యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడు?
యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడు?
“న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”—మీకా 6:8.
విరా నమ్మకస్థురాలైన ఒక క్రైస్తవురాలు, ఆమెకు దాదాపు 75 సంవత్సరాలు, ఆరోగ్యం అంతంతమాత్రం. “కొన్నిసార్లు నేను కిటికీగుండా బయటకుచూస్తే నా క్రైస్తవ సహోదర సహోదరీలు ఇంటింటికి వెళ్తూ ప్రకటించడం కనిపిస్తుంది. నాకప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, ఎందుకంటే వారితో నేనూ ఉండాలనుంటుంది కానీ నాకున్న అస్వస్థత యెహోవాకు నేనుచేసే సేవను పరిమితంచేస్తోంది” అని ఆమె అంటోంది.
2 మీరెప్పుడైనా అలా భావించారా? నిజమే, యెహోవాను ప్రేమించే వారందరు ఆయన నామము స్మరిస్తూ నడవాలని ఆయన కట్టడలు పాటించాలని కోరుకుంటారు. కానీ, మనకు ఆరోగ్యం క్షీణిస్తుంటే, వయస్సు పైబడుతుంటే లేదా కుటుంబ బాధ్యతలుంటే అప్పడేమిటి? దేవుని సేవలో మన హృదయం కోరుకునేదంతా చేయకుండా అలాంటి పరిస్థితులు మనల్ని బహుశా అడ్డగిస్తున్నప్పుడు మనం కొంత నిరుత్సాహపడవచ్చు. మన పరిస్థితి అదే అయితే, మీకా 6, 7 అధ్యాయాల పరిశీలన బహుశా చాలా ప్రోత్సాహకరంగా నిరూపించబడుతుంది. ఈ అధ్యాయాలు యెహోవా నియమాలు సహేతుకమనీ, వాటిని పాటించడం సులభమనీ చూపిస్తాయి.
దేవుడు తన ప్రజలతో ఎలా వ్యవహరిస్తాడు
3 మొదట మనం మీకా 6:3-5 చూసి, యెహోవా తన ప్రజలతో ఎలా వ్యవహరిస్తాడో గమనిద్దాం. మీకా కాలంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నారని గుర్తుంచుకోండి. అయినప్పటికీ, యెహోవా వారిని “నా జనులారా” అని కనికరంతో సంబోధిస్తున్నాడు. “నా జనులారా, . . . మనస్సునకు తెచ్చుకొనుడి” అని ఆయన వారిని అర్థిస్తున్నాడు. వారిని కఠినంగా నిందించడానికి బదులు “నేను మీకేమి చేసితిని?” అని అడుగుతూ వారి హృదయాలు చేరడానికి ప్రయత్నిస్తున్నాడు. “నాతో చెప్పుడి” అని కూడా ఆయన వారిని ప్రోత్సహిస్తున్నాడు.
4 యెహోవా మనందరికి ఎంతటి ఉదాత్త మాదిరిని ఉంచుతున్నాడో కదా! మీకా కాలంలో తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు, యూదా ప్రజల్ని ఆయన కనికరంతో “నా జనులు” అని పిలుస్తూ వారిని వేడుకున్నాడు. కాబట్టి మరినిశ్చయంగా, సంఘస్థులతో వ్యవహరించేటప్పుడు మనం దయ, కనికరాలను ప్రదర్శించాలి. నిజమే, కొందరితో సర్దుకుపోవడం సులభం కాకపోవచ్చు లేదా వారు ఆధ్యాత్మికంగా
బలహీనులుగా ఉండవచ్చు. అయినప్పటికీ, వారు యెహోవాను ప్రేమిస్తే, మనం వారికి సహాయపడాలనీ వారిని కనికరించాలనీ కోరుకుంటాము.5 తర్వాత, మనం మీకా 6:6, 7ను పరిశీలిద్దాం. మీకా వరుసగా ఇలా ప్రశ్నిస్తున్నాడు: “ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?” లేదు, “వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును” ఇచ్చి యెహోవాను సంతోషపరచడం సాధ్యంకాదు. అయితే ఆయనను సంతోషపరిచేది మాత్రం ఒకటుంది. ఏమిటది?
మనం న్యాయంగా నడుచుకోవాలి
6 యెహోవా మననుండి ఏమి ఆశిస్తున్నాడో మనం మీకా 6:8లో నేర్చుకుంటాం. మీకా ఇలా అడుగుతున్నాడు: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.” కోరబడిన ఈ మూడు లక్షణాల్లో, మనమెలా భావిస్తాం, ఆలోచిస్తాం, ప్రవర్తిస్తాం అనేవి చేరివున్నాయి. మనమీ లక్షణాలు చూపేందుకు ఇష్టపడాలి, వాటినెలా కనుపర్చాలో ఆలోచించాలి, వాటిని ప్రదర్శించేలా చర్యతీసుకోవాలి. మననుండి కోరబడే ఈ మూడు లక్షణాల్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
7 ‘న్యాయంగా నడుచుకోవడం’ అంటే సరైనది చేయడమని భావం. దేవుని కార్యవిధానం న్యాయకట్టడను అనుసరించి ఉంటుంది. అయితే, మీకా సమకాలీనులు న్యాయానికి బదులు అన్యాయం చేస్తున్నారు. ఏ యే విధాలుగా? మీకా 6:10ని పరిశీలించండి. ఆ వచనం చివర్లో, వర్తకులు ‘చిన్నదిగా చేయబడిన కొలను’ ఉపయోగిస్తున్నారని వర్ణించబడింది. ఇంకా వారు ‘తప్పు రాళ్ళను’ వాడుతున్నారని 11వ వచనం చెబుతోంది. 12వ వచనం ప్రకారం, ‘వారి నాలుక కపటంగా మాట్లాడుతుంది.’ ఆ విధంగా, మీకా కాలపు వాణిజ్య ప్రపంచంలో తప్పుడు కొలతలు, తప్పుడు తూకాలు, తప్పుడు మాటలు విపరీతంగా ఉన్నాయి.
8 అన్యాయపు క్రియలు సంతప్రదేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. న్యాయస్థానాల్లో సహితం అవి మామూలైపోయాయి. “అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు” అని మీకా 7:3 సూచిస్తోంది. అమాయక ప్రజలకు అన్యాయపు శిక్షలు విధించడానికి న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటున్నారు. “గొప్పవారు” లేదా పలుకుబడిగల పౌరులు నేరాలకు పాల్పడుతున్నారు. నిజానికి అధిపతి, న్యాయాధిపతి, గొప్పవాడు కలిసి “ఏకపట్టుగా” లేదా సమైక్యంగా దుష్టకార్యాలు జరిగిస్తున్నారని మీకా చెబుతున్నాడు.
9 దుష్ట నాయకులు జరిగిస్తున్న అన్యాయాలు యూదా ఇశ్రాయేలులపై ప్రభావం చూపాయి. న్యాయం లేకపోవడం సహచరుల మధ్య, ప్రాణ స్నేహితుల మధ్య, చివరకు దంపతుల మధ్య కూడా అపనమ్మకానికి దారితీసిందని మీకా 7:5 తెలియజేస్తోంది. ఈ పరిస్థితి, కుమారులూ తండ్రులూ, కుమార్తెలూ తల్లులూ ఒకరినొకరు ద్వేషించుకొనేందుకు దారితీసిందని 6వ వచనం చెబుతోంది.
10 నేటి విషయమేమిటి? అలాంటి పరిస్థితుల్నే మనం చూడడం లేదా? మీకా వలెనే మనం కూడా న్యాయం, నమ్మకం లేని వాతావరణంలో, సామాజిక మరియు కుటుంబ జీవితాలు కుప్పకూలుతున్న తరుణంలో జీవిస్తున్నాం. అయినప్పటికీ, ఈ దుష్టలోకంలో జీవిస్తున్న దేవుని సేవకులుగా మనమీ లోక అన్యాయపు స్వభావం క్రైస్తవ సంఘంలోకి చొరబడనీయం. బదులుగా, మనం నిజాయితీ, యథార్థతా సూత్రాల్ని మన దైనందిన జీవితంలో ప్రదర్శిస్తూ వాటిని సమర్థించేందుకు కృషిచేస్తాం. నిజానికి, ‘మనమన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తిస్తాం.’ (హెబ్రీయులు 13:18) న్యాయంగా నడుచుకోవడం ద్వారా, నిజమైన నమ్మకం ప్రదర్శించే సహోదరత్వం ఫలితంగా వచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవిస్తున్నామని మీరంగీకరించరా?
ప్రజలెలా ‘యెహోవా ప్రకటన’ వింటారు?
11 అన్యాయపు పరిస్థితులున్నా, సమస్త ప్రజలకు న్యాయం జరుగుతుందని మీకా ప్రవచిస్తున్నాడు. యెహోవా ఆరాధకులయ్యేందుకు ప్రజలు “ఆ యా సముద్రముల మధ్యదేశములనుండియు, ఆ యా పర్వతముల మధ్యదేశములనుండియు” సమకూర్చబడతారని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. (మీకా 7:12) నేడు, ఈ ప్రవచనపు అంతిమ నెరవేర్పులో ఏదో ఒక దేశ ప్రజలు కాదు, అన్ని దేశాల ప్రజలు దేవుని నిష్పక్షపాత న్యాయం నుండి ప్రయోజనం పొందుతున్నారు. (యెషయా 42:1) ఇది నిజమని ఎలా నిరూపించబడుతోంది?
12 జవాబు కోసం, మీకా అంతకుముందు పలికిన మాటలు పరిశీలించండి. మీకా 6:9 ఇలా చెబుతోంది: “యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్యపెట్టును.” ‘యెహోవా ప్రకటనను’ అన్ని దేశాల ప్రజలు ఎలా వింటారు, దీనికి మనం న్యాయంగా నడుచుకోవడంతో ఎలాంటి సంబంధం ఉంది? నిజానికి, ప్రజలు అక్షరార్థంగా దేవుని ప్రకటనా స్వరం వినరు. కానీ, మన ప్రపంచవ్యాప్త ప్రకటనా పని ద్వారా సమస్త జాతుల, జీవనగతుల ప్రజలు యెహోవా ప్రకటనా స్వరం వింటున్నారు. ఫలితంగా, ఆ వినేవారు ‘[దేవుని] నామం లక్ష్యపెడుతూ’ దానియెడల పూజ్యభావంతో ఉంటున్నారు. ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా సేవచేయడం ద్వారా మనం నిశ్చయంగా న్యాయంగా, ప్రేమగా ప్రవర్తిస్తున్నాం. నిష్పక్షపాతంగా దేవుని నామం ప్రతి ఒక్కరికి తెలియజేయడం ద్వారా, మనం ‘న్యాయంగా నడుచుకుంటున్నాం.’
మనం కనికరాన్ని ప్రేమించాలి
13 ఇప్పుడు మనం, మీకా 6:8లో కోరబడిన రెండవ లక్షణాన్ని చర్చిద్దాం. మనం ‘కనికరమును ప్రేమించాలని’ యెహోవా ఆశిస్తున్నాడు. “కనికరము” అని తర్జుమా చేయబడిన హీబ్రూ పదం “ప్రేమపూర్వక దయ” లేదా “యథార్థ ప్రేమ” అని కూడా అనువదించబడింది. ఇతరులపట్ల చురుకుగా శ్రద్ధ చూపడం, వారిని కనికరంతో పట్టించుకోవడమే “ప్రేమపూర్వక దయ.” ప్రేమగల గుణానికి ఈ ప్రేమపూర్వక దయ విభిన్నంగా ఉంటుంది. అదెలా? ప్రేమకు విశాల భావముంది, దానిని వస్తువులకు, అనుభూతులకు అన్వయించి ప్రయోగించవచ్చు. ఉదాహరణకు, ఒకరు ‘లోకాన్ని లోకంలో ఉన్నవాటిని ప్రేమించడాన్ని’ గూర్చి, ‘జ్ఞానమును ప్రేమించు’ వ్యక్తిని గూర్చి లేఖనాలు మాట్లాడుతున్నాయి. (1 యోహాను 2:15; సామెతలు 29:3) దానికి విభిన్నంగా, “ప్రేమపూర్వక దయ” అన్ని సందర్భాల్లో ప్రజలకే, ప్రత్యేకించి దేవుని సేవించేవారికి అన్వయించబడుతుంది. అందుకే, మీకా 7:20 యెహోవా దేవుని సేవించిన ‘అబ్రాహాముకు అనుగ్రహించబడిన కనికరము’ అంటే ప్రేమపూర్వక దయను గురించి మాట్లాడుతుంది.
14మీకా 7:18 ప్రకారం, దేవుడు ప్రేమపూర్వక దయ చూపడంలో “సంతోషించువాడు” అని ప్రవక్త చెబుతున్నాడు. మీకా 6:8లో కేవలం ప్రేమపూర్వక దయ చూపడం కాదుగానీ ఆ లక్షణాన్ని ప్రేమించాలని మనకు చెప్పబడింది. ఈ లేఖనాల నుండి మనమేమి నేర్చుకుంటాము? ప్రేమపూర్వక దయ చూపించాలని మనం కోరుకుంటాము కాబట్టి అది ఇష్టపూర్వకంగా, ధారాళంగా చూపించబడుతుంది. అవసరంలో ఉన్నవారికి ప్రేమపూర్వక దయ చూపించడంలో యెహోవా వలెనే మనమూ సంతోషానందాల్ని కనుగొంటాం.
15 నేడు, అలాంటి ప్రేమపూర్వక దయ దేవుని ప్రజల గుర్తింపు చిహ్నంగా ఉంది. ఒక ఉదాహరణను పరిశీలించండి. 2001 జూన్‌లో అమెరికాలోని టెక్సాస్‌లో ఉష్ణమండల తుఫాను కారణంగా విపరీతమైన వరదలు రావడంతో, యెహోవాసాక్షుల వందల గృహాలతోసహా వేలసంఖ్యలో ఇళ్ళు నాశనమయ్యాయి. అవసరంలో ఉన్న తమ క్రైస్తవ సహోదరులకు సహాయపడేందుకు, దాదాపు 10,000 మంది సాక్షులు స్వచ్ఛందంగా, ఉచితంగా తమ శక్తిని, సమయాన్ని వెచ్చించారు. ఆ స్వచ్ఛంద సేవకులు ఆరు నెలలకుపైగా వారాంతాల్లో రాత్రింబగళ్ళు అవిశ్రాంతంగా పనిచేసి, తమ క్రైస్తవ సహోదరుల కోసం 8 రాజ్యమందిరాలు, 700లకు పైగా గృహాలు పునర్నిర్మించారు. అలాంటి పనిచేయడానికి అవకాశంలేని వారు ఆహారం, ఇతర వస్తువులు, డబ్బు విరాళంగా ఇచ్చారు. ఈ వేలాదిమంది సాక్షులు తమ సహోదరులకు ఎందుకు సహాయం చేయడానికొచ్చారు? ఎందుకంటే వారు ‘కనికరమును ప్రేమించారు.’ ప్రపంచవ్యాప్తంగా మన సహోదరులు అలాంటి ప్రేమపూర్వక దయగల పనులు చేస్తారని తెలుసుకోవడం ఎంత స్ఫూర్తిదాయకమో కదా! అవును, “కనికరమును ప్రేమించుట” భారం కాదు, అదొక ఆనందం!
దేవుని యెదుట దీనమనస్సు కలిగి ప్రవర్తించండి
16మీకా 6:8లో కోరబడుతున్న మూడవ లక్షణం, ‘దేవుని యెదుట దీనమనస్సు కలిగి ప్రవర్తించడం.’ అంటే మన పరిమితులు గుర్తించి, దేవునిపై ఆధారపడడమని దీనర్థం. దీనిని ఉపమానరీతిగా చెప్పడానికి, పెనుతుఫానులో నడిచివెళ్తూ తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్న చిన్న పాపాయిని కాసేపు ఊహించుకోండి. తనకు బలం చాలాతక్కువని ఆ పాపాయికి బాగా తెలుసు, కానీ ఆమెకు తన తండ్రిమీద గట్టి నమ్మకముంది. మనంకూడా మన పరిమితులు తెలుసుకోవాలి, అయితే మనకు మన పరలోక తండ్రిపై ప్రగాఢ విశ్వాసం ఉండాలి. మనమీ ప్రగాఢ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోగలం? దానికొక మార్గమేమంటే, దేవునికి సన్నిహితంగా ఉండడం ఎందుకు జ్ఞానయుక్తమో మనస్సులో ఉంచుకోవడమే. మీకా మనకు మూడు కారణాలను, అంటే యెహోవా మన విమోచకుడు, మన నిర్దేశకుడు, మన సంరక్షకుడు అని గుర్తుచేస్తున్నాడు.
17మీకా 6:4, 5 ప్రకారం, దేవుడిలా చెబుతున్నాడు: “ఐగుప్తుదేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని.” అవును, యెహోవా ఇశ్రాయేలీయుల విమోచకుడు. యెహోవా ఇంకనూ ఇలా చెబుతున్నాడు: “మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.” జనాంగాన్ని నిర్దేశించడానికి మోషే అహరోనులు ఉపయోగించుకోబడ్డారు, విజయోత్సాహ నాట్యంలో మిర్యాము ఇశ్రాయేలు స్త్రీలను ముందుండి నడిపించింది. (నిర్గమకాండము 7:1, 2; 15:1, 19-21; ద్వితీయోపదేశకాండము 34:12) యెహోవా తన సేవకుల ద్వారా వారికి నిర్దేశమిచ్చాడు. తాను ఇశ్రాయేలు జనాంగాన్ని బాలాకు బిలాముల నుండి సంరక్షించానని, వారి ప్రయాణపు చివరిఘట్టంలో మోయాబులోని షిత్తీము దగ్గరనుండి వాగ్దాన దేశమందలి గిల్గాలువరకు వారిని కాపాడానని 5వ వచనంలో యెహోవా ఆ జనాంగానికి గుర్తుచేస్తున్నాడు.
18 మనం దేవునితో నడుస్తుండగా, ఆయన మనల్ని సాతాను లోకం నుండి విమోచిస్తాడు, తన వాక్యం ద్వారా తన సంస్థ ద్వారా మనకు నిర్దేశమిస్తాడు, మనం వ్యతిరేకుల ముట్టడిక్రింద ఉన్నప్పుడు ఒక గుంపుగా మనల్ని సంరక్షిస్తాడు. అందువల్ల, ప్రాచీనకాల వాగ్దాన దేశంకన్నా
మరెంతో గొప్పదైన దేవుని నీతియుక్త నూతనలోకంవైపు కల్లోలభరిత పరిస్థితులగుండా మనంచేస్తున్న ప్రయాణపు చివరిఘట్టంలో మన పరలోక తండ్రితో కలిసి నడుస్తుండగా మనమాయన చెయ్యి గట్టిగా పట్టుకోవడానికి తగిన కారణముంది.19 దేవుని యెదుట దీనమనస్సు కలిగి ప్రవర్తించడం మన పరిస్థితుల విషయమై వాస్తవిక దృక్కోణం కలిగివుండేందుకు మనకు సహాయం చేస్తుంది. ఇలా ఎందుకంటే, దీనమనస్సు కనుపర్చడంలో మన పరిమితులను ఎరిగియుండడం కూడా ఇమిడివుంది. యెహోవా సేవలో మనం చేయగలదానిపై వయస్సు పైబడడం లేదా ఆరోగ్యం క్షీణించడం కొన్ని పరిమితులు తీసుకురావచ్చు. అయితే, ఇది మనల్ని నిరుత్సాహపర్చేందుకు అనుమతించే బదులు, ‘మన శక్తికి మించి కాదుగాని కలిమి కొలదియే ఇచ్చేందుకు’ మనంచేసే ప్రయత్నాలను, త్యాగాలను దేవుడు అంగీకరిస్తాడని గుర్తుంచుకోవడం మంచిది. (2 కొరింథీయులు 8:12) నిజానికి, మన పరిస్థితులు అనుమతించినకొలది మనమెంతచేసినా మనస్ఫూర్తిగా ఆయనను సేవించాలని యెహోవా ఆశిస్తున్నాడు. (కొలొస్సయులు 3:23, 24) మనమాయన సేవలో మనం చేయగలిగినంతా మనఃపూర్వకంగా, ఆసక్తిగా చేసినప్పుడు, దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు.—సామెతలు 10:22.
వేచివుండే స్వభావం ఆశీర్వాదాలు తెస్తుంది
20 యెహోవా ఆశీర్వాద అనుభవం, మీకా స్వభావాన్నే అనుకరించేలా మనల్ని పురికొల్పుతుంది. ఆయనిలా ప్రకటించాడు: “రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును.” (మీకా 7:7) ఈ మాటలు మనం దేవుని ఎదుట దీనమనస్సు కలిగి ప్రవర్తించడంతో ఎలా సంబంధం కలిగివున్నాయి? కనిపెట్టుకొనివుండే స్వభావం లేదా సహనం కలిగివుండడం, యెహోవా దినమింకా రాలేదనే నిరాశా భావం తప్పించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (సామెతలు 13:12) మనస్సులో మాట చెప్పాలంటే, మనందరం ఈ దుష్టలోకాంతాన్ని కోరుకుంటున్నాం. కానీ, ప్రతివారం వేలాదిమంది దేవునితో నడవడం ఇప్పుడిప్పుడే ఆరంభిస్తున్నారు. అది తెలుసుకోవడం కనిపెట్టుకొనివుండే స్వభావం చూపడానికి మనకొక కారణమిస్తుంది. ఈ సందర్భంగా, ఓ దీర్ఘకాల సాక్షి ఇలాచెప్పారు: “గత 55 సంవత్సరాల్లో చేసిన ప్రకటనా పని గుర్తుచేసుకుంటే, యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడం ద్వారా నేనేమీ కోల్పోలేదని దృఢంగా నమ్ముతున్నాను. బదులుగా, నేనెన్నో బాధాకరమైన వేదనలు తప్పించుకోగలిగాను.” మీకూ అలాంటి అనుభవం కలిగిందా?
21 యెహోవాతో నడవడం నిస్సందేహంగా మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీకా 7:14లో మనం చదువునట్లుగా, దేవుని ప్రజలను కాపరి వద్ద సురక్షితంగా ఉన్న గొఱ్ఱెలతో మీకా పోలుస్తున్నాడు. ఈ ప్రవచనపు నేటి గొప్ప నెరవేర్పులో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషము, వారితోపాటు వేరే గొఱ్ఱెలు తాము నమ్ముకున్న కాపరియగు యెహోవాచెంత సురక్షితంగా ఉన్నారు. వారు “అడవిలో ప్రత్యేకముగా” అంటే ఆధ్యాత్మిక భావంలో అంతకంతకూ మితిమీరుతున్న ఈ వేదనభరితమైన, ప్రమాదకరమైన లోకంనుండి వేరుగా నివసిస్తారు.—యోహాను 10:16; ద్వితీయోపదేశకాండము 33:28; యిర్మీయా 49:31; గలతీయులు 6:16.
22మీకా 7:14 ప్రవచించినట్లు యెహోవా ప్రజలు సమృద్ధి కూడా అనుభవిస్తారు. దేవుని గొఱ్ఱెలు లేదా ప్రజల గురించి మాట్లాడుతూ మీకా ఇలా అంటున్నాడు: “బాషానులోను గిలాదులోను వారు . . . మేయుదురు.” బాషాను గిలాదులలోని గొఱ్ఱెలు సారవంతమైన పచ్చిక బయళ్ళలో మేసి బలపడినట్లు, దేవుని ప్రజలు నేడు ఆధ్యాత్మిక సమృద్ధిని అనుభవిస్తున్నారు, ఇది దేవుని యెదుట దీనమనస్సు కలిగి ప్రవర్తించే వారికి లభించే మరో ఆశీర్వాదం.—సంఖ్యాకాండము 32:1; ద్వితీయోపదేశకాండము 32:14.
23మీకా 7:18, 19లో ప్రవక్త, పశ్చాత్తాపంచూపే వారిని క్షమించే యెహోవా ఇచ్ఛను నొక్కిచెబుతున్నాడు. యెహోవా ‘అతిక్రమమును క్షమించడమే’ గాక ‘దోషమును పరిహరిస్తున్నాడని’ 18వ వచనం తెలియజేస్తోంది. 19వ వచనం ప్రకారం, ఆయన ‘వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో పడవేస్తాడు.’ దీనినుండి మనం నేర్చుకోగల ఒక పాఠమేమిటి? ఈ విషయంలో మనం యెహోవాను అనుకరిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. మన విషయంలో ఇతరులు తప్పులు చేసినప్పుడు మనం వారిని క్షమిస్తామా? అలాంటి వారు పశ్చాత్తాపపడి, నిష్కృతికి ప్రయత్నిస్తే, నిశ్చయంగా మనం సంపూర్ణంగా శాశ్వతంగా క్షమించాలని యెహోవాకున్న ఇచ్ఛను ప్రతిబింబించాలని కోరుకుంటాము.
24 మీకా ప్రవచన పరిశీలన నుండి మనమెలా ప్రయోజనం పొందాము? తనకు సన్నిహితులయ్యే వారికి యెహోవా నిజమైన నిరీక్షణ దయచేస్తాడని అది మనకు గుర్తుచేసింది. (మీకా 2:1-13) మనం నిరంతరం దేవుని నామము స్మరిస్తూ నడిచేలా సత్యారాధనను పురోగమింపజేయడానికి మనకు సాధ్యమైనంతమేరకు సమస్తం చేయడానికి అది మనల్ని ప్రోత్సహించింది. (మీకా 4:1-4) మన పరిస్థితులెలావున్నా, మనం యెహోవా కోరేవాటిని చేయగలమని మనకు హామీ ఇవ్వబడింది. అవును, యెహోవా నామము స్మరిస్తూ నడవడానికి మీకా ప్రవచనం నిజంగా మనల్ని బలపరుస్తోంది.
మీరెలా సమాధానమిస్తారు?
• మీకా 6:8 ప్రకారం, యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడు?
• మనం ‘న్యాయంగా నడుచుకోవాలంటే’ ఏమి అవసరం?
• మనం ‘కనికరమును ప్రేమిస్తున్నామని’ మనమెలా చూపగలం?
• దేవుని ఎదుట ‘దీనమనస్సు కలిగి ప్రవర్తించడంలో’ ఏమి ఇమిడియుంది?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. యెహోవా సేవకులు కొందరు ఎందుకు నిరుత్సాహపడవచ్చు, అయితే ఏది సహాయకరంగా నిరూపించబడుతుంది?
3. తిరుగుబాటుచేసే ఇశ్రాయేలీయులతో యెహోవా ఎలా వ్యవహరిస్తున్నాడు?
4. కనికరం విషయంలో దేవుని మాదిరి మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?
5. మీకా 6:6, 7లో ఏ ప్రాముఖ్యమైన అంశం చెప్పబడింది?
6. మీకా 6:8లో ఏ మూడు దైవిక లక్షణాలు కోరబడ్డాయి?
7, 8. (ఎ) ‘న్యాయంగా నడుచుకోవడం’ అంటే అర్థమేమిటి? (బి) మీకా కాలంలో ఎలాంటి అన్యాయాలు అధికంగా ఉన్నాయి?
9. దుష్టుల అన్యాయపు చర్యలవల్ల యూదా ఇశ్రాయేలులు ఎలాంటి ప్రభావానికి లోనయ్యాయి?
10. ప్రస్తుత-దిన అన్యాయపు వాతావరణంలో, క్రైస్తవులు ఎలా ప్రవర్తిస్తారు?
11. మీకా 7:12 ఎలా నెరవేరుతోంది?
12. నేడు ‘యెహోవా ప్రకటన’ ఎలా వినబడుతోంది?
13. ప్రేమకు, ప్రేమపూర్వక దయకు మధ్య ఏ భేదముంది?
14, 15. ప్రేమపూర్వక దయ ఎలా చూపబడింది, దానికి రుజువుగా పేరాలో ఏది ప్రస్తావించబడింది?
16. దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించే అవసరాన్ని నొక్కిచెప్పేందుకు మనకు ఏ ఉపమానం సహాయపడుతుంది?
17. యెహోవా తన ప్రాచీనకాల ప్రజలను ఎలా విమోచించాడు, నిర్దేశించాడు, సంరక్షించాడు?
18. నేడు దేవుడెలా విమోచకునిగా, నిర్దేశకునిగా, సంరక్షకునిగా పనిచేస్తున్నాడు?
19. మన దీనమనస్సు ఏవిధంగా మన పరిమితులకు సంబంధం కలిగివుంది?
20. మీకా వలెనే కనిపెట్టుకొనివుండే స్వభావం ప్రదర్శించడానికి దేనిని తెలిసికొని ఉండడం మనకు సహాయంచేయాలి?
21, 22. మనకాలంలో మీకా 7:14 ఎలా నెరవేరుతోంది?
23. మీకా 7:18, 19 పరిశీలించడం నుండి మనమే పాఠం నేర్చుకోగలం?
24. మీకా ప్రవచనంనుండి మీరెలా ప్రయోజనం పొందారు?
[21వ పేజీలోని చిత్రాలు]
మీకా తన కాలమందలి దుష్ట పరిస్థితుల మధ్యనూ దేవుడు కోరినట్లే జీవించాడు. మీరూ అలా జీవించగలరు
[23వ పేజీలోని చిత్రం]
సమస్త జీవనగతుల ప్రజలకు సాక్ష్యమిస్తూ న్యాయంగా నడుచుకోండి
[23వ పేజీలోని చిత్రాలు]
ఇతరుల అవసరాలను తీర్చడం ద్వారా మీరు కనికరమును ప్రేమిస్తున్నట్టు చూపించండి
[23వ పేజీలోని చిత్రం]
దీనమనస్సు కలిగి మీ పరిమితులను గుర్తిస్తూ చేయగలిగిందే చెయ్యండి