాండము 32:24-30.
మరొకరెవరనగా పేరు తెలియజేయబడని ఒక గలిలయ స్త్రీ. ఆమె 12 సంవత్సరాలపాటు రక్తస్రావంతో ‘ఎన్నో తిప్పలుపడింది.’ ఈ స్థితిలో, ఆమె ఇతరులనెవ్వరినీ ముట్టుకోకూడదు. అయినప్పటికీ, ఆమె ధైర్యంతెచ్చుకొని యేసును కలవడానికి వెళ్లింది. ఆమె పదేపదే ఇలా అనుకుంది: ‘నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును.’ ‘[యేసును] వెంబడిస్తూ ఆయనమీద పడుతూవున్న జనసమూహము’ మధ్యగా ఆయన దగ్గరకు ఆమె చేరుకోవడాన్ని ఆలోచించండి. యేసు పైవస్త్రం ముట్టగానే తన ‘రక్తధార కట్టెనని’ అంటే తన దీర్ఘకాల వ్యాధి నయమైందని ఆమె గ్రహించింది! “నా వస్త్రములు ముట్టిన దెవరని” యేసు అడిగినప్పుడు, ఆమె భయపడింది. అయితే యేసు వాత్సల్యపూరితంగా ఆమెతో ఇలా అన్నాడు: “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక.” ఆమె ప్రయత్నాలకు ప్రతిఫలం లభించింది.—మార్కు 5:24-34; లేవీయకాండము 15:25-27.
ఇంకొక సందర్భంలో, తన కుమార్తెను బాగుచేయమని మత్తయి 15:22-28.
ఒక కనాను స్త్రీవచ్చి యేసును మనస్ఫూర్తిగా వేడుకుంది. అందుకు యేసు పిల్లల ఆహారం కుక్కపిల్లలకు వేయడం యుక్తంకాదని ఆమెకు చెప్పాడు. యోగ్యులైన యూదులకు దక్కాల్సింది ప్రక్కనబెట్టి ఇశ్రాయేలీయులు కానివారి యెడల తాను శ్రద్ధచూపలేడని ఆయన భావం. ఆయన చెప్పిన ఉపమాన భావం గ్రహించినా, ఆమె ఇలా యాచించింది: “నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా.” ఆమెకున్న బలమైన విశ్వాసం, చిత్తశుద్ధి యేసును పురికొల్పడంతో ఆయనిలా అన్నాడు: “అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక.”—వీరు తమ ప్రయత్నాల్లో పట్టుదల చూపి ఉండకపోతే వీరికి ఏమి జరిగివుండేది? ఆరంభ ఆటంకం లేదా నిరాకరణ ఎదురైనప్పుడే వారు తమ ప్రయత్నం మానుకునివుంటే వారు ఆశీర్వాదాలు పొందివుండే వారేనా? లేదు. యేసు నేర్పిన అంశాన్ని అంటే యెహోవాను వెదకడంలో “సిగ్గుమాలి మాటిమాటికి” అడగడం సరైనదని, ఆవశ్యకం అని కూడా ఈ ఉదాహరణలు చక్కగా ఉదహరిస్తున్నాయి.—లూకా 11:5-13.
ఆయన చిత్తానుసారముగా
పైన ప్రస్తావించబడిన, అద్భుతరీతిలో స్వస్థతపొందిన వారి వృత్తాంతాల్లో, ఆ స్వస్థతలు పొందడానికి కీలకాంశం వారు మనస్ఫూర్తిగా కోరుకోవడమేనా? కాదు, వారి విన్నపాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. యేసు దేవుని కుమారుడని, వాగ్దత్త మెస్సీయ అని అసాధారణంగా నిరూపించడానికే ఆయనకు ఆ అద్భుత శక్తులు ఇవ్వబడ్డాయి. (యోహాను 6:14; 9:33; అపొస్తలుల కార్యములు 2:22) అంతేకాకుండా, యేసు చేసిన ఆ అద్భుతాలు, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో మానవజాతిపై యెహోవా కుమ్మరింపనైయున్న భూసంబంధ దివ్య ఆశీర్వాదాలకు ముంగుర్తుగా ఉన్నాయి.—ప్రకటన 21:4; 22:2.
సత్యారాధకులు స్వస్థతనిచ్చే, భాషలు మాట్లాడేవంటి సామర్థ్యాలతో అద్భుతకార్యాలు చేయడం ఇక దేవుని చిత్తమేమాత్రం కాదు. (1 కొరింథీయులు 13:8, 13) మనకాలానికైన ఆయన చిత్తంలో ‘మనుష్యులందరు సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండేలాగున’ భూవ్యాప్తంగా రాజ్యసువార్త ప్రకటించడం ఒకభాగం. (1 తిమోతి 2:4; మత్తయి 24:14; 28:19, 20) దేవుని సేవకులు ఆయన చిత్తానికి అనుగుణంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే తాము పట్టుదలతో చేసే ప్రార్థనలు అంగీకరింపబడతాయని సరిగానే ఆశించవచ్చు.
‘చివరకు దేవుని సంకల్పమెలాగూ నెరవేర్చబడినప్పుడు మనమెందుకు తీవ్రంగా పోరాడాలి?’ అని కొందరు ఆలోచించవచ్చు. మానవ ప్రయత్నాలెలావున్నా యెహోవా తన సంకల్పం నెరవేరుస్తాడు, అయినా ఆయన చిత్తం నెరవేర్చడంలో ఆయావ్యక్తులు కూడా ఒక భాగమైయుండడం ఆయనకు ప్రీతికరం. యెహోవాను ఒక ఇల్లు కడుతున్న మనిషితో పోల్చవచ్చు. ఆ కట్టేవ్యక్తి దగ్గర ఇంటినిర్మాణ పూర్తి నమూనా ఉంటుంది, దానికి అతను స్థానికంగా అందుబాటులోవున్న నిర్మాణ సామగ్రిని ఎంపికచేసుకుంటాడు. అదే ప్రకారంగా, నేడు నెరవేర్చవలసిన ప్రణాళిక ఒకటి యెహోవా దగ్గరుంది, దానికి ఇష్టపూర్వకంగా ముందుకువచ్చే తన సేవకులను ఉపయోగించుకోవడానికి ఆయనిష్టపడుతున్నాడు.—కీర్తన 110:3; 1 కొరింథీయులు 9:16, 17.
యౌవనుడైన తోషియో అనుభవమే తీసుకోండి. పాఠశాలలో ప్రవేశించిన తర్వాత, తన విలక్షణ సేవాప్రాంతంలో సాధ్యమైనంత గొప్ప సాక్ష్యం ఇవ్వాలని కోరుకున్నాడు. తన దగ్గర ఎప్పుడూ బైబిలు ఉంచుకొని, మాదిరికరమైన క్రైస్తవునిగా ఉండేందుకు హృదయపూర్వక ప్రయత్నం చేశాడు. తన పాఠశాల మొదటి సంవత్సరం పూర్తికావస్తుండగా, తరగతిలో ఉపన్యాసమిచ్చే అవకాశం వచ్చింది. తోషియో సహాయం కొరకు యెహోవాకు ప్రార్థించి, ఆ తర్వాత “పయినీరు సేవను జీవన వృత్తిగా చేసుకోవడమనే నా లక్ష్యం” అనే శీర్షికగల ప్రసంగాన్ని తాను ఇచ్చినప్పుడు తరగతిలోని వారందరు శ్రద్ధగా వినడంచూసి అతనెంతో పులకించిపోయాడు. తాను యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకునిగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన వివరించాడు. ఒక విద్యార్థి బైబిలు అధ్యయనానికి ఒప్పుకొని బాప్తిస్మం తీసుకునేంతగా అభివృద్ధి సాధించాడు. తన ప్రార్థనలకు అనుగుణంగా తోషియో మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నాలకు బహుగా ప్రతిఫలం లభించింది.
మీరెంత మనస్ఫూర్తిగా చేస్తున్నారు?
యెహోవాను ఆయన ఆశీర్వాదాలను మీరు మనస్ఫూర్తిగా వెదకుతున్నారని మీరు వివిధ రీతుల్లో చూపించవచ్చు. మొదట, క్రైస్తవ కూటాలకు చక్కగా సిద్ధపడడంవంటి, మీరు చేయగల ప్రాథమిక పనులు ఉన్నాయి. మంచిగా సిద్ధపడిన వ్యాఖ్యానాలు, పురికొల్పే ప్రసంగాలు, సమర్థవంతమైన ప్రదర్శనల ద్వారా మీరు యెహోవాను ఎంత తీవ్రంగా వెదకుతున్నారో వెల్లడిచేస్తారు. మీ పరిచర్య నాణ్యతను వృద్ధిచేసుకోవడం ద్వారా కూడా మీరు ఎంత మనస్ఫూర్తిగా కృషిచేస్తున్నారో మీరు ప్రదర్శించవచ్చు. ఇండ్లదగ్గర మీరు స్నేహపూర్వకంగా మాట్లాడటానికి ప్రయత్నించేందుకు వీలుగా మీ ప్రాంతానికి సరిపడేలా ఫలవంతమైన ఉపోద్ఘాతాలు ఉపయోగించే విషయమేమిటి? (కొలొస్సయులు 3:23) నిండు హృదయంతో పనిచేయడంద్వారా ఒక క్రైస్తవుడు పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా సేవచేయడంవంటి సంఘ నియామకాలను బహుశా అంగీకరించవచ్చు. (1 తిమోతి 3:1, 2, 12, 13) మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోవడం ద్వారా ఇవ్వడంలోవున్న ఆనందంలో పాలుపంచుకోగలరు. మీరు బ్రాంచి నిర్మాణ ప్రణాళికలో లేదా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవచేసేందుకు దరఖాస్తు చేయగలవారిగా ఉండవచ్చు. మీరు అర్హతగల అవివాహిత పురుషునిగావుంటే, ఆధ్యాత్మిక పురుషులను మంచి కాపరులుగా సంసిద్ధులనుచేసే పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరుకావాలని మీరు కోరుకోవచ్చు. మీరు వివాహితులైతే, యెహోవాకు మరింత సేవచేయాలని మీకు మనస్ఫూర్తిగా ఉన్న కోరికను ప్రదర్శించేందుకు మిషనరీ సేవ ఒక మార్గం కావచ్చు. రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగావున్న ప్రాంతానికి తరలివెళ్లడం బహుశా మీకు సాధ్యంకావచ్చు.—1 కొరింథీయులు 16:9.
నిజానికి ఒకానొక నియామకాన్ని మీరు ఏ స్ఫూర్తితో నెరవేరుస్తారనేదే లెక్కలోకి వస్తుంది. మీకు ఏ బాధ్యత ఇవ్వబడినా, మనస్ఫూర్తిగా, శక్తివంచనలేకుండా, “నిష్కపటమైన హృదయముతో” నిర్వహించండి. (అపొస్తలుల కార్యములు 2:47; రోమీయులు 12:8) ప్రతి నియామకాన్ని యెహోవాకు స్తుతి తీసుకురావాలనే మీ అత్యంత ఆసక్తిని ప్రదర్శించడానికి లభించిన అవకాశంగా దృష్టించాలి. యెహోవా సహాయం కొరకు ఎడతెగక ప్రార్థించి మీకు శక్యమైనంత శ్రేష్ఠంగా పనిచెయ్యండి. అప్పుడు మీరు బహుగా ప్రతిఫలం పొందుతారు.
మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నాలకు ప్రతిఫలం
తోటి ప్రయాణికులకు ప్రకటించగలిగేలా భయాన్ని అధిగమించడానికి ప్రార్థించిన క్రైస్తవుడు మీకు గుర్తున్నాడా? ఆయన నిష్కపట కోరికను యెహోవా ఆశీర్వదించాడు. స్నేహపూర్వకంగా సమీపించడానికి, సంభాషణలు ఆరంభించేందుకు వివిధ అంశాలను ఎంచుకోవడానికి ఆ సహోదరుడు కృషి చేశాడు. కలవరపరిచే మానవ సంబంధాలను గురించి వ్యాకులపడుతున్న ఒకవ్యక్తికి ఆయన బైబిలు ఉపయోగించి ఫలవంతమైన సాక్ష్యమివ్వగలిగాడు. ట్రైన్‌లో చేసిన అనేక పునర్దర్శనాలు గృహ బైబిలు అధ్యయనానికి నడిపాయి. ఆయన మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నాలను యెహోవా నిజంగా ఆశీర్వదించాడు!
మీరు యెహోవాను మనస్ఫూర్తిగా వెదకడంలో కొనసాగితే మీకూ అలాంటి ఫలితాలే లభించవచ్చు. మీరు దైవపరిపాలనకు సంబంధించిన ఏ కార్యంలో నిమగ్నమైవున్నా దాన్ని నెరవేర్చడంలో మీరు వినయంగా పట్టుదలతో కృషిచేస్తూ మీ హృదయాన్నంతా దానిపై ఉంచితే, యెహోవా మిమ్మల్ని తన సంకల్పాలకు అనుగుణంగా ఉపయోగించుకొని మీపై నిండైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు.
[26వ పేజీలోని చిత్రం]
ఈ స్త్రీ పట్టుదలగా ఉండకపోయివుంటే ఏమి జరిగివుండేది?
[27వ పేజీలోని చిత్రం]
యెహోవా ఆశీర్వాదం కోసం మీరు ఆయనను పట్టుదలతో యాచిస్తారా?
[28వ పేజీలోని చిత్రాలు]
మీరు యెహోవాను మనస్ఫూర్తిగా వెదకుతున్నారని మీరెలా చూపవచ్చు?